సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఏళ్ల తరబడి ఎదురు చూపుల తరువాత విడుదలైన నోటిఫికేషన్ల ప్రకా రం ఉద్యోగాలు సాధించేందుకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలు రాసేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 1 నుంచి 23వ తేదీ వరకు ‘తెలంగాణ రెసి డెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ రిక్రూట్‌మెంట్ బోర్డు’ఆధ్వర్యంలో గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ, పీఎల్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్, ఫిజికల్ డైరెక్టర్.. తదితర 9 రకాల ఉద్యోగాలకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి హాల్‌టికెట్లను ఆన్లైన్లో పెట్టారు. అయితే ఇప్పటికీ పలువురు అభ్యర్థులకు కొన్ని పరీక్షల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో చూపించడం లేదు. కొన్ని డౌన్‌లోడ్ కావటం లేదు. కొందరికి మాత్రం కొన్ని పరీక్షల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. హాల్‌టికెట్లు చూసి పలువురు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. జేఎల్, డీఎల్, టీజీటీ, పీజీటీ, పీఎల్ పరీక్షలకు పేపర్–1 (జనరల్ స్టడీస్), పేపర్–2 (మెథడాలజీ), పేపర్–3 (సబ్జెక్టు) ఉన్నాయి. పరీక్షలు రాసే విషయంలో అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలు చూస్తే కళ్లు తిరిగే పరిస్థితి ఉందని అంటున్నారు.
మూడు పేపర్లకు మూడు జిల్లాలు..
మంచిర్యాలకు చెందిన నికిత అనే అభ్యర్థి టీజీటీకి దరఖాస్తు చేయగా, ఆమెకు పేపర్–1 హైదరాబాద్‌లో, పేపర్–2 మంచిర్యాలలో, పేపర్–3కి వరంగల్‌లో సెంటర్లు ఇచ్చారు. అలాగే నిజామాబాద్‌కు చెందిన రమాదేవి నిజామాబాద్‌లో పరీక్ష కేంద్రం ఆప్షన్ ఇవ్వగా, ఆమెకు పేపర్–1 రంగారెడ్డి జిల్లా, పేపర్–2 మేడ్చల్, పేపర్–3కి కరీంనగర్ జిల్లాలో సెంటర్లు ఇచ్చారు. ఖమ్మంకు చెందిన బిందుకు పేపర్–1 ఖమ్మంలో, పేపర్–2 కొత్తగూడెంలో, పేపర్–3కి సత్తుపల్లిలో సెంటర్లు ఇచ్చారు. ఈ పరీక్షలను ఆగస్టు 4, 14, 22 తేదీల్లో రాయాల్సి ఉంది. ఇక్కడే మరో పెద్ద సమస్య వచ్చిపడింది. వీళ్లు టీజీటీతోపాటు పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జేఎల్ పరీక్షలకు కూడా దరఖాస్తు చేశారు. ఈ పరీక్షల కేంద్రాలు ఏయే జిల్లాల్లో కేటాయిస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో సగం జిల్లాల్లో తిరగాల్సిన పరిస్థితి..
మొత్తం 9 విభాగాల పరీక్షల్లో కీలకమైన పీజీటీ, టీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలకు మూడు చొప్పున పేపర్లకు పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలు ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్వహించడం లేదని విమర్శలు వస్తున్నాయి. టీజీటీ పరీక్షలు ఆగస్టు 4, 14, 22 తేదీల్లో ఉన్నాయి. కాగా, ఈ పరీక్షలు రాసే అభ్యర్థులు.. ఆగస్టు 9, 10, 16, 19, 21 తేదీల్లో పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలు రాయాల్సి ఉంది.
వీరికి టీజీటీ తరహాలోనే వివిధ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తే ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వందల కిలోమీటర్ల మేర ఆగస్టు నెలంతా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు ఉన్న మహిళా అభ్యర్థులు నరకయాతన పడాల్సిన పరిస్థితులు కల్పించారని మండిపడుతున్నారు. ఒక అభ్యర్థి ఇలా పోటీ పరీక్షలు రాసేందుకు వివిధ జిల్లాలు తిరగాలంటే రూ. వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment