దూత కలహకారుడు కాకూడదు. తగాదాను పెంచడం, మాటల్ని ఎగదోయడం, యుద్ధాన్ని పురిగొల్పడం లాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ దూత చేయకూడదు. అలాంటి కుటిలబుద్ధులుమంచి దౌత్యవేత్త కాలేరు.
ఒకానొక సమయంలో దేవదత్తుడు బుద్ధునితో విభేదించాడు. బౌద్ధ సంఘాన్ని చీల్చాడు. ఐదువందల మంది భిక్షువులతో ప్రత్యేక సంఘాన్ని గయాశీర్షంలో స్థాపించాడు. అతని చెప్పుడు మాటలు విని, వెళ్లిపోయిన ఆ ఐదువందల మంది భిక్షువులకు నచ్చచెప్పి, వారి అనుమానాలను నివృత్తి చేసి తిరిగి వెనక్కు తీసుకురావాలని బుద్ధుడు భావించాడు. వారి దగ్గరకు దూతగా వెళ్ళి సమయస్ఫూర్తిగా దౌత్యాన్ని నెరపగలవారు ఎవరా అని ఆలోచించాడు. ఆ విషయం చెప్పగానే చాలామంది ‘మేము వెళ్తాం’ అంటూ ముందుకొచ్చారు.
వారందరిలో ధమ్మ సేనాపతిగా పేరుపొందిన సారపుత్రుడు మాత్రమే తగినవాడని బుద్ధుడు భావించాడు. సారపుత్రుణ్ణి పంపేముందు, దూతకు ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పి పంపాడు బుద్ధుడు సారపుత్రునితో.
‘సారపుత్రా!’ మంచి దౌత్యవేత్త ఎనిమిది విషయాల్ని పాటించాలి. వాటిలో మొదటిది: దూతకు విసుగులేకుండా వినే లక్షణం ఉండాలి. వారు ఎంత చెప్తున్నా మధ్యలో ఆపకుండా, అడ్డుపడకుండా ఓర్పుతో వినాలి. ఇక రెండోది: దూత తాను చెప్పదలచుకున్నదంతా సమగ్రంగా చెప్పాలి. అస్తుబిస్తుగా, అరకొరగా, అసందర్భం గా చెప్పకూడదు.
అలాగే సారపుత్రా! వినడం అంటే కేవలం చెవితో వినడం కాదు. దాన్ని హృదయంతో గ్రహించాలి. అప్పుడు ఎదుటివారు చెప్పే విషయాల్లో వారి సాధక బాధకాలు అర్థం అవుతాయి. ఇక నాలుగోది: దూత విషయ ధరుడు కావాలి. తాను ఏమి చెప్పాలో, ఆ విషయాన్నంతా ఒంటబట్టించుకోవాలి. అప్పుడు సమయాన్ని, సందర్భాన్ని బట్టి సమయస్ఫూర్తితో వ్యవహరించడం సాధన అవుతుంది. ఇంకా, దూత విజ్ఞాత కావాలి. తాను మాట్లాడేప్పుడు విజ్ఞత కలిగి ఉండాలి. మాటలు తూలకూడదు, విషయాల్ని దాచి చెప్పకూడదు అలాంటి విజ్ఞుడే మంచి దౌత్యవేత్త!
ఇంకా సారపుత్రా! దూత విజ్ఞాపయిత కూడా అయి ఉండాలి. అంటే... తాను విజ్ఞత కోల్పోకూడదు. ఎదుటివారు రెచ్చగొడుతున్నా ఎదురు తిరిగి మాట్లాడుతున్నా, తలా, తోకలేని ప్రశ్నలతో వేధిస్తున్నా తాను సంయమనం పాటించాలి.
ఆ విధంగా దూతకి చతురత ఉండాలి. తన దౌత్యం ఫలించినా, ఫలించకపోయినా, తాను మాత్రం చలించకూడదు. తన ఔన్నత్యాన్ని కోల్పోకూడదు.సారపుత్రా! ఈ ఏడింటితో పాటు దౌత్యవేత్తకు ఉండవలసిన ముఖ్య లక్షణం ఏమంటే... దూత కలహకారుడు కాకూడదు. తగాదాను పెంచడం, మాటల్ని ఎగదోయడం, యుద్ధాన్ని పురిగొల్పడం లాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ దూత చేయకూడదు. అలాంటి కుటిలబుద్ధి ఉన్నవాడు మంచి దౌత్యవేత్త కాలేడు’’ అని ఈ ఎనిమిది విషయాలు చెప్పి పంపాడు. సారపుత్రుడు వెళ్ళి సమస్యను పరిష్కరించాడు. ఐదువందల మంది భిక్షువులూ తమ తప్పును గ్రహించి తిరిగి బౌద్ధ సంఘానికి వచ్చారు. దేవదత్తుడు మాత్రం వినక ఒంటరిగా మిగిలిపోయాడు.
– డా. బొర్రా గోవర్ధన్
దౌత్య లక్షణాలు
Published Mon, May 31 2021 12:29 AM | Last Updated on Mon, May 31 2021 9:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment