శాస్త్ర జ్ఞానాభివృద్ధే దేశానికి ఊపిరి | Katti Padma Rao Write on Science in India, Scientific Development | Sakshi
Sakshi News home page

శాస్త్ర జ్ఞానాభివృద్ధే దేశానికి ఊపిరి

Published Fri, Sep 9 2022 1:10 PM | Last Updated on Fri, Sep 9 2022 1:15 PM

Katti Padma Rao Write on Science in India, Scientific Development - Sakshi

భారతదేశంలో శాస్త్రీయ భావ జాలాలపై హిందూ పౌరాణిక వ్యవస్థ దాడి చేస్తోంది. మొత్తం సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ధ్వంసం చేసి భూ కేంద్ర సిద్ధాంతాలతో కూడిన జ్యోతిష్యం, మూఢవిశ్వాసాలతో కూడిన భావజాలాన్ని వ్యాప్తి చేస్తు న్నారు. దానివల్ల భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, ఇలా అన్నీ సంక్షోభంలో పడు తున్నాయి. మానవుని పుట్టుక, నిర్మాణం మీదే ఇంకా సందిగ్ధ భావనలు ప్రచారం చేస్తున్నారు. నిజానికి భారతదేశంలో చార్వాకం, బౌద్ధం, జైనం, సాంఖ్యం విస్తరిల్లి భారతీయ భౌతిక శాస్త్రం అత్యున్నతంగా ప్రజ్వలించింది. ఇతర దేశాల వారు సాంఖ్య దర్శనం లోని అనేక అంశాలను తీసుకుని వారి భౌతిక శాస్త్రాన్ని అభివృద్ధి చేసుకున్నారు.

సాంఖ్యం బుద్ధుణ్ణి తర్కబద్ధమైన ఆలోచనలకు పురిగొల్పింది. జ్ఞానం ధ్యానం నుండి వచ్చేది కాదనీ, అది తర్క బద్ధమైనదనీ ఆయన గ్రహించాడు. సాంఖ్య దర్శనం భారతీయ తత్వ శాస్త్రాలలో హేతు బద్ధమైనది, భౌతిక వాదంతో కూడినది. ఈ దర్శనాన్ని రచించిన ‘కపిలుడు’ నిరీశ్వర వాదాన్ని ప్రతిపాదించాడు. దీనిపై పరిశోధన చేసిన ‘కీత్‌’ ‘ప్రపంచం మొత్తంలో భౌతిక వాదానికి సాంఖ్య దర్శనం ప్రేరణ శక్తి’ అన్నాడు. శాస్త్ర జ్ఞానానికి జ్ఞాన సంపద, హేతు దృష్టి, కార్యాచరణ శీలత, గ్రహణశక్తి, విశ్లేషణా శక్తి, అవసరం. అయితే ఇప్పుడు శాస్త్రాన్ని బోధించే ఆచార్యులు కూడా మూఢ నమ్మకాలు కలిగి ఉండటం ఆశ్చర్యం. భౌతిక వాదాన్ని, భౌతికశాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని, జీవశాస్త్రాన్ని బోధించే ఆచార్యులు కూడా వర్ణధర్మాన్ని యజ్ఞ, యాగ, కర్మకాండలపై నమ్మకాన్ని, కులాచరణను కలిగి ఉండటంవల్ల శాస్త్ర జ్ఞాన బోధ పెదవుల నుండే జరుగుతోంది కానీ అది మేధస్సుకు పదును పెట్టలేక పోతోంది. అందుకే ఇప్పుడు దేవాల యాల యాత్రలకు శాస్త్రవేత్తలు క్యూ కడుతున్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం.

ఎందుకంటే పదార్థవాదం చెప్పే ఒక ఉపాధ్యాయుడు తన భావజాలం నుండి బయటపడలేక పదార్థం వెనుక కూడా ఏదో అదృశ్య శక్తి ఉన్నదని బోధించే దశలో ఉండటం వల్ల విశ్వవిద్యాలయాల్లో ద్వైదీ భావజాలం పరిఢవిల్లుతోంది. అందువల్లే అక్కడ రూపొందే విద్యార్థులు శాస్త్రీయ ఆవిష్కరణల్లో వెనుక బడిపోతున్నారు. ఫలితంగా మన విశ్వ విద్యాలయాల కోసం చేస్తున్న కొన్ని కోట్ల రూపాయల ఖర్చు వ్యర్థమైపోతోంది. శాస్త్ర జ్ఞాన లోపం వల్ల ఉత్పత్తి క్రమం కూడా భారతదేశంలో తగ్గిపోతోంది. శాస్త్ర సాంకేతిక జ్ఞానం వల్ల చైనా, జపాన్, జర్మనీల్లో ఉత్పత్తి పెరిగింది. మనదగ్గర అది కనిపించకపోవడానికి శాస్త్ర జ్ఞాన లోపమే కారణం.

నైతిక శక్తిని బోధించే బౌద్ధాన్ని విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో, రాజకీయ పాఠశాలల్లో విస్తృ తంగా బోధించకపోవడం వల్ల నైతిక శక్తి సైతం తగ్గిపోతూ వస్తోంది. అవినీతిపరులు పెరగడం, దేశాన్ని దోచుకుని ఇతర దేశాల్లో దాచుకునేవారు పెరగడం, దేశీయ ఉత్పత్తులకు పునాదైన సాంకేతిక జ్ఞాన శూన్యత వల్ల మూఢాచారాలు పెరగడం సహజమైపోయింది. రాళ్ళూ, రప్పలకు బుర్రలు తాకట్టు పెట్టడం వల్ల పేరుకు 140 కోట్లు మంది ఉన్నా కూడా ఆలోచించే వాళ్ళు 20 కోట్ల మంది కంటే తక్కువే ఉన్నారని అర్థ మవుతుంది. శ్రామికుడిని హీనంగా చూస్తూ విగ్రహా లను ఆధారం చేసుకుని బతికే వారిని పండితులుగా, భూదేవతలుగా కొనియాడటం జరుగుతోంది. 

రాగ ద్వేషాలను, కుల మత వైరుధ్యాలను పెంచే సంఘర్షణోన్మాద, యుద్ధోన్మాదాన్ని పెంచే కల్పిత యుద్ధ గాథల ప్రవచనాల వల్ల, దృశ్యాల వల్ల భారతదేశం నిరంతరం ఘర్షణలతో అట్టుడుకుతోంది. బౌద్ధ భారత నిర్మాణం వల్ల నైతిక శక్తి పెరుగుతుంది. పగతో పగ చల్లారదు. ప్రేమ వల్లే పగ చల్లారుతుంది అనే ధమ్మ పథం సూత్రాలు నేడు అవసరం. స్థిరత్వంతో, సంయమనంతో, కోప రహితుడిగా ఉండి... నిబ్బరంగా, నిజాయితీగా ఉండే విజ్ఞానవంతుడు వరదల ధాటికి మునగని దీవి లాంటివాడని, అటువంటి స్థిరత్వాన్ని శాస్త్రజ్ఞులు సాధించాలని బౌద్ధ బోధనలు చెబుతున్నాయి. శాస్త్ర జ్ఞానం ప్రకారం పుట్టుకలో గానీ, మరణంలోగానీ మానవులందరూ ఒకే రకంగా ఉన్నారు. ఒకే కులంలోని వ్యక్తులు కూడా అనేక వృత్తులు చేపడుతున్నారు. కానీ మనసుల్లో వర్ణభేదాలు, కుల భేదాలు, మూఢనమ్మకాలు ఉండడం వల్ల తమను తాము మనుషులుగా గుర్తించుకోలేక పోతున్నారు. 

గొప్ప జీవశాస్త్ర జ్ఞానమున్న వాళ్ళు కూడా మంత్ర గాళ్లకు, జ్యోతిష్యులకు లొంగిపోతున్నారు. వ్యవసాయ దారులు, వర్తకులు, విద్యావంతులు కూడా వీరికి బానిసలవుతున్నారు. అందువల్ల శాస్త్ర జ్ఞానం జీవితంలో ఫలించడం లేదు. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బు తీసుకెళ్ళి దేవుని హుండీల్లో వేస్తున్నారు. మనిషి పవిత్రత, అపవిత్రత అనేది ప్రవర్తన వల్ల రుజువు కావాలి కానీ దేవుడికి ఇచ్చే కానుకల వల్ల కాదు. దొంగలు, అవినీతి పరులు, అప్పు చేసి ఇతర దేశాలకు పారిపోయే వారంతా గొప్ప భక్తులుగా చలామణి అవుతున్నారు. నిజమైన శాస్త్రజ్ఞులకు సరైన గుర్తింపు, ఆదరణ లేదు.

కనీసం ఇప్పటికైనా మన శాస్త్రీయ విజ్ఞానాభివృద్ధి తెచ్చిన ఫలితాలతో ముందుకు వెళ్ళవలసిన చారిత్రక సందర్భం ఇది. శాస్త్ర విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారానే ప్రజా జీవన సమృద్ధికి ప్రేరణ కలుగుతుంది. ఉత్పత్తి, జ్ఞానం, విద్య, సాంకేతికతల సమన్వయంతో భారతదేశం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అప్పుడే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగం జీవితాల్లో ప్రతిఫలిస్తుంది. (క్లిక్‌: ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?)


- డాక్టర్‌ కత్తి పద్మారావు
కవి, దళితోద్యమ నాయకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement