25న ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజనీర్, అటవీశాఖ, పోస్టల్ అసిస్టెంట్స్ పరీక్షలు
తలపట్టుకుంటున్న నిరుద్యోగులు.. పట్టించుకోని అధికారులు
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేదే అరకొరగా. పోటీకి సన్నద్ధమయ్యే అభ్యర్థులు అహోరాత్రులు శ్రమిస్తేగానీ నెగ్గుకురాలేరు. అసలే రాష్ర్ట విభజన నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులతో నోటిఫికేషన్లు లేక ఆవేదనలో ఉన్న అభ్యర్థులపై మరో పిడుగు పడింది! ఈనెల 25వ తేదీన ఒకే రోజు మూడు పరీక్షల జరగనుండటంతో దేనికి హాజరు కావాలో తేల్చుకోలేక నిరుద్యోగులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజనీర్, పోస్టల్ అసిస్టెంట్స్, అటవీశాఖ నోటిఫికేషన్లు అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే 25న జూనియర్ ఇంజనీర్ పరీక్ష నిర్వహణకు మార్చి 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే రెండు నెలల క్రితమే పరీక్ష తేదీ ఖరారైంది. అయితే రాష్ట్ర అటవీ శాఖ దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా అదే రోజున ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్ష నిర్వహిస్తామని ఇటీవలే తేదీని ప్రకటించింది. దీంతో రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏది రాయాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఇది చాలదన్నట్టు తాజాగా పోస్టల్ శాఖ కూడా మే 25వతేదీన పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించటం మూడు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఆందోళన నింపింది. పరీక్ష తేదీలను మార్చాలని అధికారులను కోరినా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు.
అధికారులు చొరవ చూపాలి
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు కోసం ఎదురు చూస్తున్న మాకు ఈ పరీక్షలు వరంలా అనిపించాయి. కానీ ఒకే రోజు మూడు పరీక్షలు పెట్టటం అంటే నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా ఒక్కటే. అధికారులు చొరవ తీసుకొని పరీక్షల తేదీలను మార్చాలి.
- కృష్ణ, అభ్యర్థి, కర్నూలు
ఒకే రోజు మూడు పరీక్షలా?
ఒకే రోజు మూడు పరీక్షలు ఎలా నిర్వహిస్తారు? ఇది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడ మే. తేదీలు ఖరారు చేసేముందు అదే రోజు ఇతర పరీక్షలు ఉన్నాయోమో చూసుకోవాలా వద్దా? అధికారులు దీన్ని పరిశీలించి పరీక్ష తేదీలను మార్చాలి.
- కిషోర్, అభ్యర్థి, హైదరాబాద్
ఒకే రోజు మూడు ‘పరీక్ష’లు
Published Tue, May 20 2014 12:55 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM
Advertisement