రోల్‌ మోడల్‌: తొలి ఇండియన్‌ అమ్మాయిగా చరిత్ర సృష్టించనున్న రిజా | Riza Reji Is First Indian With Down Syndrome To Be Selected For Premier Fashion Show | Sakshi
Sakshi News home page

రోల్‌ మోడల్‌: తొలి ఇండియన్‌ అమ్మాయిగా చరిత్ర సృష్టించనున్న రిజా

Published Thu, Jul 14 2022 12:14 AM | Last Updated on Thu, Jul 14 2022 12:16 AM

Riza Reji Is First Indian With Down Syndrome To Be Selected For Premier Fashion Show - Sakshi

వయసుకు తగ్గట్టుగా మానసికంగా, శారీరకంగా పరిపూర్ణంగా ఎదగని పిల్లల...మాట, నడక, నవ్వు సాధారణ పిల్లలకంటే విభిన్నంగా ఉంటుంది. కొంతమంది అయితే ఒకటీ రెండు మాటలు కూడా స్పష్టంగా పలకడం కూడా కష్టమే. అటువంటిది డౌన్‌సిండ్రోమ్‌తో బాధపడుతోన్న రిజా రేజి ఏకంగా ప్రీమియర్‌ ఫ్యాషన్‌ షోకు ఎంపికైంది. గ్లోబల్‌ ఈవెంట్‌లో ర్యాంప్‌ వాక్‌ చేయనున్న తొలి ఇండియన్‌ అమ్మాయిగా రిజా చరిత్ర సృష్టించనుంది.

కేరళకు చెందిన వహీద్, అనితారేజి దంపతులకు ఇద్దరు కూతుర్లు రియ, రిజాలు. 2014 నుంచి బెంగళూరులో స్థిరపడిన రేజి దంపతులు క్రియేటివ్‌ ఆర్ట్స్‌ వృత్తినిపుణులు. దివ్యాంగ పిల్లల సంక్షేమమే లక్ష్యంగా ‘బ్యూటిపుల్‌ టుగెదర్‌’ పేరిట అనితా ఓ ఇనిస్టిట్యూట్‌ను కూడా నడుపుతోంది.పెద్ద కూతురు రియా ముంబైలోని అడ్వరై్టజింగ్‌ కంపెనీలో అసోసియేట్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. చిన్న కూతురైన 23 ఏళ్ల రిజా చిన్నప్పటి నుంచి డౌన్‌ సిండ్రోమ్‌ కారణంగా అక్కలా ఎదగలేదు. అయినప్పటికీ మిగతా డౌన్‌ సిండ్రోమ్‌ పిల్లలందరిలోకి చురుకుగా ఉండేది. ఇది గమనించిన ఆమె తల్లిదండ్రులు రిజాను డ్యాన్స్, యాక్టింగ్‌లలో శిక్షణ తీసుకునేందుకు ప్రోత్సహించి, ‘క్రిసాలిస్‌ ఫెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ సెంటర్‌’లో చేర్పించారు. దీంతో రిజా మనస్సులోని భావాలను వ్యక్తం చేయడానికి మంచి సాధనం దొరికింది. తన డ్యాన్స్‌ భంగిమలు, నటనతో అనేక విషయాలను వ్యక్తం చేయడం ప్రారంభించింది. ఒకపక్క యాక్టింగ్‌ నేర్చుకుంటూనే సింగింగ్, డ్యాన్సింగ్, స్టేజి షోల ద్వారా పాపులర్‌ స్టార్‌గా మారింది. 


తల్లిదండ్రులతో రిజా

తొలి భారతీయురాలిగా..
డౌన్‌సిండ్రోమ్‌ పిల్లల అభ్యున్నతికోసం  నిధులు సేకరించే ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ ‘గ్లోబల్‌ డౌన్‌ సిండ్రోమ్‌ ఫౌండేషన్‌’. ఉత్తర అమెరికాకు చెందిన ఈ సంస్థ ఏటా ‘బీ బ్యూటిఫుల్‌ బీ యువర్‌ సెల్ఫ్‌’ పేరిట ఫ్యాషన్‌ షోను నిర్వహిస్తోంది. ఈ షో ద్వారా వచ్చిన నిధులను డౌన్‌సిండ్రోమ్‌ బాధితుల అభ్యున్నతి కోసం ఖర్చుచేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఆన్‌లైన్‌ ఆడిషన్స్‌లో పాల్గొన్న రిజా..‘కాస్ట్యూమ్, వాకింగ్‌ స్టైల్, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌’లో తన ప్రతిభను ప్రదర్శించి ఇండోవెస్ట్రన్‌ విభాగంలో ఫ్యాషన్‌ షోకు ఎంపికైంది. దీంతో ఇప్పటిదాక ఎప్పుడూ మోడలింగ్‌లో పాల్గొనని రిజా అంతర్జాతీయ వేదికపై ర్యాంప్‌ వాక్‌ చేయనుంది. డౌన్‌సిండ్రోమ్‌ కలిగిన వారికి ప్రత్యేకంగా నిర్వహించేæఈ గ్లోబల్‌ ఈవెంట్‌లో.. ఇండియా తరపున ప్రాతినిధ్యం వహిస్తోన్న తొలి అమ్మాయి రిజా కావడం విశేషం. అమెరికాలోని కొలరాడోలో ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ఈ షోలో వివిధ దేశాలకు చెందిన ఇరవై మంది మోడల్స్‌ పోటీపడనున్నారు. రిజా ఇప్పటి నుంచే దీనికోసం తన వెర్బల్‌ స్కిల్స్‌ను పెంచుకోవడానికి శిక్షణ తీసుకుంటూ సన్నద్ధమవుతోంది. ఈ ఫ్యాషన్‌ షోలో విన్నర్‌గా నిలిచి తన కమ్యూనిటీ వారికి ప్రేరణగా నిలవడానికి ప్రయత్నిస్తోంది.

‘‘ఎవరైనా తమ బిడ్డకు మానసిక వైకల్యం ఉందని తెలిసినప్పడు దానిని అంగీకరించడమే అతిపెద్ద సవాలు. సమాజంలో ఎదురయ్యే సానుభూతిని దాటుకుని వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దాలి. ప్రస్తుతం మా రిజా ఇవన్నీ దాటుకుని దేశం తరపును తొలిసారి  ఫ్యాషన్‌ షోలో పాల్గొని తనలాంటి వారందరికి ఆదర్శంగా నిలవబోతోంది. నా కూతురు యాక్టివ్‌గా మాట్లాడడమేకాదు, డ్యాన్స్‌ కూడా చేస్తోంది. తన మనసులోని భావాలను ఎంతో ఆత్మవిశ్వాసంతో వ్యక్తం చేయగలదు. అలా అని తన వైకల్యాన్నీ దాయలేదు. కానీ తనని తాను నిరూపించుకుని మంచి క్రియేటివ్‌ ఆర్టిస్ట్‌గా ఎదిగి అందరితో చక్కగా కలిసిపోతుంది’’
– రిజా తల్లి అనితా రేజి 

అందరితో సమానంగా చూడాలి
వైకల్యాలను దృష్టిలో పెట్టుకుని దివ్యాంగుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటారు. కానీ మానసిక, శారీరక వైకల్యం ఉన్న వారిలో కూడా కొన్ని నైపుణ్యాలు దాగున్నాయి. వాటిని అర్థం చేసుకుని  మెరుగు పరిచే దిశగా సంక్షేమ పథకాలను రూపొందిస్తే దివ్యాంగులు సైతం వారి కాళ్ల మీద వాళ్లు నిలబడగలరు. వారు కూడా అందరిలాగే సమాజంలో మనగలుగుతారు. ఫ్యాషన్‌ షోలో పాల్గొనబోతున్న రిజా ఒంటరిది కాదు. డౌన్‌సిండ్రోమ్‌ కమ్యూనిటీ తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది. వారంతా కూడా ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఇల్లు, కేర్‌ సెంటర్‌లకే పరిమితమైన వారంతా వెలుగులోకి రావడం కాస్త కష్టమైనప్పటికీ వారికి ఉన్న అవకాశాలను అందుకునే మార్గాలను చూపితే వారు ఉన్నతంగా ఎదగగలుగుతారు. వీటన్నింటికంటే ముందు వారిని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలుగా అస్సలు చూడకూడదు. అందరితో సమానంగా ఎప్పుడు చూస్తామో అప్పుడే వాళ్లు చక్కగా ఎదగగలుగుతారు.  
– రిజా తండ్రి రేజి వహీద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement