కేంద్రానికి రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రూ.20,069 కోట్ల అప్పు చేసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. రాష్ట్రప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.21,528 కోట్ల అప్పు చేయనున్నట్లు పేర్కొంది. అయితే ఇందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.18,796 కోట్ల వరకే అప్పు చేసేందుకు అనుమతించింది. అంతకుమించి అప్పు చేసేందుకు వీల్లేదని స్పష్టం చేస్తూ గతంలోనే రాష్ట్రసర్కారుకు లేఖ రాసింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 12 శాతం మేరకు రెవెన్యూ వృద్ధి ఉంటుందని పేర్కొంది.
అయితే అంత శాతం వృద్ధి లేదనే కారణంతో కేంద్రం రాష్ట్ర అప్పు పరిమితిని రూ.18,796 కోట్లకు కుదించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి లేఖ రాసింది. అసలే రాష్ట్రం కష్టాల్లో ఉందని, 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.13,297 కోట్ల రెవెన్యూ లోటులో ఉందని, నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి వచ్చే మూడేళ్లలో రూ.15 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్ల అవసరముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2016-17 ఆర్థిక సంవత్సరం అప్పుల పరిమితిని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రూ.20,069 కోట్లకు పెంచాలని కోరింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6,68,970 కోట్లు ఉంటుందని, రాష్ట్ర ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం నిబంధనల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతం మేరకు అప్పు చేసేందుకు వీలున్నందున.. రూ.20,069 కోట్ల అప్పునకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.
20,069 కోట్ల అప్పునకు అనుమతించండి
Published Thu, Jun 9 2016 1:23 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement