Borra Goverdhan
-
ధర్మయోధుడు: ‘‘నాయనా! మాకు నీవు ఒక్కడివే కుమారుడవి.. పైగా..
అది కురుదేశం. దాని రాజధాని నగరం స్థూలకోష్ఠికం. ఆ నగరంలో ధనవంతుడైన పండితుని కుమారుడు రాష్ట్రపాలుడు. రాష్ట్రపాలునికి యుక్తవయస్సు దాటింది. అతనికి గృహజీవితం పట్ల అంతగా ఇష్టం ఉండేది కాదు. సన్యసించాలని, జ్ఞానం పొందాలని అనుకునేవాడు. ఒకరోజు బుద్ధుడు తన బౌద్ధసంఘంతో కలసి నగరానికి వచ్చాడు. తన మిత్రునితో కలిసి వెళ్ళి, బుద్ధుని ధర్మోపదేశం విన్నాడు రాష్ట్రపాలుడు. తానూ బౌద్ధ భిక్షువుగా మారాలి అనుకున్నాడు. బుద్ధుని దగ్గరకు వెళ్ళి నమస్కరించి, విషయం చెప్పాడు.‘‘రాష్ట్రపాలా! నీవు కుర్రవాడివి. నీ తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే నీకు భిక్షు దీక్ష ఇస్తాను’’ అన్నాడు బుద్ధుడు. రాష్ట్రపాలుడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల్ని అడిగాడు. వారు–‘‘నాయనా! మాకు నీవు ఒక్కడివే కుమారుడవి. పైగా మా కోట్లాది ధనానికీ నీవే వారసుడివి. నిన్ను వదిలి మేం బతకలేం. కాబట్టి భిక్షువుగా మారడానికి అనుమతించలేం’’ అని తేల్చి చెప్పారు. రాష్ట్రపాలుడు రెండుమూడు రోజులు వారిని ప్రాధేయపడ్డాడు. చివరికి తన గదిలోకి చేరి, నిరాహార వ్రతం పూనాడు. వారం గడిచింది. రాష్ట్రపాలుడు నీరసించి పడిపోయాడు. తల్లిదండ్రులు భయపడ్డారు. భోరున విలపించారు. అప్పుడు రాష్ట్రపాలుని మిత్రున్ని పిలిపించారు. అతను చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఆ మిత్రుడు– తల్లిదండ్రులతో..‘‘మీరు అంగీకరించడమే మంచిది. కనీసం ఎక్కడో ఒకచోట బతికి ఉంటాడు. అయినా కొందరు కొంతకాలమే భిక్షు జీవనం సాగించి, ఇక సాగించలేక తిరిగి ఇంటిదారి పడుతున్నారు. మన వాడూ అదే చేయవచ్చు ’’ అని చెప్పడంతో ఏదో ఒక మూల ఆశతో తల్లిదండ్రులు అనుమతించారు.మహా ఐశ్వర్యాన్ని వదిలి రాష్ట్రపాలుడు భిక్షువుగా మారాడు. కొన్నాళ్ళు గడిచాయి. కొడుకు తిరిగిరాలేదు. దానితో బుద్ధుని పట్ల, భిక్షువుల పట్ల చాలా కోపాన్ని పెంచుకున్నాడు రాష్ట్రపాలుడి తండ్రి. ఒకరోజు కాషాయ బట్టలు కట్టుకుని, బోడిగుండుతో, భిక్షాపాత్ర పట్టుకుని ఒక భిక్షువు వారింటికి వచ్చాడు. పెరట్లో ఉన్న తండ్రికి వళ్ళు మండిపోయింది. ‘‘భిక్షా లేదు, గంజీ లేదు. పో..పో’’ అంటూ తిట్టాడు. ఇంట్లోకి వెళ్ళిపోయాడు. భిక్షువు చిరునవ్వుతో అక్కడి నుండి కదిలాడు. అంతలో ఇంటిలోని దాసి పాచిన గంజి పారబోయడానికి బయటకు తెచ్చింది. భిక్షువు ఆగి... ‘‘అమ్మా! ఆ గంజి అయినా భిక్షగా వేయండి’’ అన్నాడు.ఆమె ఆ పాచిన గంజిని భిక్షాపాత్రలో పోస్తూ ఆ భిక్షువుకేసి తేరిపార చూసింది.ఆమె ఒళ్ళు జలదరించింది. నేల కంపించింది. నేలమీద పడి నమస్కరించింది. లేచి పరుగు పరుగున ఇంట్లోకి పోయింది.‘‘అయ్యా! ఆ వచ్చిన భిక్షువు మరెవరో కాదు. మన అబ్బాయి గారే’’ అంది. ఆ మాట విని తల్లిదండ్రులు శోకిస్తూ వీధుల్లోకి వచ్చిపడ్డారు. అక్కడ భిక్షువు కనిపించలేదు. వెతుకుతూ వెళ్లారు. ఆ వీధి చివరనున్న తోటలో కూర్చొని ఆ పాచిన భిక్షను పరమాన్నంగా స్వీకరిస్తున్నాడు రాష్ట్రపాలుడు. ‘‘నాయనా! మేము గమనించలేదు. రా! మన ఇంటికి రా! మంచి భోజనం వడ్డిస్తాం’’ అన్నారు. ‘‘గృహస్తులారా! ఈ రోజుకి నా భోజనం ముగిసింది’’ అన్నాడు. మరునాడు రమ్మన్నారు. అంగీకరించాడు. వెళ్ళాడు. ఉన్నతమైన ఆసనంపై బంగారు గిన్నెల్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలు ముందు ఉంచారు. కొన్ని పళ్ళాల నిండా రత్నరాశులు, వజ్రవైడూర్యాలు నింపి ఆ గదిలో ఉంచారు.‘‘నాయనా! మనకి ఏం తక్కువ! ఈ పళ్ళాల్లో కాదు, గదుల నిండా ఇలాంటి ధనరాశి ఉంది. ఇవన్నీ నీకే... రా! ఆ భిక్ష జీవనం వదులు’’ అన్నారు.‘‘మీరు ఆ ధనరాశుల్ని బండ్లకెత్తించి గంగానదిలో కుమ్మరించండి. లేదా... దానం చేయండి. నాకు జ్ఞాన సంపద కావాలి. ధర్మ సంపద కావాలి. శీలసంపద కావాలి. అది తరగని సంపద. అది తథాగతుని దగ్గర తరగనంత ఉంది. మీరూ ఆ ధర్మ మార్గాన్నే నడవండి. మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి’’ అని లేచి వెళ్లిపోయాడు రాష్ట్రపాలుడు. – డా. బొర్రా గోవర్ధన్ -
బౌద్ధవాణి: ఆమెకు గుండె ఆగినంత పని అయింది..
ఆ ఇంట్లో ఇల్లాలు వంటచేస్తూ అందులో నిమగ్నమై పోయింది. ఆ రోజు భిక్షు సంఘాన్ని భిక్ష కోసం ఆహ్వానించారు ఆ గృహస్తులు. ఆమెకు ఒక నెలల బిడ్డ. ఆ బిడ్డడిని ఇంటిముందు దుప్పటి మీద పడుకోబెట్టారు. ఇద్దరు పిల్లలు ఆడిస్తున్నారు. ఆ పసివాడు వెల్లకిలా పడుకుని, కాళ్ళూ చేతులూ ఆడిస్తూ బోసినవ్వులు చిందిస్తున్నాడు.ఆమె వంటగదిలోంచి అప్పుడప్పుడూ ఆ పిల్లలకేసి చూస్తూనే ఉంది. కొంత సమయం గడిచింది. ఇంటి యజమాని కావడితో మంచినీరు తెచ్చి ఇంట్లో విశాలమైన మధ్య గదిలో ఉంచాడు. ఆరుబయట ఆడుకుంటున్న పిల్లల్లో ఒకడు పెద్దగా అరిచాడు.‘‘అమ్మా! భిక్షువులు వస్తున్నారు’’ అంటూ ఆ వీధి చాలా ΄÷డవైంది. ఆ వీధిలోకి అప్పుడే వచ్చారు భిక్షుగణం. భిక్షగా సమర్పించే ఆహార పదార్థాలన్నీ పూర్తయ్యాయి. వాటిని గిన్నెల్లోకి సర్దుతోంది. ఇంతలో బయట ఏదో శబ్దం వినపడింది. కోడె దూడ ఒకటి చెంగుచెంగున ఎగురుతూ, తోక ఎత్తి అటుకేసి వచ్చింది. పసి పిల్లవాణ్ణి అక్కడే ఉంచి, మిగిలిన ఇద్దరు పిల్లలూ ఇంట్లోకి పరుగు తీశారు. ఇల్లాలికి విషయం అర్థమై, వేగంగా బైటికి పరుగు తీసింది.కానీ... అప్పటికే ఆ గిత్తదూడ వచ్చేసింది. ఆరుబయట పడుకున్న పిల్లవాడి మీదగా దూకి వెళ్ళిపోయింది. ఆమెకు గుండె ఆగినంత పని అయింది. ఆమె వెళ్ళేసరికి... చిరునవ్వులు చిందిస్తూ బోసి నోటితో ఊ కొడుతున్నాడు ఆ బిడ్డ. కొంతసేపటికి భిక్షువులు వచ్చారు. వారు భిక్ష పూర్తి చేశాక ధర్మోపదేశం చేశారు. అప్పుడు వారికి ప్రమాదం తప్పిన పిల్లవాని గురించి తెలిసింది.‘‘చేశారా! ఆ బాలుడు స్థిరచిత్తుడు. స్థిత ప్రజ్ఞుడు. చావు ముందుకొస్తున్నా చిరునవ్వు చెదరనివాడు’’ అన్నాడు ఆ భిక్షువు. ‘‘అవును. కుశల సంపన్నుడు అజేయుడు’’ అన్నాడు మరో భిక్షువు. పాపకర్మలు చేయనివాడు, మోసపు మాటలు ఎరుగని వాడు, పాప సంకల్పాలు తెలియని వాడు. అందుకే స్థిరచిత్తుడు’’ అన్నాడు మొదటి భిక్షువు. వారు అలా వాద సంవాదాలు చేసుకుంటూ ఆరామానికి చేరారు. అక్కడా ఇదే సంఘటన చెప్పి, అదే చర్చ కొనసాగించారు. అలా చర్చించే వారంతా కొత్తగా వచ్చిన వారే. వారి మధ్య మాటలు జరుగుతూ ఉండగా బుద్ధుడు అక్కడికి వచ్చాడు. భిక్షువులందరూ నిశ్శబ్దం పాటించారు. ‘‘భిక్షువులారా! ఇపుడు మీరు వాదులాడుకుంటున్న విషయం ఏమిటి?’ అని అడిగాడు. విషయమంతా తెలుసుకున్నాడు.‘‘భిక్షువులారా! శరీరంతో పాప కర్మలు చేయని వారు, పాపపు మాటలు మాట్లాడనివారు, పాప సంకల్పాలు చేయని వారు, పాప జీవనం కొనసాగించనివారు ఈ నాలుగు ధర్మాల్ని పాటించేవారు కుశల సంపన్నులే. అజేయులే! అత్యున్నత స్థితిని పొందినవారే! అయితే పసివారు ఇవేవీ చేయరు కాబట్టి వారు అజేయులు కారు. ఎందుకంటే.... వారు వెల్లకిలా పడుకుని మాత్రమే ఉండగలరు. వారు తమ శరీరంతో ఏ కర్మలూ చేయలేరు. వారికి నోరుంటుంది.నవ్వు, ఏడుపులు ఉంటాయి తప్ప, తప్పు ఒప్పులు మాట్లాడలేరు. అంటే... మాటల ద్వారా కర్మలాచరించలేరు. అలాగే... అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అనే ఆలోచనలు వారికి ఉండవు. కాబట్టి సంకల్పాలూ ఉండవు. ఇక, తాను అది తినాలి ఇది తినాలిఅని ఎలా ఉండదో... ఆ తిండిని ఏదో ఒక మార్గంలో, మంచిగానో చెడుగానో సంపాదించి తినాలి అనే కోరికా ఉండదు. తల్లిపాలు తాగడం తప్ప... మరే విధమైన జీవన కర్మలు చేయరు. పసిపిల్లవాణ్ణి కర్మలతో కొలవకూడదు.పెరిగి పెద్దయ్యాక కలిగే అనేక వికారాల నుండి, దోషాల నుండి, స్వార్థాల నుండి బైటపడిన వారినే కుశల సంపన్నులుగా, అజేయునిగా భావించాలి. అలాంటి నిస్వార్థ జీవనాన్ని కీర్తించాలి. అ నాలుగు ధర్మాల్ని ధరించిన వారికి అపజయం కలగదు. ప్రమాదం వచ్చి మీద పడుతున్నా చిరునవ్వు చెరగదు.’’ అన్నాడు. పాపకర్మలు చేసే అవకాశం ఉన్నా చేయని వారు పాపపు జీవన విధానం ఎదుటే ఉన్నా దాన్ని స్వీకరించని వారు... ఇలాంటి వారు మాత్రమే అజేయులు. ఎందుకంటే వారు తమని తాము జయించుకుంటారు కాబట్టి అనే విషయం వారికి అర్థమైంది. ఆ కొత్త భిక్షువులు బుద్ధునికి ప్రణమిల్లారు. – డా. బొర్రా గోవర్ధన్ -
'సమ్యక్ దర్శనం' వల్లే సత్యాన్ని తెలుసుకోగలం!
మగధ రాజ్య రాజధాని రాజగృహ సమీపంలోని పక్షి పర్వతం. ఆ పర్వతం చివర విశాలమైన చదును భాగం. ఒకపక్క పెద్ద పెద్ద కొండరాళ్ళు. ఆ రాళ్ళ సందులో చిన్న గుహ. అది చల్లగా విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చదును భాగం చుట్టూ పనస చెట్లు దట్టంగా ఉన్నాయి. ఒకరోజు బుద్ధుడు సాయంత్రం వేళ ఆ గుహ ముందున్న రాతిమీద కూర్చొని ఉన్నాడు. ఆ సమయానికి వచ్చాడు దీర్ఘనఖుడు అనే సన్యాసి. అతను అగ్ని ఆరాధకుడు. దీర్ఘనఖుడు వచ్చి, వంగి బుద్ధునికి నమస్కరించాడు. ఒక పక్కన నిలబడ్డాడు. ఆ రోజుల్లో కొందరు తాపసులు ‘‘మీరు చెప్పేది ఏదీ నాకు సమ్మతం కాదు. దేన్నీ నేను ఒప్పుకోను’’ అనేవారు. ఏ విషయాన్ని చెప్పినా, దాన్ని ఏదో ఒక విధంగా విమర్శించేవారు. తప్పులు వెదికేవారు. అంగీకరించేవారు కాదు. ఇంకొందరున్నారు. వారు ప్రతిదాన్నీ అంగీకరించేవారు. ఆయా విషయాలపై వాదవివాదాలు చేసేవారు కాదు. ‘అలాగే... ‘అవునవును’ అంటూ తలలూపేవారు. ఇక మూడోరకం ఉన్నారు. వారు ‘‘మాకు కొంత సమ్మతం కాదు’’ అనేవారు. దీర్ఘనఖుడు ఇందులో మొదటి రకం వాడు. ‘‘ఏదీ నాకు సమ్మతం కాదు’’ అనేవాడు. ఆరోజు ఇదే విషయం గురించి చర్చించుకుంటూ.... ‘‘దీర్ఘనఖా! ఏదీ నాకు సమ్మతం కాదు’ అనేదైనా నీకు సమ్మతమేనా?’’ అని అడిగాడు. ‘‘గౌతమా! అది మాత్రం నాకు సమ్మతమే’’ అన్నాడు. బుద్ధుడు అతని వైపు తదేకంగా చూశాడు. బుద్ధుని ప్రశాంత దృక్కులు తనని ఏదో ప్రశ్నిస్తున్నట్లు గమనించాడు. అప్పుడు బుద్ధుడు– ‘‘ఏదీ సమ్మతం కాదు... అనేవారి దృష్టి రాగరహితంగా ఉంటుంది. దేనితో కలవకుండా ఉంటుంది. ΄÷గడ్తలకు, ప్రతి దాన్నీ పొందాలనే భావనకూ దూరంగా ఉంటుంది. దేనినీ పట్టుకుని వేళ్ళాడదు!’’ అన్నాడు. ‘‘గౌతమా! మంచిది. మీరు నా దృష్టి కోణాన్ని మెచ్చుకుంటున్నారన్నమాట’’ అన్నాడు. ‘‘దీర్ఘనఖా! ఇంకా విను. ‘అంతా సమ్మతమే అనేవారు దీనికి భిన్నంగా ఉంటారు. వారి దృష్టి రాగంతో ఉంటుంది. ప్రతి దానితో కలసి΄ోతుంది. ΄÷గడ్తలను కోరుకుంటుంది. ప్రతి దాన్నీ పొందాలి అనుకుంటుంది. ఇక మూడోరకంవారి దృష్టి ఈ రెండు రకాలనూ కలగలుపుకుని ఉంటుంది. విశేషం ఏమిటంటే.. ఈ మూడు రకాల వారిలో ప్రతి ఒక్కరూ తమ దృష్ఠే సరైనదనుకుంటారు. ఇతరుల్ని విమర్శిస్తారు. వ్యతిరేకిస్తారు. తమ అనుభవంలో... తాము అనుకునేదానికి భిన్నమైన ఫలితం చూసినా, గ్రహించినా గానీ,,, వీరు మారరు. మూర్ఖంగా తాను అనుకున్నదే సత్యం అనుకుంటారు. సర్వం అదే అని నిర్ణయించుకుంటారు. మిగిలినదంతా మిధ్యే అని భావిస్తారు. దీని వల్ల ప్రజ్ఞని (ఎరుకను) కోల్పోతారు. సత్యాన్ని ఆవిష్కరించలేరు’’ అని చెప్పాడు. బుద్ధుడు అలా మూడురకాల దృష్టి గలవారి గురించి చెప్పాక, తన తప్పు ఏమిటో దీర్ఘనఖునికి అర్థమైంది. ద్వేషం, క్రోధాలు ఎలా సత్యాన్ని తెలుసుకోడానికి అవరోధాలలో... రాగం మోహం కోరికలు కూడా అలాంటి అవరోధాలే అని గ్రహించాడు. ఇవి తొలగించుకుని సమ్యక్ దర్శనం వల్లనే సత్యాన్ని సత్యంగా.. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలం అని అర్థం చేసుకున్నాడు. మనస్సుని మాలిన్య రహితం చేసుకోవడం వల్ల సమ్యక్ దృష్టి కలుగుతుందని గ్రహించి... వినమ్రంగా బుద్ధుని పాదాలంటి నమస్కరించాడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: గంగే మాం పాహి! -
ఆంతరంగిక శుద్ధి
మనిషికి బాహ్య అంగాల శుద్ధి కంటే ఆంతరంగిక శుద్ధి అవసరం అంటుంది బౌద్ధం. ఈ మనోశుద్ధి వల్ల మనస్సు మలిన రహితం అవుతుంది. తేటదనం ఉట్టిపడుతుంది. శారీరక శుద్ధి కంటే మనోశుద్ధే మేలు. మనో వాక్కాయ కర్మల్లో మనో శుద్ధి ఉంటే వాక్కులూ చేసే పనులూ, వాటంతట అవే శుద్ధి అయిపోతాయి. అందుకే అన్నింటికీ అగ్రగామి మనసే’’ అంటుంది ధమ్మపదం. ఎంత విన్నా, ఎంత చదివినా హీనబుద్ధి గలవాడు తమగుణం మానలేడు అంటారు. దేహాన్ని ఎంత శుద్ధిగా ఉంచుకున్నా అవగుణం ఉన్నవాడికి ఒక్కసారి కాకపోతే ఎప్పుడో ఒక్కసారైనా దేహశుద్ధి తప్పదు. మనోశుద్ధి ఉంటే వారు మణిలా జీవితాంతం రాణిస్తారు. కానీ శారీరక శుద్ధి వల్ల పాపాలు పోయి పుణ్యం వచ్చిపడుతుంది అని నమ్మే పండితుడు చివాట్లు తిన్న కథ ఇది. మగధ దేశంలో మల్లిక అనే ఒక దాసి ఉండేది. ఆమె ఎంతో అందగత్తె. నిండు యవ్వనంలో ఉన్నా నిలకడ గల మగువ. ఒకరోజు తెల్లవారు జామునే నీటికోసం నదికి పోయింది. మంచు పట్టి ఉంది. చలి వణికిస్తోంది. ఆమె నదీతీరం చేరి అక్కడ నదిలోకి కట్టి ఉన్న మెట్ల మీద నుండి దిగింది. అప్పటికే అక్కడ ఒక పండితుడు నీటిలో స్నానం చేస్తూ ఉన్నాడు. బుడింగిన మునిగి పైకి లేచాడు. ఎదురుగా మల్లిక కనిపించింది. ఆమె అప్పటికే నీరు ముంచుకుని కడవ నడుమున పెట్టింది. ఆ క్షణంలో ఆమె అందాన్ని, వయ్యారాన్ని చూసి, పండితుని మనస్సు చలించింది. అలాగే నిలబడి చలికి వణుకుతూ ఆమె వంకే చూస్తుండిపోయాడు. అతని వాలకం మల్లిక పసిగట్టి– ‘‘అయ్యా నేను దాసిని. ఈ తెల్లవారు వేళ నీటికోసం ఈ నదికి రాక తప్పదు. చలి బాధను భరించకా తప్పదు. కానీ, మీరు దాసులు కారే? తమరెందుకు ఈ వేళ ఇక్కడికి వచ్చారు? ఈ నీట్లో దిగి ఇలా వడ వడ వణికిపోతున్నారు?’’ అని అడిగింది. ‘‘మల్లీ! నీకు ఆమాత్రం తెలియదా? ఈ జలం పవిత్రమైనది. దీనిలో స్నానం చేస్తే ఎప్పటి పాపాలు అప్పుడు కొట్టుకుపోతాయి. ఈ నీట్లో దిగి మూడు మునకలు వేస్తే సరి. చేసిన దోషాలన్నీ హరించుకుపోయి, పుణ్యం పోగుపడుతుంది. ఆ మాత్రం తెలియని అజ్ఞానివి’’ అంటూ మునిగి లేచాడు. మల్లిక నడుమున ఉన్న నీటి కడవను సరిచేసుకుని – ‘‘అయ్యా! నిజమా! నీటిలో మునిగితేనే పాపాలు హరించుకుపోతాయా?’’ అంది అమాయకంగా! ‘‘అవును మల్లికా! ఇది శాస్త్రం’’ అన్నాడు. ‘‘అయితే స్వామీ! మీ కంటే ఎప్పుడూ ఈ నీటిలోనే ఉండే కప్పలు, చేపలు, పీతలు, జలగలు ఎంతో పుణ్యశాలురన్నమాట. మూడు మునకలకే మీకు పుణ్యం పోగుపడితే.. నిరంతరం మునకలేసే అవి ఎంతటి పుణ్యాన్ని పోగుపెట్టుకుని ఉంటాయి? అవును లెండీ, మీకంటే కప్పలే గొప్ప’’ అంటూ నవ్వుతూ మెట్లెక్కి వెళ్ళిపోయింది. తనకు చిత్తశుద్ధి లేదని తెలియ చెప్పడానికే మల్లి అలా వ్యంగ్యంగా మాట్లాడిందని పండితుడు గ్రహించాడు. శారీరక శుద్ధి కంటే ఆంతరంగిక శుద్ధే గౌరవాన్ని తెచ్చిపెడుతుందని తెలుసుకున్నాడు. ఆంతరంగిక శుద్ధి జరగాలంటే బుద్ధుని బోధనలే శరణు అని బుద్ధుణ్ణి శరణు వేడాడు. ఆ తరువాత గొప్ప పండితునిగా... శీలవంతునిగా కీర్తిగాంచాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
దానఫలం.. చూడగలం..
మనుషులకు ఉండవలసిన పది మానవీయ లక్షణాలలో దానగుణం మొదటిది అంటుంది బౌద్ధం. ఎందుకంటే దానం అంటే త్యాగం కాబట్టి. తన సంపదని, తన శ్రమని త్యాగం చేయడమే కాబట్టి. వ్యక్తుల కష్టాలు తీర్చడానికి దానం ఉపయోగపడుతుంది. కన్నీరూ తుడుస్తుంది. ‘వ్యక్తుల కంటే ధర్మం కోసం కృషి చేసే సంఘానికి దానం చేయడం మరింత మేలు’ అంటాడు బుద్ధుడు. ఒకడు వైశాలి నగర సమీపంలోని మహావనం లో కూటాగార శాలలో బుద్ధుడు ఉన్నాడు. అప్పుడు వైశాలికి చెందిన లిచ్ఛవీ గణరాజు కుమారుడైన సింహసేనాపతి బుద్ధుని దగ్గరకు వచ్చాడు. సింహుడు తీర్థంకర మత అభిమాని. అయినా అతనిలో రేగే అనేక సందేహాల్ని తీర్చుకోవడానికి బుద్ధుని దగ్గరికే వచ్చేవాడు. ఆ రోజు... వచ్చి బుద్ధునికి నమస్కరించి ఒక పక్కన కూర్చొన్నాడు. బుద్ధుడు అతని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత సింహసేనాపతి అంజలి ఘటిస్తూ– ‘‘భగవాన్! మీరు అనేకమార్లు దాన విశిష్టత గురించి చెప్పారు. ఏ దాత తాను చేసిన దానానికి ఆనందం పొందగలడు?’’ అని అడిగాడు. ‘‘సింహా! ఒక తాను దానం చేయాలి అని అనుకున్నప్పుడు తాను చేయబోయే దానాన్ని తలచుకుని ఏ కొంచెమైనా బాధపడకూడదు. అలాగే దానం చేస్తూ... ఏదో చేస్తానని అన్నాను. చేయక తప్పడం లేదు’ అని బాధపడకూడదు. ఆ విధంగానే దానం చేశాక కూడా ‘‘దానం చేయాలని అనుకున్నాను సరే. కాని దానం చేసి ఉండకూడదు. చేసినా అంత చేసి ఉండకూడదు.’’ అని అప్పుడూ బాధపడకూడదు. ఇలా ఈ మూడు సమయాల్లో ఏ దాత బాధపడడో ఆ దాత దాన ఆనందాన్ని పొందుతాడు’’ అన్నాడు బుద్ధుడు. అప్పటికే బౌద్ధ ధర్మాన్ని వ్యాపింపజేయడం కోసం అనాథ పిండకుడు, మాత విశాఖ, మగధ రాజు బింబిసారుడు, కోసల రాజు ప్రసేనుడు... ఇంకా ఎందరో దాతలు పేరు పొందారు. వారందరి విషయం తెలిసిన సింహ సేనాపతి – ‘‘భంతే! దాన ఫలాన్ని ప్రత్యక్షంగా చూడ్డం సంభవమేనా?’’ అని అడిగాడు. ‘‘సింహా! ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకడు పిసినారి. శ్రద్ధలేని వాడు. మరొకరు దాత. శ్రద్ధ గలవాడు. వీరిద్దరిలో సాధారణ ప్రజలే కాదు, పండితులు, అరహంతలు ముందుగా ఎవరి దగ్గరకు వెళ్తారు?’’ ‘‘భగవాన్! దాత దగ్గరికే వెళ్తారు’’ ‘‘భిక్షువులు, మునులు, పండితులు, ధ్యానులు ముందుగా ఎవరి దగ్గర భిక్ష గ్రహిస్తారు’’ ‘‘శ్రద్ధగలవాడు, దానగుణం కలవాని దగ్గరే ముందుగా భిక్ష స్వీకరిస్తారు’’ ‘‘వారు ముందుగా ఎవరికి బోధిస్తారు?’’ ‘‘శ్రద్ధగల దాతకే భగవాన్’’ ‘‘బతికున్నప్పుడు, మరణించాక కూడా వీరిలో ఎవరు సత్కీర్తిని పొందుతారు?’’ ‘‘అలాంటి సత్కీర్తి దాతలు మాత్రమే పొందగలరు భగవాన్’’ ‘‘రాజు కొలువుకి, పండిత పరిషత్తుకి, ధర్మ సభలకి, ఏ పరిషత్తులకైనా వెళ్ళితే... ఎవరు గౌరవం పొందుతారు?’’ ‘‘భగవాన్! ఏ సభలకైనా వెళ్ళి గౌరవం పొందగలిగేది శ్రద్ధ గలవాడైన దాత మాత్రమే’’ అన్నాడు. ‘‘చూశావా సింహా! దాత పొందే సత్కీర్తి, గౌరవం దాన ఫలమే! దానఫలం ప్రత్యక్షంగా కనిపించే సత్యమే కదా!’’ అన్నాడు. ‘‘భగవాన్! ఇకపై దాన గుణాన్ని పెంపొందించుకుంటాను’’ అని శిరస్సు వంచి ప్రణమిల్లాడు సింహసేనాపతి. – డా. బొర్రా గోవర్ధన్ -
బుద్ధుని బోధలు: ధ్యాన బలం
అది కార్తీక పున్నమి రోజు. ఆకాశం నిర్మలంగా ఉంది. వెన్నెల ప్రకాశిస్తోంది. జేతవనంలోని బౌద్ధారామం దీపాలతో దేదీప్యమానంగా ఉంది. ఆరోజు ఉదయం నుండి ఎందరెందరో భిక్షువులు జేతవనానికి వస్తూనే ఉన్నారు. మరలా మూడునెలల తర్వాత ఆరామం భిక్షువులతో నిండుగా కళకళలాడుతోంది. బౌద్ధ భిక్షువులకు ఆషాఢపున్నమి నుండి కార్తీక పున్నమి వరకూ వర్షావాసకాలం. ఈ నాలుగు నెలల కాలంలో ఓ మూడు నెలలు ఆషాఢ పున్నమి నుండి ఆశ్వయుజ పున్నమి వరకూ, లేదా శ్రావణ పున్నమి నుండి కార్తీక పున్నమి వరకూ గల మూడు నెలల కాలంలో భిక్షువులు గ్రామాల వెంట తిరుగుతూ భిక్ష స్వీకరించకూడదు. సాధ్యమైనంత వరకూ గ్రామాలకు జనావాసాలకూ దూరంగా వనాలలోనో, కొండ గుహల్లోనో ఏకాంతంగా గడపాలి. ధ్యానసాధన పెంపొందించుకోవాలి. తమని తాము తీర్చిదిద్దుకోవాలి. ఆ మూడు మాసాల సాధన ఫలితాల్ని వచ్చాక మిగిలిన భిక్షువులతో పంచుకోవాలి. ఇక ఆనాటినుండీ తిరిగి చారిక చేస్తూ ధమ్మ ప్రచారానికి వెళ్ళిపోవాలి. అలా వర్షావాసం గడిపి వచ్చినవారిలో ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఒకరు సుమేధుడు. రెండోవాడు తిష్యుడు. ఇద్దరూ వచ్చి బుద్థునికి నమస్కరించారు. ఒక పక్క నిలబడ్డారు. ‘భిక్షువులారా! మీ వర్షావాసం సుఖంగా గడిచిందా? మీ సాధన చక్కగా సాగిందా? అని అడిగాడు. ఇద్దరూ భగవాన్ అంతా చక్కగా జరిగింది అని నమస్కరిస్తూ తలలు ఊపారు. అప్పుడు బుద్ధుడు ముందుగా ‘తిష్యా! నీవు ఏం చేశావు?’ అని అడిగాడు. తిష్యుడు కాస్త ముందుకి వచ్చి ‘భగవాన్! నేను ఉన్నచోట వనం చాలా సుందరంగా ఉంది. అక్కడ ఒక కొలను ఉంది. ఆ కొలనులో రకరకాల తామరలు ఉన్నాయి. నా ధ్యాసనంతా తామరపూలపై కేంద్రీకరించాను. ఆ పూల మీద వాలే తుమ్మెదలు, రంగు రంగు రెక్కల సీతాకోక చిలుకలూ వాటి ఝుంకారాలపై మనస్సు నిలిపాను. ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ గడిపాను అన్నాడు. ‘మరి నీవు సుమేధా?’ అని సుమేధుణ్ణి అడిగాడు. ‘భగవాన్! నేను ఆ ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ ధ్యానసాధన చేసి ఏకాగ్రతని, ఎరుకని సాధించాను. ధ్యానంలో మరోమెట్టుకు చేరాను’ అని తాను పొందిన స్థితిని వివరించాడు. అప్పుడు బుద్ధుడు– ‘భిక్షువులారా! భిక్షువులు ధ్యానసాధనలో బలహీనులు కాకూడదు. ధ్యానబల సంపన్నులు కావాలి. బలమైన గుర్రమే యుద్ధంలో విజయం సాధిస్తుంది. పోటీలో గెలుపొందు తుంది. భిక్షువులు కూడా అంతే. ధ్యానబల సంపన్నుడైన భిక్షువే దుఃఖ నివారణా మార్గంలో ముందుంటాడు. గొప్ప భిక్షువుగా రాణిస్తాడు. నిర్వాణపథాన్ని పూర్తిగా దాటగలుగుతాడు. తిష్యా! ఇక నీ సమయాన్ని ఎప్పుడూ వృథా చేసుకోకు. బలాన్ని పోగొట్టుకోకు అని చెప్పాడు. ఆ తర్వాత వర్షావాస కాలంలో తిష్యుడు కూడా ధ్యానబలాన్ని సాధించాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
దౌత్య లక్షణాలు
దూత కలహకారుడు కాకూడదు. తగాదాను పెంచడం, మాటల్ని ఎగదోయడం, యుద్ధాన్ని పురిగొల్పడం లాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ దూత చేయకూడదు. అలాంటి కుటిలబుద్ధులుమంచి దౌత్యవేత్త కాలేరు. ఒకానొక సమయంలో దేవదత్తుడు బుద్ధునితో విభేదించాడు. బౌద్ధ సంఘాన్ని చీల్చాడు. ఐదువందల మంది భిక్షువులతో ప్రత్యేక సంఘాన్ని గయాశీర్షంలో స్థాపించాడు. అతని చెప్పుడు మాటలు విని, వెళ్లిపోయిన ఆ ఐదువందల మంది భిక్షువులకు నచ్చచెప్పి, వారి అనుమానాలను నివృత్తి చేసి తిరిగి వెనక్కు తీసుకురావాలని బుద్ధుడు భావించాడు. వారి దగ్గరకు దూతగా వెళ్ళి సమయస్ఫూర్తిగా దౌత్యాన్ని నెరపగలవారు ఎవరా అని ఆలోచించాడు. ఆ విషయం చెప్పగానే చాలామంది ‘మేము వెళ్తాం’ అంటూ ముందుకొచ్చారు. వారందరిలో ధమ్మ సేనాపతిగా పేరుపొందిన సారపుత్రుడు మాత్రమే తగినవాడని బుద్ధుడు భావించాడు. సారపుత్రుణ్ణి పంపేముందు, దూతకు ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పి పంపాడు బుద్ధుడు సారపుత్రునితో. ‘సారపుత్రా!’ మంచి దౌత్యవేత్త ఎనిమిది విషయాల్ని పాటించాలి. వాటిలో మొదటిది: దూతకు విసుగులేకుండా వినే లక్షణం ఉండాలి. వారు ఎంత చెప్తున్నా మధ్యలో ఆపకుండా, అడ్డుపడకుండా ఓర్పుతో వినాలి. ఇక రెండోది: దూత తాను చెప్పదలచుకున్నదంతా సమగ్రంగా చెప్పాలి. అస్తుబిస్తుగా, అరకొరగా, అసందర్భం గా చెప్పకూడదు. అలాగే సారపుత్రా! వినడం అంటే కేవలం చెవితో వినడం కాదు. దాన్ని హృదయంతో గ్రహించాలి. అప్పుడు ఎదుటివారు చెప్పే విషయాల్లో వారి సాధక బాధకాలు అర్థం అవుతాయి. ఇక నాలుగోది: దూత విషయ ధరుడు కావాలి. తాను ఏమి చెప్పాలో, ఆ విషయాన్నంతా ఒంటబట్టించుకోవాలి. అప్పుడు సమయాన్ని, సందర్భాన్ని బట్టి సమయస్ఫూర్తితో వ్యవహరించడం సాధన అవుతుంది. ఇంకా, దూత విజ్ఞాత కావాలి. తాను మాట్లాడేప్పుడు విజ్ఞత కలిగి ఉండాలి. మాటలు తూలకూడదు, విషయాల్ని దాచి చెప్పకూడదు అలాంటి విజ్ఞుడే మంచి దౌత్యవేత్త! ఇంకా సారపుత్రా! దూత విజ్ఞాపయిత కూడా అయి ఉండాలి. అంటే... తాను విజ్ఞత కోల్పోకూడదు. ఎదుటివారు రెచ్చగొడుతున్నా ఎదురు తిరిగి మాట్లాడుతున్నా, తలా, తోకలేని ప్రశ్నలతో వేధిస్తున్నా తాను సంయమనం పాటించాలి. ఆ విధంగా దూతకి చతురత ఉండాలి. తన దౌత్యం ఫలించినా, ఫలించకపోయినా, తాను మాత్రం చలించకూడదు. తన ఔన్నత్యాన్ని కోల్పోకూడదు.సారపుత్రా! ఈ ఏడింటితో పాటు దౌత్యవేత్తకు ఉండవలసిన ముఖ్య లక్షణం ఏమంటే... దూత కలహకారుడు కాకూడదు. తగాదాను పెంచడం, మాటల్ని ఎగదోయడం, యుద్ధాన్ని పురిగొల్పడం లాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ దూత చేయకూడదు. అలాంటి కుటిలబుద్ధి ఉన్నవాడు మంచి దౌత్యవేత్త కాలేడు’’ అని ఈ ఎనిమిది విషయాలు చెప్పి పంపాడు. సారపుత్రుడు వెళ్ళి సమస్యను పరిష్కరించాడు. ఐదువందల మంది భిక్షువులూ తమ తప్పును గ్రహించి తిరిగి బౌద్ధ సంఘానికి వచ్చారు. దేవదత్తుడు మాత్రం వినక ఒంటరిగా మిగిలిపోయాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
చివరి సందేశం
బుద్ధుడు తన ధర్మప్రచారంలో భాగంగా ఒకసారి వైశాలికి వచ్చాడు. అప్పటికి ఆయనకు ఎనభై ఏళ్లు. అక్కడ ఉన్నప్పుడు ఆయన అనారోగ్యం పాలయ్యారు. తేరుకున్నాక బయలుదేరి బంద అనే గ్రామం చేరారు. అక్కడి నుంచి భోగనగరం చేరారు. ఆరోగ్యం మరలా దెబ్బతింది. అవసాన దశ అని ఆయనకు తెలిసింది. ఇంతవరకూ తానున్న లిచ్ఛవుల రాజ్యం నుంచి మల్లుల రాజ్యానికి వెళ్లాలని, తన నిర్యాణం అక్కడే జరగాలని వెంటనే పావామల్లుల రాజధాని పావానగరానికి వెళ్లాడు. అక్కడ చుందుని ఆహ్వానంపై బుద్ధుడు తన భిక్షువులతో కలిసి అతని ఇంటికి వెళ్లాడు. చుందుడు వడ్డించిన పదార్థంతో రెండు ముద్దలు తిన్నాక అది సరిగా లేదని గ్రహించి మిగిలిన భిక్షువుల్ని ‘తినవద్దు’ అని వారించాడు. ఆ తర్వాత బుద్ధునికి తీవ్ర రక్తవిరేచనాలు పట్టుకున్నాయి. తర్వాత కుసీనగరానికి వెళ్దామనడంతో గుడ్డడోలీని కట్టి బుద్ధుడిని మోసుకుంటూ కుసీనగరం కేసి బయలుదేరారు భిక్షువులు. అక్కడినుంచి హిరణ్యవతి నదీతీరానికి చేరి, అక్కడున్న మల్లుల సాలవనంలో ఆగారు. అక్కడ రెండు సాలవృక్షాల మధ్య పడక ఏర్పాటు చేయించుకుని విశ్రమించాడు బుద్ధుడు. ఆయనకు సపర్యలు చేస్తూ ఆనందుడు, నందుడు ఆయన పక్కనే ఉన్నారు. ‘‘నేనిక జీవించలేను. నా మరణవార్తను మల్లులకు తెలియజేయండి’’ అని చెప్పాడు. ఆ మాటలు విన్న ఆనందుడు దుఃఖించాడు. అప్పుడు బుద్ధుడు ఆనందునితో– ‘‘ఆనందా! కొన్ని ధాతువుల కలయికే జననం. అవి విడిపోవడమే మరణం. సంఘటితమైన పదార్థాలన్నీ నశించేవే. దుఃఖం ఎందుకు?’’ అని వారించాడు. బుద్ధుని విషయం తెలిసి సుబుద్ధుడు అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. తాను బుద్ధుడిని ఒకసారి చూడాలని అడిగాడు. ఆనందుడు ‘ఇప్పుడు సాధ్యం కాదు’ అని చెప్పాడు. ఆ మాటలు విన్న బుద్ధుడు ‘‘ఆనందా! సుబుద్ధుడిని నా దగ్గరకు పంపు’’ అని చెప్పాడు. తన వద్దకు వచ్చి నమస్కరించి నిలుచున్న సుబుద్ధునితో ఎన్నో ధర్మవిషయాలను ప్రబోధించాడు. అవి విన్న సుబుద్ధుడు వెంటనే భిక్షు దీక్ష యాచించాడు. బుద్ధుడు అంగీకరించాడు. ఇలా బుద్ధుని చివరి సందేశం విన్న వ్యక్తిగా, బుద్ధుడు దీక్షను ఇప్పించిన ఆఖరి భిక్షువుగా సుబుద్ధుడు బౌద్ధ సంఘంలో ప్రసిద్ధుడయ్యాడు. ఆ రాత్రి బుద్ధుడు విపశ్యనా ధ్యానంలోకి వెళ్లాడు. ఆ ధ్యానంలోని ఒక్కోదశను దాటుకుంటూ ఇంద్రియ జ్ఞానరాహిత్య స్థితికి చేరాడు. అలా శూన్యతాయతన స్థితికి చేరి– ఆ స్థితిలోనే నిర్వాణం పొందాడు.బుద్ధుని మరణ వార్త తెలిసి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. లిచ్చవులు, బులియులు, కొలియులు, పావామల్లులు, కుసీనగర మల్లులు, శాక్యులు, కోసల, మగధ రాజ్యాల వారు ‘‘మా రాజ్యంలోనే అంత్యక్రియలు జరగాలి’’ అంటూ పోటీ పడ్డారు. తగాదాకు దిగారు. చివరికి ద్రోణుడు అనే పండితుడు వారందరి మధ్య సయోధ్య కుదిర్చాడు. చనిపోయిన కుసీనగరంలోనే దహనం చేసి, అస్థికలు ఎనిమిది సమాన భాగాలుగా పంచుకోవాలనే ఒప్పందం కుదిరింది. ఈ గొడవ తేలేవరకూ బుద్ధుని పార్థివ దేహాన్ని నూలుబట్టల్లో చుట్టి, నూనెపాత్రలో భద్రపరిచారు. బుద్ధుడు నిర్వాణం పొందేనాటికే సారిపుత్రుడు, మహా మౌద్గల్యాయనుడు, రాహులుడూ మరణించారు. బౌద్ధసంఘంలో తదుపరి స్థానంలో ఉన్న మహాకాశ్యపుడు పావానగరంలో ఉన్నాడు. బుద్ధుని మరణ వార్తను తెలుసుకున్న మహా కాశ్యపుడు వెంటనే బయలుదేరి కుసీనగరం చేరాడు. బుద్ధుని చితికి మహాకాశ్యపుడు నిప్పంటించాడు. చివరికి అవశేషాల్ని ఎనిమిది రాజ్యాలు పంచుకున్నాయి. వారికి కొలపాత్ర (మానిక)తో పంచి ఇచ్చిన ద్రోణుడు ఆ మానికను తీసుకున్నాడు. పిప్పిలి రాజ్యం వారు మిగిలిన భస్మాన్ని తీసుకున్నారు. ఆ అవశేషాలపై ఆలా పదిస్మారక స్థూపాలు నిర్మించాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
ఊగిసలాట వద్దు
శుభకరుడిది బాల్యం నుంచి ఊగిసలాడే మనస్తత్వం. ఈ రోజు ఆటలకు పోవాలా? వద్దా? వెళ్తే ఏ ఆటను ఎంపిక చేసుకోవాలి? పొలం పనికి పోవాలా? పంతులుగారి దగ్గరకు పోవాలా... ఇలా ప్రతిపనినీ ఎటూ తేల్చుకోకుండా ఆలోచిస్తూ గడిపేస్తూ ఉండేవాడు. పెద్దవాడయ్యాడు. పెళ్లీడుకొచ్చాడు. పెళ్లి చేసుకోవాలా? వద్దా? పెళ్లి జీవితం సుఖాన్నిస్తుందా? దుఃఖాన్ని కలిగిస్తుందా? చేసుకుంటే ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి– ఇలా రకరకాల ఆలోచనలు చేస్తూ కాలం గడిపేవాడు. ‘వివాహం చేసుకోకపోతే... పోయి సన్యసించు. జ్ఞానం, గౌరవం కలుగుతాయి’’ అన్నారు తల్లిదండ్రులు. సరే, సన్యసించాలి అనుకున్నాడు. ఇక సన్యాస జీవితం సుఖదాయకమా ? కాదా– అని ఆలోచించడం మొదలు పెట్టాడు. ఒకరోజున శుభకరుణ్ణి బుద్ధుని దగ్గరకు తీసుకుపోయారు అతని మిత్రులు. బుద్ధుడు ఆ రోజు శ్రద్ధ గురించి వివరిస్తూ– ‘‘శ్రద్ధ అనేది మూడు ముఖాలున్న విలువైన వజ్రం. అందులో ఒక ముఖం విశ్వాసం. నమ్మకం. మనం ఏ మార్గాన్ని ఎంచుకున్నామో ముందు దానిమీద మనకి విశ్వాసం ఉండాలి. దాన్ని విశ్వసించాలి. అపనమ్మకంతో ఏ పనీ మొదలు పెట్టకూడదు. ఇక రెండో ముఖం ప్రయత్నం. మనం నమ్మిన మార్గంలో మనం శక్తియుక్తులు దాచుకోకుండా ప్రయత్నం సాగించాలి. విఘ్నాలు ఎదురైనా నిరాశపడక ప్రయత్నం కొనసాగించాలి. మూడోముఖం చిత్తశుద్ధి. మన మార్గంలో, మనం చేసే ప్రయత్నంలో చిత్తశుద్ధి ఉండాలి. మనస్పూర్తిగా చేయాలి. దోషభావంతో, కీడు ఆలోచనలతో పగ, ప్రతీకారాలు తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో చేయకూడదు. ఎదుటి వారిని ఓడించాలనీ, పడగొట్టాలనే దురుద్దే్దశ్యాలు లేకుండా మంచి మనస్సుతో చేయాలి. ఇలా... నమ్మకం, ప్రయత్నం, చిత్తశుద్ది– ఈ మూడూ కలసిందే శ్రద్ధ. శ్రద్ధ వల్ల జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధవల్లే సర్వం ఫలిస్తుంది’’అని చెప్పాడు. ఆ ప్రబోధం శుభకరుని మీద బాగా పని చేసింది. ఊగిసలాట తొలగిపోయింది. అనంతర కాలంలో మంచి జ్ఞానిగా, గొప్ప భిక్షువుగా పేరు పొందాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
సరైన గురుదక్షిణ
బౌద్ధనీతి జీవకుడు గొప్ప వైద్యుడు. మగధ రాజవైద్యుడు. బుద్ధుని అనుయాయి. బుద్ధునికి వ్యక్తిగత వైద్యుడు కూడా. రోగుల పొట్టకు, వెన్నెముకకు, తలకు శస్త్రచికిత్సలు చేసి, ‘కణుతులు’ తీసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. జీవకుడు ఎవరో చెత్తకుప్పలో కని పారేసిన బిడ్డ. మగధరాజు అభయుడు ఆ అనాధ బిడ్డను పెంచి, పెద్ద చేసి, విద్యార్జన కోసం తక్షశిలకు పంపుతాడు. అక్కడ ఏడేళ్లు వైద్యవిద్యను అభ్యసిస్తాడు. జీవకుడు ఒకరోజు తన ఆచార్యుని దగ్గరకు పోయి, ‘‘ఆర్యా! నా చదువుకు ముగింపు ఎప్పుడు?’’ అని అడిగాడు. ‘‘జీవకా! ఇప్పుడే’’అన్నాడు ఆచార్యుడు. ‘‘ఆచార్యా! తమకు గురుదక్షిణగా ఏమివ్వగలను?’’ అని అడిగాడు. ‘‘జీవకా! తక్షశిలకు నాలుగు దిక్కులా వెదకు. ఎందుకూ పనికిరాని ఒక పిచ్చి మొక్కను తీసుకురా. అదే నీవు నాకిచ్చే దక్షిణ’’ అన్నాడు. జీవకుడు వెళ్లి, వెదకి వెదకి చివరికి ఉత్త చేతులతో తిరిగొచ్చాడు. ‘‘ఆచార్యా! వైద్యానికి పనికి రాని మొక్క ఏదీ నాకు కనిపించలేదు’’అన్నాడు. ‘‘నాయనా జీవకా, ఇదే నీవు నాకు ఇచ్చిన సరైన గురుదక్షిణ. నేను పెట్టిన పరీక్షలో నెగ్గావు. నీ విద్యాభ్యాసం పూర్తయింది’’అని చెప్పి, దీవించి పంపాడు. ఆ తర్వాత జీవకుడు గొప్ప వైద్యునిగా, బౌద్ధునిగా రాణించాడు. - బొర్రా గోవర్ధన్