అభిప్రాయం
అంబేడ్కర్ ప్రతిపాదించిన సామాజిక విప్లవ సిద్ధాంతం భారతీయ సామాజిక పునర్నిర్మాణానికీ, దళితజాతుల విముక్తి పోరాటానికీ లక్ష్యాన్ని, గమ్యాన్ని నిర్దేశించింది. తరతరాలుగా భారతీయ సంస్కృతి కోల్పోయిన మానవతను, సమతను ఆయన విముక్తి పోరాటం పునరుజ్జీవింప జేసింది. నేడు భారత దేశంలో సమసమాజ నిర్మాణానికి ఉద్యుక్తులవుతున్న వారందరూ అంబేడ్కర్‌ను అధ్యయనం చేయకుండా, సమన్వయ పర్చుకోకుండా వారి పోరాటాల్లో విజయం సాధించటం అసాధ్యం. అంబేడ్కర్‌ను విస్మరించినవారు తమ లక్ష్యాల్లో, గమ్యాల్లో వైఫల్యం చెందుతూ ఆ వైఫల్యానికి కారణాలు గుర్తెరగలేక తిరోగమిస్తున్నారు. ఏ వ్యవస్థలోనైనా పునాదులతో సహా మార్పు తేవాలన్నప్పుడు, ఆ సామాజిక వ్యవస్థను శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించాలి.
వికసిత భారత నిర్మాణం ద్వారా మన ప్రస్థానం ప్రపంచానికి స్ఫూర్తిదాయకం కావా లని ఆగస్టు 15న ఎర్రకోటపై చేసిన తన 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఉద్ఘాటించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఒక ప్రధాని చేసిన సుదీర్ఘ ప్రసంగం ఇది. మోదీ ఇప్పటికి ఎర్రకోట మీద 11 సార్లు జెండా ఎగురవేసి, ఎక్కువసార్లు ఎగురవేసిన మూడో ప్రధానిగా నిలిచారు.
భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట మీద 17 సార్లు జెండా ఎగురవేశారు. ఆయన ప్రసంగాలు ప్రపంచ దేశా లను ఆకట్టుకున్నాయి. నెహ్రూ తన ప్రసంగాలలో భారత భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక అంశాలతో పాటు ఆర్థిక అంశా లను, అంతర్జాతీయ అంశాలను ఉటంకించేవారు. నెహ్రూ గొప్ప చదువరి. స్వతహాగా పండితుడు. ప్రపంచ దేశాల ప్రధాన మంత్రులతో విస్తృతమైన స్నేహం ఉన్నవారు.
ఆ తరువాత ఇందిరా గాంధీ 16 సార్లు ఎర్రకోట మీద పతాకను ఎగురవేశారు. ఇందిర ప్రసంగాలలో కూడా విస్తృతమైన అంశాలు చర్చలకు వచ్చేవి. పేదరిక నిర్మూలన, బ్యాంకుల జాతీయీకరణ, భూసంస్కరణల వంటి అనేక అంశాల్ని ఆమె పేర్కొన్నారు. భారత దేశ మౌలిక స్వభావాన్ని మార్చే భూసంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ పెద్ద చర్చనీయాంశాలుగా మారాయి.
స్వాతంత్రం వచ్చేనాటికి మన దేశ జనాభా 40 కోట్ల లోపే. ఇందిరాగాంధీ పాలన వరకు అది సుమారు 80 కోట్లు. ఇప్పుడు 140 కోట్లకు పెరిగింది. జనాభా ఇంతగా పెరిగిన ఈ సందర్భంలో ప్రజలందరూ ప్రధాని ఉపన్యాసంలో వచ్చే ముఖ్యమైన అంశాల కోసం ఎదురు చూడటం సహజం. ఇప్పటి జనాభాలో ప్రధానమైన శక్తిగా యువత 40 కోట్ల మందిగా ఉన్నారు. దగ్గర దగ్గర 67 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. భారత సమాజంలో కోటీశ్వరులు పెరుగుతున్నారు.
20 కోట్ల మంది కోటీశ్వరులు ఉంటే, పేదలు 70 కోట్ల మంది ఉన్నారు. సమాజం ఇంకా సామాజిక అసమానతలతోనూ, స్త్రీల అణచివేతల తోనూ, నిరుద్యోగ భారతంగానూ ఉన్న సందర్భమిది. అందుకే ప్రధాని ప్రసంగంలోని నిర్మాణాత్మకమైన అంశాల కోసం ప్రజలు ఎదురుచూశారు. ప్రధాని యువతకు నూత్న ఉపాధి అంశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు.
దేశాభివృద్ధికి మరిన్ని నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నామన్నారు. దేశాన్ని గ్లోబల్ మ్యాను ఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడానికి ఇది సువర్ణావకాశం అని కూడా అన్నారు. ఇవన్నీ దేశ ప్రజలను ఉత్తేజితం చేసే మాటలే అయినప్పటికీ రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానం కనుమరు గైనట్టేనని అనిపించింది.
నిజానికి ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్న రైల్వేలు, టెలిఫోన్లు, విద్యుత్, ఇంధన, అనేక భారీ పరిశ్రమలు కార్పొరేట్ చేతుల్లోకి వెళుతున్న సందర్భమిది. భారత రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తేనే భారత ఆర్థిక సంపద ఇతర దేశాల ఆర్థిక సంపదకు దీటుగా పెరుగుతుందని చెప్పారు.
ఇకపోతే మోదీ గ్లోబల్ కంపెనీలను భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించాలనీ, వాటిని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభు త్వాలు తమలో తాము పోటీ పడాలనీ సూచించారు. నిజానికి మోదీ లక్ష్యం చేసిన 2047వ సంవత్సరానికి భారత జనాభా 170 కోట్లను దాటవచ్చును.
ఇప్పటికే 70 కోట్ల మంది ప్రజలకు ఇళ్ళ స్థలాలు లేవు. 170 కోట్లకు జనాభా పెరిగినప్పుడు, విదేశీ కంపెనీలకు స్థలాలు యిచ్చుకుంటూపోతే 2047 కంతా భారతదేశ ప్రజలకు ఇళ్ళ స్థలం దొరక్కపోగా, కొన్ని దేశాలవలే మనమూ సముద్రాల పైన ఇళ్ళు నిర్మించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని భౌగోళిక శాస్త్రవేత్తలు అంటున్నారు.
నరేంద్ర మోదీ ప్రసంగంలో దేశంలో సాంకేతిక రంగంలో ప్రధాన భూమికను వహిస్తున్న మైనారిటీలకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుల విషయంలో మార్పులు తేవాలనే భావన కనిపిస్తుంది. ఈ విషయా లను హ్యూమన్ రైట్స్ వాచ్ ఖండించింది. ప్రధాని సహజంగా మతా తీత భావనలో ప్రసంగిస్తేనే దేశంలో సామరస్యత, శాంతి, క్రాంతి కలుగుతాయని లౌకికవాదుల భావన.
నిజానికి సాంస్కృతిక లౌకిక వాదం అంటే చర్చనీయాంశం అవుతుంది. నెహ్రూ, ఇందిరాగాంధీ, వి.పి. సింగ్... వీరంతా భారతదేశం లౌకిక ప్రజాస్వామ్యదేశం అని చెప్పారు. ఇకపోతే రాజ్యాంగ సభ సమయంలో అంబేడ్కర్ మతాతీత లౌకిక భావనతో పాలకవర్గం ఉన్నప్పుడు దేశంలో సామరస్యం నెల కొంటుందనీ, ముస్లింలు, క్రైస్తవులు, పార్శీలు, జైనులుగా చెప్పబడు తున్న ప్రజలంతా భారతీయులేననీ నొక్కి వక్కాణించారు.
మైనారిటీలు, దళితుల వెనుకబాటుతనాన్ని గూర్చి, వారి అభ్యున్నతికి పాటు పడాల్సిన అంశాలను గూర్చి అంబేడ్కర్ ఇలా చెప్పారు: సాంఘిక, ఆర్థిక, రాజకీయ విషయాల్లో మనలో మనకు తీవ్రమైన భేదాభిప్రా యాలున్నవని నేనేరుగుదును. అయినప్పటికీ మనమంతా కలిసి వివిధ ధోరణులనన్నింటిని సమన్వయింపజేసికొని ఒక దేశం, ఒకే ప్రజలు అనిపించే జాతీయ భావంతో మెలగ్గలిగే రోజులు రాగలవనే విశ్వసిస్తున్నాను. ఇకపోతే అనుక్షణం మారుతున్న ఆధునాతన యుగంలో విద్యకున్న విలువ మరి దేనికీ లేదు. అందులోనూ సాంఘిక గౌరవాన్ని పెంపొందించుకోవాల్సివున్న నిమ్న జాతుల్లో విద్య చాలా అవసరం.
ఇకపోతే అంబేడ్కర్ ప్రతిపాదించిన సామాజిక విప్లవ సిద్ధాంతం భారతీయ సామాజిక పునర్నిర్మాణానికీ, దళితజాతుల విముక్తి పోరాటానికీ లక్ష్యాన్ని, గమ్యాన్ని నిర్దేశించింది. తరతరాలుగా భారతీయ సంస్కృతి కోల్పోయిన మానవతను, సమతను ఆయన విముక్తి పోరాటం పునరుజ్జీవింప జేసింది. నేడు భారతదేశంలో సమసమాజ నిర్మాణానికి ఉద్యుక్తులవుతున్న వారందరూ అంబేడ్కర్‌ను అధ్యయనం చేయకుండా, సమన్వయ పర్చుకోకుండా వారి పోరాటాల్లో విజయం సాధించటం అసాధ్యం.
అంబేడ్కర్‌ను విస్మరించినవారు, అంబేడ్కర్‌ను అధ్యయనం చేయనివారు తమ లక్ష్యాల్లో, గమ్యాల్లో నిరంతర వైఫల్యం చెందుతూ ఆ వైఫల్యానికి కారణాలు గుర్తెరగలేక తిరోగమిస్తున్నారు. ఏ వ్యవస్థలోనైనా పునా దులతో సహా మార్పు తేవాలన్నప్పుడు, ఆ సామాజిక వ్యవస్థను మొత్తం శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని విస్మరించిన ఏ వాదమూ సజీవమైనది కాదు. ఈ వాస్తవాన్ని హిందూ కర్మవాదులు, కులవాదులు నిరంతరం విభేది స్తూనే ఉంటారు. అంబేడ్కర్ వారసులుగా వారితో మన యుద్ధం సాగుతూనే ఉంటుంది.
ఇకపోతే భారతదేశాన్ని పాలించే పాలకులకు తప్పక కొన్ని అభ్యుదయ భావాలు ఉంటాయి, కాదనలేము, స్త్రీలపై జరిగే అత్యాచారాల విషయంలో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును అందరూ స్వీకరించాల్సిందే. ప్రతిపక్ష నాయకుణ్ణి మొదటి వరుసలో కూర్చో బెడితే బాగుండేది. ఎందుకంటే నెహ్రూ, వాజ్‌పేయి ఈ సంప్రదా యాన్ని పాటించారు. నిజానికి తన సుదీర్ఘమైన ప్రసంగంలో రాజ్యాంగ కర్తను బహుదా ప్రస్తావించటం ఆయన ధర్మం.
అస్పృశ్యతా నివారణ, కులనిర్మూలన, దళితుల రక్షణ, పౌరహక్కుల రక్షణ, విశ్వ విద్యాలయాల్లో శాస్త్రీయభావాల పెంపునకు సంబంధించిన రాజ్యాంగ స్ఫూర్తి కలిగి ఉండటం ఒక చారిత్రక అవసరం. ఏమైనా అంతిమంగా అంబేడ్కర్ రాజ్యాంగమే స్వాతంత్య్ర దినోత్సవ ఆశయాలకు దిక్సూచి. అంబేడ్కర్ మార్గమే భారతదేశ అభివృద్ధికి ప్రధాన భూమిక. ఆ మార్గంలో పయనిద్దాం!
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment