తెలంగాణలో 67,820 ఉద్యోగ ఖాళీలు.. విభజన పూర్తయ్యేది ఎప్పుడో? | Telangana Jobs Notification May Release After Completion Of Separation Of Employees | Sakshi
Sakshi News home page

TS Job Notificatons: తెలంగాణలో 67,820 ఉద్యోగ ఖాళీలు.. విభజన పూర్తయ్యేది ఎప్పుడో?

Published Wed, Nov 24 2021 1:56 AM | Last Updated on Wed, Nov 24 2021 12:53 PM

Telangana Jobs Notification May Release After Completion Of Separation Of Employees - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ఇంకొన్నాళ్లు సమయం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనవరి 1న నూతన సంవత్సర కానుకగా ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నా.. అది ఇంత త్వరగా సాధ్యమవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

నోటిఫికేషన్లను జనవరిలో ఇవ్వాలంటే డిసెంబరు 20లోగా కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే, ఉద్యోగుల కేటాయింపునకు చాలా సమయం పడుతుందని ఉద్యోగ సం ఘాల నేతలు పేర్కొంటున్నారు. అందుకే ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి ఇంకొన్నాళ్లు పడుతుందని చెబుతున్నారు. దీంతో అప్పటివరకు రాష్ట్రంలోని 8 లక్షల మంది నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పేలా లేవు. 

వివరాల సేకరణ 
ఏ పోస్టులు ఏ కేటగిరీలోకి వస్తాయన్న వర్గీకరణను పూర్తి చేసిన ప్రభుత్వం వివిధ శాఖల్లోని పోస్టుల వివరాలనూ సేకరించింది. శాఖల వారీగా మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, ఖాళీల వివరాలను తీసుకుంది. ఒక్క పాఠశాల విద్యాశాఖ మినహా మిగతా శాఖల వివరాల సేకరణ ఇదివరకే పూర్తికాగా.. ఇప్పుడు ఆ శాఖ లెక్క కూడా తేలింది. ఆర్థిక శాఖ క్షేత్రస్థాయి నుంచి సేకరించిన లెక్కల ప్రకారం 67,820 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆగస్టులో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌కు నివేదించింది.

మరోసారి వాటిని పరిశీలించే ప్రక్రియను చేపట్టారు. అది పూర్తయితే ఈ వారంలోనే వివిధ శాఖల్లో ఖాళీలపై పూర్తిస్థాయి స్పష్టత రానుంది. ఆ తర్వాత అంటే వచ్చే నెల్లో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమవుతుంది. వీలైతే ఈ నెలలోనే ఆ ప్రక్రియను పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటివరకు ఆర్డర్‌ టు సర్వ్‌ కింద పనిచేస్తున్న ఉద్యోగులను కొత్త జిల్లాల ప్రకా రం కేటాయించడం, అందుకోసం వారికి ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియను వచ్చే నెలలో చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. 

ఆప్షన్లకు అందుబాటులో అన్ని పోస్టులు 
ఉద్యోగులు పనిచేస్తున్న పోస్టులు మాత్రమే కాకుండా శాఖల వారీగా మంజూరైన పోస్టులన్నింటినీ ఆప్షన్లకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగ సంఘాలు కూడా అదే డిమాండ్‌ చేశాయి. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు ఆప్షన్ల ప్రకారం వాటిని కేటాయించాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రాథమిక మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది. సంబంధిత జిల్లా, జోన్, మల్టీ జోన్‌లోని పోస్టులను స్థానికత ఆధారంగా కేటాయిస్తారు.

ఒకవేళ ఎక్కువ మంది ఆప్షన్లు ఇస్తే సీనియర్లకు ఇస్తారు. ఇందులోనూ వికలాంగులు, వితంతువులు, కేన్సర్‌/కిడ్నీ వ్యాధిగ్రస్తులు, మానసిక వైకల్యం కలిగిన పిల్లలున్న వారు, జీహెచ్‌ఎంసీ మినహా మిగతా ప్రాంతాల్లో స్పౌజ్‌ (కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు), గుర్తింపు పొందిన సంఘాల వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ ప్రక్రియను డిసెంబరులోగా పూర్తి చేస్తే ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి మార్గం సుగమం అవుతుంది. 

విద్యాశాఖలో... 
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టుల లెక్క తేలింది. ఇక జిల్లాల వారీగా విభజన చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎవరు ఏ జిల్లా పరిధిలోకి వస్తారనేది ధ్రువీకరిస్తారు. ఉమ్మడి జిల్లాల లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1.22 లక్షలు. అయితే చాలామంది పదవీ విరమణ, ఇతర కారణాల వల్ల వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం విద్యాశాఖలో వివిధ కేడర్లలో 18,927 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. అయితే వీటిలో 12,225 పోస్టులను భర్తీ చేసే అవకాశముందని అంటున్నారు. 

త్వరలోనే సీఎం సమావేశం.. 
ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్‌ త్వరలోనే సమావేశం నిర్వహించే అవకాశముంది. కొత్త జిల్లాలకు శాశ్వత కేటాయింపులు చేపట్టేందుకు మార్గదర్శకాలపై చర్చిస్తారు. ఈ నెలాఖరులో సమావేశం జరిగే అవకాశం ఉంది. 
రాజేందర్, టీఎన్‌జీవో, రాష్ట్ర అధ్యక్షుడు 

ఆయా శాఖల్లో భర్తీ చేసే అవకాశం ఉన్న పోస్టులు 
స్కూల్‌ అసిస్టెంట్‌–1,694, లాంగ్వేజ్‌ పండిట్‌–1,211, పీఈటీ–458, ఎస్‌జీటీ–8,862, హోంశాఖ–21,507, ఉన్నత విద్య–3,825, గిరిజన సంక్షేమం–1,700, వైద్యారోగ్యశాఖ– 10,048, బీసీ సంక్షేమం–3,538, ఎస్సీ సంక్షేమం–1,967, రెవెన్యూ–1,441, మైనారి టీ సంక్షేమం–1,437, గ్రామీణాభివృద్ధి– 1391, నీటి పారుదల–1,222, పురపాలక శాఖ–1,148, అటవీశాఖ–1,096, కార్మిక శాఖ–980, వ్యవసాయ శాఖ–742, పశుసంవర్థకశాఖ– 628, రోడ్లు భవనాలు, రవాణా– 492, పరిశ్రమలు–292, ఆర్థికశాఖ–838, స్త్రీ శిశుసంక్షేమం–800, జీఏడీ– 220, సాంస్కృతిక, పర్యాటక–69, ప్లానింగ్‌–65, పౌర సరఫరాలు–48, శాసనసభ–38, ఇంధన శాఖ–33, న్యాయ శాఖ–26, ఐటీ శాఖ– 4. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement