TGT
-
ప్రతి ఆప్షన్ ఎంపిక చేసుకోవాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: గురుకుల పోస్టుల పరీక్షలు రాసిన అభ్యర్థుల నుంచి ఆప్షన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ), అక్టోబర్ 3 నుంచి 9 వరకు పాఠశాలల్లోని లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆప్షన్లు ఇవ్వాలని గురుకుల బోర్డు ఆదేశించింది. జోన్లు, సొసైటీల వారీగా ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇవ్వాలని.. ఈ క్రమంలో అవకాశమున్న ప్రతి ఆప్షన్‌ను తప్పకుండా ఎంపిక చేసుకుంటేనే ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. జోన్ల వారీగా అర్హత మార్కుల్లో తేడాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఆప్షన్ విలువైనదేనని.. ఒక్క ఆప్షన్ వదులుకున్నా ఒక అవకాశం వదిలేసుకున్నట్లేనని స్పష్టం చేస్తున్నారు. ఐదు సొసైటీల పరిధిలో.. ప్రస్తుతం ఐదు గురుకుల సొసైటీల పరిధిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. రాష్ట్రంలోని ఏడు జోన్ల పరిధిలోని ఉద్యోగాలకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 35 ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాధాన్యతా క్రమంలో వాటిని ఎంపిక చేసుకుంటూ ఆప్షన్ పేజీని పూర్తి చేయాలి. మహిళా అభ్యర్థులకు అదనంగా బాలికల విద్యా సంస్థల కేటగిరీ ఉండటంతో వారు 70 ఆప్షన్లు ఇవ్వాలి. మల్టీజోనల్ స్థాయిలోని డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు సమయంలోనే ఆప్షన్లు స్వీకరించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ).. జోనల్ స్థాయి పోస్టులకు మాత్రం ఇప్పుడు ఆప్షన్ అవకాశాన్ని కల్పించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కేటగిరీల వారీగా మెరిట్ జాబితాలను విడుదల చేయనుంది. వచ్చే నెల రెండో వారంలో.. రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ అర్హత పరీక్షల ను నిర్వహించిన బోర్డు.. ఇప్పుడు ప్రాథమిక జాబితా ల తయారీకి ఉపక్రమించింది. ప్రస్తుతం కళాశాల విద్య కమిషనరే ట్, ఇంటర్ బోర్డు పరిధిలో డిగ్రీ లెక్చ రర్లు, జూనియర్ లెక్చరర్లకు సంబంధించి అర్హత పరీక్షలు జరుగుతున్నాయి. టీఎస్పీఎస్సీ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. పరీక్షలు పూర్తయ్యాక మెరిట్ జాబితాలను విడుదల చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాథమిక మెరిట్ జాబితాల విడుదలలో జాప్యం జరిగినట్టు తెలుస్తోంది. వచ్చేనెల మొదటివారంతో టీఎస్పీఎస్సీ పరీక్షలు పూర్తవు తాయి. ఆ తర్వాత గురుకుల బోర్డు ప్రాధాన్యత క్రమంలో ప్రాథమిక మెరిట్ జాబితాలను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ముందుగా డిగ్రీ లెక్చరర్ పోస్టుల జాబితా విడుదల చేసి, డెమో పరీక్షలు నిర్వహిస్తారు. వాటి తుది మెరిట్ జాబితా ప్రకటించాక.. జూనియర్ లెక్చరర్ డెమో పరీక్షలు, అనంతరం పీజీటీ, టీజీటీ తదితర కేటగిరీలకు సంబంధించిన ఫలితాలను క్రమంగా వెల్లడించేలా బోర్డు అధికారులు కార్యాచరణ రూపొందించారు. -
తెలంగాణ మొత్తం తిరగాల్సిందే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఏళ్ల తరబడి ఎదురు చూపుల తరువాత విడుదలైన నోటిఫికేషన్ల ప్రకా రం ఉద్యోగాలు సాధించేందుకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలు రాసేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 1 నుంచి 23వ తేదీ వరకు ‘తెలంగాణ రెసి డెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు’ఆధ్వర్యంలో గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ, పీఎల్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్, ఫిజికల్ డైరెక్టర్.. తదితర 9 రకాల ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి హాల్‌టికెట్లను ఆన్లైన్లో పెట్టారు. అయితే ఇప్పటికీ పలువురు అభ్యర్థులకు కొన్ని పరీక్షల హాల్‌టికెట్లను వెబ్సైట్లో చూపించడం లేదు. కొన్ని డౌన్లోడ్ కావటం లేదు. కొందరికి మాత్రం కొన్ని పరీక్షల హాల్‌టికెట్లు డౌన్లోడ్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. హాల్‌టికెట్లు చూసి పలువురు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. జేఎల్, డీఎల్, టీజీటీ, పీజీటీ, పీఎల్ పరీక్షలకు పేపర్–1 (జనరల్ స్టడీస్), పేపర్–2 (మెథడాలజీ), పేపర్–3 (సబ్జెక్టు) ఉన్నాయి. పరీక్షలు రాసే విషయంలో అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలు చూస్తే కళ్లు తిరిగే పరిస్థితి ఉందని అంటున్నారు. మూడు పేపర్లకు మూడు జిల్లాలు.. మంచిర్యాలకు చెందిన నికిత అనే అభ్యర్థి టీజీటీకి దరఖాస్తు చేయగా, ఆమెకు పేపర్–1 హైదరాబాద్‌లో, పేపర్–2 మంచిర్యాలలో, పేపర్–3కి వరంగల్‌లో సెంటర్లు ఇచ్చారు. అలాగే నిజామాబాద్‌కు చెందిన రమాదేవి నిజామాబాద్‌లో పరీక్ష కేంద్రం ఆప్షన్ ఇవ్వగా, ఆమెకు పేపర్–1 రంగారెడ్డి జిల్లా, పేపర్–2 మేడ్చల్, పేపర్–3కి కరీంనగర్ జిల్లాలో సెంటర్లు ఇచ్చారు. ఖమ్మంకు చెందిన బిందుకు పేపర్–1 ఖమ్మంలో, పేపర్–2 కొత్తగూడెంలో, పేపర్–3కి సత్తుపల్లిలో సెంటర్లు ఇచ్చారు. ఈ పరీక్షలను ఆగస్టు 4, 14, 22 తేదీల్లో రాయాల్సి ఉంది. ఇక్కడే మరో పెద్ద సమస్య వచ్చిపడింది. వీళ్లు టీజీటీతోపాటు పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జేఎల్ పరీక్షలకు కూడా దరఖాస్తు చేశారు. ఈ పరీక్షల కేంద్రాలు ఏయే జిల్లాల్లో కేటాయిస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో సగం జిల్లాల్లో తిరగాల్సిన పరిస్థితి.. మొత్తం 9 విభాగాల పరీక్షల్లో కీలకమైన పీజీటీ, టీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలకు మూడు చొప్పున పేపర్లకు పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలు ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్వహించడం లేదని విమర్శలు వస్తున్నాయి. టీజీటీ పరీక్షలు ఆగస్టు 4, 14, 22 తేదీల్లో ఉన్నాయి. కాగా, ఈ పరీక్షలు రాసే అభ్యర్థులు.. ఆగస్టు 9, 10, 16, 19, 21 తేదీల్లో పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలు రాయాల్సి ఉంది. వీరికి టీజీటీ తరహాలోనే వివిధ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తే ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వందల కిలోమీటర్ల మేర ఆగస్టు నెలంతా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు ఉన్న మహిళా అభ్యర్థులు నరకయాతన పడాల్సిన పరిస్థితులు కల్పించారని మండిపడుతున్నారు. ఒక అభ్యర్థి ఇలా పోటీ పరీక్షలు రాసేందుకు వివిధ జిల్లాలు తిరగాలంటే రూ. వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. -
సైనిక్ స్కూల్, కలికిరిలో 18 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన కలికిరి సైనిక్ స్కూల్.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 18 ► పోస్టుల వివరాలు: టీజీటీ–02, ఎల్డీసీ–02, ఎంటీఎస్–14 తదితరాలు. ► టీజీటీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ/బీఏ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 21 నుంచి 35 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు ఉంటుంది. ► ఎల్డీసీ: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు: 18 నుంచి 50ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది. ► ఎంటీఎస్: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18నుంచి 50ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.08.2021 ► వెబ్సైట్: https://sskal.ac.in -
టీజీటీ పోస్టులకు బీటెక్ వారూ అర్హులే
సాక్షి, హైదరాబాద్: టీజీటీ (టీచర్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్) పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో ఉన్న బీఏ, బీకాం, బీఎస్సీ వారితోపాటు బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులను కూడా అర్హులుగా పరిగణించాలని హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్‌లోని డిగ్రీలతోపాటు బీటెక్ చేసిన వారిని కూడా అర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఖమ్మంకు చెందిన సంజీవరావు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ బీటెక్‌తోపాటు బీఎడ్ కూడా చేశారని, పరీక్ష రాసి ఉత్తీర్ణులైనా ఎంపిక చేయలేదని ఆయన తరఫు న్యాయవాది ఉమాదేవి వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎన్సీటీఈ 2014 రూల్స్ మేరకు టీజీటీ పోస్టులకు నోటిఫికేషన్‌లోని డిగ్రీలతోపాటు బీటెక్ పూర్తి చేసిన వారిని కూడా అర్హులుగా ప్రకటించాలని ఉత్తర్వులు జారీ చేశారు. -
26 నుంచి టీజీటీ, పీజీటీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో పోస్టుల భర్తీకి సంబంధించి టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్), పీజీటీ (పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్) అర్హత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. సబ్జెక్టుల వారీగా తేదీలను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) గురువారం ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యాశాఖ గురుకులాల్లో 960 టీజీటీ, 1,972 పీజీటీ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా టీజీటీ కేటగిరీలో 56,421 మంది, పీజీటీ కేటగిరీలో 62,604 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తికావడంతో పరీక్షల ఏర్పాట్లకు బోర్డు ఉపక్రమించింది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 14 వరకు సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహించనుంది. పరీక్ష తేదీకి పది రోజుల ముందే హాల్‌టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని బోర్డు కన్వీనర్ నవీన్ నికోలస్ తెలిపారు. అర్హత పరీక్షలను మూడు పేపర్లుగా విభజించారు. పేపర్–1 పరీక్ష కామన్‌గా ఒకేరోజు (అక్టోబర్ 6న) నిర్వహిస్తుండగా పేపర్–2, పేపర్–3 పరీక్షలు మాత్రం సబ్జెక్టుల వారీగా వేర్వేరు తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్నారు. -
టీజీటీ భర్తీలో నిబంధనలు బేఖాతర్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా అభ్యర్థులను ఎంపిక చేస్తూ జాబితా రూపొందించారన్నారు. జనరల్ కేటగిరీలో ఎంపిక కావాల్సిన అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అలసత్వంతో రిజర్వేషన్ కేటగిరీ జాబితాలో వచ్చారని, దీంతో రిజర్వ్డ్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం అభ్యర్థులు సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దాదాపు పది మంది అభ్యర్థుల పేర్లు ఓపెన్ కేటగిరీలో కాకుండా రిజర్వేషన్ కేటగిరీలో ఎంపికైనట్లు పేర్కొంటూ హాల్‌టికెట్ నంబర్లు, మార్కులతో కూడిన పత్రాలను అధికారులకు సమర్పించారు. టీఎస్పీఎస్సీకి ఆర్.కృష్ణయ్య లేఖ టీజీటీల ఎంపికలో తప్పులు దొర్లాయని, వెంటనే పూర్తిస్థాయి విచారణ జరపాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్క అభ్యర్థి ఎంపికలో తప్పు జరిగినా జాబితా మొత్తం తలకిందులు అవుతుందన్నారు. ఈమేరకు టీఎస్పీఎస్సీకి లేఖ రాశారు. నియామక విధానంలోనూ క్రమపద్ధతి పాటించడం లేదన్నారు. వెబ్ ఆప్షన్ అనేది పాలనా ప్రక్రియకు సంబంధించిందని, దీన్ని ఎంపికైన తర్వాతే చేపట్టాలని, అలా కాకుండా ముందస్తుగా ఆప్షన్లు ఇవ్వడంతో అభ్యర్థులు నష్టపోతున్నారన్నారు. -
6 నుంచి ‘టీజీటీ’ సర్టిఫికెట్ల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ ఆప్షనల్స్) పోస్టుల భర్తీలో భాగంగా రెండోసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మార్చి 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. 6వ తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో వెరిఫికేషన్ ప్రారంభం అవుతుందని వెల్లడించింది. వెరిఫికేషన్‌కు వెంట తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్ల వివరాలు, హాజరు కావాల్సిన అభ్యర్థుల జాబితాను తమ వెబ్సైట్లో పొందవచ్చని వివరించింది. అభ్యర్థుల కొరత, మొదట నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు గైర్హాజరు వంటి కారణాలతో రెండోసారి వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో వెరిఫికేషన్‌కు పిలిచినట్లు తెలిపింది. -
పీజీటీ–టీజీటీల్లో ఒకదాన్ని వదులుకోండి
సాక్షి, హైదరాబాద్ : పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు రెండింటికీ ఎంపికైన అభ్యర్థులు.. వాటిల్లో ఒకదానికి వదిలేసుకుంటున్నట్టుగా ఆప్షన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ సూచించింది. టీజీటీ పోస్టులకు ఎంపిక ప్రక్రియ తుదిదశలో ఉందని.. అభ్యర్థులు ఆప్షన్ ఇస్తే తద్వారా ఖాళీ అయ్యేచోట తదుపరి అర్హులను ఎంపిక చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. -
'ఘంటా చక్రపాణిగారు.. మమ్మల్ని పట్టించుకోండి'
-
'ఘంటా చక్రపాణిగారు.. మమ్మల్ని పట్టించుకోండి'
సాక్షి, హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ వెంటనే గురుకుల టీజీటీ తుది ఫలితాలను వెల్లడించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. సోమవారం టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో టీజీటీ అభ్యర్థులు చేరి ఆందోళనకు దిగారు. టీఎస్పీఎస్సీ వద్దే భైఠాయించడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా కాస్తంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురుకులాల్లోని (పీజీటీ, టీజీటీ) స్థాయిలోని పలు పోస్టులకు టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో తొలుత అభ్యర్థులను 1:2 గా ఎంపిక చేశారు. ఇందులో కొద్ది రోజుల కిందటే పీజీటీ ఫలితాలను వెల్లడించారు. కానీ, టీజీటీ ఫలితాలను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. అయితే, ప్రస్తుతం టీజీటీ పోస్టులకు 1:2 ప్రకారం ఎంపికైన అభ్యర్థులంతా కూడా తమకు ఉద్యోగం వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. మరోపక్క, వివిధ పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు నిర్వహించనుంది. దీంతో టీజీటీ 1:2కు ఎంపికైన అభ్యర్థులు ఇటు గురుకులాలపై ఆశపెట్టుకోవాలా, టీఆర్టీకి చదవాలా అనే అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయినప్పటికీ ఫలితాల వెల్లడి విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చేస్తునే ఉన్నారు. వివిధ మార్గాల ద్వారా టీఎస్పీఎస్సీపై ఫలితాలకోసం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ టీఎస్పీఎస్సీ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రావడంతో సోమవారం టీజీటీ 1:2 అభ్యర్థులంతా టీఎస్పీఎస్సీ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళన నిర్వహించారు. తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్న తమకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఉపశమనం కలిగించాలని, ఆందోళన నుంచి బయటపడేయాలని విజ్ఞప్తి చేశారు. తమ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై టీఎస్పీఎస్సీ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. -
నవోదయ విద్యాలయ సమితిలో 2072 టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్
నవోదయ విద్యాలయ సమితి 2072 టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటిల్లో అసిస్టెంట్స్ కమిషనర్స్, ప్రిన్సిపాల్స్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ), ఇతర (మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ (మేల్, ఫిమేల్), లైబ్రేరియన్ వంటి పోస్టులున్నాయి. దేశవ్యాప్తంగా 591 నవోదయ విద్యాలయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలు, అర్హతలు, ఎంపిక పై ఫోకస్.. విభాగాలవారీగా ఖాళీలు అసిస్టెంట్స్ కమిషనర్స్: 2 (వీటిల్లో ఒకటి పీహెచ్‌లకు కేటాయించారు) అర్హత: హ్యుమానిటీస్/సైన్స్/కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఏదైనా ప్రభుత్వ/సెమీ గవర్నమెంట్/స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థల్లో ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో ఐదేళ్ల పని అనుభవం. రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసి ఎడ్యుకేషన్‌లో రీసెర్చ్ చేసినవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి: జూలై 31, 2016 నాటికి 45 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.15,600 - రూ.39,100 (గ్రేడ్ పే రూ.7600) ప్రిన్సిపాల్స్ = 40 (అన్‌రిజర్వుడ్ - 22, ఓబీసీ - 10, ఎస్సీ-06, ఎస్టీ-2) అర్హత: 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ/తత్సమానం. వైస్ ప్రిన్సిపాల్/పీజీటీ/లెక్చరర్/మాస్టర్‌గా 10 లేదా 12 ఏళ్ల పని అనుభవం ఉండాలి. రెసిడెన్షియల్ స్కూల్ హౌస్మాస్టర్గా మూడేళ్ల పని అనుభవం. ఇంగ్లిష్ లేదా హిందీ/ సంబంధిత ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. వయోపరిమితి: జూలై 31, 2016 నాటికి 35- 45 ఏళ్లు. వేతన శ్రేణి: రూ.15,600 - రూ.39,100 (గ్రేడ్ పే రూ.7600) పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ) = 880 పోస్టులు బయాలజీ = 77 (అన్‌రిజర్వుడ్-44, ఓబీసీ- 17, ఎస్సీ- 15, ఎస్టీ-1) కెమిస్ట్రీ = 90 (అన్‌రిజర్వుడ్ - 46, ఓబీసీ - 12, ఎస్సీ - 15, ఎస్టీ- 17) కామర్స్= 52 (అన్‌రిజర్వుడ్- 20, ఓబీసీ - 15, ఎస్సీ - 11, ఎస్టీ- 06) ఎకనామిక్స్= 112 (అన్‌రిజర్వుడ్- 44, ఓబీసీ-23, ఎస్సీ-33, ఎస్టీ - 12) ఇంగ్లిష్ = 76 (అన్‌రిజర్వుడ్ - 56, ఎస్సీ- 11, ఎస్టీ - 09) జాగ్రఫీ = 56 (అన్‌రిజర్వుడ్ - 32, ఓబీసీ - 09, ఎస్సీ - 10, ఎస్టీ - 05) హిందీ = 78 (అన్‌రిజర్వుడ్ - 57, ఎస్సీ-12, ఎస్టీ-09) హిస్టరీ = 70(అన్‌రిజర్వుడ్ - 48, ఓబీసీ-08, ఎస్సీ-09, ఎస్టీ-05) మ్యాథ్స్ = 117 (అన్‌రిజర్వుడ్ - 36, ఓబీసీ - 25, ఎస్సీ-31, ఎస్టీ-25) ఫిజిక్స్ = 102 (అన్‌రిజర్వుడ్ - 49, ఓబీసీ - 19, ఎస్సీ - 15, ఎస్టీ- 19) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ = 50 (అన్‌రిజర్వుడ్-33, ఎస్సీ-07, ఎస్టీ -10) అర్హత: సంబంధిత పోస్టు, సబ్జెక్టును బట్టి... రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి నిర్దేశిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో రెండేళ్ల ఇంటిగ్రేటెడ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ లేదా 50 శాతం మార్కులతో హిందీ/ఫిజిక్స్ (అప్లైడ్ ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్)/కెమిస్ట్రీ (కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ), మ్యాథమెటిక్స్ (మ్యాథమెటిక్స్/అప్లైడ్ మ్యాథమెటిక్స్)/ఎకనామిక్స్ (ఎకనామిక్స్/అప్లైడ్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్)/హిస్టరీ/జాగ్రఫీ/కామర్స్ (కామర్స్ విత్ అకౌంటింగ్/కాస్ట్ అకౌంటింగ్/ఫైనాన్షియల్ అకౌంటింగ్)/ఇంగ్లిష్/బయాలజీ (బోటనీ/జువాలజీ/లైఫ్ సెన్సైస్/బయోసెన్సైస్/జెనెటిక్స్/మైక్రో బయాలజీ/బయోటెక్నాలజీ/మాలికుల్యర్ బయాలజీ/ప్లాంట్ ఫిజియాలజీ) ఉత్తీర్ణత. ఐటీ పోస్టులకు 50 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ఐటీ) లేదా ఏదైనా బ్రాంచ్‌లో బీఈ/బీటెక్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా ఉత్తీర్ణత లేదా ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఎంసీఏ లేదా బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్)/బీసీఏ ఉత్తీర్ణత. ఐటీ పోస్టులకు మినహాయించి అన్ని పోస్టులకు బీఈడీ ఉండాలి. హిందీ లేదా ఇంగ్లిష్ లాంగ్వేజ్ బోధించగల ప్రావీణ్యం ఉండాలి. వయోపరిమితి: జూలై 31, 2016 నాటికి 40 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.9300- రూ.34,800 (గ్రేడ్ పే రూ.4800) ట్రైన్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) - 660 పోస్టులు ఇంగ్లిష్ = 159 (అన్‌రిజర్వుడ్ - 77, ఓబీసీ - 26, ఎస్సీ - 19, ఎస్టీ - 37) హిందీ = 132 (అన్‌రిజర్వుడ్ - 78, ఓబీసీ - 28, ఎస్సీ - 18, ఎస్టీ - 08) మ్యాథ్స్ = 229 (అన్‌రిజర్వుడ్ - 99, ఓబీసీ - 20, ఎస్సీ - 51, ఎస్టీ - 59) సైన్స్ = 72 (అన్‌రిజర్వుడ్ = 35, ఓబీసీ - 06, ఎస్సీ-09, ఎస్టీ-22) సోషల్ స్టడీస్ = 68 (అన్‌రిజర్వుడ్ - 49, ఓబీసీ - 08, ఎస్సీ - 02, ఎస్టీ - 09) అర్హత: రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ లేదా 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టు (ఇంగ్లిష్/మ్యాథ్స్ (మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ)/సైన్స్ (బోటనీ/జువాలజీ/కెమిస్ట్రీ)/హిందీ/సోషల్ స్టడీస్ (జాగ్రఫీ/ఎకనామిక్స్/పొలిటికల్ సైన్స్)లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ ఉండాలి. సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్)లో ఉత్తీర్ణత తప్పనిసరి. వయోపరిమితి: జూలై 31, 2016 నాటికి 35 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.9300 - రూ.34,800 (గ్రేడ్ పే రూ.4600) మిస్లేనియస్ కేటగిరీ - 255 పోస్టులు మ్యూజిక్ = 41 (అన్‌రిజర్వుడ్ - 14, ఓబీసీ - 21, ఎస్సీ -02, ఎస్టీ - 04) ఆర్ట్ = 50 (అన్‌రిజర్వుడ్ = 20, ఓబీసీ - 26, ఎస్టీ-04) పీఈటీ (పురుషులు) = 28 (అన్‌రిజర్వుడ్ - 12, ఓబీసీ - 16) పీఈటీ (మహిళలు) = 91 (అన్‌రిజర్వుడ్ = 54, ఓబీసీ-21, ఎస్సీ-8, ఎస్టీ-8) లైబ్రేరియన్ = 45 (అన్‌రిజర్వుడ్ - 35, ఓబీసీ - 10) అర్హత: మ్యూజిక్ టీచర్ పోస్టులకు ఐదేళ్ల గ్రాడ్యుయేషన్ (మ్యూజిక్)/పోస్ట్‌గ్రాడ్యుయేషన్ (మ్యూజిక్) లేదా బ్యాచిలర్ డిగ్రీ (మ్యూజిక్)తోపాటు బీఈడీ ఉత్తీర్ణత లేదా తత్సమానం. ఆర్ట్ టీచర్ పోస్టులకు ఫైన్ఆర్ట్స్ (డ్రాయింగ్/పెయింటింగ్/స్కల్ప్చర్/గ్రాఫిక్ ఆర్ట్స్/క్రాఫ్ట్స్)లో ఐదేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత లేదా పీజీ డిగ్రీ ఇన్ డ్రాయింగ్, పెయింటింగ్, ఫైన్ఆర్ట్స్ లేదా తత్సమానం. పీఈటీ పోస్టులకు ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఏదైనా డిగ్రీతోపాటు డీపీఈడీ ఉత్తీర్ణత. లైబ్రేరియన్ పోస్టులకు లైబర్రీ సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత లేదా గ్రాడ్యుయేషన్‌తోపాటు లైబ్రరీ సైన్స్‌లో ఏడాది వ్యవధి ఉన్న డిప్లొమా ఉత్తీర్ణత. ఇంగ్లిష్/హిందీ/సంబంధిత ప్రాంతీయ భాషలో పరిజ్ఞానం ఉండాలి. వయోపరిమితి: జూలై 31, 2016 నాటికి 35 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.9300 - రూ.34,800 (గ్రేడ్ పే రూ.4600) టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్ టీచర్స్)- మొత్తం పోస్టులు : 235 ఇందులో తెలుగు = 4 (ఎస్టీ - 4) అర్హత: 50 శాతం మార్కులతో తెలుగు ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ ఉత్తీర్ణత. బీఈడీతోపాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్)లో ఉత్తీర్ణత. వయోపరిమితి: జూలై 31, 2016 నాటికి 35 ఏళ్లు మించకూడదు. వేతన శ్రేణి: రూ.9300 - రూ.34,800 (గ్రేడ్ పే రూ.4600) వయోసడలింపు: అన్ని పోస్టులకు ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్ పోస్టులు మినహాయించి మిగిలిన అన్ని పోస్టులకు అన్ని కేటగిరీల మహిళలకు పదేళ్లు, దివ్యాంగులు.. జనరల్ - పదేళ్లు, ఓబీసీ - 13 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ - 15 ఏళ్లు)కు సడలింపు ఉంటుంది. ఎంపిక: అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్స్, పీజీటీలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. టీజీటీలు, మిస్లేనియస్ కేటగిరీ(లైబ్రేరియన్) పోస్టులు, టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్) పోస్టులకు రాతపరీక్ష మాత్రమే ఉంటుంది. రాతపరీక్షను దేశవ్యాప్తంగా 42 నగరాల్లో నిర్వహిస్తారు. అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్ పోస్టులకు ఢిల్లీలో మాత్రమే పరీక్ష ఉంటుంది. అసిస్టెంట్ కమిషనర్ పరీక్ష విధానం మూడు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో రీజనింగ్ ఎబిలిటీ (ప్రశ్నలు - 20, మార్కులు - 20), జనరల్ అవేర్నెస్ (ప్రశ్నలు - 40, మార్కులు - 40), లాంగ్వేజ్ టెస్ట్ (జనరల్ ఇంగ్లిష్, జనరల్ హిందీ) (ప్రశ్నలు - 40, మార్కులు - 40), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (ప్రశ్నలు - 20, మార్కులు - 20), ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ప్రశ్నలు - 60, మార్కులు - 60)లు ఉంటాయి. ప్రిన్సిపాల్ పరీక్ష విధానం మూడు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో రీజనింగ్ ఎబిలిటీ (ప్రశ్నలు - 20, మార్కులు - 20), జనరల్ అవేర్నెస్ (ప్రశ్నలు - 40, మార్కులు - 40), లాంగ్వేజ్ టెస్ట్ (జనరల్ ఇంగ్లిష్, జనరల్ హిందీ) (ప్రశ్నలు - 40, మార్కులు - 40), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (ప్రశ్నలు - 20, మార్కులు - 20), అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ ప్రొసీజర్/రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (ప్రశ్నలు - 60, మార్కులు - 60)లు ఉంటాయి. పీజీటీ, టీజీటీ, మిస్లేనియస్ టీచర్స్, టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్) పరీక్ష విధానం అన్ని పోస్టులకు కలిపి కామన్ పేపర్ ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ఇందులో జనరల్ ఇంగ్లిష్ అండ్ హిందీ (40 ప్రశ్నలు), జనరల్ అవేర్నెస్ (30 ప్రశ్నలు), జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ (30 ప్రశ్నలు), టీచింగ్ ఆప్టిట్యూడ్ (20 ప్రశ్నలు), సంబంధిత సబ్జెక్ట్ నాలెడ్జ్ (80 ప్రశ్నలు) ఉంటాయి. పీజీటీ ప్రశ్నపత్రం పోస్ట్‌గ్రాడ్యుయేషన్ స్థాయిలో, టీజీటీ, ఇతర పోస్టుల ప్రశ్నపత్రం గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉంటుంది. మొత్తం మార్కులు 200. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇతరులు అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్ పోస్టులకు రూ.1500, పీజీటీ. టీజీటీ, మిస్లేనియస్, రీజినల్ లాంగ్వేజ్ టీచర్స్ పోస్టులకు రూ.1000 ఫీజు చెల్లించాలి. దరఖాస్తు విధానం: www.nvshq.org, www.mecbsegov.in వెబ్‌సైట్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత అభ్యర్థులు దాన్ని ప్రింటవుట్ తీసుకుని భద్రపర్చాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్, ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 10, 2016 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 9, 2016 ఫీజు చెల్లించడానికి చివరి తేది: అక్టోబర్ 14, 2016 పరీక్ష తేదీలు: నవంబర్, డిసెంబర్ 2016 వెబ్‌సైట్స్: www.nvshq.org, www.mecbsegov.in -
ఆదర్శం.. ఆగమాగం..
మందమర్రి రూరల్ : జిల్లాలోని ఆదర్శ పాఠశాలల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటికే అరకొర సౌకర్యాలతో నెట్టుకువస్తున్న ఆదర్శ పాఠశాలలకు కొత్త ఆపద వచ్చిపడింది. జిల్లాలో ఏడు పాఠశాలలు ఉన్నాయి. వాటిని కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాయిలో తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆకర్షణీయమైన వేతనాలు, అన్ని అలవెన్సులు, బోధనకు కావాల్సిన అన్ని వసతులూ ఉంటాయనే ఆశతో పోటీ పరీక్షల్లో నెగ్గి మరీ ఉపాధ్యాయులు మోడల్ స్కూళ్లలో చేరారు. ఇప్పుడు వారి పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తుండడంతో ఒక్కొక్కరుగా గుడ్‌బై చెబుతున్నారు. అర్హత, సర్వీస్, సంబంధిత సమస్యలపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో వ్యక్తిగతంగా నష్టపోలేక స్కూల్ పాయింట్లకు పయనమవుతున్నారు. 14 మంజూరు.. ఏడు ప్రారంభం నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. గత విద్యాసంవత్సరం నుంచే ఈ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. జిల్లాకు మొత్తం గతేడాదే 14 పాఠశాలలు మంజూరు కాగా.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, దండేపల్లి, జైనథ్, మందమర్రి, కుంటాల, బజార్‌హత్నూర్‌లలో స్కూళ్లను ఏర్పాటు చేశారు. 6 నుంచి ఇంటర్మీడియెట్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. బోధనకు ప్రభుత్వం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), టైయిస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల (టీజీటీ)ను ఎంపిక చేసింది. ఒక్కో స్కూల్‌కు ఒక ప్రిన్సిపాల్ 13 మంది పీటీజీలు, ఆరుగురు టీజీటీలు మొత్తం 20 మంది స్టాఫ్ ఉండాలి. కాగా.. ఈ ఏడు పాఠశాలన్నింటిలో ఇద్దరు మాత్రమే ప్రిన్సిపాల్స్ ఉన్నారు. ఇక పాఠశాలలో ముగ్గురు నుంచి నలుగురు వరకు స్టాఫ్ తక్కువగా ఉంది. సుమారు 20 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. సర్సీస్ రూల్స్, వేతనాలతోనే సమస్య.. ప్రభుత్వ పాఠశాల ఎస్జీటీలకు నెలకు రూ.10,900, స్కూల్ అసిస్టెంట్లకు రూ.14,860 మూల వేతనాలు ఉండ గా ఆదర్శ పాఠశాలలో పనిచేసే టీజీటీలకు నెలకు రూ.14,860, పీజీటీలకు రూ.16,150 ఖరారు చేసింది. ఎక్కువ వేతనం వస్తుందని ఆశతో అప్పటికే ప్రభుత్వ పాఠశాల్లో ఎస్జీటీలుగా, స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ రాత పరీక్షల ద్వారా ఎంపికై మోడల్ స్కూళ్లలో చేరారు పలువురు. ఎస్జీటీలను టీజీటీలుగా, స్కూల్ అసిస్టెంట్లను పీజీటీ ప్రిన్సిపాల్స్‌గా తీసుకుంది. నియామకాలు బాగానే ఉన్నా.. తర్వాత వీరిని ప్రభుత్వం పట్టించుకోవడమే మానేసింది. సర్సీస్ రూల్స్, బదీలీలపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. వీరి నియామకం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు డీఏ రెండు సార్లు (17.12) శాతం పెరిగింది. ఆదర్శ పాఠశాలల అధ్యాపకులకు మాత్రం పాత మూల వేతనమే అందుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పోలిస్తే పీజీటీలకు ప్రతి నెలా రూ.7,125, టీజీటీలు రూ.6,556 తక్కువ వేతనం పొందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసి మోడల్ స్కూళ్లలో బోధిస్తున్న ఉపాధ్యాయులకు పాత పింఛన్ వర్తిస్తుందా? కొత్త పింఛన్ విధానమా? అనే అశంపై స్పష్టత లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించింది. ఆదర్శ పాఠశాలల్లోని టీజీటీలు, పీజీటీలకు ఇది వర్తించకపోవడంతో భవిష్యత్తులో పీఆర్సీలో నష్టపోయే ప్రమాదం ఉంది. తిరిగి పాత స్థానాలకు.. మోడల్ స్కూళ్లలో పోస్టింగ్ పొందిన తర్వాత వాటిలో పనిచేయడం ఇష్టం లేకపోతే రెండేళ్లలోపు తిరిగి స్కూల్ పాయింట్లకు తిరిగి వచ్చే వెసులు బాటును ప్రభుత్వం కల్పిం చింది. దీంతో ఈ నిబంధన ఆధారంగా ఆదర్శ పాఠశాల బోధకులు పాత స్థానాలకు వెళ్తున్నారు. ఇక్కడే కొనసాగితే భవిష్యత్తులో సర్వీస్ పరంగా, వేతనాల పరంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు తిరిగి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఆసిఫాబాద్‌లోని పాఠశాలలో ఇద్దరు పీజీటీ లు, మందమర్రిలో ఒకరు సర్కారు బడిలోకి వెళ్లిపోయారు. మరో 20 మంది మోడల్ స్కూళ్ల నుంచి స్కూల్ పాయింట్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. వసతులు, భవనాలులేక అనేక అసౌకర్యాల మధ్య విద్యార్థులు పాఠశాలలో చేరేందుకు ఇష్టపడటం లేదు. మోడల్ స్కూళ్లలో ఇప్పటికే పోస్టులు భారీ స్థాయిలో ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బోధకులు కూడా వెళ్లిపోతే విద్యాబోధన, ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో టీజీటీలు, పీజీటీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు - సత్యనారాయణ, డీఈవో ఆదిలాబాద్ పోస్టింగ్‌లు తీసుకున్న రెండేళ్లలో ఇష్టం లేకుంటే టీజీటీలు, పీజీటీలు తిరిగి స్కూల్ పాయింట్లకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ విషయాన్ని ముందుగానే స్పష్టం చేసింది. వారికి కొన్ని సమస్యలున్నాయని అంటున్నారు. వారు వెళ్లిపోతే ఖాళీలతో కొత్తగా రిక్రూట్మెంట్ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. -
మో‘డల్’ పాఠశాలలు
మార్కాపురం టౌన్, న్యూస్‌లైన్: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఆదర్శ పాఠశాలల(మోడల్ స్కూళ్లు)ను గతేడాది ప్రవేశపెట్టింది. విద్యా సంవత్సరం ఆరంభం నాటికి పాఠశాలల భవనాల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. అయినా ఈ భవనాల్లోనే తరగతులు ప్రారంభించారు. పాఠశాలకు ప్రిన్సిపాల్, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల నియమించాలి. కాని పూర్తిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. దీంతో ఉన్న కొద్ది మంది టీచర్లే మిగలిన సబ్జెక్టులు బోధిస్తున్నారు. మరి కొన్ని సబ్జెక్టులకు విద్యార్థుల తల్లిదండ్రులే టీచర్లను నియమించి జీతాలు చెల్లిస్తున్నారు. అయినా విద్యాశాఖాధికారులు మాత్రం సౌకర్యాల కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చాలీచాలని తరగతి గదులు మార్కాపురం మండలంలోని మిట్టమీదపల్లెలో ఈ ఏడాది మోడల్ స్కూల్‌ను ప్రారంభించారు. పాఠశాల్లో 6, 7, 8, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు చేరారు. ఒక్కొక్క తరగతికి 80 మంది విద్యార్థులను తీసుకుని రెండు సెక్షన్లుగా విభజించాలి. 6, 7, 8 తరగతుల్లో 240 మందికిగానూ 225 మంది, ఇంటర్ మొదటి సంవత్సరంలో 80 మందికిగానూ 53 మంది చేరారు. ఒక్కో సెక్షన్‌కు 40 మంది విద్యార్థులను కేటాయించాల్సి ఉంది. కానీ టీచర్ల కొరతతో 75 మంది విద్యార్థులను ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి విద్యనందిస్తున్నారు. విద్యార్థులకు సరిపడా ఫర్నీచర్ లేకపోవడంతో కొందరు కిందే కూర్చొంటున్నారు. సిబ్బంది కొరత మోడల్ పాఠశాలకు ప్రిన్సిపాల్, 14 మంది పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, ఆరుగురు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లను నియమించాలి. కానీ ఇప్పటి వరకు ప్రిన్సిపాల్, ఆరుగురు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లను మాత్రమే తీసుకున్నారు. దీంతో పాఠశాల్లోని పీడీ, ఇతర టీచర్లే మిగిలిన సబ్జెక్టులు బోధిస్తున్నారు. తల్లిదండ్రుల ఆర్థికసాయంతో టీచర్లకు జీతాలు ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథ్స్, జువాలజీ, సివిక్స్ సబ్జెక్టులకు టీచర్లు లేరు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు టీచర్లతో తమ పిల్లలకు పాఠాలు చెప్పించుకుంటున్నారు. ఈ టీచర్లకు తల్లిదండ్రులే జీతాలు అందిస్తున్నారు. దీంతోపాటు ప్రిన్సిపాల్ కూడా బోధన చేస్తున్నారు. సౌకర్యాలు నిల్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాల్సి ఉంది. కానీ భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్‌లో ఉండి చదువు కొనసాగిస్తున్నారు. కొందరు ఇంటి వద్ద నుంచే పాఠశాలకు హాజరవుతున్నారు. పాఠశాలలో మంచినీటి వసతి లేదు. దీంతో విద్యార్థులు ఫ్లోరైడ్ నీటినే తాగుతున్నారు. మరి కొందరు ఇంటి వద్ద నుంచి బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు పాఠశాలకు ల్యాబ్ సామగ్రి రాలేదు. దీంతో ప్రయోగశాలలు నిరుపయోగంగా మారాయి. త్వరలోనే భర్తీ చేస్తాం: వెంకటేశ్వరరెడ్డి, మోడల్ స్కూల్స్ ఇన్ చార్జి మోడల్ స్కూల్లో టీచర్ల కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మిట్టమీదపల్లెలో ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విద్యాశాఖా మంత్రి నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేస్తాం. -
మో‘డల్’ విద్య
చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మోడల్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొరత తీవ్రంగా ఉంది. 2011 లోనే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా భవనాల నిర్మాణం పూర్తికాకపోవడంతో 2013 విద్యా సంవత్సరంలో 6, 7, 8, ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 16 పాఠశాలలున్నారు. వీటిలో ప్రిన్సిపాల్స్, పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్)లు పూర్తి స్థాయిలో లేరు. టీజీటీ (టైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించినప్పటికీ వీరిలో కొంత మందిని మాత్రమే నియమించారు. ప్రిన్సిపాల్, పీజీటీ పోస్టుల కోసం అభ్యర్థులు అర్హత పరీక్ష రాసినప్పటికీ కొంతమంది విధుల్లో చేరకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని మోడల్ పాఠశాలల్లో 16 మంది ప్రిన్సిపాల్స్‌కు ఐదుగురు, 160 మంది పీజీటీలకు 131 మంది, 112 మంది టీజీటీలకు ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఐదు చోట్లే ప్రిన్సిపాళ్లు విద్యాపరంగా వెనకబడిన మండలాల్లో మోడల్ పాఠశాల లు ఏర్పాటు చేశారు. కేవీబీపురం, కేవీపల్లి, కురబలకోట, పుంగనూరు, ఎర్రావారిపాళెం మండలాల్లోని పాఠశాలల్లో మాత్రమే ప్రిన్సిపాల్స్ ఉన్నారు. మిగిలిన చోట్ల ఎంఈవోలు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. వీరికి మండల స్థాయిలో అనేక పనులు ఉండడంతో మోడల్ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపలేకపోతున్నారనే విమర్శలున్నాయి. టీజీటీలు హిందీ సబ్జెక్టుకు మాత్రమే కేవీబీపురం, కేవీపల్లి, కలకడ, కు రబలకోట, పుంగనూరు మండలాల్లో ఉన్నారు. పీజీటీలు ఒక్కో పాఠశాలలో 10 మంది ఉండాల్సి ఉండగా బి.కొత్తకోటలో ఆరుగురు, బెరైడ్డిపల్లెలో తొమ్మిది మంది, గుడిపల్లిలో ఇద్దరు, కలకడలో తొమ్మిది మంది, కుప్పంలో ఏడుగురు, కేవీబీపురంలో తొమ్మిదిమంది, కేవీపల్లిలో తొమ్మిది మంది, కురబలకోటలో ఆరుగురు, పెద్దమండ్యంలో తొమ్మిది మంది, పీటీఎంలో ఐదుగురు, పుంగనూరులో ఏడుగురు, శాంతిపురంలో తొమ్మిది మంది, తంబళ్లపల్లిలో ఐదుగురు, ఎర్రావారిపాళెంలో తొమ్మిది మంది మంది ఉన్నారు.