అభిప్రాయం
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ విద్యానగర్ ఎస్సీ–ఎస్టీ కాలనీకి చెందిన నలుగురు యువకులు మందమర్రి పోలీసులు తాము చేయని దొంగతనం కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపిస్తూ డిసెంబర్ 19న సెల్ఫీ వీడియో ద్వారా అభ్యర్థన పెట్టి, హెయిర్ డై తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఇదే కాలనీకి చెందిన ఆటో నడుపుకొనే ఎరుకల కులానికి చెందిన మరో యువకుడు ఏడాది కింద పోలీసులు తనపై అనేక కేసులు బనాయిస్తున్నారని భయపడి పోలీస్ స్టేషన్లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని అంటించుకున్నాడు. దాని కంటే ముందు ఒకసారి గొంతు కోసుకున్నాడు. ఆత్మహత్యా ప్రయత్నాల్ని ఆ యువకులు చనిపోయే ఉద్దేశంతో చేయకపోయినా, తామున్న పరిస్థితి నుండి ఎట్లా బయట పడాలో తెలియక ఈ ప్రమాదకర మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇలాంటి పెనుగులాటల వెనుక సామాజిక, ఆర్థిక, వ్యవస్థాపరమైన అంశాలున్నాయి.
ఈ ఎస్సీ–ఎస్టీ కాలనీ అనేక ప్రాంతాల నుండి ఒకప్పుడు వలస వచ్చి, కాలరీ ఏరియాలో రోజూవారీ కూలీ చేసుకొని బతికే నిరుపేదలు నివసించే ప్రాంతం. స్థిరపడిన వారిలో మాదిగ, నేతకాని, ఎరుకల కులాలే ప్రధానంగా ఉన్నాయి. వాళ్ల తరువాత తరాలు కూడా ఇక్కడే పుట్టి పెరుగుతున్నాయి. ఈ కాలనీ కుటుంబాలకు నిర్మాణ రంగంలో దొరికే రోజువారీ అడ్డ కూలీ పని, యువకులైతే ఆటోలు నడుపు కోవటం, పాన్ టేలలు, వెల్డింగ్, చిన్న చిన్న మెకానిక్ పనులే జీవనా ధారం. తల్లిదండ్రుల జీవితాల్లోనే స్థిరత్వం లేకపోవటం, పరిసరాల ప్రభావం, ఇతర సాంస్కృతిక కారణాల వలన పిల్లలు పెద్దగా చదువులో రాణించటం లేదు. వీళ్లలో కొందరిపై గతంలో చిన్న చిన్న స్క్రాప్, కాపర్ వైర్ల, ఇతర దొంగతనాల కేసులున్నాయి. ఇద్దరిపై గంజాయిని స్థానికంగా అమ్మి పెట్టే కేసులున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ కేసుల్లో ఎవ్వరికీ ఎప్పుడూ కోర్టులో శిక్ష పడలేదు.
నేరం జరగటానికి గల సామాజిక, ఆర్థిక నేపథ్యాన్ని వదిలేసి బ్రిటిష్ పాలకులు ఒకప్పుడు కొన్ని తెగలను నేరస్త తెగలుగా ముద్ర వేసి, వారిని క్రిమినల్ ట్రైబ్స్ అని పిలిచేవారు. ఫలితంగా ఆ తెగలో పుట్టిన వారు గతంలో నేరాలు చేసి ఇప్పుడు మానేసినా లేదా అసలు ఎప్పుడూ నేరం చేయకపోయినా నిరంతరం అంతులేని పోలీసు అకృత్యాలకు బలయ్యేవారు. ఆ ముద్ర చెరిపేసుకోవటానికి వారికి కొన్ని తరాలు పట్టింది.
ఇతరుల కళ్ళు గప్పి, మన కష్టార్జితం కాని దాన్ని కైవసం చేసుకోవటమే దొంగతనం. సమాజంలో లంచగొండులు, అక్రమార్జనపరులు, బ్యాంకులను కొల్లగొట్టే వ్యాపారులు, ప్రజల ఉమ్మడి భూములను, వనరులను తమ హస్తగతం చేసుకొనే వైట్‌కాలర్ మనుషులు దొంగలు కారా? సభ్య సమాజం అనబడే దాంట్లో ఎంత మంది ఇవ్వాళ కేవలం వారి నైతికమైన కష్టార్జితం మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నారు? వీరంతా సమాజంలో ఎంతో దర్జాగా బతుకుతుండగా నిమ్న కులాలకు చెందిన వాళ్లు, కటిక పేదలు మాత్రం పోలీసుల చేతిలో దెబ్బలు తింటున్నారు. కేవలం దొంగ తనం రూపంలో తేడా ఉన్నందుకేనా?
పేదరికం, తగిన ఉపాధి మార్గాలు లేకపోవడం, పాలకులే పెంచి పోషించే వ్యసనపర సంస్కృతి, మనుషులందరినీ సమానంగా చూసే ప్రజాస్వామ్య సంస్కృతి లేని పరిపాలనల పర్యవసానంగానే చిన్న చిన్న దొంగతనాలు జరుగుతాయి. దీనికి వ్యక్తిగతంగా వారినే బాధ్యులను చేసి శిక్షించటం కంటే పాలకులే ఆ స్థితికి నైతిక బాధ్యత వహించటం నాగరిక పద్ధతి. నేరం జరగటానికి గల నేపథ్యాన్నీ, నివారించడానికి గల అవకాశాలనూ పరిశీలించకుండా నేరస్తులను మాత్రమే శిక్షించే సాంప్రదాయం సంకుచితమైనది. నేర సంస్కృతి పెరగటానికి కావలసిన భౌతిక పరిస్థితులను పెంచి పోషించే పాలకులే నేరాల అదుపు పేరుతో పేదవర్గాలపై కేసులు బనాయించటం అనైతికమైన విషయం.
చదవండి: విస్మృత చరిత్రపై వెలుగు రేకలు
దేశంలో కొన్ని వర్గాలు మాత్రమే దొంగలుగా ఉంటారనే సామాజిక విలువలో ఆర్థిక, కులవివక్ష ఉంది. మేం మాత్రం దొంగలం కాదు సుమా అనే ఆత్మవంచన కూడా ఉంది. ఈ మానసిక భావనను సమీక్షించుకోవాల్సిన బాధ్యత పాలకులది, సభ్య సమాజానిది. సమాజంలోని పౌరులందరూ గౌరవప్రదమైన ఉపాధితో, సమానమైన హోదా, అవకాశాలతో జీవించేటట్టు చూడాల్సిన రాజ్యాంగ బాధ్యత పాలకులది.
- డాక్టర్ ఎస్. తిరుపతయ్య
మానవ హక్కుల వేదిక, తెలంగాణ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment