ఒకే రోజు మూడు పరీక్షలా! | today three competitive exams | Sakshi
Sakshi News home page

ఒకే రోజు మూడు పరీక్షలా!

Published Sat, May 24 2014 11:46 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

today three competitive exams

జోగిపేట, న్యూస్‌లైన్: ఒకే రోజు మూడు ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్ష నిర్వహిస్తూ అధికారులు నిరుద్యోగుల ఆశలకు గండి కొట్టారు. దీంతో నిరుద్యోగులు రెండు ఉద్యోగ అర్హత పరీక్షలకు గైర్హాజరు కాక తప్పడంలేదు. మూడింటిలో ఏదో ఒక దానికే హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం సంబంధిత అధికారులకు విన్నవించినా వారు స్పందించకపోవడంతో నిరుద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జూనియర్ ఇంజినీర్, పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈ నెల 25 పరీక్ష జరుగనుంది. అదే అటవీ శాఖ ఆధ్వర్యంలో సెక్షన్ ఆఫీసర్ల ఉద్యోగానికి కూడా అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మూడు ఉద్యోగాలకు ఇంచుమించుగా  డిగ్రీ, ఇంజినీరింగ్, సైన్స్ గ్రూపు విద్యార్థులు అర్హులు. అటవీ శాఖ పరీక్షను వాయిదా వేయాలని అధికారులను కోరినా వారు పట్టించుకోలేదు.

 పోస్టల్ అసిస్టెంట్
 పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఏదేని డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. 25వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

 అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం..
 అటవీ శాఖలో సెక్షన్ అధికారి ఉద్యోగానికి బీఎస్సీ సైన్స్ గ్రూపు, ఇంజినీరింగ్‌లో మెకానికల్, సివిల్, కెమికల్ డిగ్రీ చదివిన వారు అర్హులు. ఈ ఉద్యోగానికి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తారు.

 జూనియర్  ఇంజినీర్ ఉద్యోగం..
 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగానికి ఇంజినీరింగ్  చదివిన వారు అర్హులు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

 నష్టపోనున్న నిరుద్యోగులు
 పోస్టల్ ఉద్యోగానికి  ఏదేని డిగ్రీ చదివిన వారు అర్హులు. అదేవిధంగా ఇంజనీరింగ్, అటవీ శాఖ ఉద్యోగానికి ఇంజనీరింగ్, బీఎస్సీ చదివిన వారు అర్హులు. మూడింటిలో ప్రతి రెండు ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌తో పాటు ఏదేని డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. దాదాపుగా మూడు ఉద్యోగాలకు నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ముందుగానే తేదీలను ప్రకటించింది. అటవీశాఖ ముందుగా నిర్ణయించిన తేదీలను వాయిదా వేసి ఈనెల 25న పరీక్ష నిర్వహిస్తోంది.

 దీంతో నిరుద్యోగులు జేఎన్‌టీయూ అధికారులను పరీక్ష వాయిదా వేయాలని వేడుకుంటున్నారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది.  దీంతో అభ్యర్థులు మూడింటిలో ఏదేని ఒక  పరీక్షనే రాయాల్సి ఉంటుంది. మూడింటిలో ఏదో ఒకటి రాకపోతుందా అనే యోచనలో ఉన్న  అభ్యర్థుల ఆశలు ఆవిరయ్యాయి.  ఈ తేదీలను ముందు చూపుతో నిర్ణయించకపోవడం వల్ల అర్హులైన నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement