మధిర టు తిరుపతి.. ‘సారూ.. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!' | Madhira To Tirupati Story Writer Bijivemula Ramanareddy Funday Sunday Story | Sakshi
Sakshi News home page

మధిర టు తిరుపతి.. ‘సారూ.. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!'

Published Sun, May 5 2024 10:59 AM | Last Updated on Sun, May 5 2024 10:59 AM

Madhira To Tirupati Story Writer Bijivemula Ramanareddy Funday Sunday Story

‘సారూ..’ అన్న శబ్దం నా చెవి గూబను కాస్త గట్టిగానే చరిచింది. నా భార్యతో మాటలకు మధ్యలో కామా పెట్టి, ఎవరాని అటు దిరిగి చూశాను. వయస్సు అర్ధసెంచరీకి అవతలిగట్టు. అరవై ఏళ్లవరకూ ఉండొచ్చు. మాసిన చొక్కాకు అక్కడక్కడా చిన్నపాటి చిరుగులు. కింద లుంగీ.. ఇంకొంచెం పెద్ద చిరుగులతో చొక్కాను డామినేట్‌ చేస్తోంది. నెత్తిన జుట్టు దుమ్మును పులుముకొని చిందరవందరగా వుంది. కుడికాలికి పిక్క మునిగే వరకు కట్టు. కట్టుకట్టి చాలారోజులైందన్నట్టు తెల్లటి కట్టు మట్టి పులుముకొని కనిపించింది. మనిషిని చుట్టుముట్టిన పేదరికం ఛాయలు.

‘ఏంటన్నట్లు?’ అతనివైపు చూశాను.
      ‘సారూ.. నేను హైదరాబాద్‌కు పొయ్యే రైలెక్కాలి. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!’ బతిమిలాడుతున్నట్లు మాట, అభినయం. 
‘సరే చెబుతా! అక్కడ కూర్చోనుండు’ పక్కనే ఉన్న అరుగు చూపించి అన్నాను.
      ‘మర్చిపోవద్దు సారూ.. నీ కాళ్లు మొక్కుతా’ అంటూ మరింత దగ్గరగా వచ్చి నా కాళ్లపైకి వంగాడు.
అతన్నుంచి జారి మందు వాసన నా ముక్కు పుటాలను తాకింది.
ముఖం చిట్లించి ‘చెప్పాను కదా.. అక్కడ కూర్చో, రైలొచ్చినప్పుడు చెబుతా’ కాస్త విసుగ్గా అన్నాను.
‘గట్లనే సారూ ..’ రెండడుగులు వెనక్కువేసి నిలుచున్నాడు.

నేను, నా భార్య హైదరాబాద్‌ వెళ్లేందుకు బాపట్ల రైల్వేస్టేషన్‌ లో రైలు కోసం వెయిట్‌ చేస్తున్నాము. మా కూతురు, అల్లుడు హైదరాబాదులో కాపురంపెట్టి నెలన్నర. ప్రసవం పూర్తయి బిడ్డకు జన్మనిచ్చాక అయిదవ నెల వచ్చేవరకు కూతురు గాయత్రి మాతోనే ఉంది. అప్పటికే మనవడు గిర్వాన్‌ కాస్త వొళ్లుచేశాడు.  కాళ్లు, చేతులు హుషారుగా ఆడించడం, కనుగుడ్లు పెద్దవిచేసి చూడడం, బోర్లా తిరగడం, మనం నవ్వితే.. నిశితంగా పరిశీలించి నవ్వడం, హెచ్చరికలకు స్పందించడం మొదలు పెట్టాడు.

మనవడి మురిపెంలో అయిదు నెలలు అయిదు రోజుల్లా గడిచాయి. అల్లుడిది ప్రైౖవేటు కంపెనీలో ఉద్యోగం. తానెలాగోలా బాబును సగదీరుకుంటానని చెప్పి కూతురు హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. మనవడి  జ్ఞాపకాలు మరువలేక బుడ్డోన్ని చూడాలని నా శ్రీమతి తహతహలాడిపోయింది. నాకూ కాస్త అలానే ఉన్నా బయటపడలేని స్థితప్రజ్ఞత.

ఇంతలో ఆరవనెల అన్నప్రాశన అని కూతురు కబురుపెట్టింది. కాగలకార్యం కాలం తీర్చినట్లు హైదరాబాద్‌ ప్రయాణం ఖరారైంది. రాత్రి పది గంటలకు సింహపురి ట్రైన్‌ లో ప్రయాణం. మనవడి కోసం బట్టలు, పెద్ద దోమతెరతో పాటు ఏమేమి తీసుకురావాలో కూతురు రెండు రోజులుగా పదేపదే లిస్ట్‌ చదివింది. నా శ్రీమతి.. కూతురు వద్దన్న వాటిని కూడా బ్యాగుల్లో బలవంతంగా కూర్చి ఉరువుల సంఖ్యను అయిదుకు పెంచింది.

‘బయలుదేరేటప్పుడు, రైలు ఎక్కేటప్పుడు బ్యాగులను కౌంట్‌ చేయండి’ అన్న కూతురు ముందుచూపు సూచనలతో ఉరువులు లెక్కగట్టి రైల్వేస్టేషన్‌కు చేరుకునేసరికి రాత్రి తొమ్మిదిన్నర గంటలైంది. ప్లాట్‌ఫారంపై మరోమారు బ్యాగులు లెక్కగట్టి సంతృప్తి చెందాక అక్కడే ఉన్న అరుగుపై కూర్చుంది మా ఆవిడ. రైలు రావడానికి  అరగంట సమయముంది. ‘అన్నీ సర్దావా? ఏవైనా మరచిపోయావా?’ అన్నమాటకు ‘గుర్తున్నకాడికి’ అంది. ఇంతలో కూతురు ఫోన్‌ . లగేజీల ప్రస్థానంపై ఆరా.

ఆమె కొడుకు అన్నప్రాశన కోసం తీసుకున్న వెండి గిన్నె, స్పూన్, గ్లాసు ఎక్కడ మరచి పోతామో? అన్నది ఆమె టెన్షన్‌ . ఒకపక్క రైళ్ల రాకపోకల అనౌన్స్‌మెంట్లు, ప్రయాణికుల ఉరుకులు, పరుగులు. రైళ్లు ఎక్కి, దిగే ప్రయాణికుల రద్దీతో ప్లాట్‌ఫారాలు సందడిని నింపుకోగా, ఈ మధ్యే రంగులద్దుకున్న రైల్వేస్టేషన్‌  రాత్రిపూట ఎల్‌ఈడీ కాంతుల వెలుగుల్లో కన్నులకింపుగా కనపడుతోంది.

‘సార్‌.. సార్‌’ అంటూ పెరుగెత్తుకుంటూ వచ్చాడు మళ్ళీ ఆ వ్యక్తి.
      ‘ఏమిటన్నట్లు?’ చూశాను.
‘రైలు వస్తున్నట్టుంది సార్‌! హైదరాబాద్‌ దేనా?’ అన్నాడు. సీరియస్‌గా ముఖం పెట్టి ‘నువ్వెక్కడికెళ్లాలి?’ అన్నాను.
      ‘హైదరాబాద్‌  పొయ్యే  రైలుకే సార్‌’
‘ఎక్కడ దిగాలి?’
      ఊరి పేరు చెప్పాడు. ఏపీ సరిహద్దులో ఉన్న తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఊరు.
‘మేమూ ఆ రైలుకే వెళుతున్నాము, మాతో పాటు ఎక్కుదువులే’ అన్నాను.
      ‘దండాలు దొరా.. ఈ ఒక్క సాయం చెయ్యి.. మా అయ్య కదూ’ అని మరీ వంగి కాళ్లను తాకుతూ దండం పెట్టాడు. మందు వాసన నాతోపాటు పరిసరాలనూ పలకరిస్తోంది. నేను వెనక్కు తగ్గాను.

      ‘మర్చిపోబాకు సారూ రైలు రాగానే నాకు చెప్పు.. ఏమీ అనుకోకు’ అంటూ చేతులు జోడించాడు.
తను పదేపదే దగ్గరగా రావడం నన్ను మరింతగా ఇబ్బంది పెడుతోంది. కోపం, చిరాకు తెప్పిస్తోంది.
      ‘సరే.. చెబుతానన్నా గదా, రైలు రాంగానే చెబుతా, పొయ్యి అరుగు మీద కూర్చో’ అన్నాను.
‘కోప్పడకు సారూ.. మరచిపోతావేమోనని చెపుతాండాలే ’ కొంచెం దూరం జరిగాడు.
      మరికొద్దిసేపట్లో గూడూరు– సింహపురి ఎక్స్‌ప్రెస్‌ మూడవ నంబర్‌ ప్లాట్‌పారంపైకి రానుందని తెలుగు, ఇంగ్లిష్, హిందీలో అనౌన్స్‌మెంట్‌. అప్పటికే కిక్కిరిసిన జనం అలర్ట్‌ అయ్యారు. రైలు వస్తుందంటూ తోటి ప్రయాణికులతో చర్చలు. కొందరు షాపుల్లో వాటర్‌ బాటిళ్లు కొంటున్నారు, ఇంకొందరు పిల్లలకు బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్‌ కొనిపిస్తున్నారు, మరికొందరు ఫోన్లో రైలు వచ్చిందంటూ ఇంటికి కబురు చెబుతున్నారు, కొందరు బయలుదేరుతున్నామంటూ గమ్యంలోని వారికి సమాచారం చేరవేస్తున్నారు. ప్రయాణికుల కోలాహలం పెరిగింది.

మరోమారు నా భార్య మా లగేజీ బ్యాగులు లెక్కగట్టింది. మా కూతురు కౌంటింగ్‌ సూచనల ప్రభావం ఆమెను వీడనట్లుంది.
      ‘బ్యాగులు అన్నీ ఉన్నాయా?’ అన్న అర్థం వచ్చేలా ఆమెవైపు చూశాను. ఈసారి ఆమె నవ్వింది. 
‘సార్‌..సార్‌ ఇదో టీ తీసుకోండి, వేడివేడి టీ..’ పరుగులాంటి నడకతో వచ్చాడు ఆ వ్యక్తి. సీరియస్‌గా చూశాను.
      ‘మీ కోసమే తెచ్చాను, టీ తాగండి సర్‌’ అన్నాడు. 
నాకు కోపం నసాలానికెక్కింది. చుట్టుపక్కల ప్రయాణికుల దృష్టి చాలాసేపటి నుంచి మా ఇద్దరిపైనే ఉంది. ప్రతిసారీ అతను వేరెవరి దగ్గరకు వెళ్లకుండా నావద్దకు వచ్చి బతిమిలాడుతుండడంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. మరోమారు అందరూ నావైపు చూశారు. కోపం కంట్రోల్‌ చేసుకున్నాను.

‘ఇప్పుడే ఇంట్లో అన్నం తిని వస్తున్నాను, ఇప్పుడు టీ తాగను, నువ్వు తాగు’ ఒక్కో అక్షరం గట్టిగా నొక్కి పలికుతూ కళ్లెర్ర చేశాను.
నా ఆగ్రహం పసిగట్టినట్లున్నాడు, దూరంగా వెళ్లి టీ తాగి అక్కడే నిల్చున్నాడు.
      ట్రైన్‌  వస్తోందంటూ మరోమారు అనౌన్‌్సమెంట్‌. ప్లాటుఫారంపై డిస్‌ప్లేలలో రైలు నంబర్, బోగీ నంబర్లు వేస్తున్నారు. అది చూసి ప్రయాణికుల్లో హడావుడి. అటూ ఇటూ వేగంగా కదులుతున్నారు. 
      ‘సార్‌ రైలొచ్చిందా?’ ఈసారి కాస్త దూరం నుంచే అడిగాడు ఆ వ్యక్తి.
‘ఆ.. వస్తాంది. ఇక్కడే ఉండు ఎక్కుదాం’ అన్నాను.
      ‘సరే.. సరే’ అంటూ నాకు దగ్గరగా వచ్చి నిల్చున్నాడు.
నా భార్య మరోమారు బ్యాగులను చూపుడు వేలితో లెక్కించడం కనిపించింది. రైలు కూతతోపాటు దాని వెలుతురు తోడుగా ప్లాట్‌ఫారం పట్టాలపైకి భారంగా వచ్చి ఆగింది.  మేమున్న దగ్గరకి కొంత అటు ఇటుగా మేము ఎక్కాల్సిన బీ–5 ఏసీ స్లీపర్‌ బోగి ఉంది. నా భార్య, నేను చెరో రెండు బ్యాగులు చేతికి తీసుకున్నాం. ఆదరబాదరగా వచ్చి ‘ఇటివ్వు తల్లీ’ అంటూ నా భార్య చేతిలోని రెండు బ్యాగులు తీసుకున్నాడా వ్యక్తి. ఆమె ఇంకో బ్యాగు తీసుకుంది. నా వెంటే బ్యాగులు మోసుకొచ్చాడు. బోగీలో మాకు కేటాయించిన సీట్ల వద్ద బ్యాగులు పెట్టాను. నా భార్యకు సీటు చూపించి కూర్చోబెట్టి.. ‘నీది యే బోగి?’ అడిగాను ఆ వ్యక్తిని.

      ‘నాదిక్కడ కాదు సారూ..’ అన్నాడు. 
‘పద నీ బోగీలో దిగబెడతా’ అన్నాను. 
      ‘నాదిక్కడ కాదులే సారూ..’ అన్నాడు మళ్లీ. 
‘ఏదీ.. నీ టిక్కెట్‌ చూపించు? సీటెక్కడో చెబుతా’ అన్నాను.
      ‘టికెట్‌ లేదు సారూ..’ అన్నాడు.
‘అదేంటి! టికెట్‌ తీసుకోలేదా?’
      ‘లేదు సారూ.. అయినా మాకెందుకు సారూ టికెట్, మమ్మల్ని టికెట్‌ అడగరులే’ అన్నాడు. 
‘టీసీ వచ్చి చెక్‌ చేస్తే?’
      ‘అది మీకు సారూ.. మాకు కాదులే’ నసగుతూ అన్నాడు
‘ఎందుకు?’ అన్నట్లు చూశాను. 
      ‘నేను అడుక్కునేటోన్ని  సారూ.. మాకు టిక్కెట్‌ గట్ల లేదులే’ అన్నాడు. 
ఆశ్చర్యమేసింది. మాసిన బట్టలు, ఆహార్యం చూస్తే అచ్చమైన పల్లెటూరి అమాయకుడిలా ఉన్నాడు తప్పించి మరీ అడుక్కునేవాడిలా కనిపించలేదు.

‘నువ్వు అడుక్కుంటావా?’ అన్నాను. 
      ‘అవును సారూ.. నేను బిచ్చగాన్ని’ అన్నాడు.
నాముందు దాదాపు గంటపాటు రైల్వేస్టేషనులో ఉన్నాడు, నాకే టీ ఇవ్వబోయాడు, ఎవ్వరినీ డబ్బులు అడుక్కోలేదు. మనస్సు ఏదోలా అయ్యింది. తను అబద్ధం చెబుతున్నాడేమో!
      ‘నిజం చెప్పు నువ్వు అడుక్కుంటావా?’ అడిగాను. 
‘నిజం సారూ.. నేను బిచ్చగాన్నే, ఆరేళ్లుగా అడుక్కుంటున్నాను’ అన్నాడు.
      ‘అంతకుముందు?’
‘రైతును సారూ’ అన్నాడు. 
ఉలిక్కి పడ్డాను. తనవైపు తేరిపార చూశాను. రైతు కుటుంబంలో పుట్టిన నాకు తన మాటలు మనస్సులో అలజడి సృష్టించాయి.  
నా భార్యకు మళ్లీ వస్తానని చెప్పి తనతో పాటు బోగీల వెంట నడుస్తున్నాను. నాగటి చాళ్లలో నడచినట్లు కాలి పాదాలు తొసుకుతున్నాయి. సరిగ్గా అడుగులు వేయలేకపోతున్నాను. మనసుదీ అదే స్థితి. మెదడు గతితప్పింది.

‘యే.. టిఫినీ.. టిఫినీ.. ఇడ్లీ వడా, ఇడ్లీ వడా... సార్‌ వాటర్‌.. వాటర్, కూల్‌డ్రింక్స్‌..’
రైలు బోగీల్లో అరుపుల గోల. నా మనసు ఘోషపై ధ్యాసపెట్టిన నా చెవులు వాటిని పట్టించుకోలేదు. ఎలాగోలా జనరల్‌ కంపార్ట్‌మెంట్‌ కొచ్చాను. ఖాళీగా ఉన్న సీటుపై కూర్చున్నాను.
      ‘కూర్చో’ ఆ వ్యక్తికి సీటు చూపించాను.
‘పర్లేదు సారూ నేను నిలుచుంటా’ అన్నాడు. చెయ్యిపట్టి కూర్చోబెడుతూ ‘నీ పేరు..?’ అడిగాను. 
      ‘సోమయ్య సారూ..’
‘నీ కథ వినాలని ఉంది చెప్పు సోమయ్యా..’ అన్నాను. ఒక్కక్షణం.. మొదలుపెట్టాడు.
‘మాది మధిర దగ్గర పల్లెటూరు సారూ. చిన్న రైతు కుటుంబం. ఒక కొడుకు, ఒక కూతురు. రెండెకరాల మెట్ట. వానొస్తేనే పైరు, లేకుంటే బీడు. రెక్కలు గట్ల కట్టెలు జేసుకొని పని చేసేటోల్లం. అప్పులతో పెట్టుబడి, కరువులతో కష్టాలు. ఒక పంటొస్తే నాలుగు పంటలు పొయ్యేటియి. వడ్డీలు పెరిగొచ్చి అప్పులు కుప్పబడె. తీర్చే దారి దొరక్కపాయ.

ఎదిగొచ్చిన కూతురును ఇంట్లో పెట్టుకోలేంగద సారూ.. ఎకరం అమ్మి బిడ్డ పెండ్లిజేస్తి. నా కష్టం పిల్లోడికొద్దని వాన్ని డిగ్రీ దాకా చదివిస్తి. అప్పులోల్లు ఇంటిమీద పడి ఆగమాగం జేస్తిరి. నానా మాటలు పడితి. అయి భరించలేక ఉరిపోసుకుందామని తీర్మానం జేసుకుంటి. భార్యా, కొడుకు దావలేని రీతిన వీధిన పడ్తరని మనసు మార్చుకుంటి. సేద్యం ఇక కుదిరేకత లేదని తీర్మానం జేసుకుంటి. ఉన్న అప్పు వడ్డీలతో గలిపి అయిదు లక్షలకు ఎగబాకె. ఎకరం అమ్మి లొల్లిజేసేటోల్లకు కొంత అప్పుగడ్తి.  మా ఊర్లో నా దోస్తుగాల్లు కొందరు సేద్యం ఎత్తిపెట్టి చిన్నచిన్న యాపారాలకు బొయ్యి బాగానే సంపాదిస్తున్నారు. వో దినం నా బాధ వారికి మొరపెట్టుకుంటి.

‘మాతో వస్తావా?’ అనిరి. అట్టే అని జెప్పి వొకనాడు వాల్లతో పాటు తిరుపతి రైలెక్కితి. ఎట్టోకట్ట గడ్డనెయ్యి స్వామీ అని ఎంకన్న స్వామికి మొక్కుకుంటి. తిరపతి బొయ్యి చూస్తే నా దోస్తుగాల్లు జేసే యాపారం   బిచ్చమెత్తకోవడమని తెలిసె సారూ. పొద్దున లేచింది మొదలు రాత్రి దాకా అడుక్కోడమే. ‘ఇదేందయ్యా ఇట్టాంటిదానికి దెస్తిరే’ అని తొలిరోజు మనసురాక యాతనపడితి.

కలోగంజో కలిగిన కాడికి నలుగురికి పెట్టినోల్లం, ఇప్పుడు అడుక్కునే రోజులొచ్చే అని కుమిలిపోతి. అప్పుతీర్చాల, కొడుకును దారిలో పెట్టాల. మనకాడ యేముందని యేం యాపారం జేస్తాం! మనసుకు నచ్చజెప్పుకుంటి. ఆ రోజు నుంచి అడుక్కోడం మొదలు పెడ్తి సారూ. రెండువారాలు బిచ్చమెత్తడం ఇంటికి రాడం, రెండు రోజులుండి మల్లీ పోడం, నెలాఖరుకు రావడం రెండు రోజులుండి మల్లీ పోడం. ఆరేండ్ల కాలం గడచిపాయ దొరా.’

మనసు బాధను పంచుకొనేదానికి దోస్తానా దొరికిండనుకున్నాడేమో? ఏకబిగిన తన కథ చెప్పాడు సోమయ్య. మనసును పిండేసే కథ. నేలను కదలించే కథ. కొన్ని నిమిషాలపాటు మా మధ్యన మాటల్లేవు. అంతా నిశ్శబ్దం. రైలు ఇనప చక్రాల రోదనా నా చెవికెక్కడం లేదు.
కొద్దిసేపటి తరువాత.. ‘ఇప్పుడెలా ఉంది పరిíస్థితి’ అడిగాను. 
      ‘బాగుందిసారూ .. అప్పులు తీర్చాను, ఊర్లో పాత ఇంటిని రిపేర్‌ చేసుకున్నాను. కొడుకు హైదరాబాద్‌లో కంపెనీలో చేరాడు’ చెప్పాడు.
‘రైతుగా పదిమందికి పెట్టినోడివి బిచ్చమెత్తడం ఇబ్బందిగా లేదా సోమయ్యా..’
      ‘ఎందుకుండదు సారూ.. ఎదుటి మనిషి ముందు చేయిచాచగానే కొందరు చీదరించుకుంటారు, కొందరు పనిజేసుకొని బతకొచ్చుగా అంటారు. కొందరు అసహ్యంగా చూస్తారు. కొందరైతే నానాతిట్లు తిడతారు’ అన్నాడు.
‘మాటలు పడ్డప్పుడు బాధనిపించదా?’ అన్నాను.

‘అనిపిస్తుంది సారూ.. కచ్చితంగా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడల్లా  రైతుగా నేను పడిన కష్టాలు కళ్ల ముందేసుకుంటాను. పంట కోసం తెచ్చిన అప్పులు గట్టమని అప్పులిచ్చినోల్లు తిట్టిన తిట్లు గుర్తుకు తెచ్చుకుంటాను. తోటి మనిషన్న జాలి లేకుండా ఇంటి మీదకొచ్చి పరువు బజారుకీడ్చినప్పుడు పడ్డ యాతన గుర్తుకు తెచ్చుకుంటాను.

పెండ్లాన్ని అమ్మైనా బాకీ తీర్చాలన్న మాటలకు గుండెపగిలి ఏడ్చిన ఏడుపు గుర్తుకు తెచ్చుకుంట సారూ. చుట్టుపక్కోల్లు గుమిగూడి ఓదార్చకుండా మాట్లాడిన వెకిలి మాటలకు  పడ్డ యాతన, వేదన గుర్తుకు తెచ్చుకుంటా, ఆ మాటలు పడలేక ఉరిపోసుకొని చచ్చిపోదామనుకున్న రోజులు యాదికి తెచ్చుకుంట. ఆ కష్టాలు, అవమానాల కంటే బిచ్చమెత్తుకొనేటప్పుడు పడే మాటలు సిన్నయిగా అగుపిస్తాయి సారూ. రైతుగా ఉన్న నాటి కష్టాలతో పోలిస్తే ఇప్పటి నొప్పి గుండెను పిండదు సారూ.’

సోమయ్య మాటలు ఆర్ద్రంగా మారాయి. చొక్కా చెరుగుతో కళ్లను తుడుచుకున్నాడు. నా కళ్లకు సోమయ్య మసగ్గా కనపడుతున్నాడు. మనస్సు బాధగా మూలిగింది.
      ‘సోమయ్యా .. ఉద్యోగం చాలించి నేనూ రానా..’ ఆయన మనస్సు తేలిక చేయాలన్న ఉద్దేశంతో అన్నాను. 
ఒక్కసారి నావైపు చూసి చిన్నగా నవ్వాడు. ‘మీకెందుకు సారూ ఆ కర్మ? ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు’ అన్నాడు. 
      ‘అవును సోమయ్యా! తిరుపతికే ఎందుకు వెళ్లడం అంతదూరం?’ అన్నాను.
‘భక్తులు దేశం నలుమూలల్నుంచి వచ్చేతావు సారూ, పాపాలు చేసి పుణ్యం పట్టకపోయేటందుకు మొక్కులతో వస్తరు, దండిగా డబ్బులతో వస్తరు, ఖర్చుపెట్టేందుకు సిద్దపడే వస్తరు, దేవుడికింత , మాకింత’ చెప్పాడు. 
      ‘అయితే బిక్షమెత్తి పాపులకు పుణ్యం పంచే దేవుడి ఉద్యోగం అన్నమాట’ అన్నాను. 
‘ఊరుకొండి సారూ..  వెంకన్నస్వామే దేవుడు, నేను కాదు’ నవ్వుతూ అన్నాడు. సోమయ్యలో నవ్వు చూశాను. కొంచెం బాధ తగ్గింది. సెల్‌ఫోన్‌ లో టైమ్‌ చూశాను. పన్నెండు కావస్తోంది. ఎవరిగోడూ పట్టని సింహపురి ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ దాటి మధిర వైపు వేగంగా పరుగెడుతోంది.

‘మీరెల్లిపడుకోండి సారూ.. మేడం ఒక్కరే ఉంటారు, నేను ఇంకో గంటలో దిగిపోతా ’ అన్నాడు. 
      ‘అవును సోమయ్యా.. నువ్వు బాపట్లలో ఎందుకున్నావు?’ అన్నాను. 
‘తిరపతిలో తొందరతొందరగా రైలెక్కాను సారూ.. తీరాచూస్తే అది మావూరి దగ్గర ఆగదంట. అందుకే ఇక్కడ దిగాను, దసరా పండక్కు కొడుకు, కూతురు పిల్లలు ఊరికి వచ్చిండ్రు సారూ.. రేపే పండగ, మల్లీ రైలెక్కడ పోగొట్టుకుంటానో అని బయపడి మిమ్మిల్ని ఇబ్బంది పెట్టాను’ అన్నాడు.

‘సరే’ అని లేచాను. ఇప్పుడు సోమయ్య దగ్గర నాకు మందు వాసన రావడం లేదు, మట్టి వాసన వస్తోంది, రైతు చమట వాసన వస్తోంది. చేయి కలిపాను.
      పాలకుల ఆదరణ కరువై వో రైతు కాడిదించాడు. వందల మంది జనం ఆకలి ఆర్తనాదాలు నా చెవుల్లో మారు మోగుతున్నాయి. అన్యమనస్కంగానే నా బోగీవైపు అడుగులు వేశాను. — బిజివేముల రమణారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement