మిస్టరీ: సరిగ్గా రెండేళ్లకు..
Funday Mistery Story
జీవితంలో అసంపూర్ణంగా ఆస్వాదించిన కొన్ని మధురక్షణాలు.. మళ్లీ తిరిగిరాని జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి. అలాంటప్పుడు పొంగుకొచ్చే భావోద్వేగాన్ని వర్ణించడం మహా కష్టం. ఇక ఆ తర్వాత అంతకుమించిన సంతోషాలెన్నొచ్చినా.. మనసు మాత్రం గతాన్నే నెమరువేసుకుంటుంది. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లమని కోరుకుంటుంది. ‘స్టెల్లా హట్’ జీవితంలో కూడా అదే జరిగింది. ఆమె ఆలాపన, అన్వేషణ, ఆవేదన అంతా తన కన్నతల్లి కోసమే. అసలేంటా కథ?
స్టెల్లా కథ.. ఓ అమెరికన్ అయిన ఆమె తండ్రి రాబర్ట్ వోర్ట్‌మన్ కథతోనే మొదలవుతుంది. అది 1971, జపాన్ . అప్పుడు రాబర్ట్‌కి 22 ఏళ్లు. తను జపాన్ లో ఎయిర్‌మన్ గా పనిచేసేవాడు. ఒకరోజు ఓ ప్రయాణంలో.. ఓక్‌చా అనే 20 ఏళ్ల కొరియన్ అమ్మాయితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. పెళ్లి అయిన ఏడాదికే స్టెల్లా పుట్టింది.
రాబర్ట్.. తన భార్య ఓక్‌చాను ముద్దుగా ‘సన్నీ’ అని పిలుచుకునేవాడు. కొన్ని నెలలకు జపాన్ కి చెందిన ఒక అమెరికన్ ఎయిర్ ఫోర్స్‌కు.. రాబర్ట్ సెలెక్ట్ అయ్యాడు. దాంతో స్టెల్లాను సన్నీ(ఓక్‌చా)కి అప్పగించి.. అతడు అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లాల్సి వచ్చింది. మధ్యమధ్యలో వచ్చి.. భార్యాబిడ్డలతో గడిపేవాడు. తండ్రి దూరంగా ఉండటంతో.. స్టెల్లాకు తల్లితో మరింత అనుబంధం పెరిగింది. ఐస్‌క్రీమ్ పార్లర్‌లో ఉద్యోగం చేసే సన్నీ.. కూతురు స్టెల్లాను చాలా ప్రేమగా చూసుకునేది. చాలా ప్రదేశాలకు తిప్పేది. వాటన్నిటినీ తల్లి ప్రేమకు గుర్తుగా గుండెలో దాచుకుంది స్టెల్లా. కొంతకాలానికి సన్నీకి బార్‌లో వెయిట్రెస్ జాబ్ వచ్చింది. అది నైట్ డ్యూటీ కావడంతో.. స్టేల్లాను న్యూజెర్సీలో ఉండే రాబర్ట్ బంధువులకు అప్పగించాల్సి వచ్చింది.
తనతో స్టెల్లా కూడా లేకపోవడంతో.. సన్నీకి బయట స్నేహాలు పెరిగాయి. ఇంట్లో గడిపే సమయం తగ్గి.. బయట గడిపే సమయం పెరిగిపోయింది. దాంతో ఫ్యామిలీ వెకేషన్ ్స తగ్గిపోయాయి. రాబర్ట్‌తో గొడవలు మొదలయ్యాయి. కాల్ చేసుకున్నా, కలుసుకున్నా.. ఆ రోజంతా గొడవలతోనే ముగిసేది. పరిస్థితి చేయిదాటిపోతుందని గుర్తించిన రాబర్ట్.. సామరస్యంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే భార్యతో ఓ ఒప్పందానికి వచ్చాడు. ‘ఇక నుంచి మనం కలసే ఉందాం.. నాతో పాటు అమెరికా వచ్చెయ్. న్యూజెర్సీ వెళ్లి స్టెల్లాతో సంతోషంగా ఉందాం’ అని కోరాడు. అందుకు సన్నీ సరే అంది. ఇద్దరూ న్యూజెర్సీలో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు.
దాంతో తన జాబ్‌ని న్యూయార్క్ నుంచి న్యూజెర్సీకి మార్పించుకున్నాడు రాబర్ట్. సన్నీని తీసుకెళ్లడానికి తిరిగి జపాన్ చేరుకున్నాడు. అయితే భర్త వెంట వెళ్లడానికి అభ్యంతరం చెప్పింది సన్నీ. ‘నేను ఇప్పుడే నీతో రాలేను. ఒకసారి మా కుటుంబాన్ని కలుస్తాను. వచ్చాక మనం న్యూజెర్సీ వెళ్లిపోదాం’ అని చెప్పి.. దక్షిణ కొరియాలోని సియోల్‌కి వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. ఆమె గురించి ఎంత వెతికినా ఎలాంటి సమాచారం దొరకలేదు. ‘ఆమె అసలు పేరు ఓక్‌చా అని, ఆమె సొంత ఊరు దక్షిణకొరియాలోని సియోల్’ అని తప్ప.. మరే వివరాలూ రాబర్ట్‌కి తెలియవు. ఆ మాటకొస్తే తను వెళ్లింది సియోల్‌కేనో కాదో కూడా తెలియదు. ఆ తర్వాత సన్నీ ఎప్పుడూ కూతురు స్టెల్లాని కలవలేదు. కానీ.. స్టెల్లా మాత్రం తల్లి జ్ఞాపకాలతో తల్లడిల్లిపోయేది.
సరిగ్గా రెండేళ్లకు..
రాబర్ట్ తల్లి ఓ ఫోన్ లిఫ్ట్ చేసింది. ‘స్టెల్లా స్టెల్లా’ అనే పిలుపుతో ఓ ఆడ గొంతును అవతలి నుంచి విన్నది. మరే మాట ఆమెకు అర్థం కాలేదు. దానికి కారణం.. రాబర్ట్ తల్లికి ఇంగ్లిష్ మాత్రమేవచ్చు. దాంతో ఫోన్ లో వినిపించిన మాటలేవీ రాబర్ట్ తల్లికి అర్థం కాలేదు. ఒక్క స్టెల్లా అనే పేరు తప్ప. అందుకే ఆ కాల్ చేసింది సన్నీయే కావచ్చు అన్న అనుమానం కలిగింది ఆ కుటుంబానికి. ఎందుకంటే.. సన్నీకి కొరియన్ మాత్రమే వచ్చు. తన తల్లి మాట్లాడే భాష అర్థంకాకే ఆ రోజు సన్నీ కాల్ కట్ చేసుంటుందనుకున్నాడు రాబర్ట్.
1985లో స్టెల్లాకు 4 గౌన్లు, ఓ కుక్కపిల్ల గిఫ్ట్‌గా వచ్చాయి. అయితే ప్యాకింగ్ మీద కాలిఫోర్నియా పోస్ట్ మార్క్ ఉంది. అది కచ్చితంగా తన తల్లే తనకోసం పంపించిందని ఇప్పటికీ నమ్ముతుంది స్టెల్లా. అయితే సన్నీ గురించి ఎలాంటి ఆధారం దొరకలేదు. కొన్నాళ్లకు తండ్రి రాబర్ట్.. మరో పెళ్లి చేసుకున్నాడు. అతడికి మరో పాప పుట్టింది. సవతి తల్లి కూడా స్టెల్లాను ప్రేమగా చూసుకునేది. కానీ కన్నతల్లిని చూడాలనే ఆశ.. స్టెల్లాలో చావలేదు. స్టెల్లాకు పెళ్లి అయ్యి.. ఒక బాబు కూడా పుట్టాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. అయినా తన తల్లిని చూడలేకపోయానన్న వెలితి.. ఆమెను ఇప్పటికీ వెంటాడుతోంది.
సన్నీ అలియాస్ ఓక్‌చాకి ప్రస్తుతం 73 ఏళ్లు దాటే ఉంటాయి. అసలు ప్రాణాలతో ఉందో లేదో తెలియని తల్లి కోసం స్టెల్లా మాత్రం ఇంకా అదే ఆశతో ఎదురుచూస్తోంది. మరి సన్నీ ఏమైంది? ఎందుకు చెప్పాపెట్టకుండా వాళ్ల జీవితాల్లోంచి వెళ్లిపోయింది.? ఒకవేళ మోసం చేయాలని తనకు లేకపోయినా.. అనుకోకుండా ఏదైనా ప్రమాదానికి గురైందా? అలా అయితే.. స్టెల్లా గురించి కాల్ చేసింది ఎవరు? స్టెల్లాకు గిఫ్ట్స్ పంపించింది ఎవరు?’ లాంటి ఎన్నో ప్రశ్నలకు నేటికీ సమాధానాలు లేవు. దాంతో ఓక్‌చా కథ ఓ మిస్టరీగా మిగిలిపోయింది.
— సంహిత నిమ్మన
ఇవి చదవండి: ఈ వారం కథ: శుభశకునం! 'నువ్వు చెప్పింది అక్షరాలా నిజం'
Comments
Please login to add a commentAdd a comment