Down syndrome
-
డౌన్ సిండ్రోమ్‌తో లాయర్‌గా చరిత్ర సృష్టించింది! ఎవరీమె..?
అన్ని సక్రమంగా ఉన్నా.. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక తిప్పలు పడుతుంటారు. అందుకు ఏవేవో సాకులు కూడా చెబుతుంటారు. కానొ కొందరూ భయానక సవాళ్లును దాటుకుంటూ అసాధ్యం అనే దాన్ని కూడా సాధించి చూపిస్తారు. అలాంటి కోవకు చెందిదే అనా విక్టోరియా. మెక్సికోలోని జకాటెకాస్‌కు చెందిన అనా విక్టోరియా ఎస్పినో డి శాంటియోగా డౌన్ సిండ్రోమ్‌తో న్యాయ పట్టా పొందిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించింది. 25 ఏళ్ల అనా జూలై 2024లో యూనివర్సిడాడ్ అటోనోమా డి జకాటెకస్ నుంచి పట్టభద్రురాలైంది. ఆమె విద్యాభ్యాసంలో అనేక సవాళ్ల ఎదుర్కొన్నప్పటికీ..ఒక ప్రొఫెసర్ సాయంతో తన కలను సాకారం చేస్తుకుంది. ఆయన మార్గనిర్దేశంలో డౌన్ సిండ్రోమ్‌తో న్యాయ విద్యలో డిగ్రీని సాధించిన అరుదైన వ్యక్తిగా నిలిచింది. జనవరి 30, 1999న జన్మించిన అనా ఓచోవా, ఎస్పినో జపాటాల కుమార్తె. ఆమె తన విద్యను ఆన్లైన్లోనే పూర్తి చేసింది. తరువాత న్యాయశాస్త్రం అభ్యసించేందుకు యూనివర్సిడాడ్ ఆటోనోమా డి జకాటెకాస్లో చేరింది. అయితే అక్కడ నిర్థిష్ట అవసరాలున్న తనలాంటి వ్యక్తులకు పాఠాలు భోధించే విధానం లేక చాలా ఇబ్బందులు పడింది. అయినప్పటికీ ఆమె దృఢ సంకల్పమే సాయం చేసే మంచి ప్రొఫెసర్ చెంతకు చేరేలా చేసింది. ఆయన అండదండలతో న్యాయపరమైన అధ్యయనంలో ఎదురయ్యే సవాళ్లన్నింటిని అధిగమించగలిగింది. అనా న్యాయవాదిగా అవ్వడానికి ముందు తనలాంటి వికలాంగుల హక్కుల కోసం వాదించే శాసనఫోరమ్లలో పనిచేసేది. ఇది తనకు న్యాయరంగ పట్ల అవగాహనను ఇవ్వడమే గాక భవిష్యత్తు అవకాశాలకు మార్గం సుగమం చేసింది. అలాగే అనా లాయర్‌గా వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని, సమానత్వం కోసం వాదించాలని చూస్తోంది. ఇంతటి స్థితిలో కూడా అంకితభావంతో అనితరసాధ్యమైన తన కలను సాకారం చేసుకుని అందిరిచేత ప్రశంసలందుకోవడమే గాక విదేశాల నుంచి ఉద్యోగా ఆఫర్లు కూడా వచ్చాయి. ఇక అనాకి పెయింటింగ్ కళలో కూడా మంచి ప్రావిణ్యం ఉంది. 2014 నుంచి అనే పెయింటింగ్ ఎగ్జిబిషన్లను నిర్వహించింది. తన పెయింటింగ్‌లను 'డెస్టే మి సీ'లో పేరుతో ప్రదర్శించింది.(చదవండి: హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!) -
ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ పాజిటివ్ అంటే..? ప్రమాదమా..!
నాకు 40 ఏళ్లు. మూడవ నెల ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ పాజిటివేమో అనే డౌట్ చెప్పారు. చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఉమ్మనీరు టెస్ట్ చేస్తామన్నారు. దీనివల్ల అన్నీ కనిపెట్టొచ్చా? బేబీ హెల్దీగా ఉన్నట్టు ఎలా గుర్తించడం? – ఎన్. వైశాలి, షోలాపూర్ ఆమ్నియోసెంటీసిస్ (Amniocentesis) ద్వారా ఉమ్మనీరును టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. తగు జాగ్రత్తలతో ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్.. పొట్టలోపల బేబీకి టెస్ట్ చేసే ప్రక్రియ ఇది. ఈ వైద్య పరీక్షను ముఖ్యంగా క్రోమోజోమల్ సమస్యలేమైనా ఉన్నాయేమో అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి సూచిస్తారు. జన్యు వ్యాధుల విషయంలోనూ ఈ టెస్ట్‌ను చేస్తారు. 40 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ కావడం, మీ బ్లడ్ టెస్ట్‌లలో డౌట్ రావడం వల్ల క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కనిపెట్టడానికి ఈ టెస్ట్‌ని సజెస్ట్ చేసి ఉంటారు. దీన్ని చాలా అనుభవం ఉన్న స్పెషలిస్ట్‌లే చేస్తారు. మీరు మామూలుగా ఫుడ్ తినే ఈ టెస్ట్‌కి వెళ్లొచ్చు. ఔట్ పేషంట్ డిపార్ట్మెంట్లోనే చేస్తారు. అల్ట్రసౌండ్ చేసి.. బేబీ, ప్లాసెంటా, పొజిషన్‌ను చెక్ చేసి వివరించి కన్సెంట్ తీసుకుని చేస్తారు. టెస్ట్ రిజల్ట్స్ 5 నుంచి 15 రోజుల్లో వస్తాయి. వచ్చే రిజల్ట్స్‌ని బట్టి తదనంతర పరిణామాలను మీతో డిస్కస్ చేస్తారు. ఈ టెస్ట్‌లో అన్నిరకాల అబ్నార్మిలిటీస్ని కనిపెట్టలేము. దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి. సెరిబ్రల్ పాల్సీ, ఆటిజం, స్పీనల్ బిఫడా, ఫిజికల్ చేంజెస్‌ను ఇందులో కనిపెట్టలేం. అలాంటివాటికి కొన్నిసార్లు అడ్వాన్స్డ్ స్కాన్ అవసరం అవుతుంది. ఈ ప్రొసీజర్‌లో 0–5 శాతం గర్భస్రావం అయ్యే రిస్క్, ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. యాంటీబయాటిక్స్ ఇస్తారు. ప్రొసీజర్ తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకుని ఇంటికి వెళ్లొచ్చు. మైల్డ్ క్రాంప్స్ ఉంటాయి. పారాసిటమాల్ లాంటివి ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ప్రొసీజర్ తర్వాత బాగా కడుపు నొప్పి వచ్చినా, బ్లీడింగ్ అవుతున్నా.. వాటర్ లీక్ అయినా ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాలి. ఇంటికి వెళ్లాక ఇలాంటి లక్షణాలు కనపడినా.. చలి, జ్వరం ఉన్నా వెంటనే ఎమర్జెన్సీ వార్డ్‌కి వెళ్లాలి. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ ఫీలవకుండా.. పౌష్టికాహారం తీసుకోవాలి. — డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
డౌన్ సిండ్రోమ్‌తో డౌన్ అయిపోలే..! ఏకంగా మోడల్‌గా..!
ఏదైనా రుగ్మతతో పోరాడుతున్న లేదా వైకల్యంతో బాధపడుతున్న అక్కడితో ఆగిపోకూడదని ప్రూవ్ చేసిందో ఈ యువతి. రుగ్మత గమ్యానికి అడ్డంకి కాదు. అదే నిన్ను పదిమంది ముందు విలక్షణంగా నిలబడేలా మలుచుకునే ఓ గొప్ప అవకాశం అంటోంది ఈమె. అంత పెద్ద సమస్యను ఫేస్ చేస్తూ కూడా..నలుగురు శభాష్ అనేలా తలెత్తుకుని జీవిస్తోంది. తనలాంటి వారెందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆమె పేరే జైనికా జగసియా. ఆమె డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతోంది. డౌన్‌సిండ్రోమ్ అంటే తెలిసిందే. మానసికలోపంతో బాధపడే చిన్నారులని చెప్పొచ్చు. శారీరక పెరుగుదల ఉన్న మానసిక పెరుగుదల ఉండదు. పైగా వారు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి చిన్నారుల ఆయుర్ధాయం కూడా తక్కువే. అంతటి పెను సమస్యతో బాధపడుతున్నప్పటికీ మోడల్, అడ్వకేట్, లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్గా దూసుకుపోతోంది. ఇంకోవైపు పాకశాస్త్ర నైపుణ్యంతో హోమ్బ్రెడ్ బై అనే బ్రాండ్‌తో ప్రముఖ బేకర్‌గా గుర్తింపుతెచ్చుకుంది. అంతేగాదు జైనికాకి ఫిట్నెస్ ఔత్సాహికురాలిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ఆరోగ్యం పట్ల ఎలా శ్రద్ధ వహించాలో చక్కగా చెబుతుంది. అక్కడితో ఆమె విజయ ప్రస్థానం ఆగలేదు..గూచీ వంటి ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహరించి డౌన్ సిండ్రోమ్‌తో ఉన్నవాళ్లు అన్ని రంగాల్లో చురుగ్గా రాణించగలరని చూపించాలని ప్రగాఢంగా కోరుకుంటోంది. ఇక ఆమె ఇలా అన్ని విభ్ని రంగాల్లో రాణించగలగడానికి ప్రధాన కారణం అమ్మనాన్నల సహకారం తోపాటు తన సమస్యను అంగీకరించడం అంటోంది జైనికా. "మన బాధ ఏదైనా అంగీకరించాలి. యస్ నా సమస్య ఇది కాబట్టి నేనే చేయగలిగేదేమిటీ..? నా ఐడెంటీటీని ఎలా సంపాదించుకోవాలి అనే దానిపైకి ఫోకస్‌ని పోనివ్వాలి. అంతే తప్ప! మానసిక వైకల్యురాలిని కాబట్టి చేయలేను అనే ఆలోచన రాకూడదు. ఎలా చేస్తే బెటర్‌గా అవ్వగలను అనేది ఆలోచించాలే తప్ప ఆగిపోకూడు. అది పిడుగులాంటి సమస్య అయినా పక్కకు నెట్టి మరీ సాగిపోవాలి. చిన్నప్పటి నుంచి భాష దగ్గర నుంచి చదవడం, రాయడం అన్ని నాతోటి వాళ్ల కన్న వెనుక ఉండేదాన్ని. ప్రతీది లాస్ట్.. లాస్ట్.. ఆ లాస్ట్ని ఫస్ట్ ఎలా చేయగలననే ఆలోచనే అన్నింటిని అలవోకగా నేర్చుకునే శక్తి ఇచ్చింది. లాస్ట్.. లాస్ట్ అంటూ వేస్ట్‌గా కూర్చొండిపోలే. లాస్ట్ని ఫస్ట్‌గా మార్చే ప్రయత్నం చేశా అంతే!. అలాగే బేకింగ్ వంటకాలంటే మొదట్లో కాస్త అయిష్టత ఉండేది. అయితే నా సోదరి ఇవి తయారు చేయడంతో నాకు ఊహించనివిధంగా దానిపై అభిరుచి ఏర్పడింది. తెలియకుండానే ఆ కళలో ప్రావీణ్యం సాధించాను. వాస్తవానికి హెల్తీగా ఉన్నవాళ్లకైనా సరే..ముందగా ఏదైనా పని మొదలు పెట్టిన వెంటనే కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక నా బోటి వాళ్లకు మరింత సమస్యాత్మకంగా ఉంటుంది. ఇక్కడ ఇద్దరికీ సమస్య..సమస్యే అనే విషయం గ్రహించాలి. కాకపోతే.. ఇక్కడ నేను తొందరగా నేర్చుకోలేనన్న భయం నన్ను మరింత శ్రద్ధ పెట్టి నేర్చుకునేలా చేస్తోందని చెబుతోంది జైనికా. అంతేగాదు సవాలు ఎవ్వరికైనా సవాలే కాకపోతే ఇక్కడ నాకు రుగ్మత లేదా వైకల్యం ఉందన్న ఆలోచన ఆ సవాలును అత్యంత కఠినమైనదిగా మారుస్తుంది. జస్ట్ ఇలా ఉండి కూడా సాధించి గ్రేట్‌గా ఉండాలన్న ఆలోచన ఉంటే మాత్రం ఎంతటి కఠిన సవాలునైనా చేధించొచ్చు అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది." జైనికా. నిజానికి సమాజం అలాంటి పిల్లలను చూసి జాలిపడుతుంది. కానీ ఆ అవసరం లేదు, నేర్చుకోవడానికి టైం తీసుకుంటామే తప్ప మాలాంటి వాళ్లు కూడా సాధించగలరు అని చాటి చెప్పింది జైనికా. (చదవండి: భారత అత్యున్నత న్యాయమూర్తి ఫాలో అయ్యే డైట్ ఇదే!) -
ఎన్టీ స్కాన్ అంటే ఏంటీ? దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది?
నాకిప్పుడు 3వ నెల. రొటీన్ స్కాన్‌లో బేబీ NT థికనెస్ 3.5 సెం.మీ ఉంది అని డాక్టర్ చెప్పారు. అది మంచిది కాదన్నారు. స్కాన్ మెషిన్ తప్పేమో అని నాకు అనిపిస్తోంది. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది? మళ్లీ ఎప్పుడు స్కాన్ చేయించుకోవాలి? – డి. అమరజ, బళ్లారి NT(న్యూకల్ ట్రాన్స్లుసెన్సీ) స్కాన్ అనేది టైమ్ బౌండ్‌తో ఉంటుంది. అంటే 11–13 వారాల ప్రెగ్నెన్సీ మధ్యలోనే చేయించుకోవాలి. సమయం తక్కువ కాబట్టి సెకండ్ ఒపీనియన్‌గా వెంటనే వేరే చోట అంటే ఫీటల్ మెడిసిన్ యూనిట్లో పనిచేసే డాక్టర్‌తో చేయించండి. పుట్టబోయే బిడ్డకు మెడ వెనుక చర్మం కింద నార్మల్‌గానే కొంచెం ఫ్లూయిడ్ ఉంటుంది. సాధారణంగా దీనిని మూడవ నెల ప్రెగ్నెన్సీలో NT స్కాన్‌లో చెక్ చేస్తారు. అది 3.5 సెం.మీలోపు ఉంటే ఏ సమస్యా ఉండదు. NT థిక్నెస్ బేబీది 3.5 సెం.మీ కంటే ఎక్కువ ఉంటే ‘Icreased NT’ అంటారు. ఈ కేసులో గర్భస్రావం అయ్యే చాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. బిడ్డ గుండెకు సంబంధించి ఏదైనా అబ్నార్మాలిటీ ఉండొచ్చు. లేదా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అంటే డౌన్స్ సిండ్రోమ్(Down Syndrome) లాంటివి ఉండొచ్చు. కానీ ఒక్క NT థిక్నెస్ పైనే డయాగ్నసిస్ చేయరు. మీ బ్లడ్ టెస్ట్ కూడా చెక్ చేసి రెండిటినీ కలిపి చేసే టెస్ట్‌ని కంబైడ్ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అంటారు. ఆ టెస్ట్ చేయించుకోండి. ఇందులో ‘లో రిస్క్’ అని వస్తే ప్రమాదం తక్కువ అని అర్థం. ‘హై రిస్క్’ అని వస్తే ఫీటస్ మెడిసిన్ కన్సల్టెంట్‌ని కలిస్తే వాళ్లు కౌన్సెలింగ్ చేస్తారు. ఈ రెండు పరీక్షల ఫలితాలు సాధారణంగా వారంలో వచ్చేస్తాయి. ఈ పరీక్షల రిపోర్ట్‌ని బట్టే తర్వాత స్కాన్ ఉంటుంది. హై రిస్క్ కేసెస్‌లో నాల్గవ నెలలో ఉమ్మనీరు చెక్ చెస్తారు. దీనిని Amniocentesis అంటారు. ఈ టెస్ట్ ఫైనల్ కన్ఫర్మేషన్ ఏదైనా మేజర్‌గా క్రోమోజోమ్ ప్రాబ్లమ్‌కి సంబంధించి ఉంటుంది. ఈ రిపోర్ట్ రిజల్ట్‌ని బట్టే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా వద్దా అనేది నిర్ధారిస్తారు. చాలాసార్లు NT ఒక్కటి 3.5 సెం.మీ కంటే ఎక్కువ ఉన్నా బయాకెమిస్ట్రీ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్‌ని కూడా కలిపి రిస్క్ అసెస్మెంట్ చేస్తారు. లో రిస్క్ వస్తే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయవచ్చు.. ఏ ప్రాబ్లం లేదని అర్థం. అప్పుడు 5, 7, 9వ నెలల్లో స్కాన్స్ ఉంటాయి. కానీ కొంతమంది గర్భిణీల్లో అంటే మేనరికం పెళ్లిళ్లు అయిన కుటుంబంలో జెనెటిక్ లేదా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా.. డయాబెటిస్.. ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నా.. ఫీటస్ మెడిసిన్ కౌన్సెలర్‌ని కలిస్తే ఈ పరీక్షలన్నీ ప్రెగ్నెన్సీకి ముందు లేదా మూడవ నెల మొదట్లోనే చేసి కౌన్సెలింగ్ ఇస్తారు. (చదవండి: ఎగ్స్‌ని ప్రిజర్వ్ చేసుకుని ఐదారేళ్ల తర్వాత పిల్లల్ని కనొచ్చా?) -
రోల్ మోడల్: తొలి ఇండియన్ అమ్మాయిగా చరిత్ర సృష్టించనున్న రిజా
వయసుకు తగ్గట్టుగా మానసికంగా, శారీరకంగా పరిపూర్ణంగా ఎదగని పిల్లల...మాట, నడక, నవ్వు సాధారణ పిల్లలకంటే విభిన్నంగా ఉంటుంది. కొంతమంది అయితే ఒకటీ రెండు మాటలు కూడా స్పష్టంగా పలకడం కూడా కష్టమే. అటువంటిది డౌన్‌సిండ్రోమ్‌తో బాధపడుతోన్న రిజా రేజి ఏకంగా ప్రీమియర్ ఫ్యాషన్ షోకు ఎంపికైంది. గ్లోబల్ ఈవెంట్లో ర్యాంప్ వాక్ చేయనున్న తొలి ఇండియన్ అమ్మాయిగా రిజా చరిత్ర సృష్టించనుంది. కేరళకు చెందిన వహీద్, అనితారేజి దంపతులకు ఇద్దరు కూతుర్లు రియ, రిజాలు. 2014 నుంచి బెంగళూరులో స్థిరపడిన రేజి దంపతులు క్రియేటివ్ ఆర్ట్స్ వృత్తినిపుణులు. దివ్యాంగ పిల్లల సంక్షేమమే లక్ష్యంగా ‘బ్యూటిపుల్ టుగెదర్’ పేరిట అనితా ఓ ఇనిస్టిట్యూట్‌ను కూడా నడుపుతోంది.పెద్ద కూతురు రియా ముంబైలోని అడ్వరై్టజింగ్ కంపెనీలో అసోసియేట్ క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. చిన్న కూతురైన 23 ఏళ్ల రిజా చిన్నప్పటి నుంచి డౌన్ సిండ్రోమ్ కారణంగా అక్కలా ఎదగలేదు. అయినప్పటికీ మిగతా డౌన్ సిండ్రోమ్ పిల్లలందరిలోకి చురుకుగా ఉండేది. ఇది గమనించిన ఆమె తల్లిదండ్రులు రిజాను డ్యాన్స్, యాక్టింగ్‌లలో శిక్షణ తీసుకునేందుకు ప్రోత్సహించి, ‘క్రిసాలిస్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్’లో చేర్పించారు. దీంతో రిజా మనస్సులోని భావాలను వ్యక్తం చేయడానికి మంచి సాధనం దొరికింది. తన డ్యాన్స్ భంగిమలు, నటనతో అనేక విషయాలను వ్యక్తం చేయడం ప్రారంభించింది. ఒకపక్క యాక్టింగ్ నేర్చుకుంటూనే సింగింగ్, డ్యాన్సింగ్, స్టేజి షోల ద్వారా పాపులర్ స్టార్‌గా మారింది. తల్లిదండ్రులతో రిజా తొలి భారతీయురాలిగా.. డౌన్‌సిండ్రోమ్ పిల్లల అభ్యున్నతికోసం నిధులు సేకరించే ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ ‘గ్లోబల్ డౌన్ సిండ్రోమ్ ఫౌండేషన్’. ఉత్తర అమెరికాకు చెందిన ఈ సంస్థ ఏటా ‘బీ బ్యూటిఫుల్ బీ యువర్ సెల్ఫ్’ పేరిట ఫ్యాషన్ షోను నిర్వహిస్తోంది. ఈ షో ద్వారా వచ్చిన నిధులను డౌన్‌సిండ్రోమ్ బాధితుల అభ్యున్నతి కోసం ఖర్చుచేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఆన్లైన్ ఆడిషన్స్‌లో పాల్గొన్న రిజా..‘కాస్ట్యూమ్, వాకింగ్ స్టైల్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్’లో తన ప్రతిభను ప్రదర్శించి ఇండోవెస్ట్రన్ విభాగంలో ఫ్యాషన్ షోకు ఎంపికైంది. దీంతో ఇప్పటిదాక ఎప్పుడూ మోడలింగ్‌లో పాల్గొనని రిజా అంతర్జాతీయ వేదికపై ర్యాంప్ వాక్ చేయనుంది. డౌన్‌సిండ్రోమ్ కలిగిన వారికి ప్రత్యేకంగా నిర్వహించేæఈ గ్లోబల్ ఈవెంట్లో.. ఇండియా తరపున ప్రాతినిధ్యం వహిస్తోన్న తొలి అమ్మాయి రిజా కావడం విశేషం. అమెరికాలోని కొలరాడోలో ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ఈ షోలో వివిధ దేశాలకు చెందిన ఇరవై మంది మోడల్స్ పోటీపడనున్నారు. రిజా ఇప్పటి నుంచే దీనికోసం తన వెర్బల్ స్కిల్స్‌ను పెంచుకోవడానికి శిక్షణ తీసుకుంటూ సన్నద్ధమవుతోంది. ఈ ఫ్యాషన్ షోలో విన్నర్‌గా నిలిచి తన కమ్యూనిటీ వారికి ప్రేరణగా నిలవడానికి ప్రయత్నిస్తోంది. ‘‘ఎవరైనా తమ బిడ్డకు మానసిక వైకల్యం ఉందని తెలిసినప్పడు దానిని అంగీకరించడమే అతిపెద్ద సవాలు. సమాజంలో ఎదురయ్యే సానుభూతిని దాటుకుని వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దాలి. ప్రస్తుతం మా రిజా ఇవన్నీ దాటుకుని దేశం తరపును తొలిసారి ఫ్యాషన్ షోలో పాల్గొని తనలాంటి వారందరికి ఆదర్శంగా నిలవబోతోంది. నా కూతురు యాక్టివ్‌గా మాట్లాడడమేకాదు, డ్యాన్స్ కూడా చేస్తోంది. తన మనసులోని భావాలను ఎంతో ఆత్మవిశ్వాసంతో వ్యక్తం చేయగలదు. అలా అని తన వైకల్యాన్నీ దాయలేదు. కానీ తనని తాను నిరూపించుకుని మంచి క్రియేటివ్ ఆర్టిస్ట్‌గా ఎదిగి అందరితో చక్కగా కలిసిపోతుంది’’ – రిజా తల్లి అనితా రేజి అందరితో సమానంగా చూడాలి వైకల్యాలను దృష్టిలో పెట్టుకుని దివ్యాంగుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటారు. కానీ మానసిక, శారీరక వైకల్యం ఉన్న వారిలో కూడా కొన్ని నైపుణ్యాలు దాగున్నాయి. వాటిని అర్థం చేసుకుని మెరుగు పరిచే దిశగా సంక్షేమ పథకాలను రూపొందిస్తే దివ్యాంగులు సైతం వారి కాళ్ల మీద వాళ్లు నిలబడగలరు. వారు కూడా అందరిలాగే సమాజంలో మనగలుగుతారు. ఫ్యాషన్ షోలో పాల్గొనబోతున్న రిజా ఒంటరిది కాదు. డౌన్‌సిండ్రోమ్ కమ్యూనిటీ తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది. వారంతా కూడా ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఇల్లు, కేర్ సెంటర్లకే పరిమితమైన వారంతా వెలుగులోకి రావడం కాస్త కష్టమైనప్పటికీ వారికి ఉన్న అవకాశాలను అందుకునే మార్గాలను చూపితే వారు ఉన్నతంగా ఎదగగలుగుతారు. వీటన్నింటికంటే ముందు వారిని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలుగా అస్సలు చూడకూడదు. అందరితో సమానంగా ఎప్పుడు చూస్తామో అప్పుడే వాళ్లు చక్కగా ఎదగగలుగుతారు. – రిజా తండ్రి రేజి వహీద్ -
ఆ అమ్మ కథ కదిలించింది.. జాన్ సీనా కలుసుకున్నాడు
ఆ అమ్మ కథ.. ఓ స్టార్నటుడిని కరిగించింది. ఆ కథ తెలుసుకుని డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, హాలీవుడ్ నటుడు జాన్ సీనా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న తన వీరాభిమానిని ఎట్టకేలకు కలుసుకున్నాడు. పైగా ఆ అభిమాని ఉక్రెయిన్ శరణార్థి కావడంతో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. 19 ఏళ్ల మిషా రోహోజైన్, డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న టీనేజర్. కొడుకు పరిస్థితి చూసి.. తండ్రి చిన్నప్పుడే వదిలేశాడు. అప్పటి నుంచి ఆ ఒంటరి తల్లే కొడుకు ఆలనాపాలనా చూసుకుంటోంది. ఉక్రెయిన్ మరియాపోల్ వాళ్ల స్వస్థలం. ఒకప్పుడు అతని ఇంటి నిండా జాన్ సీనా పోస్టర్లే. కానీ, యుద్ధంతో వాళ్ల ఇళ్లు నాశనం అయ్యింది. ప్రాణాలు అరచేతపట్టుకుని ఆ తల్లీకొడుకులు దేశం విడిచారు. అయితే.. ఇంటిని, ఇంట్లో ఉన్న జాన్ సీనా పోస్టర్లను వదిలి వెళ్లేందుకు మిషా ఇష్టపడలేదు. దీంతో జాన్ సీనాను కలిపిస్తాం అంటూ ఆ తల్లి ఆ కొడుకుని బతిమాలి దేశం దాటింది. అమ్‌స్టర్‌డ్యామ్ దగ్గర ఓ శరణార్థ క్యాంపులో తలదాచుకున్నారు వాళ్లు. అప్పటి నుంచి మిషా, జాన్ సీనాను కలవాలని గోల చేయడం మొదలుపెట్టాడు. ఈ తరుణంలో.. మే నెలలో నెదర్లాండ్స్‌కు జాన్ సీనా వస్తున్నాడని తెలిసి.. అక్కడికి వెళ్లారు. కానీ, ఆ సూపర్ స్టార్ రాలేదు. నిరాశగా వెనుదిరిగారు వాళ్లు. ఈ ఉక్రెయిన్ శరణార్థి కథ.. ఈ మధ్యే వాల్ స్ట్రీట్ జర్నల్‌లో పబ్లిష్ అయ్యింది. ఆ కథనం ద్వారా విషయం తెలుసుకున్న సీనా.. ఆ తల్లి సాహసానికి ఫిదా అయ్యాడు. అంతేకాదు తన వీరాభిమాని మిషాను కలుసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అమ్‌స్టర్‌డ్యామ్ దగ్గర ఓ శరణార్థ క్యాంపులో తలదాచుకున్న ఆ కుటుంబాన్ని కలుసుకున్నాడు జాన్ సీనా. శరణార్థి శిబిరం కావడంతో అనుమతులు దొరకడం ఇబ్బంది అయ్యింది. ఇబ్బందులు తలెత్తుతాయాన్న ఉద్దేశంతో డబ్ల్యూడబ్ల్యూఈ సైతం స్పానర్షిప్ చేయలేదు. దీంతో తన సొంత ఖర్చులతో రిస్క్ అయినా సరే జాన్ సీనా, ఆ తల్లీకొడుకులను కలుసుకున్నాడు. మిషాకు తన గుర్తుగా కొన్ని గిఫ్ట్‌లు ఇచ్చాడు. What a wonderful way to spend a Saturday. Misha and his mother, Liana define #NeverGiveUp. Thank you to the @WSJ and @WWE who helped make this special visit possible. https://t.co/RpriCvjN3K — John Cena (@JohnCena) June 7, 2022 -
ఫలించిన అమ్మ 'తపస్'
కలెక్టరేట్ : కడుపున బిడ్డ పడగానే.. అబ్బాయా.. అమ్మాయా.. అని ఏ తల్లీఆలోచించదు. పుట్టిన చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుతూ భవిష్యత్తులో ప్రయోజకులను చేయాలని ఎన్నో కలలు కంటుంది. అలాంటిది.. పుట్టిన బిడ్డకు మానసిక ఎదుగుదల లేదని తెలిస్తే.. ఎంత ఎదిగినా పసి ప్రాయంలోనేఉండిపోతాడని గుర్తిస్తే.. ఆ మాతృమూర్తి గుండె తట్టుకుంటుందా..? కానీ భవాని తట్టుకున్నారు. అమ్మగా తన బిడ్డకు అండగా నిలిచారు. విద్య నేర్పేగురువయ్యారు. ‘డౌన్ సిండ్రోమ్’ కొడుకును అంతర్జాతీయ వేదికలపై డ్యాన్స్ ప్రదర్శనలిచ్చే స్థాయికి తీసుకెళ్లారు. తన కొడుక్కు ‘తపస్’ అని పేరు పెట్టుకుని ఆ బాలుడిని పెంచేందుకు పెద్ద తపస్సే చేస్తోందా తల్లి. బిడ్డ వైకల్యానికికుంగిపోకుండా విధిని ఎదిరించి నిలిచిన తల్లి భవాని, ఆమె చూపిన బాటలో పయనిస్తున్న తపస్పై ‘సాక్షి’ కథనం.. విజయవాడకు చెందిన భవాని, లోకేష్ దంపతులు 2006లో నగరానికి వచ్చి దమ్మాయిగూడలో నివాసం ఉంటున్నారు. పెళ్లయిన మూడేళ్లకు తపస్ జన్మించాడు. అతడు (డౌన్ సిండ్రోమ్ బాయ్) మానసిక దివ్యాంగుడు. ప్రతి 800 మంది శిశువుల్లో ఒకరు జన్యులోపంతో ఇలా జన్మిస్తారని, వీరికి ఐక్యూ చాలా తక్కువ ఉంటుందని డాక్టర్లు చెప్పారు. అతడి వైకల్యం గురించి విన్న ఆ దంపతులు మొదట ఆందోళనకు గురయ్యారు. తర్వాత దేవుడిచ్చిన శాపాన్ని అధిగమించాలనుకున్నారు. తల్లే గురువుగా మారి.. మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు ఆత్మవిశ్వాసంతో వారికి కొత్త జీవితం ఇవ్వడం ఎలాగో ఆలోచించారు తపస్ తల్లిదండ్రులు లోకేష్, భవానీ దంపతులు. పుట్టినప్పటి నుంచి తపస్ ఇంటికే పరిమితమయ్యాడు. తల్లి భవానీయే గురువుగా మారి అక్షరాలు నేర్పిస్తోంది. తపస్‌కు డ్యాన్స్ అంటే ఇష్టమని గుర్తించిన ఇంటి వద్దే ‘తపస్ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్’ను ప్రారంభించారు. తన బిడ్డలాంటి పిల్లలకు ఉచితంగా డ్యాన్స్ నేర్పిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తపస్‌కు డాన్స్ మీద ఉన్న మక్కువతో సులువుగా నేర్చుకున్నాడు. తల్లి భవాని ఇచ్చిన ప్రోత్సాహంతో అతడు పలు వేదికలపై డ్యాన్స్ పోటీల్లో ప్రతిభ చాటుతున్నాడు. గతేడాది వెస్ట్రన్ డాన్స్ ప్రదర్శనకు టీఎస్ఎఫ్ఏ (తెలుగు షార్ట్‌ఫిలిం అవార్డ్స్) నుంచి తపస్ పురస్కారం అందుకున్నాడు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ఖేలో ఇండియా’ పేరిట రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన పోటీల్లో సాఫ్ట్‌బాల్ పోటీల్లోనూ రెండో స్థానంలో నిలిచాడు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ‘బాలోత్సవ్’లోను తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నాడు. కాకినాడలో నిర్వహించిన ‘క్రియా చిల్డ్రన్ ఫెస్టివల్’లో ప్రముఖులచే సత్కారం సైతం అందుకున్నాడు. ఇటీవల జూన్ 11న నాన్ స్టాప్‌గా 35 నిముషాలు డ్యాన్స్ చేసిన తొలి డౌన్ సిండ్రోమ్ కిడ్‌గా ‘ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్’ను సైతం తపస్ సొంతం చేసుకుని ఔరా అనిపించాడు. ఏ స్కూల్లో చేర్చుకోవడం లేదు తపస్లోని ప్రతిభను గుర్తించి ఎన్నో అవార్డులు వరించినా ‘డౌన్ సిండ్రోమ్ బాయ్’ అనే కారణంతో ఏ స్కూల్లోను చేర్చుకోవడం లేదు. దీంతో ఇంట్లోనే చదువు చెబుతున్నాను. ఓ అకాడమీ ప్రారంభించి ఇలాంటి పిల్లలకు ఉచితంగా డాన్స్‌లో శిక్షణ ఇస్తున్నా. మానసిక వికలాంగుల తల్లిదండ్రులు ధైర్యం కోల్పోకుండా పిల్లలకు అండగా నిలవాలి. వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. అయినా తపస్ లాంటి ఎందరో చిన్నారుల భవిష్యత్‌కు బాటలు వేయాలని ఉంది. – భవాని, తపస్ తల్లి -
నాన్ స్టాప్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు
సాక్షి, హైదరాబాద్ : దివ్యాంగుడైన (డౌన్ సిండ్రోమ్ ) 9 ఏళ్ల బుడతడు 35 నిమిషాల నాన్ స్టాప్ డ్యాన్స్‌తో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. బోయిన్‌పల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా దమ్మాయిగూడ చెందిన భవానీ–లోకేష్ కుమారుడు తపష్ డ్యాన్స్‌లో తన అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. హిప్ అప్, వెస్ట్రన్, బాలీవుడ్, మాస్ బీట్, ఫోక్ సాంగ్స్, పేట్రియాటిక్ సాంగ్‌లకు అనుగుణంగా స్టెపులు వేస్తూ 35 నిమిషాల పాటు నిర్విరామంగా నృత్యం చేసి ఆకట్టుకున్నాడు. ఈ కేటగిరీలో ఇప్పటి వరకు ఉన్న 18 నిమిషాల రికార్డును తపష్ బద్దలు కొట్టాడు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు బింగి నరేందర్‌గౌడ్, స్వర్ణ బాలుడికి రికార్డు పత్రాన్ని, షీల్డ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా తపష్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ చిన్నారికి సంగీతం పట్ల ఉన్న ఆసక్తి కొద్దీ ఆ దిశగా ప్రోత్సహించామన్నారు. -
అబార్షన్ కు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతివ్వాలన్న ఓ మహిళ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కడుపులోని పిండం ‘డౌన్ సిండ్రోమ్’తో బాధపడుతోందని, కాబట్టి అబార్షన్ కు అనుమతించాలని మహారాష్ట్రకు చెందిన మహిళ కోర్టును కోరింది. అయితే, ఈ విషయంలో గర్భాన్ని కొనసాగిస్తే తల్లికి ఎలాంటి హాని ఉండదంటూ మెడికల్ బోర్డు నివేదిక సమర్పించింది. బిడ్డకు మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మాత్రమే ఉన్నాయని వైద్యుల బృందం తేల్చిందని మంగళవారం కేసును విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎల్ఎన్ లు వ్యాఖ్యానించారు. -
ప్రేమంటే ఇలాగే ఉంటుందేమో!
-
ప్రేమంటే ఇలాగే ఉంటుందేమో!
న్యూయార్క్: ప్రేమ అంటే ప్రేమే.. దగ్గరకు చేర్చడమే దాని లక్షణం. గుండెను మెలిపెట్టే శక్తి దానికే ఉంది. దానికి రంగు, జాతి, మతం ఉండవు. అలాగే, ఎదుటి వ్యక్తి అందంగా, ఆహార్యంగా ఉన్నాడా అని కూడా చూడదు. అందరిని తనలో కలిపేసుకుంటుంది. అందరిని హత్తుకుంటుంది. అందుకే అది మాతృప్రేమైనా, పితృప్రేమైనా, బంధువుల ప్రేమైనా, యువతీ యువకుల ప్రేమైనా స్వచ్ఛంగా ఉంటే అమృతంలా మారి శాశ్వతను ఇస్తుంది. ఆ ప్రేమకు అందమైన బానిసలుగా మారుస్తుంది. ఇలాంటి ప్రేమనే ఓ బాయ్ ఫ్రెండ్ తనపై కురిపించే సరికి ఆ ప్రేయసి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎగిరిగంతేసినంత పనిచేసింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. లక్షల్లో ఆ వీడియోను వీక్షించారు. ఆ వీడియో ప్రకారం డౌన్ సిండ్రోమ్ వ్యాధి లక్షణం ఉన్న డానీ గ్రిప్తిస్ అనే యువకుడు అదే వ్యాధి లక్షణం ఉన్న తన గర్ల్ ప్రెండ్ ఆశ్లే గ్రీన్హాగ్ ను ఊహించని గిఫ్ట్ ఇచ్చి అబ్బుర పరిచాడు. గతంలో వారిద్దరి మధ్య సంభాషణ జరిగిన సందర్భంలో తన 21వ పుట్టిన రోజున కచ్చితంగా ఓ రింగ్ తెస్తానని, అది ఆమె చేతికి తొడుగుతానని చెప్పాడు. కానీ, ఆ ఆశ్లే ఆ విషయం మరిచిపోయింది. అనుకున్నట్లుగానే 21వ పుట్టిన రోజు వచ్చింది. తన గర్ల్ ప్రెండ్ కోసం డానీ కొన్ని గిఫ్టులు తీసుకొచ్చాడు. అందులో ఒక్కో గిఫ్ట్ చూస్తూ సంబరపడిపోతున్న ఆశ్లే చివరిగా అందులో రింగ్ ఉండటం చూసి అబ్బురపడిపోయింది. ఎగిరిగంతేసింది. అతడిని గట్టిగా హత్తుకుని తన హద్దులు చెరిగిన సంతోషాన్ని చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. పుట్టిన రోజుకు వచ్చిన స్నేహితులంతా ఈ దృశ్యం చూసి కనువిందు పొందారు. ఆ రింగ్ ను ప్రేమగా ఆశ్లే చేతికి డానీ తొడిగాడు. గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటారంట. సాధారణంగా డౌన్ సిండ్రోమ్ వ్యాధి గ్రస్తులకు జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటంతోపాటు శారీరక పెరుగుదలలో కూడా తేడాలుంటాయి. -
మానసిక వికాసం డౌన్
డౌన్ సిండ్రోమ్ నేడు వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే తల్లి వయసు డౌన్ సిండ్రోమ్ కలిగే అవకాశం 30 ఏళ్ల లోపు ప్రతి 2500 ప్రెగ్నెన్సీలలో ఒకరికి 40 ఏళ్లు దాటితే ప్రతి 80 ప్రెగ్నెన్సీలలో ఒకరికి 45 ఏళ్లు దాటితే ప్రతి 32 ప్రెగ్నెన్సీలలో ఒకరికి పిల్లల్లో మానసిక వికాస లోపాలను కలగజేసే అంశాల్లో అతి ముఖ్యమైంది ‘డౌన్ సిండ్రోమ్’. ఇది జన్యుపరమైన కారణాలతో కలుగుతుంది. సుమారు ప్రతి ఎనిమిది వంతుల శిశుజననాల్లో ఒకరికి ఈ సమస్య కలిగే అవకాశం ఉంది. తల్లిగర్భం దాల్చే వయసు పెరుగుతున్న కొద్దీ పుట్టబోయే శిశువుకు డౌన్ సిండ్రోమ్ కలిగే అవకాశం పెరుగుతుంది. డౌన్ సిండ్రోమ్ కలిగే అవకాశాలను తగ్గించడానికి సరైన వయసులో వివాహం చేసుకోవడం, పిల్లల కోసం తగిన సమయంలో ప్లాన్ చేసుకోవడం ఎంతో కీలకం. మహిళల్లో పద్దెనిమిది ఏళ్లలోపు, 35 ఏళ్లు దాటిన తర్వాత వివాహాలైన సందర్భాల్లో పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన, ఇతర లోపాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ముందుగానే గుర్తించవచ్చు: కీలకమైన విషయం ఏమిటంటే గర్భస్థ శిశువుకు జన్యులోపాలను ముందుగానే కొన్ని పరీక్షల ద్వారా గుర్తించేందుకు అవకాశం ఉంది. దీన్ని వినియోగించుకోవడం ద్వారా (ముఖ్యంగా 30 ఏళ్లు పైబడ్డ తర్వాత గర్భం ధరిస్తున్న మహిళలందరూ) ప్రయోజనం పొందవచ్చు. ఇక జెనెటిక్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవడం కూడా ప్రధానమే. సాధారణంగా చేసే పరీక్షలు: జన్యుపరమైన లోపాలను తెలుసుకోవడం కోసం సాధారణంగా చేసే స్క్రీనింగ్ పరీక్షలివి... ఆమ్నియోసెంటైసిస్, కోరియోనిక్ విల్లస్ శాంప్లింగ్ (సీవీఎస్) ఎక్స్పాండెడ్ ఆల్ఫాప్రోటీన్ (ఏఎఫ్‌పీ) అల్ట్రాసౌండ్ న్యూకల్ ట్రాన్స్‌లుయెన్సీ స్క్రీనింగ్ (ఎన్టీ స్క్రీనింగ్)... వంటి పరీక్షల ద్వారా కడుపులోని పిల్లలకు డౌన్స్ సిండ్రోమ్ ఉందేమోనని కాస్త ముందుగానే గుర్తించడం చాలావరకు సాధ్యమే. (అయితే కొద్దిమందిలో పరీక్షలు సాధారణంగానే ఉన్నా పుట్టిన తర్వాతే విషయం పడే అవకాశాలూ ఉంటాయి). డౌన్ సిండ్రోమ్‌కు కారణాలు క్రోమోజోమ్స్ 21లో జన్యుపదార్థం అధికం కావడం వల్ల డౌన్ సిండ్రోమ్ సంభవిస్తుంది. అండం ఏర్పడే సమయంలో జన్యు సంయోగం జరుగుతుంది. ఈ ప్రక్రియలో క్రోమోజోమ్‌లు విడివడుతుంటాయి. అలా విడిపోనప్పుడు దాన్ని నాన్ డిస్ఫంక్షన్గా వ్యవహరిస్తారు. దీని వల్ల 21వ క్రోమోజోమ్‌లో ఒక అదనపు భాగం (ఆర్మ్) ఏర్పడుతుంది. దీన్ని ట్రైజోమీ 21 అంటారు. అంటే కేవలం రెండు మాత్రమే గాక అదనంగా మరొకటి ఉన్న క్రోమ్జోమ్గా పేర్కొంటారు. అవసరమైన దాని కంటే అదనంగా ఉండే ఈ క్రోమ్జోమ్ వల్ల మెదడులో, శరీరంలో అనేక లోపాలు తలెత్తుతాయి. ఇవే వ్యాధి లక్షణాలుగా బయటపడతాయి. అయితే దురదృష్టవశాత్తూ డౌన్స్ సిండ్రోమ్‌కు కారణమైన అంశాన్ని గుర్తించినప్పటికీ... దీని వల్ల ఆ తర్వాత కలిగే మానసిక వికాస లోపాన్ని సరిచేసే విధానం ఇప్పటివరకూ కనుగొనలేదు. డౌన్ సిండ్రోమ్ లక్షణాలు కండరాలు వదులుగా ఉండటం (హైపోటోనియా) కళ్లు పైవైపునకు ఉండటం - మధ్య నుంచి జారుతున్నట్లుగా ఉండటం (అప్‌వర్డ్ స్లాంటింగ్ పాల్పెబ్రల్ ఫిషర్) చప్పిడి ముక్కు (నేసల్ బ్రిడ్జ్ ఫ్లాట్‌గా ఉండటం) పొట్టిగా, లావుగా ఉండటం చెవులు కిందికి ఉండటం (లో-సెట్ ఇయర్స్) అరచేతిపై కాలిపై ఉండే గీతలు తక్కువగా ఉండటం చప్పిడి ముఖం (ఫ్లాట్ ఫేస్) జాయింట్స్ వద్ద ఎముకలను ఎక్కువగా వంచగలగడం (హైపర్ ఎక్స్‌టెండింగ్ జాయింట్స్) పెద్ద నాలుక, చిన్న నోరు కాలి బొటన వేలికీ, రెండోవేలికీ మధ్య ఉన్న ఖాళీ ఎక్కువగా ఉండటం... వంటి శారీరక లక్షణాలు ఈ సమస్యను క్లినికల్‌గా గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఇతర సమస్యలు థైరాయిడ్ లోపం పుట్టుకతోనే గుండె సమస్యలు (కంజెనిటల్ హార్ట్ డిసీజెస్), వినికిడి లోపం, ఏడీహెచ్‌డీ (దుడుకు స్వభావం, ఏకాగ్రత లోపం), ప్రవర్తన రుగ్మతలు (కాండక్ట్ డిజార్డర్స్), ఆటిజమ్ వంటి లక్షణాలూ కూడా కనిపిస్తాయి. ఈ పిల్లల్లో ఐక్యూ తక్కువగా ఉండటం, నడక, మాట కాస్త ఆలస్యంగా రావడం వంటివి గుర్తించవచ్చు. కొందరిలో జీర్ణకోశ వ్యవస్థ లోపాలు, కంటి లోపాలు కూడా కనిపిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ లోపాలు, లుకేమియా, మతిమరపుతో పాటు సైకోసిస్ వంటి మానసిక సమస్యలూ వీరిలో కనిపించడం ఎక్కువ. ఇక చర్మవ్యాధులు కూడా వస్తుంటాయి. గతంలో అంటే... 1900వ ప్రాంతంలో ఈ వ్యాధికి గురైన పిల్లల గుండెజబ్బులు, ఇతర ఇన్ఫెక్షన్ల కారణంగా పదోఏడు నిండకముందే మరణించేవారు. కానీ ఇప్పుడు 80 శాతం మంది డౌన్ సిండ్రోమ్ ఉన్నవారు 50 ఏళ్లు వచ్చేవరకూ జీవిస్తున్నారు. అవసరమైన పరీక్షలు (ముఖ్యంగా థైరాయిడ్, గుండె సంబంధమైనవి) చేయిస్తూ ఉండటం, సమస్యలకు తగిన విధంగా చికిత్స చేయించడం అవసరం. దీనితోపాటు మానసిక వికాసానికి ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించడం కూడా ముఖ్యం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ (ఎన్ఐఎమ్హెచ్) వంటి అనేక సంస్థలతో పాటు అనేక ఇతర మానవీయ సంస్థలు ఈ పిల్లలకు అవసరమైన శిక్షణను చిత్తశుద్ధితో అందిస్తున్నాయి. అయితే వ్యాధితోనే పుట్టిన పిల్లల విషయంలో తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉన్నా... తగిన వయసులోనే గర్భం దాల్చడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలే ఈ జబ్బును నివారించడానికి ఉపయోగపడతాయి. ఇక గర్భవతులు డాక్టర్లు సూచించిన మేరకు తగిన పరీక్షలు చేయించుకోవడం కూడా అవసరమే. ఈ రోజుల్లో 50 ఏళ్ల వరకు జీవిస్తున్నారు గతంలో అంటే... 1900 వ ప్రాంతంలో ఈ వ్యాధికి గురైన పిల్లల గుండెజబ్బులు, ఇతర ఇన్ఫెక్షన్ల కారణంగా పదో ఏడు నిండకముందే మరణించేవారు. కానీ ఇప్పుడు 80 శాతం మంది డౌన్ సిండ్రోమ్ ఉన్నవారు 50 ఏళ్లకు పైబడి జీవిస్తున్నారు. -
ఈ బుడ్డోడు.. భలే హుషారు
న్యూయార్క్: సాధారణంగా చిన్నపిల్లలంటే అందరికీ ముచ్చటే. వారు ఏం చేసినా ఆశ్చర్యంగా చూడాలనిపిస్తుంది. వాళ్లు ఎలాంటి హాస్యం పండించకుండానే మన ముఖంలో చిరునవ్వు ఉంటుంది. అలాంటిది మనం చెప్పింది చెప్పినట్లు బుడిబుడినడకలకు ముందే చేస్తుంటే ఆ పిల్లాడ్ని చూసి ఎంతటి ఆశ్యర్యం వేస్తుంది.. సరిగ్గా అంతే ఆశ్చర్యాన్ని గొలిపాడు రెండేళ్ల బాలుడైన జాన్ డేవిడ్ మారిన్. అది కూడా అతడు డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతు. అలబామాకు చెందిన జాన్ తన తల్లి ఎలా చెప్తే అలా చేస్తూ వారిని ముచ్చటగొలిపాడు. ముఖ్యంగా అతడి తల్లి ఏబీసీడీలు చెప్తుంటే.. చాలా చక్కగా హావభావాలు పలికిస్తూ అవే అక్షరాలు తిరిగి చెప్పాడు. కానీ, ఒక డబ్ల్యూ మాత్రం చెప్పలేక మరింత ఆశ్చర్యపోయేలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ సమాధానం చెప్పాడు. దీంతో ఆ పిల్లాడి అమ్మ, అమ్మమ్మ గుడ్ జాబ్ అంటూ చేతుల్లోకి తీసుకొని ముద్దు చేశారు. డౌన్ సిండ్రోమ్ అనే జన్యుసంబంధమైన వ్యాధితో బాధపడేవారికి సాధారణంగా ఆకళింపు అంతగా ఉండదు. ఈ వీడియోను ఇప్పటికే కోటి ముప్పై లక్షల మంది చూశారు. -
డౌన్ సిండ్రోమ్‌పై అవగాహన సదస్సు
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: డౌన్ సిండ్రోమ్‌తో బాధపడే చిన్నారులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని డౌన్ సిండ్రోమ్ అసోసియేషన్ ఆఫ్ తమిళనాడు (డీఎస్‌ఏటీ) అధ్యక్షురాలు సురేఖరామచంద్రన్ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో డౌన్ సిండ్రోమ్‌పై అవగాహన తీసుకుని వచ్చే విధంగా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. సురేఖరామచంద్రన్ విలేకరులతో మాట్లాడుతూ, డౌన్ సిండ్రోమ్‌కు గురైన కారణాలపై, అందులో వచ్చిన చికిత్స విధానాలపై అవగాహన తీసుకు వచ్చేలా చెన్నై నగరంలో 12వ ప్రపంచ డౌన్ సిండ్రోమ్ కాంగ్రెస్(డబ్ల్యూడీఎస్‌సీ) పేరుతో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. 2015వ సంవత్సరం ఆగస్టు 17 నుంచి 21 వరకు చెన్నైలో తొలిసారిగా డౌన్ సిండ్రోమ్ సదస్సుకు వివిధ దేశాల నుంచి డౌన్ సిండ్రోమ్‌కు గురైన చిన్నారులు, నిపుణులు, పరిశోధకులు హాజరు కానున్నారని అన్నారు. ఆసియా పసిఫిక్ డౌన్ సిండ్రోమ్ ఫెడరేషన్(ఏపీడీఎస్ఎఫ్) డౌన్ సిండ్రోమ్ ఇంటర్నేషనల్(డీఎస్ఐ) సభ్యులతో కలిసి డౌన్ సిండ్రోమ్‌పై అవగాహన తీసుకుని రానున్నట్లు తెలిపారు. డీఎస్టీఏకు జెట్ ఎయిర్వేస్ సహకారం అందిస్తుందన్నారు. చెన్నైను సందర్శించే డౌన్ సిండ్రోమ్ చిన్నారులకు ఎయిర్ టికెట్లో ప్రత్యేక రాయితీలను అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన డౌన్ సిండ్రోమ్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు.