పూర్వం అంగీరస మహర్షికి భూతి అనే శిష్యుడు ఉండేవాడు. భూతి ముక్కోపి, మహా తపస్సంపన్నుడు. అతడికి కోపావేశాలకు అందరూ భయపడేవారు. ప్రకృతి కూడా అతడి కోపానికి భయపడి సక్రమంగా ప్రవర్తించేది. అంగీరసుడి వద్ద విద్యాభ్యాసం పూర్తయ్యాక భూతి స్వయంగా ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వివాహం చేసుకుని, గృహస్థాశ్రమం చేపట్టాడు.
భూతి మహర్షి తన ఆశ్రమంలో శిష్యులకు వేదవేదాంగాలను బోధించేవాడు. అతడి ఆశ్రమం నిత్యాగ్నిహోత్రంతో వేదమంత్రాలతో కళకళలాడుతూ ఉండేది. భూతి కోపాన్ని ఎరిగిన శిష్యులు అతడికి కోపం రాకుండా వినయంగా మసలుకుంటూ, శుశ్రూషలు చేసేవారు.
భూతి మహర్షికి సువర్చుడు అనే సోదరుడు ఉన్నాడు. సువర్చుడు ఒకసారి యాగాన్ని చేయాలనుకున్నాడు. యాగానికి రమ్మంటూ సోదరుడు భూతిని ఆహ్వానించాడు. సోదరుడి యాగానికి వెళ్లాలని నిశ్చయించుకున్న భూతి, తన శిష్యుల్లో శాంతుడు అనేవాణ్ణి పిలిచి ఆశ్రమ బాధ్యతలను అప్పగించాడు.
‘నేను తిరిగి వచ్చేంత వరకు ఆశ్రమంలో అగ్నిహోత్రం చల్లారకూడదు. అగ్నిహోత్రం చల్లారకుండా ఉండేందుకు నిత్య హోమాలు కొనసాగేలా చూడు’ అని ఆజ్ఞాపించి, సోదరుడి యాగాన్ని చూడటానికి బయలుదేరాడు.
ఒకరోజు శాంతుడు, మిగిలిన శిష్యులు ఆశ్రమానికి సంబంధించిన వేరే పనుల్లో ఉండగా, అగ్నిహోత్రం చల్లారిపోయింది. అది చూసిన శిష్యులు గురువు తిరిగి వస్తే తమను ఏమని శపిస్తాడోనని భయపడుతూ గజగజలాడారు. జరిగిన దానికి శాంతుడు మరింతగా దుఃఖించాడు. గురువు తనకు ముఖ్యమైన బాధ్యత అప్పగించినా, అది సక్రమంగా నిర్వర్తించలేని తన అసమర్థతకు, నిర్లక్ష్యానికి విపరీతంగా బాధపడ్డాడు.
ఇప్పుడు తాను తిరిగి హోమగుండాన్ని వెలిగించినా, గురువు దివ్యదృష్టితో జరిగిన తప్పు తెలుసుకుని, తనను శపించి భస్మం చేసేస్తాడనుకుని భయపడ్డాడు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఇప్పుడు ఏం చేయాలని పరిపరి విధాలుగా ఆలోచించాడు. చివరకు అగ్నిదేవుడిని శరణు వేడుకుంటే, ఆయనే ఆపద నుంచి గట్టెక్కించగలడని తలచాడు.
‘నమః సర్వభూతానాం సాధనాయ మహాత్మనే/ ఏక ద్విపంచధిష్ణ్యాయ తాజసూయే షడాత్మనే...’ అంటూ అగ్నిదేవుడిని స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రం పలికాడు.
‘ఓ అగ్నిదేవా! దేవతలందరికీ ముఖానివి నీవే! హోమ యజ్ఞాలలో సమర్పించే హవిస్సులను, ఆజ్యాన్ని ఆరగించి దేవతలందరికీ తృప్తి కలిగిస్తున్నావు. దేవతలందరికీ నువ్వే ప్రాణస్వరూపుడివి. హుతాశనా! ‘విశ్వ’ నామధేయం గల నీ జిహ్వ ప్రాణులందరికీ శుభాలను ప్రసాదిస్తుంది. ఆ నాలుకతోనే మహాపాపాల నుంచి, భయాల నుంచి మమ్మల్ని రక్షించు. నా అశ్రద్ధ వల్లనే హోమగుండం చల్లారిపోయింది. నన్ను అనుగ్రహించు’ అని ప్రార్థించాడు.
శాంతుడి ప్రార్థనకు అగ్నిదేవుడు సంతుష్టుడయ్యాడు. వెంటనే అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘వత్సా! ఏమి నీ కోరిక? ఏ వరాలు కావాలో కోరుకో!’ అని అడిగాడు.
‘దేవా! నా అలక్ష్యం వల్ల హోమగుండం చల్లారిపోయింది. ఈ హోమగుండంలో పూర్వం నుంచి ఉన్న విధంగానే అగ్ని నిలిచి ఉండాలి. నా గురువుకు ఇప్పటి వరకు సంతానం లేదు. ఆయనకు పుత్రసంతానాన్ని అనుగ్రహించాలి. నా గురువు ఇకపై ప్రాణులపై స్నేహభావంతో ఉండాలి. నీ అనుగ్రహం కోసం నేను చేసిన స్తోత్రాన్ని ఎవరు పఠించినా వారిపై నీ అనుగ్రహాన్ని కురిపించాలి. ఇవే నేను కోరే వరాలు’ అన్నాడు శాంతుడు.
శాంతుడి మాటలకు అగ్నిదేవుడు ముగ్ధుడయ్యాడు. అతడు కోరిన వరాలన్నింటినీ అనుగ్రహించాడు. ‘లోకంలో నువ్వు ఉత్తమ శిష్యుడివి. నీకోసం ఒక్క వరమైనా కోరుకోకుండా, నీ గురువు గురించే వరాలు కోరుకున్నావు. నీ గురువుకు పుట్టబోయే పుత్రుడు ‘మనువు’ అవుతాడు. నువ్వు చెప్పిన అగ్నిస్తోత్రం పఠించిన వారికి çసకల శుభాలూ జరుగుతాయి’ అని పలికి అదృశ్యమయ్యాడు.
సోదరుడి యాగం పూర్తికావడంతో భూతి మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆశ్రమంలో హోమగుండంలోని అగ్ని దేదీప్యమానంగా మండుతూ ఉండటంతో సంతృప్తి చెందాడు. శాంతుడిని దగ్గరకు రమ్మని పిలిచాడు. ‘శిష్యా! ఎన్నడూ లేనివిధంగా నాకు అందరి మీద స్నేహభావం కలుగుతోంది. ఇదేదో వింతలా ఉంది. నాకు అంతుచిక్కడం లేదు. నీకమైనా తెలిస్తే చెప్పు’ అని అడిగాడు.
గురువు ఆశ్రమాన్ని విడిచి వెళ్లినప్పటి నుంచి జరిగినదంతా శాంతుడు పూసగుచ్చినట్లు చెప్పాడు. అయితే, శాంతుడు భయపడినట్లుగా భూతి మహర్షి కోపగించుకోలేదు. శపించలేదు. పైగా అంతా విని ఎంతో సంతోషించాడు. తన శిష్యుడైన శాంతుడు అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకున్నందుకు గర్వించాడు. శాంతుడిని అభినందించాడు. నాటి నుంచి మరింత ప్రత్యేక శ్రద్ధతో శాంతుడికి సకల వేద శాస్త్రాలనూ, వాటి మర్మాలనూ క్షుణ్ణంగా బోధించి, తనంతటి వాడిగా తయారు చేశాడు.
కొంతకాలానికి అగ్నిదేవుడి వరప్రభావంతో భూతి మహర్షికి కొడుకు పుట్టాడు. అతడే భౌత్యుడు. కాలక్రమంలో భౌత్యుడు పద్నాలుగో మనువుగా వర్ధిల్లాడు. అతడి భౌత్య మన్వంతరం ఏర్పడింది. – సాంఖ్యాయన
ఇది చదవండి: బౌద్ధవాణి.. మట్టికుండ నేర్పిన పాఠం
Comments
Please login to add a commentAdd a comment