
మనుషులకు ఉండవలసిన పది మానవీయ లక్షణాలలో దానగుణం మొదటిది అంటుంది బౌద్ధం. ఎందుకంటే దానం అంటే త్యాగం కాబట్టి. తన సంపదని, తన శ్రమని త్యాగం చేయడమే కాబట్టి. వ్యక్తుల కష్టాలు తీర్చడానికి దానం ఉపయోగపడుతుంది. కన్నీరూ తుడుస్తుంది. ‘వ్యక్తుల కంటే ధర్మం కోసం కృషి చేసే సంఘానికి దానం చేయడం మరింత మేలు’ అంటాడు బుద్ధుడు.
ఒకడు వైశాలి నగర సమీపంలోని మహావనం లో కూటాగార శాలలో బుద్ధుడు ఉన్నాడు. అప్పుడు వైశాలికి చెందిన లిచ్ఛవీ గణరాజు కుమారుడైన సింహసేనాపతి బుద్ధుని దగ్గరకు వచ్చాడు. సింహుడు తీర్థంకర మత అభిమాని. అయినా అతనిలో రేగే అనేక సందేహాల్ని తీర్చుకోవడానికి బుద్ధుని దగ్గరికే వచ్చేవాడు. ఆ రోజు... వచ్చి బుద్ధునికి నమస్కరించి ఒక పక్కన కూర్చొన్నాడు. బుద్ధుడు అతని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత సింహసేనాపతి అంజలి ఘటిస్తూ–
‘‘భగవాన్! మీరు అనేకమార్లు దాన విశిష్టత గురించి చెప్పారు. ఏ దాత తాను చేసిన దానానికి ఆనందం పొందగలడు?’’ అని అడిగాడు. ‘‘సింహా! ఒక తాను దానం చేయాలి అని అనుకున్నప్పుడు తాను చేయబోయే దానాన్ని తలచుకుని ఏ కొంచెమైనా బాధపడకూడదు. అలాగే దానం చేస్తూ... ఏదో చేస్తానని అన్నాను. చేయక తప్పడం లేదు’ అని బాధపడకూడదు. ఆ విధంగానే దానం చేశాక కూడా ‘‘దానం చేయాలని అనుకున్నాను సరే. కాని దానం చేసి ఉండకూడదు. చేసినా అంత చేసి ఉండకూడదు.’’ అని అప్పుడూ బాధపడకూడదు. ఇలా ఈ మూడు సమయాల్లో ఏ దాత బాధపడడో ఆ దాత దాన ఆనందాన్ని పొందుతాడు’’ అన్నాడు బుద్ధుడు.
అప్పటికే బౌద్ధ ధర్మాన్ని వ్యాపింపజేయడం కోసం అనాథ పిండకుడు, మాత విశాఖ, మగధ రాజు బింబిసారుడు, కోసల రాజు ప్రసేనుడు... ఇంకా ఎందరో దాతలు పేరు పొందారు. వారందరి విషయం తెలిసిన సింహ సేనాపతి – ‘‘భంతే! దాన ఫలాన్ని ప్రత్యక్షంగా చూడ్డం సంభవమేనా?’’ అని అడిగాడు. ‘‘సింహా! ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకడు పిసినారి. శ్రద్ధలేని వాడు. మరొకరు దాత. శ్రద్ధ గలవాడు. వీరిద్దరిలో సాధారణ ప్రజలే కాదు, పండితులు, అరహంతలు ముందుగా ఎవరి దగ్గరకు వెళ్తారు?’’
‘‘భగవాన్! దాత దగ్గరికే వెళ్తారు’’ ‘‘భిక్షువులు, మునులు, పండితులు, ధ్యానులు ముందుగా ఎవరి దగ్గర భిక్ష గ్రహిస్తారు’’
‘‘శ్రద్ధగలవాడు, దానగుణం కలవాని దగ్గరే ముందుగా భిక్ష స్వీకరిస్తారు’’
‘‘వారు ముందుగా ఎవరికి బోధిస్తారు?’’
‘‘శ్రద్ధగల దాతకే భగవాన్’’
‘‘బతికున్నప్పుడు, మరణించాక కూడా వీరిలో ఎవరు సత్కీర్తిని పొందుతారు?’’
‘‘అలాంటి సత్కీర్తి దాతలు మాత్రమే పొందగలరు భగవాన్’’
‘‘రాజు కొలువుకి, పండిత పరిషత్తుకి, ధర్మ సభలకి, ఏ పరిషత్తులకైనా వెళ్ళితే... ఎవరు గౌరవం పొందుతారు?’’
‘‘భగవాన్! ఏ సభలకైనా వెళ్ళి గౌరవం పొందగలిగేది శ్రద్ధ గలవాడైన దాత మాత్రమే’’ అన్నాడు.
‘‘చూశావా సింహా! దాత పొందే సత్కీర్తి, గౌరవం దాన ఫలమే! దానఫలం ప్రత్యక్షంగా కనిపించే సత్యమే కదా!’’ అన్నాడు.
‘‘భగవాన్! ఇకపై దాన గుణాన్ని పెంపొందించుకుంటాను’’ అని శిరస్సు వంచి ప్రణమిల్లాడు సింహసేనాపతి.
– డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment