రామేశంగారు మాకు దగ్గరగా ఉండే, దూరపు బంధువు! ఒకే వీధిలో పక్క పక్క ఇళ్ళల్లో ఉండేవారం! ఆయన భార్య వైపు నుంచి మా నాన్నగారికి బీరకాయపీచు చుట్టరికం ఉండేది. మా అన్నదమ్ములందరం వాళ్ళని అత్తయ్య, మావయ్య అని పిలిచేవారం! మా నాన్నగారు, ఆయన ఒకే డిపార్ట్‌మెంటులో పనిచేసేవారు. దానికితోడు ఇద్దరూ రచయితలే! ఇవన్నీ కలవడంతో, మా కుటుంబాల మధ్య బంధుత్వం మాట ఎలావున్నా, స్నేహం ఎక్కువ కనబడేది!
నేను కాలేజీ చదువులకు వచ్చేసరికే.. మా నాన్నగారు పక్షవాతంతో మంచం పట్టడం, రామేశంగారు బదిలీ మీద వేరే ఊరు వెళ్ళిపోవడంతో, మా కుటుంబాల మధ్య దూరం ఏర్పడి పోయింది. తర్వాత కాలంలో నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చి, మూడు నాలుగు చోట్ల పనిచేసిన తర్వాత బదిలీ మీద నేను తిరిగి మా ఊరు చేరాను.
ఓ రోజు బ్యాంకులో పనిచేసుకుంటున్న సమయంలో, కౌంటర్ ఎదురుగా నిలబడి.. ‘నువ్వు చిట్డిబాబు కొడుకువి కదూ!’ అంటూ పలకరించారు.
బుర్ర వంచి పని చేసుకుంటున్న నేను, ఆ పిలుపు వినగానే బుర్ర ఎత్తి చూశాను. రామేశం గారే!
మా నాన్నగారిని ఆ పేరుతో పిలిచేవారు బహు తక్కువగా ఉండేవారు. అందులో రామేశంగారు ఒకరు!
‘అవునండీ .. మీరు రామేశం మావయ్యగారు కదూ!’ అప్రయత్నంగానే నోటంట ఆ పేరు వచ్చేసింది.
‘అవునయ్యా! ఇక్కడికి ఎప్పుడు వచ్చావూ.. మీ నాన్న ఆరోగ్యం ఎలావుంది.. ఇక్కడే ఉన్నారా? నువ్వు కూడా కథలు రాస్తావుట కదా.. మీ బ్యాంకులో పనిచేసే హరగోపాల్ చెప్పాడు! రిటైర్మెంట్ తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చేశాను!’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అన్నిటికీ జవాబులిచ్చి.. ‘సాయంత్రం బ్యాంకు అవగానే మీ ఇంటికి వస్తాను!’ అంటూ అడ్రసు తీసుకుని ఆయన పనిచేసిపెట్టి పంపేశాను.
అలా.. మా కుటుంబాల మధ్య బంధుత్వం నాతో తిరిగి మొదలైంది! అయితే మా నాన్న కదల్లేని పరిస్థితులలో ఇంటిపట్టునే ఉండేవారు. మా అమ్మ ఏ పేరంటాలకో వెళ్తుండేది. నేను ఖాళీ దొరికినప్పుడో, కథల మీద సలహాలు తీసుకోడానికో, ఆయన పని మీదో వాళ్ళింటికి వెళ్తుండేవాడ్ని!
రామేశంగారి భార్య భానుమతిగారు మా ఇంటికి తరచు వస్తుండేవారు. రామేశంగారు మాత్రం ఎవరింటికి వెళ్ళేవారు కాదు! వాళ్ళ పిల్లలు కూడా అంతే.. ఎవరినీ కలసేవారు కాదు.
ఇప్పుడు ఆయన మా ఇంట్లోవాళ్లందరి కంటే నాతోనే ఎక్కువ చనువుగా ఉంటున్నారు. మా ఇద్దరి అభిప్రాయాలు కలిసేవి. అలాగే.. ఆయన కథలంటే చాలా ఇష్టపడేవాడ్ని. మంచి శైలి, అభ్యుదయ భావాలతో ఆయన కథలు, ఆసాంతం చదివించేవి. ఆయన్ని కలసినప్పుడల్లా.. నాకు తెలియని చాలా విషయలు చెప్తూ ఉండేవారు.
ఆయనతో బాగా చనువు ఎర్పడటంతో, నేను రాసే కథలను ఆయనకే మొదట చూపెట్టేవాడ్ని!
బావుండకపోతే.. మొహం మీదే చెప్పేవారు. ఆయన సూచనలు తీసుకుని మార్పులు, చేర్పులు చేసి, మళ్ళీ ఆయన ఓకే అన్న తర్వాతే, పత్రికలకు పంపేవాడ్ని!
ఓ సంవత్సర కాలం గడిచిన తర్వాత, ఉన్నట్టుండి రామేశంగారికి మోకాలు నొప్పి వచ్చి, బయటకు వెళ్ళడం తగ్గిపోయింది. ఆ విషయమే ఓ రోజు ఫోన్ చేసి.. ‘చేతి వేళ్లు కూడా పూర్తిగా పట్టు తప్పాయి! నీ అవసరం తరచు ఉంటుంది!’ అంటూ, బ్యాంకు పని ఏదో పురమాయించారు.
బ్యాంకులో పని ఎక్కువగా ఉండటంతో, వెంటనే వాళ్ళింటికి వెళ్ళలేకపోయాను.
ఓ నెల రోజుల తర్వాత వీలు చూసుకుని రామేశంగారిని చూడ్డానికి వెళ్ళాను. తలుపు తీస్తూ.. ‘రా నాయనా! ఈ మధ్య బొత్తిగా నల్లపూస అయిపోయావు! కూర్చో కాఫీ ఇస్తా!’ అంటూ మా అత్తయ్య, నా మాట వినిపించుకోకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది.
‘మార్చి నెల కదా.. బ్యాంకులో చాలా బిజీగా ఉంది! ఇంటికి వెళ్ళేసరికే రాత్రి పది దాటిపోతున్నది!’ అంటూ రామేశంగారి మంచం దగ్గరకి కూర్చి లాక్కుని కూర్చున్నాను.
అప్పుడు చూశాను.. మరో కుర్చీలో ఒకావిడ కూర్చుని ఉంది. ఆవిడ్ని నేనెప్పుడూ చూడలేదు.
‘ఏంలేదోయ్.. మీ అత్తయ్యలాగే ఈ మధ్య నా చేతివేళ్ళు కూడా నా మాట వినడం లేదు! మెదడు నాదే కదా.. ఇంకా నా చెప్పు చేతల్లోనే ఉంది!’
అంతలో అక్కడికి వచ్చిన మా అత్తయ్య, రామేశంగారి మాటలకు అడ్డం పడుతూ.. ‘చోద్యం కాకపోతే.. డొంకతిరుగుడు లేకుండా విషయం తిన్నగా చెప్పొచ్చుగా!’ అంటూ, నాకు కాఫీ గ్లాసు అందించింది.
‘కథలలో వర్ణనలు, ఉపోద్ఘాతాలు, ఉపమానాలు లేకపోతే, నువ్విచ్చే కాఫీలా చప్పగా ఉంటుంది!’ ఆవిడతో అని..
నావైపు చూపు మరలుస్తూ ‘ఏం లేదేయ్.. ఈ మధ్య రాయడం కూడా కష్టంగా ఉంది. అందుకే.. నా రాతకోతలన్నీ ఈ అమ్మాయి చేత చేయిస్తున్నాను. ఓ రకంగా స్టెనోగ్రాఫర్ అనుకో!’ అన్నారు రామేశంగారు.
‘కథలు రాసే స్టెనోగ్రాఫర్ అన్నమాట!’ నవ్వుతూ అంటూ, కాస్సేపు మాట్లాడి వచ్చేశాను.
తర్వాత రోజుల్లో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ‘ఎక్కడైనా వంట మనిషినో, పని మనిషినో పెట్టుకుంటారు గాని, ఇలా కథలు రాయడానికి మనిషిని పెట్టుకోవడం ఎప్పుడూ వినలేదురా అబ్బి!’ మా అత్తయ్య నవ్వుతూ నాతో అంటుండేది.
‘కదల్లేని కథల మనిషికి, నీలా కథలు చెప్పేవారు కాకుండా, కథలు రాసేవారు కావాలి కదోయ్!’ ఆయన కూడా నవ్వుతూ అనేవారు.
‘ఎప్పుడు చూసినా మన కొంపల్లో పదిమంది ఉండేవారు! ఇప్పుడేం వుంది.. లింగు లింగుమని ఇద్దరేసి ఉంటున్నారు! ఈ వయసులో మరో మనిషి సాయం మంచిదే కదా నాయనా!’ అంటూ మా అత్తయ్య కూడా ఆవిడతో సరదాగానే ఉండేది.
ఓ రోజు బ్యాంకులో పని చేసుకుంటుంటే, రామేశంగారి నుంచి ఫోన్ వచ్చింది.
‘మీ అత్తయ్య చనిపోయింది, అర్జంటుగా నువ్వు రావాలి’ అంటూ కంగారుగా చెప్పి ఫోన్ పెట్డిశారు!
ఒక్కసారిగా నిర్ఘాంత పోయాను.
‘ఆవిడ ఎప్పుడూ ముక్కు చీదిన సందర్భం కూడా లేదు.. అలాంటిది ఈ ఘోరం ఎలా జరిపోయిందో..’ అనుకుంటూ బ్రాంచి మేనేజరు దగ్గరికి వెళ్ళి, విషయం చెప్పి, సెలవు పెట్టి రామేశంగారింటికి వెళ్ళాను. అప్పటికే వాళ్ళ పిల్లలు, బంధువులు వచ్చి, తర్వాత కార్యక్రమం గురించి అటూ ఇటూ తిరుగుతున్నారు.
రామేశంగారు దిగులుగా ఓ పక్కన కూర్చుని ఉన్నారు. ఆయన్ని ఎలా పలకరించాలో తెలియలేదు. దగ్గరకి వెళ్ళి గట్టిగా చేతులు పట్టుకున్నాను. ప్రశాంతంగా నిద్ర పోతున్నట్టున్న మా అత్తయ్యని చూడగానే, నా కళ్ళు చెమర్చాయి.
‘నిన్న రాత్రి వరకు బానే ఉందయ్యా.. ఉదయాన్నే కొంచెం నలతగా ఉందంటే, డాక్టరు రామ్మూర్తికి ఫోన్ చేశా.
‘మీరు రావొద్దు.. నేనే హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు, మీ ఇంటికి వచ్చి చూస్తానులెండి!’ అంటూ ఓ పది నిమిషాల్లో వచ్చాడు. ఆయన వచ్చేలోగా.. అదిగో ఆ దివాను మీద పడుకుంది పడుకున్నట్టే పోయింది! హార్ట్ అటాక్‌ట. పాపం అది చెప్పడానికి రామ్మూర్తి వచ్చినట్టైంది! బీపీ, షుగరు, బెల్లం అన్నీ నాకున్నాయి గాని, మీ అత్తకి ఎప్పుడూ తుమ్ము కూడా రాలేదు! సునాయాసంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది!’ అంటూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకున్నారు.
ఓ గంటలో కార్యక్రమం అంతా ముగిసి, రామేశంగారు ఇంట్లో ఒంటరైపోయారు.
ఆయన పక్కన మౌనంగా కాస్సేపు కూర్చున్నాను. ఆ కథలు రాసే ఆవిడ కూడా ఆయన పక్కనే కూర్చుంది.
‘నాకు తప్పదులే.. పనేమైనా ఉంటే ఫోన్ చేస్తాను! అన్నట్టు.. మీ అమ్మా, నాన్నలకి ఈ విషయం అంత అర్జంటుగా చెప్పకు. మెల్లగా వీలు చూసుకుని చెప్పు’ అంటూ ఆయన నెమ్మదిగా కళ్ళు మూసుకున్నారు.
జలజలరాలే నీటిబొట్లు ఆయన ఒళ్లో పడుతుండటం నేను మొదటిసారి చూశాను. కాలగర్భంలో ఆర్నెల్లు గడిచిపోయాయి. ఆ రోజు లంచ్ టైములో.. ‘నీకీ విషయం తెలిసిందా!?’ అంటూ మా కొలిగ్ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నోట్లో ఇడ్లీ ముక్క పెట్టుకుంటూ.. తెలియదన్నట్టు తలూపాను. ఎడం చేత్తో సెల్ఫోన్‌లో ఓ ఫొటో చూపెట్టేడు. అది చూస్తూనే ఒక్కసారిగా షాక్ తగిలినట్టైయింది. నా నోటంట మాట రాలేదు.
‘నిజం కాదే’ అన్నట్టు అతని వైపు చూశాను.
‘ఓ వారం కిందట.. మా ఫ్రెండ్ అక్కడకి ఏదో పని మీద వెళ్తే, కనబడ్డారుట.. మీ మావయ్యగారు వీల్ చైర్లో ఉన్నారుట, పక్కన ఆవిడ ఉందిట!’ అంటూ ఆ విషయాన్ని మా కొలిగ్ కళ్ళకు కట్టినట్లు చెప్తుంటే, నమ్మలేకుండా ఉండిపోయాను.
లంచ్ తర్వాత కౌంటర్లో కూర్చుని పని చేసుకుంటున్నానే గాని, ఆలోచనలతో మనసంతా కకావికలమైంది!
ఓ నాలుగు రోజులు ఆ ఆలోచనలతోనే గడిపాను.
ఏం చేయాలో తోచలేదు. ‘అసలు ఏం చేయగలను?’ అనుకుంటూ సమాధాన పడిపోయాను.
ఆ రోజు.. బ్యాంక్‌లో పని పూర్తిచేసి, టేబుల్ సర్దుకుంటుంటే సెల్‌ఫోన్ మోగింది.
రామేశంగారి నుంచి.. ఉలిక్కిపడ్డాను!
ఫోన్ ఆన్ చేశాను గాని, మాటలు వెతుక్కుంటూ, తడపడ్డాను!
‘బ్యాంకులో ఉన్నావా.. అందరూ బావున్నారా?’ ఆయన మాటల్లో కాస్త వ్యంగం కనబడింది.
కారణం.. ఈమధ్య కాలంలో నేను ఆయన్ని కలవలేదు, ఫోన్‌లో మాట్లాడిందీ లేదు!
‘అందరూ బావున్నారండీ! బ్యాంకులో చాలా బిజీగా ఉంది.. రాలేకపోయాను!’ పొడి పొడిగా వచ్చాయి నా మాటలు.
‘ఏం లేదోయ్.. మీ బ్యాంకులో ఉన్న నా పెన్షన్ అకౌంట్‌కి నామినేషన్ మార్చాలి! ఆ ఫారం పట్టుకుని ఓసారి రా.. !’ ఎప్పటిలాగే.. హుకుం జారిచేసినట్టు అన్నారు.
భార్య పోయిన తరువాత పెన్షన్ అకౌంట్‌కి నామినేషన్ ఇవ్వకపోయినా కొంపలు మునిగిపోవు! అయితే ఆయన చాదస్తం తెలిసిన వాడ్ని కాబట్టి ‘రేపు వస్తాను!’ అంటూ ఫోన్ కట్ చేశాను.
ఆయనింటికి వెళ్ళి, ఆయన్నెలా ఫేస్ చెయ్యాలో అర్థం కాలేదు!
మర్నాడు ఉదయం బ్యాంకుకి ఓ పావుగంట ముందే బయలుదేరి, మధ్యలో ఆయనింటికి వెళ్ళాను.
‘ఏమిటీ.. ఈ మధ్య మరీ నల్లపూసవై పోయావు..’
ఆ మాటలకి సమాధానం చెప్పకుండా.. ముభావంగా నా చేతిలో బ్యాంకు ఫారం ఆయనకి ఇచ్చి ఎదురుగా కూర్చున్నాను. ఆయన ఆ ఫారం నింపుతూ.. ‘ఏంలేదోయ్.. పోయే వయసే కదా, తర్వాత పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఈ జాగ్రత్తలు!’ అంటూ నా వైపు క్రీగంట చూస్తూ అన్నారు. వంటింట్లో నుంచి ఆవిడ కాఫీ తెచ్చి, నాకు అందించింది. ఆవిడలో మార్పు నాకు ఏం కనబడలేదు.
‘మా పిల్లలు బానే చూస్తారు, వాళ్ళ దగ్గరకి వచ్చేయమని అంటారు. కానీ, నాకీ కాగితాల్ని వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదు! ఆ మాట ఎలా ఉన్నా, ఓసారి చూసి.. అన్ని సరిపోయాయో లేదో చెప్పు!’ అంటూ నింపిన ఫారాల్ని నా చేతిలో పెట్టారు.
ఫారంలో ఆయన ఫించన్ అకౌంట్ ఎదురుగా నామినీ పేరుని చూసి, నుదురు చిట్లించి, ఆయన వైపు చూశాను.
‘ఉన్న ఈ రెండిళ్లు, బ్యాంకు డిపాజిట్లు మా పిల్లలకి రాసేశాను. ఆ ఫించన్..’ అంటూ నా వైపు చూశారు.
నా మొహంలో ఏం కనబడిందో.. మళ్ళీ ఆయనే అన్నారు..
‘ఈ అమ్మాయి తెలుసుగా, ఆమెకి ఎవరూ లేరు. ఓ అనాథ! నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. నీకేమిటి.. అందరికీ తెలుసులే, అదేం రహస్యం కాదు! ఇదిగో ఇలా ఈ వీల్ చైర్లోనే అక్కడికి వెళ్ళాను! ఎవరికీ నచ్చదు, కాని..’ అంటూ ఓ పుస్తకంలో ఉన్న, ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ నాకందించారు.
అయితే.. ఆయన దాన్ని మామూలు విషయంలా చెప్పడం నాకు చాలా చిరాకు కలిగింది.
మాట్లాడాలనిపించలేదు!
‘మీ అత్తయ్య వెళ్ళిపోయిందిగా, నా తదనంతరం నా పెన్షన్ తీసుకోవడానికి ఎవరూ లేరు! ఈ అమ్మాయికా.. పాపం ఎవరూ లేరు, జీవనాధారం కూడా లేదు! అందుకే.. అలా చేశాను! అంతే గాని, అందరూ అనుకుంటున్నట్టు కాదులే! ఈ సర్టిఫికెట్‌తో అమ్మాయికి ఓ ఆధారం దొరుకుతుంది! ఆ విషయమే మా ఆఫీసు వాళ్ళకి ఈ రోజే ఆర్జీ కూడా పంపిసాను! బ్యాంకులో కాస్త ఈ పని చేసి పెట్టు!’ అంటూ గబగబా ఆయన చెప్పదలుచుకుంది చెప్పేశారు.
ఆ క్షణంలో.. ఆయనకి.. ఏం చెప్పడానికీ నాకు ధైర్యం సరిపోలేదు!
‘సరే.. వస్తాను!’ అంటూ బ్యాంకు దారి పట్టాను.
బ్యాంకులో ఉన్నంతసేపు ఆయన గుర్తుకు రాలేదు.
కాని సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత, తిరిగి నా ఆలోచనలు ఆయన చేసిన పని చూట్టూరే తిరిగాయి!
ఆ రాత్రి ఏదో ఆలోచిస్తున్న నాకు ఒక్కసారిగా.. ఏదో స్ఫురించి, సెల్‌ఫోన్ తీసుకున్నాను.
‘మావయ్యగారు నమస్కారం! నా ఈ అభిప్రాయాన్ని మీ ముందు చెప్పే ధైర్యం లేదు.. అలా అని చెప్పకుండా ఉండనూ లేను! అందుకే ఈ మెసేజ్!
మీ మ్యారేజ్‌ని సమాజం కొందరు తప్పని అనొచ్చు.. లేదా వెనుకనున్న మీ ఆలోచనని కొంతమంది మెచ్చుకోవచ్చు!
కాని నిజానికి.. మీ ఆలోచనని అచరణలో పెట్టడానికి, మీకు పెళ్ళి తప్పనిసరైంది! అసలు మీ ఆలోచనే తప్పు!
మీ ఆస్తిలో కొంత ఆవిడకి ఇచ్చుంటే హర్షించేవాడ్ని, కాని ప్రభుత్వం ఇచ్చే ఈ సౌకర్యాన్ని, మీరు దుర్వినియోగం చేశారు!
ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయాలు పెన్షన్ల కింద ప్రభుత్వం ఇస్తున్నది.
సమాజసేవ అంటూ మీలా అందరూ పెన్షన్లని ఎవరికో ఒకరికి రాసేస్తుంటే.. ఈ దుర్వినియోగనికి ఇంక అంతు ఉండదు! వాటిని చెల్లించడానికి ప్రభుత్వం తిరిగి మన మీదే పన్నులు వేస్తుంది!
మీరు చేసిన పని చట్టసమ్మతం కావొచ్చు. కాని ఈ దేశ పౌరుడుగా నాకు సమ్మతం కాదు!
మీ రాతల్లో కనబడే నిజాయితీ, చేతల్లో కనబడలేదు!
క్షమించండి.. ఇది మూమ్మాటికీ తప్పే!’ మెసేజ్ టైపు చేసి, రామేశంగారికి పంపాను!
తర్వాత.. నాకు నిద్ర పట్టడానికి అట్టే సమయం పట్టలేదు! – జయంతి ప్రకాశశర్మ
Comments
Please login to add a commentAdd a comment