కాల పరీక్షలో మన విదేశీ సంబంధాలు | Sakshi Guest Column On Indian Govt Foreign Relations | Sakshi
Sakshi News home page

కాల పరీక్షలో మన విదేశీ సంబంధాలు

Published Fri, Oct 18 2024 1:18 AM | Last Updated on Fri, Oct 18 2024 1:18 AM

Sakshi Guest Column On Indian Govt Foreign Relations

విశ్లేషణ

దశాబ్దాలుగా భారతీయులకు, ప్రత్యేకించి పంజాబ్‌ నుండి వలస వెళ్తున్నవారికి కెనడా చేరుకోవలసిన ప్రదేశంగా ఉంటోంది. అంతేకాదు, భారత్‌ అణు సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో సహాయపడే వ్యూహాత్మక భాగస్వామి కెనడా. అటువంటి దేశంతో భారత్‌ సంబంధాలు ఎందుకు క్షీణిస్తున్నట్లు? కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తమ సిక్కు పౌరులను భారత్‌ హత్య చేయిస్తుందని ఆరోపించడం, దాదాపు అటువంటి ఆరోపణనే అమెరికా కూడా చేయడం వాతావరణాన్ని వేడెక్కించింది. ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది... కెనడా, అమెరికా ప్రభుత్వాలు ఈ అంశంపై బహిరంగ ప్రకటనకు ఎందుకు వెళ్లాయి? రెండవది... భారతదేశంపై ఇలా ఆరోపణలు మోపడం ఎక్కడదాకా వెళ్ళి ఆగుతుంది?

గత దశాబ్దంలో ప్రపంచ వలస ప్రస్థానాలకు చెందిన ఒక ముఖ్యమైన కథ ఏమిటంటే... భారతీయ వలసలు గణనీయంగా పెరగడం. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, సింగపూర్‌ నుంచి దుబాయ్‌ వరకు, పోర్చుగల్‌ నుంచి ఇజ్రాయెల్‌ వరకు భారతీయుల వలసలు నానాటికీ పెరుగుతున్నాయి. 2014లో కెనడాలో కేవలం 38,364 మంది భారతీయులు శాశ్వత పౌరులుగా మారారు. 2022 నాటికి ఈ సంఖ్య ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయిలో 1,18,095కి చేరుకుంది. దీనికి విరుద్ధంగా, 2022లో కేవలం 30 వేల మంది చైనీయులు మాత్రమే కెనడాకు తరలి వెళ్లారు. 

దశాబ్దాలుగా భారతీయులకు, ప్రత్యేకించి పంజాబ్‌ నుండి వలస వచ్చిన వారికి కెనడా చేరుకోవలసిన ప్రదేశంగా ఉంటోంది. పైగా, భారతదేశ అణు సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడే వ్యూహాత్మక భాగస్వామి కెనడా. అలాంటప్పుడు, రెండు దేశాల మధ్య సంబంధాలు ఎందుకు మునుపెన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి?

భారతదేశం, ఆంగ్లోస్పియర్‌ (ఇంగ్లిష్‌ భాష, సంస్కృతి ప్రధానంగా ఉండే) దేశాల మధ్య సమస్య ఉందని స్పష్టమవుతోంది. విదే శాంగ విధానం, జాతీయ భద్రతతో స్వప్రయోజనాలు నెరవేర్చేందుకు దేశీయ రాజకీయ వ్యూహాలను ట్రూడో మిళితం చేశారని భారత అధి కారులు అభియోగాలు మోపారు. 

ట్రూడోకి కెనడియన్‌ సిక్కుల ఓటు అవసరం కాబట్టి వారి ఖలిస్తానీ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నారు; ఆయన ప్రభుత్వం డ్రగ్‌ పంపిణీదారులు, భారత వ్యతిరేక ఉగ్రవాదు లకు ఆశ్రయం ఇస్తోందనీ వీరు ఆరోపించారు. దీనికి ప్రతిగా కెనడా పౌరులను హత్య చేయడానికి భారత ఇంటెలిజెన్స్‌ అధికారులు, దౌత్య వేత్తలు కుట్ర పన్నారని ట్రూడో ప్రభుత్వం ఆరోపించింది.

మరోవైపు అమెరికా ఈ వివాదంలోకి అడుగుపెట్టి, కెనడియన్‌ సిక్కు హత్యను, అమెరికన్‌ సిక్కుపై ఇదే విధమైన ప్రయత్నానికి ముడి పెట్టింది. దీంతో దౌత్యపరమైన గందరగోళం ప్రారంభమైంది. త్వర లోనే ఇది పెద్ద గొడవగా మారి పరాకాష్ఠకు చేరింది. కెనడా, అమెరికా, బ్రిటన్‌లలో ఖలిస్తానీ అనుకూల క్రియాశీలత గురించి భారత్‌ ఫిర్యాదు... దేశీయ భద్రతా సమస్యలపై ఆధారపడింది. 

పాశ్చాత్య ప్రభుత్వాలు భారతదేశ ఆందోళనల పట్ల సున్నితంగా వ్యవహరించడం లేదన్న మోదీ ప్రభుత్వ దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే, దౌత్యవేత్తలు, సీనియర్‌ ప్రభుత్వ అధికారులతో సహా భారతీ యులకు వ్యతిరేకంగా కెనడా, అమెరికా చేసిన నేరారోపణలు తీవ్రమై నవి. ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

మొదటిది... కెనడా, అమెరికా ప్రభుత్వాలు ఈ అంశంపై బహిరంగ ప్రకటనకు ఎందుకు వెళ్లాయి? రెండోది... భారత్‌పై ఇలా ఆరోపణలు మోపడం ఎక్కడ దాకా వెళ్ళి ఆగుతుంది? రెండవ ప్రశ్న విషయానికి వస్తే, అమె రికా, కెనడా రెండూ పేర్లను కూడా పేర్కొన్నాయి. పైగా భారతీయు లపైనే తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బాధ్యతను ఉంచాయి.

మొదటి ప్రశ్న ముఖ్యమైనది. ఎందుకంటే కెనడా, అమెరికాలు భారతదేశంతో సహేతుకంగానే మంచి దౌత్య సంబంధాలను కలిగి ఉన్నాయి. పైగా చాలావరకు విచక్షణతో ఇవి విషయాలను నిర్వహించ గలవని ఆశించవచ్చు. మొదటి ప్రశ్నకు సంబంధించి కెనడియన్‌ సిక్కు ఓటర్లతో ఎన్నికల ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే ఆశతో ట్రూడో పక్షపాత రాజకీయాలు ఆడుతున్నారనేది భారత ప్రభుత్వ అధికారిక అభియోగం. 

‘సరిహద్దు’ ఉగ్రవాద దాడులకు సంబంధించిన ఆరో పణలతో భారత రాజకీయ నాయకులు రాజకీయ పెట్టుబడి పెట్టారని పాకిస్తాన్‌ ఆరోపిస్తున్న రీతిని ఇది బాగా ధ్వనిస్తోంది. దేశీయ రాజకీ యాలతో జాతీయ భద్రతా సమస్యలను కలపడం రెండు మార్గాలనూ తొలగించివేస్తుంది. పైగా అటువంటి ఆరోపణలను మూడవ పక్షం వారు ఎలా చూస్తున్నారనే అంశంపై జాగ్రత్తగా ఉండాలి. 

బహుశా, ట్రూడో ప్రభుత్వాన్ని భారతదేశం విస్మరించే స్థాయిలో ఉందనే అభిప్రాయాన్ని కొందరు అర్థం చేసుకోవచ్చు. హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించి ప్రాథమిక ఆరోపణలు వచ్చినప్పుడు న్యూఢిల్లీలో ఇదే ప్రధానమైన అభిప్రాయంగా ఉండేది. తర్వాత, అమెరికా గడ్డపై కూడా, గురుపథ్‌వ సింగ్‌ పన్నూన్‌ను చంపడానికి భారత అధికారులు కుట్ర పన్నారని అమెరికా ఆరోపించడమే కాకుండా, చట్టపరమైన చర్యలను కూడా ప్రారంభించడం ద్వారా ముందడుగు వేసింది. 

ఇదంతా కేవలం స్నేహితుల మధ్య ఉన్న అపార్థం, అపమ్మకాల వ్యవహారమా? లేక దీంట్లో పెద్ద సమస్యలు ఇమిడి ఉన్నాయా? ఇంగ్లిష్‌ భాషాధిక్య దేశాలైన ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, అమెరికా తమ ’ఫైవ్‌ ఐస్‌’ కూటమి ద్వారా ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని పంచుకున్న విషయం తెలిసిందే. 

దీన్ని బట్టి చూస్తే, ట్రూడో ఎక్కువ ఓట్లను కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం ఏమంత విశ్వసనీయమైన ప్రతిస్పందనగా అనిపించదు. మరీ ముఖ్యంగా, పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలు తమను లక్ష్యంగా చేసుకుంటున్నాయని భారత ప్రభుత్వం ఎందుకు విశ్వసిస్తోందనే ప్రశ్నను అడిగి తీరాలి.

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌ గత వారం తన విజయదశమి ప్రసంగంలో, పాశ్చాత్య ‘ఉదారవాద, ప్రజాస్వా మ్యాలు’ బంగ్లాదేశ్‌లో చేసినట్లుగా భారతదేశంలో ‘అరబ్‌ స్ప్రింగ్‌’ తరహా ‘వర్ణ విప్లవాలను’ ప్రదర్శించాలని యోచిస్తున్నాయని పరోక్షంగా ఆరోపించారు. పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలతో సంబంధాలను వీక్షిస్తున్న ఈ విధానం భారతీయ విదేశీ, జాతీయ భద్రతా విధానాలకు సంబంధించి పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది.

ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ తన పదవీ కాలంలో చేసిన అనేక ప్రసంగాలలో ‘భారతదేశం బాగుండాలని ప్రపంచం కోరుకుంటోంది, కానీ మన సవాళ్లు స్వదేశంలో ఉన్నాయి’ అని తరచుగా చెప్పే వారు. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ఉదారవాద ప్రజాస్వామ్యాలు కలిసి జిహాదీ తీవ్రవాదం, నిరంకుశ చైనా పెరుగుదలపై భారతదేశంలాగే ఆందోళన చెందుతున్నాయనీ, అందువల్లే పాశ్చాత్య ఉదారవాద, ప్రజాస్వామ్య పాలనపై గురిపెట్టిన ఈ రెండు ప్రమాదాలకు వ్యతిరేకంగా భారతదేశం ఎదుగుదలకు అవి మద్దతునిచ్చాయన్న దృక్పథంపై ఈ  అంచనా ఆధారపడి ఉంది.

ఈ దృక్కోణం మారిందా? భారతదేశం ఇకపై ఆంగ్లోస్పియర్‌ను ‘మిత్రుడు’గా లేదా కనీసం దాని పురోగతిలో భాగస్వామిగా చూడ లేదా? చైనా, పాకిస్తాన్‌లు రెండింటినీ తన జాతీయ భద్రతకు ప్రమా దకారులుగా ప్రకటించిన భారత్‌ అదే సమయంలో పశ్చిమ ఉదార వాద ప్రజాస్వామ్యాలను దూరం చేసుకోగలదా? విదేశాంగ విధాన నిర్వాహకులు, జాతీయ భద్రతను నిర్వహించే వారి ఆలోచనల మధ్య తప్పు అమరిక ఏదైనా ఉందా? కెనడా ప్రధాని ట్రూడో ఇలాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తారు.

కొనసాగుతున్న పశ్చిమాసియా సంఘర్షణలో పెరుగుతున్న అమెరికా ప్రమేయం పెనుమంటగా మారడంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థపై తక్షణ పర్యవసానాలను కలిగిస్తుంది. మొత్తంమీద ప్రపంచ పర్యావరణం నేడు భారత ఆర్థికవృద్ధికి, పెరుగుదలకి చాలా తక్కువ అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. 

మోదీ ప్రభుత్వం, సంఘ్‌ పరివార్‌లు పశ్చిమ దేశాలపై, వాటి సంస్థలపై క్రమం తప్పకుండా విమర్శలు గుప్పించడం చూస్తే... పశ్చిమ దేశాలతో భారత్‌ సంబంధాలు పరీక్షకు గురవుతున్నట్లు, విశ్వాస సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నట్లు అనిపిస్తుంది. ట్రూడో వ్యవహారం కేవలం ఒక తీవ్రమైన అనారోగ్యపు లక్షణం కావచ్చు!


సంజయ బారు
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్, మాజీ ప్రధాని మన్మోహన్‌
సింగ్‌కు మీడియా సలహాదారు (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో...) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement