ప్రెగ్నెన్సీలో డౌన్‌ సిండ్రోమ్‌ పాజిటివ్‌ అంటే..? ప్రమాదమా..! | Sakshi
Sakshi News home page

ప్రెగ్నెన్సీలో డౌన్‌ సిండ్రోమ్‌ పాజిటివ్‌ అంటే..? ప్రమాదమా..!

Published Sun, Apr 14 2024 12:57 PM

The Test That Can Eliminate The Risk Of Down Syndrome In Pregnancy - Sakshi

నాకు 40 ఏళ్లు. మూడవ నెల ప్రెగ్నెన్సీలో డౌన్‌ సిండ్రోమ్‌ పాజిటివేమో అనే డౌట్‌ చెప్పారు. చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఉమ్మనీరు టెస్ట్‌ చేస్తామన్నారు. దీనివల్ల అన్నీ కనిపెట్టొచ్చా? బేబీ హెల్దీగా ఉన్నట్టు ఎలా గుర్తించడం?
– ఎన్‌. వైశాలి, షోలాపూర్‌

ఆమ్నియోసెంటీసిస్‌ (Amniocentesis) ద్వారా ఉమ్మనీరును టెస్ట్‌ చేసి తెలుసుకోవచ్చు. తగు జాగ్రత్తలతో ఫీటల్‌ మెడిసిన్‌ కన్సల్టెంట్‌.. పొట్టలోపల బేబీకి టెస్ట్‌ చేసే ప్రక్రియ ఇది. ఈ వైద్య పరీక్షను ముఖ్యంగా క్రోమోజోమల్‌ సమస్యలేమైనా ఉన్నాయేమో అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి సూచిస్తారు. జన్యు వ్యాధుల విషయంలోనూ ఈ టెస్ట్‌ను చేస్తారు.

40 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్‌ కావడం, మీ బ్లడ్‌ టెస్ట్‌లలో డౌట్‌ రావడం వల్ల  క్రోమోజోమల్‌ అబ్‌నార్మాలిటీస్‌ కనిపెట్టడానికి ఈ టెస్ట్‌ని సజెస్ట్‌ చేసి ఉంటారు. దీన్ని చాలా అనుభవం ఉన్న స్పెషలిస్ట్‌లే చేస్తారు. మీరు మామూలుగా ఫుడ్‌ తినే ఈ టెస్ట్‌కి వెళ్లొచ్చు. ఔట్‌ పేషంట్‌ డిపార్ట్‌మెంట్‌లోనే చేస్తారు. అల్ట్రసౌండ్‌ చేసి.. బేబీ, ప్లాసెంటా, పొజిషన్‌ను చెక్‌ చేసి వివరించి కన్‌సెంట్‌ తీసుకుని చేస్తారు.

టెస్ట్‌ రిజల్ట్స్‌ 5 నుంచి 15 రోజుల్లో వస్తాయి. వచ్చే రిజల్ట్స్‌ని బట్టి తదనంతర పరిణామాలను మీతో డిస్కస్‌ చేస్తారు. ఈ టెస్ట్‌లో అన్నిరకాల అబ్‌నార్మిలిటీస్‌ని కనిపెట్టలేము. దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి. సెరిబ్రల్‌ పాల్సీ, ఆటిజం, స్పీనల్‌ బిఫడా, ఫిజికల్‌ చేంజెస్‌ను ఇందులో కనిపెట్టలేం. అలాంటివాటికి కొన్నిసార్లు అడ్వాన్స్‌డ్‌ స్కాన్‌ అవసరం అవుతుంది. ఈ ప్రొసీజర్‌లో 0–5 శాతం గర్భస్రావం అయ్యే రిస్క్, ఇన్‌ఫెక్షన్‌ రిస్క్‌ ఉంటుంది.

యాంటీబయాటిక్స్‌ ఇస్తారు. ప్రొసీజర్‌ తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకుని ఇంటికి వెళ్లొచ్చు. మైల్డ్‌ క్రాంప్స్‌ ఉంటాయి. పారాసిటమాల్‌ లాంటివి ఇస్తారు. పెయిన్‌ కిల్లర్స్‌ వాడకూడదు. ప్రొసీజర్‌ తర్వాత బాగా కడుపు నొప్పి వచ్చినా, బ్లీడింగ్‌ అవుతున్నా.. వాటర్‌ లీక్‌ అయినా ఆసుపత్రిలో అడ్మిట్‌ అవ్వాలి. ఇంటికి వెళ్లాక ఇలాంటి లక్షణాలు కనపడినా.. చలి, జ్వరం ఉన్నా వెంటనే ఎమర్జెన్సీ వార్డ్‌కి వెళ్లాలి. రిజల్ట్స్‌ కోసం వెయిట్‌ చేస్తున్నప్పుడు స్ట్రెస్‌ ఫీలవకుండా.. పౌష్టికాహారం తీసుకోవాలి. 

— డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్‌ & ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌

Advertisement
Advertisement