రణయంత్రాలు.. 'యుద్ధాన్ని మనం ముగించకుంటే యుద్ధం మనల్ని?' | Sakshi Special Cover Story On Artificial Robot Soldiers Robot Vehicles Future Technology | Sakshi
Sakshi News home page

రణయంత్రాలు.. 'యుద్ధాన్ని మనం ముగించకుంటే యుద్ధం మనల్ని?'

Published Sun, Aug 11 2024 12:17 AM | Last Updated on Sun, Aug 11 2024 12:17 AM

Sakshi Special Cover Story On Artificial Robot Soldiers Robot Vehicles Future Technology

‘యుద్ధాన్ని మనం ముగించకుంటే యుద్ధం మనల్ని ముగించేస్తుంది’ అన్నాడు ఇంగ్లిష్‌ రచయిత హెచ్‌జీ వెల్స్‌. చాలామంది దేశాధినేతలు ఇప్పటికీ ఈ సంగతిని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే కొత్త కొత్త యుద్ధాలను మొదలుపెడుతున్నారు. మానవాళి జీవనసరళిని సులభతరం చేయాల్సిన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని యుద్ధాల కోసం ఉపయోగించుకుంటున్నారు. సునాయాసంగా సామూహిక జనహననం చేయగల అధునాతన ఆయుధాలను, యుద్ధ వాహనాలను తయారు చేసుకుంటున్నారు. చివరకు రోబో సైనికులను కూడా రంగంలోకి దించుతున్నారు. ‘యుద్ధం విధ్వంసశాస్త్రం’ అన్నాడు కెనడా మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు జాన్‌ అబట్‌. ఈ విధ్వంసశాస్త్ర పురోగతిపై ఒక విహంగ వీక్షణం...

యుద్ధాలు ఎందుకు తలెత్తుతాయంటే, కచ్చితమైన కారణాలను చెప్పడం కష్టం. ప్రధానంగా నియంతల నిరంకుశ ధోరణి, జాత్యహంకారం, మతోన్మాదం, రాజ్యవిస్తరణ కాంక్ష వంటివి చరిత్రలో ప్రధాన యుద్ధ కారణాలుగా కనిపిస్తాయి. అయితే, ఇలాంటి పెద్దపెద్ద కారణాల వల్లనే యుద్ధాలు జరుగుతాయనుకుంటే పొరపాటే! చాలా చిల్లరమల్లర కారణాలు కూడా యుద్ధాలకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి.

చిల్లర కారణంతో జరిగిన యుద్ధానికి ఒక ఉదాహరణ ‘ద పిగ్‌ వార్‌’. ఇది ఒక పంది కోసం అమెరికన్లకు, బ్రిటిషర్లకు మధ్య జరిగిన యుద్ధం. ఇదెలా జరిగిందంటే– అమెరికా ప్రధాన భూభాగానికి, వాంకోవర్‌ దీవికి మధ్య శాన్‌ జువాన్‌ దీవి ఉంది. లైమాన్‌ కట్లర్‌ అనే అమెరికన్‌ రైతు తన పొలంలోకి ప్రవేశించిన పందిని తుపాకితో కాల్చి చంపాడు. ఆ పంది బ్రిటిషర్ల అధీనంలోని హడ్సన్స్‌ బే కంపెనీకి చెందినది. ఈ సాదాసీదా సంఘటన శాన్‌ జువాన్‌ దీవిలో స్థిరపడ్డ అమెరికన్లకు, అక్కడ వలస వ్యాపారం సాగించే బ్రిటిషర్లకు మధ్య యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం 1859లో ప్రారంభమై, 1872 వరకు కొనసాగింది. చరిత్రలో ఇలాంటి యుద్ధాలు మరికొన్ని కూడా జరిగాయి. సామరస్యంగా చర్చలతో పరిష్కరించుకోగలిగే చిన్నా చితకా కారణాల వల్ల తలెత్తిన యుద్ధాలు ప్రాణనష్టానికి, ఆస్తినష్టానికి దారితీశాయి.

రణ పరిణామం..
మొదటి ప్రపంచయుద్ధం నాటికి యుద్ధరంగంలోకి తుపాకులు, ఫిరంగులు, యుద్ధట్యాంకులు, బాంబులను జారవిడిచే యుద్ధవిమానాలు, జలమార్గం నుంచి దాడులు చేసే యుద్ధనౌకలతో పాటు ప్రమాదకరమైన రసాయనిక ఆయుధాలు కూడా వచ్చిపడ్డాయి. రెండో ప్రపంచయుద్ధంలో అణుబాంబులు అందుబాటులోకి వచ్చాయి. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికన్‌ బలగాలు జారవిడిచిన అణుబాంబుల పర్యవసానాలు తెలిసినవే! మొదటి రెండు ప్రపంచయుద్ధాలూ కోట్ల సంఖ్యలో ప్రాణాలను కబళించాయి. ఈ యుద్ధాలు మానవాళికి అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. అలాగని యుద్ధాలు సమసిపోలేదు. రెండు ప్రపంచయుద్ధాల తర్వాత కూడా అనేక యుద్ధాలు జరిగాయి, జరుగుతున్నాయి. కొన్ని అంతర్యుద్ధాలు, ఇంకొన్ని ప్రచ్ఛన్నయుద్ధాలు, మరికొన్ని ప్రత్యక్ష యుద్ధాలు– ఒక్కొక్క యుద్ధంలో సాంకేతిక ఆయుధాలు పదునెక్కుతూ వస్తున్నాయి. ఇప్పటి యుద్ధాల్లో రణయంత్రాలే రణతంత్రాలను నిర్దేశిస్తున్నాయి. కృత్రిమ మేధ యుద్ధాల తీరుతెన్నులనే మార్చేస్తోంది.

రోబో సైనికులు..
పాతకాలంలో సైనికులు పరస్పరం ఎదురుపడి తలపడేవారు. ఒక్కోసారి ఏ కొండల చాటునో, గుట్టల చాటునో మాటువేసి దొంగదాడులతో శత్రుబలగాల మీద విరుచుకుపడేవారు. ఇప్పుడు రోజులు మారాయి. యుద్ధరంగంలోకి రోబో సైనికులను దించుతున్నారు. వీటిని ఎక్కడో ఉంటూ రిమోట్‌ ద్వారా నియంత్రిస్తూ, శత్రువులను మట్టుబెట్టగలుగుతున్నారు. అలాగే, శత్రువుల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను సమర్థంగా నిరోధించగలుగుతున్నారు. రోబో సైనికులు ఆయుధాలను ప్రయోగించడమే కాకుండా, శత్రువులు అమర్చిన మందుపాతరలను తొలగించడం, బాంబులను ఏరివేయడం వంటి పనులు కూడా చేయగలవు. అమెరికా, చైనా వంటి దేశాలు ఇప్పటికే రోబో సైనికులను రూపొందించుకున్నాయి.

వీటిలో కృత్రిమ మేధతో పనిచేసేవి కూడా ఉండటం విశేషం. ఈ రోబోసైనికులు యుద్ధరంగంలో సైనికుల పనిని సులభతరం చేస్తాయి. దాడులకు తెగబడే శత్రుబలగాలను తిప్పికొట్టడం, శత్రువులపై కాల్పులు జరపడం, శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం వంటి పనులను సునాయాసంగా చేస్తాయి. దక్షిణ కొరియా సైన్యం కాపలా విధుల కోసం సెంట్రీ రోబోలను ఉపయోగిస్తోంది. అధునాతన తుపాకులను అమర్చిన ఈ సెంట్రీ రోబోలు సైనిక స్థావరాల వద్ద గస్తీ తిరుగుతుంటాయి. శత్రువులను గుర్తించినట్లయితే, కాల్పులు జరుపుతాయి. యుద్ధరంగంలో రోబో సైనికులతో పాటు చాలా దేశాలు వేర్వేరు పనుల కోసం వేర్వేరు రోబోలను కూడా వాడుతున్నాయి.

యుద్ధరంగంలో భావి సాంకేతికత..
ఇప్పటికే పలు అధునాతన ఆయుధాలు, సైనిక పరికరాలు అగ్రరాజ్యాల అమ్ములపొదిలోకి చేరాయి. ఈ దేశాలు మరిన్ని అధునాతన ఆయుధాలు, వాహనాలు, సైనిక పరికరాల కోసం పరిశోధనలు సాగిస్తున్నాయి. రిస్ట్‌మౌంటెడ్‌ డిస్‌ప్లే సిస్టమ్, హెల్మెట్‌ మౌంటెడ్‌ రాడార్‌ సిస్టమ్‌ వంటి పరికరాల రూపకల్పన ఇప్పటికే తుదిదశకు చేరుకుంది. వీటి నమూనాలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. రిస్ట్‌మౌంటెడ్‌ డిస్‌ప్లే సిస్టమ్‌ యుద్ధరంగంలో పనిచేసే సైనికులకు బాగా ఉపయోగపడుతుంది. సౌరశక్తితో పనిచేసే ఈ సిస్టమ్‌లోని మూడున్నర అంగుళాల స్క్రీన్‌పై చుట్టుపక్కల వివిధ దిశల్లో ఏం జరుగుతోందో, శత్రువుల కదలికలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు చూడవచ్చు. హెల్మెట్‌ మౌంటెడ్‌ రాడార్‌ సిస్టమ్‌ 360 డిగ్రీలలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు స్క్రీన్‌పై ప్రసారం చేస్తుంది.

ఇందులోని మూవింగ్‌ టార్గెట్‌ ఇండికేటర్‌ (ఎంటీఐ) రాడార్‌ సెన్సర్‌ దుమ్ము ధూళి పొగ దట్టంగా కమ్ముకున్న చోట కూడా శత్రులక్ష్యాలను 50 మీటర్ల దూరం నుంచి స్పష్టంగా చూపగలుగుతున్నాయి. పలు దేశాలు ఇప్పటికే హైపర్‌సోనిక్‌ మిసైల్స్‌ను వినియోగంలోకి తెచ్చాయి. అయితే, ధ్వనివేగానికి ఇరవైరెట్ల వేగంతో దూసుకుపోయే హైపర్‌సోనిక్‌ మిసైల్స్‌ తయారీకి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అణుబాంబులను మోసుకుపోగలిగే హైపర్‌సోనిక్‌ మిసైల్స్‌ 2040 నాటికి అందుబాటులోకి రాగలవని అంచనా. రష్యా, చైనా, అమెరికా సైన్యాలు ఈ స్థాయి హైపర్‌సోనిక్‌ మిసైల్స్‌ తయారీకి పోటాపోటీగా ప్రయోగాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే ఈ దేశాల సైనికబలగాలు హైపర్‌సోనిక్‌ యుద్ధవిమానాలను వాడుకలోకి తీసుకొచ్చాయి. సైనిక ప్రయోగాల కోసం, హైటెక్‌ ఆయుధాల తయారీ కోసం అమెరికా భారీ స్థాయిలో ఖర్చు చేస్తోంది. ఈ కార్యక్రమాల కోసం అమెరికా చేసే ఖర్చు 2040 నాటికి ట్రిలియన్‌ డాలర్లను (రూ.83.50 లక్షల కోట్లు) అధిగమిస్తుందని అమెరికన్‌ రక్షణరంగ నిపుణుడు పీటర్సన్‌ చెబుతున్నారు.

రష్యా, చైనాలు కూడా హైపర్‌సోనిక్‌ మిసైల్స్‌ రూపకల్పనలో ప్రయోగాలు సాగిస్తున్నాయి. భారీస్థాయిలో విధ్వంసాలు సృష్టించగల అణుబాంబులను మోసుకుపోయి ఖండాంతర లక్ష్యాలను ఛేదించగల మిసైల్స్‌ తయారీకి ఈ దేశాలు ముమ్మర యత్నాలు చేస్తున్నాయి. వీటికి తోడు దుందుడుకు అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ నేతృత్వంలోని ఉత్తర కొరియా కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదకర ఆయుధాల తయారీకి ప్రయోగాలను సాగిస్తోంది. వివిధ దేశాలు డైరెక్ట్‌ ఎనర్జీ వెపన్స్‌ తయారీకి ప్రయోగాలు సాగిస్తున్నాయి. రైల్‌ గన్స్‌ వంటి డైరెక్ట్‌ ఎనర్జీ వెపన్స్‌ ప్రభావవంతంగా పనిచేసే ఆయుధాలే అయినప్పటికీ, విద్యుత్తు సరఫరా ఉంటేనే ఇవి పనిచేయగలవు. యుద్ధక్షేత్రంలో విద్యుత్తు సరఫరా కోసం అత్యధిక సామర్థ్యం గల హైడెన్సిటీ మొబైల్‌ పవర్‌స్టోరేజ్‌ సిస్టమ్స్, మినీ న్యూక్లియర్‌ రియాక్టర్స్‌ వంటి వాటి తయారీకి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కొనసాగుతున్న యుద్ధాలు..
ఇప్పటికే ఉక్రెయిన్‌–రష్యాల మధ్య, ఇజ్రాయెల్‌– పాలస్తీనా, ఇజ్రాయెల్‌–లెబనాన్, సూడాన్‌లోని రెండు వర్గాల సైన్యం మధ్య యుద్ధాలు కొనసాగుతున్నాయి. వీటి వల్ల ఇప్పటికే చాలా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. ఈ యుద్ధాలను నిలువరించేందుకు ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ శక్తులు చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇతర దేశాలు బాహాటంగా వీటిలో ఏదో ఒక పక్షం తీసుకున్నట్లయితే, దాని పర్యవసానంగా మూడో ప్రపంచయుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం లేకపోలేదు.

ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలే కాకుండా, ఇథియోపియా, హైతీ వంటి దేశాల్లోని అలజడులు, ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంపై పట్టు కోసం అమెరికా–చైనాల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో చెప్పడం కష్టం. ఈ పరిస్థితులు అదుపు తప్పి మూడో ప్రపంచ యుద్ధమే గనుక జరిగితే, జరగబోయే బీభత్సం ఊహాతీతంగా ఉంటుంది. ‘మూడో ప్రపంచయుద్ధంలో ఏ ఆయుధాలతో పోరు జరుగుతుందో నాకు తెలీదు గాని, నాలుగో ప్రపంచయుద్ధంలో మాత్రం మనుషులు కర్రలు, రాళ్లతోనే కొట్టుకుంటారు’ అని ఐన్‌స్టీన్‌ ఏనాడో అన్నాడు. మూడో ప్రపంచయుద్ధమే గనుక సంభవిస్తే, దాని దెబ్బకు భూమ్మీద నాగరికత తుడిచిపెట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి. యుద్ధంలో మరణించిన వాళ్లు మరణించగా, అరకొరగా మిగిలిన వాళ్ల మధ్య గొడవలు తలెత్తితే, వాళ్ల పోరాటానికి ఆధునిక ఆయుధాలేవీ మిగిలి ఉండకపోవచ్చు. అప్పుడు ఐన్‌స్టీన్‌ మాటలే నిజం కూడా కావచ్చు.

రోబో వాహనాలు..
దేశాల సైనిక బలగాలు రకరకాల రోబో వాహనాలను వాడుతున్నాయి. డ్రైవర్‌ లేకుండానే ఇవి ప్రయాణించగలవు. రిమోట్‌ కంట్రోల్‌తో వీటిని సుదూరం నుంచి నియంత్రించవచ్చు. వీటిలో కొన్నింటికి ఆయుధాలను అమర్చి యుద్ధరంగానికి పంపే వెసులుబాటు ఉంది. వీటి ద్వారా శత్రుస్థావరాలను ఇట్టే మట్టుబెట్టవచ్చు. కొన్ని రకాల రోబో వాహనాలను శత్రువులు అమర్చిన మందుపాతరలను, బాంబులను నిర్వీర్యం చేయడానికి కూడా వాడుతున్నారు. రోబో వాహనాల్లో యుద్ధట్యాంకుల స్థాయి వాహనాల నుంచి బాంబులు, మందుపాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసే ఆటబొమ్మల్లా కనిపించే చిన్న చిన్న రోబో వాహనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, అమెరికన్‌ బలగాలు ఉపయోగిస్తున్న ‘గార్డ్‌బో’ అనే రోబో వాహనం చూడటానికి బంతిలా ఉంటుంది. ఇది ఉభయచర వాహనం. నేల మీద, నీటిలోను ఇది సునాయాసంగా ప్రయాణించగలదు.

ఇది గస్తీకి, నిఘా పనులకు ఉపయోగపడుతుంది. అమెరికన్‌ బలగాలు వాడుతున్న ‘మాడ్యులర్‌ అడ్వాన్స్‌డ్‌ ఆర్మ్‌డ్‌ రోబోటిక్‌ సిస్టమ్‌’ (మార్స్‌) మనుషులు నడిపే యుద్ధట్యాంకులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. దీనిని మనుషులు నేరుగా నడపాల్సిన పనిలేదు. రిమోట్‌ కంట్రోల్‌తో దీనిని సుదూరం నుంచి నియంత్రంవచ్చు. దీనికి అమర్చిన ఫిరంగులతో శత్రుస్థావరాలపై దాడులు జరపవచ్చు. బ్రిటిష్‌ సైన్యం ఉపయోగించే డ్రాగన్‌ రన్నర్‌ చూడటానికి చిన్న పిల్లల ఆటబొమ్మలా ఉన్నా, ఇది చాలా సమర్థమైన రోబో వాహనం. రిమోట్‌తో నడిచే ఈ వాహనం మందుపాతరలను, పేలని బాంబులను ముప్పయి అడుగుల దూరం నుంచి గుర్తించి, అప్రమత్తం చేస్తుంది. చైనా సైన్యం రోబో ఆర్మ్‌డ్‌ డాగ్‌ను ఇటీవల రంగంలోకి దించింది. ఇది చూడటానికి ఆటబొమ్మలా కనిపిస్తుంది గాని, దీనికి అమర్చిన ఆటోమేటిక్‌ గన్‌ ద్వారా కాల్పులు జరపగలదు. దీనిని రిమోట్‌ ద్వారా సుదూరం నుంచి ఉపయోగించుకోవచ్చు.

మన అమ్ములపొదిలోనూ ఏఐ ఆయుధాలు..
- రాజ్యాలకు పోటీగా భారత్‌ కూడా రోబోటిక్‌ ఆయుధాలను, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది.
హైదరాబాద్‌కు చెందిన ‘జెన్‌ టెక్నాలజీస్‌’ భారత సైన్యం కోసం ‘ప్రహస్త’ పేరుతో రోబో జాగిలాన్ని, ‘హాక్‌ ఐ’ పేరుతో పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను సైతం గుర్తించగలిగే యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను, ‘స్థిర్‌ స్టాబ్‌–640’ పేరుతో నేలపై తిరిగే యుద్ధ వాహనాలతో పాటు యుద్ధనౌకల నుంచి ఆయుధాలను గురి తప్పకుండా ఉపయోగపడే పరికరాన్ని, ‘బర్బరీక్‌’ పేరుతో అల్ట్రాలైట్‌ రిమోట్‌ కంట్రోల్‌ కంబాట్‌ వెపన్‌ స్టేషన్‌ను రూపొందించింది. వీటన్నింటినీ దూరం నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా నియంత్రించవచ్చు. శత్రువుల దాడులను తిప్పికొట్టడానికి, చొరబాటుదారులను నిరోధించడానికి ఇవి సమర్థంగా ఉపయోగపడతాయి.

చిల్లర కారణంతో జరిగిన యుద్ధానికి ఒక ఉదాహరణ ‘ద పిగ్‌ వార్‌’. ఇది ఒక పంది కోసం అమెరికన్లకు, బ్రిటిషర్లకు మధ్య జరిగిన యుద్ధం. ఇదెలా జరిగిందంటే– అమెరికా ప్రధాన భూభాగానికి, వాంకోవర్‌ దీవికి మధ్య శాన్‌ జువాన్‌ దీవి ఉంది. లైమాన్‌ కట్లర్‌ అనే అమెరికన్‌ రైతు తన పొలంలోకి ప్రవేశించిన పందిని తుపాకితో కాల్చి చంపాడు. ఆ పంది బ్రిటిషర్ల అధీనంలోని హడ్సన్స్‌ బే కంపెనీకి చెందినది. ఈ సాదాసీదా సంఘటన శాన్‌ జువాన్‌ దీవిలో స్థిరపడ్డ అమెరికన్లకు, అక్కడ వలస వ్యాపారం సాగించే బ్రిటిషర్లకు మధ్య యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం 1859లో ప్రారంభమై, 1872 వరకు కొనసాగింది. చరిత్రలో ఇలాంటి యుద్ధాలు మరికొన్ని కూడా జరిగాయి. సామరస్యంగా చర్చలతో పరిష్కరించుకోగలిగే చిన్నా చితకా కారణాల వల్ల తలెత్తిన యుద్ధాలు ప్రాణనష్టానికి, ఆస్తినష్టానికి దారితీశాయి.

స్మార్ట్‌ ఆయుధాలు..
‘స్మార్ట్‌’యుగం. స్మార్ట్‌ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి వచ్చిన తరుణంలోనే వివిధ దేశాల సైనిక బలగాలు తమ ఆయుధాగారాల్లోకి స్మార్ట్‌ ఆయుధాలను కూడా చేర్చుకుంటున్నాయి. వీటిలో స్మార్ట్‌ గ్రనేడ్‌ లాంచర్లు, డిజిటల్‌ రివాల్వర్లు వంటివి ఉన్నాయి. అమెరికన్‌ సైన్యం దశాబ్దం కిందటే స్మార్ట్‌ గ్రనేడ్‌ లాంచర్‌ను వినియోగంలోకి తెచ్చింది. ‘ఎక్స్‌ఎం25 కౌంటర్‌ డిఫిలేడ్‌ టార్గెట్‌ ఎంగేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ (సీడీటీఈ) గ్రనేడ్‌ లాంచర్‌ను అఫ్గాన్‌ యుద్ధంలో ఉపయోగించింది. దీని నుంచి ప్రయోగించిన గ్రనేడ్లు లక్ష్యం వైపుగా దూసుకుపోయి సరిగా లక్ష్యంపైన లేదా లక్ష్యానికి అత్యంత చేరువలో గాల్లోనే పేలుతాయి. ఇవి 150 మీటర్ల నుంచి 700 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించ గలవు. డిజిటల్‌ రివాల్వర్లను స్మార్ట్‌వాచ్‌ ద్వారా లాక్‌ లేదా అన్‌లాక్‌ చేసుకోవచ్చు. ఆటబొమ్మల్లా కనిపించే ఈ డిజిటల్‌ రివాల్వర్లను పలు దేశాల సైనిక బలగాలు ఇప్పటికే ఉపయోగిస్తున్నాయి. సైన్స్‌ఫిక్షన్‌ సినిమాల్లో కనిపించేలాంటి చిత్రవిచిత్రమైన ఆయుధాలు కూడా ప్రస్తుతం విరివిగా వాడుకలోకి వస్తున్నాయి. ఉదాహరణకు హాలీవుడ్‌ సినిమా ‘మైనారిటీ రిపోర్ట్‌’లో పోలీసు బలగాలు ‘సిక్‌ స్టిక్స్‌’ అనే ఆయుధాలు ఉపయోగించిన దృశ్యాలు ఉన్నాయి.

‘సిక్‌ స్టిక్స్‌’ ఎవరిని తాకినా వారికి వెంటనే వాంతులవుతాయి. ఈ సినిమా 2002లో విడుదలైతే, 2007 నాటికల్లా దాదాపు ఇలాంటి ఆయు«ధాలే ‘వోమిట్‌ గన్స్‌’ వాడుకలోకి వచ్చేశాయి. ఇవి ప్రాణాంతకమైన ఆయుధాలు కాకున్నా, అల్లరి మూకలను చెదరగొట్టేందుకు ఉపయోగపడతాయి. వీటి నుంచి వెలువడే రేడియో తరంగాలు లక్ష్యం దిశగా ప్రయాణించి, చెవులు గింగుర్లెత్తి, తలతిరిగేలా చేస్తాయి. వీటి బారి నుంచి క్షణాల్లోనే తప్పించుకోకుంటే, ఇవి వాంతులయ్యేలా చేస్తాయి. అమెరికన్‌ నావికాదళం కోసం ‘ఇన్వోకాన్‌’ కంపెనీ ఈ ‘వోమిట్‌ గన్స్‌’ను రూపొందించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే టాక్టికల్‌ డ్రోన్స్, అన్‌మేన్డ్‌ ఏరియల్‌ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎనేబుల్డ్‌ ప్లేన్స్, అటానమస్‌ ట్యాంక్స్, అటానమస్‌ వెపన్స్‌ వంటివి కూడా స్మార్ట్‌ ఆయుధాల కోవలోకే వస్తాయి. సంపన్న దేశాలు పోగేసుకుంటున్న ఇలాంటి ఆయుధాలు భారీస్థాయిలో విధ్వంసాలను సృష్టించగలవు. – పన్యాల జగన్నాథదాసు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement