త్రేతాయుగారంభంలో మద్ర దేశంలోని శాకల నగరంలో సుధర్ముడనే వర్తకుడు ఉండేవాడు. అతడు గొప్ప ధనికుడు, ధార్మికుడు. ఒకనాడు అతడు వ్యాపారం కోసం విలువైన వస్తువులు తీసుకుని సురాష్ట్రానికి బయలుదేరాడు. సుధర్ముడు రాత్రివేళ ఎడారి మార్గంలో ప్రయాణిస్తుండగా, కొందరు బందిపోటు దొంగలు అతణ్ణి అడ్డగించి, అతడి వద్దనున్న వస్తువులన్నీ దోచుకుపోయారు.
ఉన్నదంతా దొంగలు ఊడ్చుకుపోవడంతో సుధర్ముడు ఆ ఎడారి మార్గంలో దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా మిగిలాడు. నిస్సహాయుడిగా ఎడారిమార్గంలో పిచ్చివాడిలా తిరగసాగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ మర్నాటి ఉదయానికి ఎడారిని దాటుకుని, ఒక అడవికి చేరుకున్నాడు. ఆకలితో శక్తినశించి ఉండటంతో అడవిలోని ఒక జమ్మిచెట్టు కింద కూలబడ్డాడు.
నీరసంతో అతడు ఆ చెట్టు కిందనే నిద్రపోయాడు. సాయంత్రం చీకటి పడుతుండగా మెలకువ వచ్చింది. బడలిక తీరడంతో నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. ఎదురుగా వందలాది ప్రేతాలతో కలసి ఉన్న ప్రేతనాయకుడు కనిపించాడు. సుధర్మడికి భయం, ఆశ్చర్యం కలిగాయి. ఎక్కడెక్కిడి నుంచో వచ్చిన ప్రేతాలు ఆ ప్రేతనాయకుడి చుట్టూ కూర్చున్నాయి. సుధర్ముడు ఆశ్చర్యంగా ఆ ప్రేతనాయకుడినే చూస్తూ ఉండిపోయాడు.
తననే గమనిస్తున్న సుధర్ముడిని చూసిన ప్రేతనాయకుడు, అతడికి స్వాగతపూర్వకంగా నమస్కారం చేశాడు. దాంతో సుధర్ముడికి భయం పోయి, నెమ్మదిగా ప్రేతనాయకుడితో స్నేహం చేశాడు. ప్రేతనాయకుడు సుధర్ముడిని ‘నువ్వెవరివి? చూడటానికి సౌమ్యుడిలా కనిపిస్తున్నావు. ఎక్కడి నుంచి ఈ అడవికి ఒంటరిగా వచ్చావు? నీకేమైనా కష్టం కలిగిందా? చెప్పు’ అని అడిగాడు. ప్రేతనాయకుడు అలా ఆదరంగా అడగటంతో సుధర్ముడు కంటతడి పెట్టుకుని, తన కష్టాన్నంతా దొంగలు దోచుకుపోయారని, ఇప్పుడు తనకు దిక్కులేదని బాధపడ్డాడు.
ప్రేతనాయకుడు సుధర్ముణ్ణి ఓదార్చారు. ‘మిత్రమా! కాలం కలసిరానప్పుడు ఇలాంటి దుస్సంఘటనలు జరుగుతుంటాయి. ధైర్యం తెచ్చుకో! తిండి మానేసి శరీరాన్ని శుష్కింపజేసుకోకు. ముందు దిగులుపడటం మానేయి. కాలం నీకు మళ్లీ అనుకూలిస్తుంది’ అని ధైర్యం చెప్పాడు. తర్వాత తన సహచర ప్రేతాలకు సుధర్ముడిని పరిచయం చేస్తూ, ‘మిత్రులారా! ఇతడు సుధర్ముడు. ఈనాటి నుంచి నాకు మిత్రుడు. అందువల్ల మీకు కూడా మిత్రుడే!’ అని పరిచయం చేశాడు.
అంతలోనే అక్కడకు గాల్లోంచి ఒక మట్టికుండ పెరుగన్నంతో వచ్చి నిలిచింది. అలాగే మరో కుండ మంచినీళ్లతో వచ్చింది. వాటిని చూసి ప్రేతనాయకుడు ‘లే మిత్రమా! స్నానాదికాలు పూర్తి చేసుకుని, ముందు భోంచేయి.’ అన్నాడు. సుధర్ముడు స్నానం చేసి వచ్చి, ప్రేతనాయకుడు, అతడి సహచర ప్రేతాలతో కలసి పెరుగన్నం తిన్నాడు. వారి భోజనం పూర్తి కాగానే రెండు కుండలూ అదృశ్యమైపోయాయి. తర్వాత ప్రేతనాయకుడికి వీడ్కోలు పలికి మిగిలిన ప్రేతాలు కూడా అదృశ్యమైపోయాయి.
ఇదంతా సుధర్ముడికి ఆశ్చర్యకరంగా అనిపించింది. ‘మిత్రమా! ఈ నిర్జనారణ్యంలోకి అమృతంలాంటి పెరుగన్నాన్ని, చల్లని మంచినీళ్లను ఎవరు పంపారు? నీ సహచర ప్రేతాలెవరు? ఇంతకూ నువ్వెరివి?’ అని ప్రశ్నలు కురిపించాడు.
‘సుధర్మా! గత జన్మలో నేను శాకల నగరంలో సోమశర్మ అనే విప్రుణ్ణి. నా వద్ద పుష్కలంగా సంపద ఉన్నా, ఎన్నడూ ధర్మకార్యాలు చేసి ఎరుగను. పరమ పిసినారిగా బతికేవాణ్ణి. నా పొరుగునే సోమశ్రవుడనే వైశ్యుడు ఉండేవాడు. దాదాపు నా వయసు వాడే కావడంతో చిన్ననాటి నుంచి అతడితో స్నేహం ఏర్పడింది. అతడు భాగవతోత్తముడు, ధార్మికుడు. అతడి దానధర్మాలు చూసినా, నాలో మార్పు రాలేదు. చాలాకాలం గడిచాక ఇద్దరమూ వార్ధక్యానికి దగ్గరయ్యాం.
ఒకనాడు భాద్రపద ద్వాదశినాడు పర్వస్నానం కోసం నా వైశ్యమిత్రుడితో కలసి ఐరావతి, నడ్వా నదుల సంగమ స్థలానికి వెళ్లాను. సంగమ స్నానం చేసిన రోజున నేను పవిత్రంగా ఉపవాసం ఉన్నాను. అక్కడే స్నానానికి వచ్చిన విప్రోత్తముణ్ణి పిలిచి, అతడికి ఒక కుండలో తియ్యని పెరుగన్నాన్ని, మరో కుండలో చల్లని నీళ్లను, గొడుగును, పాదరక్షలను దానంగా ఇచ్చాను. నా జన్మలో నేను చేసిన దానం అదొక్కటే! తర్వాత ఆయువు ముగిసి, మరణించాక నేను ప్రేతాన్నయ్యాను.
ఆనాడు ఆ విప్రుడికి దానం చేసిన అన్నమే అక్షయంగా మారింది. ప్రతిరోజూ మధ్యాహ్నం పెరుగున్నం కుండ, నీటి కుండ ఇక్కడకు వస్తాయి. మేమంతా భోజనం ముగించగానే అదృశ్యమవుతాయి. అతడికి ఇచ్చిన గొడుగు ఇప్పుడు జమ్మిచెట్టుగా మారి, నాకు, నా సహచరులకు నీడనిస్తోంది’ అని చెప్పాడు ప్రేతనాయకుడు.
‘మిత్రమా! నీ చరిత్ర ఎంతో గొప్పగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలో, నాకు దారేదో చెప్పు?’ అన్నాడు సుధర్ముడు.
‘మిత్రమా! బాధ్రపద శ్రావణ నక్షత్రయుత ద్వాదశీ వ్రతాన్ని ఆచరించు. నీకు శుభాలు కలుగుతాయి. అయితే, నాదొక కోరిక. నాకు, నా సహచర ప్రేతాలకు గయ క్షేత్రంలో పిండప్రదానాలు చేయి. నువ్వు పిండదానం చేస్తే, మాకు పిశాచరూపాల నుంచి విముక్తి దొరుకుతుంది’ అని చెప్పి ప్రేతనాయకుడు సుధర్ముణ్ణి తన భుజాలపై కూర్చోబెట్టుకుని, అడవిని దాటించి శూరసేన రాజ్యలో విడిచిపెట్టాడు.
సుధర్ముడు శూరసేన రాజ్యంలో మెల్లగా చిన్న చిన్న వ్యాపారాలు చేసి, కాలక్రమంలో పెద్ద వర్తకుడిగా ఎదిగాడు. ప్రేతనాయకుడు చెప్పినట్లుగానే భాద్రపద ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు. గయ క్షేత్రానికి వెళ్లి ప్రేతనాయకుడికి, అతడి ప్రేతపరివారానికి శాస్త్రోక్తంగా పిండప్రదానాలు చేశాడు. వారితో పాటే తన పితరులకు, బంధువులకు పిండప్రదానాలు చేశాడు. సుధర్ముడు పిండప్రదానాలు చేయగానే ప్రేతనాయకుడు, అతడి సహచరప్రేతాలు దివ్యలోకాలకు వెళ్లిపోయారు. – సాంఖ్యాయన
ఇవి చదవండి: అద్వైత: బజ్ మంటున్న అలారం శబ్దానికి?
Comments
Please login to add a commentAdd a comment