State Finance Department
-
త్వరలో 704 ఏఈ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మెకానికల్ (84), సివిల్ (320), అగ్రికల్చర్ ఇంజనీరింగ్ (100), ఎలక్ట్రికల్ (200) విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఆయా విభా గాల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హుల వుతారు. ఇందులో 259 పోస్టులు మల్టీ జోన్–1కు, 445 పోస్టులు మల్టీ జోన్–2 కు కేటాయించారు. వీటితో పాటు మరో 227 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) ఉద్యోగాల భర్తీకి కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో సివిల్ (182), మెకానికల్ (45) పోస్టులు ఉన్నాయి. 112 పోస్టులు మల్టీ జోన్–1కు, 115 పోస్టులు మల్టీజోన్–2 కు కేటాయించారు. బీటెక్ పట్టభద్రుల తో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. -
ఉగాదికి ఉద్యోగ నోటిఫికేషన్లు.. తొలివిడతలో భారీ సంఖ్యలో భర్తీ?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ముమ్మరంగా కసరత్తు సాగుతోంది. ఉగాది నాటికి తొలివిడత నోటిఫికేషన్ జారీచేసే అవకాశముంది. ఏప్రిల్ 2న ఉగాది పండుగ జరుపుకోనుండగా, మరో రెండువారాల్లోగా తొలి విడత నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 27 ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. దశలవారీగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతగా 30 వేల నుంచి 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు సమాచారం. ఎక్కువ మంది ఈ మెగా ఉద్యోగమేళాలో భాగం పంచుకోవాలన్న ఉద్దేశంతో విడతలవారీగా ఈ నోటిఫికేషన్లు జారీ కానున్నట్లు సమాచారం. ఒకేసారి 80 వేల పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయడం వల్ల ఇబ్బందులుంటాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. కాగా, వివిధ శాఖల నుంచి వస్తున్న ఉద్యోగ ఖాళీల సమాచారంపై రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. గురువారంనాటికి 10 ప్రభుత్వ శాఖలు కొలువుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపించాయి. హోం, వైద్యారోగ్య, రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. హోంశాఖలో 18,334 పోస్టులు, వైద్యారోగ్య శాఖలో 12,755, పాఠశాల విద్యాశాఖలో 13,086 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలకు కొన్ని మార్పులను సూచించగా ఒకటి రెండు రోజుల్లో ఆ శాఖల నుంచి తుది ప్రతిపాదనలు మళ్లీ ఆర్థిక శాఖకు అందనున్నాయి. సీఎం సూచనలు అందిన వెంటనే జీవోలు సీఎం కేసీఆర్ నుంచి సూచనలు అందిన వెంట నే శాఖల వారీగా తొలివిడత పోస్టుల భర్తీకి పరిపాలనాఅనుమతులు జారీ చేస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేయనుంది. ఆ వెంటనే సంబంధిత శాఖల సమన్వయంతో ఆయా నియామక సంస్థలు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నాయి. వివిధ శాఖల నుంచి వస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారంలో ఎక్కడా తేడా రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నోటిఫికేషన్లో ఎలాంటి తప్పులు రాకుండా తగిన చర్యలు చేపట్టారు. తొలివిడత నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రక్రియ రెండువారాల్లో పూర్తి కానుందని, వచ్చే నెల ప్రారంభంలో నోటిఫికేషన్లు రావచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
హైకోర్టుకు 183 సూపర్‌న్యూమరరీ, 267 అదనపు పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు పరిధిలో 183 సూపర్ న్యూమరరీ, 267 పోస్టుల కల్పనకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి తెలిపింది. ఈ మేరకు కేటగిరీల వారీగా ఆయా పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సూపర్‌న్యూమరరీ పోస్టుల్లో భాగంగా జాయింట్ రిజిస్ట్రార్(1), డిప్యూటీ రిజిస్ట్రార్ (3), అసిస్టెంట్ రిజిస్ట్రార్(10), సెక్షన్ ఆఫీసర్ (50),జడ్జిలు, రిజిస్ట్రార్లకు పీఎస్‌లు(11), డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్లు(12), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు(24), ఎగ్జామినర్(3), డ్రైవర్(30), రికార్డు అసిస్టెంట్(39) పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ అ య్యాయి. ఇక అదనపు పోస్టుల విషయానికి వస్తే జిల్లా కోర్టులు, అదనపు జిల్లా సెషన్స్ కోర్టులు, కమిషనర్లు, ఎస్పీ కార్యాలయాలు, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులు, అసిస్టెంట్ సెషన్స్ కోర్టులు, ప్రధాన కార్యాలయంలో పనిచేసేందుకు 267 పోస్టులకు అనుమతినిచ్చింది. ఇందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు(4), గ్రేడ్–1 అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (116), గ్రేడ్–2 అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు(39), అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (101), పరిపాలన అధికారులు (2), సూపరిండెంట్లు (2), సీనియర్ అసిస్టెంట్లు(3) పోస్టులు మంజూరయ్యాయి. వీటికి తోడు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కేడర్‌లో హైకోర్టులో ఒక ఓఎస్డీ పోస్టును కూడా మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ వేరొక ఉత్తర్వు జారీ చేసింది. -
సూక్ష్మసేద్యానికి నిధులు కరువు
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మసేద్యానికి బ్రేకులు పడ్డాయి. నిధులు లేకపోవడంతోనే ఈ కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.85 లక్షల ఎకరాలకుగాను కేవలం 70 వేల ఎకరాలకు మాత్రమే పరిపాలన అనుమతులిచ్చారు. ఇందులో ఇంకా ఒక్కటి కూడా క్షేత్రస్థాయిలో రైతులకు అందలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 1,26,054 మంది రైతులు డ్రిప్ ఇరిగేషన్‌కు మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఉద్యాన శాఖ వద్ద మూలుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 60 శాతం నిధులు కేటాయింపులు చేసినా రాష్ట్ర ఆర్థిక శాఖ తన వాటా నిధులు విడుదల చేయడం లేదు. కేంద్రం నుంచి రూ.348 కోట్లు కేటాయింపులు రాగా, రాష్ట్ర ఆర్థిక శాఖ దానికి రూ.283 కోట్లు కలిపి ఇవ్వాల్సి ఉంది. అవసరాల రీత్యా అదనంగా మరో రూ.263.55 కోట్లు ఇచ్చేలా యాక్షన్ ప్లాన్‌కు ఆమోదం కూడా ఇచ్చింది. ఇందులో కేంద్రం రూ.191 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. అయితే అందుకు రాష్ట్ర వాటా కలిపి ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మసేద్యాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా బీసీలకు 90, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తోంది. సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం గతంలో నాబార్డు నుంచి రూ.800 కోట్లు రుణంగా తీసుకుంది. ఆ సొమ్ము అంతా కూడా గతేడాది దర ఖాస్తులు, వాటి చెల్లింపులకు పూర్తయింది. పదో స్థానంలో రాష్ట్రం... దేశవ్యాప్తంగా 2.30 కోట్ల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందుబాటులోకి వచ్చింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే సూక్ష్మసేద్యంలో తెలంగాణ పదో స్థానంలో ఉంది. దేశంలో అత్యధికంగా రాజస్తాన్‌లో 44.71 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు అప్పు, అడ్వాన్సు ఇలా..
నిడమర్రు : వాహనాలు, కంప్యూటర్ వంటివి కొనుగోలుకు, వివాహం, ఉన్నత చదువుల ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు అడ్వాన్స్, అప్పుల రూపంలో కొంత మొత్తం అందిస్తుంది. దీనికోసం రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా జీవో నంబర్ 167 విడుదల చేసింది. ఆర్పీఎస్ 2015 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ రుణాలు, అడ్వాన్సులు పొందేందుకు అర్హులు. ఏ అవసరాలకు రుణాలు ఇస్తారు.. వాటివడ్డీ, వాయిదాలు తదితర వివరాలు తెలుసుకుందాం. కార్ అడ్వాన్స్ ♦ బేసిక్ పే రూ.37,100 అంతకంటే ఎక్కువ ఉన్న ఉద్యోగులకు, 15 నెలల బేసిక్ పే లేదా రూ.6 లక్షలు..ఇందులో ఏది తక్కువ ఉంటే అంత అడ్వాన్స్ ఇస్తారు. దీనిని 65 వాయిదాల్లో 5.5 శాతం వడ్డీతో చెల్లించాలి. మోటర్ సైకిల్ అడ్వాన్స్ ♦ బేసిక్ పే రూ.22,460 కంటే ఎక్కువ పొందుతున్న ఉద్యోగులు దీనికి అర్హులు. ఏడు నెలల బేసిక్ పే లేదా రూ.80 వేలు.. ఇందులో ఏది తక్కువ ఉంటే అంత అడ్వాన్స్ ఇస్తారు. దీన్ని 16 వాయిదాల్లో 5.5 శాతం వడ్డీతో చెల్లించాలి. మోపెడ్ అడ్వాన్స్ ♦ రెండేళ్ల సర్వీసు ఉండాలి. బేసిక్ పే రూ.16,400 అంతకంటే ఎక్కువ పొందుతున్నవారు అర్హులు. దీనికి 7 నెలల బేసిక్ పే లేదా రూ.35 వేలు..ఇందులో ఏది తక్కువ ఉంటే అంత మొత్తం చెల్లిస్తారు. 16 ♦ వాయిదాల్లో 5.5 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలి. సైకిల్ అడ్వాన్స్ ♦ కార్, మోటర్ సైకిల్ కోసం అడ్వాన్స్ తీసుకున్నవారు మినహాయించి, అందరూ అర్హులు. నగదు రూ.10 వేలు అడ్వాన్స్‌గా 5.5 శాతం వడ్డీతో 4 వాయిదాల్లో చెల్లించాలి. వివాహ అడ్వాన్స్ ♦ పురుష ఉద్యోగులు, వారి పిల్లల వివాహాలకు, క్లాస్–4 ఉద్యోగులకు 15 నెలల బేసిక్ పే లేదా రూ.75 వేలు చెల్లిస్తారు. దీన్ని 5.5 శాతం వడ్డీతో, 10 వాయిదాల్లో చెల్లించాలి. ♦ మహిళా ఉద్యోగులు, వారి పిల్లల వివాహాలకు క్లాస్–4 ఉద్యోగినులకు అయితే 15 నెలల బేసిక్ పే లేదా రూ.లక్ష.. ఇందులో ఏది తక్కువగా ఉంటే అంత మొత్తం చెల్లిస్తారు. ♦ మిగతావారికి, 15 నెలల బేసిక్ పే లేదా రూ.2 లక్షలు.. ఇందులో ఏది తక్కువగా ఉంటే అంత మొత్తం చెల్లిస్తారు. దీన్ని 10 వాయిదాల్లో 5.5 శాతం వడ్డీతో చెల్లించాలి. కంప్యూటర్ ♦ బేసిక్ పే రూ.16,400 లేదా అంతకంటే ఎక్కువ పొందుతున్నవారు అర్హులు. వీరికి రూ.50 వేలు చెల్లిస్తారు. దీన్ని 5.5 శాతం వడ్డీతో చెల్లించాలి. పండుగ అడ్వాన్స్ ♦ స్కేల్ రూ.26,600–రూ.77,030 లేదా అంతకంటే తక్కువ స్కేల్ పొందుతున్నవారు అర్హులు. వీరికి రూ.7,500 చెల్లిస్తారు. దీన్ని 10 వాయిదాల్లో తిరిగి చెల్లించాలి. ఆప్కో దుస్తుల కొనుగోలుకు ♦ అప్కో దుకాణాల్లో దుస్తుల కొనుగోలుకు గెజిటెడ్ అధికారులు రూ.7.500, నాన్ గెజిటెడ్ అధికారులు రూ.6 వేలు, క్లాస్–4 ఉద్యోగులకు రూ.4,500 అడ్వాన్స్‌గా ఇస్తారు. ఎటువంటి వడ్డీ లేకుండా అందరూ 10 వాయిదాల్లో చెల్లించాలి. ఉన్నత చదువుల కోసం ♦ నాన్ గెజిటెడ్ మరియు క్లాస్–4 ఉద్యోగులకు రూ.7,500 ఇస్తారు. వడ్డీ లేకుండా దీన్ని 10 వాయిదాల్లో చెల్లించాలి. -
20,069 కోట్ల అప్పునకు అనుమతించండి
కేంద్రానికి రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రూ.20,069 కోట్ల అప్పు చేసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. రాష్ట్రప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.21,528 కోట్ల అప్పు చేయనున్నట్లు పేర్కొంది. అయితే ఇందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.18,796 కోట్ల వరకే అప్పు చేసేందుకు అనుమతించింది. అంతకుమించి అప్పు చేసేందుకు వీల్లేదని స్పష్టం చేస్తూ గతంలోనే రాష్ట్రసర్కారుకు లేఖ రాసింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 12 శాతం మేరకు రెవెన్యూ వృద్ధి ఉంటుందని పేర్కొంది. అయితే అంత శాతం వృద్ధి లేదనే కారణంతో కేంద్రం రాష్ట్ర అప్పు పరిమితిని రూ.18,796 కోట్లకు కుదించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి లేఖ రాసింది. అసలే రాష్ట్రం కష్టాల్లో ఉందని, 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.13,297 కోట్ల రెవెన్యూ లోటులో ఉందని, నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి వచ్చే మూడేళ్లలో రూ.15 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్ల అవసరముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2016-17 ఆర్థిక సంవత్సరం అప్పుల పరిమితిని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రూ.20,069 కోట్లకు పెంచాలని కోరింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6,68,970 కోట్లు ఉంటుందని, రాష్ట్ర ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం నిబంధనల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతం మేరకు అప్పు చేసేందుకు వీలున్నందున.. రూ.20,069 కోట్ల అప్పునకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.