మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : ఒకే రోజు మూడు ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్ష ఉండటంతో నిరుద్యోగులు రెండు ఉద్యోగ అర్హత పరీక్షలకు గైర్హాజరు కాక తప్పడంలేదు. మూడింటిలో ఏదో ఒక దానికే హాజరు కావలసిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులకు విన్నవించినా వారు స్పందించకపోవడంతో నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఆధ్వర్యంలో జూనియర్ ఇంజినీర్, పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈ నెల 25 తేదీన పరీక్ష జరగనుంది. అదే రోజు రాష్ట్రజేఎన్‌టీయూ ఆధ్వర్యంలో అటవీ శాఖ సెక్షన్ అధికారి ఉద్యోగానికి పరీక్ష ఉంది. ఈ మూడు ఉద్యోగాలకు ఇంచుమించుగా ఏదేని డిగ్రీ, ఇంజినీరింగ్, సైన్స్ గ్రూపు విద్యార్థులు అర్హులు. అటవీ శాఖ పరీక్షను వాయిదా వేయాలని జేఎన్‌టీయూ అధికారులను కోరినా వారు కనికరించకపోవడం శోచనీయం.
నష్టం
పోస్టల్ ఉద్యోగానికి ఇంజినీరింగ్, ఏదేని డిగ్రీ చదివిన వారు అర్హులు. అదేవిధంగా ఇంజినీరింగ్, అటవీ శాఖ ఉద్యోగానికి ఇంజినీరింగ్, బీఎస్సీ చదివిన వారు అర్హులు అవుతారు. మూడింటిలో ప్రతి రెండు ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌తో పాటు ఏదేని డిగ్రీ చదివిన వారు అర్హులు. దాదాపుగా మూడు ఉద్యోగాలకు ఆశతో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ముందుగానే తేదీలను ప్రకటించింది. రాష్ట్ర అటవీ శాఖ ముందుగా నిర్ణయించిన తేదీలను వాయిదా వేసి ఈ నెల 25న ప్రకటించింది.
దీంతో నిరుద్యోగులు జేఎన్‌టీయూ అధికారులను వేడుకున్నా పరీక్ష తేదీలనే వాయిదా వేయలేదు. దీంతో అభ్యర్థులు ఏదేని రెండు ఉద్యోగ అర్హత పరీక్షలను కోల్పోతున్నారు. మూడింటిలో ఏదేని ఒక ఉద్యోగం రాకపోదా అని ఆశతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆశలు ఆవిరైపోయాయి. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు స్పందించి అటవీ శాఖ ఉద్యోగ పరీక్షను వాయిదా వేసేవిధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
ఇవీ.. ఆ మూడు ఉద్యోగాలు
జూనియర్ ఇంజినీర్
ఈ ఉద్యోగానికి ఇంజినీరింగ్(డిగ్రీ) చదివిన వారు అర్హులు. 25 తేదీన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు.
పోస్టల్ అసిస్టెంట్
ఈ ఉద్యోగానికి ఏదేని డిగ్రీ చదివిన వారు అర్హులు. 25 తేదీన మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
అటవీశాఖ సెక్షన్ అధికారి
అటవీ శాఖ ఉద్యోగానికి బీఎస్సీ సైన్స్ గ్రూపు, ఇంజినీరింగ్‌లో మెకానికల్, సివిల్, కెమికల్ డిగ్రీ చదివిన వారు అర్హులు. ఈ ఉద్యోగానికి ఈ నెల 25 తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పరీక్ష జరుగనుంది.
ఒకేరోజు మూడు ఉద్యోగ అర్హత పరీక్షలు
Published Sat, May 24 2014 2:17 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM
Advertisement
Advertisement