'సమ్యక్‌ దర్శనం' వల్లే సత్యాన్ని తెలుసుకోగలం! | Inspirational Story Of Gautama Buddha | Sakshi
Sakshi News home page

'సమ్యక్‌ దర్శనం' వల్లే సత్యాన్ని తెలుసుకోగలం!

Published Mon, Mar 4 2024 7:42 AM | Last Updated on Mon, Mar 4 2024 7:43 AM

Inspirational Story Of Gautama Buddha - Sakshi

స్పూర్తిదాయకమైన కథ

మగధ రాజ్య రాజధాని రాజగృహ సమీపంలోని పక్షి పర్వతం. ఆ పర్వతం చివర విశాలమైన చదును భాగం. ఒకపక్క పెద్ద పెద్ద కొండరాళ్ళు. ఆ రాళ్ళ సందులో చిన్న గుహ. అది చల్లగా విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చదును భాగం చుట్టూ పనస చెట్లు దట్టంగా ఉన్నాయి. ఒకరోజు బుద్ధుడు సాయంత్రం వేళ ఆ గుహ ముందున్న రాతిమీద కూర్చొని ఉన్నాడు. ఆ సమయానికి వచ్చాడు దీర్ఘనఖుడు అనే సన్యాసి. అతను అగ్ని ఆరాధకుడు. దీర్ఘనఖుడు వచ్చి, వంగి బుద్ధునికి నమస్కరించాడు. ఒక పక్కన నిలబడ్డాడు.

      ఆ రోజుల్లో కొందరు తాపసులు ‘‘మీరు చెప్పేది ఏదీ నాకు సమ్మతం కాదు. దేన్నీ నేను ఒప్పుకోను’’ అనేవారు. 
ఏ విషయాన్ని చెప్పినా, దాన్ని ఏదో ఒక విధంగా విమర్శించేవారు. తప్పులు వెదికేవారు. అంగీకరించేవారు కాదు. ఇంకొందరున్నారు. వారు ప్రతిదాన్నీ అంగీకరించేవారు. ఆయా విషయాలపై వాదవివాదాలు చేసేవారు కాదు. ‘అలాగే... ‘అవునవును’ అంటూ తలలూపేవారు. 
      ఇక మూడోరకం ఉన్నారు. వారు ‘‘మాకు కొంత సమ్మతం కాదు’’ అనేవారు. 
దీర్ఘనఖుడు ఇందులో మొదటి రకం వాడు. ‘‘ఏదీ నాకు సమ్మతం కాదు’’ అనేవాడు.

      ఆరోజు ఇదే విషయం గురించి చర్చించుకుంటూ.... 
‘‘దీర్ఘనఖా! ఏదీ నాకు సమ్మతం కాదు’ అనేదైనా నీకు సమ్మతమేనా?’’ అని అడిగాడు. 
      ‘‘గౌతమా! అది మాత్రం నాకు సమ్మతమే’’ అన్నాడు. బుద్ధుడు అతని వైపు తదేకంగా చూశాడు. బుద్ధుని ప్రశాంత దృక్కులు తనని ఏదో ప్రశ్నిస్తున్నట్లు గమనించాడు. 
అప్పుడు బుద్ధుడు– ‘‘ఏదీ సమ్మతం కాదు... అనేవారి దృష్టి రాగరహితంగా ఉంటుంది. దేనితో కలవకుండా ఉంటుంది. ΄÷గడ్తలకు, ప్రతి దాన్నీ పొందాలనే భావనకూ దూరంగా ఉంటుంది. దేనినీ పట్టుకుని వేళ్ళాడదు!’’ అన్నాడు. 
      ‘‘గౌతమా! మంచిది. మీరు నా దృష్టి కోణాన్ని మెచ్చుకుంటున్నారన్నమాట’’ అన్నాడు. 
‘‘దీర్ఘనఖా! ఇంకా విను. ‘అంతా సమ్మతమే అనేవారు దీనికి భిన్నంగా ఉంటారు. వారి దృష్టి రాగంతో ఉంటుంది. ప్రతి దానితో కలసి΄ోతుంది. ΄÷గడ్తలను కోరుకుంటుంది. ప్రతి దాన్నీ పొందాలి అనుకుంటుంది. ఇక మూడోరకంవారి దృష్టి ఈ రెండు రకాలనూ కలగలుపుకుని ఉంటుంది. విశేషం ఏమిటంటే.. ఈ మూడు రకాల వారిలో ప్రతి ఒక్కరూ తమ దృష్ఠే సరైనదనుకుంటారు. ఇతరుల్ని విమర్శిస్తారు. వ్యతిరేకిస్తారు. తమ అనుభవంలో... తాము అనుకునేదానికి భిన్నమైన ఫలితం చూసినా, గ్రహించినా గానీ,,, వీరు మారరు. మూర్ఖంగా తాను అనుకున్నదే సత్యం అనుకుంటారు. సర్వం అదే అని నిర్ణయించుకుంటారు. మిగిలినదంతా మిధ్యే అని భావిస్తారు. దీని వల్ల ప్రజ్ఞని (ఎరుకను) కోల్పోతారు. సత్యాన్ని ఆవిష్కరించలేరు’’ అని చెప్పాడు.

      బుద్ధుడు అలా మూడురకాల దృష్టి గలవారి గురించి చెప్పాక, తన తప్పు ఏమిటో దీర్ఘనఖునికి అర్థమైంది. 
ద్వేషం, క్రోధాలు ఎలా సత్యాన్ని తెలుసుకోడానికి అవరోధాలలో... రాగం మోహం కోరికలు కూడా అలాంటి అవరోధాలే అని గ్రహించాడు. ఇవి తొలగించుకుని సమ్యక్‌ దర్శనం వల్లనే సత్యాన్ని సత్యంగా.. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలం అని అర్థం చేసుకున్నాడు. 
      మనస్సుని మాలిన్య రహితం చేసుకోవడం వల్ల సమ్యక్‌ దృష్టి కలుగుతుందని గ్రహించి... వినమ్రంగా బుద్ధుని పాదాలంటి నమస్కరించాడు. 
– డా. బొర్రా గోవర్ధన్‌

ఇవి చదవండి: గంగే మాం పాహి!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement