సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ముమ్మరంగా కసరత్తు సాగుతోంది. ఉగాది నాటికి తొలివిడత నోటిఫికేషన్ జారీచేసే అవకాశముంది. ఏప్రిల్ 2న ఉగాది పండుగ జరుపుకోనుండగా, మరో రెండువారాల్లోగా తొలి విడత నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 27 ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే.
దశలవారీగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతగా 30 వేల నుంచి 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు సమాచారం. ఎక్కువ మంది ఈ మెగా ఉద్యోగమేళాలో భాగం పంచుకోవాలన్న ఉద్దేశంతో విడతలవారీగా ఈ నోటిఫికేషన్లు జారీ కానున్నట్లు సమాచారం. ఒకేసారి 80 వేల పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయడం వల్ల ఇబ్బందులుంటాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
కాగా, వివిధ శాఖల నుంచి వస్తున్న ఉద్యోగ ఖాళీల సమాచారంపై రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. గురువారంనాటికి 10 ప్రభుత్వ శాఖలు కొలువుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపించాయి. హోం, వైద్యారోగ్య, రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు ఇందులో ఉన్నాయి.
ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. హోంశాఖలో 18,334 పోస్టులు, వైద్యారోగ్య శాఖలో 12,755, పాఠశాల విద్యాశాఖలో 13,086 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలకు కొన్ని మార్పులను సూచించగా ఒకటి రెండు రోజుల్లో ఆ శాఖల నుంచి తుది ప్రతిపాదనలు మళ్లీ ఆర్థిక శాఖకు అందనున్నాయి.
సీఎం సూచనలు అందిన వెంటనే జీవోలు
సీఎం కేసీఆర్ నుంచి సూచనలు అందిన వెంట నే శాఖల వారీగా తొలివిడత పోస్టుల భర్తీకి పరిపాలనాఅనుమతులు జారీ చేస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేయనుంది. ఆ వెంటనే సంబంధిత శాఖల సమన్వయంతో ఆయా నియామక సంస్థలు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నాయి.
వివిధ శాఖల నుంచి వస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారంలో ఎక్కడా తేడా రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నోటిఫికేషన్‌లో ఎలాంటి తప్పులు రాకుండా తగిన చర్యలు చేపట్టారు. తొలివిడత నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రక్రియ రెండువారాల్లో పూర్తి కానుందని, వచ్చే నెల ప్రారంభంలో నోటిఫికేషన్లు రావచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment