సర్కారీ నౌకరీ సాటి రాదు మరేదే | waiting for Government Job Notifications | Sakshi
Sakshi News home page

సర్కారీ నౌకరీ సాటి రాదు మరేదే

Published Thu, May 5 2016 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

సర్కారీ నౌకరీ సాటి రాదు మరేదే

సర్కారీ నౌకరీ సాటి రాదు మరేదే

 కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి అత్యున్నత సివిల్ సర్వీసెస్ వరకూ..ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం యువత ఆతృతగాఎదురుచూస్తోంది. ప్రకటనల సమాచారం తెలిసిన వెంటనే కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు తీస్తోంది. చిన్నచిన్న ఉద్యోగాలకు సైతం ఎంటెక్‌లు, ఎంబీఏలు, పీజీలు, పీహెచ్‌డీ స్కాలర్స్ పోటీపడుతున్న వైనం సర్కారీ కొలువులపై యువత ఆసక్తిని తేటతెల్లం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలపట్ల పెరుగుతున్న క్రేజ్‌పై ప్రత్యేక విశ్లేషణ..
 
 అందరి చూపూ ప్రభుత్వ ఉద్యోగాలపైనే..
 అర్హతలు, ఇన్‌స్టిట్యూట్‌లు, డిగ్రీలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేజిక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలకు సెలవులు పెట్టో.. అదీ వీలు కాకపోతే రాజీనామా చేసైనా సరే సర్కార్ కొలువును సొంతం చేసుకునే దిశగా కదులుతున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తోపాటు ఆయా రాష్ట్రాల సర్వీస్ కమిషన్ల జాబ్ నోటిఫికేషన్లకు వెల్లువెత్తుతున్న దరఖాస్తులే ఇందుకు నిదర్శనం.
 
 కానిస్టేబుల్ పోస్టులకు పీజీ అభ్యర్థులు
  తెలుగు రాష్ట్రాల సరళిని పరిశీలిస్తే ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఇంటర్మీడియెట్ అర్హతగా ప్రకటించిన కానిస్టేబుల్ పోస్టులకు ప్రొఫెషనల్ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఎం.ఫిల్ అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 40 శాతం మందికిపైగా పీజీలు, ప్రొఫెషనల్ డిగ్రీ అభ్యర్థులే ఉన్నారంటే ప్రభుత్వ ఉద్యోగాలకు పెరుగుతున్న క్రేజ్‌ను అర్థంచేసుకోవచ్చు.   
 
 ప్యూన్ ఉద్యోగాలకు పీహెచ్‌డీ స్కాలర్స్
 ప్రభుత్వ ఉద్యోగాలకు యువతలో పెరుగుతున్న ఆసక్తికి తాజా ఉదాహరణ.. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ప్యూన్ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు పీహెచ్‌డీ, ఎంఫిల్, ఎంటెక్ అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవడం. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ప్యూన్ ఉద్యోగ దరఖాస్తుల్లోనూ ఇదే తీరు. ఇందులో 30 పోస్టుల నోటిఫికేషన్‌కు దాదాపు 75 వేల మంది ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకున్నారు.
 
 ప్రొఫెషనల్ డిగ్రీస్ టు సివిల్ సర్వీసెస్
 యూపీఎస్సీ నివేదిక ప్రకారం సివిల్స్-2013 అభ్యర్థుల్లో 40% మంది ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్‌మెంట్, సైన్స్ గ్రాడ్యుయేట్లు, పీజీ ఉత్తీర్ణులే ఉన్నారు. మొత్తం 770 మంది విజేతల్లో బీటెక్-36%; ఎంబీబీఎస్-42.9%, మేనేజ్‌మెంట్-22%, ఎంటెక్-34.4%; ఎండీ/సూపర్ స్పెషాలిటీ-38.7%; సెన్సైస్ పీజీ-32.3% మంది ఉన్నారు.
 
 బ్యాంకు ఉద్యోగాలకు భారీ పోటీ

 2014-15లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) చేపట్టిన కామన్ రిటెన్ ఎగ్జామినేషన్స్‌కు 23 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరుకావడమే ప్రభుత్వ ఉద్యోగాల పట్ల యువత ఆసక్తికి నిదర్శనం. పోటీ ఇంతలా ఉన్నందునే ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్ అనే విధానాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం.
 
 గ్రూప్-2కు ఐదున్నర లక్షల మంది దరఖాస్తు!
 తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వచ్చాయి. 439 ఖాళీల గ్రూప్ -2 నోటిఫికేషన్‌కు ఏకంగా 5,64,431 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అధిక శాతం మంది ఇంజనీరింగ్, పీజీలతోపాటు ఎంఫిల్, పీహెచ్‌డీ అభ్యర్థులు కూడా ఉండటం గమనార్హం.
 
 అంత క్రేజ్ ఎందుకు!
 
 వేతనాలు
 ఆరో వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగాయి. ఏడో వేతన సంఘం సిఫార్సులు కూడా అమల్లోకి వస్తే ఎంట్రీ లెవల్‌లోనే నెలకు రూ. 35 వేల నుంచి రూ. 40 వేల మధ్యలో జీతం పొందే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఉన్నత స్థాయి ఉద్యోగులకు సకల సదుపాయాలు లభిస్తున్నాయి.
 
 ఒత్తిడి లేని వాతావరణం

 ప్రైవేటు రంగంతో పోల్చితే ప్రభుత్వ ఉద్యోగంలో విధుల నిర్వహణ పరంగా      ఒత్తిడి కొంత తక్కువగా ఉంటుంది!      టార్గెట్స్, డెడ్‌లైన్స్ వంటివాటి నుంచి     విముక్తి పొందొచ్చనే యోచన.
 
 
 సంఘంలో గౌరవం
 మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగి అంటే ఇప్పటికీ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే గవర్నమెంట్ ఎంప్లాయిస్‌ను ‘బాబూస్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తుంటారు.
 
 సామాజిక సేవ చేసే అవకాశం
 వ్యక్తిగతంగా సామాజిక దృక్పథం, అభివృద్ధికి తోడ్పడాలనే తపన ఉన్న అభ్యర్థులు ప్రభుత్వ సర్వీసుల ద్వారా ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు.
 
 మరో పార్శ్వం
 ఎంటెక్, ఎంబీఏ, ప్రొఫెషనల్ డిగ్రీ చదివిన వారూ ప్యూన్లు, కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గల కారణాలను లోతుగా పరిశీలిం చాలని ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి అన్నారు. వృత్తి విద్యలో నాణ్యత లోపించడం, సుమారు 50% మంది ప్రొఫెషనల్ విద్యార్థులు జాబ్స్ కోసం వేచి చూస్తుండటం, కోరుకున్న కొలువులు రాకపోవడం కూడా ఇందుకు కారణమేనని చెప్పారు.
 
 యువత ప్రభుత్వ ఉద్యోగాల వైపు దృష్టి సారించడానికి కారణం వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఒత్తిళ్లు లేని భవిష్యత్తు గ్యారెంటీ అని భావించడమే. 2008లో ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర య్యాయి. దీంతో ఎంతో మంది పింక్ స్లిప్‌లు అందుకున్నారు. అలాంటి పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండదు. పే కమిషన్ల సిఫారసుల మేరకు ప్రస్తుతం కెరీర్ ప్రారంభంలోనే ఆకర్షణీయ వేతనాలు అందుతున్నాయి.
 
 ప్రొ॥వై.వెంకటరామిరెడ్డి యూపీఎస్‌సీ మాజీ సభ్యులు

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement