Buddism
-
సద్ధర్మం! శరత్కాలంలోని సూర్యుని కాంతిలా హయిగా ఉంటుంది!
సద్ధర్మంఅది శ్రావస్తి నగరానికి దాపున ఉన్న జేతవనం. ఆ వనం మధ్యలో ఉన్న ఆనందబోధి వృక్షం కింద ప్రశాంత వదనంతో కూర్చొని ఉన్నాడు బుద్ధుడు. భిక్షు సంఘం ఆ చెట్టు చల్లని నీడలో కూర్చొని ఉన్నారు. వారు ధరించిన కాషాయ వస్త్రాలు కాంతిమంతంగా ఉన్నాయి. ఆ వెలుగు వారి దేహం మీద పడి ప్రకాశిస్తోంది. ‘‘భిక్షువులారా! మనం ఎలాంటి ధర్మాన్ని తెలుసుకోవాలి? ఎలాంటి ధర్మాన్ని సేవించాలి? ఎలాంటి ధర్మాన్ని ఆచరించాలి? అని ఆలోచించాలి’’ అన్నాడు గంభీరంగా. భిక్షువులందరూ ప్రశాంతంగా వినసాగారు. మనం పాటించే ధర్మం నాలుగు విధాల ఫలితాలనిస్తుంది. అందులో మొదటిది విషపదార్థం కలిసిన చేదు గుమ్మడికాయ రసం లాంటిది. దీని రుచీ, వాసన, రంగూ ఏదీ బాగోదు. పైగా తాగితే ప్రమాదం కూడా. అలాగే... వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ దుఃఖాన్ని ఇచ్చే ధర్మం అలాంటిది.అలాంటి కుశలం ఇవ్వని ధర్మాన్ని గ్రహించి దూరంగా ఉండాలి. ఇక, రెండోరకం ధర్మాచరణ బంగారు పాత్రలో ఉన్న కుళ్ళిన పదార్థం లాంటిది. ఈ పదార్థం రంగు, రుచి, వాసనలు ఇంపుగా ఉంటాయి. పైగా బంగారు పాత్రలో ఉంది. కానీ, దీన్ని సేవిస్తే అనారోగ్యం కలిగి, ప్రాణాలకే ముప్పు. వర్తమానంలో సుఖాన్ని, దీర్ఘకాలంలో దుఃఖాన్ని ఇచ్చే ధర్మాచరణ ఇలాంటిది. మరి, భిక్షువులారా! ఒక చెక్క పాత్ర ఉంది. దానిలో ఎన్నో మూలికలతో మరిగిన మూత్రం ఉంది. పాండు రోగానికి అది మంచి ఔషధం. దాని రంగు, రుచి, వాసనలు ఏవీ బాగోలేదు. అయినా దాన్ని సేవిస్తే రోగం తగ్గుతుంది. ఉపశమనం కలుగుతుంది. అలాగే... వర్తమానంలో దుఃఖాన్ని, దీర్ఘకాలంలో సుఖాన్ని ఇచ్చే ధర్మాచరణ కూడా ఇలాంటిదే!’’ అన్నాడు. ‘‘అలాగే... ఒక పాత్రలో పెరుగు, తేనె, నెయ్యి కలిపిన బెల్లం రసం ఉంది. అది కడుపులో బాధల్ని హరించే ఔషధం. ఆ బెల్లం రసం రంగు బాగుంటుంది. రుచి బాగుంటుంది. వాసన కూడా బాగుంటుంది. అది చేసే మేలు కూడా బాగుంటుంది. ఇలా వర్తమానంలో సుఖాన్ని, దీర్ఘ కాలంలో కూడా సుఖాన్ని ఇచ్చేది సద్ధర్మం.’’ ‘‘భిక్షువులారా! సద్ధర్మం అనేది శరత్కాలంలోని సూర్యుని కాంతి లాంటిది. అది ప్రకాశిస్తుంది. మనిషి దుఃఖాన్ని పారద్రోలుతుంది’’ అని చెప్పి, అందరి వంకా ఓసారి చూశాడు. అందరి మనస్సుల్లోని ఉషస్సు వారందరి ముఖాల్లో తేజస్సుగా ప్రతిఫలిస్తోంది! – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: సద్ధర్మం! శరత్కాలంలోని సూర్యుని కాంతిలా ప్రకాశిస్తూ నేఉంటుంది!) -
బౌద్ధ సాగరం
దేనికైనా మధ్యేమార్గంలో పోవాలంటారు పెద్దలు. అతివాదాలు ప్రపంచానికి వినాశనకరం. ఈ మధ్యేమార్గం బౌద్ధం నుంచి ప్రజల్లోకి వచ్చిన భావధార. ఇంతకీ మధ్యేమార్గం అంటే ఏమిటి? మధ్యమాప్రతిపద్ అని సంస్కృతంలో, మజ్జిమాపతిపదా అని పాళీలో పిలిచే ఈ మార్గం ‘రెండు అంత్యాలను వదిలి, ఆ అంత్యాన్నో ఈ అంత్యాన్నో కౌగిలించుకోకుండా, అంటే మరీ అతికిపోకుండా, మధ్య దారిలో పోవాలని చెబుతుంది.’ ‘సత్యం, ఆ అంత్యంలోనో, ఈ అంత్యంలోనో కాక మధ్యలో ఉంటుందనే భావనను బౌద్ధ సిద్ధాంతాలకు అన్వయించడం జరిగిం’దని విశదీకరిస్తుంది ‘మహా బౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువు’. దీన్ని కూర్చినవారు అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి. మధ్యేమార్గం మన జీవితాలకు ఒక సంయమనాన్ని ఇస్తే, మరి ఆ సంయమనం సాధించడానికి కావాల్సిన ఉపకరణం– ధ్యానం. ఆ ధ్యానంలో రకరకాల మార్గాలున్నాయి, రకరకాల తుది ఫలితాలున్నాయి. బుద్ధుడి ద్వారా ప్రపంచానికి అందిన ఒక ధ్యాన ప్రక్రియ– విపశ్యన. ‘ఇది ఎరుక, అప్రమత్తత, జాగరూకత, పరిశీలనల మీద ఆధారపడినది.’ ఇది ఉనికిలో ఉన్న మిగిలిన ధ్యానాలకు భిన్నం. సమాధి స్థితిలో మనస్సు ‘అనేక మార్మిక స్థితులను చేరుతుంది. కానీ ప్రపంచాన్ని యథాతథంగా చూడలేడు. కాని బుద్ధునికి కావలసింది ప్రపంచాన్ని యథాతథంగా చూడగలగడం.. .(అందుకే) విపశ్యనను కనిపెట్టాడు. విపశ్యన అంటే, మనస్సును పూర్తిగా విముక్తం చేసి, వస్తువుల యథార్థ స్థితికి తీసుకెళ్లి, తద్వారా నిర్వాణానికి చేర్చే అంతర్ప్రజ్ఞ’ అని చెబుతుంది ఇదే మహా బౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువు. ఇది ఒక విశ్లేషణాత్మక విధానం. ‘దుఃఖాన్ని, రూపారూప ప్రపంచంలో ఆత్మలేని తనాన్ని ఎరుకపరిచేది ఈ జ్ఞానం’. 2008లో వెలువడిన ఈ మహా బౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువులో ఇంకా ఇలాంటి ఎన్నో మాటలకు, రీతులకు అర్థాలు, వివరాలు తెలుస్తాయి. రెండు అట్టల నడుమ బౌద్ధ మహాసాగరాన్ని ఇముడ్చుకున్న గ్రంథం ఇది. పదం పదంలో జ్ఞాన పథం! తెలిసీ అసత్యం పలకడానికి ఎవరైనా సిగ్గుపడాలనీ, అలాగే పర్యాలోచన(రిఫ్లెక్షన్) చేసి కర్మలను పరిశుద్ధం కావించుకోవాలనీ రాహు లునికి బుద్ధుడు బోధించింది రాహులోవాద సూత్రం. ‘ఏ ధర్మమూ, వస్తువూ అదే విధంగా ఏరెండు క్షణాల పాటు ఉండదు’ అని చెప్పేది క్షణికవాదం. యోగ అంటే, కాడి కిందకు తేవటమే. ‘ఎలాగైతే కాడికి పూన్చిన ఎద్దులు నియమబద్ధంగా నడుస్తాయో, అలాగే యోగం మనిషి మనస్సును సంయమిస్తుంది’. ఇక పవిత్రాక్షరం ఓమ్ తాంత్రిక బౌద్ధంలో శూన్యతను సూచిస్తుంది. అయితే ఈ గ్రంథం వట్టి ప్రతి పదార్థాల పదకోశం కాదు. ఇది బౌద్ధ సూత్రాలను, శాస్త్రాలను, సిద్ధాంతాలను, పారిభాషిక పదాలను గణనీయంగా వివరిస్తుంది. కొత్తగా బౌద్ధాన్ని తెలుసుకోగోరేవారికీ, అవ గాహన చేసుకోగోరేవారికీ ఇది ఒక కరదీపిక. ‘ఇటువంటి బౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువు తెలుగులో– బుద్ధుని కాలంలోనే బౌద్ధం ఆంధ్రదేశంలో ప్రవేశించినా, క్రీ.పూ. 300ల నుంచి క్రీ.శ. 700ల వరకు, వేయి సంవత్సరాల పాటు, ఆంధ్రదేశాన్ని దున్ని వేసినా– ఒక్కటీ వెలువడలేదు’ అని ప్రకాశకులు (మిసిమి ప్రచురణలు) ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, ‘తెలుగులో వెలువడిన ప్రథమ మహా బౌద్ధ విజ్ఞాన నిఘంటువు’ ఇదని ఘనంగా ప్రకటించారు. అయితే, ‘నేను త్రిపిటకాచార్యుడను కాను. అంతకంటె బౌద్ధ వాఙ్మయ మహాధ్యక్షుడను అసలే కాను. ఒక సామాన్య బౌద్ధ విద్యార్థిని. అలాగే ఈ ప్రయత్నం చేశాను... ఆ మహా సముద్రంలోని జ్ఞాన జలాన్ని నా ‘బుడ్డి చెంబు’ పట్టినంత మేరకే గ్రహించాను’ అని వినయంగా చెప్పుకొన్నారు కూర్పరి అన్నపరెడ్డి. నిఘంటువు ముందు ‘మహా’ అని చేర్చడం కూడా, బౌద్ధ సంప్రదాయాన్ని(ఉదా: మహా నిదాన సుత్త, మహా పదాన సుత్త) పాటించాలనే కోరికతో చేశానని చెప్పినప్పటికీ ఇది ‘మహా’ అని చేర్చడానికి తగినదే! బౌద్ధానికి సంబంధించిన అనేక గ్రంథాలను తెలుగులో వెలువరించిన అరుదైన రచయితగా కూడా అన్నపరెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇందులో అనువాదాలు, పరిశోధనలు, స్వతంత్ర రచనలు ఉన్నాయి. మానవీయ బుద్ధ, బుద్ధ దర్శనం, బుద్ధుని దీర్ఘ సంభాషణలు, బుద్ధుని సూత్ర సముచ్చయం, తెలుగులో బౌద్ధం, ఆచార్య నాగార్జునుడు, మహోన్నత బుద్ధుడు, నలభై రెండు ప్రకరణాల సూత్రం, బుద్ధుని ధర్మం– శిష్యులు, పోషకులు లాంటి పుస్తకాలను వెలువరించారు. 1933 ఫిబ్రవరి 22న మహాశివరాత్రి పర్వదినాన గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులో దిగువ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు అన్నపరెడ్డి. లెక్చరర్‌గా పనిచేశారు. ‘చదివింది తత్వశాస్త్రం. బోధించింది సమాజశాస్త్రం. రాసింది మనోవిజ్ఞాన శాస్త్రం. అభిమాన విషయం సాహిత్యం, గ్రంథ రచన’. 1996 నుంచి 2011 వరకు ‘మిసిమి’ మాసపత్రికకు సంపాదకులుగా పనిచేశారు. చాలామంది సాధారణ తెలుగు పాఠకులకు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆయన ద్వారానే పరిచయం. మేధావుల మెతకలు, అస్తిత్వవాదం ఆయన ఇతర రచనలు. ‘చింతనాగ్ని కొడిగట్టిన వేళ’ ఆయన ఆత్మకథ. బౌద్ధమతం అవలంబించిన తర్వాత తన పేరును బుద్ధఘోషుడు అని పెట్టుకున్నారు. ఆ పేరుతో రచనలు చేశారు. కానీ అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డిగానే ఎక్కువమందికి పరిచితుడు. 2021 మార్చ్ 9న ఆయన మరణించారు. ఇది ఆయన జయంతి, వర్ధంతుల ఉమ్మడి సందర్భం. కొంతమంది తాము బతికి ఉన్నంతకాలం సెలయేళ్లలా ప్రవహిస్తారు. వారి దగ్గరికి ఎప్పుడు సమీపించినా మెదడుకు ఇంత జ్ఞానతడి చేసుకుని రావొచ్చు. అలాంటి ఒక తెలుగు సెలయేరు అన్నపరెడ్డి! -
కట్టుకథలు, అర్ధ సత్యాలు మాత్రమే!
అక్టోబర్ 21న మల్లెపల్లి లక్ష్మయ్య రాసిన ‘ఆ ప్రతిజ్ఞలే మార్గదర్శకాలు’ వ్యాసానికి ఇది స్పందన. గత అరవై ఏళ్లుగా నియోబుద్ధిస్ట్ లాబీ, అంబేడ్కర్‌వాదులూ అంబేడ్కర్ గురించి కట్టుకథలు, అర్ధసత్యాలు సృష్టించడంలో విజయం సాధించారు. అరుణ్ శౌరి (వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్) తప్ప ఎవరూ అంబేడ్కర్‌కు సంబంధించిన నిజానిజాలను వెలికితీసే విషయంలో ధైర్యం చేయలేకపోయారు. అంబేడ్కర్ ప్రతి మాటనూ అంబేడ్కర్‌వాదులూ, నియోబుద్ధిస్టులూ గుడ్డిగా సమర్థిస్తారు. అంబేడ్కర్‌పై చిన్న విమర్శను కూడా వారు సహించలేరు. వారికి మాత్రం హిందూ మతంపైనా, హిందూ దేవుళ్లపైనా విమర్శలు చేసే వాక్ స్వాతంత్య్రం ఉంది. అంబేడ్కర్ స్వయంగా తన రచనల్లో హిందూ మతం పైనా, బ్రాహ్మణులపైనా తన ద్వేషాన్ని వెళ్లగక్కారు. 1956 అక్టోబర్ 14న అమాయక హిందువులను బౌద్ధ మతంలోకి మారుస్తూ దీక్ష ఇచ్చిన సమయంలో చేయించిన 22 ప్రతిజ్ఞల్లోనూ ఇదే విద్వేషం కనిపిస్తుంది. ఆరోజు అక్కడ చేరినవారందరూ తాము బౌద్ధంలోకి మారుతున్నామనే అనుకున్నారు. బౌద్ధంలో ఈ 22 ప్రతిజ్ఞలు లేవని వారెవరికీ తెలియదు. నిజానికి అంబేడ్కర్ బౌద్ధమతంలోకి మార్చే పేరుతో ఆయనే ఓ సొంత మతాన్ని ఆవిష్కరించారు. – డాక్టర్ పి. కృష్ణమోహన్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్వీయూ -
శాస్త్ర జ్ఞానాభివృద్ధే దేశానికి ఊపిరి
భారతదేశంలో శాస్త్రీయ భావ జాలాలపై హిందూ పౌరాణిక వ్యవస్థ దాడి చేస్తోంది. మొత్తం సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ధ్వంసం చేసి భూ కేంద్ర సిద్ధాంతాలతో కూడిన జ్యోతిష్యం, మూఢవిశ్వాసాలతో కూడిన భావజాలాన్ని వ్యాప్తి చేస్తు న్నారు. దానివల్ల భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, ఇలా అన్నీ సంక్షోభంలో పడు తున్నాయి. మానవుని పుట్టుక, నిర్మాణం మీదే ఇంకా సందిగ్ధ భావనలు ప్రచారం చేస్తున్నారు. నిజానికి భారతదేశంలో చార్వాకం, బౌద్ధం, జైనం, సాంఖ్యం విస్తరిల్లి భారతీయ భౌతిక శాస్త్రం అత్యున్నతంగా ప్రజ్వలించింది. ఇతర దేశాల వారు సాంఖ్య దర్శనం లోని అనేక అంశాలను తీసుకుని వారి భౌతిక శాస్త్రాన్ని అభివృద్ధి చేసుకున్నారు. సాంఖ్యం బుద్ధుణ్ణి తర్కబద్ధమైన ఆలోచనలకు పురిగొల్పింది. జ్ఞానం ధ్యానం నుండి వచ్చేది కాదనీ, అది తర్క బద్ధమైనదనీ ఆయన గ్రహించాడు. సాంఖ్య దర్శనం భారతీయ తత్వ శాస్త్రాలలో హేతు బద్ధమైనది, భౌతిక వాదంతో కూడినది. ఈ దర్శనాన్ని రచించిన ‘కపిలుడు’ నిరీశ్వర వాదాన్ని ప్రతిపాదించాడు. దీనిపై పరిశోధన చేసిన ‘కీత్’ ‘ప్రపంచం మొత్తంలో భౌతిక వాదానికి సాంఖ్య దర్శనం ప్రేరణ శక్తి’ అన్నాడు. శాస్త్ర జ్ఞానానికి జ్ఞాన సంపద, హేతు దృష్టి, కార్యాచరణ శీలత, గ్రహణశక్తి, విశ్లేషణా శక్తి, అవసరం. అయితే ఇప్పుడు శాస్త్రాన్ని బోధించే ఆచార్యులు కూడా మూఢ నమ్మకాలు కలిగి ఉండటం ఆశ్చర్యం. భౌతిక వాదాన్ని, భౌతికశాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని, జీవశాస్త్రాన్ని బోధించే ఆచార్యులు కూడా వర్ణధర్మాన్ని యజ్ఞ, యాగ, కర్మకాండలపై నమ్మకాన్ని, కులాచరణను కలిగి ఉండటంవల్ల శాస్త్ర జ్ఞాన బోధ పెదవుల నుండే జరుగుతోంది కానీ అది మేధస్సుకు పదును పెట్టలేక పోతోంది. అందుకే ఇప్పుడు దేవాల యాల యాత్రలకు శాస్త్రవేత్తలు క్యూ కడుతున్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే పదార్థవాదం చెప్పే ఒక ఉపాధ్యాయుడు తన భావజాలం నుండి బయటపడలేక పదార్థం వెనుక కూడా ఏదో అదృశ్య శక్తి ఉన్నదని బోధించే దశలో ఉండటం వల్ల విశ్వవిద్యాలయాల్లో ద్వైదీ భావజాలం పరిఢవిల్లుతోంది. అందువల్లే అక్కడ రూపొందే విద్యార్థులు శాస్త్రీయ ఆవిష్కరణల్లో వెనుక బడిపోతున్నారు. ఫలితంగా మన విశ్వ విద్యాలయాల కోసం చేస్తున్న కొన్ని కోట్ల రూపాయల ఖర్చు వ్యర్థమైపోతోంది. శాస్త్ర జ్ఞాన లోపం వల్ల ఉత్పత్తి క్రమం కూడా భారతదేశంలో తగ్గిపోతోంది. శాస్త్ర సాంకేతిక జ్ఞానం వల్ల చైనా, జపాన్, జర్మనీల్లో ఉత్పత్తి పెరిగింది. మనదగ్గర అది కనిపించకపోవడానికి శాస్త్ర జ్ఞాన లోపమే కారణం. నైతిక శక్తిని బోధించే బౌద్ధాన్ని విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో, రాజకీయ పాఠశాలల్లో విస్తృ తంగా బోధించకపోవడం వల్ల నైతిక శక్తి సైతం తగ్గిపోతూ వస్తోంది. అవినీతిపరులు పెరగడం, దేశాన్ని దోచుకుని ఇతర దేశాల్లో దాచుకునేవారు పెరగడం, దేశీయ ఉత్పత్తులకు పునాదైన సాంకేతిక జ్ఞాన శూన్యత వల్ల మూఢాచారాలు పెరగడం సహజమైపోయింది. రాళ్ళూ, రప్పలకు బుర్రలు తాకట్టు పెట్టడం వల్ల పేరుకు 140 కోట్లు మంది ఉన్నా కూడా ఆలోచించే వాళ్ళు 20 కోట్ల మంది కంటే తక్కువే ఉన్నారని అర్థ మవుతుంది. శ్రామికుడిని హీనంగా చూస్తూ విగ్రహా లను ఆధారం చేసుకుని బతికే వారిని పండితులుగా, భూదేవతలుగా కొనియాడటం జరుగుతోంది. రాగ ద్వేషాలను, కుల మత వైరుధ్యాలను పెంచే సంఘర్షణోన్మాద, యుద్ధోన్మాదాన్ని పెంచే కల్పిత యుద్ధ గాథల ప్రవచనాల వల్ల, దృశ్యాల వల్ల భారతదేశం నిరంతరం ఘర్షణలతో అట్టుడుకుతోంది. బౌద్ధ భారత నిర్మాణం వల్ల నైతిక శక్తి పెరుగుతుంది. పగతో పగ చల్లారదు. ప్రేమ వల్లే పగ చల్లారుతుంది అనే ధమ్మ పథం సూత్రాలు నేడు అవసరం. స్థిరత్వంతో, సంయమనంతో, కోప రహితుడిగా ఉండి... నిబ్బరంగా, నిజాయితీగా ఉండే విజ్ఞానవంతుడు వరదల ధాటికి మునగని దీవి లాంటివాడని, అటువంటి స్థిరత్వాన్ని శాస్త్రజ్ఞులు సాధించాలని బౌద్ధ బోధనలు చెబుతున్నాయి. శాస్త్ర జ్ఞానం ప్రకారం పుట్టుకలో గానీ, మరణంలోగానీ మానవులందరూ ఒకే రకంగా ఉన్నారు. ఒకే కులంలోని వ్యక్తులు కూడా అనేక వృత్తులు చేపడుతున్నారు. కానీ మనసుల్లో వర్ణభేదాలు, కుల భేదాలు, మూఢనమ్మకాలు ఉండడం వల్ల తమను తాము మనుషులుగా గుర్తించుకోలేక పోతున్నారు. గొప్ప జీవశాస్త్ర జ్ఞానమున్న వాళ్ళు కూడా మంత్ర గాళ్లకు, జ్యోతిష్యులకు లొంగిపోతున్నారు. వ్యవసాయ దారులు, వర్తకులు, విద్యావంతులు కూడా వీరికి బానిసలవుతున్నారు. అందువల్ల శాస్త్ర జ్ఞానం జీవితంలో ఫలించడం లేదు. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బు తీసుకెళ్ళి దేవుని హుండీల్లో వేస్తున్నారు. మనిషి పవిత్రత, అపవిత్రత అనేది ప్రవర్తన వల్ల రుజువు కావాలి కానీ దేవుడికి ఇచ్చే కానుకల వల్ల కాదు. దొంగలు, అవినీతి పరులు, అప్పు చేసి ఇతర దేశాలకు పారిపోయే వారంతా గొప్ప భక్తులుగా చలామణి అవుతున్నారు. నిజమైన శాస్త్రజ్ఞులకు సరైన గుర్తింపు, ఆదరణ లేదు. కనీసం ఇప్పటికైనా మన శాస్త్రీయ విజ్ఞానాభివృద్ధి తెచ్చిన ఫలితాలతో ముందుకు వెళ్ళవలసిన చారిత్రక సందర్భం ఇది. శాస్త్ర విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారానే ప్రజా జీవన సమృద్ధికి ప్రేరణ కలుగుతుంది. ఉత్పత్తి, జ్ఞానం, విద్య, సాంకేతికతల సమన్వయంతో భారతదేశం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అప్పుడే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం జీవితాల్లో ప్రతిఫలిస్తుంది. (క్లిక్: ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?) - డాక్టర్ కత్తి పద్మారావు కవి, దళితోద్యమ నాయకుడు -
దానఫలం.. చూడగలం..
మనుషులకు ఉండవలసిన పది మానవీయ లక్షణాలలో దానగుణం మొదటిది అంటుంది బౌద్ధం. ఎందుకంటే దానం అంటే త్యాగం కాబట్టి. తన సంపదని, తన శ్రమని త్యాగం చేయడమే కాబట్టి. వ్యక్తుల కష్టాలు తీర్చడానికి దానం ఉపయోగపడుతుంది. కన్నీరూ తుడుస్తుంది. ‘వ్యక్తుల కంటే ధర్మం కోసం కృషి చేసే సంఘానికి దానం చేయడం మరింత మేలు’ అంటాడు బుద్ధుడు. ఒకడు వైశాలి నగర సమీపంలోని మహావనం లో కూటాగార శాలలో బుద్ధుడు ఉన్నాడు. అప్పుడు వైశాలికి చెందిన లిచ్ఛవీ గణరాజు కుమారుడైన సింహసేనాపతి బుద్ధుని దగ్గరకు వచ్చాడు. సింహుడు తీర్థంకర మత అభిమాని. అయినా అతనిలో రేగే అనేక సందేహాల్ని తీర్చుకోవడానికి బుద్ధుని దగ్గరికే వచ్చేవాడు. ఆ రోజు... వచ్చి బుద్ధునికి నమస్కరించి ఒక పక్కన కూర్చొన్నాడు. బుద్ధుడు అతని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత సింహసేనాపతి అంజలి ఘటిస్తూ– ‘‘భగవాన్! మీరు అనేకమార్లు దాన విశిష్టత గురించి చెప్పారు. ఏ దాత తాను చేసిన దానానికి ఆనందం పొందగలడు?’’ అని అడిగాడు. ‘‘సింహా! ఒక తాను దానం చేయాలి అని అనుకున్నప్పుడు తాను చేయబోయే దానాన్ని తలచుకుని ఏ కొంచెమైనా బాధపడకూడదు. అలాగే దానం చేస్తూ... ఏదో చేస్తానని అన్నాను. చేయక తప్పడం లేదు’ అని బాధపడకూడదు. ఆ విధంగానే దానం చేశాక కూడా ‘‘దానం చేయాలని అనుకున్నాను సరే. కాని దానం చేసి ఉండకూడదు. చేసినా అంత చేసి ఉండకూడదు.’’ అని అప్పుడూ బాధపడకూడదు. ఇలా ఈ మూడు సమయాల్లో ఏ దాత బాధపడడో ఆ దాత దాన ఆనందాన్ని పొందుతాడు’’ అన్నాడు బుద్ధుడు. అప్పటికే బౌద్ధ ధర్మాన్ని వ్యాపింపజేయడం కోసం అనాథ పిండకుడు, మాత విశాఖ, మగధ రాజు బింబిసారుడు, కోసల రాజు ప్రసేనుడు... ఇంకా ఎందరో దాతలు పేరు పొందారు. వారందరి విషయం తెలిసిన సింహ సేనాపతి – ‘‘భంతే! దాన ఫలాన్ని ప్రత్యక్షంగా చూడ్డం సంభవమేనా?’’ అని అడిగాడు. ‘‘సింహా! ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకడు పిసినారి. శ్రద్ధలేని వాడు. మరొకరు దాత. శ్రద్ధ గలవాడు. వీరిద్దరిలో సాధారణ ప్రజలే కాదు, పండితులు, అరహంతలు ముందుగా ఎవరి దగ్గరకు వెళ్తారు?’’ ‘‘భగవాన్! దాత దగ్గరికే వెళ్తారు’’ ‘‘భిక్షువులు, మునులు, పండితులు, ధ్యానులు ముందుగా ఎవరి దగ్గర భిక్ష గ్రహిస్తారు’’ ‘‘శ్రద్ధగలవాడు, దానగుణం కలవాని దగ్గరే ముందుగా భిక్ష స్వీకరిస్తారు’’ ‘‘వారు ముందుగా ఎవరికి బోధిస్తారు?’’ ‘‘శ్రద్ధగల దాతకే భగవాన్’’ ‘‘బతికున్నప్పుడు, మరణించాక కూడా వీరిలో ఎవరు సత్కీర్తిని పొందుతారు?’’ ‘‘అలాంటి సత్కీర్తి దాతలు మాత్రమే పొందగలరు భగవాన్’’ ‘‘రాజు కొలువుకి, పండిత పరిషత్తుకి, ధర్మ సభలకి, ఏ పరిషత్తులకైనా వెళ్ళితే... ఎవరు గౌరవం పొందుతారు?’’ ‘‘భగవాన్! ఏ సభలకైనా వెళ్ళి గౌరవం పొందగలిగేది శ్రద్ధ గలవాడైన దాత మాత్రమే’’ అన్నాడు. ‘‘చూశావా సింహా! దాత పొందే సత్కీర్తి, గౌరవం దాన ఫలమే! దానఫలం ప్రత్యక్షంగా కనిపించే సత్యమే కదా!’’ అన్నాడు. ‘‘భగవాన్! ఇకపై దాన గుణాన్ని పెంపొందించుకుంటాను’’ అని శిరస్సు వంచి ప్రణమిల్లాడు సింహసేనాపతి. – డా. బొర్రా గోవర్ధన్ -
బౌద్ధ ధర్మ బోధనలు: తెలిసి చేసిన తప్పు!
ఒక ఆరామంలో చక్షుపాలుడు అనే భిక్షువు ఉండేవాడు. అతను వృద్ధుడు. పైగా అంధుడు. తెల్లవారు జామున బయటకు వచ్చి నడిచే సమయంలో అతని కాళ్ల కింద పడి కొన్ని కీటకాలు నలిగి చనిపోయాయి. భిక్షువు కాళ్ల కింద పడి కీటకాలు చనిపోవడం ఆ రోజుల్లో నేరంగా పరిగణించే వారు. కాబట్టి చక్షుపాలుణ్ణి తీసుకుని కొందరు భిక్షువులు బుద్ధుని దగ్గరకు వచ్చి– ‘భగవాన్! ఇతను ప్రతిరోజూ కీటకాల్ని చంపుతున్నాడు’ అని అభియోగం మోపారు. బుద్ధుడు విషయం తెలుసుకుని ‘‘భిక్షువులారా! ఇతనికి చూపు లేదు. కాబట్టి ఇతను చేసిన పని తెలిసి చేసింది కాదు. కాబట్టి నేరం కాదు. దానికి ఇతణ్ణి శిక్షించవలసిన పని గానీ నిందించవలసిన పని గానీ లేదు’’ అని చెప్పాడు. చక్షుపాలునితో ‘‘చక్షుపాలా! నీవు చేసింది నేరం కాకపోయినా జీవహింస జరిగింది. కాబట్టి అది తప్పు. నీవు మరింత జాగ్రత్త వహించు. ఆ తప్పు కూడా జరగకుండా చూసుకో’’ అన్నాడు. ఇంకా భిక్షువులు అక్కడే నిలబడి ఉన్నారు. అది గమనించిన బుద్ధుడు– ‘‘భిక్షులారా! మీకు ఒక కథ చెప్తాను వినండి– అంటూ ఇలా చెప్పాడు. పూర్వం ఒక పట్టణంలో ఒక నేత్ర వైద్యుడు ఉండేవాడు. అతడు మంచి వైద్యుడే గానీ, అనైతిక వాది. ఒక రోజు కట్టెలు కొట్టుకోవడానికి ఒక గ్రామీణ స్త్రీ అడవికి వెళ్ళింది. ఒక ఎండుపుల్ల ఆమె కంటికి తగిలింది. కన్ను ఎర్రబడింది. వాచింది. పట్టణంలోని వైద్యుని విషయం తెలిసి ఆయన దగ్గరకు వచ్చి– ‘‘అయ్యా! నేను పేదరాలిని! మీకు ధనం ఇచ్చుకోలేను. నా కన్ను బాగు చేయండి. అప్పటిదాకా మీ ఇంట్లో దాసి పని చేస్తాను’’ అని ప్రాధేయపడింది. వైద్యుడు ‘సరే’నన్నాడు. కన్ను పరీక్షించాడు. కంటికి ఎలాంటి నష్టం లేదని గ్రహించాడు. వైద్యం ప్రారంభించాడు. కంట్లో మందు వేశాడు. కొన్నాళ్లకి ఆమెకు చూపు మరింత తగ్గిపోయింది. కళ్లు కనిపించడం మానేశాయి. విషయం చెప్పింది. ‘‘చూపు వస్తుంది, భయపడకు’’ అన్నాడు. ‘‘అయ్యా! నాకు చూపు తెప్పించండి. నేను, నా బిడ్డా జీవితాంతం మీ ఇంట్లో దాసులుగా సేవ చేస్తాం’’ అని కాళ్లావేళ్ళా పడింది. వైద్యునికి కావలసింది అదే! కావాలనే ఆమెకు చూపు పోగొట్టాడు. ఇద్దరు సేవకులు దొరకడంతో ఆ ఒప్పందానికి ఒప్పుకున్నాడు. తిరిగి కంట్లో మందులు వేశాడు. ఆమెకి క్రమేపీ చూపు వచ్చింది. ఆమె వైద్యుని మోసం తెలుసుకుంది. కానీ బయట పడలేదు. నెమ్మదిగా గ్రామాధికారి వద్దకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పింది. ఆయన జరిగినదంతా తెలుసుకున్నాడు. ఆ తర్వాత వైద్యుడికి తగిన శిక్ష విధించాడు. ఈ కథలో వైద్యుడు కావాలనే, స్వార్థంతో ఆమె కళ్ళు పోగొట్టాడు. ఇది తెలియక చేసిన తప్పు కాదు. తెలిసి చేసిన మోసం. కాబట్టి వైద్యుడు చేసింది నేరం. అందుకు తగిన శిక్ష అనుభవించాడు. అని భిక్షువులకు చెప్పాడు బుద్ధుడు. అప్పుడు చక్షుపాలుడు చేసింది నేరం కాదని గ్రహించారు. భిక్షువులు ఇక ఆనాటి నుండి అన్ని పనుల్లో అతనికి సహాయపడుతూ, చిన్న చిన్న తప్పులు కూడా జరగకుండా చూశారు. – డా. బొర్రా గోవర్ధన్ -
భారత్ ఎప్పుడూ దండెత్తలేదు: మోదీ
న్యూఢిల్లీ: చరిత్రలో భారత్ ఎప్పుడూ ఇతర దేశాలపైకి దండెత్తలేదనీ, దురాక్రమణలకు పాల్పడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఢిల్లీలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. బుద్ధుని బోధనలు మానవత్వంపై ఆధారపడి ఉంటాయనీ, బౌద్ధం మన దేశంలో ఉద్భవించడం మనకు గర్వకారణమని అన్నారు. ‘జాతి, మత, కుల, భాషల మధ్య సమాజంలో తేడాలు బుద్ధుని బోధనలు కానే కావు. ఏ దేశం నుంచి ఎవరు భారత్‌కు వచ్చినా ఈ దేశం ఆదరిస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. -
శశి థరూర్‌కు చేదు అనుభవం
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ట్విటర్లో చేదు అనుభవం ఎదురైంది. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. గురువారం మహవీర్ జయంతి సందర్భంగా జైనులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బుద్దుని ఫొటో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆయన తప్పును ఎత్తిచూపారు. ‘థ్యాంకూ శశీ జీ.. కానీ మీరు మహవీర్ ఫొటోకు బదులు బుద్ధ భగవాన్ ఫొటో పెట్టారు’ అని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘జైనిజం, బుద్దిజం రెండు వేర్వేరు మతాలు’ అని మీకు తెలుసనుకుంటా అని మరొకరు చమత్కరించారు. ‘అందరూ మేధావిగా భావించే మీరు ఎంత పెద్ద పాపం ఎలా చేశారు. అయినా మనిషి అన్నాక తప్పు చేయడం సహజం మీరు కూడా మనిషేగా’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. దీనిని గమనించిన శశి థరూర్ తాను తప్పు చేయనని, చేసినా ఒప్పుకుంటానని, సాక్ష్యాలు కూడా దాచిపెట్టనని.. నిజాయితీగా ఉండటమే అన్నిటికన్నా ముఖ్యమని ట్వీట్ చేశారు. ఫొటో లింక్ షేర్ చేసి ‘నాలాగే చాలా మంది పొరపాటు చేసి ఉంటారు. నా కారణంగానైనా ఇది వెలుగులోకి వచ్చిందంటూ తన పొరపాటును సమర్థించుకున్నారు. అంతేకాకుండా ఈ పొరపాటు చేసిన వారందరినీ ట్యాగ్ చేస్తూ.. మహవీర్‌కు బదులు బుద్ధుని ఫొటోను పెట్టిన క్లబ్‌లోకి మీకు స్వాగతం’ అంటూ ట్వీట్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ కూడా థరూర్లాగే బుద్ధుని ఫొటో పోస్ట్ చేశారు. pic.twitter.com/DP6hT70AJh — Shashi Tharoor (@ShashiTharoor) March 29, 2018 -
కాంతుల కొండకు సేవల దండ
కొత్త కోణం బౌద్ధాన్ని వ్యాప్తి చేయడానికి అక్కడి సంస్కృతినీ, సాహిత్యాన్నీ, భాషనూ, సంగీతాన్నీ, సాధనాలుగా వాడుకోవాలే తప్ప బయటి సంస్కృతీ సంప్రదాయాలను భాషను స్థానిక ప్రజలపై రుద్దకూడదనేది ఆయన బలమైన అభిప్రాయం. స్థానిక సంస్కృతిని పరిరక్షిస్తూనే బుద్ధుని బోధనలను అక్కడి ప్రజల జీవితాల్లో భాగం చేయాలనేది కూడా మాస్టర్ సింగ్ యూన్ ప్రగాఢ విశ్వాసం. అందుకే ప్రతి విషయాన్నీ స్థానిక భాషల్లోకి అనువదించి బోధించాలనేది మాస్టర్ ఆదేశం. ‘ఫో గ్వాంగ్ షాన్’ ఇవి మూడు పదాలు. ‘మాస్టర్ సింగ్ యూన్’ అనేవి కూడా మూడు పదాలే. ఫో గ్వాంగ్ షాన్ అంటే చైనా భాషలో బౌద్ధకాంతి పర్వతం అని అర్థం. ఆ పర్వతం ఈ రోజు ప్రపంచమంతటికీ వెలుగులు విరజిమ్ముతోంది. అలనాడు బౌద్ధం పంచిన వెలుగును నేడు కూడా విశ్వవ్యాప్తం కావడానికి ఒకే ఒక్క వ్యక్తి కృషి, పట్టుదల కారణమవుతున్నాయంటే నమ్మశక్యం కాదేమో కానీ, అదే నిజం. ఆ వ్యక్తి మాస్టర్ సింగ్ యూన్. ఆయన వయస్సు ఇప్పుడు 90 ఏళ్లు. ఇప్పటికీ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 12వ తేదీన ఆయన జన్మదినం. వేలాది మంది బౌద్ధ భిక్షువులతో ఆ సందర్భంగా జరిగిన సమావేశం, అందులో దర్శనమిచ్చిన సంఘటిత శక్తి ఆయన కృషికి ప్రత్యక్ష నిదర్శనం. మాస్టర్ సింగ్ యూన్ 1927లో చైనాలోని చియాంగ్స్ రాష్ట్రంలోని చియాంక్తులో జన్మించారు. పన్నెండవ యేటనే బౌద్ధ భిక్షువుగా మారారు. ఆయన భిక్షువుగా మారిన తీరు కూడా ఆశ్చర్యకరమే. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన సమయమది. వ్యాపారం చేసిన ఆయన తండ్రి సమీపంలోని పట్టణానికి తరచూ వెళ్లి వస్తుండేవాడు. అలా వెళ్లిన తండ్రి ఒకరోజు తిరిగి రాలేదు. ఆయనను వెతుక్కుంటూ తల్లితో పాటు వెళ్లిన సింగ్ యూన్‌కు నిరాశే ఎదురయ్యింది. తిరిగి వస్తుండగానే ఒక బౌద్ధ భిక్షువు కనిపించి క్షేమ సమాచారాలు అడిగారు. నీవు భిక్షువుగా మారమని ఆయనే సూచించారు. దానికి యూన్ వెంటనే సరేనంటూ∙సమాధానం ఇచ్చినట్టు తన ప్రసంగాలలో పేర్కొంటూ ఉంటారు. కానీ తల్లి మాత్రం ‘భర్తను పోగొట్టుకున్నాను. నిన్ను కూడా పోగొట్టుకోలేను’ అని తేల్చి చెప్పింది. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేననీ, బౌద్ధ భిక్షువుగా మారతాననీ చెప్పి యూన్ వెళ్లిపోయారు. పదేళ్లు చైనాలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొంది, 1949లో బౌద్ధం వ్యాప్తి కోసం తైవాన్ ద్వీపానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులు మాస్టర్ సింగ్ యూన్‌ను కలవరపరిచాయి. ప్రజలు మూఢ నమ్మకాలతో, వ్యసనాలతో, ముఖ్యంగా నల్లమందు బానిసలుగా జీవనం గడుపుతున్నారు. అయితే సింగ్ యూన్ మొదటే అలాంటి వారితో బౌద్ధం గురించి ముచ్చటించకుండా సంగీతం, విద్యాబుద్ధులు నేర్పుతూ, ఇతర నైపుణ్యాలను అందిస్తూ చేరువయ్యారు. ఆయన మొదటిగా ఒక పత్రికను కూడా స్థాపించారు. బౌద్ధం అవసరాన్నీ, మనిషిగా జీవించడానికి కావలసిన విధానాన్నీ ఆ పత్రిక ద్వారా అందించారు. స్వయంగా చిత్రకారుడు కూడా కావడంతో ఆ ప్రాంతంలోని బాలలను సమీకరించి, మంచి జీవితాన్ని ఎలా కొనసాగించాలో చిత్రకళతో నేర్పారు. హ్యూమనిస్టిక్ బుద్ధిజం అదొక ప్రారంభం మాత్రమే. ఇక్కడే సింగ్ యూన్ నూతన ఒరవడికి పునాది వేశారు. తన ఆచరణ నుంచే కొత్త ఆలోచనలకు రూపకల్పన చేశారు. అప్పటివరకు భిక్షువులు ఆరామాలకు పరిమితమై సజీవమైన ఆలోచనలకూ, ఆచరణకూ దూరమయ్యారు. అటువంటి విధానానికి స్వస్తి పలికి, బౌద్ధం ఒక ఆదర్శవంతమైన జీవన విధానానికి మార్గదర్శకంగా ఉండేందుకు, ప్రజలందరికీ చేరువ కావడానికి కార్యక్రమం రూపొందించుకోవాలని యూన్ నిర్ణయించుకొన్నారు. దానినే ఆయన హ్యూమనిస్టిక్ బుద్ధిజం అని పేర్కొన్నారు. ఇది మూడు నాల్గు అంశాలను ప్రముఖంగా ముందుకు తీసుకొచ్చింది. అందులో ముఖ్యమైనవి– మనిషి కేంద్రంగా ధర్మం పనిచేయాలి, మనిషి అభివృద్ధిలో అది భాగం కావాలి, బుద్ధుని ఆలోచనలు నిత్యజీవితంలో ఆచరణ యోగ్యంగా ఉండాలి. బుద్ధుని అష్టాంగ మార్గం నుంచి మూడు విషయాలను విస్తృతంగా ప్రచారం చేశారు. ఒకటి మంచి ఆలోచన, మంచి మాటలు, మంచి చేతలు ఉండాలని ఉద్బోధించారాయన. ఆరామాలను కేవలం ధ్యానమందిరాలుగా, ప్రార్థనా స్థలాలుగా మిగల్చకుండా ప్రతీ చోటా బాలల కోసం విద్యాలయాలను నెలకొల్పి వాటితో అనుసంధానం చేశారు. చదువుతోపాటు నైపుణ్యాలను జోడించి జీవితాన్ని స్వతంత్రంగా, స్వేచ్ఛగా గడపడానికి కావాల్సిన పునాదులను వేశారు. అందులోనే మానవత్వాన్ని ముఖ్యమైన అంశంగా మాస్టర్ యూన్ ముందుకు తీసుకొచ్చారు. అనాథలు, వృద్ధులు, పేదలలో ఒక విశ్వాసాన్ని కలిగించడానికి కావలసిన కార్యక్రమాలను రూపొందించారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చే కేంద్రాలుగా బౌద్ధారామాలను మార్చారు. సాంస్కృతిక పరమైన చైతన్యాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసారు. ప్రతీ బౌద్ధారామంలో గ్రంథాలయం, పురావస్తు ప్రదర్శన శాలలతో పాటు ఆర్ట్ గ్యాలరీలను ఏర్పాటు చేశారు. చిన్నారుల నుంచి వృద్ధులదాకా బుద్ధుని బోధనలను చిత్రలేఖనంతో ప్రచారం చేసే నైపుణ్యాన్ని ఆర్ట్ గ్యాలరీల ద్వారా అందించారు. భిక్షువులే సమాజ సేవకులు భిక్షువులను తయారు చేసేందుకు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం బౌద్ధారామాలలో కొత్తదేమీ కాదు. కానీ, ఫో గ్వాంగ్ షాన్ కేంద్రాలు వీటికి మాత్రమే పరిమితం కాలేదు. బౌద్ధ భిక్షువులకు సామాజిక సేవాకార్యకర్తలుగా కూడా తర్ఫీదునిస్తున్నాయి. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు గానీ మరే ఇతర అవసరాల సమయంలోగానీ వీరంతా సామాజిక సేవలో భాగమవుతున్నారు. ప్రాథమిక, ఉన్నత విద్యలతో పాటు విశ్వవిద్యాలయం స్థాయి చదువులను కూడా ఈ సంస్థ అందిస్తున్నది. అందులో భాగంగానే తైవాన్‌లో రెండు, ఆస్ట్రేలియాలో, అమెరికాలో, ఆఫ్రికాలో కూడా ఒక్కొక్కటి చొప్పున విశ్వవిద్యాలయాలను స్థాపించి, నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు వేలాది మంది యువతీయువకులకు బౌద్ధ భిక్షువులుగా శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని ఒకవైపు కొనసాగిస్తూనే, రెండోవైపు కోట్లాదిగా ఉన్న బౌద్ధ అనుయాయులను సంఘటితపర్చడం కోసం ఒక సామాజిక సంస్థను ఏర్పాటు చేశారు. దానిపేరే ‘బుద్ధిస్టు లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్’(బిఎల్ఐఏ). 1992లో ప్రారంభమైన ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమితి గుర్తింపును కూడా పొందింది. కాలిఫోర్నియాలోని సిలాయీ బౌద్ధ విహారం దీని ప్రధాన కేంద్రం. ప్రపంచంలోని అన్ని దేశాల్లో దీనికి శాఖలున్నాయి. మన దేశంలో తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో దీని విభాగాలు పనిచేస్తున్నాయి. ఈ సంస్థ చాలా సేవా కార్యక్రమాలను చేపడుతున్నది. ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించడంతో పాటు అనేక పత్రికలను, టీవీ చానళ్లను, ప్రచురణలను ఈ సంస్థ నిర్వహిస్తున్నది. ఎన్నో ప్రాంతాల్లో సంచార గ్రంథాలయాలను నిర్వహిస్తున్నది. బౌద్ధంలో క్రియాశీలకంగా ఉన్న వారి కోసం ప్రత్యేకించి స్కౌట్స్, అండ్ గైడ్స్ సంస్థను కూడా ప్రారంభించారు. మరొక ముఖ్యమైన అంశం ఫో గ్వాంగ్ షాన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం. ఈ కార్యాలయం తైవాన్‌లోని కౌషియాంగ్ రాష్ట్రంలోనే దాష్ పట్టణం సమీపంలో ఒక కొండ మీద కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో నిర్మిం చారు. ఈ కేంద్ర కార్యాలయాన్ని మూడు భాగాలుగా విభజించారు. శాక్యముని గౌతమ బుద్ధుడు ప్రవచించిన బౌద్ధం, ధమ్మం, సంఘం అనే త్రిరత్నాలు దీనికి ప్రాతిపదిక. మొదట సంఘ విహారాన్ని నిర్మించాడు. ఇందులో బౌద్ధ భిక్షువులకు శిక్షణ మందిరాలు, విడిదిగదులతో పాటు దాదాపు పదివేల మంది ఒకేసారి సమావేశమయ్యేందుకు వీలుగా మందిరాలను నిర్మించారు. పదివేల బుద్ధ ప్రతిమలతో నిర్మించిన ఒక సమావేశ మందిరం అద్భుతం. నాగార్జునసాగర్‌లో నెలకొల్పబోతున్న బుద్ధవనం ప్రాజెక్టులో ఫో గ్వాంగ్ షాన్ తరహాలోనే ఒక సంస్థను రూపొందించే అంశాన్ని అధ్యయనం చేసేందుకు ఈ వ్యాసకర్త సహా ఒక బృందం ఇటీవల తైవాన్‌లో పర్యటించి వచ్చింది. బుద్ధ స్మారక కేంద్ర నిర్మాణం రెండవది.. దీని విస్తీర్ణం 250 ఎకరాలు. ఇందులో 150 అడుగుల బుద్ధుని విగ్రహంతో పాటు దాని అడుగు భాగాన ఒక మందిరంలో గౌతమ బుద్ధుని ధాతువు కూడా ఉంచారు. బుద్ధుని అష్టాంగమార్గానికి సంకేతంగా 8 పగోడాలను నిర్మించారు. చైనా ఆర్కిటెక్చర్లో పగోడా ఒక విధమైన కట్టడం. ఈ ఎనిమిది పగోడాలలో ఎనిమిది విషయాలకు సంబంధించిన అంశాలను పొందుపర్చారు. ఒకటి బోధనకు. రెండవది సమావేశం. మూడవది మూడు మంచి విషయాలు, మంచి ఆలోచన, మంచి మాటలు, మంచి చేతలు, నాల్గవది ఇతరులకు విశ్వాసాన్నీ, సంతోషాన్నీ, భరోసాను ఆదరణను అందించేది, ఐదవది సామరస్యం, ఆరు పరిపూర్ణత, ఏడు చెడును దరిచేరనీయక పోవడం, ఎనిమిది అష్టాంగమార్గాన్ని బోధించేందుకు సంకేతాలుగా నిర్మించారు. ఫో గ్వాంగ్ షాన్‌లోని మూడవ భాగాన్ని ధమ్మ సంకేతంగా ఒక భవనాన్ని ఇటీవలే నిర్మించారు. ఇందులో ప్రధానంగా ధ్యాన మందిరం, గ్రంథాలయం, ఆర్ట్ గ్యాలరీ లాంటివి నిర్మిస్తున్నారు. భారతదేశమంటే గౌరవం ఇప్పటికీ ప్రపంచంలోని దాదాపు 200 కేంద్రాల్లో ఈ సంస్థ తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నది. తైవాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకు శాక్యముని బుద్ధగా వారు పిలుచుకుంటున్న గౌతమ బుద్ధుని జన్మస్థలం భారత దేశ మంటే వారికి ఎనలేని గౌరవం. ఫో గ్వాంగ్ షాన్ సంస్థ బౌద్ధంలోని మహా యాన మార్గాన్ని అనుసరిస్తున్నది. ఆచార్య నాగార్జునుడు వ్యవస్థాపకుడుగా రూపొందిన మహాయానం వారికి అత్యంత పవిత్రమైనది. మహాయానం ఆవిర్భవించిన తెలుగునేల అంటే కూడా వారికి అభిమానం. ఈ సంస్థ మహా యాన మార్గాన్ని విశ్వసిస్తున్నప్పటికీ బౌద్ధంలోని అన్ని శాఖలను సమాన స్థాయిలోనే గౌరవిస్తున్నది. అంతేకాకుండా ప్రపంచంలోని ప్రధాన మతాలపట్ల సంస్థ స్నేహభావంతో వ్యవహరిస్తున్నది. ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజున సర్వమత సమ్మేళనాలు నిర్వహించడం వీరి ప్రత్యేకత. ఈ సంస్థ వ్యవస్థాపకుడు మాస్టర్ సింగ్ యూన్ ప్రతిపాదించిన మరొక ముఖ్యమైన అంశం స్థానిక సంస్కృతి పరిరక్షణ. బౌద్ధాన్ని వ్యాప్తి చేయడానికి అక్కడి సంస్కృతినీ, సాహిత్యాన్నీ, భాషనూ, సంగీతాన్నీ, సాధనాలుగా వాడుకోవాలే తప్ప బయటి సంస్కృతీ సంప్రదాయాలను భాషను స్థానిక ప్రజలపై రుద్దకూడదనేది ఆయన బలమైన అభిప్రాయం. స్థానిక సంస్కృతిని పరిరక్షిస్తూనే బుద్ధుని బోధనలను అక్కడి ప్రజల జీవితాల్లో భాగం చేయాలనేది కూడా మాస్టర్ సింగ్ యూన్ ప్రగాఢ విశ్వాసం. అందుకే ప్రతి విషయాన్నీ స్థానిక భాషల్లోకి అనువదించి బోధించాలనేది మాస్టర్ ఆదేశం. బ్రెజిల్ నుంచి ఇండియా దాకా ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఈ సంస్థ బౌద్ధాన్ని అక్కడి స్థానిక పరిస్థితులకు జోడించి అన్వయించి ప్రబోధిస్తున్నది. వ్యాప్తి చేస్తున్నది. ఫో గ్వాంగ్ షాన్ చేస్తున్న కృషి బౌద్ధాన్ని మరోసారి ప్రపంచవ్యాప్తం చేసే బౌద్ధ కాంతి శిఖరంగా వెలుగొందుతుంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మల్లెపల్లి లక్ష్మయ్య 97055 66213 -
బౌద్ధంలోకి 300 మంది హిందువులు
బౌద్ధుల పుణ్యక్షేత్రమైన బుద్ధగయలో సుమారు 300 మంది వెనుకబడిన కులాలకు చెందిన హిందువులు బౌద్ధమతం స్వీకరించారు. కుల వివక్ష, అంటరానితనం వదిలించుకోవడం కోసమే తాము బౌద్ధమతంలో చేరినట్లు మతమార్పిడి చేసుకున్నవారు తెలిపారు. బీహార్ లోని ఔరంగాబాద్, జహనాబాద్ జిల్లాలతోపాటు, మహరాష్ట్ర లోని నాగ్ పూర్, సతారా నగరాలనుంచి, మధ్యప్రదేశ్ జబల్ పూర్, రేవా నుంచి వచ్చిన వారంతా బౌద్ధంలో చేరినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మయన్మార్ కు చెందిన బౌద్ధ సన్యాసి చంద్రముని, బుద్ధ గయలోని బర్మా విహార్ ఆశ్రమంలో జరిగిన దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించిన బాబా సాహెబ్ అంబేద్కర్ మిషన్... ఈ హిందువుల మతమార్పిడి కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించినట్లు అధికారులు చెప్తున్నారు.