ఈ సంవత్సరమే జరిగిన పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో.. అవినీతి ఆరోపణల కింద ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. అతని పార్టీ పీటీఐ (పాకిస్తాన్ తెహ్‌రీక్ ఇ ఇన్సాఫ్) తరఫున అతను పోటీ చేయడానికే కాదు.. ప్రచారం చేయడానికీ వీల్లేదని ఆ దేశపు సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది. దాంతో పీటీఐ అభ్యర్థులంతా స్వతంత్రంగా బరిలోకి దిగారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికలుగా ఇమ్రాన్ ప్రచారం చేసిపెట్టాడు. ప్రసంగాలిచ్చాడు. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ కోర్టు తీర్పును ధిక్కరించాడా? అయ్యో అస్సలు కాదు. జైల్లోనే ఉన్నాడు. మరి? ప్రచారం, ప్రసంగాలు చేసింది ఇమ్రాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవతార్!
ఒక్క పాకిస్తాన్‌లోనే కాదు ప్రపంచ రాజకీయాల్లో తన చిప్‌ని దూర్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్! దాదాపు 50కి పైగా దేశాలకు ఇది ఎన్నికల సంవత్సరం. సుమారు రెండు బిలియన్ల (రెండువందల కోట్లు) మంది ఓటును వినియోగించుకుంటున్నారు. అమెరికా టు ఆఫ్రికా, ఆసియా టు ఐరోపాలోని దేశాల్లో జరిగే ఈ ఎన్నికల్లో పాలసీ మ్యాటర్స్, ప్రచారం .. పాజిటివ్, నెగటివ్ రెండు కోణాల్లో ఏఐదే ప్రధాన పాత్ర! అందుకే 2024, గ్లోబల్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ సంవత్సరాన్ని ఏఐ ఎలక్షన్స్ ఇయర్ అంటున్నారు. ఈ సందర్భంగా.. మన దగ్గర స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సాంకేతికత అందిపుచ్చుకుంటున్న ఈ క్షణం దాకా ఎన్నికల ప్రచారాల్లో వస్తున్న మార్పుల వెంట సరదాగా నడిచొద్దాం..
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొన్ని దశాబ్దాల వరకు ఎన్నికల ప్రచారమంటే అగ్రనేతలు నిర్వహించే బహిరంగ సభలే! ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలకి వస్తే.. ఖాదీ వస్త్రధారణ, పవర్‌ఫుల్ స్లోగన్సే ప్రచారస్త్రాలుగా ఉండేవి. 1965లో లాల్‌బహదూర్ శాస్త్రి ‘జైజవాన్ జై కిసాన్’తో మొదలైందీ ఎన్నికల నినాద యాత్ర. ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లోని ఉరువా బహిరంగ సభలో ఆ నినాదాన్నిచ్చారు ఆయన. చైనా, పాకిస్తాన్‌లను దృష్టిలో పెట్టుకుని.. సరిహద్దు గట్టి రక్షణకు సైనికుల బలాన్ని, వ్యవసాయాధారిత మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక రైతులే కాబట్టి వాళ్ల సంక్షేమాన్ని కాంక్షిస్తూ.. ఆ రెండు వర్గాలకు తమ సర్కారు అండగా ఉంటుందనే భరోసాను కల్పించడానికి శాస్త్రి ఆ స్లోగన్‌ని అందుకున్నారు. అది వైరలై నేటికీ లైవ్‌గానే ఉంది.
1971లో ఇందిరాగాంధీ ఇచ్చిన ‘గరీబీ హటావో (పేదరిక నిర్మూలన)’ నినాదం కాంగ్రెస్‌కి ల్యాండ్‌స్లైడ్ విక్టరీని తెచ్చిపెట్టింది. అయితే ఆ నినాదానికి యాంటీగా ప్రతిపక్షాలు.. ‘గరీబీ కాదు గరీబోంకో హటారహే (పేదరికాన్ని కాదు పేదలను నిర్మూలిస్తోంది)’ అంటూ ఆమెను ట్రోల్ చేశాయి. 1975 ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికలప్పుడు జనతా పార్టీ ‘ఇందిరా హటావో దేశ్ బచావో’ స్లోగన్‌తో విజయం సాధించింది. ఇందిరా హత్య తర్వాత 1984 ఎన్నికల్లో ‘జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా.. ఇందిరా తేరా నామ్ రహేగా (సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఇందిరా నీ పేరుంటుంది)’ నినాదంతో కాంగ్రెస్ గెలుపొందింది.
1989లో వీపీ సింగ్ ‘రాజా నహీ ఫకీర్ హై.. దేశ్ కీ తక్‌దీర్ హై (రాజు కాదు పేద.. ఆయనే ఈ దేశపు భాగ్యప్రదాత)’ స్లోగన్‌తో ఎన్నికలను జయించి ప్రధాని అయ్యాడు.1996 స్లోగన్ ‘బారీ బారీ అబ్ కీ బారీ అటల్ బిహారీ’ ఎంత పాపులరో వేరేగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత వరుసగా ‘ఇండియా ఈజ్ షైనింగ్’, ‘కాంగ్రెస్ కే హాత్ ఆమ్ ఆద్మీ కే సాథ్ (కాంగ్రెస్ హస్తం.. సామాన్యుడికి ఆపన్న హస్తం)’ నినాదాలు ఆయా పార్టీల ఐడెంటిటీలుగా మారాయి. అయితే నినాదాల పవర్ సోషల్ మీడియా ఇరాలోనూ కొనసాగుతోంది. ‘అచ్ఛే దిన్ ఆలే వాలే హై (మంచి రోజులు రానున్నాయి)’, ‘హాత్ బద్లేగా హాలాత్ (హస్తం మార్పును తెస్తుంది), ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’, ‘అబ్ కీ బార్ చార్‌సౌ పార్’ వంటి నినాదాలే అందుకు నిదర్శనం.
స్వాతంత్య్రం వచ్చిన ఓ రెండుమూడు దశాబ్దాల వరకు ఎన్నికల ప్రచారంలో రేడియో కూడా ప్రధాన పాత్ర పోషించింది. దశాబ్దం కిందటి వరకు పత్రికలు, టీవీల్లో అడ్వర్‌టైజ్‌మెంట్స్ ఆ రోల్‌ని తీసుకున్నాయి. వీటితోపాటు గోడ పత్రికలు, పాంప్లెట్స్, వాల్ రైటింగ్స్ కూడా తమ ఉనికిని చాటాయి. ప్రైవేట్ చానళ్ల పర్వం మొదలయ్యాక అవీ తమ ఇన్‌ఫ్లుయెన్స్‌ని చూపించాయి. నేతల ప్రచార యాత్రలూ ఆయా పార్టీల జయాపజయాలను ప్రభావితం చేశాయి. వాటిల్లో ఆడ్వాణీ రథ యాత్ర ఒకటి. ఇది వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచినప్పటికీ రైట్ వింగ్ ఐడియాలజీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఫలితంగా ఆ తర్వాత ఐదేళ్లలోనే కేంద్రంలో ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునేలా చేసింది.
రిగ్గింగ్ చేస్తున్నట్టు..
స్లొవేకియాలో నిరుడు జరిగిన ఎన్నికల్లో.. ప్రధాన పార్టీల తరఫున నిలబడిన వ్యక్తి ఆడియో టేప్ సంచలనంగా మారింది. ఆ టేప్‌లో.. తాను ఎలా రిగ్గింగ్ చేయబోతున్నాడో మరొకరికి విపులంగా వివరిస్తున్నాడు. ఆ ఆడియో బయటకు వచ్చాక సదరు నేత ఎన్నికల్లో ఓడిపోయాడు. అతనికి అమెరికా, నాటో దేశాలను సమర్థించే వ్యక్తిగా పేరుంది. అందుకే అతన్ని ఎన్నికల్లో ఓడించేందుకు ఏఐ సాయంతో రష్యన్ ఏజెన్సీలు డీప్‌ఫేక్ ఆడియోను çసృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశాయి అమెరికా అనుకూల అభ్యర్థి ఓటమికి దారులు వేసి, రష్యన్ అనుకూల వ్యక్తిని గెలిపించుకున్నాయి. ఎన్నికల అనంతరం యూఎస్ చేపట్టిన సమగ్ర విచారణలో ఈ అంశం వెలుగు చూసింది.
జంతువులతో పోల్చినట్టు..
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండోనేషియా ఎన్నికలపైనా ఏఐ ఎఫెక్ట్ పడింది. ప్రభుత్వాధినేత ప్రభోవో సుబియాంటో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉపాధ్యక్షుడు గిబ్రాన్ రకాబుమ్మింగ్ తీవ్రంగా విమర్శిస్తున్న వీడియో అక్కడ సంచలనమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకునే వ్యక్తులను ఉపాధ్యక్షుడు ‘జూ’లోని జంతువులతో పోల్చినట్టుగా ఉందీ వీడియోలో. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ వీడియోపై విచారణ జరిపించింది. గిబ్రాన్ పాత వీడియోకు ఏఐ జనరేటెడ్ వాయిస్‌ను జోడించి ఫేక్ వీడియో క్రియేట్ చేసినట్టుగా తేలింది.
తప్పుకుంటున్నట్టు..
ఈ సంవత్సరం మొదట్లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో అబ్దుల్లా నహీద్.. స్వతంత్ర అభ్యర్థిగా గాయ్‌బంధా నుంచి బరిలోకి దిగారు. ఎన్నికల పోరులో గెలుపు కోసం అతను శ్రమిస్తుండగా.. హఠాత్తుగా ఓ వీడియో బయటకు వచ్చింది. అతను పోటీ నుంచి తప్పుకుని ప్రత్యర్థికి మద్దతు ఇస్తున్నట్టుగా! దీంతో అప్పటి వరకు నహీద్‌కు వచ్చిన ప్రచార ఊపంతా గంగపాలైంది. చివరకు ఆ వీడియో డీప్ ఫేక్‌గా నిర్ధారణైంది.
సోషల్ మీడియా..
తొంభైయ్యవ దశకంలో ఎన్నికల ప్రచారం పేరుతో అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేయడం మొదలైంది. సామాన్యులు పోటీలో నిలబడి తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో రాజకీయ ప్రచారంపై ఎన్నికల కమిషన్ నజర్ పెట్టింది. కొత్త నియమ నిబంధనలను తీసుకొచ్చింది. అలా రాజకీయ ప్రచారానికి హద్దులు నిర్దేశమవుతున్న తరుణంలో ఐవీఆర్‌ఎస్ కాల్స్ ఎన్నికల ప్రచారంలో భాగం పంచుకున్నాయి. ఆ తర్వాత కొద్ది కాలానికే ఇంటర్నెట్ విప్లవం వచ్చి పడింది. సోషల్ మీడియాను మోసుకొచ్చింది. అంతే ఈమెయిల్స్, వాట్సాప్ మొదలు యూట్యూబ్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్, ఎక్స్, ఇన్‌స్టా లాంటి సోషల్ మీడియా పాపులర్ ప్లాట్‌ఫామ్స్ జనాలకు చేరువయ్యాయి. ఆదిలోనే వాటి ఇంపాక్ట్‌ని గ్రహించి.. సమర్థవంతంగా వాడుకున్న పార్టీగా బీజేపీకి పేరుంది. గుజరాత్‌లో మొదలైన మోదీ వేవ్ 2014లో సోషల్ మీడియా వేదికగా దేశమంతటా విస్తరించడానికి కారణమైంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీ..
సోషల్ మీడియా ప్రచారాన్ని రాకెట్‌లోకి ఎక్కించి ఆకాశం అందుకునేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌స(ఏఐ) ఎంట్రీ ఇచ్చింది. 2013 నుంచే ఏఐ వాడకం మొదలైనా అది శైశవ దశ. ఇప్పుడు ఏఐ యవ్వన దశకు చేరుకుంది. సరదాగా మొదలైన ఏఐ వాడకం ప్రొఫెషన్స్‌సకి ఉపకరణంలా మారింది. ఇప్పుడు మరింతగా ముదిరి ఎన్నికల ప్రక్రియలో భాగమైంది. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఓటును వినియోగించుకునేందుకు అందుబాటులో ఉన్న సమాచారం ఎంతో కీలకం. తమకు తెలిసిన, తమ దగ్గరకు వస్తున్న సమాచారం ఆధారంగానే ఓటరు నిర్ణయం ప్రభావితం అవుతుంది. కానీ ఇప్పుడు గెలుపే పరమావధిగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏఐని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికి వినియోగిస్తున్నారు. ఇలా చేస్తున్న వారిలో రాజకీయాల్లోని వ్యక్తులతో పాటు ఆకతాయిలూ ఉంటున్నారు. ఫలితంగా అగ్రరాజ్యమైన అమెరికా నుంచి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ వరకు అంతటా ఎన్నికల ప్రక్రియ కుదుపునకు లోనయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏఐ వాడి, వేడికి అమెరికా, యూరప్‌లలో ఫెయిర్ ఎలక్షన్స్‌స కోరుకునే ప్రజాస్వామ్యవాదులకు దడ మొదలైంది.
ఆర్థిక, ఆయుధ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచంపై అమెరికా ఆధిపత్యం తెలియంది కాదు. అమెరికా తన దగ్గరున్న టెక్నాలజీ సాయంతో ఇండియాలో మన చేతికి ఉన్న వాచిలో టైమ్ ఎంతో చూడగలదని చెబుతుంటారు. అంతటి అమెరికా అధ్యక్షుడికే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌స చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో! డెమొక్రాట్ల తరఫున బైడెన్, రిపబ్లికన్ ల తరఫున డోనాల్డ్ ట్రంప్‌లు ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఏఐ ద్వారా వచ్చే సమస్యలను ఎదుర్కోవడం వారికీ సవాలుగా మారిందనడంలో సందేహం లేదు.
ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తున్న వీడియో
ఇద్దరినీ..
తైవాన్ ఎన్నికల సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు సైయింగ్ వెన్ లక్ష్యంగా అనేక ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వాటిల్లో ఆ దేశానికి చెందిన ప్రముఖ న్యూస్ యాంకర్‡దేశాధ్యక్షుడిని ఇంటర్వ్యూ చేసినట్టుగా ఉన్ని వీడియో ఒకటి. అందులో చైనా – తైవాన్ సంబంధాలపై దేశ అధ్యక్షుడి ప్రతిష్ఠకు భంగం కలిగేలా సమాచారం వ్యాప్తి చేశారు. ఈ డీప్‌ఫేక్ వీడియోలో అధ్యక్షుడి వాయిస్‌నే కాదు న్యూస్ యాంకర్‌నూ ఏఐ ద్వారా సృష్టించారు.
ఘాటైన వ్యాఖ్యలు!
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇటీవల వారణాసి వెళ్లారు. అక్కడ జరిగిన అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. అయితే కొద్ది రోజులకే ఏఐ సాయంతో రణ్‌వీర్‌సింగ్ వాయిస్‌ను క్లోన్ చేసి అదే వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. అందులో.. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, మోడీ అసంబద్ధ విధానాలపై రణ్‌వీర్‌సింగ్ ఘాటైన వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది. అంతేకాదు దేశ భవిష్యత్తు కోసం రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరినట్టుగా ఉంది. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది. వెంటనే తేరుకున్న రణ్‌వీర్ సింగ్ కుటుంబం సదరు తప్పుడు సమాచారాన్ని షేర్ చేసిన వారిపై కేసు పెట్టింది. మరో హీరో ఆమిర్‌ఖాన్ కూ ఇలాంటి అనుభమే ఎదురైంది.
ఇమ్రాన్ .. నీకు నేనున్నాను!
ఈ మార్చి మొదట్లో ట్రంప్ మాట్లాడుతున్న వీడియో ఒకటి అమెరికాలో వైరల్ అయింది. అందులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ును ఉద్దేశిస్తూ ట్రంప్ చెప్పిన మాటలు అమెరికాలో సంచలనం కలిగించాయి. త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే, ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను విడిపిస్తానని, అమెరికా– పాకిస్తాన్ ల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తానని ట్రంప్ మాట్లాడినట్టుగా ఆ వీడియోలో ఉంది. దీనిపై నలువైపులా విమర్శలు చుట్టుముట్టాయి. చివరకు టెక్నోక్రాట్స్, అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు రంగంలోకి దిగి దర్యాప్తు జరిపితే.. అది ఏఐ యాప్ ద్వారా తయారైన డీప్ ఫేక్ వీడియో అని తేలింది. ట్రంప్ మాట్లాడుతున్న పాత వీడియోలు, ట్రంప్‌ను పోలిన ఏఐ వాయిస్ సాయంతో కొత్త వీడియోను తయారుచేసి వదిలారు. అది నిజామా.. కాదా? అని తెలుసుకునేలోపు ఆ వీడియో సగం అమెరికాను చుట్టొచ్చింది.
అంతేకాదు న్యూహాంప్‌షైర్ ప్రైమరీ ఎన్నికలప్పుడు.. అక్కడి ఓటర్లకు ఫోన్ కాల్స్ వచ్చాయి. అందులో బైడెన్ స్వయంగా.. ప్రైమరీ ఎన్నికల్లో ఓటు వేయద్దంటూ ఆ ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల్లో సేవ్ చేసిన ఓటును త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు కోసం ఉపయోగించాలంటూ విజ్ఞప్తి చేశారు. గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, ట్రంప్‌ల మధ్య విజయం దోబూచులాడింది. ఓట్ల లెక్కింపు అంశం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో బైడెన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ నిజమేనేమోనని సగటు అమెరికన్ ఓటరు నమ్మే పరిస్థితి నెలకొంది. కానీ విచారణలో ఏఐ సాయంతో బైడెన్ వాయిస్‌ను సృష్టించి ఆ కాల్స్ చేసినట్టు తేలింది. ఇలా అసలు జరగని విషయాన్ని కచ్చితంగా జరిగిందన్నట్టుగా మన పంచేద్రియాలను నమ్మించడం సులువైపోయింది.
మన దగ్గర..
అమెరికన్ ర్యాపర్ లిల్ యాచీ నడక ఆధారంగా.. ప్రధాని నరేంద్ర మోదీని డిక్టేటర్‌గా పేర్కొంటూ రూపొందిన ఏఐ మీమ్.. ఎక్స్‌లో పోస్ట్ అయిన క్షణాల్లోనే వైరల్ అయింది. ఆ వెంటనే దేశంలో అనేక మంది రాజకీయ నాయకుల ఏఐ మీమ్స్, ఏఐ అవతార్‌లు స్క్రీన్ మీదకు వచ్చాయి. ఆఖరికి ఈ ఏఐ మీమ్స్ ట్రెండ్‌పై సాక్షాత్తు ప్రధాని ‘నా మీద చేసిన మీమ్ చాలా క్రియేటివ్‌గా ఉంది. ఎన్నికల ఒత్తిడితో సతమతమవుతున్న నేను దీన్ని చూసి భలే రిలాక్స్ అయ్యాను’ అని స్పందించారు. భారతీయ జనతా పార్టీ కూడా తన ఎన్నికల ప్రచారానికి ఏఐని వాడుకుంటోంది. ప్రధాని మోదీ హిందీ సంభాషణను ఏఐ సాయంతో ఎనిమిది ప్రాంతీయ భాషల్లోకి మార్చింది.
నేరుగా దేశ ప్రధానే తమ సొంత భాషలో తమతో మాట్లాడారు అని ప్రజలు మురిసిపోయారు. సాంకేతికతను ఒడిసిపట్టుకున్నామని బీజేపీ ఆనందంతో గంతులేసింది. అదే విధంగా గడిచిన పదేళ్లలో భారత్ ఎలా అభివృద్ధి చెందిందనే అంశాలపైనా ఏఐ సాయంతో వీడియో రూపొందించి జనాల్లోకి వదిలింది. ప్రచారంలో దూసుకుపోయింది. ఏఐని మంచికి వాడుకుంటే తప్పులేదు. ప్రజలను భ్రమల్లోకి నెట్టాలనుకుంటేనే ప్రమాదం. ప్రపంచంలోనే ఏ దేశానికి లేనంత యువ జనాభా మన సొంతం. ఈ యువ భారతానికి స్పీడెక్కువ.
సోషల్ మీడియా అధికంగా ఉపయోగించేది వీళ్లే. ఈ ఉడుకు రక్తానికి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా.. నిజాన్ని తలదన్నేలా ఏఐ తయారుచేస్తున్న తప్పుడు సమాచారం అందితే? దాని ఆధారంగా వారి ప్రయాణం సాగితే? వ్యక్తులుగా వారికి, వ్యవస్థగా దేశానికి తీరని నష్టం. రెచ్చగొట్టే సభలు, సమావేశాలు, తప్పుడు ప్రకటనలనైతే అడ్డుకోవచ్చు. కానీ చేతిలో ఇమిడిపోయే ఫోన్లను టాయిలెట్లకు సైతం తీసుకుపోతున్న కాలంలో.. నియంత్రణ లేకుండా కనురెప్ప పాటులో సోషల్ మీడియా ద్వారా బట్వాడా అవుతున్న అబ్ధాలను అడ్డుకోవడమెలా?
మరణించిన వ్యక్తి ప్రచారం..
2019లో.. తమిళనాడు, కన్యాకుమారి నుంచి వసంత్ కుమార్ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2020లో ఆయన మరణించారు. మొన్నటి ఏప్రిల్ 19న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కొడుకు విజయ్‌కుమార్ పోటీ చేశారు. అయితే పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు తన కొడుకు విజయ్‌ను గెలిపించాలంటూ వసంత్‌కుమార్ కోరుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. 2020లో చనిపోయిన వసంత్ 2024లో ఎలా ప్రచారం చేశాడా అని జనాలు అవాక్కయ్యారు. అయితే అది డీప్‌ఫేక్ సాయంతో రూపొందించిన వీడియోగా తేలింది.
ఫ్యాక్ట్ చెక్ ఉన్నా..
సాంకేతికంగా రోజుకో కొత్త ఆవిష్కరణ పుట్టుకొస్తున్న ఆధునిక యుగంలో ప్రతి చెడును చట్టాలతో అరికట్టడం ఒకింత కష్టమే! అనుమానం ఉన్న కంటెంట్‌ను పట్టుకుని, దానికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి నిజానిజాలు తేల్చడం ఖర్చు, కాలంతో కూడుకున్న పని. ఫ్యాక్ట్ చెక్, ట్రూత్ ఫైండర్, ఫేక్‌న్యూస్ తదితర పద్ధతుల్లో అసలు ఏదో నకిలీ ఏదో తెలుసుకోవడం సంక్లిష్టంగా మారింది. డిజిటల్ లిటరేట్సే కానీ డిజిటల్ ఎడ్యుకేట్స్ లేదా డిజిటల్లీ చాలెంజ్డ్ జనాభా ఉన్న దేశాల్లో.. అందుబాటులో ఉన్న సమాచారాన్ని పలురకాలుగా వడబోస్తే తప్ప అసలైన విషయం బటయకు రాదు. కానీ అసలు నిజం వెలుగు చూసేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తోంది.
ముల్లును ముల్లుతోనే..
ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా టెక్నాలజీ ఆధారంగా జరుగుతున్న తప్పుడు సమాచార ప్రచారానికి చెక్ పెట్టాలంటే తిరిగి టెక్నాలజీనే ఆయుధంగా మలచుకోవాలి. సాంకెతిక నైపుణ్యంతో సృష్టిస్తున్న అభూత కల్పనలను ఇట్టే పసిగట్టి హెచ్చరించి, నిరోధించే ప్రత్యామ్నాయ యాప్‌లను డెవలప్ చేయడంపై భావి ఆవిష్కర్తలు దృష్టి సారించాలి. లేదంటే నీడే నిజమనే భ్రాంతిలో బతకాల్సి వస్తుంది. ఇప్పటికే గూగుల్, మెటా, ఎక్స్, ఓపెన్ ఏఐ, టిక్‌టాక్‌లు తమ ఫ్లాట్‌ఫామ్స్‌పై డీప్‌ఫేక్ ద్వారా జరిగే ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటామని హామీ ఇచ్చాయి. ఈ మేరకు ఫేక్‌ను గుర్తించే వ్యవస్థలను మరింత సమర్థంగా రూపొందిస్తామని వెల్లడించాయి.
ఎన్నికల వ్యవస్థలోకి ఏఐని జొప్పించి చేస్తున్న విష ప్రచారంపై పాశ్చాత్య ప్రపంచం మేల్కొంది. ఏఐని ఎలా ఎదుర్కొవాలనే అంశంపై చర్చలను నిర్వహిస్తోంది. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా చట్టాలను రూపొందించాలని ప్రపంచ దేశాలకు సూచనలు చేస్తోంది. ఏఐని అరికట్టేందుకు ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల సహకారంతో అంతర్జాతీయ స్థాయి చట్టాల రూపకల్పనకు సమయం ఆసన్నమైందని పోరుతోంది.
యంత్రమా.. హృదయ స్పందనా..
వందమంది చేసే పనిని ఒక్క యంత్రమే చేయగలదు. మనిషి కంటే ఎన్నో రెట్లు శక్తి సామర్థ్యాలు యంత్రాల సొంతం. ఇప్పుడా యంత్రాలకు మరింత మెరుగ్గా ఆలోచించే శక్తిని ఏఐ అందిస్తోంది. అయితే ఎన్ని శక్తియుక్తులు ఉన్నా మనిషి స్పృహ, హృదయ స్పందన ముందు అవన్నీ దిగదుడుపే.
ముగింపు..
సంప్రదాయం, సాంకేతికతకు ఎప్పుడూ ముడిపడదు. ఆ పోరులో టెక్నాలజే ఓ మెట్టు పైన ఉంటుంది. కాలానికి తగ్గట్టు మారాల్సిందే. తప్పదు.. తప్పు లేదు. అయితే మంచిచెడులను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలి. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల పర్యవసానాలు అనుభవించిన తర్వాత ప్రపంచ దేశాలు అణ్వాయుధాల తయారీ మీద స్వీయ నియంత్రణను పాటిస్తున్నాయి. జీవాయుధాల తయారీ, సాగులో బయోటెక్నాలజీ వినియోగం తదితర అంశాల మీద ఓ కన్నేసి ఉంచాయి. కానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఏఐ వాడకం వంటి వాటి నియంత్రణ మీదే ఇంకా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఐక్యం కావాల్సిన సందర్భం వచ్చింది అంటున్నారు సామాజిక, రాజకీయ విశ్లేషకులు. – తాండ్ర కృష్ణ గోవింద్
Comments
Please login to add a commentAdd a comment