బుద్ధుని బోధలు: ధ్యాన బలం | Teachings Of Lord Buddha In Telugu | Sakshi
Sakshi News home page

బుద్ధుని బోధలు: ధ్యాన బలం

Published Mon, Nov 22 2021 10:59 AM | Last Updated on Mon, Nov 22 2021 11:09 AM

Teachings Of Lord Buddha In Telugu - Sakshi

అది కార్తీక పున్నమి రోజు. ఆకాశం నిర్మలంగా ఉంది. వెన్నెల ప్రకాశిస్తోంది. జేతవనంలోని బౌద్ధారామం దీపాలతో దేదీప్యమానంగా ఉంది. ఆరోజు ఉదయం నుండి ఎందరెందరో భిక్షువులు జేతవనానికి వస్తూనే ఉన్నారు. మరలా మూడునెలల తర్వాత ఆరామం భిక్షువులతో నిండుగా కళకళలాడుతోంది.

బౌద్ధ భిక్షువులకు ఆషాఢపున్నమి నుండి కార్తీక పున్నమి వరకూ వర్షావాసకాలం. ఈ నాలుగు నెలల కాలంలో ఓ మూడు నెలలు ఆషాఢ పున్నమి నుండి ఆశ్వయుజ పున్నమి వరకూ, లేదా శ్రావణ పున్నమి నుండి కార్తీక పున్నమి వరకూ గల మూడు నెలల కాలంలో భిక్షువులు గ్రామాల వెంట తిరుగుతూ భిక్ష స్వీకరించకూడదు. సాధ్యమైనంత వరకూ గ్రామాలకు జనావాసాలకూ దూరంగా వనాలలోనో, కొండ గుహల్లోనో ఏకాంతంగా గడపాలి. ధ్యానసాధన పెంపొందించుకోవాలి. తమని తాము తీర్చిదిద్దుకోవాలి. ఆ మూడు మాసాల సాధన ఫలితాల్ని వచ్చాక మిగిలిన భిక్షువులతో పంచుకోవాలి. ఇక ఆనాటినుండీ తిరిగి చారిక చేస్తూ ధమ్మ ప్రచారానికి వెళ్ళిపోవాలి. 

అలా వర్షావాసం గడిపి వచ్చినవారిలో ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఒకరు సుమేధుడు. రెండోవాడు తిష్యుడు. ఇద్దరూ వచ్చి బుద్థునికి నమస్కరించారు. ఒక పక్క నిలబడ్డారు. 
‘భిక్షువులారా! మీ వర్షావాసం సుఖంగా గడిచిందా? మీ సాధన చక్కగా సాగిందా? అని అడిగాడు. ఇద్దరూ భగవాన్‌ అంతా చక్కగా జరిగింది అని నమస్కరిస్తూ తలలు ఊపారు.
అప్పుడు బుద్ధుడు ముందుగా ‘తిష్యా! నీవు ఏం చేశావు?’ అని అడిగాడు. తిష్యుడు కాస్త ముందుకి వచ్చి ‘భగవాన్‌! నేను ఉన్నచోట వనం చాలా సుందరంగా ఉంది. అక్కడ ఒక కొలను ఉంది. ఆ కొలనులో రకరకాల తామరలు ఉన్నాయి. నా ధ్యాసనంతా తామరపూలపై కేంద్రీకరించాను. ఆ పూల మీద వాలే తుమ్మెదలు, రంగు రంగు రెక్కల సీతాకోక చిలుకలూ వాటి ఝుంకారాలపై మనస్సు నిలిపాను. 
ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ గడిపాను అన్నాడు. 

‘మరి నీవు సుమేధా?’ అని సుమేధుణ్ణి అడిగాడు.
‘భగవాన్‌! నేను ఆ ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ ధ్యానసాధన చేసి ఏకాగ్రతని, ఎరుకని సాధించాను. ధ్యానంలో మరోమెట్టుకు చేరాను’ అని తాను పొందిన స్థితిని వివరించాడు. 

అప్పుడు బుద్ధుడు–
‘భిక్షువులారా! భిక్షువులు ధ్యానసాధనలో బలహీనులు కాకూడదు. ధ్యానబల సంపన్నులు కావాలి. బలమైన గుర్రమే యుద్ధంలో విజయం సాధిస్తుంది. పోటీలో గెలుపొందు తుంది. భిక్షువులు కూడా అంతే. ధ్యానబల సంపన్నుడైన భిక్షువే దుఃఖ నివారణా మార్గంలో ముందుంటాడు. గొప్ప భిక్షువుగా రాణిస్తాడు. నిర్వాణపథాన్ని పూర్తిగా దాటగలుగుతాడు. తిష్యా! ఇక నీ సమయాన్ని ఎప్పుడూ వృథా చేసుకోకు. బలాన్ని పోగొట్టుకోకు అని చెప్పాడు. ఆ తర్వాత వర్షావాస కాలంలో తిష్యుడు కూడా ధ్యానబలాన్ని సాధించాడు.
– డా. బొర్రా గోవర్ధన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement