అమ్మాయిలు బయటకు వెళ్తుంటే బాడీగార్డ్స్‌లా అబ్బాయిలను తోడిచ్చి పంపే సీన్‌కి రివర్స్‌లో అబ్బాయిలు బయటకు వెళ్తూ తోడురమ్మని అమ్మాయిలను బతిమాలుకోవడం కనిపిస్తే.. పురుషులతో సమానంగా మహిళలకూ హక్కులుంటే.. ఇంటా, బయటా అన్నింటా అమ్మాయిలకు గౌరవం అందుతుంటే..
సలాం.. ప్రివేత్..
ఈ కిర్గిజ్ అండ్ రష్యన్ పదాలకు అర్థం వందనం! పై దృశ్యాలు కనిపించేదీ కిర్గిజ్‌స్తాన్‌లోనే! ఈ దేశం ఒకప్పటి యూఎస్సెస్సార్ (యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్)లో భాగం అవడం వలన ఇప్పటికీ అక్కడ రష్యన్ అఫీషియల్ లాంగ్వేజ్‌గా కొనసాగుతోంది కిర్గిజ్‌తోపాటు. అందుకే ప్రివేత్ కూడా! మొన్న మార్చ్‌లో కిర్గిజ్‌స్తాన్‌కి టేకాఫ్ అయ్యే చాన్స్ దొరికింది. ప్రయాణాలు కామనైపోయి.. అంతకంటే ముందే అంతర్జాలంలో సమస్త సమాచారమూ విస్తృతమై పర్సనల్ ఎక్స్‌పీరియెన్సెస్‌ని పట్టించుకునే లీజర్ ఉంటుందా అనే డౌటనుమానంతోనే స్టార్ట్ అయింది ఈ స్టోరీ ఆఫ్ జర్నీ! అయినా కిర్గిజ్‌స్తాన్‌లో నేను చూసినవి.. పరిశీలించినవి.. అర్థం చేసుకున్నవి మీ ముందుంచుతున్నాను!
ఢిల్లీ నుంచి కిర్గిజ్‌స్తాన్ రాజధాని బిష్కేక్‌కి మూడున్నర గంటలు. అందులో దాదాపు రెండున్నర గంటలు టీయెన్ షాన్ పర్వత శ్రేణుల మీంచే ఉంటుంది ఆకాశయానం. విండోలోంచి చూస్తే కొండల మీద వెండి రేకులు పరచుకున్నట్టు కనిపిస్తుంది దృశ్యం. మంచుకొండలు.. మబ్బులు అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటున్నట్టు.. భుజాల మీద చేతులేసుకుని కబుర్లాడుతున్నట్టు అనిపిస్తుంది.
ఇదొక అద్భుతమైతే.. బిష్కేక్.. మనాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లయిట్ దిగగానే కురిసే మంచుతో స్వాగతం మరో అద్భుతం! సిమ్లాలో హిమ వర్షాన్ని ఆస్వాదించినప్పటికీ బిష్కేక్‌లో మంచు కురిసే వేళలు గమ్మత్తయిన అనుభూతి. మేం వెళ్లిందే మంచు పడే లాస్ట్ డేస్. ఇంకా చెప్పాలంటే తర్వాతి రోజు నుంచి మంచు పడటం ఆగిపోయి.. కరగడం మొదలైంది.
వర్షం వెలిసిన తర్వాత ఉండే కంటే కూడా రొచ్చుగా ఉంటుంది కరుగుతున్న మంచు. ఎండ చిటచిటలాడించినా.. మంచు కొండల మీద నుంచి వీచే గాలులు వేళ్లు కొంకర్లు పోయేంత చలిని పుట్టించాయి. అందుకే ఉన్న వారం రోజులూ షూ, థర్మల్స్, గ్లోవ్స్, క్యాప్ తప్పకుండా ధరించాల్సి వచ్చింది. ఇంకోమాట.. అక్కడి వాతావరణ పరిస్థితులకో ఏమో మరి.. షూ లేకుంటే అక్కడి జనాలు చిత్రంగా చూస్తారు.
గోలలు.. గడబిడలకు నియత్..
బిష్కేక్‌ని కేంద్రంగా చేసుకునే అల అర్చా, ఇసిక్ కుల్ ఇంకా బిష్కేక్ చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించాం. కాబట్టి వారం రోజులు బిష్కేక్‌తో మా అనుబంధం కొనసాగింది. సిటీ సెంటర్‌లోని హోటల్‌లో మా బస. అక్కడికి వెళ్లగానే అబ్జర్వ్ చేసిన విషయం.. కిర్గిజ్ ప్రజలు చాలా నెమ్మదస్తులని! గట్టిగట్టిగా మాట్లాడటాలు.. అరుపులు.. కేకలు, గడబిడ వాతావరణం వారికి నచ్చవు. పక్కనవాళ్లు ఏ కొంచెం గట్టిగా మాట్లాడినా చిరాగ్గా మొహం పెడ్తారు. నిర్మొహమాటంగా చెప్పేస్తారు గొంతు తగ్గించి మాట్లాడమని. ఇక్కడ మెజారిటీ రష్యనే మాట్లాడ్తారు.
‘నియత్’ అంటే ‘నో’ అని అర్థం. సైన్‌బోర్డ్స్, నేమ్‌ప్లేట్స్ కిర్గిజ్ అండ్ రష్యన్‌లో ఉంటాయి. ఇది సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్నప్పుడు మామూలు వ్యవహారాలూ రష్యన్‌లోనే నడచి.. కిర్గిజ్ భాషా పదకోశం కుంచించుకుపోయిందట. స్వతంత్ర దేశమయ్యాక కిర్గిజ్ భాషా వికాసం మీద బాగానే దృష్టిపెట్టారని స్థానికులు చెప్పిన మాట. సర్కారు విద్యాబోధన అంతా కిర్గిజ్ మీడియంలోనే సాగుతుంది. వెస్ట్రనైజ్డ్‌గా కనిపించే పట్టణ ప్రాంతమే మొత్తం దేశాన్ని డామినేట్ చేస్తుంది.
"ఈ దేశం విద్యుత్ అవసరాలను హైడల్ ప్రాజెక్ట్‌లు, బొగ్గే తీరుస్తున్నాయి. అయితే పట్టణాల్లోని సెంట్రలైజ్డ్ హీటింగ్, ఎయిర్ కండిషనింగ్‌కి బొగ్గునే వాడటం వల్ల కాలుష్యం పెరిగిపోతోందని అక్కడి పర్యావరణవేత్తల ఆవేదన. కాలుష్యంలో బిష్కేక్‌ది ఢిల్లీ తర్వాత స్థానం."
లోకల్ మార్కెట్లదే హవా..
ఇక్కడ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అంతగా లేదనే చెప్పొచ్చు. ప్రైవేట్ బ్యాంకులు మొదలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వేళ్ల మీద లెక్కపెట్టేన్ని కూడా లేవు. స్థానికులను అడిగితే.. కమ్యూనిజం ప్రభావం వల్లేమో ప్రైవేట్ బ్యాంకుల మీద పూర్తిస్థాయి నమ్మకం ఇంకా కుదరలేదని చెప్పారు. అఫర్డబులిటీ, బేరసారాలకు వీలుడంటం వల్లేమో లోకల్ మార్కెట్సే కళకళలాడుతుంటాయి. ఇక్కడ ఓష్ బజార్, దొర్‌దోయి, అక్ ఎమిర్ లోకల్ మార్కెట్లు చాలా పాపులర్. మేం ఓష్ బజార్‌కి వెళ్లాం.
రెండు రోజులు మార్కెట్ అంతా కలియతిరిగాం. సిల్వర్ జ్యూలరీ దగ్గర్నుంచి హ్యాండ్ అండ్ లగేజ్ బ్యాగ్స్, బట్టలు, వంట పాత్రలు, వెచ్చాలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, నట్స్ వరకు సమస్త సరకులకూ నిలయమిది. ఏ వస్తువులకు ఆ వస్తువుల సపరేట్ మార్కెట్ల సముదాయంగా కనిపిస్తుంది. బేరం చేయకుండా చూడాలంటేనే రోజంతా పడుతుంది. అన్నట్లు కిర్గిజ్‌లో సిల్వర్, 14 క్యారెట్ గోల్డ్ జ్యూలరీ చాలా ఫేమస్. ఓష్ బజార్‌లో ఒక్క సిల్వర్, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ జ్యూలరీయే ఉంటుంది. ఈ దేశం లెదర్ గూడ్స్‌కీ ప్రసిద్ధే! లోకల్ ఫ్యాషన్‌ని చూడాలంటే ఇక్కడి బట్టల మార్కెట్‌ని సందర్శించొచ్చు.
ఓష్ బజార్
ఈ మార్కెట్‌లో ఇంకో అట్రాక్షన్.. కిర్గిజ్‌స్తాన్ హ్యాండీక్రాఫ్ట్స్ షాప్స్. వీళ్ల సంప్రదాయ వేషధారణలోని కల్పక్ (సూఫీలు ధరించే టోపీని పోలి ఉంటుంది) దగ్గర్నుంచి వీళ్ల సాంస్కృతిక చిహ్నమైన యర్త్ హోమ్, సంప్రదాయ సంగీత వాద్యం కోముజ్ (వాళ్ల నేషనల్ మ్యూజిక్ సింబల్)ల కళాకృతులు, ఎంబ్రాయిడరీ.. ఊలు అల్లికల వరకు కిర్గిజ్ హస్తకళల నైపుణ్యానికి ప్రతీకలైన వస్తువులన్నీ ఈ షాపుల్లో దొరుకుతాయి. అయితే ఏది కొనాలన్నా చాలా బేరం ఆడాలి. కొన్ని చోట్ల వర్కవుట్ అవుతుంది. కొన్ని చోట్ల కాదు ఈ మార్కెట్‌లో అన్నిరకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లూ ఉంటాయి. అయితే మేం వెళ్లింది అక్కడి వింటర్‌లో కాబట్టి పెద్దగా కనిపించలేదు.
చలికాలాలు మైనస్ డిగ్రీల్లో టెంపరేచర్ ఉంటుంది కావున పంటలన్నీ వేసవిలోనే. యాపిల్స్, కమలా పళ్లు బాగా కనిపించాయి. ఇక్కడి కమలాలు భలే బాగున్నాయి రుచిలో. నిమ్మకాయ కన్నా కాస్త పెద్ద సైజులో ఉండే ఈ పండ్లే మా బ్రేక్‌ఫస్ట్ అక్కడున్నన్ని రోజులూ! కిర్గిజ్‌స్తాన్‌లో మరో ముఖ్యమైన కాపు వాల్‌నట్స్. ఇవి ఓష్‌బజార్‌లో రాశులు రాశులుగా కనిపిస్తాయి. బ్రౌన్ షెల్స్‌వే కాకుండా నాటుకోడి గుడ్డు పరిమాణంలో వైట్ షెల్స్‌తో కూడా ఉంటాయి.
వీటిని చాక్‌లెట్‌లో రోస్ట్ చేసి అమ్ముతారు. ఒలుచుకోవడానికి ఒక హుక్‌లాంటిదీ ఇస్తారు. వీటితోపాటు ఇంకెన్నో రకాల నట్స్, డ్రైఫ్రూట్స్ ఈ మార్కెట్‌లో లభ్యం. కానీ మన దగ్గరకన్నా వాల్‌నట్సే చాలా చవక. మంచి క్వాలిటీవి కూడా సగానికి సగం తక్కువ ధరకు దొరుకుతాయి. రష్యన్ బ్రెడ్‌ని ఇష్టపడేవాళ్లు ఇక్కడ దాన్ని ట్రై చేయొచ్చు. చాక్‌లెట్స్ కూడా ఫేమస్. వాటికీ ప్రత్యేక దుకాణ సముదాయముంది. ఇంకో విషయం.. ఇక్కడ సూపర్ మార్కెట్లలో లిక్కర్‌కీ ఒక సెక్షన్ ఉంటుంది. రకరకాల కిర్గిజ్, రష్యన్ వోడ్కా బ్రాండ్స్ కనిపిస్తుంటాయి.
"జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలు ప్రధానులుగా వాళ్ల వాళ్ల కాలాల్లో కిర్గిజ్‌స్తాన్‌ను సందర్శించారు. ఆయా సమయాల్లో అక్కడ పుట్టిన ఆడపిల్లలందరికీ ఇందిర అని పేరు పెట్టుకున్నారట. వాళ్లలో ఒకరు.. హయ్యర్ మెడికల్ డిగ్రీస్ పొందిన కిర్గిజ్‌స్తాన్ తొలి మహిళ.. డాక్టర్ ఖుదైబెర్జెనోవా ఇందిరా ఒరొజ్బేవ్నా. కిర్గిజ్‌స్తాన్ స్టేట్ మెడికల్ అకాడమీలో ఆంకాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఆ దేశాధ్యక్షుడి తర్వాత అన్ని అధికార లాంచనాలు అందుకునే రెండో వ్యక్తి ఆమే! ఇంకో విషయం ఇక్కడున్న మన ఎంబసీ వీథి పేరు మహాత్మా గాంధీ స్ట్రీట్".
మీడియా..
"ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంతో ఇక్కడ ప్రింట్ మీడియా అంతగా కనిపించదు. అందుకే ఎలక్ట్రానిక్ మీడియానే పాపులర్. ప్రభుత్వ చానెల్స్‌తోపాటు డజన్‌కి పైగా ప్రైవేట్‌వీ ఉన్నాయి. రష్యన్ చానెల్స్‌కే ఆడియన్స్ ఎక్కువ. ప్రైవేట్ ఎఫ్‌ఎమ్ రేడియో స్టేషన్లూ ఎక్కువే".
కిర్గిజ్‌స్తాన్..
"ఈ ముస్లిం నొమాడిక్ ల్యాండ్‌కి సెంట్రల్ ఆసియా స్విట్జర్లండ్‌గా పేరు. యూఎస్సెస్సార్ విచ్ఛిన్నం తర్వాత 1991లో స్వతంత్ర దేశంగా మారింది. టీయెన్ షాన్ పర్వత శ్రేణుల మధ్య ఒదిగి.. కజకిస్తాన్, చైనా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లతో సరిహద్దుల్ని పంచుకుంటుంది. ఎన్నో నాగరికతలకు కూడలిగా ఉన్న సిల్క్‌రూట్‌లో భాగం. సెక్యులర్ కంట్రీ. అధ్యక్ష్య తరహా ప్రజాస్వామ్యం. వ్యవసాయమే ప్రధానం. కెనాళ్లు, చెరువులు సాగుకు ఆధారం. పత్తి, మొక్కజొన్న, గోధుమలు, తృణధాన్యాలు ప్రధాన పంటలు. తేనెటీగలు, మల్బరీ తోటల పెంపకమూ కనిపిస్తుంది. వ్యవసాయం యంత్రాల సాయంతోనే! చిన్న కమతాల రైతులు మాత్రం గాడిదలు, గుర్రాలను ఉపయోగిస్తారు. బొగ్గు, బంగారం, కాటుకరాయి, పాదరసం గనులున్నాయి. కొంత మొత్తంలో పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నిల్వలూ ఉన్నాయి. మాంసం, పాల ఉత్పత్తులు, ఉన్ని ప్రధాన ఎగుమతులు. కరెన్సీ. సోమ్. జనాభా.. దాదాపు 67 లక్షలు. పురుషుల కన్నా మహిళలే అధికం".
14 క్యారెట్ గోల్డ్ జ్యూలరీ చూద్దామనే ఉత్సుకతతో ఒక రోజు ఆ షాపింగ్‌కీ వెళ్లాం. అదిరిపోయే డిజైన్స్ ఉన్నాయి కానీ చాలా కాస్టీ›్ల. అంత ధరపెట్టి 14 క్యారెట్ కొనేబదులు అదే ధరలో ఎంతొస్తే అంత 22 క్యారెట్ గోల్డే బెటర్ కదా అనే భారతీయ మనస్తత్వంతో కళ్లతోనే వాటిని ఆస్వాదించి వెనక్కి తిరిగొచ్చేశాం.
సెకండ్స్ ఎక్కువ..
ఇక్కడ సెకండ్ హ్యాండ్ మార్కెట్ చాలా పెద్దది. ఫోర్ వీలర్స్ అన్ని సెకండ్సే. అందుకే ప్రపంచంలోని అన్ని బ్రాండ్స్.. అన్నీ మోడల్స్ ఇక్కడ కనిపిస్తాయి. వీటి కోసం బిష్కేక్‌కి దగ్గర్లోనే దాదాపు 20 ఎకరాల్లో ఒక మార్కెట్ ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ స్టీరింగ్.. రెండూ ఉంటాయి. పర్వత ప్రాంతమవడం వల్లేమో రైల్వే కంటే రోడ్డు రవాణాయే ఎక్కువ. మన దగ్గర కనిపించే స్వరాజ్ మజ్దాలాంటి వాహనాన్ని మార్‌ష్రూత్కా అంటారిక్కడ.
ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌కి దాన్నే ఎక్కువగా వాడతారు. మనకు ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉన్నట్టుగా ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులుంటాయి. వాటిని ట్రామ్స్ అంటారు. వీటికి రోడ్డు మీద పట్టాలేం ఉండవు. పైన కరెంట్ తీగతో పవర్ జనరేట్ అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఫ్రీ ఏం కాదు కానీ ధర చాలా చాలా తక్కువ. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ ధర కాస్త ఎక్కువే. ట్రాఫిక్ చాలానే ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు కనిపించరు. అయినా ట్రాఫిక్ ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. అత్యంత అవసరమైతే తప్ప హాంకింగ్ చేయకూడదు. ఫోన్లు కూడా సెకండ్ హ్యాండ్సే అధికం.. బ్రాండ్ న్యూ ఫోన్లు ఉన్నా! ఐఫోన్ వాడకం ఎక్కువ. బ్రాండ్ న్యూ హై ఎండ్ ఫోన్లు డ్యూటీ ఫ్రీతో మన దేశంలో కన్నా గణనీయమైన తక్కువ ధరకు లభిస్తాయి.
నాడీ పట్టుకున్నారు..
"కిర్గిజ్‌స్తాన్‌లోని బిష్కేక్, ఇసిక్ కుల్ లాంటి చోట్ల భారతీయవిద్యార్థులు అందులో తెలుగు వాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు. కారణం.. మెడిసిన్. అవును ఈ దేశం వైద్యవిద్యకు హబ్‌గా మారింది. ఇది ప్రైవేట్ రంగాలకిస్తున్న ప్రోత్సాహాన్ని గ్రహించి.. రష్యాలో మెడిసిన్ చదివిన కొత్తగూడెం వాసి డాక్టర్ పి. ఫణిభూషణ్ 20 ఏళ్ల కిందటే ఇక్కడ ఐఎస్‌హెచ్‌ఎమ్ (ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్)ను స్థాపించాడు.
ఈ ప్రైవేట్ యూనివర్సిటీకొస్తున్న రెస్పాన్స్ చూసి ఇక్కడి ఐకే అకున్‌బేవ్ కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ (కేఎస్‌ఎమ్‌ఏ) ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఈ సంస్థకు తమ యూనివర్సిటీలో అఫిలియేషన్ ఇచ్చింది. ఐఎస్‌ఎమ్ ఎడ్యుటెక్ అనే కన్సల్టెన్సీ ద్వారా మన తెలుగు స్టూడెంట్స్ ఎందరికో కేఎస్‌ఎమ్‌ఏలో అడ్మిషన్స్ ఇప్పించి.. వాళ్ల వైద్యవిద్య కలను సాకారం చేస్తున్నారు డాక్టర్ ఫణిభూషణ్. ఈ రెండు యూనివర్సిటీల్లో దాదపు రెండువేలకు పైగా తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్లలో అమ్మాయిలే ఎక్కువ. ఎందుకంటే ఇది అమ్మాయిలకు సురక్షిత దేశం కాబట్టి. ఇక్కడా మెడిసిన్ అయిదున్నరేళ్లే! ఇంగ్లిష్‌లోనే బోధన సాగుతుంది.
చక్కటి ఫ్యాకల్టీ, హాస్టల్ సదుపాయాలున్నాయి. ఆసియాలోనే అతి పెద్ద అనాటమీ ల్యాబ్స్‌లలో ఒకటి కేఎస్‌ఎమ్‌ఏలో ఉంది. కమ్యూనికేషన్‌కి ఫారిన్ స్టూడెంట్స్ ఇబ్బందిపడకూడదని కిర్గిజ్, రష్యన్ భాషలనూ నేర్పిస్తారు. శారీరక దృఢత్వం, క్రమశిక్షణ కోసం పీఈటీ కూడా ఉంటుంది. ఇది అకడమిక్స్‌లో భాగం. వారానికి రెండుసార్లు ఇండియన్ ఫ్యాకల్టీతోనూ క్లాస్‌లుంటాయి. ఫారిన్‌లో మెడిసిన్ పూర్తిచేసుకున్న స్టూడెంట్స్‌కి ఇండియాలో పెట్టే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ (ఎఫ్‌ఎమ్‌జీఈ) కోసమూ ఇక్కడ ప్రత్యేక శిక్షణనిస్తారు.
అయితే కిర్గిజ్‌స్తాన్‌లో మెడిసిన్ చదవడానికి మన నీట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ‘ఇండియాలో మెడికల్ సీట్లు తక్కువ. కాంపీటిషన్ చాలా ఎక్కువ. ఎంత కష్టపడ్డా మంచి కాలేజ్‌లో సీట్ దొరకదు. ‘బీ’ కేటగరీ సీట్‌కి కనీసం కోటి రూపాయలుండాలి. అంతే ఫెసిలిటీస్.. అంతే మంచి ఫ్యాకల్టీతో ఇక్కడ 35 లక్షల్లో మెడిసిన్ అయిపోతుంది. అదీగాక మంచి ఎక్స్‌పోజర్ వస్తోంది’ అని చెబుతున్నారు అక్కడి మన తెలుగు విద్యార్థులు.
‘పిల్లల్ని మెడిసిన్ చదివించడానికి ఆస్తులు తాకట్టుపెట్టిన పేరెంట్స్‌ని చూశాను. డెడికేషన్ ఉన్న స్టూడెంట్స్‌కి మెడిసిన్ అందని ద్రాక్ష కాకూడదని, తక్కువ ఖర్చుతో క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్‌ని అందించాలనే సంకల్పంతో ఈ సంస్థను స్టార్ట్ చేశాం. అంతేకాదు యాక్టర్ సోనూ సూద్ సహకారంతో ఫీజులు కట్టలేని నీట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్‌ని మా కాలేజెస్‌లో ఫ్రీగా చదివిస్తున్నాం’ అని చెప్పారు డాక్టర్ ఫణిభూషణ్".
- డాక్టర్ ఫణిభూషణ్
విద్య, వైద్యం ఫ్రీ..
ఇందాకే ప్రస్తావించుకున్నట్టు మౌలిక సదుపాయాల విషయంలో ఈ దేశం ఇంకా కమ్యూనిజం విలువలనే పాటిస్తోంది.. విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ! ప్రైవేట్ బడులు, ఆసుపత్రులు లేవని కాదు.. చాలా చాలా తక్కువ. చదువు విషయంలో ఇంగ్లిష్ మీడియం కావాలనుకునే వాళ్లే ప్రైవేట్ బడులకు వెళ్తారు. అయితే ఈ బడుల్లో కూడా కిర్గిజ్, రష్యన్ నేర్పిస్తారు. ఆటలంటే ప్రాణం పెడతారు.
ప్రతి విద్యార్థి ఆటల్లో పాల్గొనాల్సిందే! పాఠశాల విద్య నుంచి ప్రొఫెషనల్ కోర్స్ మెడిసిన్ దాకా ఆటలనూ అకడమిక్స్‌గానే పరిగణిస్తారు. పాఠ్యాంశాలతోపాటు పీఈటీకీ మార్కులుంటాయి. అథ్లెటిక్స్, వాలీబాల్ ఎక్కువ. బిష్కేక్‌లోని పార్క్స్, గ్రౌండ్స్‌లో అథ్లెట్స్ ప్రాక్టిస్ చేస్తూ కనపడ్తారు. లెవెంత్ క్లాస్ తర్వాత ప్రతి విద్యార్థి సైన్యంలో శిక్షణ తీసుకోవాలి. ప్రతి శని, ఆదివారాలు స్కూల్ పిల్లలు నగర వీథులను శుభ్రం చేయాలి. మొక్కలు నాటాలి. నీళ్లు పోయాలి. ప్రభుత్వాసుపత్రులైతే ఆధునిక సదుపాయాలతో ప్రైవేట్ ఆసుపత్రులను తలదన్నేలా ఉంటాయి.
జీరో క్రైమ్.. నో డొమెస్టిక్ వయొలెన్స్!
బిష్కేక్‌లో మేం తిరిగిన ప్రాంతాల్లో ఎక్కడా మాకు పోలీస్ స్టేషన్లు కనించలేదు. ఆశ్చర్యపోతూ మేం తిరిగిన మార్‌ష్రూత్కా డ్రైవర్లను అడిగితే.. నవ్వుతూ ‘ఉంటాయి కానీ మా దగ్గర క్రైమ్ చాలా తక్కువ. దాదాపు జీరో అని చెప్పుకోవచ్చు’ అన్నారు. డొమెస్టిక్ట్ వయొలెన్స్‌కీ తావులేదు. ఇక్కడ ఇంటికి యజమానురాలు మహిళే. ఆర్థిక వ్యవహారాల దగ్గర్నుంచి అన్నిటినీ ఆమే చూసుకుంటుంది. లీడ్‌లోనే చెప్పుకున్నట్టు మహిళలను గౌరవించే దేశం. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్.. అన్నిట్లో మహిళలే ఎక్కువ. ట్రక్‌ని డ్రైవ్ చేస్తూ.. సంస్థల్లో ఫ్రంట్ ఆఫీస్ నుంచి మేనేజర్లు.. ఆంట్రప్రన్యూర్స్ దాకా.. లాయర్లుగా.. డాక్టర్లుగా.. ఇలా ప్రతిచోటా మహిళలే ఎక్కువగా కనిపిస్తారు.
అల అర్చా నేషనల్ పార్క్
విమెన్స్ డే జాతీయ పండగే..
కిర్గిజ్ ప్రజలు మహిళలకు ఎంత విలువిస్తారో చెప్పడానికి ఇక్కడ జరిగే విమెన్స్ డే సెలబ్రేషనే ప్రత్యక్ష్య ఉదాహరణ. దాన్నో జాతీయ పండగలా నిర్వహిస్తారు. ఆ రోజు మగవాళ్లందరూ గిఫ్ట్స్‌తో తమ ఇంట్లో.. తమ జీవితంలోని స్త్రీలకు గ్రీటింగ్స్ చెప్తారు. తమ మనసుల్లో వాళ్లకున్న చోటు గురించి కవితలల్లి వినిపిస్తారు. మేం వెళ్లింది విమెన్స్ డే అయిన వారానికే కాబట్టి బిష్కేక్‌లో ఇంకా ఆ సంబరం కనిపించింది.. సిల్వర్, 14 క్యారెట్ గోల్డ్ మార్కెట్లలో విమెన్స్ డే స్పెషల్ కలెక్షన్స్‌తో! దీని ప్రభావం కిర్గిజ్‌స్తాన్‌లో మెడిసిన్ చదువుకుంటున్న మన తెలుగు విద్యార్థుల మీదా కనిపించింది.. వాళ్లు చదువుకుంటున్న కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ (కిర్గిస్తాన్ ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయం)కి వెళ్లినప్పుడు! వాళ్ల క్లాస్ రూమ్స్ కారిడార్ వాల్స్ మీద రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ అతికించి ఉన్నాయి.
ఆ కాలేజ్‌లోని ప్రతి అబ్బాయి వాళ్లమ్మ .. అమ్మమ్మ.. నానమ్మ.. అత్త.. పిన్ని.. అక్క.. చెల్లి.. టీచర్.. ఫ్రెండ్.. ఇలా వాళ్లకు సంబంధించిన .. వాళ్లకు పరిచయమున్న మహిళలు.. అమ్మాయిల గురించి ఆ గ్రీటింగ్ కార్డ్స్ మీద రాసి తమకు వాళ్ల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అమ్మాయిలను తమకు ఈక్వల్‌గా ట్రీట్ చేయాలని కిర్గిజ్‌స్తాన్ కల్చర్‌ని చూసి నేర్చుకుంటున్నామని చెప్పారు భారతీయ విద్యార్థులు.
యర్త్ హోమ్స్
సిటీ ఆఫ్ గార్డెన్స్..
బిష్కేక్‌లో ఎటుచూసినా విశాలమైన గార్డెన్లు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. మేం వెళ్లినప్పుడు స్ప్రింగ్ సీజన్‌కి ముస్తాబవుతున్నాయి. వింటర్ అయిపోయే సమయంలో మట్టి తవ్వి.. కొత్త మట్టి వేసి.. కొత్త మొక్కల్ని నాటుతారట. మాకు ఆ దృశ్యాలే కనిపించాయి. స్ప్రింగ్ టైమ్‌లో ఈ కొత్త మొక్కలన్నీ రకరకాల పూలతో వసంత శోభను సంతరించుకుంటాయి. అసలు కిర్గిజ్‌స్తాన్‌ని స్ప్రింగ్ సీజన్‌లోనే చూడాలని స్థానికుల మాట. తోటల్లోనే కాదు.. కొండలు .. లోయల్లో కూడా మంచంతా కరిగి.. మొక్కలు మొలిచి.. రకారకాల ఆకులు.. పూలతో కొత్త అందం పరచుకుంటుంది. అందుకే ఆ టైమ్‌లోనే పర్యాటకుల సందడెక్కువ.
సిటీ స్క్వేర్..
ఒక పూటంతా బిష్కేక్ సిటీ స్క్వేర్‌లో గడిపాం. మార్చి 21.. కిర్గిజ్‌స్తా¯Œ కొత్త సంవత్సరం నూరోజ్ పండగ. మేం అక్కడికి వెళ్లేప్పటికి ఆ వేడుక కోసం పిల్లలంతా జానపద నృత్యాలు.. పాటలతో రిహార్సల్స్ చేసుకుంటూ కనిపించారు.. కిర్గిజ్‌స్తాన్ ఎపిక్ హీరో మనాస్ విగ్రహం ముందు. పదిలక్షలకు పైగా పద్యాలతో ఉన్న ఈ మనాస్ కావ్యం కిర్గిజ్ ప్రజల చరిత్ర, సంస్కృతి, ఫిలాసఫీని అభివర్ణిస్తుంది.
ఇది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద కావ్యంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ కింద దీని సంరక్షణ బాధ్యతను యునెస్కో తీసుకుంది. అంతటి ప్రాశస్త్యమున్న మనాస్ విగ్రహానికి పక్కనే కొంచెం దూరంలో ఆ దేశ పార్లమెంట్ ఉంటుంది. విశాలమైన రోడ్లు.. వాటికి ఆనుకుని గార్డెన్లు.. పాత్‌వేలతో ఎక్కడో యూరప్‌లోని దేశంలో ఉన్నట్లు అనిపిస్తుంది. నూరోజ్ కోసం బిష్కేక్ ప్రత్యేకంగా ముస్తాబవుతుందట. యర్త్ హోమ్‌లు.. హస్తకళల ఎగ్జిబిషన్స్ జరుగుతాయి. ఆ సన్నాహాలు కనిపించాయి.
వరల్డ్ నొమాడిక్ గేమ్స్ వేడుకలు
ఇసిక్ కుల్ సాల్ట్ లేక్..
ఒకరోజు బిష్కేక్‌కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల అర్చా వెళ్లాం. అ ్చ అటఛిజ్చి అంటే రంగురంగుల జూనపర్ చెట్లు అని అర్థం. రకరకాల పక్షులు, అడవి మేకలు, జింకలు, కొమ్ముల మేకలు, తోడేళ్లకు నిలయం ఈ ప్రాంతం. ఇక్కడున్న నేషనల్ పార్క్ చూడదగ్గది. మంచు కొండల మీద ట్రెకింగ్, పైన్ చెట్లు.. వాటర్ ఫాల్స్, టీయెన్ షాన్ శ్రేణుల నుంచి పారే నదులు.. నిజంగానే స్విట్జర్లండ్‌లో ఉన్నామేమో అనే భ్రమను కల్పిస్తుంది.
అన్నిటికీ మించి ఇక్కడి స్వచ్ఛమైన గాలి.. ఓహ్.. అనుకుంటాం గానీ పాడు చలి చంపేస్తుంది. పార్క్ ఎంట్రెన్స్ నుంచి మంచులో దాదాపు మూడు గంటలకు పైగా నడిస్తే గానీ నదీ తీరానికి వెళ్లలేం. ఆ తీరం వెంట ఇంకాస్త ముందుకు వెళితే వాటర్‌ఫాల్స్. అలాగే మరికాస్త వెళితే అక్ సై హిమానీ నదం. ఇది అద్భుతమని చెబుతుంటారు స్థానికులు. అక్కడ నైట్ క్యాంప్ వేసుకోవచ్చట.
ఇసిక్ కూల్ లేక్
కానీ మైనస్ డిగ్రీల టెంపరేచర్‌లో మాకు అర కిలోమీటర్ నడిచేసరికే కాళ్లు, చేతులు కొంకర్లు పోయి.. ముక్కు, పెదవులు పగిలి.. మాట మొద్దు బారిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. అలాగని అక్కడే ఉండి పక్షుల కిలకిలారావాలు.. పైన్ చెట్ల తోపులను ఆస్వాదించలేకపోయాం ఇది ప్రొఫెషనల్ ట్రెకర్స్‌కే సాధ్యమని జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ తిరిగొచ్చి మార్‌ష్రూత్కాలో కూలబడ్డాం. అందులోని హీటర్‌కి చలికాచుకున్నాం.
మా చలివణుకు చూసి డ్రైవర్లు ఒకటే నవ్వులు. ఇంకోరోజు ఇసిక్ కుల్‌కి ప్రయాణమయ్యాం. బిష్కేక్ నుంచి ఇది దాదాపు 260 కిలోమీటర్లు. సూర్యోదయానికి ముందే స్టార్ట్ అయ్యాం. దార్లో సిల్క్‌రూట్ టచ్ అవుతుంది కిర్గిజ్‌స్తాన్ – కజకిస్తాన్ బార్డర్‌లో. మసక చీకటి.. మంచు.. మార్‌ష్రూత్కా విండో గ్లాసెస్ మీది ఫాగ్ తుడుచుకుని.. కళ్లు చిట్లించుకున్నా బయటి దృశ్యం స్పష్టంగా లేదు. వెహికిల్ ఆపడానికి లేదు. వచ్చేప్పుడు చూడొచ్చులే అనుకున్నాం. వచ్చేప్పుడూ సేమ్ సీన్. రాత్రి.. చీకటి.. మంచు అయితే ఇసిక్ కుల్ సాల్ట్ లేక్ ఆ నిరాశను కాస్త మరిపించింది.
కాస్పియన్‌సీ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సరస్సుగా.. టిటీకాకా తర్వాత రెండవ అతిపెద్ద మౌంటెన్ లేక్ సరస్సుగా పేరుగాంచిందీ భూతల స్వర్గం. ఆకాశాన్ని అంటుతున్నట్టు కనిపించే మంచు పర్వతాల ఒడిలో నింగి నీలంతో.. చల్లదనంలో ఆ హిమ గిరులతో పోటీ పడుతూ నా ఊహల్లోని మానస సరోవరానికి కవలగా కనపడింది. మైనస్‌లోకి పడిపోయే టెంపరేచర్లోనూ ఇది గడ్డకట్టదు. ఈ లేక్‌లో బోటింగ్ కూడా ఉంటుంది. దీనికి విశాలమైన ఇసుక బీచ్ ఉంటుంది. ప్రతి సెప్టెంబర్‌లో ఇక్కడ వరల్డ్ నొమాడిక్ గేమ్స్ జరుగుతాయి. దీన్ని 2014లో కిర్గిజ్‌స్తానే ప్రారంభించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంచార ప్రజల సంస్కృతీసంప్రదాయల పునరుద్ధరణ, సంరక్షణతోపాటు.. ఈ గేమ్స్‌లో పాల్గొంటున్న దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో! మొదటి సంవత్సరం ఇందులో 19 దేశాలు పాల్గొంటే 2018 కల్లా 66 దేశాల నుంచి 1500 మంది పాల్గొన్నారు. ఇవి ఒక్క క్రీడాకారులనే కాదు పలురంగాల్లోని కళాకారులందరినీ ఏకం చేస్తోంది. ఈ సంబరాల్లో ఒక్క ఆటలే కాదు.. కిర్గిజ్‌స్తాన్ కల్చర్, ఫుడ్, ఆర్ట్స్, షాప్స్ అన్నీ తరలి వస్తాయి.
వందల సంఖ్యలో యర్త్ హోమ్స్ వెలసి.. ప్రపంచ అతిథులకు ఆతిథ్యాన్నిస్తాయి. ఆ సమయంలో ఇసిక్ కుల్‌లో ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారట. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవకూడని ఈవెంట్ ఇదని స్థానికులు అంటారు. ఇసిక్ కుల్ నుంచి వచ్చాక ఒకరోజు బిష్కేక్ పొలిమేరలో పౌల్ట్రీ, డెయిరీ ఫామ్ నడిపిస్తున్న ఓ రష్యన్ ఫ్యామిలీ దగ్గరకు వెళ్లాం. అతని పేరు దినేశ్. అరే.. ఇండియన్ నేమ్ అని మేం ఆశ్చర్యపోతుంటే.. అతను నవ్వి.. యూఎస్సెస్సార్‌లో బాలీవుడ్‌కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఆ ప్రభావంతోనేమో తనకు దినేశ్ అనే పేరుపెట్టారని చెప్పాడు.
నిజమే అక్కడ మాకు కుమార్ అనే పేరూ కామన్‌గా వినిపించింది. బిష్కేక్‌లో మెడికల్ కాలేజ్ అనుబంధ హాస్టల్స్‌లో ఉండి చదువుతున్న భారతీయ వైద్యవిద్యార్థుల కోసం పాలు, చికెన్, కూరగాయలను సప్లయ్ చేయడం కోసమే తను ప్రత్యేకంగా డెయిరీ, పౌల్ట్రీ ఫామ్‌లను నడుపుతున్నాని, కూరగాయలను సాగు చేస్తున్నాని చెప్పాడు దినేశ్.
వరల్డ్ నొమాడిక్ గేమ్స్
మిస్సింగ్..
ఉన్న వారంలో చలి.. ఎండ.. వాన మూడు కాలాలనూ చూపించింది కిర్గిజ్‌స్తాన్. ఎండ, వాన ఉన్నా చలి కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ వెదర్.. చిన్నపిల్లలమైపోయి మంచులో ఆటలు.. స్కీయింగ్, రోప్ వే సాహసాలు.. కిర్గిజ్, రష్యన్ మాటల్ని నేర్చుకోవడం.. వాళ్ల క్రమశిక్షణకు అబ్బురపడటం.. ఆ ప్రశాంతతను ఆస్వాదించడం.. ఉన్నదాంట్లో తృప్తిపడుతున్న వాళ్ల నైజానికి ఇన్‌స్పైర్ అవడం.. అక్కడి ఆడవాళ్ల సాధికారతకు గర్వడటం.. మొత్తంగా కిర్గిజ్‌స్తాన్ మీద బోలెడంత గౌరవంతో తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం! కానీ ఒక్క అసంతృప్తి మిగిలిపోయింది.
జమీల్యా, తొలి ఉపాధ్యాయుడు వంటి ఎన్నో పుస్తకాలతో ఎప్పుడో కిర్గిజ్‌స్తాన్‌ని పరిచయం చేసిన చెంఘిజ్ ఐత్మతోవ్‌ని కలిపే ఆయన మ్యూజియాన్ని చూడలేపోయామని! బిష్కేక్‌లో ఉందా మ్యూజియం. దాంతోపాటు కిర్గిజ్‌స్తాన్ హిస్టరీ అండ్ ఆర్ట్స్‌కి సంబంధించిన మ్యూజియమూ ఉంది. ఇదీ చూడలేదు.. సమయాభావం వల్ల! ఐత్మతోవ్ పుట్టిన నేల మీద నడయాడమన్న కాస్త ఊరటతో కిర్గిజ్‌స్తాన్‌కి సలామత్ బొలుప్ జక్ష్య (ఇప్పటికి వీడ్కోలు)! ఎప్పుడైనా స్ప్రింగ్‌లో ఒకసారి కిర్గిజ్‌స్తాన్‌ను చూసి.. ఐత్మతోవ్‌ని పలకరించాలని ఆశ! రహమత్ .. స్పసీబా.. థాంక్యూ!
— శరాది
Comments
Please login to add a commentAdd a comment