Funday Sunday
-
సుధర్ముడి కథ: ఒకనాడు అతడు వ్యాపారం కోసం..
త్రేతాయుగారంభంలో మద్ర దేశంలోని శాకల నగరంలో సుధర్ముడనే వర్తకుడు ఉండేవాడు. అతడు గొప్ప ధనికుడు, ధార్మికుడు. ఒకనాడు అతడు వ్యాపారం కోసం విలువైన వస్తువులు తీసుకుని సురాష్ట్రానికి బయలుదేరాడు. సుధర్ముడు రాత్రివేళ ఎడారి మార్గంలో ప్రయాణిస్తుండగా, కొందరు బందిపోటు దొంగలు అతణ్ణి అడ్డగించి, అతడి వద్దనున్న వస్తువులన్నీ దోచుకుపోయారు.ఉన్నదంతా దొంగలు ఊడ్చుకుపోవడంతో సుధర్ముడు ఆ ఎడారి మార్గంలో దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా మిగిలాడు. నిస్సహాయుడిగా ఎడారిమార్గంలో పిచ్చివాడిలా తిరగసాగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ మర్నాటి ఉదయానికి ఎడారిని దాటుకుని, ఒక అడవికి చేరుకున్నాడు. ఆకలితో శక్తినశించి ఉండటంతో అడవిలోని ఒక జమ్మిచెట్టు కింద కూలబడ్డాడు.నీరసంతో అతడు ఆ చెట్టు కిందనే నిద్రపోయాడు. సాయంత్రం చీకటి పడుతుండగా మెలకువ వచ్చింది. బడలిక తీరడంతో నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. ఎదురుగా వందలాది ప్రేతాలతో కలసి ఉన్న ప్రేతనాయకుడు కనిపించాడు. సుధర్మడికి భయం, ఆశ్చర్యం కలిగాయి. ఎక్కడెక్కిడి నుంచో వచ్చిన ప్రేతాలు ఆ ప్రేతనాయకుడి చుట్టూ కూర్చున్నాయి. సుధర్ముడు ఆశ్చర్యంగా ఆ ప్రేతనాయకుడినే చూస్తూ ఉండిపోయాడు.తననే గమనిస్తున్న సుధర్ముడిని చూసిన ప్రేతనాయకుడు, అతడికి స్వాగతపూర్వకంగా నమస్కారం చేశాడు. దాంతో సుధర్ముడికి భయం పోయి, నెమ్మదిగా ప్రేతనాయకుడితో స్నేహం చేశాడు. ప్రేతనాయకుడు సుధర్ముడిని ‘నువ్వెవరివి? చూడటానికి సౌమ్యుడిలా కనిపిస్తున్నావు. ఎక్కడి నుంచి ఈ అడవికి ఒంటరిగా వచ్చావు? నీకేమైనా కష్టం కలిగిందా? చెప్పు’ అని అడిగాడు. ప్రేతనాయకుడు అలా ఆదరంగా అడగటంతో సుధర్ముడు కంటతడి పెట్టుకుని, తన కష్టాన్నంతా దొంగలు దోచుకుపోయారని, ఇప్పుడు తనకు దిక్కులేదని బాధపడ్డాడు.ప్రేతనాయకుడు సుధర్ముణ్ణి ఓదార్చారు. ‘మిత్రమా! కాలం కలసిరానప్పుడు ఇలాంటి దుస్సంఘటనలు జరుగుతుంటాయి. ధైర్యం తెచ్చుకో! తిండి మానేసి శరీరాన్ని శుష్కింపజేసుకోకు. ముందు దిగులుపడటం మానేయి. కాలం నీకు మళ్లీ అనుకూలిస్తుంది’ అని ధైర్యం చెప్పాడు. తర్వాత తన సహచర ప్రేతాలకు సుధర్ముడిని పరిచయం చేస్తూ, ‘మిత్రులారా! ఇతడు సుధర్ముడు. ఈనాటి నుంచి నాకు మిత్రుడు. అందువల్ల మీకు కూడా మిత్రుడే!’ అని పరిచయం చేశాడు.అంతలోనే అక్కడకు గాల్లోంచి ఒక మట్టికుండ పెరుగన్నంతో వచ్చి నిలిచింది. అలాగే మరో కుండ మంచినీళ్లతో వచ్చింది. వాటిని చూసి ప్రేతనాయకుడు ‘లే మిత్రమా! స్నానాదికాలు పూర్తి చేసుకుని, ముందు భోంచేయి.’ అన్నాడు. సుధర్ముడు స్నానం చేసి వచ్చి, ప్రేతనాయకుడు, అతడి సహచర ప్రేతాలతో కలసి పెరుగన్నం తిన్నాడు. వారి భోజనం పూర్తి కాగానే రెండు కుండలూ అదృశ్యమైపోయాయి. తర్వాత ప్రేతనాయకుడికి వీడ్కోలు పలికి మిగిలిన ప్రేతాలు కూడా అదృశ్యమైపోయాయి.ఇదంతా సుధర్ముడికి ఆశ్చర్యకరంగా అనిపించింది. ‘మిత్రమా! ఈ నిర్జనారణ్యంలోకి అమృతంలాంటి పెరుగన్నాన్ని, చల్లని మంచినీళ్లను ఎవరు పంపారు? నీ సహచర ప్రేతాలెవరు? ఇంతకూ నువ్వెరివి?’ అని ప్రశ్నలు కురిపించాడు.‘సుధర్మా! గత జన్మలో నేను శాకల నగరంలో సోమశర్మ అనే విప్రుణ్ణి. నా వద్ద పుష్కలంగా సంపద ఉన్నా, ఎన్నడూ ధర్మకార్యాలు చేసి ఎరుగను. పరమ పిసినారిగా బతికేవాణ్ణి. నా పొరుగునే సోమశ్రవుడనే వైశ్యుడు ఉండేవాడు. దాదాపు నా వయసు వాడే కావడంతో చిన్ననాటి నుంచి అతడితో స్నేహం ఏర్పడింది. అతడు భాగవతోత్తముడు, ధార్మికుడు. అతడి దానధర్మాలు చూసినా, నాలో మార్పు రాలేదు. చాలాకాలం గడిచాక ఇద్దరమూ వార్ధక్యానికి దగ్గరయ్యాం.ఒకనాడు భాద్రపద ద్వాదశినాడు పర్వస్నానం కోసం నా వైశ్యమిత్రుడితో కలసి ఐరావతి, నడ్వా నదుల సంగమ స్థలానికి వెళ్లాను. సంగమ స్నానం చేసిన రోజున నేను పవిత్రంగా ఉపవాసం ఉన్నాను. అక్కడే స్నానానికి వచ్చిన విప్రోత్తముణ్ణి పిలిచి, అతడికి ఒక కుండలో తియ్యని పెరుగన్నాన్ని, మరో కుండలో చల్లని నీళ్లను, గొడుగును, పాదరక్షలను దానంగా ఇచ్చాను. నా జన్మలో నేను చేసిన దానం అదొక్కటే! తర్వాత ఆయువు ముగిసి, మరణించాక నేను ప్రేతాన్నయ్యాను.ఆనాడు ఆ విప్రుడికి దానం చేసిన అన్నమే అక్షయంగా మారింది. ప్రతిరోజూ మధ్యాహ్నం పెరుగున్నం కుండ, నీటి కుండ ఇక్కడకు వస్తాయి. మేమంతా భోజనం ముగించగానే అదృశ్యమవుతాయి. అతడికి ఇచ్చిన గొడుగు ఇప్పుడు జమ్మిచెట్టుగా మారి, నాకు, నా సహచరులకు నీడనిస్తోంది’ అని చెప్పాడు ప్రేతనాయకుడు.‘మిత్రమా! నీ చరిత్ర ఎంతో గొప్పగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలో, నాకు దారేదో చెప్పు?’ అన్నాడు సుధర్ముడు.‘మిత్రమా! బాధ్రపద శ్రావణ నక్షత్రయుత ద్వాదశీ వ్రతాన్ని ఆచరించు. నీకు శుభాలు కలుగుతాయి. అయితే, నాదొక కోరిక. నాకు, నా సహచర ప్రేతాలకు గయ క్షేత్రంలో పిండప్రదానాలు చేయి. నువ్వు పిండదానం చేస్తే, మాకు పిశాచరూపాల నుంచి విముక్తి దొరుకుతుంది’ అని చెప్పి ప్రేతనాయకుడు సుధర్ముణ్ణి తన భుజాలపై కూర్చోబెట్టుకుని, అడవిని దాటించి శూరసేన రాజ్యలో విడిచిపెట్టాడు.సుధర్ముడు శూరసేన రాజ్యంలో మెల్లగా చిన్న చిన్న వ్యాపారాలు చేసి, కాలక్రమంలో పెద్ద వర్తకుడిగా ఎదిగాడు. ప్రేతనాయకుడు చెప్పినట్లుగానే భాద్రపద ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు. గయ క్షేత్రానికి వెళ్లి ప్రేతనాయకుడికి, అతడి ప్రేతపరివారానికి శాస్త్రోక్తంగా పిండప్రదానాలు చేశాడు. వారితో పాటే తన పితరులకు, బంధువులకు పిండప్రదానాలు చేశాడు. సుధర్ముడు పిండప్రదానాలు చేయగానే ప్రేతనాయకుడు, అతడి సహచరప్రేతాలు దివ్యలోకాలకు వెళ్లిపోయారు. – సాంఖ్యాయనఇవి చదవండి: అద్వైత: బజ్ మంటున్న అలారం శబ్దానికి? -
ఆ పేరు వినబడితే చాలు.. వెన్నులోంచి వణుకొస్తుందట!!
గోవా అనగానే గుర్తొచ్చేది అందమైన సముద్ర తీరాలు.. అంతులేని సరదాలే! అయితే వాటితోపాటు హారర్ దృశ్యాలూ అక్కడ కామనే! వాటిల్లో ‘సాలిగావ్ మర్రిచెట్టు’ ఒకటి. సాలిగావ్ పేరు వినబడితే చాలు గోవన్లకు వెన్నులోంచి వణుకొస్తుందట. పనాజీ నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న సాలిగావ్.. హడలెత్తించే దయ్యం కథలకు ప్రసిద్ధి.‘మే డి డ్యూస్’ క్యాథలిక్ చర్చ్‌కి సమీపంలోని ఓ పెద్ద మర్రిచెట్టు వెనుక.. సుమారు 72 ఏళ్లనాటి బెదరగొట్టే హారర్ స్టోరీ ఉంది. అందుకే రాత్రి పూట ఆ చెట్టు వైపు చూడాలన్నా ఆ ఊరివారు భయపడుతుంటారు. దడపుట్టించే ఈ కథ 1952లో వినపడటం మొదలైంది.ఆ ఏడాది చివరిలో సాలిగావ్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిలెర్నేలో క్రిస్టియన్ సెమినరీ (క్రైస్తవ మతబోధనలు జరిగే విద్యాలయం) నిర్మాణం మొదలైంది. దానికి ఇనాషియో లారెంకో పెరీరా అనే పోర్చుగీస్ ఫాదర్.. మేనేజర్‌గా నియమితుడయ్యాడు. అతను సాలిగావ్లో నివాసం ఉంటూ.. సెమినరీ పనులను పర్యవేక్షిస్తూ ఉండేవాడు.ఒక ఆదివారం ఉదయాన్నే సెమినరీకి వెళ్లి తిరిగి రాలేదు. మరునాడు కూడా అతని జాడ లేకపోవడంతో.. అతని కోసం స్థానికులు, చర్చ్ ఫాదర్స్ ఊరంతా వెతకడం మొదలుపెట్టారు. ఆ గాలింపులో పెరీరా సాలిగావ్‌లోని మర్రిచెట్టు పక్కనే బురదలో అపస్మారకస్థితిలో కనిపించాడు. అతనిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ రాత్రే అతను సృహలోకి వచ్చినా 4 రోజుల పాటు మౌనంగానే ఉండిపోయాడు. ఐదోరోజు ఉదయాన్నే అతను ఆడ గొంతుతో కొంకణీ భాషలో మాట్లాడటం మొదలుపెట్టాడు.పెరీరాకు దయ్యం పట్టిందని గుర్తించిన క్రైస్తవ గురువులు.. ఆ మర్రిచెట్టుకు.. జీసస్ శిలువను రక్షణగా కట్టారు. వైద్యం అందిస్తున్నా పెరీరా ఆరోగ్యస్థితి మెరుగుపడలేదు. మరింత క్షీణించసాగింది. మధ్యమధ్యలో అతను ‘క్రిస్టలీనా’ అని అరవసాగాడు. దాంతో పెరీరాకు పట్టిన దయ్యం పేరు ‘క్రిస్టలీనా’ అని అక్కడివారు నిశ్చయించుకున్నారు.ఆధునిక వైద్యం కోసం అతనిని స్వదేశమైన పోర్చుగల్‌కు పంపించేశారు. ఇక పెరీరా తిరిగి రాలేదు. సరిగ్గా ఐదేళ్లకు అంటే 1957లో ఆ మర్రిచెట్టుకు కట్టిన శిలువ సగభాగం మాయమైపోయింది. దాంతో క్రిస్టలీనా దయ్యం తిరిగి ఆ మర్రిచెట్టును చేరుకుందని ఆ ఊరి వారు నమ్మడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ దయ్యం అక్కడే ఉందని విశ్వసిస్తారు. దాంతో అటు హిందువులు.. ఇటు క్రైస్తవులు కూడా క్రిస్టలీనాను శాంతపరచే పూజలు చేస్తూ.. రాత్రిపూట ఆ మర్రిచెట్టు దరిదాపుల్లోకి పోకుండా జాగ్రత్తపడుతున్నారు.ఆ చెట్టు గోవా మొత్తానికీ ఆత్మలు గుమిగూడే ప్రదేశమని.. అక్కడ దయ్యాలు, అతీంద్రియశక్తులు కొలువుంటాయని స్థానికుల గట్టి నమ్మకం. అందుకే అటువైపు ఎవ్వరూ పోయే సాహసం చెయ్యరు. మరి ఆ మర్రిచెట్టులో క్రిస్టలీనా ఆత్మ ఉందా? అసలు ఆమె ఎవరు? ఎందుకు పెరీరాను పీడించింది? అసలు పెరీరా ఏమయ్యాడు? ఇలాంటి సందేహాలకు నేటికీ సమాధానం లేదు. అందుకే ఇది మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
రాతల్లో నిజాయితీ: రామేశంగారు మాకు..
రామేశంగారు మాకు దగ్గరగా ఉండే, దూరపు బంధువు! ఒకే వీధిలో పక్క పక్క ఇళ్ళల్లో ఉండేవారం! ఆయన భార్య వైపు నుంచి మా నాన్నగారికి బీరకాయపీచు చుట్టరికం ఉండేది. మా అన్నదమ్ములందరం వాళ్ళని అత్తయ్య, మావయ్య అని పిలిచేవారం! మా నాన్నగారు, ఆయన ఒకే డిపార్ట్మెంటులో పనిచేసేవారు. దానికితోడు ఇద్దరూ రచయితలే! ఇవన్నీ కలవడంతో, మా కుటుంబాల మధ్య బంధుత్వం మాట ఎలావున్నా, స్నేహం ఎక్కువ కనబడేది!నేను కాలేజీ చదువులకు వచ్చేసరికే.. మా నాన్నగారు పక్షవాతంతో మంచం పట్టడం, రామేశంగారు బదిలీ మీద వేరే ఊరు వెళ్ళిపోవడంతో, మా కుటుంబాల మధ్య దూరం ఏర్పడి పోయింది. తర్వాత కాలంలో నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చి, మూడు నాలుగు చోట్ల పనిచేసిన తర్వాత బదిలీ మీద నేను తిరిగి మా ఊరు చేరాను. ఓ రోజు బ్యాంకులో పనిచేసుకుంటున్న సమయంలో, కౌంటర్ ఎదురుగా నిలబడి.. ‘నువ్వు చిట్డిబాబు కొడుకువి కదూ!’ అంటూ పలకరించారు. బుర్ర వంచి పని చేసుకుంటున్న నేను, ఆ పిలుపు వినగానే బుర్ర ఎత్తి చూశాను. రామేశం గారే!మా నాన్నగారిని ఆ పేరుతో పిలిచేవారు బహు తక్కువగా ఉండేవారు. అందులో రామేశంగారు ఒకరు! ‘అవునండీ .. మీరు రామేశం మావయ్యగారు కదూ!’ అప్రయత్నంగానే నోటంట ఆ పేరు వచ్చేసింది. ‘అవునయ్యా! ఇక్కడికి ఎప్పుడు వచ్చావూ.. మీ నాన్న ఆరోగ్యం ఎలావుంది.. ఇక్కడే ఉన్నారా? నువ్వు కూడా కథలు రాస్తావుట కదా.. మీ బ్యాంకులో పనిచేసే హరగోపాల్ చెప్పాడు! రిటైర్మెంట్ తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చేశాను!’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.అన్నిటికీ జవాబులిచ్చి.. ‘సాయంత్రం బ్యాంకు అవగానే మీ ఇంటికి వస్తాను!’ అంటూ అడ్రసు తీసుకుని ఆయన పనిచేసిపెట్టి పంపేశాను. అలా.. మా కుటుంబాల మధ్య బంధుత్వం నాతో తిరిగి మొదలైంది! అయితే మా నాన్న కదల్లేని పరిస్థితులలో ఇంటిపట్టునే ఉండేవారు. మా అమ్మ ఏ పేరంటాలకో వెళ్తుండేది. నేను ఖాళీ దొరికినప్పుడో, కథల మీద సలహాలు తీసుకోడానికో, ఆయన పని మీదో వాళ్ళింటికి వెళ్తుండేవాడ్ని! రామేశంగారి భార్య భానుమతిగారు మా ఇంటికి తరచు వస్తుండేవారు. రామేశంగారు మాత్రం ఎవరింటికి వెళ్ళేవారు కాదు! వాళ్ళ పిల్లలు కూడా అంతే.. ఎవరినీ కలసేవారు కాదు. ఇప్పుడు ఆయన మా ఇంట్లోవాళ్లందరి కంటే నాతోనే ఎక్కువ చనువుగా ఉంటున్నారు. మా ఇద్దరి అభిప్రాయాలు కలిసేవి. అలాగే.. ఆయన కథలంటే చాలా ఇష్టపడేవాడ్ని. మంచి శైలి, అభ్యుదయ భావాలతో ఆయన కథలు, ఆసాంతం చదివించేవి. ఆయన్ని కలసినప్పుడల్లా.. నాకు తెలియని చాలా విషయలు చెప్తూ ఉండేవారు.ఆయనతో బాగా చనువు ఎర్పడటంతో, నేను రాసే కథలను ఆయనకే మొదట చూపెట్టేవాడ్ని! బావుండకపోతే.. మొహం మీదే చెప్పేవారు. ఆయన సూచనలు తీసుకుని మార్పులు, చేర్పులు చేసి, మళ్ళీ ఆయన ఓకే అన్న తర్వాతే, పత్రికలకు పంపేవాడ్ని! ఓ సంవత్సర కాలం గడిచిన తర్వాత, ఉన్నట్టుండి రామేశంగారికి మోకాలు నొప్పి వచ్చి, బయటకు వెళ్ళడం తగ్గిపోయింది. ఆ విషయమే ఓ రోజు ఫోన్ చేసి.. ‘చేతి వేళ్లు కూడా పూర్తిగా పట్టు తప్పాయి! నీ అవసరం తరచు ఉంటుంది!’ అంటూ, బ్యాంకు పని ఏదో పురమాయించారు. బ్యాంకులో పని ఎక్కువగా ఉండటంతో, వెంటనే వాళ్ళింటికి వెళ్ళలేకపోయాను.ఓ నెల రోజుల తర్వాత వీలు చూసుకుని రామేశంగారిని చూడ్డానికి వెళ్ళాను. తలుపు తీస్తూ.. ‘రా నాయనా! ఈ మధ్య బొత్తిగా నల్లపూస అయిపోయావు! కూర్చో కాఫీ ఇస్తా!’ అంటూ మా అత్తయ్య, నా మాట వినిపించుకోకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది.‘మార్చి నెల కదా.. బ్యాంకులో చాలా బిజీగా ఉంది! ఇంటికి వెళ్ళేసరికే రాత్రి పది దాటిపోతున్నది!’ అంటూ రామేశంగారి మంచం దగ్గరకి కూర్చి లాక్కుని కూర్చున్నాను. అప్పుడు చూశాను.. మరో కుర్చీలో ఒకావిడ కూర్చుని ఉంది. ఆవిడ్ని నేనెప్పుడూ చూడలేదు.‘ఏంలేదోయ్.. మీ అత్తయ్యలాగే ఈ మధ్య నా చేతివేళ్ళు కూడా నా మాట వినడం లేదు! మెదడు నాదే కదా.. ఇంకా నా చెప్పు చేతల్లోనే ఉంది!’ అంతలో అక్కడికి వచ్చిన మా అత్తయ్య, రామేశంగారి మాటలకు అడ్డం పడుతూ.. ‘చోద్యం కాకపోతే.. డొంకతిరుగుడు లేకుండా విషయం తిన్నగా చెప్పొచ్చుగా!’ అంటూ, నాకు కాఫీ గ్లాసు అందించింది. ‘కథలలో వర్ణనలు, ఉపోద్ఘాతాలు, ఉపమానాలు లేకపోతే, నువ్విచ్చే కాఫీలా చప్పగా ఉంటుంది!’ ఆవిడతో అని..నావైపు చూపు మరలుస్తూ ‘ఏం లేదేయ్.. ఈ మధ్య రాయడం కూడా కష్టంగా ఉంది. అందుకే.. నా రాతకోతలన్నీ ఈ అమ్మాయి చేత చేయిస్తున్నాను. ఓ రకంగా స్టెనోగ్రాఫర్ అనుకో!’ అన్నారు రామేశంగారు.‘కథలు రాసే స్టెనోగ్రాఫర్ అన్నమాట!’ నవ్వుతూ అంటూ, కాస్సేపు మాట్లాడి వచ్చేశాను. తర్వాత రోజుల్లో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ‘ఎక్కడైనా వంట మనిషినో, పని మనిషినో పెట్టుకుంటారు గాని, ఇలా కథలు రాయడానికి మనిషిని పెట్టుకోవడం ఎప్పుడూ వినలేదురా అబ్బి!’ మా అత్తయ్య నవ్వుతూ నాతో అంటుండేది.‘కదల్లేని కథల మనిషికి, నీలా కథలు చెప్పేవారు కాకుండా, కథలు రాసేవారు కావాలి కదోయ్!’ ఆయన కూడా నవ్వుతూ అనేవారు. ‘ఎప్పుడు చూసినా మన కొంపల్లో పదిమంది ఉండేవారు! ఇప్పుడేం వుంది.. లింగు లింగుమని ఇద్దరేసి ఉంటున్నారు! ఈ వయసులో మరో మనిషి సాయం మంచిదే కదా నాయనా!’ అంటూ మా అత్తయ్య కూడా ఆవిడతో సరదాగానే ఉండేది.ఓ రోజు బ్యాంకులో పని చేసుకుంటుంటే, రామేశంగారి నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ అత్తయ్య చనిపోయింది, అర్జంటుగా నువ్వు రావాలి’ అంటూ కంగారుగా చెప్పి ఫోన్ పెట్డిశారు!ఒక్కసారిగా నిర్ఘాంత పోయాను. ‘ఆవిడ ఎప్పుడూ ముక్కు చీదిన సందర్భం కూడా లేదు.. అలాంటిది ఈ ఘోరం ఎలా జరిపోయిందో..’ అనుకుంటూ బ్రాంచి మేనేజరు దగ్గరికి వెళ్ళి, విషయం చెప్పి, సెలవు పెట్టి రామేశంగారింటికి వెళ్ళాను. అప్పటికే వాళ్ళ పిల్లలు, బంధువులు వచ్చి, తర్వాత కార్యక్రమం గురించి అటూ ఇటూ తిరుగుతున్నారు. రామేశంగారు దిగులుగా ఓ పక్కన కూర్చుని ఉన్నారు. ఆయన్ని ఎలా పలకరించాలో తెలియలేదు. దగ్గరకి వెళ్ళి గట్టిగా చేతులు పట్టుకున్నాను. ప్రశాంతంగా నిద్ర పోతున్నట్టున్న మా అత్తయ్యని చూడగానే, నా కళ్ళు చెమర్చాయి.‘నిన్న రాత్రి వరకు బానే ఉందయ్యా.. ఉదయాన్నే కొంచెం నలతగా ఉందంటే, డాక్టరు రామ్మూర్తికి ఫోన్ చేశా. ‘మీరు రావొద్దు.. నేనే హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు, మీ ఇంటికి వచ్చి చూస్తానులెండి!’ అంటూ ఓ పది నిమిషాల్లో వచ్చాడు. ఆయన వచ్చేలోగా.. అదిగో ఆ దివాను మీద పడుకుంది పడుకున్నట్టే పోయింది! హార్ట్ అటాక్ట. పాపం అది చెప్పడానికి రామ్మూర్తి వచ్చినట్టైంది! బీపీ, షుగరు, బెల్లం అన్నీ నాకున్నాయి గాని, మీ అత్తకి ఎప్పుడూ తుమ్ము కూడా రాలేదు! సునాయాసంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది!’ అంటూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకున్నారు. ఓ గంటలో కార్యక్రమం అంతా ముగిసి, రామేశంగారు ఇంట్లో ఒంటరైపోయారు. ఆయన పక్కన మౌనంగా కాస్సేపు కూర్చున్నాను. ఆ కథలు రాసే ఆవిడ కూడా ఆయన పక్కనే కూర్చుంది. ‘నాకు తప్పదులే.. పనేమైనా ఉంటే ఫోన్ చేస్తాను! అన్నట్టు.. మీ అమ్మా, నాన్నలకి ఈ విషయం అంత అర్జంటుగా చెప్పకు. మెల్లగా వీలు చూసుకుని చెప్పు’ అంటూ ఆయన నెమ్మదిగా కళ్ళు మూసుకున్నారు. జలజలరాలే నీటిబొట్లు ఆయన ఒళ్లో పడుతుండటం నేను మొదటిసారి చూశాను. కాలగర్భంలో ఆర్నెల్లు గడిచిపోయాయి. ఆ రోజు లంచ్ టైములో.. ‘నీకీ విషయం తెలిసిందా!?’ అంటూ మా కొలిగ్ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నోట్లో ఇడ్లీ ముక్క పెట్టుకుంటూ.. తెలియదన్నట్టు తలూపాను. ఎడం చేత్తో సెల్ఫోన్లో ఓ ఫొటో చూపెట్టేడు. అది చూస్తూనే ఒక్కసారిగా షాక్ తగిలినట్టైయింది. నా నోటంట మాట రాలేదు.‘నిజం కాదే’ అన్నట్టు అతని వైపు చూశాను. ‘ఓ వారం కిందట.. మా ఫ్రెండ్ అక్కడకి ఏదో పని మీద వెళ్తే, కనబడ్డారుట.. మీ మావయ్యగారు వీల్ చైర్లో ఉన్నారుట, పక్కన ఆవిడ ఉందిట!’ అంటూ ఆ విషయాన్ని మా కొలిగ్ కళ్ళకు కట్టినట్లు చెప్తుంటే, నమ్మలేకుండా ఉండిపోయాను. లంచ్ తర్వాత కౌంటర్లో కూర్చుని పని చేసుకుంటున్నానే గాని, ఆలోచనలతో మనసంతా కకావికలమైంది!ఓ నాలుగు రోజులు ఆ ఆలోచనలతోనే గడిపాను. ఏం చేయాలో తోచలేదు. ‘అసలు ఏం చేయగలను?’ అనుకుంటూ సమాధాన పడిపోయాను.ఆ రోజు.. బ్యాంక్‌లో పని పూర్తిచేసి, టేబుల్ సర్దుకుంటుంటే సెల్‌ఫోన్ మోగింది. రామేశంగారి నుంచి.. ఉలిక్కిపడ్డాను! ఫోన్ ఆన్ చేశాను గాని, మాటలు వెతుక్కుంటూ, తడపడ్డాను!‘బ్యాంకులో ఉన్నావా.. అందరూ బావున్నారా?’ ఆయన మాటల్లో కాస్త వ్యంగం కనబడింది. కారణం.. ఈమధ్య కాలంలో నేను ఆయన్ని కలవలేదు, ఫోన్లో మాట్లాడిందీ లేదు! ‘అందరూ బావున్నారండీ! బ్యాంకులో చాలా బిజీగా ఉంది.. రాలేకపోయాను!’ పొడి పొడిగా వచ్చాయి నా మాటలు.‘ఏం లేదోయ్.. మీ బ్యాంకులో ఉన్న నా పెన్షన్ అకౌంట్‌కి నామినేషన్ మార్చాలి! ఆ ఫారం పట్టుకుని ఓసారి రా.. !’ ఎప్పటిలాగే.. హుకుం జారిచేసినట్టు అన్నారు. భార్య పోయిన తరువాత పెన్షన్ అకౌంట్‌కి నామినేషన్ ఇవ్వకపోయినా కొంపలు మునిగిపోవు! అయితే ఆయన చాదస్తం తెలిసిన వాడ్ని కాబట్టి ‘రేపు వస్తాను!’ అంటూ ఫోన్ కట్ చేశాను.ఆయనింటికి వెళ్ళి, ఆయన్నెలా ఫేస్ చెయ్యాలో అర్థం కాలేదు! మర్నాడు ఉదయం బ్యాంకుకి ఓ పావుగంట ముందే బయలుదేరి, మధ్యలో ఆయనింటికి వెళ్ళాను.‘ఏమిటీ.. ఈ మధ్య మరీ నల్లపూసవై పోయావు..’ ఆ మాటలకి సమాధానం చెప్పకుండా.. ముభావంగా నా చేతిలో బ్యాంకు ఫారం ఆయనకి ఇచ్చి ఎదురుగా కూర్చున్నాను. ఆయన ఆ ఫారం నింపుతూ.. ‘ఏంలేదోయ్.. పోయే వయసే కదా, తర్వాత పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఈ జాగ్రత్తలు!’ అంటూ నా వైపు క్రీగంట చూస్తూ అన్నారు. వంటింట్లో నుంచి ఆవిడ కాఫీ తెచ్చి, నాకు అందించింది. ఆవిడలో మార్పు నాకు ఏం కనబడలేదు. ‘మా పిల్లలు బానే చూస్తారు, వాళ్ళ దగ్గరకి వచ్చేయమని అంటారు. కానీ, నాకీ కాగితాల్ని వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదు! ఆ మాట ఎలా ఉన్నా, ఓసారి చూసి.. అన్ని సరిపోయాయో లేదో చెప్పు!’ అంటూ నింపిన ఫారాల్ని నా చేతిలో పెట్టారు. ఫారంలో ఆయన ఫించన్ అకౌంట్ ఎదురుగా నామినీ పేరుని చూసి, నుదురు చిట్లించి, ఆయన వైపు చూశాను.‘ఉన్న ఈ రెండిళ్లు, బ్యాంకు డిపాజిట్లు మా పిల్లలకి రాసేశాను. ఆ ఫించన్..’ అంటూ నా వైపు చూశారు. నా మొహంలో ఏం కనబడిందో.. మళ్ళీ ఆయనే అన్నారు.. ‘ఈ అమ్మాయి తెలుసుగా, ఆమెకి ఎవరూ లేరు. ఓ అనాథ! నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. నీకేమిటి.. అందరికీ తెలుసులే, అదేం రహస్యం కాదు! ఇదిగో ఇలా ఈ వీల్ చైర్లోనే అక్కడికి వెళ్ళాను! ఎవరికీ నచ్చదు, కాని..’ అంటూ ఓ పుస్తకంలో ఉన్న, ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ నాకందించారు. అయితే.. ఆయన దాన్ని మామూలు విషయంలా చెప్పడం నాకు చాలా చిరాకు కలిగింది.మాట్లాడాలనిపించలేదు! ‘మీ అత్తయ్య వెళ్ళిపోయిందిగా, నా తదనంతరం నా పెన్షన్ తీసుకోవడానికి ఎవరూ లేరు! ఈ అమ్మాయికా.. పాపం ఎవరూ లేరు, జీవనాధారం కూడా లేదు! అందుకే.. అలా చేశాను! అంతే గాని, అందరూ అనుకుంటున్నట్టు కాదులే! ఈ సర్టిఫికెట్తో అమ్మాయికి ఓ ఆధారం దొరుకుతుంది! ఆ విషయమే మా ఆఫీసు వాళ్ళకి ఈ రోజే ఆర్జీ కూడా పంపిసాను! బ్యాంకులో కాస్త ఈ పని చేసి పెట్టు!’ అంటూ గబగబా ఆయన చెప్పదలుచుకుంది చెప్పేశారు.ఆ క్షణంలో.. ఆయనకి.. ఏం చెప్పడానికీ నాకు ధైర్యం సరిపోలేదు! ‘సరే.. వస్తాను!’ అంటూ బ్యాంకు దారి పట్టాను.బ్యాంకులో ఉన్నంతసేపు ఆయన గుర్తుకు రాలేదు. కాని సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత, తిరిగి నా ఆలోచనలు ఆయన చేసిన పని చూట్టూరే తిరిగాయి!ఆ రాత్రి ఏదో ఆలోచిస్తున్న నాకు ఒక్కసారిగా.. ఏదో స్ఫురించి, సెల్‌ఫోన్ తీసుకున్నాను. ‘మావయ్యగారు నమస్కారం! నా ఈ అభిప్రాయాన్ని మీ ముందు చెప్పే ధైర్యం లేదు.. అలా అని చెప్పకుండా ఉండనూ లేను! అందుకే ఈ మెసేజ్! మీ మ్యారేజ్‌ని సమాజం కొందరు తప్పని అనొచ్చు.. లేదా వెనుకనున్న మీ ఆలోచనని కొంతమంది మెచ్చుకోవచ్చు! కాని నిజానికి.. మీ ఆలోచనని అచరణలో పెట్టడానికి, మీకు పెళ్ళి తప్పనిసరైంది! అసలు మీ ఆలోచనే తప్పు! మీ ఆస్తిలో కొంత ఆవిడకి ఇచ్చుంటే హర్షించేవాడ్ని, కాని ప్రభుత్వం ఇచ్చే ఈ సౌకర్యాన్ని, మీరు దుర్వినియోగం చేశారు! ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయాలు పెన్షన్ల కింద ప్రభుత్వం ఇస్తున్నది. సమాజసేవ అంటూ మీలా అందరూ పెన్షన్లని ఎవరికో ఒకరికి రాసేస్తుంటే.. ఈ దుర్వినియోగనికి ఇంక అంతు ఉండదు! వాటిని చెల్లించడానికి ప్రభుత్వం తిరిగి మన మీదే పన్నులు వేస్తుంది!మీరు చేసిన పని చట్టసమ్మతం కావొచ్చు. కాని ఈ దేశ పౌరుడుగా నాకు సమ్మతం కాదు! మీ రాతల్లో కనబడే నిజాయితీ, చేతల్లో కనబడలేదు!క్షమించండి.. ఇది మూమ్మాటికీ తప్పే!’ మెసేజ్ టైపు చేసి, రామేశంగారికి పంపాను! తర్వాత.. నాకు నిద్ర పట్టడానికి అట్టే సమయం పట్టలేదు! – జయంతి ప్రకాశశర్మ -
మధిర టు తిరుపతి.. ‘సారూ.. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!'
‘సారూ..’ అన్న శబ్దం నా చెవి గూబను కాస్త గట్టిగానే చరిచింది. నా భార్యతో మాటలకు మధ్యలో కామా పెట్టి, ఎవరాని అటు దిరిగి చూశాను. వయస్సు అర్ధసెంచరీకి అవతలిగట్టు. అరవై ఏళ్లవరకూ ఉండొచ్చు. మాసిన చొక్కాకు అక్కడక్కడా చిన్నపాటి చిరుగులు. కింద లుంగీ.. ఇంకొంచెం పెద్ద చిరుగులతో చొక్కాను డామినేట్ చేస్తోంది. నెత్తిన జుట్టు దుమ్మును పులుముకొని చిందరవందరగా వుంది. కుడికాలికి పిక్క మునిగే వరకు కట్టు. కట్టుకట్టి చాలారోజులైందన్నట్టు తెల్లటి కట్టు మట్టి పులుముకొని కనిపించింది. మనిషిని చుట్టుముట్టిన పేదరికం ఛాయలు.‘ఏంటన్నట్లు?’ అతనివైపు చూశాను. ‘సారూ.. నేను హైదరాబాద్‌కు పొయ్యే రైలెక్కాలి. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!’ బతిమిలాడుతున్నట్లు మాట, అభినయం. ‘సరే చెబుతా! అక్కడ కూర్చోనుండు’ పక్కనే ఉన్న అరుగు చూపించి అన్నాను. ‘మర్చిపోవద్దు సారూ.. నీ కాళ్లు మొక్కుతా’ అంటూ మరింత దగ్గరగా వచ్చి నా కాళ్లపైకి వంగాడు.అతన్నుంచి జారి మందు వాసన నా ముక్కు పుటాలను తాకింది.ముఖం చిట్లించి ‘చెప్పాను కదా.. అక్కడ కూర్చో, రైలొచ్చినప్పుడు చెబుతా’ కాస్త విసుగ్గా అన్నాను.‘గట్లనే సారూ ..’ రెండడుగులు వెనక్కువేసి నిలుచున్నాడు.నేను, నా భార్య హైదరాబాద్ వెళ్లేందుకు బాపట్ల రైల్వేస్టేషన్ లో రైలు కోసం వెయిట్ చేస్తున్నాము. మా కూతురు, అల్లుడు హైదరాబాదులో కాపురంపెట్టి నెలన్నర. ప్రసవం పూర్తయి బిడ్డకు జన్మనిచ్చాక అయిదవ నెల వచ్చేవరకు కూతురు గాయత్రి మాతోనే ఉంది. అప్పటికే మనవడు గిర్వాన్ కాస్త వొళ్లుచేశాడు. కాళ్లు, చేతులు హుషారుగా ఆడించడం, కనుగుడ్లు పెద్దవిచేసి చూడడం, బోర్లా తిరగడం, మనం నవ్వితే.. నిశితంగా పరిశీలించి నవ్వడం, హెచ్చరికలకు స్పందించడం మొదలు పెట్టాడు.మనవడి మురిపెంలో అయిదు నెలలు అయిదు రోజుల్లా గడిచాయి. అల్లుడిది ప్రైౖవేటు కంపెనీలో ఉద్యోగం. తానెలాగోలా బాబును సగదీరుకుంటానని చెప్పి కూతురు హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. మనవడి జ్ఞాపకాలు మరువలేక బుడ్డోన్ని చూడాలని నా శ్రీమతి తహతహలాడిపోయింది. నాకూ కాస్త అలానే ఉన్నా బయటపడలేని స్థితప్రజ్ఞత.ఇంతలో ఆరవనెల అన్నప్రాశన అని కూతురు కబురుపెట్టింది. కాగలకార్యం కాలం తీర్చినట్లు హైదరాబాద్ ప్రయాణం ఖరారైంది. రాత్రి పది గంటలకు సింహపురి ట్రైన్ లో ప్రయాణం. మనవడి కోసం బట్టలు, పెద్ద దోమతెరతో పాటు ఏమేమి తీసుకురావాలో కూతురు రెండు రోజులుగా పదేపదే లిస్ట్ చదివింది. నా శ్రీమతి.. కూతురు వద్దన్న వాటిని కూడా బ్యాగుల్లో బలవంతంగా కూర్చి ఉరువుల సంఖ్యను అయిదుకు పెంచింది.‘బయలుదేరేటప్పుడు, రైలు ఎక్కేటప్పుడు బ్యాగులను కౌంట్ చేయండి’ అన్న కూతురు ముందుచూపు సూచనలతో ఉరువులు లెక్కగట్టి రైల్వేస్టేషన్‌కు చేరుకునేసరికి రాత్రి తొమ్మిదిన్నర గంటలైంది. ప్లాట్‌ఫారంపై మరోమారు బ్యాగులు లెక్కగట్టి సంతృప్తి చెందాక అక్కడే ఉన్న అరుగుపై కూర్చుంది మా ఆవిడ. రైలు రావడానికి అరగంట సమయముంది. ‘అన్నీ సర్దావా? ఏవైనా మరచిపోయావా?’ అన్నమాటకు ‘గుర్తున్నకాడికి’ అంది. ఇంతలో కూతురు ఫోన్ . లగేజీల ప్రస్థానంపై ఆరా.ఆమె కొడుకు అన్నప్రాశన కోసం తీసుకున్న వెండి గిన్నె, స్పూన్, గ్లాసు ఎక్కడ మరచి పోతామో? అన్నది ఆమె టెన్షన్ . ఒకపక్క రైళ్ల రాకపోకల అనౌన్స్మెంట్లు, ప్రయాణికుల ఉరుకులు, పరుగులు. రైళ్లు ఎక్కి, దిగే ప్రయాణికుల రద్దీతో ప్లాట్‌ఫారాలు సందడిని నింపుకోగా, ఈ మధ్యే రంగులద్దుకున్న రైల్వేస్టేషన్ రాత్రిపూట ఎల్ఈడీ కాంతుల వెలుగుల్లో కన్నులకింపుగా కనపడుతోంది.‘సార్.. సార్’ అంటూ పెరుగెత్తుకుంటూ వచ్చాడు మళ్ళీ ఆ వ్యక్తి. ‘ఏమిటన్నట్లు?’ చూశాను.‘రైలు వస్తున్నట్టుంది సార్! హైదరాబాద్ దేనా?’ అన్నాడు. సీరియస్‌గా ముఖం పెట్టి ‘నువ్వెక్కడికెళ్లాలి?’ అన్నాను. ‘హైదరాబాద్ పొయ్యే రైలుకే సార్’‘ఎక్కడ దిగాలి?’ ఊరి పేరు చెప్పాడు. ఏపీ సరిహద్దులో ఉన్న తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఊరు.‘మేమూ ఆ రైలుకే వెళుతున్నాము, మాతో పాటు ఎక్కుదువులే’ అన్నాను. ‘దండాలు దొరా.. ఈ ఒక్క సాయం చెయ్యి.. మా అయ్య కదూ’ అని మరీ వంగి కాళ్లను తాకుతూ దండం పెట్టాడు. మందు వాసన నాతోపాటు పరిసరాలనూ పలకరిస్తోంది. నేను వెనక్కు తగ్గాను. ‘మర్చిపోబాకు సారూ రైలు రాగానే నాకు చెప్పు.. ఏమీ అనుకోకు’ అంటూ చేతులు జోడించాడు.తను పదేపదే దగ్గరగా రావడం నన్ను మరింతగా ఇబ్బంది పెడుతోంది. కోపం, చిరాకు తెప్పిస్తోంది. ‘సరే.. చెబుతానన్నా గదా, రైలు రాంగానే చెబుతా, పొయ్యి అరుగు మీద కూర్చో’ అన్నాను.‘కోప్పడకు సారూ.. మరచిపోతావేమోనని చెపుతాండాలే ’ కొంచెం దూరం జరిగాడు. మరికొద్దిసేపట్లో గూడూరు– సింహపురి ఎక్స్‌ప్రెస్ మూడవ నంబర్ ప్లాట్పారంపైకి రానుందని తెలుగు, ఇంగ్లిష్, హిందీలో అనౌన్స్మెంట్. అప్పటికే కిక్కిరిసిన జనం అలర్ట్ అయ్యారు. రైలు వస్తుందంటూ తోటి ప్రయాణికులతో చర్చలు. కొందరు షాపుల్లో వాటర్ బాటిళ్లు కొంటున్నారు, ఇంకొందరు పిల్లలకు బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్ కొనిపిస్తున్నారు, మరికొందరు ఫోన్లో రైలు వచ్చిందంటూ ఇంటికి కబురు చెబుతున్నారు, కొందరు బయలుదేరుతున్నామంటూ గమ్యంలోని వారికి సమాచారం చేరవేస్తున్నారు. ప్రయాణికుల కోలాహలం పెరిగింది.మరోమారు నా భార్య మా లగేజీ బ్యాగులు లెక్కగట్టింది. మా కూతురు కౌంటింగ్ సూచనల ప్రభావం ఆమెను వీడనట్లుంది. ‘బ్యాగులు అన్నీ ఉన్నాయా?’ అన్న అర్థం వచ్చేలా ఆమెవైపు చూశాను. ఈసారి ఆమె నవ్వింది. ‘సార్..సార్ ఇదో టీ తీసుకోండి, వేడివేడి టీ..’ పరుగులాంటి నడకతో వచ్చాడు ఆ వ్యక్తి. సీరియస్‌గా చూశాను. ‘మీ కోసమే తెచ్చాను, టీ తాగండి సర్’ అన్నాడు. నాకు కోపం నసాలానికెక్కింది. చుట్టుపక్కల ప్రయాణికుల దృష్టి చాలాసేపటి నుంచి మా ఇద్దరిపైనే ఉంది. ప్రతిసారీ అతను వేరెవరి దగ్గరకు వెళ్లకుండా నావద్దకు వచ్చి బతిమిలాడుతుండడంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. మరోమారు అందరూ నావైపు చూశారు. కోపం కంట్రోల్ చేసుకున్నాను.‘ఇప్పుడే ఇంట్లో అన్నం తిని వస్తున్నాను, ఇప్పుడు టీ తాగను, నువ్వు తాగు’ ఒక్కో అక్షరం గట్టిగా నొక్కి పలికుతూ కళ్లెర్ర చేశాను.నా ఆగ్రహం పసిగట్టినట్లున్నాడు, దూరంగా వెళ్లి టీ తాగి అక్కడే నిల్చున్నాడు. ట్రైన్ వస్తోందంటూ మరోమారు అనౌన్్సమెంట్. ప్లాటుఫారంపై డిస్ప్లేలలో రైలు నంబర్, బోగీ నంబర్లు వేస్తున్నారు. అది చూసి ప్రయాణికుల్లో హడావుడి. అటూ ఇటూ వేగంగా కదులుతున్నారు. ‘సార్ రైలొచ్చిందా?’ ఈసారి కాస్త దూరం నుంచే అడిగాడు ఆ వ్యక్తి.‘ఆ.. వస్తాంది. ఇక్కడే ఉండు ఎక్కుదాం’ అన్నాను. ‘సరే.. సరే’ అంటూ నాకు దగ్గరగా వచ్చి నిల్చున్నాడు.నా భార్య మరోమారు బ్యాగులను చూపుడు వేలితో లెక్కించడం కనిపించింది. రైలు కూతతోపాటు దాని వెలుతురు తోడుగా ప్లాట్ఫారం పట్టాలపైకి భారంగా వచ్చి ఆగింది. మేమున్న దగ్గరకి కొంత అటు ఇటుగా మేము ఎక్కాల్సిన బీ–5 ఏసీ స్లీపర్ బోగి ఉంది. నా భార్య, నేను చెరో రెండు బ్యాగులు చేతికి తీసుకున్నాం. ఆదరబాదరగా వచ్చి ‘ఇటివ్వు తల్లీ’ అంటూ నా భార్య చేతిలోని రెండు బ్యాగులు తీసుకున్నాడా వ్యక్తి. ఆమె ఇంకో బ్యాగు తీసుకుంది. నా వెంటే బ్యాగులు మోసుకొచ్చాడు. బోగీలో మాకు కేటాయించిన సీట్ల వద్ద బ్యాగులు పెట్టాను. నా భార్యకు సీటు చూపించి కూర్చోబెట్టి.. ‘నీది యే బోగి?’ అడిగాను ఆ వ్యక్తిని. ‘నాదిక్కడ కాదు సారూ..’ అన్నాడు. ‘పద నీ బోగీలో దిగబెడతా’ అన్నాను. ‘నాదిక్కడ కాదులే సారూ..’ అన్నాడు మళ్లీ. ‘ఏదీ.. నీ టిక్కెట్ చూపించు? సీటెక్కడో చెబుతా’ అన్నాను. ‘టికెట్ లేదు సారూ..’ అన్నాడు.‘అదేంటి! టికెట్ తీసుకోలేదా?’ ‘లేదు సారూ.. అయినా మాకెందుకు సారూ టికెట్, మమ్మల్ని టికెట్ అడగరులే’ అన్నాడు. ‘టీసీ వచ్చి చెక్ చేస్తే?’ ‘అది మీకు సారూ.. మాకు కాదులే’ నసగుతూ అన్నాడు‘ఎందుకు?’ అన్నట్లు చూశాను. ‘నేను అడుక్కునేటోన్ని సారూ.. మాకు టిక్కెట్ గట్ల లేదులే’ అన్నాడు. ఆశ్చర్యమేసింది. మాసిన బట్టలు, ఆహార్యం చూస్తే అచ్చమైన పల్లెటూరి అమాయకుడిలా ఉన్నాడు తప్పించి మరీ అడుక్కునేవాడిలా కనిపించలేదు.‘నువ్వు అడుక్కుంటావా?’ అన్నాను. ‘అవును సారూ.. నేను బిచ్చగాన్ని’ అన్నాడు.నాముందు దాదాపు గంటపాటు రైల్వేస్టేషనులో ఉన్నాడు, నాకే టీ ఇవ్వబోయాడు, ఎవ్వరినీ డబ్బులు అడుక్కోలేదు. మనస్సు ఏదోలా అయ్యింది. తను అబద్ధం చెబుతున్నాడేమో! ‘నిజం చెప్పు నువ్వు అడుక్కుంటావా?’ అడిగాను. ‘నిజం సారూ.. నేను బిచ్చగాన్నే, ఆరేళ్లుగా అడుక్కుంటున్నాను’ అన్నాడు. ‘అంతకుముందు?’‘రైతును సారూ’ అన్నాడు. ఉలిక్కి పడ్డాను. తనవైపు తేరిపార చూశాను. రైతు కుటుంబంలో పుట్టిన నాకు తన మాటలు మనస్సులో అలజడి సృష్టించాయి. నా భార్యకు మళ్లీ వస్తానని చెప్పి తనతో పాటు బోగీల వెంట నడుస్తున్నాను. నాగటి చాళ్లలో నడచినట్లు కాలి పాదాలు తొసుకుతున్నాయి. సరిగ్గా అడుగులు వేయలేకపోతున్నాను. మనసుదీ అదే స్థితి. మెదడు గతితప్పింది.‘యే.. టిఫినీ.. టిఫినీ.. ఇడ్లీ వడా, ఇడ్లీ వడా... సార్ వాటర్.. వాటర్, కూల్‌డ్రింక్స్..’రైలు బోగీల్లో అరుపుల గోల. నా మనసు ఘోషపై ధ్యాసపెట్టిన నా చెవులు వాటిని పట్టించుకోలేదు. ఎలాగోలా జనరల్ కంపార్ట్మెంట్ కొచ్చాను. ఖాళీగా ఉన్న సీటుపై కూర్చున్నాను. ‘కూర్చో’ ఆ వ్యక్తికి సీటు చూపించాను.‘పర్లేదు సారూ నేను నిలుచుంటా’ అన్నాడు. చెయ్యిపట్టి కూర్చోబెడుతూ ‘నీ పేరు..?’ అడిగాను. ‘సోమయ్య సారూ..’‘నీ కథ వినాలని ఉంది చెప్పు సోమయ్యా..’ అన్నాను. ఒక్కక్షణం.. మొదలుపెట్టాడు.‘మాది మధిర దగ్గర పల్లెటూరు సారూ. చిన్న రైతు కుటుంబం. ఒక కొడుకు, ఒక కూతురు. రెండెకరాల మెట్ట. వానొస్తేనే పైరు, లేకుంటే బీడు. రెక్కలు గట్ల కట్టెలు జేసుకొని పని చేసేటోల్లం. అప్పులతో పెట్టుబడి, కరువులతో కష్టాలు. ఒక పంటొస్తే నాలుగు పంటలు పొయ్యేటియి. వడ్డీలు పెరిగొచ్చి అప్పులు కుప్పబడె. తీర్చే దారి దొరక్కపాయ.ఎదిగొచ్చిన కూతురును ఇంట్లో పెట్టుకోలేంగద సారూ.. ఎకరం అమ్మి బిడ్డ పెండ్లిజేస్తి. నా కష్టం పిల్లోడికొద్దని వాన్ని డిగ్రీ దాకా చదివిస్తి. అప్పులోల్లు ఇంటిమీద పడి ఆగమాగం జేస్తిరి. నానా మాటలు పడితి. అయి భరించలేక ఉరిపోసుకుందామని తీర్మానం జేసుకుంటి. భార్యా, కొడుకు దావలేని రీతిన వీధిన పడ్తరని మనసు మార్చుకుంటి. సేద్యం ఇక కుదిరేకత లేదని తీర్మానం జేసుకుంటి. ఉన్న అప్పు వడ్డీలతో గలిపి అయిదు లక్షలకు ఎగబాకె. ఎకరం అమ్మి లొల్లిజేసేటోల్లకు కొంత అప్పుగడ్తి. మా ఊర్లో నా దోస్తుగాల్లు కొందరు సేద్యం ఎత్తిపెట్టి చిన్నచిన్న యాపారాలకు బొయ్యి బాగానే సంపాదిస్తున్నారు. వో దినం నా బాధ వారికి మొరపెట్టుకుంటి.‘మాతో వస్తావా?’ అనిరి. అట్టే అని జెప్పి వొకనాడు వాల్లతో పాటు తిరుపతి రైలెక్కితి. ఎట్టోకట్ట గడ్డనెయ్యి స్వామీ అని ఎంకన్న స్వామికి మొక్కుకుంటి. తిరపతి బొయ్యి చూస్తే నా దోస్తుగాల్లు జేసే యాపారం బిచ్చమెత్తకోవడమని తెలిసె సారూ. పొద్దున లేచింది మొదలు రాత్రి దాకా అడుక్కోడమే. ‘ఇదేందయ్యా ఇట్టాంటిదానికి దెస్తిరే’ అని తొలిరోజు మనసురాక యాతనపడితి.కలోగంజో కలిగిన కాడికి నలుగురికి పెట్టినోల్లం, ఇప్పుడు అడుక్కునే రోజులొచ్చే అని కుమిలిపోతి. అప్పుతీర్చాల, కొడుకును దారిలో పెట్టాల. మనకాడ యేముందని యేం యాపారం జేస్తాం! మనసుకు నచ్చజెప్పుకుంటి. ఆ రోజు నుంచి అడుక్కోడం మొదలు పెడ్తి సారూ. రెండువారాలు బిచ్చమెత్తడం ఇంటికి రాడం, రెండు రోజులుండి మల్లీ పోడం, నెలాఖరుకు రావడం రెండు రోజులుండి మల్లీ పోడం. ఆరేండ్ల కాలం గడచిపాయ దొరా.’మనసు బాధను పంచుకొనేదానికి దోస్తానా దొరికిండనుకున్నాడేమో? ఏకబిగిన తన కథ చెప్పాడు సోమయ్య. మనసును పిండేసే కథ. నేలను కదలించే కథ. కొన్ని నిమిషాలపాటు మా మధ్యన మాటల్లేవు. అంతా నిశ్శబ్దం. రైలు ఇనప చక్రాల రోదనా నా చెవికెక్కడం లేదు.కొద్దిసేపటి తరువాత.. ‘ఇప్పుడెలా ఉంది పరిíస్థితి’ అడిగాను. ‘బాగుందిసారూ .. అప్పులు తీర్చాను, ఊర్లో పాత ఇంటిని రిపేర్ చేసుకున్నాను. కొడుకు హైదరాబాద్‌లో కంపెనీలో చేరాడు’ చెప్పాడు.‘రైతుగా పదిమందికి పెట్టినోడివి బిచ్చమెత్తడం ఇబ్బందిగా లేదా సోమయ్యా..’ ‘ఎందుకుండదు సారూ.. ఎదుటి మనిషి ముందు చేయిచాచగానే కొందరు చీదరించుకుంటారు, కొందరు పనిజేసుకొని బతకొచ్చుగా అంటారు. కొందరు అసహ్యంగా చూస్తారు. కొందరైతే నానాతిట్లు తిడతారు’ అన్నాడు.‘మాటలు పడ్డప్పుడు బాధనిపించదా?’ అన్నాను.‘అనిపిస్తుంది సారూ.. కచ్చితంగా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడల్లా రైతుగా నేను పడిన కష్టాలు కళ్ల ముందేసుకుంటాను. పంట కోసం తెచ్చిన అప్పులు గట్టమని అప్పులిచ్చినోల్లు తిట్టిన తిట్లు గుర్తుకు తెచ్చుకుంటాను. తోటి మనిషన్న జాలి లేకుండా ఇంటి మీదకొచ్చి పరువు బజారుకీడ్చినప్పుడు పడ్డ యాతన గుర్తుకు తెచ్చుకుంటాను.పెండ్లాన్ని అమ్మైనా బాకీ తీర్చాలన్న మాటలకు గుండెపగిలి ఏడ్చిన ఏడుపు గుర్తుకు తెచ్చుకుంట సారూ. చుట్టుపక్కోల్లు గుమిగూడి ఓదార్చకుండా మాట్లాడిన వెకిలి మాటలకు పడ్డ యాతన, వేదన గుర్తుకు తెచ్చుకుంటా, ఆ మాటలు పడలేక ఉరిపోసుకొని చచ్చిపోదామనుకున్న రోజులు యాదికి తెచ్చుకుంట. ఆ కష్టాలు, అవమానాల కంటే బిచ్చమెత్తుకొనేటప్పుడు పడే మాటలు సిన్నయిగా అగుపిస్తాయి సారూ. రైతుగా ఉన్న నాటి కష్టాలతో పోలిస్తే ఇప్పటి నొప్పి గుండెను పిండదు సారూ.’సోమయ్య మాటలు ఆర్ద్రంగా మారాయి. చొక్కా చెరుగుతో కళ్లను తుడుచుకున్నాడు. నా కళ్లకు సోమయ్య మసగ్గా కనపడుతున్నాడు. మనస్సు బాధగా మూలిగింది. ‘సోమయ్యా .. ఉద్యోగం చాలించి నేనూ రానా..’ ఆయన మనస్సు తేలిక చేయాలన్న ఉద్దేశంతో అన్నాను. ఒక్కసారి నావైపు చూసి చిన్నగా నవ్వాడు. ‘మీకెందుకు సారూ ఆ కర్మ? ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు’ అన్నాడు. ‘అవును సోమయ్యా! తిరుపతికే ఎందుకు వెళ్లడం అంతదూరం?’ అన్నాను.‘భక్తులు దేశం నలుమూలల్నుంచి వచ్చేతావు సారూ, పాపాలు చేసి పుణ్యం పట్టకపోయేటందుకు మొక్కులతో వస్తరు, దండిగా డబ్బులతో వస్తరు, ఖర్చుపెట్టేందుకు సిద్దపడే వస్తరు, దేవుడికింత , మాకింత’ చెప్పాడు. ‘అయితే బిక్షమెత్తి పాపులకు పుణ్యం పంచే దేవుడి ఉద్యోగం అన్నమాట’ అన్నాను. ‘ఊరుకొండి సారూ.. వెంకన్నస్వామే దేవుడు, నేను కాదు’ నవ్వుతూ అన్నాడు. సోమయ్యలో నవ్వు చూశాను. కొంచెం బాధ తగ్గింది. సెల్‌ఫోన్ లో టైమ్ చూశాను. పన్నెండు కావస్తోంది. ఎవరిగోడూ పట్టని సింహపురి ఎక్స్‌ప్రెస్ విజయవాడ దాటి మధిర వైపు వేగంగా పరుగెడుతోంది.‘మీరెల్లిపడుకోండి సారూ.. మేడం ఒక్కరే ఉంటారు, నేను ఇంకో గంటలో దిగిపోతా ’ అన్నాడు. ‘అవును సోమయ్యా.. నువ్వు బాపట్లలో ఎందుకున్నావు?’ అన్నాను. ‘తిరపతిలో తొందరతొందరగా రైలెక్కాను సారూ.. తీరాచూస్తే అది మావూరి దగ్గర ఆగదంట. అందుకే ఇక్కడ దిగాను, దసరా పండక్కు కొడుకు, కూతురు పిల్లలు ఊరికి వచ్చిండ్రు సారూ.. రేపే పండగ, మల్లీ రైలెక్కడ పోగొట్టుకుంటానో అని బయపడి మిమ్మిల్ని ఇబ్బంది పెట్టాను’ అన్నాడు.‘సరే’ అని లేచాను. ఇప్పుడు సోమయ్య దగ్గర నాకు మందు వాసన రావడం లేదు, మట్టి వాసన వస్తోంది, రైతు చమట వాసన వస్తోంది. చేయి కలిపాను. పాలకుల ఆదరణ కరువై వో రైతు కాడిదించాడు. వందల మంది జనం ఆకలి ఆర్తనాదాలు నా చెవుల్లో మారు మోగుతున్నాయి. అన్యమనస్కంగానే నా బోగీవైపు అడుగులు వేశాను. — బిజివేముల రమణారెడ్డి -
ప్రకృతి కూడా అతడి కోపానికి భయపడేది! ఒకరోజు..
పూర్వం అంగీరస మహర్షికి భూతి అనే శిష్యుడు ఉండేవాడు. భూతి ముక్కోపి, మహా తపస్సంపన్నుడు. అతడికి కోపావేశాలకు అందరూ భయపడేవారు. ప్రకృతి కూడా అతడి కోపానికి భయపడి సక్రమంగా ప్రవర్తించేది. అంగీరసుడి వద్ద విద్యాభ్యాసం పూర్తయ్యాక భూతి స్వయంగా ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వివాహం చేసుకుని, గృహస్థాశ్రమం చేపట్టాడు.భూతి మహర్షి తన ఆశ్రమంలో శిష్యులకు వేదవేదాంగాలను బోధించేవాడు. అతడి ఆశ్రమం నిత్యాగ్నిహోత్రంతో వేదమంత్రాలతో కళకళలాడుతూ ఉండేది. భూతి కోపాన్ని ఎరిగిన శిష్యులు అతడికి కోపం రాకుండా వినయంగా మసలుకుంటూ, శుశ్రూషలు చేసేవారు. భూతి మహర్షికి సువర్చుడు అనే సోదరుడు ఉన్నాడు. సువర్చుడు ఒకసారి యాగాన్ని చేయాలనుకున్నాడు. యాగానికి రమ్మంటూ సోదరుడు భూతిని ఆహ్వానించాడు. సోదరుడి యాగానికి వెళ్లాలని నిశ్చయించుకున్న భూతి, తన శిష్యుల్లో శాంతుడు అనేవాణ్ణి పిలిచి ఆశ్రమ బాధ్యతలను అప్పగించాడు.‘నేను తిరిగి వచ్చేంత వరకు ఆశ్రమంలో అగ్నిహోత్రం చల్లారకూడదు. అగ్నిహోత్రం చల్లారకుండా ఉండేందుకు నిత్య హోమాలు కొనసాగేలా చూడు’ అని ఆజ్ఞాపించి, సోదరుడి యాగాన్ని చూడటానికి బయలుదేరాడు. ఒకరోజు శాంతుడు, మిగిలిన శిష్యులు ఆశ్రమానికి సంబంధించిన వేరే పనుల్లో ఉండగా, అగ్నిహోత్రం చల్లారిపోయింది. అది చూసిన శిష్యులు గురువు తిరిగి వస్తే తమను ఏమని శపిస్తాడోనని భయపడుతూ గజగజలాడారు. జరిగిన దానికి శాంతుడు మరింతగా దుఃఖించాడు. గురువు తనకు ముఖ్యమైన బాధ్యత అప్పగించినా, అది సక్రమంగా నిర్వర్తించలేని తన అసమర్థతకు, నిర్లక్ష్యానికి విపరీతంగా బాధపడ్డాడు. ఇప్పుడు తాను తిరిగి హోమగుండాన్ని వెలిగించినా, గురువు దివ్యదృష్టితో జరిగిన తప్పు తెలుసుకుని, తనను శపించి భస్మం చేసేస్తాడనుకుని భయపడ్డాడు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఇప్పుడు ఏం చేయాలని పరిపరి విధాలుగా ఆలోచించాడు. చివరకు అగ్నిదేవుడిని శరణు వేడుకుంటే, ఆయనే ఆపద నుంచి గట్టెక్కించగలడని తలచాడు. ‘నమః సర్వభూతానాం సాధనాయ మహాత్మనే/ ఏక ద్విపంచధిష్ణ్యాయ తాజసూయే షడాత్మనే...’ అంటూ అగ్నిదేవుడిని స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రం పలికాడు. ‘ఓ అగ్నిదేవా! దేవతలందరికీ ముఖానివి నీవే! హోమ యజ్ఞాలలో సమర్పించే హవిస్సులను, ఆజ్యాన్ని ఆరగించి దేవతలందరికీ తృప్తి కలిగిస్తున్నావు. దేవతలందరికీ నువ్వే ప్రాణస్వరూపుడివి. హుతాశనా! ‘విశ్వ’ నామధేయం గల నీ జిహ్వ ప్రాణులందరికీ శుభాలను ప్రసాదిస్తుంది. ఆ నాలుకతోనే మహాపాపాల నుంచి, భయాల నుంచి మమ్మల్ని రక్షించు. నా అశ్రద్ధ వల్లనే హోమగుండం చల్లారిపోయింది. నన్ను అనుగ్రహించు’ అని ప్రార్థించాడు.శాంతుడి ప్రార్థనకు అగ్నిదేవుడు సంతుష్టుడయ్యాడు. వెంటనే అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘వత్సా! ఏమి నీ కోరిక? ఏ వరాలు కావాలో కోరుకో!’ అని అడిగాడు. ‘దేవా! నా అలక్ష్యం వల్ల హోమగుండం చల్లారిపోయింది. ఈ హోమగుండంలో పూర్వం నుంచి ఉన్న విధంగానే అగ్ని నిలిచి ఉండాలి. నా గురువుకు ఇప్పటి వరకు సంతానం లేదు. ఆయనకు పుత్రసంతానాన్ని అనుగ్రహించాలి. నా గురువు ఇకపై ప్రాణులపై స్నేహభావంతో ఉండాలి. నీ అనుగ్రహం కోసం నేను చేసిన స్తోత్రాన్ని ఎవరు పఠించినా వారిపై నీ అనుగ్రహాన్ని కురిపించాలి. ఇవే నేను కోరే వరాలు’ అన్నాడు శాంతుడు. శాంతుడి మాటలకు అగ్నిదేవుడు ముగ్ధుడయ్యాడు. అతడు కోరిన వరాలన్నింటినీ అనుగ్రహించాడు. ‘లోకంలో నువ్వు ఉత్తమ శిష్యుడివి. నీకోసం ఒక్క వరమైనా కోరుకోకుండా, నీ గురువు గురించే వరాలు కోరుకున్నావు. నీ గురువుకు పుట్టబోయే పుత్రుడు ‘మనువు’ అవుతాడు. నువ్వు చెప్పిన అగ్నిస్తోత్రం పఠించిన వారికి çసకల శుభాలూ జరుగుతాయి’ అని పలికి అదృశ్యమయ్యాడు. సోదరుడి యాగం పూర్తికావడంతో భూతి మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆశ్రమంలో హోమగుండంలోని అగ్ని దేదీప్యమానంగా మండుతూ ఉండటంతో సంతృప్తి చెందాడు. శాంతుడిని దగ్గరకు రమ్మని పిలిచాడు. ‘శిష్యా! ఎన్నడూ లేనివిధంగా నాకు అందరి మీద స్నేహభావం కలుగుతోంది. ఇదేదో వింతలా ఉంది. నాకు అంతుచిక్కడం లేదు. నీకమైనా తెలిస్తే చెప్పు’ అని అడిగాడు.గురువు ఆశ్రమాన్ని విడిచి వెళ్లినప్పటి నుంచి జరిగినదంతా శాంతుడు పూసగుచ్చినట్లు చెప్పాడు. అయితే, శాంతుడు భయపడినట్లుగా భూతి మహర్షి కోపగించుకోలేదు. శపించలేదు. పైగా అంతా విని ఎంతో సంతోషించాడు. తన శిష్యుడైన శాంతుడు అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకున్నందుకు గర్వించాడు. శాంతుడిని అభినందించాడు. నాటి నుంచి మరింత ప్రత్యేక శ్రద్ధతో శాంతుడికి సకల వేద శాస్త్రాలనూ, వాటి మర్మాలనూ క్షుణ్ణంగా బోధించి, తనంతటి వాడిగా తయారు చేశాడు.కొంతకాలానికి అగ్నిదేవుడి వరప్రభావంతో భూతి మహర్షికి కొడుకు పుట్టాడు. అతడే భౌత్యుడు. కాలక్రమంలో భౌత్యుడు పద్నాలుగో మనువుగా వర్ధిల్లాడు. అతడి భౌత్య మన్వంతరం ఏర్పడింది. – సాంఖ్యాయనఇది చదవండి: బౌద్ధవాణి.. మట్టికుండ నేర్పిన పాఠం -
హిమగిరుల సొగసరి కిర్గిజ్స్తాన్.. వైద్య విద్యకు కేరాఫ్!..అందులోనూ..
అమ్మాయిలు బయటకు వెళ్తుంటే బాడీగార్డ్స్‌లా అబ్బాయిలను తోడిచ్చి పంపే సీన్‌కి రివర్స్‌లో అబ్బాయిలు బయటకు వెళ్తూ తోడురమ్మని అమ్మాయిలను బతిమాలుకోవడం కనిపిస్తే.. పురుషులతో సమానంగా మహిళలకూ హక్కులుంటే.. ఇంటా, బయటా అన్నింటా అమ్మాయిలకు గౌరవం అందుతుంటే.. సలాం.. ప్రివేత్.. ఈ కిర్గిజ్ అండ్ రష్యన్ పదాలకు అర్థం వందనం! పై దృశ్యాలు కనిపించేదీ కిర్గిజ్స్తాన్లోనే! ఈ దేశం ఒకప్పటి యూఎస్సెస్సార్ (యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్)లో భాగం అవడం వలన ఇప్పటికీ అక్కడ రష్యన్ అఫీషియల్ లాంగ్వేజ్‌గా కొనసాగుతోంది కిర్గిజ్తోపాటు. అందుకే ప్రివేత్ కూడా! మొన్న మార్చ్‌లో కిర్గిజ్స్తాన్కి టేకాఫ్ అయ్యే చాన్స్ దొరికింది. ప్రయాణాలు కామనైపోయి.. అంతకంటే ముందే అంతర్జాలంలో సమస్త సమాచారమూ విస్తృతమై పర్సనల్ ఎక్స్పీరియెన్సెస్ని పట్టించుకునే లీజర్ ఉంటుందా అనే డౌటనుమానంతోనే స్టార్ట్ అయింది ఈ స్టోరీ ఆఫ్ జర్నీ! అయినా కిర్గిజ్స్తాన్లో నేను చూసినవి.. పరిశీలించినవి.. అర్థం చేసుకున్నవి మీ ముందుంచుతున్నాను! ఢిల్లీ నుంచి కిర్గిజ్స్తాన్ రాజధాని బిష్కేక్కి మూడున్నర గంటలు. అందులో దాదాపు రెండున్నర గంటలు టీయెన్ షాన్ పర్వత శ్రేణుల మీంచే ఉంటుంది ఆకాశయానం. విండోలోంచి చూస్తే కొండల మీద వెండి రేకులు పరచుకున్నట్టు కనిపిస్తుంది దృశ్యం. మంచుకొండలు.. మబ్బులు అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటున్నట్టు.. భుజాల మీద చేతులేసుకుని కబుర్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇదొక అద్భుతమైతే.. బిష్కేక్.. మనాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లయిట్ దిగగానే కురిసే మంచుతో స్వాగతం మరో అద్భుతం! సిమ్లాలో హిమ వర్షాన్ని ఆస్వాదించినప్పటికీ బిష్కేక్లో మంచు కురిసే వేళలు గమ్మత్తయిన అనుభూతి. మేం వెళ్లిందే మంచు పడే లాస్ట్ డేస్. ఇంకా చెప్పాలంటే తర్వాతి రోజు నుంచి మంచు పడటం ఆగిపోయి.. కరగడం మొదలైంది. వర్షం వెలిసిన తర్వాత ఉండే కంటే కూడా రొచ్చుగా ఉంటుంది కరుగుతున్న మంచు. ఎండ చిటచిటలాడించినా.. మంచు కొండల మీద నుంచి వీచే గాలులు వేళ్లు కొంకర్లు పోయేంత చలిని పుట్టించాయి. అందుకే ఉన్న వారం రోజులూ షూ, థర్మల్స్, గ్లోవ్స్, క్యాప్ తప్పకుండా ధరించాల్సి వచ్చింది. ఇంకోమాట.. అక్కడి వాతావరణ పరిస్థితులకో ఏమో మరి.. షూ లేకుంటే అక్కడి జనాలు చిత్రంగా చూస్తారు. గోలలు.. గడబిడలకు నియత్.. బిష్కేక్ని కేంద్రంగా చేసుకునే అల అర్చా, ఇసిక్ కుల్ ఇంకా బిష్కేక్ చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించాం. కాబట్టి వారం రోజులు బిష్కేక్తో మా అనుబంధం కొనసాగింది. సిటీ సెంటర్లోని హోటల్లో మా బస. అక్కడికి వెళ్లగానే అబ్జర్వ్ చేసిన విషయం.. కిర్గిజ్ ప్రజలు చాలా నెమ్మదస్తులని! గట్టిగట్టిగా మాట్లాడటాలు.. అరుపులు.. కేకలు, గడబిడ వాతావరణం వారికి నచ్చవు. పక్కనవాళ్లు ఏ కొంచెం గట్టిగా మాట్లాడినా చిరాగ్గా మొహం పెడ్తారు. నిర్మొహమాటంగా చెప్పేస్తారు గొంతు తగ్గించి మాట్లాడమని. ఇక్కడ మెజారిటీ రష్యనే మాట్లాడ్తారు. ‘నియత్’ అంటే ‘నో’ అని అర్థం. సైన్‌బోర్డ్స్, నేమ్‌ప్లేట్స్ కిర్గిజ్ అండ్ రష్యన్లో ఉంటాయి. ఇది సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్నప్పుడు మామూలు వ్యవహారాలూ రష్యన్‌లోనే నడచి.. కిర్గిజ్ భాషా పదకోశం కుంచించుకుపోయిందట. స్వతంత్ర దేశమయ్యాక కిర్గిజ్ భాషా వికాసం మీద బాగానే దృష్టిపెట్టారని స్థానికులు చెప్పిన మాట. సర్కారు విద్యాబోధన అంతా కిర్గిజ్ మీడియంలోనే సాగుతుంది. వెస్ట్రనైజ్డ్గా కనిపించే పట్టణ ప్రాంతమే మొత్తం దేశాన్ని డామినేట్ చేస్తుంది. "ఈ దేశం విద్యుత్ అవసరాలను హైడల్ ప్రాజెక్ట్‌లు, బొగ్గే తీరుస్తున్నాయి. అయితే పట్టణాల్లోని సెంట్రలైజ్డ్ హీటింగ్, ఎయిర్ కండిషనింగ్‌కి బొగ్గునే వాడటం వల్ల కాలుష్యం పెరిగిపోతోందని అక్కడి పర్యావరణవేత్తల ఆవేదన. కాలుష్యంలో బిష్కేక్ది ఢిల్లీ తర్వాత స్థానం." లోకల్ మార్కెట్లదే హవా.. ఇక్కడ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అంతగా లేదనే చెప్పొచ్చు. ప్రైవేట్ బ్యాంకులు మొదలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వేళ్ల మీద లెక్కపెట్టేన్ని కూడా లేవు. స్థానికులను అడిగితే.. కమ్యూనిజం ప్రభావం వల్లేమో ప్రైవేట్ బ్యాంకుల మీద పూర్తిస్థాయి నమ్మకం ఇంకా కుదరలేదని చెప్పారు. అఫర్డబులిటీ, బేరసారాలకు వీలుడంటం వల్లేమో లోకల్ మార్కెట్సే కళకళలాడుతుంటాయి. ఇక్కడ ఓష్ బజార్, దొర్దోయి, అక్ ఎమిర్ లోకల్ మార్కెట్లు చాలా పాపులర్. మేం ఓష్ బజార్‌కి వెళ్లాం. రెండు రోజులు మార్కెట్ అంతా కలియతిరిగాం. సిల్వర్ జ్యూలరీ దగ్గర్నుంచి హ్యాండ్ అండ్ లగేజ్ బ్యాగ్స్, బట్టలు, వంట పాత్రలు, వెచ్చాలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, నట్స్ వరకు సమస్త సరకులకూ నిలయమిది. ఏ వస్తువులకు ఆ వస్తువుల సపరేట్ మార్కెట్ల సముదాయంగా కనిపిస్తుంది. బేరం చేయకుండా చూడాలంటేనే రోజంతా పడుతుంది. అన్నట్లు కిర్గిజ్‌లో సిల్వర్, 14 క్యారెట్ గోల్డ్ జ్యూలరీ చాలా ఫేమస్. ఓష్ బజార్లో ఒక్క సిల్వర్, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ జ్యూలరీయే ఉంటుంది. ఈ దేశం లెదర్ గూడ్స్కీ ప్రసిద్ధే! లోకల్ ఫ్యాషన్‌ని చూడాలంటే ఇక్కడి బట్టల మార్కెట్‌ని సందర్శించొచ్చు. ఓష్ బజార్ ఈ మార్కెట్లో ఇంకో అట్రాక్షన్.. కిర్గిజ్స్తాన్ హ్యాండీక్రాఫ్ట్స్ షాప్స్. వీళ్ల సంప్రదాయ వేషధారణలోని కల్పక్ (సూఫీలు ధరించే టోపీని పోలి ఉంటుంది) దగ్గర్నుంచి వీళ్ల సాంస్కృతిక చిహ్నమైన యర్త్ హోమ్, సంప్రదాయ సంగీత వాద్యం కోముజ్ (వాళ్ల నేషనల్ మ్యూజిక్ సింబల్)ల కళాకృతులు, ఎంబ్రాయిడరీ.. ఊలు అల్లికల వరకు కిర్గిజ్ హస్తకళల నైపుణ్యానికి ప్రతీకలైన వస్తువులన్నీ ఈ షాపుల్లో దొరుకుతాయి. అయితే ఏది కొనాలన్నా చాలా బేరం ఆడాలి. కొన్ని చోట్ల వర్కవుట్ అవుతుంది. కొన్ని చోట్ల కాదు ఈ మార్కెట్లో అన్నిరకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లూ ఉంటాయి. అయితే మేం వెళ్లింది అక్కడి వింటర్లో కాబట్టి పెద్దగా కనిపించలేదు. చలికాలాలు మైనస్ డిగ్రీల్లో టెంపరేచర్ ఉంటుంది కావున పంటలన్నీ వేసవిలోనే. యాపిల్స్, కమలా పళ్లు బాగా కనిపించాయి. ఇక్కడి కమలాలు భలే బాగున్నాయి రుచిలో. నిమ్మకాయ కన్నా కాస్త పెద్ద సైజులో ఉండే ఈ పండ్లే మా బ్రేక్ఫస్ట్ అక్కడున్నన్ని రోజులూ! కిర్గిజ్స్తాన్లో మరో ముఖ్యమైన కాపు వాల్నట్స్. ఇవి ఓష్బజార్లో రాశులు రాశులుగా కనిపిస్తాయి. బ్రౌన్ షెల్స్వే కాకుండా నాటుకోడి గుడ్డు పరిమాణంలో వైట్ షెల్స్‌తో కూడా ఉంటాయి. వీటిని చాక్లెట్లో రోస్ట్ చేసి అమ్ముతారు. ఒలుచుకోవడానికి ఒక హుక్లాంటిదీ ఇస్తారు. వీటితోపాటు ఇంకెన్నో రకాల నట్స్, డ్రైఫ్రూట్స్ ఈ మార్కెట్లో లభ్యం. కానీ మన దగ్గరకన్నా వాల్నట్సే చాలా చవక. మంచి క్వాలిటీవి కూడా సగానికి సగం తక్కువ ధరకు దొరుకుతాయి. రష్యన్ బ్రెడ్‌ని ఇష్టపడేవాళ్లు ఇక్కడ దాన్ని ట్రై చేయొచ్చు. చాక్లెట్స్ కూడా ఫేమస్. వాటికీ ప్రత్యేక దుకాణ సముదాయముంది. ఇంకో విషయం.. ఇక్కడ సూపర్ మార్కెట్లలో లిక్కర్కీ ఒక సెక్షన్ ఉంటుంది. రకరకాల కిర్గిజ్, రష్యన్ వోడ్కా బ్రాండ్స్ కనిపిస్తుంటాయి. "జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలు ప్రధానులుగా వాళ్ల వాళ్ల కాలాల్లో కిర్గిజ్స్తాన్ను సందర్శించారు. ఆయా సమయాల్లో అక్కడ పుట్టిన ఆడపిల్లలందరికీ ఇందిర అని పేరు పెట్టుకున్నారట. వాళ్లలో ఒకరు.. హయ్యర్ మెడికల్ డిగ్రీస్ పొందిన కిర్గిజ్స్తాన్ తొలి మహిళ.. డాక్టర్ ఖుదైబెర్జెనోవా ఇందిరా ఒరొజ్బేవ్నా. కిర్గిజ్స్తాన్ స్టేట్ మెడికల్ అకాడమీలో ఆంకాలజీ డిపార్ట్మెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఆ దేశాధ్యక్షుడి తర్వాత అన్ని అధికార లాంచనాలు అందుకునే రెండో వ్యక్తి ఆమే! ఇంకో విషయం ఇక్కడున్న మన ఎంబసీ వీథి పేరు మహాత్మా గాంధీ స్ట్రీట్". మీడియా.. "ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంతో ఇక్కడ ప్రింట్ మీడియా అంతగా కనిపించదు. అందుకే ఎలక్ట్రానిక్ మీడియానే పాపులర్. ప్రభుత్వ చానెల్స్‌తోపాటు డజన్‌కి పైగా ప్రైవేట్వీ ఉన్నాయి. రష్యన్ చానెల్స్కే ఆడియన్స్ ఎక్కువ. ప్రైవేట్ ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లూ ఎక్కువే". కిర్గిజ్స్తాన్.. "ఈ ముస్లిం నొమాడిక్ ల్యాండ్‌కి సెంట్రల్ ఆసియా స్విట్జర్లండ్గా పేరు. యూఎస్సెస్సార్ విచ్ఛిన్నం తర్వాత 1991లో స్వతంత్ర దేశంగా మారింది. టీయెన్ షాన్ పర్వత శ్రేణుల మధ్య ఒదిగి.. కజకిస్తాన్, చైనా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లతో సరిహద్దుల్ని పంచుకుంటుంది. ఎన్నో నాగరికతలకు కూడలిగా ఉన్న సిల్క్‌రూట్‌లో భాగం. సెక్యులర్ కంట్రీ. అధ్యక్ష్య తరహా ప్రజాస్వామ్యం. వ్యవసాయమే ప్రధానం. కెనాళ్లు, చెరువులు సాగుకు ఆధారం. పత్తి, మొక్కజొన్న, గోధుమలు, తృణధాన్యాలు ప్రధాన పంటలు. తేనెటీగలు, మల్బరీ తోటల పెంపకమూ కనిపిస్తుంది. వ్యవసాయం యంత్రాల సాయంతోనే! చిన్న కమతాల రైతులు మాత్రం గాడిదలు, గుర్రాలను ఉపయోగిస్తారు. బొగ్గు, బంగారం, కాటుకరాయి, పాదరసం గనులున్నాయి. కొంత మొత్తంలో పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నిల్వలూ ఉన్నాయి. మాంసం, పాల ఉత్పత్తులు, ఉన్ని ప్రధాన ఎగుమతులు. కరెన్సీ. సోమ్. జనాభా.. దాదాపు 67 లక్షలు. పురుషుల కన్నా మహిళలే అధికం". 14 క్యారెట్ గోల్డ్ జ్యూలరీ చూద్దామనే ఉత్సుకతతో ఒక రోజు ఆ షాపింగ్‌కీ వెళ్లాం. అదిరిపోయే డిజైన్స్ ఉన్నాయి కానీ చాలా కాస్టీ›్ల. అంత ధరపెట్టి 14 క్యారెట్ కొనేబదులు అదే ధరలో ఎంతొస్తే అంత 22 క్యారెట్ గోల్డే బెటర్ కదా అనే భారతీయ మనస్తత్వంతో కళ్లతోనే వాటిని ఆస్వాదించి వెనక్కి తిరిగొచ్చేశాం. సెకండ్స్ ఎక్కువ.. ఇక్కడ సెకండ్ హ్యాండ్ మార్కెట్ చాలా పెద్దది. ఫోర్ వీలర్స్ అన్ని సెకండ్సే. అందుకే ప్రపంచంలోని అన్ని బ్రాండ్స్.. అన్నీ మోడల్స్ ఇక్కడ కనిపిస్తాయి. వీటి కోసం బిష్కేక్కి దగ్గర్లోనే దాదాపు 20 ఎకరాల్లో ఒక మార్కెట్ ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ స్టీరింగ్.. రెండూ ఉంటాయి. పర్వత ప్రాంతమవడం వల్లేమో రైల్వే కంటే రోడ్డు రవాణాయే ఎక్కువ. మన దగ్గర కనిపించే స్వరాజ్ మజ్దాలాంటి వాహనాన్ని మార్ష్రూత్కా అంటారిక్కడ. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌కి దాన్నే ఎక్కువగా వాడతారు. మనకు ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉన్నట్టుగా ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులుంటాయి. వాటిని ట్రామ్స్ అంటారు. వీటికి రోడ్డు మీద పట్టాలేం ఉండవు. పైన కరెంట్ తీగతో పవర్ జనరేట్ అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఏం కాదు కానీ ధర చాలా చాలా తక్కువ. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ధర కాస్త ఎక్కువే. ట్రాఫిక్ చాలానే ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు కనిపించరు. అయినా ట్రాఫిక్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అత్యంత అవసరమైతే తప్ప హాంకింగ్ చేయకూడదు. ఫోన్లు కూడా సెకండ్ హ్యాండ్సే అధికం.. బ్రాండ్ న్యూ ఫోన్లు ఉన్నా! ఐఫోన్ వాడకం ఎక్కువ. బ్రాండ్ న్యూ హై ఎండ్ ఫోన్లు డ్యూటీ ఫ్రీతో మన దేశంలో కన్నా గణనీయమైన తక్కువ ధరకు లభిస్తాయి. నాడీ పట్టుకున్నారు.. "కిర్గిజ్స్తాన్లోని బిష్కేక్, ఇసిక్ కుల్ లాంటి చోట్ల భారతీయవిద్యార్థులు అందులో తెలుగు వాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు. కారణం.. మెడిసిన్. అవును ఈ దేశం వైద్యవిద్యకు హబ్‌గా మారింది. ఇది ప్రైవేట్ రంగాలకిస్తున్న ప్రోత్సాహాన్ని గ్రహించి.. రష్యాలో మెడిసిన్ చదివిన కొత్తగూడెం వాసి డాక్టర్ పి. ఫణిభూషణ్ 20 ఏళ్ల కిందటే ఇక్కడ ఐఎస్హెచ్ఎమ్ (ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్)ను స్థాపించాడు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీకొస్తున్న రెస్పాన్స్ చూసి ఇక్కడి ఐకే అకున్బేవ్ కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ (కేఎస్ఎమ్ఏ) ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఈ సంస్థకు తమ యూనివర్సిటీలో అఫిలియేషన్ ఇచ్చింది. ఐఎస్ఎమ్ ఎడ్యుటెక్ అనే కన్సల్టెన్సీ ద్వారా మన తెలుగు స్టూడెంట్స్ ఎందరికో కేఎస్ఎమ్ఏలో అడ్మిషన్స్ ఇప్పించి.. వాళ్ల వైద్యవిద్య కలను సాకారం చేస్తున్నారు డాక్టర్ ఫణిభూషణ్. ఈ రెండు యూనివర్సిటీల్లో దాదపు రెండువేలకు పైగా తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్లలో అమ్మాయిలే ఎక్కువ. ఎందుకంటే ఇది అమ్మాయిలకు సురక్షిత దేశం కాబట్టి. ఇక్కడా మెడిసిన్ అయిదున్నరేళ్లే! ఇంగ్లిష్‌లోనే బోధన సాగుతుంది. చక్కటి ఫ్యాకల్టీ, హాస్టల్ సదుపాయాలున్నాయి. ఆసియాలోనే అతి పెద్ద అనాటమీ ల్యాబ్స్‌లలో ఒకటి కేఎస్ఎమ్ఏలో ఉంది. కమ్యూనికేషన్‌కి ఫారిన్ స్టూడెంట్స్ ఇబ్బందిపడకూడదని కిర్గిజ్, రష్యన్ భాషలనూ నేర్పిస్తారు. శారీరక దృఢత్వం, క్రమశిక్షణ కోసం పీఈటీ కూడా ఉంటుంది. ఇది అకడమిక్స్‌లో భాగం. వారానికి రెండుసార్లు ఇండియన్ ఫ్యాకల్టీతోనూ క్లాస్‌లుంటాయి. ఫారిన్లో మెడిసిన్ పూర్తిచేసుకున్న స్టూడెంట్స్‌కి ఇండియాలో పెట్టే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ (ఎఫ్ఎమ్జీఈ) కోసమూ ఇక్కడ ప్రత్యేక శిక్షణనిస్తారు. అయితే కిర్గిజ్స్తాన్లో మెడిసిన్ చదవడానికి మన నీట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ‘ఇండియాలో మెడికల్ సీట్లు తక్కువ. కాంపీటిషన్ చాలా ఎక్కువ. ఎంత కష్టపడ్డా మంచి కాలేజ్‌లో సీట్ దొరకదు. ‘బీ’ కేటగరీ సీట్‌కి కనీసం కోటి రూపాయలుండాలి. అంతే ఫెసిలిటీస్.. అంతే మంచి ఫ్యాకల్టీతో ఇక్కడ 35 లక్షల్లో మెడిసిన్ అయిపోతుంది. అదీగాక మంచి ఎక్స్పోజర్ వస్తోంది’ అని చెబుతున్నారు అక్కడి మన తెలుగు విద్యార్థులు. ‘పిల్లల్ని మెడిసిన్ చదివించడానికి ఆస్తులు తాకట్టుపెట్టిన పేరెంట్స్‌ని చూశాను. డెడికేషన్ ఉన్న స్టూడెంట్స్‌కి మెడిసిన్ అందని ద్రాక్ష కాకూడదని, తక్కువ ఖర్చుతో క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్‌ని అందించాలనే సంకల్పంతో ఈ సంస్థను స్టార్ట్ చేశాం. అంతేకాదు యాక్టర్ సోనూ సూద్ సహకారంతో ఫీజులు కట్టలేని నీట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్‌ని మా కాలేజెస్లో ఫ్రీగా చదివిస్తున్నాం’ అని చెప్పారు డాక్టర్ ఫణిభూషణ్". - డాక్టర్ ఫణిభూషణ్ విద్య, వైద్యం ఫ్రీ.. ఇందాకే ప్రస్తావించుకున్నట్టు మౌలిక సదుపాయాల విషయంలో ఈ దేశం ఇంకా కమ్యూనిజం విలువలనే పాటిస్తోంది.. విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ! ప్రైవేట్ బడులు, ఆసుపత్రులు లేవని కాదు.. చాలా చాలా తక్కువ. చదువు విషయంలో ఇంగ్లిష్ మీడియం కావాలనుకునే వాళ్లే ప్రైవేట్ బడులకు వెళ్తారు. అయితే ఈ బడుల్లో కూడా కిర్గిజ్, రష్యన్ నేర్పిస్తారు. ఆటలంటే ప్రాణం పెడతారు. ప్రతి విద్యార్థి ఆటల్లో పాల్గొనాల్సిందే! పాఠశాల విద్య నుంచి ప్రొఫెషనల్ కోర్స్ మెడిసిన్ దాకా ఆటలనూ అకడమిక్స్గానే పరిగణిస్తారు. పాఠ్యాంశాలతోపాటు పీఈటీకీ మార్కులుంటాయి. అథ్లెటిక్స్, వాలీబాల్ ఎక్కువ. బిష్కేక్లోని పార్క్స్, గ్రౌండ్స్‌లో అథ్లెట్స్ ప్రాక్టిస్ చేస్తూ కనపడ్తారు. లెవెంత్ క్లాస్ తర్వాత ప్రతి విద్యార్థి సైన్యంలో శిక్షణ తీసుకోవాలి. ప్రతి శని, ఆదివారాలు స్కూల్ పిల్లలు నగర వీథులను శుభ్రం చేయాలి. మొక్కలు నాటాలి. నీళ్లు పోయాలి. ప్రభుత్వాసుపత్రులైతే ఆధునిక సదుపాయాలతో ప్రైవేట్ ఆసుపత్రులను తలదన్నేలా ఉంటాయి. జీరో క్రైమ్.. నో డొమెస్టిక్ వయొలెన్స్! బిష్కేక్లో మేం తిరిగిన ప్రాంతాల్లో ఎక్కడా మాకు పోలీస్ స్టేషన్లు కనించలేదు. ఆశ్చర్యపోతూ మేం తిరిగిన మార్ష్రూత్కా డ్రైవర్లను అడిగితే.. నవ్వుతూ ‘ఉంటాయి కానీ మా దగ్గర క్రైమ్ చాలా తక్కువ. దాదాపు జీరో అని చెప్పుకోవచ్చు’ అన్నారు. డొమెస్టిక్ట్ వయొలెన్స్కీ తావులేదు. ఇక్కడ ఇంటికి యజమానురాలు మహిళే. ఆర్థిక వ్యవహారాల దగ్గర్నుంచి అన్నిటినీ ఆమే చూసుకుంటుంది. లీడ్‌లోనే చెప్పుకున్నట్టు మహిళలను గౌరవించే దేశం. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్.. అన్నిట్లో మహిళలే ఎక్కువ. ట్రక్‌ని డ్రైవ్ చేస్తూ.. సంస్థల్లో ఫ్రంట్ ఆఫీస్ నుంచి మేనేజర్లు.. ఆంట్రప్రన్యూర్స్ దాకా.. లాయర్లుగా.. డాక్టర్లుగా.. ఇలా ప్రతిచోటా మహిళలే ఎక్కువగా కనిపిస్తారు. అల అర్చా నేషనల్ పార్క్ విమెన్స్ డే జాతీయ పండగే.. కిర్గిజ్ ప్రజలు మహిళలకు ఎంత విలువిస్తారో చెప్పడానికి ఇక్కడ జరిగే విమెన్స్ డే సెలబ్రేషనే ప్రత్యక్ష్య ఉదాహరణ. దాన్నో జాతీయ పండగలా నిర్వహిస్తారు. ఆ రోజు మగవాళ్లందరూ గిఫ్ట్స్‌తో తమ ఇంట్లో.. తమ జీవితంలోని స్త్రీలకు గ్రీటింగ్స్ చెప్తారు. తమ మనసుల్లో వాళ్లకున్న చోటు గురించి కవితలల్లి వినిపిస్తారు. మేం వెళ్లింది విమెన్స్ డే అయిన వారానికే కాబట్టి బిష్కేక్లో ఇంకా ఆ సంబరం కనిపించింది.. సిల్వర్, 14 క్యారెట్ గోల్డ్ మార్కెట్లలో విమెన్స్ డే స్పెషల్ కలెక్షన్స్‌తో! దీని ప్రభావం కిర్గిజ్స్తాన్లో మెడిసిన్ చదువుకుంటున్న మన తెలుగు విద్యార్థుల మీదా కనిపించింది.. వాళ్లు చదువుకుంటున్న కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ (కిర్గిస్తాన్ ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయం)కి వెళ్లినప్పుడు! వాళ్ల క్లాస్ రూమ్స్ కారిడార్ వాల్స్ మీద రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ అతికించి ఉన్నాయి. ఆ కాలేజ్‌లోని ప్రతి అబ్బాయి వాళ్లమ్మ .. అమ్మమ్మ.. నానమ్మ.. అత్త.. పిన్ని.. అక్క.. చెల్లి.. టీచర్.. ఫ్రెండ్.. ఇలా వాళ్లకు సంబంధించిన .. వాళ్లకు పరిచయమున్న మహిళలు.. అమ్మాయిల గురించి ఆ గ్రీటింగ్ కార్డ్స్ మీద రాసి తమకు వాళ్ల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అమ్మాయిలను తమకు ఈక్వల్‌గా ట్రీట్ చేయాలని కిర్గిజ్స్తాన్ కల్చర్‌ని చూసి నేర్చుకుంటున్నామని చెప్పారు భారతీయ విద్యార్థులు. యర్త్ హోమ్స్ సిటీ ఆఫ్ గార్డెన్స్.. బిష్కేక్లో ఎటుచూసినా విశాలమైన గార్డెన్లు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. మేం వెళ్లినప్పుడు స్ప్రింగ్ సీజన్‌కి ముస్తాబవుతున్నాయి. వింటర్ అయిపోయే సమయంలో మట్టి తవ్వి.. కొత్త మట్టి వేసి.. కొత్త మొక్కల్ని నాటుతారట. మాకు ఆ దృశ్యాలే కనిపించాయి. స్ప్రింగ్ టైమ్‌లో ఈ కొత్త మొక్కలన్నీ రకరకాల పూలతో వసంత శోభను సంతరించుకుంటాయి. అసలు కిర్గిజ్స్తాన్ని స్ప్రింగ్ సీజన్లోనే చూడాలని స్థానికుల మాట. తోటల్లోనే కాదు.. కొండలు .. లోయల్లో కూడా మంచంతా కరిగి.. మొక్కలు మొలిచి.. రకారకాల ఆకులు.. పూలతో కొత్త అందం పరచుకుంటుంది. అందుకే ఆ టైమ్‌లోనే పర్యాటకుల సందడెక్కువ. సిటీ స్క్వేర్.. ఒక పూటంతా బిష్కేక్ సిటీ స్క్వేర్‌లో గడిపాం. మార్చి 21.. కిర్గిజ్స్తా¯Œ కొత్త సంవత్సరం నూరోజ్ పండగ. మేం అక్కడికి వెళ్లేప్పటికి ఆ వేడుక కోసం పిల్లలంతా జానపద నృత్యాలు.. పాటలతో రిహార్సల్స్ చేసుకుంటూ కనిపించారు.. కిర్గిజ్స్తాన్ ఎపిక్ హీరో మనాస్ విగ్రహం ముందు. పదిలక్షలకు పైగా పద్యాలతో ఉన్న ఈ మనాస్ కావ్యం కిర్గిజ్ ప్రజల చరిత్ర, సంస్కృతి, ఫిలాసఫీని అభివర్ణిస్తుంది. ఇది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద కావ్యంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ కింద దీని సంరక్షణ బాధ్యతను యునెస్కో తీసుకుంది. అంతటి ప్రాశస్త్యమున్న మనాస్ విగ్రహానికి పక్కనే కొంచెం దూరంలో ఆ దేశ పార్లమెంట్ ఉంటుంది. విశాలమైన రోడ్లు.. వాటికి ఆనుకుని గార్డెన్లు.. పాత్వేలతో ఎక్కడో యూరప్‌లోని దేశంలో ఉన్నట్లు అనిపిస్తుంది. నూరోజ్ కోసం బిష్కేక్ ప్రత్యేకంగా ముస్తాబవుతుందట. యర్త్ హోమ్‌లు.. హస్తకళల ఎగ్జిబిషన్స్ జరుగుతాయి. ఆ సన్నాహాలు కనిపించాయి. వరల్డ్ నొమాడిక్ గేమ్స్ వేడుకలు ఇసిక్ కుల్ సాల్ట్ లేక్.. ఒకరోజు బిష్కేక్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల అర్చా వెళ్లాం. అ ్చ అటఛిజ్చి అంటే రంగురంగుల జూనపర్ చెట్లు అని అర్థం. రకరకాల పక్షులు, అడవి మేకలు, జింకలు, కొమ్ముల మేకలు, తోడేళ్లకు నిలయం ఈ ప్రాంతం. ఇక్కడున్న నేషనల్ పార్క్ చూడదగ్గది. మంచు కొండల మీద ట్రెకింగ్, పైన్ చెట్లు.. వాటర్ ఫాల్స్, టీయెన్ షాన్ శ్రేణుల నుంచి పారే నదులు.. నిజంగానే స్విట్జర్లండ్లో ఉన్నామేమో అనే భ్రమను కల్పిస్తుంది. అన్నిటికీ మించి ఇక్కడి స్వచ్ఛమైన గాలి.. ఓహ్.. అనుకుంటాం గానీ పాడు చలి చంపేస్తుంది. పార్క్ ఎంట్రెన్స్ నుంచి మంచులో దాదాపు మూడు గంటలకు పైగా నడిస్తే గానీ నదీ తీరానికి వెళ్లలేం. ఆ తీరం వెంట ఇంకాస్త ముందుకు వెళితే వాటర్‌ఫాల్స్. అలాగే మరికాస్త వెళితే అక్ సై హిమానీ నదం. ఇది అద్భుతమని చెబుతుంటారు స్థానికులు. అక్కడ నైట్ క్యాంప్ వేసుకోవచ్చట. ఇసిక్ కూల్ లేక్ కానీ మైనస్ డిగ్రీల టెంపరేచర్లో మాకు అర కిలోమీటర్ నడిచేసరికే కాళ్లు, చేతులు కొంకర్లు పోయి.. ముక్కు, పెదవులు పగిలి.. మాట మొద్దు బారిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. అలాగని అక్కడే ఉండి పక్షుల కిలకిలారావాలు.. పైన్ చెట్ల తోపులను ఆస్వాదించలేకపోయాం ఇది ప్రొఫెషనల్ ట్రెకర్స్కే సాధ్యమని జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ తిరిగొచ్చి మార్ష్రూత్కాలో కూలబడ్డాం. అందులోని హీటర్‌కి చలికాచుకున్నాం. మా చలివణుకు చూసి డ్రైవర్లు ఒకటే నవ్వులు. ఇంకోరోజు ఇసిక్ కుల్కి ప్రయాణమయ్యాం. బిష్కేక్ నుంచి ఇది దాదాపు 260 కిలోమీటర్లు. సూర్యోదయానికి ముందే స్టార్ట్ అయ్యాం. దార్లో సిల్క్‌రూట్ టచ్ అవుతుంది కిర్గిజ్స్తాన్ – కజకిస్తాన్ బార్డర్లో. మసక చీకటి.. మంచు.. మార్ష్రూత్కా విండో గ్లాసెస్ మీది ఫాగ్ తుడుచుకుని.. కళ్లు చిట్లించుకున్నా బయటి దృశ్యం స్పష్టంగా లేదు. వెహికిల్ ఆపడానికి లేదు. వచ్చేప్పుడు చూడొచ్చులే అనుకున్నాం. వచ్చేప్పుడూ సేమ్ సీన్. రాత్రి.. చీకటి.. మంచు అయితే ఇసిక్ కుల్ సాల్ట్ లేక్ ఆ నిరాశను కాస్త మరిపించింది. కాస్పియన్సీ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సరస్సుగా.. టిటీకాకా తర్వాత రెండవ అతిపెద్ద మౌంటెన్ లేక్ సరస్సుగా పేరుగాంచిందీ భూతల స్వర్గం. ఆకాశాన్ని అంటుతున్నట్టు కనిపించే మంచు పర్వతాల ఒడిలో నింగి నీలంతో.. చల్లదనంలో ఆ హిమ గిరులతో పోటీ పడుతూ నా ఊహల్లోని మానస సరోవరానికి కవలగా కనపడింది. మైనస్‌లోకి పడిపోయే టెంపరేచర్‌లోనూ ఇది గడ్డకట్టదు. ఈ లేక్‌లో బోటింగ్ కూడా ఉంటుంది. దీనికి విశాలమైన ఇసుక బీచ్ ఉంటుంది. ప్రతి సెప్టెంబర్‌లో ఇక్కడ వరల్డ్ నొమాడిక్ గేమ్స్ జరుగుతాయి. దీన్ని 2014లో కిర్గిజ్స్తానే ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంచార ప్రజల సంస్కృతీసంప్రదాయల పునరుద్ధరణ, సంరక్షణతోపాటు.. ఈ గేమ్స్‌లో పాల్గొంటున్న దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో! మొదటి సంవత్సరం ఇందులో 19 దేశాలు పాల్గొంటే 2018 కల్లా 66 దేశాల నుంచి 1500 మంది పాల్గొన్నారు. ఇవి ఒక్క క్రీడాకారులనే కాదు పలురంగాల్లోని కళాకారులందరినీ ఏకం చేస్తోంది. ఈ సంబరాల్లో ఒక్క ఆటలే కాదు.. కిర్గిజ్స్తాన్ కల్చర్, ఫుడ్, ఆర్ట్స్, షాప్స్ అన్నీ తరలి వస్తాయి. వందల సంఖ్యలో యర్త్ హోమ్స్ వెలసి.. ప్రపంచ అతిథులకు ఆతిథ్యాన్నిస్తాయి. ఆ సమయంలో ఇసిక్ కుల్లో ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారట. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవకూడని ఈవెంట్ ఇదని స్థానికులు అంటారు. ఇసిక్ కుల్ నుంచి వచ్చాక ఒకరోజు బిష్కేక్ పొలిమేరలో పౌల్ట్రీ, డెయిరీ ఫామ్ నడిపిస్తున్న ఓ రష్యన్ ఫ్యామిలీ దగ్గరకు వెళ్లాం. అతని పేరు దినేశ్. అరే.. ఇండియన్ నేమ్ అని మేం ఆశ్చర్యపోతుంటే.. అతను నవ్వి.. యూఎస్సెస్సార్లో బాలీవుడ్‌కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఆ ప్రభావంతోనేమో తనకు దినేశ్ అనే పేరుపెట్టారని చెప్పాడు. నిజమే అక్కడ మాకు కుమార్ అనే పేరూ కామన్‌గా వినిపించింది. బిష్కేక్లో మెడికల్ కాలేజ్ అనుబంధ హాస్టల్స్‌లో ఉండి చదువుతున్న భారతీయ వైద్యవిద్యార్థుల కోసం పాలు, చికెన్, కూరగాయలను సప్లయ్ చేయడం కోసమే తను ప్రత్యేకంగా డెయిరీ, పౌల్ట్రీ ఫామ్‌లను నడుపుతున్నాని, కూరగాయలను సాగు చేస్తున్నాని చెప్పాడు దినేశ్. వరల్డ్ నొమాడిక్ గేమ్స్ మిస్సింగ్.. ఉన్న వారంలో చలి.. ఎండ.. వాన మూడు కాలాలనూ చూపించింది కిర్గిజ్స్తాన్. ఎండ, వాన ఉన్నా చలి కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ వెదర్.. చిన్నపిల్లలమైపోయి మంచులో ఆటలు.. స్కీయింగ్, రోప్ వే సాహసాలు.. కిర్గిజ్, రష్యన్ మాటల్ని నేర్చుకోవడం.. వాళ్ల క్రమశిక్షణకు అబ్బురపడటం.. ఆ ప్రశాంతతను ఆస్వాదించడం.. ఉన్నదాంట్లో తృప్తిపడుతున్న వాళ్ల నైజానికి ఇన్స్పైర్ అవడం.. అక్కడి ఆడవాళ్ల సాధికారతకు గర్వడటం.. మొత్తంగా కిర్గిజ్స్తాన్ మీద బోలెడంత గౌరవంతో తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం! కానీ ఒక్క అసంతృప్తి మిగిలిపోయింది. జమీల్యా, తొలి ఉపాధ్యాయుడు వంటి ఎన్నో పుస్తకాలతో ఎప్పుడో కిర్గిజ్స్తాన్ని పరిచయం చేసిన చెంఘిజ్ ఐత్మతోవ్ని కలిపే ఆయన మ్యూజియాన్ని చూడలేపోయామని! బిష్కేక్లో ఉందా మ్యూజియం. దాంతోపాటు కిర్గిజ్స్తాన్ హిస్టరీ అండ్ ఆర్ట్స్‌కి సంబంధించిన మ్యూజియమూ ఉంది. ఇదీ చూడలేదు.. సమయాభావం వల్ల! ఐత్మతోవ్ పుట్టిన నేల మీద నడయాడమన్న కాస్త ఊరటతో కిర్గిజ్స్తాన్కి సలామత్ బొలుప్ జక్ష్య (ఇప్పటికి వీడ్కోలు)! ఎప్పుడైనా స్ప్రింగ్‌లో ఒకసారి కిర్గిజ్స్తాన్ను చూసి.. ఐత్మతోవ్ని పలకరించాలని ఆశ! రహమత్ .. స్పసీబా.. థాంక్యూ! — శరాది ఇవి చదవండి: 'ఖైమర్ అప్సర'గా భారత దౌత్యవేత్త! -
ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ పాజిటివ్ అంటే..? ప్రమాదమా..!
నాకు 40 ఏళ్లు. మూడవ నెల ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ పాజిటివేమో అనే డౌట్ చెప్పారు. చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఉమ్మనీరు టెస్ట్ చేస్తామన్నారు. దీనివల్ల అన్నీ కనిపెట్టొచ్చా? బేబీ హెల్దీగా ఉన్నట్టు ఎలా గుర్తించడం? – ఎన్. వైశాలి, షోలాపూర్ ఆమ్నియోసెంటీసిస్ (Amniocentesis) ద్వారా ఉమ్మనీరును టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. తగు జాగ్రత్తలతో ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్.. పొట్టలోపల బేబీకి టెస్ట్ చేసే ప్రక్రియ ఇది. ఈ వైద్య పరీక్షను ముఖ్యంగా క్రోమోజోమల్ సమస్యలేమైనా ఉన్నాయేమో అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి సూచిస్తారు. జన్యు వ్యాధుల విషయంలోనూ ఈ టెస్ట్‌ను చేస్తారు. 40 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ కావడం, మీ బ్లడ్ టెస్ట్‌లలో డౌట్ రావడం వల్ల క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కనిపెట్టడానికి ఈ టెస్ట్‌ని సజెస్ట్ చేసి ఉంటారు. దీన్ని చాలా అనుభవం ఉన్న స్పెషలిస్ట్‌లే చేస్తారు. మీరు మామూలుగా ఫుడ్ తినే ఈ టెస్ట్‌కి వెళ్లొచ్చు. ఔట్ పేషంట్ డిపార్ట్మెంట్లోనే చేస్తారు. అల్ట్రసౌండ్ చేసి.. బేబీ, ప్లాసెంటా, పొజిషన్‌ను చెక్ చేసి వివరించి కన్సెంట్ తీసుకుని చేస్తారు. టెస్ట్ రిజల్ట్స్ 5 నుంచి 15 రోజుల్లో వస్తాయి. వచ్చే రిజల్ట్స్‌ని బట్టి తదనంతర పరిణామాలను మీతో డిస్కస్ చేస్తారు. ఈ టెస్ట్‌లో అన్నిరకాల అబ్నార్మిలిటీస్ని కనిపెట్టలేము. దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి. సెరిబ్రల్ పాల్సీ, ఆటిజం, స్పీనల్ బిఫడా, ఫిజికల్ చేంజెస్‌ను ఇందులో కనిపెట్టలేం. అలాంటివాటికి కొన్నిసార్లు అడ్వాన్స్డ్ స్కాన్ అవసరం అవుతుంది. ఈ ప్రొసీజర్‌లో 0–5 శాతం గర్భస్రావం అయ్యే రిస్క్, ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. యాంటీబయాటిక్స్ ఇస్తారు. ప్రొసీజర్ తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకుని ఇంటికి వెళ్లొచ్చు. మైల్డ్ క్రాంప్స్ ఉంటాయి. పారాసిటమాల్ లాంటివి ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ప్రొసీజర్ తర్వాత బాగా కడుపు నొప్పి వచ్చినా, బ్లీడింగ్ అవుతున్నా.. వాటర్ లీక్ అయినా ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాలి. ఇంటికి వెళ్లాక ఇలాంటి లక్షణాలు కనపడినా.. చలి, జ్వరం ఉన్నా వెంటనే ఎమర్జెన్సీ వార్డ్‌కి వెళ్లాలి. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ ఫీలవకుండా.. పౌష్టికాహారం తీసుకోవాలి. — డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
వెజైనా నుంచి బ్యాడ్ స్మెల్ వస్తే పరిస్థితి అంతేనా..!
నాకు 18 ఏళ్లు. వెజైనా నుంచి బ్యాడ్ స్మెల్ వస్తోంది. నేను హాస్టల్లో ఉంటాను. నా ప్రాబ్లమ్‌కి సరైన మెడిసిన్‌ని సజెస్ట్ చేయగలరు. – అనామిక, హైదరాబాద్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్లో చాలా కామన్‌గా వచ్చేది బ్యాక్టీరియల్ వెజైనోసస్. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. వెజైనా నుంచి బ్యాడ్ స్మెల్ ఉంటుంది. రాషెస్, ఇచింగ్ ఉండవు. ఇది వెజైనాలో ఉండే నార్మల్ బ్యాక్టీరియా ఎక్కువైతే వస్తుంది. పలచగా.. వైట్‌గా డిశ్చార్జ్ కావచ్చు. ఫిషీ స్మెల్ ఉంటుంది. వెజైనా ఎసిడిటీ చేంజెస్ వల్ల వస్తుంది. సువాసనగల సబ్బులు, బబుల్ బాత్స్, వెజైనల్ డియోడరెంట్స్ వాడేవారిలో ఇది ఎక్కువ. ఇన్నర్వేర్ని గాఢమైన డిటర్జెంట్స్‌తో ఉతికినా.. తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతున్నా ఇది ఎక్కువ అవుతుంది. మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే కాటన్ స్వాబ్‌తో వెజైనా నుంచి శాంపిల్ తీసి యూరిన్‌ని కూడా టెస్ట్‌కి పంపిస్తారు. ఆ రిజల్ట్స్‌తో కన్ఫర్మ్ అయితే యాంటీబయాటిక్ మాత్రలు, Doxycycline, Metronidazole లాంటివి ఇస్తారు. డాక్టర్ సలహా మేరకు పూర్తి కోర్స్ వాడాలి. కొంచెం తగ్గగానే మందులు ఆపేస్తే తిరగబెట్టే రిస్క్ పెరుగుతుంది. స్ట్రాంగ్ వెజైనల్ వాషెస్ కూడా వాడకూడదు. రోజుకు నాలుగైదుసార్లు వేడి నీళ్లతో శుభ్రం చేసుకుని.. పొడిగా ఉంచుకోవాలి. కాటన్ ఇన్నర్వేర్నే వాడాలి. ఎక్కువసార్లు ఈ ఇన్ఫెక్షన్ అవుతూంటే యూరిన్ కల్చర్, సెన్సిటివిటీ చెక్ చేయాల్సి ఉంటుంది. — డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
Funday Story: బాలిశెట్టి అహం..!
బాలిశెట్టి.. కిరాణా కొట్టు వ్యాపారి. నిత్యావసర సరుకులు బియ్యం, బెల్లం, పప్పు, ఉప్పు, చింతపండు వంటివి అమ్మేవాడు. వ్యాపారం బాగా సాగటంతో చేతికింద పనివాడిని పెట్టుకోవాలని అనుకున్నాడు. పక్క గ్రామంలో ఉండే నర్సయ్య పనికి కుదిరాడు. బాలిశెట్టికి తన కింద పనిచేసేవారంటే చులకన ఎక్కువ. తన ముందు వాళ్లు దేనికీ సరితూగరనీ, ఎందుకూ పనికిరారనే అహంతో ఉండేవాడు. నర్సయ్యది కష్టపడి పనిచేసే స్వభావం. దుకాణం తెరిచినప్పటి నుండి మూసేవరకు బాలిశెట్టి చెప్పే రకరకాల పనులన్నిటినీ కాదనకుండా చేసేవాడు. దుకాణంలో దుమ్ము దులపడం, సరుకులు పొట్లాలు, మూటలు కట్టడం చేసేవాడు. అతనికి ఏమాత్రం విరామం దొరికినా.. పప్పులు, బియ్యంలో ఉండే రాళ్లు ఏరమని పురమాయించేవాడు బాలిశెట్టి. ఎంతపని చేసినా తృప్తి ఉండేది కాదు. పని వేళలు ముగిసి నర్సయ్య ఇంటికి వెళ్లబోతుంటే ఉల్లిగడ్డల బస్తాను కరణం గారింట్లోనో, బియ్యం బస్తాను మునసబు గారింట్లోనో వేసి పొమ్మనేవాడు. ఇంటికి ఆలస్యం అవుతుంది, మరునాడు వేస్తానంటే కించపరుస్తూ, వెక్కిరిస్తూ మాట్లాడేవాడు. బాలిశెట్టి కూతురు పెళ్ళీడు కొచ్చింది. చదువుకున్న పిల్ల కావటంతో మంచి సంబంధం కుదిరింది. నర్సయ్యను దుకాణం పనులతోపాటు, పెళ్ళి పనులకూ తిప్పుకోవటం మొదలుపెట్టాడు. దాంతో ఏ అర్ధరాత్రో ఇంటికి చేరేవాడు నర్సయ్య. ఇంట్లోవాళ్ళు బాలిశెట్టి దగ్గర పని మానేయమని ఒత్తిడి చేశారు. పెళ్ళికి మూడురోజుల ముందు బాలిశెట్టి ఇంట్లో దొంగలు పడి ఉన్న నగలు, నగదు దోచుకుపోయారు. కూతురు పెళ్లి ఆగిపోతుందని బాలిశెట్టి భయపడి నర్సయ్యకు చెప్పుకుని భోరున ఏడ్చాడు. ‘అయ్యా! మీరేం కంగారు పడకండి. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి ఖర్చులు నేను సర్దుతాను’ అన్నాడు నర్సయ్య. ఆమాటకు బాలిశెట్టి ఆశ్చర్యపోయాడు. నర్సయ్యకు తన ఊరిలో పదిహేను ఎకరాల మాగాణి, ఇరవై ఎకరాల మామిడితోట, సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు కొడుకు వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు. అతనికి ఇంట్లో కూర్చోని విశ్రాంతి తీసుకోవటం ఇష్టంలేకనే బాలిశెట్టి వద్ద పనిలో చేరాడని తెలిసింది. తన కూతురు పెళ్లికి నగదు సహాయం చేశాడు నర్సయ్య. ఆనాటి నుండి ఇతరులను తక్కువ అంచనా వేయటం, చులకనగా చూడటం మానేశాడు బాలిశెట్టి. — తేజశ్రీ -
Funday Story: 'వనప్రస్థపురం'.. మరెప్పుడైనానా? ఎన్నేళ్ల నుంచి ఇదే..!?
హాలిడే ట్రిప్‌కు పిల్లలు, మనవళ్ళతో ఓలా కార్లు బయల్దేరిపోయాయి. తలుపు దగ్గరగా వేసి వచ్చి, హాల్లో సోఫా మీద కూర్చున్నాను. డైనింగ్ టేబులు మీద ఆఖరు మనవడు చివరి క్షణం వరకూ తిననని మారాం చేస్తూ వదిలేసిన పప్పు, నేయి అన్నం. దాని పక్కనే హడావుడిలో మరచిపోయిన మంచినీళ్ళ బాటిల్. ఇల్లంతా నిశ్శబ్దం కరెంటు పోయినట్టుగా. గదిలో సుభద్ర ఒత్తిగిల్లుతూ, దుప్పటి పైకి లాక్కున్న చప్పుడు. ఎంగిలి కంచం సింకులో వేసి, బెడ్రూమ్లోకి తొంగిచుశాను. ‘ఎట్లా ఉంది’ ‘తగ్గుతున్నది జ్వరం. పిల్లలు చాలా డిసప్పాయింట్ అయ్యారు నావల్ల’ ‘మరెప్పుడైనా వెళదాంలే ఏం పోయింది’ ‘మరెప్పుడైనానా? ఎన్నేళ్ల నుంచి అనుకుంటున్నాము తాజ్‌మహల్ చూద్దామని. అందరికీ కుదిరి, వాతావరణం బాగుండి, సెలవులు దొరికి, పరీక్షలు లేకుండా, ఇదిగో ఇన్నాళ్ళకి వీలయితే, ఈ వైరల్ ఫీవర్ మొత్తాన్ని దెబ్బతీసింది’ నిస్పృహగా నవ్వింది సుభద్ర. చేయి పట్టుకుని నిమిరాను. పలుచటి ముఖం. జ్వరంలోనూ తగ్గని ఆ ముఖంలోని నిర్మలత. కాకుంటే ఒత్తుగా ఉండే జుట్టొకటే ఈ మధ్య పలచబడింది. కాసేపటికి కునుకులోకి జారింది. బయటకు వచ్చి సోఫాలో కూర్చుని, క్రాస్‌వర్డ్ చేయటం మొదలు పెట్టాను. ఇరవై నిముషాలు పట్టింది. అలవాటయితే తేలికయిన ప్రక్రియే. సాయంత్రం నాలుగు గంటలు కావస్తోంది. ఫ్రిజ్ నుంచి పాలు తీసి బయటపెట్టాక, టీ డబ్బా కోసం వెతుకుతుంటే అకస్మాత్తుగా లాసా–లమ్సా చాక్లెట్ టీ గుర్తుకొచ్చింది. ఈ రోజుల్లో ఎవరయినా తాగుతున్నారా? అనుమానమొచ్చింది. ఫోను చేశాను. త్రివేణి సూపర్ మార్కెటులో ఆశ్చర్యకరంగా స్టాక్ ఉంది. పదినిమిషాల్లో పిల్లవాడితో పంపాడు. కొంచెం పాలతో, తక్కువ పంచదారతో, లైట్‌గా పెట్టిన టీ మరుగుతుంటే, వాసన కాస్త బలంగానే తగులుతోంది. రెండు మగ్గుల్లో పోసి బెడ్ రూమ్‌కు తీసుకువెళ్ళాను. చూస్తూనే లేచి కూచుంది సుభద్ర. మొదటి సిప్‌కే ముఖం విప్పారింది. ‘ఇదెక్కడిది’ ఆశ్చర్యంగా అడిగింది. ‘తెప్పించాను ఇప్పుడే’ టీ కప్పును చేతితో తిప్పుతూ చూస్తుండి పోయింది తాగడం మానేసి. ‘చల్లారిపోతుంది తాగు’ ‘ఈ రుచి, వాసన నీకు ఏం గుర్తుకు తెస్తున్నాయి’ ‘ముంబైలోని మాతుంగా కింగ్స్ సర్కిల్. అక్కడి పూలమాలలు. పక్కనే శృంగేరి మఠం. గిరి బుక్ స్టోర్’ ‘ఇంకా’ ‘బొంబాయ్ బ్లాస్ట్స్... మోకాళ్ళలోతు నీటిలో పెద్దవాడి బస్సు కోసం మెయిన్ రోడ్డు వరకూ చుడీదార్ ఎగగట్టి నడచిపోవడం’ జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా జాగ్రతగా నెమరువేస్తూ అవి అయిపోతాయేమో అన్న భయంతో కొంచెం కొంచెంగా టీ తాగాం. ‘ఎన్నేళ్ళయింది చాక్లెట్ టీ తాగి’ ‘1982లో ఆఖరిసారి తాగాము. బాంబే నుంచి స్విట్జర్లాండ్. వెనక్కు చెన్నై. కొన్ని రోజులు అమెరికా మళ్ళీ చెన్నై. ఎక్కడా దొరకలేదు మనకు’ అందామె. ‘మనం ప్రయత్నించలేదుగా’ ‘అంటే అత్తగారికి ఇష్టం లేదు. రెండు రకాల టీలు పెట్టే ఓపిక నాకు లేదు. మామయ్య, అత్తయ్య పోయాక, ఎప్పుడూ రుచిచూడని పిల్లలకు ఈ రుచి నచ్చలేదు’ ‘హోటల్స్‌లో దొరకదు’ నేను ముక్తాయింపుగా అన్నాను. మరుసటి రోజు ఉదయం ఢిల్లీ నుంచి ఫోను చేశారు పిల్లలు. అమ్మ ఎట్లా ఉంది. వంట ఏం చేసుకున్నారు వగైరా వగైరా. అమ్మ జ్వరం తగ్గిందనగానే వాళ్లకు కాస్త రిలీఫ్. కార్న్ ఫ్లేక్స్‌ను బౌల్స్‌లో తీసుకుని వేడి పాలు ఒంపుకొని డైనింగ్ టేబులు మీద కూర్చున్నాము. అల్మారాలో పై తంతెలో గోధుమ రంగులో ఉంది పెళ్లి ఆల్బమ్. దుమ్ము తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. దాదాపు నలభై ఏళ్ళ క్రితం ఆల్బమ్. పసి పిల్లలుగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళయినారు. చిన్న గొలుసు రెండు పిలకలతో అక్కయ్య ఎత్తుకొని ఉన్న రమ్య ఇవాళ అమెరికాలో సెటిల్ అయింది. కళకళలాడుతున్న ముఖాల్తో అత్తయ్యలు, మామయ్యలు, బాబాయిలు, పిన్నులు. కండువాతో తాతయ్య, అమ్మమ్మ. ఫ్యామిలీ ఫొటోలో దాదాపు 65 మందిమి ఉన్నాము. మనిషి మనిషిని లెక్కపెడితే ప్రస్తుతం అందులో నలభయి అయిదు మంది ప్రపంచంలోనే లేరు. పది మంది ఇండియాలో లేరు. ‘పెళ్ళిలో మామయ్య పాడిన పాట జ్ఞాపకముందా. భక్ష్యాలతో పాల మీగడ లేదని మీ ఆత్తకు కోపం వచ్చింది’ సుభద్ర జ్ఞాపకం చేసింది. ఆల్బమ్స్ వెనక్కి పెట్టేయబోతుంటే, సుభద్ర టీపాయి మీద ఉంచమన్నది– మధ్యాహ్నం తీరికగా చూసుకోవడానికి ఇద్దరం కలిసి. రోజుకు రెండుసార్లు పిల్లల ఫోనులు కొనసాగుతూనే ఉన్నాయి. టాక్సీ ప్రయాణం, హోటల్స్‌లో తందూరీ రోటీ రుచి. ఆగ్రా దారిలో ధాబాలు.. పుల్కాలు.. మజా కూల్డ్రింకు... బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరుసటి రోజు స్నానం చేసి స్లీవ్‌లెస్ నైటీలో బయటకు వచ్చింది సుభద్ర. చేతిలో కాగితాల కట్ట. ‘ఎన్నేళ్ళయింది నువ్వీ పింక్ స్లీవ్ లెస్ వేసుకొని’ అశ్చర్యంగా అడిగాను. ‘ఏమో! అల్మారా తెరిస్తే వేసుకోవాలనిపించింది’ ‘ఇన్నేళ్ళయినా ఎంత బాగుందో’ పెద్దగా అనేసి నాలిక కరుచుకొని చుట్టూ తిరిగి చూశాను. ఇంట్లో మేమిద్దరమే అన్న సత్యం మరోసారి గుర్తొచ్చింది. ‘ఏమిటి కాగితాల కట్ట’ ‘ఉత్తరాలు’ ‘ఏ ఉత్తరాలు’ ‘పెళ్ళికి ముందు ఆరు నెలలు మీరు నాకు, నేను మీకు రాసినవి’ నవ్వుతూ టేబుల్ మీద పెట్టింది సుభద్ర. ఒక కట్టకు గ్రీన్ బాండు. అవి సుభద్ర రాసినవి. రెడ్ రబ్బర్ బాండ్‌తో నావి. ‘ఉప్మా చేయమంటారా?’ ‘నువ్వేం చేయద్దు. కాస్త తొందరగా భోజనం చేద్దాము. ఉత్తరాలిచ్చి సోఫాలో కూర్చో’ సుభద్ర ఉత్తరాలు నేను, నా ఉత్తరాలు సుభద్ర తీసుకున్నాము. ఎన్ని ఆశలు. ఎన్ని ఆలోచనలు. ఎంత అర్థం లేని కవిత్వం. ఎప్పటి సినిమా పాటలు. మూడు వేలతో హనీమూన్ ఎక్కడికంటూ ఎన్ని చర్చలు. పెళ్ళికి ముందు ఎదుర్కోలులో కట్టుకోబోతున్న కాఫీ రంగు కంచి పట్టుచీర వర్ణన. రాసి కొట్టేసిన చిలిపి మాటలు. అప్పుడు చదివిన నవలల ప్రశంస. కనబోయే పిల్లల మీద బెరుగ్గా సాగిన చర్చలు. తెలుగు రాత అర్థం కావడానికి కూడా కొంచెం సమయం పడుతోంది. నాకు మాత్రం ఆ ఉత్తరాలు కృష్ణబిలం కన్నా లోతుగా, ఎంకి పాటల కన్నా మధురంగా అనిపించాయి. గంట తరవాత ఉత్తరాల కట్ట మార్చుకున్నాము. ఉత్తరాలు చదువుతూ అరవయి ఏళ్ళు దగ్గర పడుతున్న సుభద్రలో అప్పుడప్పుడు అణచిపెట్టుకున్న నవ్వు, ముంచెత్తుతున్న సిగ్గు చూస్తుంటే ఒక్కసారి గుండె పొరలో ఏదో కదిలింది. శిథిలమయిన దేవాలయం తలుపులు తీస్తే, చెక్కు చెదరని అమ్మవారి విగ్రహం కనబడినట్లు అనిపించింది నాకు. పుస్తకాలు చదవడం మొదలెట్టాం. ఒకరోజు ‘మిడ్ నైట్స్ చిల్ట్రన్’ కొంతభాగం నేను చదివాను. సుభద్ర విన్నది. మరుసటి రోజు ‘వెన్నెల్లో ఆడపిల్ల’ యండమూరి రచన సుభద్ర చదివింది. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దగ్గరి సుధా హోటల్లో మసాలా దోశె. మూడోరోజు ఎన్నేళ్ళుగానో పోలేకపోతున్న శర్మ ఇంటికి సాయంత్రం ఓ గంటసేపు టీకి. ఎప్ప్పుడో టీటీడీ నుంచి తెప్పించిన పోతన భాగవతం తీసి చదవడం ప్రారంభించాం ఇద్దరం. ఉదయాన్నే ఐదున్నరకల్లా లేచి ఒక అరగంట ఐ.ఎం.లో నేర్చుకున్న యోగా చేయడం, ఆ తరువాత మరో అరగంట పాటు ఏ ఆలోచనా లేని మౌనం కోసం ధ్యానంలో కూర్చోవడం. మనవళ్ల స్కూలు, పిల్లల ఆఫీసు తొందర లేకపోవడంతో, పనిమనిషిని కూడా లేట్‌గా రమ్మన్నాము. ఒక విధమైన నిర్వా్యపారత్వంతో చాలారోజుల నుంచి వెతుకుతున్నది, కొంచెం కొంచెం దొరుకుతున్న తృప్తి మొదలైంది. వారం రోజులు త్వరగా గడిచిపోయాయి. ఆదివారం వచ్చేసింది. పిల్లలు సాయంత్రం దిగుతారు. ఉదయాన్నే లేచి కాఫీ కూడా తాగకుండా, కాలనీ పార్కులో మౌనంగా అరగంట కూచున్నాము. శరీరాలు కొంచెం తగులుతున్నాయి. మనసులు పెనవేసుకున్నాయి. నెమ్మదిగా లేచి ఇంటికి వచ్చేశాము. పిల్లలు వచ్చేశారు. ఇల్లంతా మళ్ళా సందడి. పొద్దున స్కూలుకు తయారయ్యేవాళ్ళు, హోమ్‌వర్క్ మరచిపోయిన వాళ్ళు, స్కూలు బాగ్ దొరకని వాళ్ళు, బ్రేక్ఫస్ట్, లంచ్, డిన్నర్ అన్నిటికి హడావుడి.. పూర్తి బిజీ రొటీన్ మళ్ళీ మొదలయింది. మనవళ్ల బస్సు కోసం రోడ్డు మీద నిలుచోవడం, ఎన్డీటీవీలో ఊదరగొట్టే రాజకీయ చర్చలు, పాత సినిమా పాటలను కొత్త వాళ్ళతో పాడించే కార్యక్రమాలు. అప్పుడప్పుడు రాని నీళ్ళు, ఎప్పుడూ ఎగ్గొట్టే పనిమనిషి. పాత మూసలోకి క్రమంగా జారిపోతున్నాము. ఒంటరిగా ఉన్న వారం రోజులు వెనక్కి తిరిగి చూసుకుంటే, అవి ఒకసారి ఏడాది లాగా, మరోసారి ఏదో కలలాగా అనిపించడం ప్రారంభించాయి. నెలరోజుల తరువాత రెండోవాడి కొలీగ్ పెళ్ళికి పిలుపు వచ్చింది. పెళ్ళి చేసుకునే అమ్మాయి మాకు కూడా బాగా పరిచయం. ఇంటికి వచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టి కార్డు ఇచ్చి రమ్మనమంటూ పిలిచింది. ఇంటిల్లిపాది బయలుదేరారు. ‘నాకెందుకో రావాలని లేదురా’ ప్రయాణానికి గంట ముందర చెప్పాను. ‘ఏం నాన్నా? ఒంట్లో బాలేదా’ ఆదుర్దాగా అడిగాడు మా రెండోవాడు. ‘ఒంట్లో బానే ఉంది. అక్కడికొచ్చి క్యూలో నిల్చుని, బఫే తినే ఇంట్రెస్టూ, రాను పోను నాలుగు గంటలు కార్లో కూచునే ఓపిక రెండూ లేవు’ నేనూ రానంటూ సుభద్ర ఉండిపోయింది. మమ్మల్ని వదిలి వాళ్లకు వెళ్లక తప్పలేదు. ఆ పైవారం బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతం. కుటుంబసమేతంగా వనభోజనాలు. మరో వారం బిర్లామందిర్ ప్రయాణం. అన్నీ ఆఖరి క్షణంలో మానేశాము నేను, సుభద్ర. మమ్మల్ని, మా ప్రవర్తనని, ఆలోచనలను చిన్నప్పటి నుండి ఎరిగి ఉన్న పిల్లలకు, ముఖ్యంగా కోడళ్ళకు, ఏం జరుగుతున్నదో అంతుపట్టడం లేదు. మేమేమీ కోపంగా లేము. సాధింపులు లేవు. పిల్లలతో చిరాకు పడటం లేదు. పైపెచ్చు పూర్వం కన్నా కొంచెం సంతోషంగా ఉన్నట్లు కూడా వాళ్ళకు, మాకూ తెలుస్తూనే ఉంది. ఆదివారం ఉదయం. అందరం బ్రేక్ఫస్ట్ కానించి కూర్చున్నాము. పిల్లలు ఆడుకోడానికి వెళ్లారు. పెద్దకొడుకు, కోడలు, చిన్నకొడుకు, కోడలు హాల్లో సోఫాల్లో కూర్చొని ఉన్నారు. సుభద్ర వంటింట్లో టీ పెడుతోంది. పేపరుతో బయటకు వచ్చిన నన్ను చూసి, సింగల్ సీటరు సోఫా ఖాళీ చేసి కూర్చొమన్నాడు పెద్దవాడు. ‘అమ్మా నువ్వు కూడా ఇటురా’ పిలిచాడు. టీ కప్పులు ట్రేలో పట్టుకొని వచ్చింది సుభద్ర. మా దగ్గరున్న స్వతంత్రం వల్ల, ఇంట్లో ఉండే మంచి వాతావరణం వల్ల, ఏ ఉపోద్ఘాతం, డొంక తిరుగుడు లేకుండా సూటిగా అడిగాడు పెద్దవాడు. ‘నాన్నా ఈ మధ్య మీరు ఇద్దరూ మాతో బయటికి రావడాన్ని ఎవాయిడ్ చేస్తున్నారు. ఒంట్లో బాలేదా? మనసు బాలేదా?’ ‘అదేమీ లేదురా’ మాట దాటేశాను. ‘పోనీ పిల్లలతో, పనితో బాగా అలసిపోతున్నారా? వంటకు సహాయంగా మనిషిని పెడదామంటే మీరేగా వద్దన్నారు’ ‘పనిలో ఏ ప్రాబ్లమ్ లేదురా’ ‘ఎందులోనూ ఏ ప్రాబ్లమ్ లేకపోతే మరి ఈ మార్పు ఎందుకు వచ్చింది. తాజ్‌మహల్ ట్రిప్ కాన్సిల్ అయినప్పటి నుంచి మీరు దేనికీ మాతో కలిసి రావట్లేదు. ఎందుకు?’ సుభద్ర, నేను మార్చి మార్చి చూసుకున్నాము. ఏమీ మాట్లాడవద్దన్నట్లు తల ఆడించింది సుభద్ర. నామటుకు నాకు, ఈ మౌనం, ముసుగులో గుద్దులాట కొనసాగితే, మనస్పర్థలు మొదలయితాయేమో అనిపించింది. ఆలోచించుకొని నెమ్మదిగా అన్నాను. ‘మేము వనస్థలిపురంలోని మన పాత ఇంట్లో ఉందామనుకుంటున్నాము. కనీసం ఓ ఆర్నెల్లు’ కొడుకులు, కోడళ్ళు అందరూ ఉలిక్కిపడ్డారు. ‘ఎందుకు నాన్నా? ఏమయింది’ చిన్నవాడి ప్రశ్న. ‘ఏమీ కాలేదు. మీరు మమ్మల్ని ఒక్కమాట అనలేదు. పిల్లలు కూడా ఏమీ నోరుజారలేదు. అంతా ఎంతో ప్రేమగా ఉంటున్నారు’ ‘మరి?’ ‘నేను చెప్పే కారణాలు కొన్ని మీకు నవ్వు తెప్పించవచ్చు. కొన్ని మీకు అర్థం కూడా కాకపోవచ్చు. మా అమ్మ చెప్పేది... రామాయణ వనవాస ఘట్టంలో దశరథుడి ఆక్రోశం అర్థం కావాలంటే పిల్లలుండాలని. అట్లాగే నేను చెప్పేవి, అనుకునేవి, మీకు అరవై, డెబ్బై ఏళ్ళు వస్తేగాని పూర్తిగా అర్థం కావు. వయసు పైబడ్డాక భార్య భర్తలకు ఏకాంతం యవ్వనంలో కన్నా ఎక్కువ అవసరం అని నా అభిప్రాయం. పెళ్ళయిన మొదటి రెండేళ్లలో ఎట్లా ఉన్నామో, ఏం మాట్లాడుకున్నామో కూడా జ్ఞాపకం లేదు నాకు. మీ చదువులు, మా అమ్మ, నాన్న, బంధువులు, రోగాలు, ప్రయాణాలు కొన్ని దశాబ్దాలు హాడావుడిగా గడిచిపోయాయి. మీ అందరి మధ్య ఎంత ప్రేమగా ఉన్నా, మేమిద్దరం నిశ్శబ్దంగా పక్కపక్కన కూర్చోవడమో, మా పెళ్లి ఆల్బమ్ చుసుకోవడమో, మాకు ఎంతో సహాయం చేసిన స్నేహితుల విషయం మాట్లాడుకోవడమో, ఇప్పుడు దాదాపు అసంభవం అయింది. కృష్ణశాస్త్రి పాటలు వింటుంటే మనవరాలు చానల్ మార్చేస్తుంది. తలత్ మెహమూద్ గజల్ చిన్నకోడలికి మలేరియా వణుకుపాట. పాత ఆల్బం టీపాయ్ మీద పెడితే పిల్లల పుస్తకాల్లో కలసిపోతుంది. ఏమీ చేయకుండా ఉండటం, చేయదలచుకున్నది మాత్రమే చేయడం, ఈ స్వతంత్రం కాస్త కావాలి అనిపిస్తోంది రా’ నా మాటలకు చిన్నకోడలు కాస్త గిల్టీగా తలదించుకుంది. ‘ఓ పదిహేను రోజులు ఎక్కడి కన్నా వెళ్ళిరండి నాన్నా!’ చిన్నవాడు సలహా ఇచ్చాడు. ‘నేను కోరుకునేది ఎక్కడికీ పోనక్కరలేని స్థిరత్వం, ప్రశాంతత. నాకు అరవై అయిదు ఏళ్ళు. మహా అయితే మరో పదిహేనేళ్ళు, ఆరోగ్యం బాగుంటే ఇరవై. మా ఇద్దరిలో ఒకరు ముందు, ఒకరు వెనక పోక తప్పదు. మా ఇద్దరిలో ఒంటరిగా మిగిలిన వాళ్ళకి మనుమలు, మనవరాళ్ళు తప్ప, ఏ జ్ఞాపకాల గుబాళింపు, ఏ మాటల మంద్రధ్వని ఆలంబనగా ఉండనక్కరలేదా? కళ్ళు మూసుకొని మీ అమ్మను తలచుకుంటే కాఫీ పెడుతూనో, పసిపిల్లకు పాలు పడుతూనో కనబడుతున్నది. ఆ రూపం తప్ప మరే రూపమూ ఎంత ప్రయత్నించినా నా కళ్ళ ముందుకు రావడం లేదు’ ఉద్యోగం చేస్తున్న పెద్దకోడలు తలదించుకొని నెమ్మదిగా అన్నది – ‘పోనీ మేమే ఎక్కడికన్నా మారిపోమా’ ‘మళ్ళా అదే మాట. మీరు మమ్మల్ని కష్టపెట్టడం లేదు. కాని మనమలు మనవరాళ్ళతో ఉండే సుఖం కన్నా కొంచెం వేరే సుఖం, శాంతి కావలసిన సమయం వచ్చిందేమో అనిపిస్తున్నది. ఏదో పొద్దున లేచి, గబగబా దీపం పెట్టి, హాడావుడిగా చేసే పూజ తప్ప, అరగంట ప్రశాంతంగా ఆత్మావలోకనం చేసుకునే తీరిక, వ్యవధి లేకుండా ఉన్నది జీవితం. తండ్రిగా, తాతగా, భర్తగా, ఉద్యోగిగా కాకుండా భగవంతుడు ఇచ్చిన జన్మకు ఒక వ్యక్తిగా నేను సాధించినదేమిటి? నన్ను, నేను ఎంతవరకు తెలుసుకున్నానన్న ప్రశ్న నన్ను ఒక్కొక్కసారి కలవరపెడుతున్నది.’ ‘అయితే వెళ్ళిపోతారా’ కూతురు లేని లోటును తీర్చిన చిన్నకోడలు ఒక్కసారి బావురుమంది. ‘అదేమిటమ్మా, ఆరునెలలు అనుకుంటున్నాము. ఉండగలమో, లేదో? మనసంతా ఇక్కడికే లాగుతుందేమో? చంటివాణ్ణి జోకోట్టకపోతే నాకు నిద్ర పట్టదేమో? ఏ అవసరం వచ్చినా చెప్పండి రెండు గంటల్లో హైటెక్ సిటీలో వచ్చివాలతాము. ఏం తినాలనిపించినా, మమ్మల్ని చూడాలనిపించినా, వెంటనే బయలుదేరి రండి. మన పూర్వులు నిర్ణయించినట్లు వానప్రస్థ ఆశ్రమాన్ని కొన్ని నెలలు అయినా వనస్థలిపురంలో గడుపుదామని మా ప్రయత్నం. భగవంతుడి దయ వల్ల మొదటి రెండు నెలలు ఈ ప్రయత్నం సఫలమయితే, తరువాతి రెండు నెలలు ఉత్తరాలు రాసుకునే వెనకటి రోజులకు పోదామనుంది. వీలయితే వాట్సప్‌ని ఫోను నుంచి తీసేద్దామనీ ఉంది. రోజువారీ వ్యవహారంలో మీరంతట మీరు నిర్ణయాలు తీసుకోవడం, బాగా అవసరమనుకుంటేనే మా సలహాను అడగడం మీకూ మంచిది. మాకూ మంచిది. ఎవరు చూడొచ్చారు? ప్రతిరోజు కనబడకపోతే మూడు దశాబ్దాల క్రింది నా యూరోపియన్ అనుభవాలు మీకు వినాలనిపిస్తుందేమో! మనవరాలు సంగీతం క్లాసు టయిమ్కి వాకింగ్ పెట్టుకోకుండా నేను ఇంట్లోనే ఉండి దాని ముద్దు పాటలు వింటానేమో’ ‘అహంకారమడగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరతీసుకో అన్న పాట అంతరార్థం తెలుసుకోవాలని ఉందిరా మీ నాన్నకు’ సుభద్ర వత్తాసు పలికింది. తేలికపడిన మనసుతో కుర్చీలోంచి ఉత్సాహంగా లేచాను. — బారు శ్రీనివాసరావు ఇవి చదవండి: Psychological Facts: 'తెలివైనవారి' పది అలవాట్లు ఏంటో మీకు తెలుసా! -
Psychological Facts: 'తెలివైనవారి' పది అలవాట్లు ఏంటో మీకు తెలుసా!
ఇంటెలిజెంట్, బ్రిలియంట్, జీనియస్.. ఇలాంటి తెలివైన వ్యక్తులు ఎవరితోనూ మాట్లాడకుండా, గాలిలోకి చూస్తూ, తమలో తామే ఆలోచించుకుంటూ.. తమ తెలివితేటల గురించి అహంకారంతో ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా వారి గురించి అధ్యయనాలు.. దేని గురించైనా వారు తమకు తక్కువగా తెలుసని అనుకుంటారని, వినయపూర్వకంగా ఉంటారని తెలియజేస్తున్నాయి. అలాగే వారి తెలివితేటలు రోజువారీ ప్రవర్తనల్లో, అలవాట్లలో స్పష్టంగా కనిపిస్తాయని సైకాలజిస్టులు చెప్తున్నారు. వాటిని అర్థంచేసుకుని, ఆచరిస్తే.. తెలివితేటలను మనందరమూ పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చు. ఆ పది అలవాట్లేమిటో తెలుసుకుందాం. 1. తమ తెలివితేటల గురించి మాట్లాడరు.. అత్యంత తెలివైన వ్యక్తులు తమ స్మార్ట్‌నెస్ గురించి గొప్పలు చెప్పుకోరు. వారి మనస్సులో రోజువారీ విషయాల కంటే చాలా ముఖ్యమైన విషయాల మీదే మథనం జరుగుతూ ఉంటుంది. తమ ఆలోచనాపరిధిని విస్తరించుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు. 2. విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు.. తెలివైన వ్యక్తులు పరిశీలన, ప్రయోగాల ద్వారా నేర్చుకుంటారు. ఇతరులు కనుగొన్న విషయాలను విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు. మరింత ప్రయోజనరమైన ఫలితాల కోసం కృషిచేస్తారు. 3. పరిష్కారంలో ముందుంటారు.. తెలివైనవారు సవాళ్లను ఎదుర్కోవడంలో , సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారు. ఆలోచించడం, నిరాశను అధిగమించడం ద్వారా పట్టుదల, ఆత్మవిశ్వాసం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణిని పెంపొందించుకుంటారు. 4. ఎల్లప్పుడూ జ్ఞానాన్ని కోరుకుంటారు.. ‘మీకు ఎంత ఎక్కువ తెలిస్తే.. తెలియనిది ఇంకా అంత ఉందని గ్రహిస్తారు’ అని ప్రఖ్యాత తత్త్వవేత్త అరిస్టాటిల్ చెప్పాడు. తెలివైనవారు ఈ విషయాన్ని తప్పకుండా ఆచరిస్తారు. తమకు ఎంత తెలిసినా తెలియాల్సింది, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థం చేసుకుంటారు. 5. డాట్స్‌ని ఎలా కనెక్ట్ చేయాలో వారికి తెలుసు! తెలివైనవారికి వివరాలు తెలుసుకోవడంతో పాటు వాటిని జూమ్ అవుట్ చేసి చూడగల సామర్థ్యం ఉంటుంది. వాటి మధ్య బంధాలను, సంబంధాలను కనెక్ట్ చేయడం తెలుసు. అంటే ఒక అంశానికి సంబంధించి ఎవరూ చూడని లార్జర్ పిక్చర్‌ను వారు చూడగలరు. తెలివైనవారు ప్రపంచాన్ని నలుపు–తెలుపులుగా, మంచి–చెడులుగా చూడరు. ఓపెన్ మైండ్‌తో ఉంటారు. విభిన్న తత్వాలు, ఆలోచనలను అర్థం చేసుకుంటారు. 6. చాలా ప్రశ్నలు అడుగుతారు.. తెలివైనవారు అన్నిటికీ సమాధానాలు కలిగి ఉండరు. సహజమైన ఉత్సుకతతో వారి మనసులో లెక్కలేనన్ని ప్రశ్నలుంటాయి. ఆలోచింపజేసే ప్రశ్నలను అడగడం ద్వారా, విస్తృతమైన చర్చకు దారి తీస్తారు. లోతైన దృక్కోణం నుంచి∙విషయాలను అన్వేషిస్తారు. అవగాహనను విస్తరించుకుంటారు. ఎందుకంటే వారికి తమ పరిమితులు తెలుసు. అందుకే ఎంత పెద్దవారైనా చిన్నపిల్లల నుంచి నేర్చుకోవడానికి కూడా సంకోచించరు. 7. చిన్న చిన్న వివరాలపైనా శ్రద్ధపెడ్తారు.. తెలివైన వ్యక్తులు కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ రెండింటినీ ఉపయోగించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఏదైనా ఎలా పనిచేస్తుందో అర్థంచేసుకోవడంతో పాటు, ఎందుకు పని చేస్తుందో కూడా అర్థంచేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. మోడల్స్‌ను విశ్లేషించడం ద్వారా, తరచుగా పట్టించుకోని చిన్న చిన్న వివరాలపైనా శ్రద్ధచూపుతూ ఆలోచనాశక్తిని పెంచుకుంటారు. 8. లోతుగా అధ్యయనం చేస్తారు.. తెలివైనవారికి ఓ ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. ఎవరికీ అర్థంకాని విషయాలను అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సంక్లిష్టమైన విషయాలను లోతుగా అధ్యయనం చేసి, సహేతుకమైన వివరణలను కనుగొనడంపై దృష్టి పెడతారు. 9. ఇతరుల పనుల గురించి ఆలోచించరు.. తెలివైనవారు తమ పని, చదువు పట్ల అమితమైన ధ్యాస కలిగి ఉంటారు. అందువల్ల ఇతరులు చెప్పేది వినడానికి సమయం లేదా శక్తిని కేటాయించరు. వారికున్న అధిక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇతరుల చర్యలు, ప్రవర్తనల నుంచి సులువుగా తమ దృష్టిని మళ్లించుకుంటారు. 10. చేసేముందు ఆలోచిస్తారు.. తెలివైన వ్యక్తులు ఏదైనా పనిచేసే ముందు సమస్యల గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తారు. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నామని వారికి స్పష్టత రావాలి. వారి మనస్సాక్షికి తెలియాలి. అప్పుడే పనిచేయడం మొదలుపెడతారు. ప్రఖ్యాత తత్వవేత్త లావోత్సు ‘ప్రకృతి తొందరపడదు, అన్నీ జరుగుతాయి’ అని చెప్పినట్లు∙తెలివైన వ్యక్తులు తమ ప్రయత్నాల విషయంలో తొందరపడరు, తొందరపెట్టరు. — సైకాలజిస్ట్ విశేష్ ఇవి చదవండి: ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు! -
Naila Grewal: నా యాక్టింగ్‌కి 'టెలివిజనే' నాకు ప్రేరణ!
నైలా గ్రేవాల్.. హిందీ నటి. ఇప్పుడు ఓటీటీ స్టార్ కూడా! బయటెంత ఫాలోయింగ్ ఉందో.. అంతకంటే ఎక్కువ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకు. ఇంకొన్ని వివరాల్లోకి వెళితే.. నైలా పుట్టి,పెరిగింది ఢిల్లీలో. మాస్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. డాన్స్ నేర్చుకుంది. థియేటర్ స్కిల్స్ కూడా ఒంటబట్టించుకుంది. ముందు మోడలింగ్ వైపే అడుగులేసింది. కానీ ఆసక్తి అంతా యాక్టింగ్ మీదే ఉండింది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా డాన్స్ బాలేలు చేస్తూ.. థియేటర్లో నటిస్తూ నటనా ప్రతిభను మెరుగుపరచుకునేది. అలాంటి ఒకానొక సందర్భంలోనే బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ నుంచి ఒక కబురు‡ వచ్చింది.. తను తీయబోయే ‘తమాషా’ సినిమాలో నైలాకు వేషం ఇస్తున్నట్టు. అది విన్న ఆమె సంతోషానికి అవధుల్లేవు. సెట్స్ మీదకు వెళ్లినప్పుడైతే కలా.. నిజమా అనుకుందట. మొదటి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అవకాశాలనూ అందిపుచ్చుకుంది. ‘బరేలీ కీ బర్ఫీ’, ‘భాంగ్డా పా లే’, ‘థప్పడ్’లలో నటించింది. ‘ఇష్క్ విష్క్ రిబౌండ్’లో నటిస్తోంది. తాజాగా ‘మామ్లా లీగల్ హై’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నైలా లండన్‌లో లా చదివి.. ఢిల్లీలో వకీల్గిరీ ప్రారంభించిన లాయర్‌గా నటించింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఆమె నటనకే కాదు ఆమె అందానికి.. ఫ్యాషన్ స్టయిల్‌కి.. డాన్స్కీ అభిమానగణం ఉంది. అంతేకాదు ఆరోగ్యకరమైన జీవన శైలికి ఆమెను స్ఫూర్తిగా తీసుకునే అభిమానులూ ఉన్నారు. సినిమానైనా.. సీరియల్‌నైనా.. ఆ మాటకొస్తే కదిలే బొమ్మను ఫస్ట్ నేను చూసింది టెలివిజన్‌లోనే. అందుకే యాక్టింగ్‌కి టెలివిజనే నాకు ప్రేరణ, స్ఫూర్తి. సిల్వర్‌స్క్రీన్, స్మాల్‌స్క్రీన్, వెబ్‌స్క్రీన్.. ఏ స్క్రీన్ అయినా యాక్టర్స్‌కి ఒకటే. రీచింగ్‌లో తేడా తప్ప దేనికైనా టాలెంటే కొలమానం! - నైలా గ్రేవాల్. ఇవి చదవండి: లియాండర్ పేస్... ప్రముఖ డ్యాన్సర్! -
ఫండే: కథ - 'ఓ.. అదా సంగతి! అందుకా ఈ మార్పు..!'
ఇంటి దగ్గరకు వచ్చే కొద్ది చీకటి చిక్కపడుతూ వచ్చింది. మనసు బాధతో ఒక్కసారి మూలిగింది. రాత్రి కూడా ఆఫీసులోనే గడిపితే – ఇల్లే కదా స్వర్గసీమ అనేది ఉత్త మాటేనా? బాధగానే తలుపు తట్టాను. అనుభవానికి భిన్నంగా తలుపులు వెంటనే తెరుచుకున్నాయి. చిమ్మచీకట్లో పూర్ణ చంద్రోదయం అయినట్లు, చిరునవ్వుతో ఎదురుగా నిలబడి వుంది మా ఆవిడ! ఆశ్చర్యంతో పెదవి పెగలలేదు నాకు. అడుగు ముందుకు పడలేదు. క్రికెట్లో పదకొండవ నెంబర్ ఆటగాడైన బౌలర్ రెండు వందలు కొట్టినట్లు వింటే కలిగేటంత ఆశ్చర్యం.. బహుమతి వచ్చిన లాటరీ టికెట్‌ను ఎవరో మతిలేనివాడు నాకు అందిస్తే కలిగేటంత ఆశ్చర్యం.. యాబై యేళ్ళ జీవితంలో ఒక్కసారైనా చూడని, పేరు వినని వాడు విశాఖలో అచ్చంగా నాకు వెయ్యిగజాలు ఉచితంగా రాసిచ్చాడని వింటే కలిగేటంత ఆశ్చర్యం అనిపించింది! ‘ఏమిటలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడి పోయారు.. లోపలకు రండి’ గోముగా పలికింది మా ఆవిడ. ఆ పలికిన తీరు నా ఆశ్చర్యానికి మల్లెలు తురిమాయి ఏమైంది ఈ రోజు..? ఏమిటీ మార్పు? ఇంటి లోపలకు అడుగు పెడుతూనే చుట్టూ చూశాను. అత్తగారు కానీ మామగారు కానీ వచ్చారా.. లేకపోతే మా ఆవిడ అక్క కానీ..! ఏదో బలమైన కారణం ఉండాలి. లేకపోతే మా ఆవిడ ఇలా నవ్వుతూ పలకరించటమే! తుఫాను ముందు వీచే చల్ల గాలిలా, బహుశా ఏదైనా కొనమని అడుగుతుందేమో..! పండుగకి ఇంకో రెండు వారాలే! అయినా పండుగకి కొనవలసిన వాటికి టెండర్ పెట్టడమూ, ఒప్పుకోవటమూ అయిపోయిందిగా! మళ్ళీ, ఇప్పుడు ఇలా..! నాకు పాలుపోలేదు. కుర్చీలో కూర్చుని షూ లేస్ విప్పుకున్నాను. వేడి వేడి కాఫీతో వచ్చి నా పక్కనే కూర్చుంది.. ఆవిడ. అది మరో షోకు! ఆఫీసు నుంచి రాగానే అలా కాఫీ ఇవ్వటం, కాసేపు సరదాగా మాట్లాడుకోవటం మొదలైనవి గత చరిత్ర. ఏదైనా అవసరముంటే చెప్పటం, పొడి పొడిగా మాట్లాడుకోవటం, లేకపోతే ఎవరి పనిలో వాళ్లం ఉండటం నేటి చరిత్ర. ‘ఏవండీ.. అలా మాట్లాడకుండా కూర్చున్నారు?’ ఎదురుగా కూర్చున్నది మా అవిడేనా అనే సందేహం కలిగింది నాకు. పరిశీలనగా సూక్ష్మంగా చూశాను.. అవిడే! ‘దేవుడా.. ఈ రోజు ఏ సునామీ రాకుండా కాపాడు తండ్రీ’ అని ప్రార్థిస్తూనే అన్నాను..‘చెప్పు?’ ‘ఏముంటాయండీ.. మాకు చెప్పడానికి? రోజంతా ఇంట్లో మగ్గేవాళ్ళం. మీరే చెప్పండి..’ ఒక్క సిప్పు కాఫీ తాగాను.. కాఫీ.. రోజుకన్నా బాగుంది. అయినా ఆ మాట పైకి అనలేదు. కాసేపు పోయాక మా ఆవిడే చెప్పటం మొదలు పెట్టింది.. ‘మరేమోనండీ.. నాలుగు రోజుల క్రితం మా అక్క.. అదేనండీ.. మా పెద్దమ్మ కూతురు ఫోన్ చేసింది..’ రోజుల కొద్ది బయటకు చెప్పకుండా మనసులో దాచి ఉంచిన, చుట్టాల సంగతులు.. వాళ్ళ గొడవలు వగైరాలు నా ముందు వరదగా ప్రవహించాయి ఆనకట్ట పగిలినట్లు. సంవత్సరాల క్రితం గమనించిన ఆమెలోని చలాకీతనం మాట తీరు పునర్జన్మ ఎత్తినందుకు కొంత సంతోషించాను. ఆ మాటలు వినటం పోనూ పోనూ ఇబ్బంది అయినప్పటికీ! ‘అసలు సంగతి మర్చి పోయానండీ. సాయంత్రం బజ్జీలు వేశానండీ’ హఠాత్తుగా లేచింది. ‘ఆఫీసు నుంచి ఆకలితో వస్తారనీ..’ ‘ఇదొకటా..’ మనసులో అనుకున్నాను. వైశాఖంలో వాన చినుకులా..’ మా ఆవిడ సాయంత్రం టిఫిన్ చేయటం కూడానా! ఇంటికి వచ్చి ఆకలిగా ఉంది అని చెబితే ‘బయట తినలేక పోయారా?’ అని అంటుంది. ‘టైమ్ చూశావా? తొమ్మిది దాటుతోంది. ఇప్పుడు బజ్జీలేమిటీ.. అన్నంలో తినేస్తాను’ అంటూ లేచాను. ఫ్రిజ్ నుంచి తీసిన చలి విరగని కూరలు తినే బదులు సాయంత్రం చేసిన బజ్జీలు బెటర్ అనుకున్నాను. కానీ మరో షాకు ఇచ్చింది మా ఆవిడ. వెచ్చ వెచ్చగా చారూ కూర వడ్డించి! ‘ఇదేమిటే ఈ రోజు ఇలా షాకుల మీద షాకులు ఇస్తున్నావు.. వేడి వేడి వంటలు..’ ‘ఏదో, నేను ఎప్పుడూ మీకు వేడి వేడిగా వంటి పెట్టనట్లు!’ ఆవిడ ముఖం ఎర్రబడింది. ‘పోనీలే.. అయినా ఈ రోజు ఈ మార్పు ఏమిటి? ఏదో ఉంది. కారణం చెప్పు. ఏం టెండర్ పెడుతున్నావు?’ ‘మరీ బాగుంది మీ మాట.. ఏదైనా కొనాలని అడిగే ముందే మీకు నేను సేవ చేస్తున్నట్లు! లేకపోతే చేయట్లేనా?’ ‘అలా అనలేదే నేను. ఇంతకు నా బడ్జెట్లో వచ్చే వస్తువే అడగాలి సుమా’ హెచ్చరించాను. పదివేలు పెట్టి పండుగకి పట్టుచీర కొన్నాను. అందువల్ల చీర టెండర్ పెట్టదు. మరింకేం అడుగుతుంది? నేను ఆలోచనలో పడ్డాను.. హఠాత్తుగా గుర్తుకొచ్చింది. పండుగకి బోనస్ వస్తే ఒక్క వజ్రపు ముక్కు పుడక కొనమని అడుగుతోంది. ‘ఇంకా బోనస్ సంగతి తెలియదే’ అన్నాను. ‘అది కాదండీ..’ ఒక్క నిమిషం మాట్లాడలేదు మా ఆవిడ. ‘ఏమండీ..’ మళ్ళీ గోముగా పిలిచింది. ‘చెప్పు..’ ‘నా సెల్‌ఫోను పోయిందండీ..’ ఓ.. అదా సంగతి! అందుకా ఈ మార్పు. సెల్ ఉంటే సెల్ చెవికి అంటించుకుని రోజంతా మాట్లాడుతూ గడిపే మా ఆవిడకి సెల్ పోయేసరికి భర్తతో మాట్లాడాలని వంట చేయాలని గుర్తుకొచ్చిందన్న మాట! ‘ఎక్కడ పోతుందే.. నువ్వే ఎక్కడైనా పెట్టి మరిచిపోయుంటావు. బాగా వెతుకు.’ ‘అంతా వెతికానండీ..’ మా ఆవిడ దీనంగా నా వైపు చూస్తూ అంది. ‘కనబడలేదండీ..’ ‘అయితే ఇప్పుడు కొత్త సెల్ కొనాలన్న మాట. అంతేగా!’ ఒక్క పూట తిండి లేకపోయినా గడపవచ్చు కాని సెల్ ఫోను లేకపోతే నిమిషమైనా గడపలేం కదా ! ఏం చేస్తుంది.. పాపం! సంపాదన లేని ఇల్లాలు! ‘అలాగేలే. కొత్తది కొంటానులే’ అన్నాను. ఆవిడ ముఖం మీద చంద్రోదయం అయింది. నేను మనసులో నవ్వుకుంటూ అనుకున్నాను.. ‘ఒక్క నాలుగురోజులు పోయాక ఆఫీసులో దాచిన మా ఆవిడ సెల్ ఫోన్ ఇంటికి తీసుకు రావాలని, ఒక్క నాలుగు రోజులు ఆవిడ మాటలూ సాన్నిహిత్యాన్ని ఆస్వాదించాలని! — ఎల్. ఆర్. స్వామి -
Alia Bhatt: తనకు 'ఆలూ' అనే ముద్దు పేరు ఎలా వచ్చిందో తెలుసా!
ఒక్కొక్కరికి ఒక్కో ముద్దుపేరు ఉండటం సహజం. వారి ప్రవర్తనతో గానీ, అలవాట్లు.. ఇష్టాలతోగానీ, కనిపించే తీరుతోగానీ.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. చాలా రకాలుగా మారుపేర్లు, ముద్దుపేర్లు వస్తూంటాయి. కొన్ని ముద్దు పేర్లు మాత్రం స్థిరపడిపోతాయి కూడా. ఇలాగే ప్రముఖ బాలీవుడ్ నటి అయినటువంటి ఆలియా భట్‌కి కూడా ఓ చిన్న కథ ఉంది. అదేంటో చూద్దామా! ఆలియా భట్.. మగవాళ్ల కోసం తయారుచేసిన డియోడరెంట్స్ని వాడుతుందని బాలీవుడ్లో చెవులు కొరుక్కుంటారట. అది సరే.. ఆలియాను ఆమె ఫ్రెండ్స్ ప్రేమగా.. ఇంటోవాళ్లు్ల ముద్దుగా ఆలూ అని పిలుచుకుంటారని ఆమె అభిమానులకు తెలిసే ఉంటుంది. అయితే ఆలియా నుంచి ఆలూ అని రాలేదట. ఆమె చిన్నప్పుడు చబ్బీ చబ్బీగా ఉండటం వల్ల వాళ్లమ్మ సోనీ రాజ్దాన్ ‘ఆలూ’ అని పిలవడం మొదలుపెట్టిందట. తర్వాత అదే ముద్దు పేరుగా సెట్ అయిపోయిందని మూవీ వెబ్‌సైట్స్ ఇన్ఫో! ఇవి చదవండి: పద్నాలుగేళ్ల వయసులోనే దేశాధ్యక్షుడు -
మిస్టరీ: ఓక్చా వోర్ట్మన్!
జీవితంలో అసంపూర్ణంగా ఆస్వాదించిన కొన్ని మధురక్షణాలు.. మళ్లీ తిరిగిరాని జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి. అలాంటప్పుడు పొంగుకొచ్చే భావోద్వేగాన్ని వర్ణించడం మహా కష్టం. ఇక ఆ తర్వాత అంతకుమించిన సంతోషాలెన్నొచ్చినా.. మనసు మాత్రం గతాన్నే నెమరువేసుకుంటుంది. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లమని కోరుకుంటుంది. ‘స్టెల్లా హట్’ జీవితంలో కూడా అదే జరిగింది. ఆమె ఆలాపన, అన్వేషణ, ఆవేదన అంతా తన కన్నతల్లి కోసమే. అసలేంటా కథ? స్టెల్లా కథ.. ఓ అమెరికన్ అయిన ఆమె తండ్రి రాబర్ట్ వోర్ట్మన్ కథతోనే మొదలవుతుంది. అది 1971, జపాన్ . అప్పుడు రాబర్ట్‌కి 22 ఏళ్లు. తను జపాన్ లో ఎయిర్‌మన్ గా పనిచేసేవాడు. ఒకరోజు ఓ ప్రయాణంలో.. ఓక్చా అనే 20 ఏళ్ల కొరియన్ అమ్మాయితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. పెళ్లి అయిన ఏడాదికే స్టెల్లా పుట్టింది. రాబర్ట్.. తన భార్య ఓక్చాను ముద్దుగా ‘సన్నీ’ అని పిలుచుకునేవాడు. కొన్ని నెలలకు జపాన్ కి చెందిన ఒక అమెరికన్ ఎయిర్ ఫోర్స్‌కు.. రాబర్ట్ సెలెక్ట్ అయ్యాడు. దాంతో స్టెల్లాను సన్నీ(ఓక్చా)కి అప్పగించి.. అతడు అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లాల్సి వచ్చింది. మధ్యమధ్యలో వచ్చి.. భార్యాబిడ్డలతో గడిపేవాడు. తండ్రి దూరంగా ఉండటంతో.. స్టెల్లాకు తల్లితో మరింత అనుబంధం పెరిగింది. ఐస్‌క్రీమ్ పార్లర్లో ఉద్యోగం చేసే సన్నీ.. కూతురు స్టెల్లాను చాలా ప్రేమగా చూసుకునేది. చాలా ప్రదేశాలకు తిప్పేది. వాటన్నిటినీ తల్లి ప్రేమకు గుర్తుగా గుండెలో దాచుకుంది స్టెల్లా. కొంతకాలానికి సన్నీకి బార్లో వెయిట్రెస్ జాబ్ వచ్చింది. అది నైట్ డ్యూటీ కావడంతో.. స్టేల్లాను న్యూజెర్సీలో ఉండే రాబర్ట్ బంధువులకు అప్పగించాల్సి వచ్చింది. తనతో స్టెల్లా కూడా లేకపోవడంతో.. సన్నీకి బయట స్నేహాలు పెరిగాయి. ఇంట్లో గడిపే సమయం తగ్గి.. బయట గడిపే సమయం పెరిగిపోయింది. దాంతో ఫ్యామిలీ వెకేషన్ ్స తగ్గిపోయాయి. రాబర్ట్‌తో గొడవలు మొదలయ్యాయి. కాల్ చేసుకున్నా, కలుసుకున్నా.. ఆ రోజంతా గొడవలతోనే ముగిసేది. పరిస్థితి చేయిదాటిపోతుందని గుర్తించిన రాబర్ట్.. సామరస్యంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే భార్యతో ఓ ఒప్పందానికి వచ్చాడు. ‘ఇక నుంచి మనం కలసే ఉందాం.. నాతో పాటు అమెరికా వచ్చెయ్. న్యూజెర్సీ వెళ్లి స్టెల్లాతో సంతోషంగా ఉందాం’ అని కోరాడు. అందుకు సన్నీ సరే అంది. ఇద్దరూ న్యూజెర్సీలో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. దాంతో తన జాబ్‌ని న్యూయార్క్ నుంచి న్యూజెర్సీకి మార్పించుకున్నాడు రాబర్ట్. సన్నీని తీసుకెళ్లడానికి తిరిగి జపాన్ చేరుకున్నాడు. అయితే భర్త వెంట వెళ్లడానికి అభ్యంతరం చెప్పింది సన్నీ. ‘నేను ఇప్పుడే నీతో రాలేను. ఒకసారి మా కుటుంబాన్ని కలుస్తాను. వచ్చాక మనం న్యూజెర్సీ వెళ్లిపోదాం’ అని చెప్పి.. దక్షిణ కొరియాలోని సియోల్‌కి వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. ఆమె గురించి ఎంత వెతికినా ఎలాంటి సమాచారం దొరకలేదు. ‘ఆమె అసలు పేరు ఓక్చా అని, ఆమె సొంత ఊరు దక్షిణకొరియాలోని సియోల్’ అని తప్ప.. మరే వివరాలూ రాబర్ట్‌కి తెలియవు. ఆ మాటకొస్తే తను వెళ్లింది సియోల్కేనో కాదో కూడా తెలియదు. ఆ తర్వాత సన్నీ ఎప్పుడూ కూతురు స్టెల్లాని కలవలేదు. కానీ.. స్టెల్లా మాత్రం తల్లి జ్ఞాపకాలతో తల్లడిల్లిపోయేది. సరిగ్గా రెండేళ్లకు.. రాబర్ట్ తల్లి ఓ ఫోన్ లిఫ్ట్ చేసింది. ‘స్టెల్లా స్టెల్లా’ అనే పిలుపుతో ఓ ఆడ గొంతును అవతలి నుంచి విన్నది. మరే మాట ఆమెకు అర్థం కాలేదు. దానికి కారణం.. రాబర్ట్ తల్లికి ఇంగ్లిష్ మాత్రమేవచ్చు. దాంతో ఫోన్ లో వినిపించిన మాటలేవీ రాబర్ట్ తల్లికి అర్థం కాలేదు. ఒక్క స్టెల్లా అనే పేరు తప్ప. అందుకే ఆ కాల్ చేసింది సన్నీయే కావచ్చు అన్న అనుమానం కలిగింది ఆ కుటుంబానికి. ఎందుకంటే.. సన్నీకి కొరియన్ మాత్రమే వచ్చు. తన తల్లి మాట్లాడే భాష అర్థంకాకే ఆ రోజు సన్నీ కాల్ కట్ చేసుంటుందనుకున్నాడు రాబర్ట్. 1985లో స్టెల్లాకు 4 గౌన్లు, ఓ కుక్కపిల్ల గిఫ్ట్‌గా వచ్చాయి. అయితే ప్యాకింగ్ మీద కాలిఫోర్నియా పోస్ట్ మార్క్ ఉంది. అది కచ్చితంగా తన తల్లే తనకోసం పంపించిందని ఇప్పటికీ నమ్ముతుంది స్టెల్లా. అయితే సన్నీ గురించి ఎలాంటి ఆధారం దొరకలేదు. కొన్నాళ్లకు తండ్రి రాబర్ట్.. మరో పెళ్లి చేసుకున్నాడు. అతడికి మరో పాప పుట్టింది. సవతి తల్లి కూడా స్టెల్లాను ప్రేమగా చూసుకునేది. కానీ కన్నతల్లిని చూడాలనే ఆశ.. స్టెల్లాలో చావలేదు. స్టెల్లాకు పెళ్లి అయ్యి.. ఒక బాబు కూడా పుట్టాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. అయినా తన తల్లిని చూడలేకపోయానన్న వెలితి.. ఆమెను ఇప్పటికీ వెంటాడుతోంది. సన్నీ అలియాస్ ఓక్చాకి ప్రస్తుతం 73 ఏళ్లు దాటే ఉంటాయి. అసలు ప్రాణాలతో ఉందో లేదో తెలియని తల్లి కోసం స్టెల్లా మాత్రం ఇంకా అదే ఆశతో ఎదురుచూస్తోంది. మరి సన్నీ ఏమైంది? ఎందుకు చెప్పాపెట్టకుండా వాళ్ల జీవితాల్లోంచి వెళ్లిపోయింది.? ఒకవేళ మోసం చేయాలని తనకు లేకపోయినా.. అనుకోకుండా ఏదైనా ప్రమాదానికి గురైందా? అలా అయితే.. స్టెల్లా గురించి కాల్ చేసింది ఎవరు? స్టెల్లాకు గిఫ్ట్స్ పంపించింది ఎవరు?’ లాంటి ఎన్నో ప్రశ్నలకు నేటికీ సమాధానాలు లేవు. దాంతో ఓక్చా కథ ఓ మిస్టరీగా మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఈ వారం కథ: శుభశకునం! 'నువ్వు చెప్పింది అక్షరాలా నిజం' -
ఈ వారం కథ: శుభశకునం! 'నువ్వు చెప్పింది అక్షరాలా నిజం'
'వారంలోని ప్రతిరోజు లాగే ఆ రోజు కూడా ఏ ప్రత్యేకతా లేని గురువారం. చలి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా తన ప్రభావం చూపుతోంది. బూడిదరంగు ఆకాశంలో కృశించిపోయిన సూర్యుడు సన్నని వెలుతురు పంచుతున్నాడు. మునుపెన్నడో చెత్తకుండీలోంచి ఏరుకొచ్చిన ఓ నడిపాత తివాచీపై కూతురు దగ్గుతో లుంగలు చుట్టుకుపోవడాన్ని మజీద్ నిస్సహాయంగా గమనించసాగాడు. పనార్ ఎడారిలోని సంచారతెగలు వుండే ఒకే ఒక్క గది ఉన్న ఇంటికి అదే కాస్త వెచ్చదనాన్ని సమకూరుస్తోంది. బైట న్యుమోనియా ప్రబలిపోతుండడంతో మజీద్ తన కూతుర్ని ఎన్నో ఆస్పత్రులకు తిప్పితే చివరికి ఓ డాక్టర్ ఆమెను చూడడానికి ఒప్పుకున్నాడు. ఆయన మందులిచ్చి వ్యాధి మరింత ఎక్కువ కాకుండా పిల్లని కాస్త వెచ్చని వాతావరణంలో ఉంచమన్నాడు.' ‘ఇలా రండి, కాస్త టీ, రొట్టీ, ఓ గుడ్డు తీసుకుందురు గానీ’ భార్య ఫరీదా అంది. తన కొడుకులు బైట సంతోషంగా ఆడుకోవడాన్ని, ఫరీదా అతని చుట్టూ ఆందోళనగా తిరగడాన్ని అతను నిశ్శబ్దంగా చూడసాగాడు. ఆమె కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు, మొరటుగా మారిన చేతివేళ్లు, కాయలు గాచిన అరచేతులు.. పెళ్ళైన కొత్తల్లోని ఫరీదాకీ, ఈమెకు ఎంతో తేడా చూపుతున్నాయి. ఆగది మధ్యకు ఆమె మూలనున్న ఓ బల్లని జరిపింది. అదే వాళ్ళకి వంటగదీ, పడకగదీ, భోజనాలగదీ, అన్నీ. స్నానాల గది, పాయిఖానా ఇంటి బైటెక్కడో, అవి మాత్రం సామూహికం. వాటిని ఎన్నో కుటుంబాలవాళ్ళు వాడుకుంటుంటారు. ఇంట్లో కూడా ఈ బల్లతో పాటే నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు.. అంతే! ఓ టీవీ, దాన్ని ఎక్కడో దొరికిన ప్లాస్టిక్ పూలతో అలంకరించారు. అదో మూలన చిన్న స్టూల్ మీద ఉంటుంది. నీళ్ళ కోసం వాడి పారేసిన కోకాకోలా బాటిల్స్ వాడుకుంటుంటారు. ప్రతిరోజూ వాళ్ళు మాంసం వండుకుని తినడానికి కుదరదు. ఒకవేళ కుదిరినా చిన్న ముక్క కూడా మిగలదు. అందుకని వాళ్ళకి ఫ్రిజ్ అవసరం కూడా ఉండదు. తన భార్య కూతురి ఆరోగ్యం గురించిన చింతతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిందని మజీద్‌కి బాగా తెలుసు. ఓవారం రోజుల్లోనే ఆమె మొహం ఎంత నీరసించిపోయి పీక్కుపోయిందో అర్థమవుతోంది. అయితే తను ఏరోజూ ఏ విషయంలోనూ ఫిర్యాదు చేసింది లేదు. ఆ విషయంలో తను అదృష్టవంతుడే, కానీ లోపల్లోపల అతనేదో అపరాధిలా బాధపడుతుంటాడు. తమ కష్టాలు తీరిపోయే రోజు ఒకటి వస్తుందని అతను ఎదురు చూస్తున్నాడు. ‘జమీలా! నాన్నగారు బైటికి వెళుతున్నారు, టాటా చెబుదాం రా!’ అంటూ ఆ చిన్నబిడ్డని ఫరీదా తివాచీ పైనుంచి లేపేటప్పటికి ఆ పిల్ల గట్టిగా అరుస్తూ ఏడవసాగింది. దాంతో కలవరపడిపోయిన ఆ తల్లి పాపని ఊరుకోబెట్టడానికి చిన్నగా పాడసాగింది. ‘ఈవేళ తొందరగా వచ్చేస్తానులే’ టీ ముగించిన మజీద్ అన్నాడు ఆమెతో. ‘ఇన్షా– అల్లాహ్!’ మజీద్ నెమ్మదిగా నడుస్తూ హైవే మీదకొచ్చి సిటీ బస్ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. అతని చుట్టూ ఎడారే, అక్కడక్కడా ముళ్ళజెముడు మొక్కలు రోడ్డుకిరువైపులా పెరిగిపోయున్నాయి. వీస్తున్న చల్లగాలికి అతను వేసుకున్న జుబ్బా ఊగుతుంటే, తలపై టోపీ చలి నుండి, దుమ్ము నుండి అతనికి రక్షణ కల్పిస్తోంది. చలికి పగిలిన అతని పాదాలు తక్కువ ధరలో కొన్న పాత ఉన్ని మేజోళ్ళలోనూ, నకిలీ తోలుబూట్లలోనూ తలదాచుకున్నాయి. నిజం చెప్పాలంటే సంచార జాతుల వాళ్ళకు కుటుంబం గడవాలంటే చెప్పినంత సులువు కాదు. తను ఏదో ఒక పని చేస్తున్న కారణంగా అధికారులు తనని అరెస్టు చేయకుంటే చాలని ప్రతిరోజూ అతను ప్రార్థిస్తుంటాడు. ఆ ప్రాంతాల్లో అడుక్కు తినడాన్ని నిషేధించారు కాబట్టి తమలాంటి వాళ్ళు ఏ పని దొరికితే అది చాలావరకు అవి చట్టవ్యతిరేకమైనవే అయుంటాయి. చేయడానికి సిద్ధంగా ఉంటారు. సంచార జాతివాడిగా ముద్రవేయబడ్డ అజీజ్ కానీ, అతని తండ్రి, తాత, ఎవరూ కూడా బడికి వెళ్ళి చదువుకున్నదేలేదు. నేటి సమాజంలో చదువు రాకపోవడమంటే ఎంత దుర్భరమో అతనికి బాగా తెలుసు. ఏదో అజీజ్ తన మీద దయతో తన పనిముట్లను అతని షాపులో ఉంచుకోనిస్తూ తనకి సహకరిస్తున్నాడు. ‘జమీలా ఎలా ఉంది?’ అడిగాడు అజీజ్. ‘ఇప్పుడు ఫర్వాలేదు’ చెప్పాడు మజీద్. ‘రెండు రోజుల పాటు నువ్వు రాకపోయేసరికి కాస్త కంగారుగా ఉండిందిలే.’ ఆ ఊళ్ళో అజీజ్ ఒక్కడే తనతో ఈ మాత్రం దయతో ఉంటాడు. అతనికో చిన్న ఎలక్ట్రిక్ షాపు ఉంది. అందులోనే అతను ఏ ప్రతిఫలం ఆశించకుండా మజీద్ పనిముట్లను ఉంచుకోవడానికి పెద్ద మనసుతో అనుమతినిచ్చాడు. ఎప్పుడైనా ఓ మంచిరోజున అజీజ్ అతనికి ఐదారు దీనారాలను ఇస్తుంటాడు. కానీ ఆ మంచిరోజులనేవి చాలా చాలా అరుదు. ప్రతిరోజూ మజీద్ కేవలం రొట్టె, పెరుగులతో భోజనం చేస్తుంటాడు. అప్పుడప్పుడు అజీజ్ తను ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం పెట్టేవాడు. కోడిమాంసం, కట్లెట్.. ఇలా. ఎప్పుడైనా ఒక్కోసారి మహబూబ్ హోటల్ నుంచి భోజనం తెప్పించేవాడు. అజీజ్ కబాబ్ కానీ మరోటి కానీ మజీద్‌కి తినమని ఇచ్చినప్పుడల్లా ఏదో అపరాధభావన మజీద్‌ని తొలిచేసేది..అనవసరంగా అతనికి భారమౌతున్నానని. ‘తిను మజీద్, నువ్వు తినకుంటే నాకు బావుండదు’ మెల్లిగా నచ్చజెప్పేవాడు అజీజ్. ‘షుక్రియా’ ఔదార్యంతో అతనిస్తుంటే, అతన్ని నొప్పించకూడదని మజీద్ తీసుకునేవాడు. అజీజ్ మంచితనానికి తను ఏ విధంగానూ, ఎన్నటికీ ఋణం తీర్చుకోలేనని మజీద్‌కి తెలుసు. ఏదో ఒక అద్భుతం జరిగి తన దశ తిరిగిపోతే తను కూడా అజీజ్లాగే ఇతరులకి సహాయపడాలని అతనెప్పుడూ కోరుకుంటుంటాడు. ప్రతిరోజూ మక్కా వైపుకు తిరిగి ఐదుసార్లు ప్రార్థన చేసేటప్పుడు అటువంటి అద్భుతమొకటి తన జీవితంలో జరగాలని భగవంతుని ప్రార్థిస్తుంటాడు. ఇప్పుడతని వయసు నలభై ఐదు.. తనపై ఆధారపడ్డ వాళ్ళు మరో నలుగురు. ఓ విధంగా అతను తన తల్లిదండ్రులు ఈ ‘ఆపరేషన్ లెనిన్ బోల్ట్’ ఆరంభమై ఈ కష్టాలన్నీ అనుభవించకుండా దాటుకెళ్ళిపోవడాన్ని అదృష్టంగా భావిస్తుంటాడు. అప్పట్లో అతని వయసు ఇరవై మూడు. మనిషిగా తననెప్పటికీ గుర్తించలేని ఈ మాతృభూమి పట్ల దేశభక్తి అతని కణాల్లో అగ్నిని రగిల్చేది. సైన్యంలో చాలా చిన్న ఉద్యోగంలో చేరి యుద్ధం చేసే బీభత్సాన్ని ఓ సాక్షిలా తన కళ్ళారా చూశాడు. ‘యుద్ధంలో వీరమరణమన్నదే లేదు.. రక్తపాతం తప్ప! వీధుల్లో యుద్ధట్యాంకులు నడుస్తుంటే మనసులో ఆనందం ఎలా ఉంటుంది.. ఏదో ఖాళీ అయిన భావన తప్ప! యుద్ధంలో విజయం అంటే ఈ మనసు ఖాళీ అయిందానికా లేక ఈ భయంకరమైన పరిస్థితులకా? దేన్ని విజయం అంటారు? అంతా కల్పితం, అంతా మాయ కాకపోతే!’ మసాలా టీ తాగుతూ ఎన్నోసార్లు మజీద్ యుద్ధమంటే తన ఏవగింపును కవితాత్మకంగా తన మిత్రునితో పంచుకునేవాడు. ఈ యుధ్ధంలోనే అజీజ్ తన సర్వస్వాన్ని, తన కుటుంబంతో సహా కోల్పోయాడు. నెలల తరబడి అతను తనలాంటి వాళ్ళతో కలిసి ఎంతో బెంగగా, తన దగ్గరికి రాని చావు కోసం ఎదురు చూస్తూ టెంట్లలో నివసించాడు. ఒక్కొక్కరుగా తన తోటివారి మరణాలు అతన్ని నెమ్మదిగా ఇహలోకంలోకి తెచ్చాయి. ‘పోయిందేదో పోయింది, ఇకనైనా నేను ఇతరులకి ఉపయోగపడేలా జీవించాలి’ తన్ను తానే సమాధానపర్చుకున్నాడు. అది మొదలు ఎవరికి ఏ సహాయం కావాలన్నా, శవాలు పూడ్చడంతో సహా చేయందించేవాడు. ఆ సమయంలో అతనికి పరిచయమైన సంచార జీవులు, వారికి సంబంధం లేని ఈ దేశం పట్లా, ఆ దేశపౌరుల పట్లా వారికున్న భక్తిభావం, అంకితభావం.. అన్నీ అతనికి ఎంతో విస్మయం కలిగించాయి. అప్పటి నుండి ఈ సంచారజాతుల పట్ల అతని దృక్పథం ఎంతో మారిపోయింది. అటువంటి వారికి తన హృదయంలో భగవంతుని తర్వాత అంతటి స్థానం కల్పించాడు. ఉద్రిక్తతలకు నెలవైన సరిహద్దుల నుంచి యుద్ధట్యాంకులు వెనక్కి వెళ్ళాక, వీళ్ళు కూడా తమ తమ ఆవాసాలకి.. గుర్తింపు లేని, అణచివేయబడ్డ తమ జీవితాల్లోకి తిరిగి వెళ్ళిపోవడాన్ని గమనించాడతను. తమ దేశానికి కొత్తగా వచ్చిన స్వాతంత్య్రానికి ప్రతీకగా ఎగిరే జెండాను ఎక్కడ చూసినా సరే అతన్ని ఏదో అపరాధభావనతో చీల్చేసేది. ఈ విజయానికి ఇతర మిత్రదేశాలు సంబరాలు చేసుకుంటుంటే త్యాగాలు చేసిన ఈ సంచార జీవులు మాత్రం అజ్ఞాతంగా ఉండిపోయారు. ‘ఈ కపటనాటకాలతో నా మనసు అవమానంతో దహించుకుపోతోంది, నిస్సహాయుడినైపోయాను!’ అజీజ్ అన్నాడు. ‘ఒంటిగాడివైపోయావు, ఏం చేయగలవు!’ విచారిస్తున్న అజీజ్‌ని ఓదార్చాడు మజీద్. ‘అసలు నువ్వు నా పట్ల చూపుతున్న మంచితనమే నాకెంత గొప్పగా ఉంటుందో తెలుసా! అల్లా నీకు స్వర్గంలో తప్పకుండా చోటు కల్పిస్తాడులే అజీజ్!’ ‘స్వర్గమా!’ బుస కొట్టాడు అజీజ్. ‘నిజమే! ఒక్కడివే భారీ మార్పులు తేలేకపోవచ్చు, కానీ నువ్వు నాపై చూపే మంచితనం నా జీవితానికెంత ముఖ్యమో తెలుసా! నువ్వు ఆ అల్లా దూతవని నేనెప్పుడూ నమ్ముతాను.’ ‘అబ్బా, మజీద్! పొగడ్డానికైనా ఓ హద్దుండాలయ్యా!’ ‘ఇదేం పొగడ్త కాదు, నిజమే కదా?’ అజీజ్ తన ఖాళీ కప్పుని పక్కన పెట్టి, తలపైని టోపీ తీసేసి కౌంటర్ వెనక్కెళ్ళి కూచున్నాడు. ‘అస్సలామలేకుమ్!’ నీలిరంగు కోట్లు ధరించి, వయసులో ఉన్న ఇద్దరు ఈజిప్షియన్లు అక్కడికొచ్చి వైరింగ్ కేబుల్స్ కోసం అడిగారు. అజీజ్ వాళ్ళడిగిన వస్తువుల కోసం అరల వెనక్కి వెళ్ళగానే ఈజిప్షియన్లలో ఒకడు అటూఇటూ చూసి మజీద్ దగ్గరికెళ్లి తన కుడికాలి బూటుని అతనికిచ్చాడు. ‘దీన్ని కుట్టాల్సుంటుంది.. కొంత సమయం కావాలి’ పళ్ళూడి బోసినోరులా కనిపిస్తున్న ఆ బూటుని పరీక్షించి అన్నాడు మజీద్. ‘పర్లేదులే’ మజీద్ తన పనిలో తానుంటే అతను అక్కడున్న ప్లాస్టిక్ స్టూలుపై కూచున్నాడు. మరొకడు అజీజ్ తెచ్చిన వైరు సామానుని పరిశీలిస్తున్నాడు. ఐదారు నిమిషాల్లో మజీద్ తన పని ముగించేశాడు. ఆ యువకుడు బూటుని పరీక్షించి, కాలికి తొడుక్కుని, సంతృప్తిగా మజీద్ వైపు చూశాడు. ‘ఎంతివ్వాలి?’ ‘ఎంత బాబూ, యాభై షిల్స్ అంతే!’ ‘అంతే! చెత్తగాళ్ళు, ఈ దేశదిమ్మరులు కూడా ఎంత ఖరీదు చెబుతున్నారో!’ ప్యాంట్ జేబులని వెతుకుతూ అన్నాడతను. మజీద్ అతనివంక ఏ భావమూ లేకుండా సూటిగా చూశాడు. ఈ చుట్టుపట్ల చెప్పులు కుట్టే వాళ్ళలో తనే చాలా చౌక అని అతనికి బాగా తెలుసు. ‘కుక్కా! తీసుకో!’ నాణాన్ని అతనివైపుకి విసురుతూ, గారపట్టిన పళ్ళని బైటపెడుతూ హేళనగా నవ్వాడా యువకుడు. అతని మాటలని పట్టించుకోనట్టు ఉండిపోయాడు మజీద్. లోలోపల మనసు మండిపోతుంటే పళ్ళు గిట్టకరిచాడు. ఇప్పుడు తనేం మాట్లాడే పరిస్థితిలో లేడని అతనికి తెలుసు. ‘జరిగినదానికి చాలా బాధగా ఉంది మజీద్’ అన్నాడు అజీజ్. తలపైని బట్ట సవరించుకుంటూ నిస్సత్తువగా ఒక్క నవ్వు నవ్వాడు మజీద్. ‘జీవితంలో మనకు బలం, అధికారం లేనప్పుడు ఓర్పు, క్షమ అలవర్చుకోవాలని నేర్చుకున్నాను. ఇప్పుడు వాడు నన్ను కుక్కా అన్నాడు.. కానీ ఈ దేశం దహనమైపోతుంటే వీళ్ళలో ఒక్కడైనా ముందుకు రావడం మనం చూశామా?’ రెప్పల వెనుక కన్నీటిని దాచేశాడు మజీద్. అంగీకారంగా తలూపి అజీజ్ ఓ వార్తాపత్రికను తీసుకుని హెడ్ లైన్స్ చదువుతుండగా ఓ విషయం అతన్ని ఆకర్షించింది. ‘పౌరసత్వం ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం.’ ‘మజీద్! శుభవార్త! సంచారజాతులకు పౌరసత్వం ఇవ్వడానికి కేబినెట్ ప్రయత్నిస్తోందట! ఇకపై నువ్వు దేశదిమ్మరివని అనిపించుకోనక్కరలేదు.’ ‘హు! ఈ సర్కస్ ఎన్నిసార్లు చూడలేదు అజీజ్! పార్లమెంటులో బిల్లు పెట్టాము అన్న మాటలతో చాలా అలసిపోయాను. ఈ వారంలో నేను జమీలాను తీసుకుని ఎన్నో ఆస్పత్రులు తిరిగాను. కేవలం సంచారజాతి వాడినైనందుకు డాక్టర్లు ఆమెకు చికిత్స చేయలేదు తెలుసా? మేమలా పుట్టడం నేరమా? మేము మనుషులం కామా?’ ‘నిజమే కానీ, అసలు మీ పరిస్థితే చాలా విచిత్రంగా ఉంది. మీలో కొంతమంది మాలాంటి పౌరులకన్నా ఎక్కువ కాలంగా ఇక్కడుంటున్నారు. కానీ ఎడారి ప్రాంతాలలో మిమ్మల్ని వలసదారులుగా చూస్తారు. మరికొందరు సాధారణ పౌరుల్లా తాము కూడా ప్రయోజనం పొందాలని తమ కాగితాలను కాల్చిపడేసి దేశంలోకి చొచ్చుకుని వచ్చేశారు. ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిన వారినీ, చట్టాన్ని గౌరవించేవారినీ ఎలా తెలుసుకోవాలని? ఈ సమస్యకు పరిష్కారం సాల్మన్ రాజు కూడా చూపలేడేమో!’ ‘నువ్వు చెప్పింది అక్షరాలా నిజం, కానీ ఈ నిరీక్షణ, ఇంత అన్యాయం.’ ‘చూడు మజీద్, యుద్ధమంటే కేవలం చెడ్డవాళ్ళు మాత్రమే మరణించరు. మంచివాళ్ళు కూడా కొంత బాధ పడాల్సి వస్తుంది. ఇక్కడ నేను చెప్పిందే నిజం కాకపోవచ్చు కానీ,లోకం తీరు అలాగే ఉంది మరి!’ ‘1967 లో జరిగిన ఆరు రోజుల యుద్ధం గురించి మా నాన్నగారు చెప్పింది నాకు బాగా గుర్తు. ఆర్మీలో చేరి, అందులో పనిచేయడానికి సంచారజాతులవారిని ఉపయోగించుకుంటారు కానీ యుద్ధమైపోయాక మాదారి మాదే.. ఎడారి వైపే. దీనివల్ల మానాన్న ఏ మాత్రం ప్రయోజనం పొందలేదు, కేవలం వాళ్ళకి ఉపయోగపడ్డారంతే! కొంతమందికి కంటితుడుపుగా ఏవో కొన్ని అవార్డులిచ్చారే కానీ పౌరులు యుద్ధంలో పాల్గొంటే ఇచ్చేదాని ముందు ఇదెంత? ఎంత దారుణంగా వివక్ష చూపుతున్నారో, మమ్మల్ని జంతువుల కన్నా హీనంగా చూస్తున్నారు. ఇంక మాకు గౌరవం ఏముంటుంది!’ నిట్టూరుస్తూ, ‘నిన్న పుచ్చకాయలు అమ్ముతున్నాడని బద్రుని అరెస్టు చేశారట తెలుసా?’ అన్నాడు మజీద్. అద్దాలు సరిచేసుకుంటూ పత్రికలోంచి తలెత్తి చూశాడు అజీజ్. అతనికేం చెప్పాలో తోచలేదు. అతని అదృష్టం కొద్దీ మధ్యాహ్న ప్రార్థనల కోసం మసీదు నుంచి వచ్చిన పిలుపు గాలిని నింపేసింది. ఇద్దరూ తమ తమ చాపల్ని పరుచుకొని మక్కావైపుకు తిరిగి ప్రార్థించసాగారు. లయబద్ధంగా ప్రార్థన చేస్తున్నవారి కంఠం నుండి వస్తున్న శ్లోకాలు ఆ మధ్యాహ్నవేళ నిశ్శబ్దాన్ని కరిగించసాగాయి. ఓ పదిహేను నిమిషాల పాటు వీధులన్నీ స్తబ్ధుగా మారినా, వెంటనే మళ్ళీ మామూలే.. ఉరుకులు, పరుగులు. ఆ ఇద్దరూ ఒకరు దేశపౌరుడు, మరొకరు సంచార జాతివారు. విచిత్రంగా ఇద్దరూ ఒకే భగవంతుని ముందు మోకరిల్లారు. బహుశా ఆయనకి స్వర్గానికి, మనుషుల మనసులకు తేడా తెలియదేమో! చాప మడుస్తూ ఎందుకనో మజీద్ ఆలోచనలో పడ్డాడు. ‘ఏమిటంత ఆలోచన మజీద్?’ ‘మా సంచారజాతుల వాళ్ళమంతా కూడా సంచారజాతి దేవుడినే ప్రార్థించాలేమోనని!’ ‘ఛ! ఏమిటా మాటలు?’ గట్టిగా అరిచాడు అజీజ్. ‘ఒక్కోసారి భగవంతుడు గుడ్డివాడు, చెవిటివాడు అనిపిస్తుంది. సిగ్గుతో తన ముఖం చూపించలేక దాచుకున్నాడనిపిస్తుంది. ఎంత కాలమిలా? మా ప్రాణాలు విసిగిపోయాయి! అందుకే నేను..’ ‘నిరాశతో దైవదూషణకు పాల్పడవద్దు మజీద్! మరి నేను ఏ దేవుడిని ప్రార్థించాలని? ఏ దేవుడైతే నాకు ఇంటినీ, కుటుంబాన్నీ ఇచ్చాడో అదే దేవుడు వాటిని నాశనం కూడా చేశాడు. అంత మాత్రాన నేను మరో దేవుడిని ప్రార్థించాలా? మన జీవితాలే మనకు పాఠాలు కావాలి అంతే!’ స్నేహితుని భుజం తడుతూ అన్నాడు అజీజ్. ‘అంటే, ఇదే న్యాయమంటావా?’ ‘కావచ్చేమో! అయితే అది తెలుసుకోవడానికి మనం తెరవాల్సింది కళ్ళు కాదు, మనసు! ఒక్కోసారి ఎంత తరచి చూసినా ఇవన్నీ మనకు అర్థంకావు కూడా. యుద్ధక్యాంపులోని నా జీవితం ఇతరులకి సహాయం చేయడంలో తప్ప మరెందులోనూ అర్థం లేదని తెలిపింది.’ అర్థం లేని నిరీక్షణలో, నిరాశతో కుంగిపోయిన తన స్నేహితుడివైపు జాలిగా చూశాడు అజీజ్. మజీద్ తన పౌరసత్వం కోసం ఎంతగా ప్రార్థిస్తున్నాడో అతనికి బాగా తెలుసు. జీవితంలో ఏ హక్కులూ, అంతెందుకు ఓ గుర్తింపు కూడా లేకపోవడమంటే మనిషినెంత వేధిస్తుందో అజీజ్‌కి బాగానే అర్థమవుతోంది. అతనికి మజీద్ పరిస్థితి తలలేని మొండెంలా అనిపిస్తోంది. మజీద్ స్థితిగతుల్ని ఏ మాత్రం మార్చలేని తను చూపించే జాలి, సానుభూతి ఎంత వరకు ఉపయుక్తమో తల్చుకున్న కొద్దీ బాధ కలిగిస్తోంది అతనికి. ‘మంచిరోజులు వస్తాయిలే మజీద్!’ ఆశావహంగా అన్నాడు అజీజ్. ‘నాకు మా తండ్రి మరణించిన రోజు గుర్తుకొస్తుంది, ఆ రోజు మా నాన్న శవం అనామకంగా.. ఆయన తండ్రిలాగే ఎక్కడో పూడ్చిపెట్టామే తప్ప ఆయనకో గుర్తింపు లేదని గ్రహించలేకపోయాను. రేప్పొద్దున నేనైనా అంతే! అదేమంత బాధ కాదు కానీ, రాబోయే తరాలు తమ తాతముత్తాతలని ఎక్కడ పూడ్చిపెట్టారో కనీసం తెలుసుకుంటారు. అవి తమకు చెందినవేనని అర్థంచేసుకుంటే అదో తృప్తి, అంతే! మాలాంటి వాళ్ళంతా అంతే, ఎక్కడ పుట్టామో, ఎక్కడికి వెళుతున్నామో, మాకంటూ ఓ ఉనికీ, దానికో నిదర్శనమూ ఏదీ ఉండదు’ అన్నాడు మజీద్. ‘సరే, ఇక భోంచేద్దాం పద’ మనసుని తొలిచే ఈ అంశం నుండి మజీద్ దృష్టి మరల్చడానికి అజీజ్ అన్నాడు. కళ్ళద్దాలని సరిచేసుకుంటూ అజీజ్ తన భోజనాన్ని తీసుకొచ్చాడు. రొట్టె, పెరుగు తెచ్చుకోవడానికి మజీద్ బైటికెళ్ళాడు. ప్రతిరోజూ అతను అలీబాబా బేకరీ వాళ్ళు వందమందికి చేసే దానంలో ఈ రొట్టె, పెరుగు తెచ్చుకుని భోంచేస్తుంటాడు. ఈజిప్టు దేశ కార్మికులు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు, భారతీయులు ఎక్కువ భాగం ఈ అలీబాబా వారి ఔదార్యంతోనే జీవిస్తుంటారు. ప్రతిఒక్కరికీ వెచ్చని నాలుగు రొట్టెలు, ఓ సీసాడు పెరుగు.. దీనికోసం ఎంతోమంది క్యూ కడుతుంటారు. అదేం పోషకాహారం కాకపోయినా ఎన్నో ఏళ్ళుగా ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతోంది మరి! ప్రత్యేకమైన రోజుల్లోనూ, రంజాన్ మాసంలోనూ అతను మసీదులో పెట్టే భోజనంతోనే గడిపేస్తుంటాడు. వీలైతే తన ఇంట్లోవారి కోసం ఓ ప్లాస్టిక్ సంచిలో అక్కడి నుండి భోజనపదార్థాలు తీసికెళుతుంటాడు. తన రొట్టె, పెరుగు తీసుకుని మజీద్ గబగబ అజీజ్ దుకాణానికి పరిగెట్టాడు. అక్కడ అజీజ్ తన కోసం ఎదురు చూస్తుంటాడు మరి! ప్రతిరోజూ తెల్లవారే అజీజ్ తన మధ్యాహ్న భోజనాన్ని వండుకుని తెచ్చుకుంటుంటాడు. ఎప్పుడైనా మాంసం వండుకున్నప్పుడు కాస్త ఎక్కువగానే వండి మజీద్ కోసం తెస్తుంటాడు. అజీజ్ తన డబ్బా మూత తెరిచేసరికి వంటకాల ఘుమఘుమలు షాపంతా అల్లుకున్నాయి. దాంతో ఇంటి గురించిన ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు మజీద్. ఫరీదా కుట్లు అల్లికల్లో ఎంతో నిష్ణాతురాలు. అలా సంపాదించిన డబ్బుతో ఆమె మాంసమూ, ఎప్పుడైనా పిల్లలు జబ్బు పడినప్పుడు మందులకూ ఉపయోగిస్తుంటుంది. బాగా డబ్బున్న ఓ అరబ్బీ ఆవిడకు ఫరీదా చేసే ఎంబ్రాయిడరీ అంటే ఎంతో ఇష్టం. ఆమె ఫరీదాని తన కోసం మరిన్ని ఎంబ్రాయిడరీ పనులు చేసివ్వమని అడుగుతుంటుంది. తన చేతివేళ్లు నొప్పి పుట్టినా, కళ్ళకు శ్రమ కలిగినా సరే, వచ్చే ఈ కొద్దిపాటి ఆదాయాన్ని ఫరీదా వదులుకోదు. పిల్లలు ఎలాగూ బడులకు వెళ్ళరు. వాళ్ళు ఇంట్లోనో, ఆ చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటారు. ఇంటిపనీ, ఎంబ్రాయిడరీ పనీ, పిల్లలని చూసుకోవడంతో ఆమెకు పొద్దు చాలదు. అయినా ఎంతో నేర్పుతో అన్నీ సంబాళించుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి ఆ ధనికురాలు పిల్లలకోసం పాలపొడి, పిండి.. జమీలా, సిరాజ్, ఒమర్‌లకు తన పిల్లల పాతబట్టలను కూడా ఇస్తుంటుంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళకదే కాస్త ఊరట కలిగించే విషయం. ‘మాంసం చాలా చక్కగా వండావు అజీజ్, కాస్త నా రొట్టె కూడా తీసుకో. దీంతో పాటే అది కూడా బాగుంటుంది’ అన్నాడు మజీద్. ‘అయితే ఈ అన్నాన్ని ఎవరు తింటారు? ఈసారి నీ రొట్టె కోసమే వస్తాన్లే’ చిన్నగా నవ్వాడు అజీజ్. వెన్నెల్లాంటి ఆ నవ్వును చూస్తూ మజీద్ ‘నిజమే, దేవుడున్నాడు’ అనుకున్నాడు. ఆవేళ రాత్రి ప్రార్థనలయ్యాక రోజంతా జరిగిన సంఘటనలని గుర్తుచేసుకుంటూ మజీద్ ఫరీదాతో తమకిక మంచిరోజులు రానున్నాయని, భగవంతుడు తమ ప్రార్థనలని ఆలకించబోతున్నాడనీ ఎంతో ఆశగా చెప్పాడు. ఆ రాత్రి చీకటి దట్టంగా పరుచుకున్న ఆకాశంవైపు చూడసాగాడు మజీద్. గాలి ఈలలు వేస్తూ వచ్చి ఇసుక తిన్నెలపై వాలి అక్కడే ఆగిపోతోంది. ఒంటెలు వాళ్ళుంటున్న పరిసరాల్లో అటూ ఇటూ బద్ధకంగా తిరుగుతున్నాయి. కిటికీ దగ్గరగా కూచుని అతను మనసారా ప్రార్థన చేసుకుని ఆకాశం వైపు చూశాడు. మేఘాలన్నీ దక్షిణం వైపు జరిగిపోవడంతో ఓ నక్షత్రం ఆ ప్రదేశాన తళుక్కుమంది. చంద్రుని చూసిన చకోరంలా అతని ఎద ఎగిసిపడింది. ఇంతకుముందు ఒకసారి అజీజ్ తన షాపులో సామాను ఉంచుకోవడానికి అనుమతినిచ్చినపుడు ఇలాగే.. ఓ తార నీలాకాశంలో తళుక్కుమంది! ఆశనిరాశల ఈ ఊగిసలాటలో తన కుటుంబాన్ని చంపేసి, తను కూడా ఆత్మహత్య చేసుకుందామనుకున్న రోజులవి. తన పనిముట్లున్న సంచిని పట్టుకుని ఇల్లిల్లూ తిరిగినా ఫలితం లేకపోవడంతో నిరాశగా ఓ షాపు ముందు అలిసిపోయి కూచుంటే.. అప్పటికది అజీజ్దని తనకి తెలియదు. మధ్యాహ్నపు ఎండకు సోలిపోతుంటే అజీజ్ తనని లోనికి రమ్మని మంచినీళ్ళిచ్చి వివరాలు కనుక్కున్నాడు. అప్పటి నుండే తన జీవితం చిన్న మలుపు తిరిగింది మరి! ‘ఎందుకు నాన్నా నవ్వుతున్నారు?’ తండ్రితో పాటు ఆకాశంలోకి చూస్తూ అడిగాడు ఒమర్. తాము కూడా కళ్ళువిప్పార్చుకుని చూస్తూ తండ్రిని చుట్టుముట్టేశారు సిరాజ్, జమీలాలు. ఫరీదా భర్త వైపు చిరునవ్వుతో ఓసారి చూసి తన పనిలో పడిపోయింది. మజీద్ తన పిల్లల వైపు చూసి చిన్నగా నవ్వాడు. మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని అనుభవిస్తున్న అతను పిల్లలను దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. ఏదో శుభసూచకం అతని మనసుకి తోస్తోంది. కచ్చితంగా మంచిరోజు వస్తోంది! శుక్రవారం గాలిలో ఏదో మత్తు జల్లినట్టు తెల్లవారింది. ఎందుకనో ఆ వేళ ప్రార్థనలకు మసీదుకు వెళ్ళాలనిపించింది మజీద్ మనసుకి. మధ్యాహ్న ప్రార్థనలయ్యాక ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్లో ఎవరో బోర్లా పడి ఉండడం కనిపించిందతనికి. ఆ అబ్బాయిని తిప్పి చూసిన మజీద్ అతని ముఖం మీద రక్తపు చారికలు కనిపించేసరికి నివ్వెరపోయాడు. స్ప్పహ తప్పిన అతన్ని చేతుల్లోకి తీసుకుని దారేపోతున్న ఓ లారీని ఆపి దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. క్యాజువాల్టీ వార్డులో ఆ అబ్బాయిని అప్పగించి, ఆతృతగా బైట నిలబడి ఎదురుచూడసాగాడు. ఎందుకనో తను ఇబ్బందుల్లో పడబోతానేమో అనిపించింది అతనికి. ఇక ఇంటికి వెళదాం అనుకున్నంతలో మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్న ఓ డాక్టర్ అతన్ని ఆగమని సైగ చేశాడు. గుండె దడ పుట్టి, ఏదో కడుపులో తిప్పుతున్న భావన అతనిలో! నొసలంతా చెమటలు పట్టి, కంఠం పొడిబారిపోయింది అతనికి. ఇంతలో తళతళలాడే ఓ నల్లని జాగ్వార్ కారు ఆస్పత్రి ముందు ఆగింది. అందులోంచి కలవరపాటుతో మొహం ఉబ్బిపోయిన ఓ అరబ్ దిగాడు. ఆందోళనకు చిరునామాలా ఉన్నాడతను. పైబట్టని సర్దుకుంటూ, జారిపోతున్న నల్లని దుస్తులని సరిచేసుకుంటూ లోనికి అడుగుపెట్టాడు. శరీరం వణికిపోతుండగా అతను మజీద్‌ని దాటి క్యాజువాల్టీ వార్డులోపలికి వెళ్ళాడు. మనసు లోపల్లోపల తను ఏ తప్పూ చేయలేదని తెలిసినా, అతన్ని ఏదో తెలియని భయం ఆవరించింది. శక్తినంతా కూడగట్టుకుని పారిపోదామనుకున్నంతలో, ఇంతకు ముందు మొబైల్ ఫోన్లో మాట్లాడిన డాక్టరూ, ఈ అరబ్బూ కలిసి బైటికొచ్చారు. కొంతసేపు వాళ్ళేం మాట్లాడుకున్నారో కానీ.. ఆ డాక్టరు మజీద్ వైపు చూపించడమూ, ఆ అరబ్బు అతన్ని దగ్గరికి రమ్మని సైగ చేయడమూ జరిగిపోయాయి. కాళ్ళు భూమిలో పాతుకుపోయినట్టయి మజీద్ కదల్లేకపోయాడు. ఇంతలో ఆ అరబ్బు అతని దగ్గరికొచ్చి కష్టంతో కరకుదేరిన మజీద్ చేతిని తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేనంతగా మజీద్ మనసు మొద్దుబారిపొయింది. ‘అల్లా హు అక్బర్! నువ్వు లేకపోతే మా అబ్బాయి రోడ్డు మీదే చచ్చిపోయుండేవాడు. ఆ దేవుడే నిన్ను పంపాడేమో! నీ పేరేంటి?’ వణుకుతున్న పెదాలతో అడిగాడా అరబ్బు. ‘మజీద్.’ ‘ఏం చేస్తుంటావు?’ ‘చెప్పులు కుడతాను.’ ‘ఎక్కడుంటావు?’ ‘పనార్లో, నేనో సంచారజాతివాడిని.’ క్షణంపాటు స్థాణువైన అరబ్బు మాటలకోసం వెతుక్కున్నాడు. ‘నీతోపాటు ఎవరెవరున్నారు?’ ‘నా భార్య, ముగ్గురు పిల్లలు.’ ‘వాళ్ళని తీసుకుని మా ఇంటికి వచ్చేయకూడదూ! నువ్వు మా ఇంట్లో తోటపని చేద్దూగానీ. మీ పిల్లల్ని చదివిస్తాను, నీ భార్యని కాస్త తేరుకోనీ!’ మజీద్ తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. ఉన్నట్టుండి అతనికి మిలమిల్లాడే ఆ నక్షత్రం గుర్తుకొచ్చింది. ఎంత కాకతాళీయం! దేవుడు తన కష్టాలని కడతేర్చ నిశ్చయించాడేమో! కన్నీళ్ళతో ముఖం తడిసిపోతుండగా మజీద్ మక్కా వైపుకు తిరిగి మోకరిల్లాడు. ఒంటిగాడివైపోయావు, ఏం చేయగలవు! విచారిస్తున్న అజీజ్‌ని ఓదార్చాడు మజీద్. అసలు నువ్వు నా పట్ల చూపుతున్న మంచితనమే నాకెంత గొప్పగా ఉంటుందో తెలుసా! అల్లా నీకు స్వర్గంలో తప్పకుండా చోటు కల్పిస్తాడులే అజీజ్! చూడు మజీద్, యుద్ధమంటే కేవలం చెడ్డవాళ్ళు మాత్రమే మరణించరు. మంచివాళ్ళు కూడా కొంత బాధ పడాల్సి వస్తుంది. ఇక్కడ నేను చెప్పిందే నిజం కాకపోవచ్చు కానీ,లోకం తీరు అలాగే ఉంది మరి! ఆవేళ రాత్రి ప్రార్థనలయ్యాక రోజంతా జరిగిన సంఘటనలని గుర్తుచేసుకుంటూ మజీద్ ఫరీదాతో తమకిక మంచిరోజులు రానున్నాయని, భగవంతుడు తమ ప్రార్థనలని ఆలకించబోతున్నాడనీ ఎంతో ఆశగా చెప్పాడు. — మూల కథ : ది సైన్ (ఇంగ్లిష్) రచయిత్రి : స్నేహ సుసాన్ షిబు తెలుగు అనువాదం: డాక్టర్ యు విష్ణుప్రియ. ఇవి చదవండి: Inspirational Stories: పృథుచక్రవర్తికి అత్రి మహర్షి అనుగ్రహం! -
Inspirational Stories: పృథుచక్రవర్తికి అత్రి మహర్షి అనుగ్రహం!
బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షికి కర్దమ మహర్షి కుమార్తె అనసూయతో వివాహం జరిగింది. అనసూయ భర్తను సేవించుకుంటూ ఉండేది. అత్రి మహర్షి సంసారయాత్ర కొనసాగిస్తూనే, జపతపాది విధులను యథాప్రకారం కొనసాగించేవాడు. వారి దాంపత్యాన్ని పరీక్షించడానికి ఒకసారి త్రిమూర్తులు వచ్చారు. అత్రి మహర్షి వారికి సాదరంగా స్వాగతం పలికాడు. తన ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించాలని కోరాడు. ఆతిథ్యం స్వీకరించడానికి త్రిమూర్తులు ఒక షరతు విధించారు. తమకు భోజనం వడ్డించే స్త్రీ వివస్త్రగా ఉండాలని కోరారు. అత్రి మహర్షి ఈ సంగతిని అనసూయకు చెప్పాడు. ఆమె సమ్మతించింది. వారు స్నానం చేసి వస్తే, భోజనం వడ్డిస్తానని చెప్పింది. త్రిమూర్తులు స్నానం చేసి వచ్చి, విస్తర్ల ముందు కూర్చున్నారు. అనసూయ వారిపై మంత్రాక్షతలను చల్లింది. వారు ముగ్గురూ చంటిబిడ్డల్లా మారిపోయారు. అప్పుడు అనసూయ వివస్త్రగా మారి వారికి భోజనం వడ్డించింది. తర్వాత ఆమె వస్త్రాలు ధరించి, తిరిగి వారిపై మంత్రాక్షతలు చల్లడంతో వారు తిరిగి యథారూపాల్లోకి మారారు. అనసూయ మహిమకు చకితులైన త్రిమూర్తులు అత్రి మహర్షిని, అనసూయను ఆశీర్వదించారు. వారికి లోకోత్తరులైన ముగ్గురు కొడుకులు పుడతారని వరమిచ్చారు. త్రిమూర్తుల వరప్రభావాన అత్రి మహర్షి, అనసూయ దంపతులకు చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు పుత్రులుగా కలిగారు. బిడ్డలు ముగ్గురు దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగారు. ఒకనాడు అత్రి మహర్షి అనసూయను పిలిచి, ‘నువ్వు కోరుకున్నట్లుగానే నీకు పుత్రులు జన్మించారు. ఇక నేను తపోజీవనాన్ని సాగించాలనుకుంటున్నాను. నువ్వు నాతో వస్తావా లేదా బిడ్డల దగ్గరే ఉంటావా?’ అని అడిగాడు. ‘స్వామీ! మన పుత్రులు ఇంకా పెద్దవాళ్లు కాలేదు. ఎదగని బిడ్డలను వదిలేసి తపోజీవనానికి వెళ్లిపోవడం ధర్మం కాదు. పుత్ర పోషణార్థం పృథు చక్రవర్తి వద్దకు వెళ్లి, ధనం తీసుకురండి. పిల్లలు పెద్దవాళ్లయ్యాక వానప్రస్థానానికి వెళ్లిపోదాం’ అని చెప్పింది. అనసూయ చెప్పిన మాటలు న్యాయంగానే తోచాయి. వెంటనే అత్రి మహర్షి ధనం కోరడానికి పృథు చక్రవర్తి వద్దకు బయలుదేరాడు. అప్పుడు పృథు చక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడు. యాగం పూర్తయ్యాక యాగాశ్వాన్ని విడిచిపెట్టి, దాని సంరక్షణ కోసం పృథు చక్రవర్తి తన కొడుకును పంపుతూ, అతడికి సహాయంగా వెళ్లవలసినదిగా అత్రి మహర్షిని ప్రార్థించాడు. అత్రి మహర్షి అందుకు ‘సరే’నని సమ్మతించి, పృథు చక్రవర్తి కొడుకుతో కలసి యాగాశ్వం వెంట బయలుదేరాడు. పృథు చక్రవర్తి యాగవైభవాన్ని చూసి ఓర్వలేని ఇంద్రుడు పాషాండ వేషంలో వచ్చి, యాగాశ్వాన్ని అపహరించుకుని ఆకాశమార్గాన వెళ్లిపోయాడు. ఇది చూసి పృథు చక్రవర్తి కొడుకు నిశ్చేష్టుడయ్యాడు. యాగాశ్వాన్ని అపహించుకుపోతున్నది సాక్షాత్తు దేవేంద్రుడని గుర్తించడంతో అతడిపై బాణం వేసేందుకు సంశయించాడు. అప్పుడు అత్రి మహర్షి, ‘కుమారా! యజ్ఞయాగాదులకు భంగం కలిగించేవాడు ఎంతటి వాడైనా వాడిని శిక్షించవచ్చు. నిస్సంశయంగా నువ్వు ఇంద్రుడిని ఎదిరించు’ అని బోధించాడు. పృథు చక్రవర్తి కుమారుడు వెంటనే దేవేంద్రుడిపై శరపరంపరను కురిపించాడు. ఆ బాణాల దెబ్బకు తాళలేని ఇంద్రుడు యాగాశ్వాన్ని అక్కడే విడిచిపెట్టి, పలాయనం చిత్తగించాడు. రాకుమారుడు అశ్వాన్ని తీసుకుని అత్రి మహర్షితో కలసి ఇంటికి తిరుగుముఖం పడుతుండగా, ఇంద్రుడు మాయరూపంలో మళ్లీ యాగాశ్వాన్ని అపహరించాడు. పృథుచక్రవర్తి కుమారునికి యాగాశ్వం ఎలా అదృశ్యమైందో అర్థంకాలేదు. కంగారు పడ్డాడు. అత్రి మహర్షి అతడికి ధైర్యం చెప్పాడు. దివ్యదృష్టితో చూశాడు. దేవేంద్రుడే మళ్లీ దుశ్చేష్టకు పాల్పడ్డాడని గ్రహించాడు. ‘నాయనా! ఇంద్రుడే మళ్లీ యాగాశ్వాన్ని తస్కరించుకుపోయాడు’ అని రాకుమారుడితో చెప్పాడు. కోపోద్రిక్తుడైన పృథు కుమారుడు ఇంద్రుడిని తరుముతూ బాణాలు గుప్పించాడు. అతడి ధాటికి తాళలేని ఇంద్రుడు యాగాశ్వాన్ని విడిచిపెట్టి, మళ్లీ పారిపోయాడు. ఈసారి పృథు కుమారుడు యాగాశ్వాన్ని సురక్షితంగా తీసుకువచ్చాడు. అత్రి మహర్షితో కలసి యాగశాలకు చేరుకున్నాడు. తండ్రితో జరిగినదంతా చెప్పాడు. యాగాశ్వ సరంక్షణలో అత్రి మహర్షి చేసిన సాయానికి పృథు చక్రవర్తి వేనోళ్ల పొగిడి, కృతజ్ఞతలు తెలిపాడు. అశ్వమేధాన్ని దిగ్విజయంగా నిర్వర్తించినందుకు పృథు చక్రవర్తిని అత్రి మహర్షి ప్రశంసించాడు. ఇదంతా నచ్చని గౌతమ మహర్షి ‘ఒక మానవమాత్రుడిని ఇంతగా పొగడటం తగదు’ అంటూ వాదులాటకు దిగాడు. ఇంతలో కశ్యప మహర్షి లేచి, ‘ఈ వాదులాట ఇక్కడ పరిష్కారం కాదు గాని, దీనిలోని ధర్మాధర్మాలను సనత్కుమారుడొక్కడే తేల్చగలడు’ అన్నాడు. కశ్యపుని మాట మేరకు అందరూ సనత్కుమారుని వద్దకు చేరుకున్నారు. అత్రి, గౌతములిద్దరూ అతడి వద్ద తమ తమ వాదనలను వినిపించారు. సనత్కుమారుడు అంతా విని, ‘ఇందులో అత్రి మహర్షి దోషమేమీ లేదు. నా విష్ణుః పృథివీపతిః అనే భావన ప్రకారం అత్రి మహర్షి మాటలు ధర్మసమ్మతమే’ అని అన్నాడు. పృథు చక్రవర్తి సంతోషించి, అత్రి మహర్షిని ఘనంగా సత్కరించి, ఆయనకు కోరిన ధనరాశులనిచ్చి, సాదరంగా సాగనంపాడు. — సాంఖ్యాయన ఇవి చదవండి: అమ్మా, నాన్న ఆనంద విహారం -
Parineeti Chopra: దేవుడా..! టెన్షన్లో ఉన్నప్పుడు ఈ హీరోయిన్ ఇలా చేస్తుందా!
సాధారణంగా మన జీవితాల్లో ఎన్నో కుదుపులు, చికాకులు, అడ్డంకులు వస్తూంటాయి. వీటిని కొందరు తేలికగా, మరికొందరు టెన్షన్‌గా తీసుకుంటారు. మరి ఆ టెన్షన్లో చాలామంది కొన్నిరకాల చేష్టలు చేస్తూంటారు. వాటిలో గోళ్లు కొరకడం, వేళ్లు విరవడం, తల పట్టుకోవడం, చికాకు పడుతూ ఉండటంలాంటివి. ఇక ఈ బాలీవుడ్ నటికి మాత్రం ఇలాంటి అలవాటుందని తెలుసా..! టెన్షన్లో ఉన్నప్పుడు.. భయమేసినప్పుడు పరిణీతి చోప్రాకు.. చేతివేళ్ల గోళ్లను కాదు.. ఆ గోళ్ల చుట్టూ ఉన్న స్కిన్‌ని కొరకడం అలవాటట! విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు చాలా భయపడుతుందట! ఆ భయంతో గోళ్ల చుట్టూ ఉన్న స్కిన్‌ని కొరుకుతుందని బాలీవుడ్ సోర్సెస్ ఇన్ఫో. పిజ్జా అంటే పరిణీతికి ప్రాణం. పగలు.. రాత్రి.. అర్ధరాత్రి.. అనే తేడా లేకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పిజ్జా పనిపడుతుందట! ఇవి చదవండి: Priyamani: ప్రియ 'నటీమణి'.. పెర్ఫార్మెన్స్కి పర్యాయపదం ఆమె! -
Priyamani: ప్రియ 'నటీమణి'.. పెర్ఫార్మెన్స్కి పర్యాయపదం ఆమె!
'ప్రస్తుతం కమ్‌బ్యాక్ హీరోయిన్స్ హవా నడుస్తోంది. ఆ లిస్ట్‌లో ప్రియమణి మస్ట్! గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్కి పర్యాయపదం ఆమె! సినీప్రియులు.. వెబ్ వీక్షకులకు సుపరిచితురాలు. కథానాయికగా ఒక వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు వెబ్‌స్క్రీన్ మీదా షైనింగ్ స్టారే! ప్రియమణి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి బ్రీఫ్‌గా..' ప్రియమణి అసలు పేరు ప్రియా వాసుదేవన్ మణి అయ్యర్. అమె తండ్రి వాసుదేవన్ మణి అయ్యర్ .. బిజినెస్‌మేన్, తల్లి లతా మణి అయ్యర్.. జాతీయ స్థాయి మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. చదువుకునే రోజుల్లోనే ప్రియమణి పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ మోడల్‌గా మారింది. అలా ఆమె తమిళ దర్శకుడు భారతీరాజా దృష్టిలో పడింది. చిత్రసీమకు పరిచయం అయింది. ఆమె కెరీర్ తమిళ చిత్రం ‘కంగలాల్ కైదు సెయి’ తో ప్రారంభమైనప్పటికీ, మొదట విడుదలైంది మాత్రం ‘ఎవరే అతగాడు’ అనే తెలుగు సినిమానే. ఆ తర్వాత ‘సత్యం’ సినిమాతో మలయాళంలోనూ అడుగుపెట్టింది. చేసిన సినిమాలన్నీ విజయవంతమవడంతో టైట్ స్కెడ్యూల్స్తో బిజీ అయిపోయింది. ‘యమదొంగ’ , ‘శంభో శివ శంభో’, ‘రక్త చరిత్ర 2’, ‘రగడ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటే ‘క్షేత్రం’, ‘చారులత’ వంటి చిత్రాలతో నటిగా నిరూపించుకుంది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో షారుఖ్ ఖాన్‌తో ఒక పాటలో నటించి బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్‌ని పెళ్లి చేసుకుంది. సినిమాల నుంచి కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. తిరిగి రియాల్టీ షోస్, వెబ్ సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకులకు దగ్గరైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో దేశ వ్యాప్తంగా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచిన సిరీస్ ‘ద ఫ్యామిలీ మేన్’. ఆమె నటించిన వెబ్ మూవీస్ ‘భామా కలాపం’, ‘భామా కలాపం 2’ రెండూ ఆహాలో స్ట్రీమింగ్‌లో ఉన్నాయి. పెళ్లి తరువాత నటనకు దూరంగా ఉండాలన్న ఆలోచన నాకు లేదు. భార్య వంటింటికే పరిమితమనే మనస్తత్వం నా భర్తకు లేదు. నన్ను చాలా సపోర్ట్ చేస్తారాయన! – ప్రియమణి. ఇవి చదవండి: Sharmila Yadav: డ్రోన్ దీదీ -
విచిత్రమైన మాటలు, దుస్తులు, ప్రవర్తన.. A సినిమాలో ఉపేంద్ర గుర్తున్నాడా?
అంకిత్ ఒక ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్. చిన్న అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఎవరితోనూ మాట్లాడడు, కలవడు. చిన్నప్పటి నుంచీ పదిమందిలోకి వెళ్లాలంటే విపరీతమైన ఆందోళన, భయం. ఎలాగోలా పదోతరగతి పూర్తయిందనిపించాడు. ఆ తర్వాత ఇంట్లోనే కూర్చుని గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ కస్టమర్లతో మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాడు. బయటకు వెళ్తే తన గురించి తప్పుగా అనుకుంటారేమో, ఎగతాళి చేస్తారేమోనని భయపడుతుంటాడు. తనపై ఇతరులు కుట్రలు చేస్తున్నారని నమ్ముతుంటాడు. ఇటీవల.. తాను ఎదుటివారి మనసులోని మాటలను ఎంతదూరం నుంచైనా వినగలనని, తాను ఆత్మలతో మాట్లాడగలనని చెప్పడం మొదలుపెట్టాడు. ఇలాగే వదిలేస్తే ఏమైపోతాడోననే భయంతో సన్నిహితుల అతన్ని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. అంకిత్ డ్రెస్.. పలు రంగులతో ముక్కలు ముక్కలుగా విచిత్రంగా ఉంది. ప్రవర్తన కూడా అసాధారణంగా ఉంది. మాట్లాడేటప్పుడు ఎలాంటి భావోద్వేగాలు ప్రదర్శించలేదు. మాటల్లో క్లారిటీ లేదు. చెప్పేది పూర్తి చేయకుండానే మరో అంశంలోకి వెళ్లి పోతున్నాడు. సైకోడయాగ్నసిస్ అనంతరం అతను స్కిజోటైపల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణైంది. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తులను అందరూ విచిత్ర వ్యక్తులని పిలుస్తుంటారు. ఇది సాధారణంగా టీనేజ్‌లో బయటపడుతుంది. దీర్ఘకాలిక సైకోథెరపీ అవసరం.. పర్సనాలిటీ డిజార్డర్స్కు మందులు లేవు. దీర్ఘకాలిక సైకోథెరపీ అవసరమవుతుంది. దాంతోపాటు డిజార్డర్ ఉన్నవారు తమ జీవనశైలిలో, కోపింగ్ స్ట్రాటజీస్లో మార్పులు చేసుకోవడం ద్వారా కొంత ప్రయోజనం పొందవచ్చు. ► స్కిజోటైపల్ వ్యక్తిత్వ లక్షణాలు, ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తన, వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడం మొదటి అడుగు. ► పరిచయస్తులతో కొద్దికొద్దిగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు చూపు కలిపేందుకు, పదిమందిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాలి ► పెద్ద లక్ష్యాలను చిన్నవిగా, సాధించగలిగేవిగా విభజించుకోవాలి ► ధ్యానం, యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను దినచర్యలో భాగం చేసుకోవాలి ► ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే స్నేహితులు, కుటుంబ సభ్యులతో అనుభవాలను పంచుకోవాలి ► క్రమం తప్పకుండా వ్యాయామం, పోషకాహారం, తగినంత నిద్రతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలి ► మానసిక ఆరోగ్యం మీద శారీరక ఆరోగ్యం సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది ► ఆల్కహాల్ లేదా మాదకద్రవ్యాల వినియోగాన్ని వెంటనే ఆపేయాలి. అవి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి. చికిత్స ప్రభావానికి అంతరాయం కలిగిస్తాయి ► ఇవన్నీ ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ పూర్తి అంచనా, పర్సనల్ ట్రీట్మెంట్ ప్లాన్ కోసం సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి ► వక్రీకరించిన ఆలోచనా విధానాలను సవరించడం, ఆందోళనను తగ్గించడం, సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచడంలో CBT ప్రభావవంతంగా ఉంటుంది ► SPDకి సంబంధించిన ఇతర లక్షణాలను తగ్గించడానికి అవసరమైతే సైకియాట్రిస్ట్ సూచించిన మందులను వాడాల్సి ఉంటుంది. భావోద్వేగాలు కనిపించవు.. PD ఉన్నవారు బాల్యంలో ఎవరితోనూ కలవకపోవడం, స్కూల్లో అండర్ పెర్పార్మెన్స్ ఉండవచ్చు. దీన్ని ఆసరాగా చేసుకొని ఇతరులు బెదిరించవచ్చు, ఆటపట్టించవచ్చు. టీనేజ్‌లో ఒంటరితనం, సామాజిక ఆందోళన అధికస్థాయిలో ఉంటుంది. ఈ కింది లక్షణాల్లో ఐదు, అంతకంటే ఎక్కువ లక్షణాలు ఉంటాయి. ► ఒంటరిగా ఉండటం, కుటుంబ సభ్యులు తప్ప సన్నిహితులు లేకపోవడం.. ► అసలు ఎమోషన్స్ లేకపోవడం లేదా పరిమిత, అనుచితమైన భావోద్వేగ ప్రతిస్పందనలుండటం.. ► పదిమందిలోకి వెళ్లాలంటే విపరీతమైన ఆందోళన.. ► ప్రమాదంకాని.. లేని పరిస్థితులను, సందర్భాలను కూడా తప్పుగా అర్థం చేసుకోవడం.. ► విచిత్రమైన, అసాధారణమైన ఆలోచనలు, నమ్మకాలు లేదా ప్రవర్తన.. ► ఇతరుల విధేయత గురించి నిరంతరం సందేహాలు, అనుమానాస్పద లేదా మతిస్థిమితం లేని ఆలోచనలు.. ► టెలిపతి వంటి ప్రత్యేక శక్తులపై నమ్మకం.. ► ఎదురుగా లేని వ్యక్తులు కూడా ఉన్నట్లుగా భ్రమలు.. ► చిత్రవిచిత్రంగా దుస్తులు ధరించడం, చిందరవందరగా కనిపించడం.. ► అస్పష్టంగా, అసాధారణంగా మాట్లాడటం, విచిత్రమైన ప్రసంగశైలి.. స్కిజోఫ్రెనియా అని పొరపాటు వ్యక్తిత్వం మనల్ని ప్రత్యేకంగా నిలిపే ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తనల కలయిక. మెదడు పనితీరు, జన్యుశాస్త్రం, పర్యావరణ ప్రభావాలు, చూసి నేర్చుకున్న ప్రవర్తనల వల్ల వ్యక్తిత్వంలో లోపాలు ఏర్పడవచ్చు. PD ఉన్నవారిని స్కిజోఫ్రేనియా అని అనుకునే ప్రమాదం ఉంది. కానీ PDలో భ్రమలు లేదా భ్రాంతులతో సైకోటిక్ ఎపిసోడ్లు క్లుప్తంగా ఉంటాయి. భ్రమలు, వాస్తవానికి మధ్య వ్యత్యాసం తెలుసుకోగలరు. స్కిజో ఫ్రేనియా లాంటి మానసిక రుగ్మత ఉన్న బంధువు ఉంటే PD వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తుల్లో డిప్రెషన్, యాంగ్జయిటీ, ఆత్మహత్య ఆలోచనలు, పని, పాఠశాల, సంబంధబాంధవ్యాలకు సంబంధించిన సమస్యలు, సామాజిక సమస్యలు ఉంటాయి. సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
Smart Lock: అరచేతిని చూపిస్తేనే తెరుచుకుంటుంది
మామూలు తాళాలను ఆరితేరిన దొంగలు ఇట్టే తెరిచి, ఇల్లంతా దోచుకునే ప్రమాదం ఉంది. ఇది స్మార్ట్‌లాక్. ఎంత ఆరితేరిన దొంగలైనా దీనిని తెరవలేరు. దీనిని తెరవడానికి తాళం చెవితో పనిలేదు. దీనికి తెలిసిన వారి అరచేతిని చూపిస్తేనే తెరుచుకుంటుంది. ఇందులో యాభై వరకు అరచేతి ముద్రలను నమోదు చేసుకునే వీలుంది. సాధారణంగా అన్ని నమోదు చేసుకోనవసరం ఉండదు గాని, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరి అరచేతి ముద్రలను నమోదు చేసుకుంటే, ఇది భేషుగ్గా ఉపయోగపడుతుంది. అమెరికన్ కంపెనీ ఫిలిప్స్ కార్పొరేషన్ దీనిని రూపొందించింది. దీనిని తెరవాలంటే దీనికి అమర్చి ఉన్న స్కానర్ వద్ద అరచేతిని చూపిస్తే చాలు. దీని ధర 359.99 డాలర్లు (రూ.29,925) మాత్రమే! -
రైల్విలాస్: అప్పట్లో రైల్వేస్టేషన్.. ఇప్పుడు హోటల్
ప్రపంచంలోని పురాతనమైన రైల్వేస్టేషన్లలో ఇదొకటి. ఒకప్పుడు రైళ్ల రాకపోకలతో కళకళలాడేది. ఇక్కడ రైల్వే సేవలు నిలిచిపోవడంతో కొన్నాళ్లకు ఈ రైల్వేస్టేషన్నే హోటల్‌గా మార్చేశారు. ఇది ఇంగ్లండ్‌లోని పెట్వర్త్లో ఉంది. మిడ్ ససెక్స్ రైల్వే కంపెనీ 1859లో ఇక్కడ రైల్వేస్టేషన్‌ను నిర్మించింది. అప్పట్లో ఇక్కడ రైల్వే సిబ్బంది, ప్రయాణికుల వసతి కోసం స్టేషన్‌కు ఆనుకునే ‘రైల్వే ఇన్’ అనే హోటల్ కూడా వెలిసింది. దాదాపు శతాబ్దానికి పైగా సేవలందించిన పెట్వర్త్ రైల్వేస్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలను 1966లో నిలిపి వేశారు. తర్వాత దశాబ్దాల తరబడి ఇది అతీ గతీ లేకుండా పడి ఉంది. తర్వాత రైల్వేస్టేషన్‌కు మరమ్మతులు జరిపి, 1995లో తొలిసారిగా స్టేషన్ భవనంలో రెండు గదులను హోటల్ గదుల్లా మార్చి, అతిథులకు బస కల్పించడం ప్రారంభించారు. తర్వాత ఇక్కడ నిలిచిపోయిన పాత రైళ్ల బోగీలను కూడా హోటల్ గదులుగా మార్చి, స్టేషన్ భవనంలో కూడా మరిన్ని గదులను ఏర్పాటు చేసి 1998 నుంచి దీన్ని ‘ద ఓల్డ్ రైల్వేస్టేషన్’ పేరుతో పూర్తిస్థాయి హోటల్‌గా మార్చారు. -
మందుపాతరలను పసిగడుతుంది
చూడటానికి పిల్లలు ఆడుకునే కారుబొమ్మలా కనిపిస్తుంది గాని, ఇది మందుపాతరలను పసిగడుతుంది. కొరియన్ విద్యార్థులు సుబిన్ కిమ్, జిహూన్ పార్క్ ‘వార్డెన్’ పేరుతో ఈ మైన్ డిటెక్టింగ్ రోబోకు రూపకల్పన చేశారు. ఇది ఎగుడుదిగుడు రహదారులు, బాగా ఎత్తుపల్లాలు ఉండే కొండ దారుల్లో కూడా నిర్దేశించిన మార్గంలో సునాయాసంగా ముందుకు సాగిపోగలదు. దీని అడుగుభాగంలో మోవింగ్ అటాచ్‌మెంట్‌ను అమర్చడంతో దారిలో అడ్డొచ్చే గడ్డి, కలుపు మొక్కలను పీకిపడేస్తూ చకచక ముందుకు కదిలిపోగలదు. పగటి వేళలోనే కాకుండా, రాత్రి కటికచీకట్లోనూ ఇది పనిచేయగలదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ రోబో మైన్డిటెక్టర్ మందుపాతరలను అమర్చిన ప్రదేశాలను అత్యంత కచ్చితంగా గుర్తించి, వెనువెంటనే ఆ సమాచారాన్ని యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తుంది. కొరియన్ విద్యార్థులు ప్రస్తుతం దీనిని ప్రయోగాత్మకంగా రూపొందించారు. మరింత మెరుగుపరచిన తర్వాత దీనిని రక్షణ అవసరాల కోసం అందుబాటులోకి తేనున్నారు.