మందమర్రి రూరల్ : జిల్లాలోని ఆదర్శ పాఠశాలల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటికే అరకొర సౌకర్యాలతో నెట్టుకువస్తున్న ఆదర్శ పాఠశాలలకు కొత్త ఆపద వచ్చిపడింది. జిల్లాలో ఏడు పాఠశాలలు ఉన్నాయి. వాటిని కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాయిలో తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆకర్షణీయమైన వేతనాలు, అన్ని అలవెన్సులు, బోధనకు కావాల్సిన అన్ని వసతులూ ఉంటాయనే ఆశతో పోటీ పరీక్షల్లో నెగ్గి మరీ ఉపాధ్యాయులు మోడల్ స్కూళ్లలో చేరారు. ఇప్పుడు వారి పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తుండడంతో ఒక్కొక్కరుగా గుడ్‌బై చెబుతున్నారు. అర్హత, సర్వీస్, సంబంధిత సమస్యలపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో వ్యక్తిగతంగా నష్టపోలేక స్కూల్ పాయింట్లకు పయనమవుతున్నారు.
14 మంజూరు.. ఏడు ప్రారంభం
నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. గత విద్యాసంవత్సరం నుంచే ఈ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. జిల్లాకు మొత్తం గతేడాదే 14 పాఠశాలలు మంజూరు కాగా.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, దండేపల్లి, జైనథ్, మందమర్రి, కుంటాల, బజార్‌హత్నూర్‌లలో స్కూళ్లను ఏర్పాటు చేశారు. 6 నుంచి ఇంటర్మీడియెట్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.
బోధనకు ప్రభుత్వం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), టైయిస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల (టీజీటీ)ను ఎంపిక చేసింది. ఒక్కో స్కూల్‌కు ఒక ప్రిన్సిపాల్ 13 మంది పీటీజీలు, ఆరుగురు టీజీటీలు మొత్తం 20 మంది స్టాఫ్ ఉండాలి. కాగా.. ఈ ఏడు పాఠశాలన్నింటిలో ఇద్దరు మాత్రమే ప్రిన్సిపాల్స్ ఉన్నారు. ఇక పాఠశాలలో ముగ్గురు నుంచి నలుగురు వరకు స్టాఫ్ తక్కువగా ఉంది. సుమారు 20 పోస్టుల ఖాళీగా ఉన్నాయి.
సర్సీస్ రూల్స్, వేతనాలతోనే సమస్య..
ప్రభుత్వ పాఠశాల ఎస్జీటీలకు నెలకు రూ.10,900, స్కూల్ అసిస్టెంట్లకు రూ.14,860 మూల వేతనాలు ఉండ గా ఆదర్శ పాఠశాలలో పనిచేసే టీజీటీలకు నెలకు రూ.14,860, పీజీటీలకు రూ.16,150 ఖరారు చేసింది. ఎక్కువ వేతనం వస్తుందని ఆశతో అప్పటికే ప్రభుత్వ పాఠశాల్లో ఎస్జీటీలుగా, స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ రాత పరీక్షల ద్వారా ఎంపికై మోడల్ స్కూళ్లలో చేరారు పలువురు.
ఎస్జీటీలను టీజీటీలుగా, స్కూల్ అసిస్టెంట్లను పీజీటీ ప్రిన్సిపాల్స్‌గా తీసుకుంది. నియామకాలు బాగానే ఉన్నా.. తర్వాత వీరిని ప్రభుత్వం పట్టించుకోవడమే మానేసింది. సర్సీస్ రూల్స్, బదీలీలపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. వీరి నియామకం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు డీఏ రెండు సార్లు (17.12) శాతం పెరిగింది. ఆదర్శ పాఠశాలల అధ్యాపకులకు మాత్రం పాత మూల వేతనమే అందుతోంది.
ప్రభుత్వ ఉపాధ్యాయులతో పోలిస్తే పీజీటీలకు ప్రతి నెలా రూ.7,125, టీజీటీలు రూ.6,556 తక్కువ వేతనం పొందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసి మోడల్ స్కూళ్లలో బోధిస్తున్న ఉపాధ్యాయులకు పాత పింఛన్ వర్తిస్తుందా? కొత్త పింఛన్ విధానమా? అనే అశంపై స్పష్టత లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించింది. ఆదర్శ పాఠశాలల్లోని టీజీటీలు, పీజీటీలకు ఇది వర్తించకపోవడంతో భవిష్యత్తులో పీఆర్‌సీలో నష్టపోయే ప్రమాదం ఉంది.
తిరిగి పాత స్థానాలకు..
మోడల్ స్కూళ్లలో పోస్టింగ్ పొందిన తర్వాత వాటిలో పనిచేయడం ఇష్టం లేకపోతే రెండేళ్లలోపు తిరిగి స్కూల్ పాయింట్లకు తిరిగి వచ్చే వెసులు బాటును ప్రభుత్వం కల్పిం చింది. దీంతో ఈ నిబంధన ఆధారంగా ఆదర్శ పాఠశాల బోధకులు పాత స్థానాలకు వెళ్తున్నారు. ఇక్కడే కొనసాగితే భవిష్యత్తులో సర్వీస్ పరంగా, వేతనాల పరంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు తిరిగి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఇప్పటికే ఆసిఫాబాద్‌లోని పాఠశాలలో ఇద్దరు పీజీటీ లు, మందమర్రిలో ఒకరు సర్కారు బడిలోకి వెళ్లిపోయారు. మరో 20 మంది మోడల్ స్కూళ్ల నుంచి స్కూల్ పాయింట్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. వసతులు, భవనాలులేక అనేక అసౌకర్యాల మధ్య విద్యార్థులు పాఠశాలలో చేరేందుకు ఇష్టపడటం లేదు. మోడల్ స్కూళ్లలో ఇప్పటికే పోస్టులు భారీ స్థాయిలో ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బోధకులు కూడా వెళ్లిపోతే విద్యాబోధన, ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో టీజీటీలు, పీజీటీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఎలాంటి ఇబ్బంది లేదు - సత్యనారాయణ, డీఈవో ఆదిలాబాద్
పోస్టింగ్‌లు తీసుకున్న రెండేళ్లలో ఇష్టం లేకుంటే టీజీటీలు, పీజీటీలు తిరిగి స్కూల్ పాయింట్లకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ విషయాన్ని ముందుగానే స్పష్టం చేసింది. వారికి కొన్ని సమస్యలున్నాయని అంటున్నారు. వారు వెళ్లిపోతే ఖాళీలతో కొత్తగా రిక్రూట్‌మెంట్ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేదు.
ఆదర్శం.. ఆగమాగం..
Published Sun, Aug 10 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM
Advertisement
Advertisement