కాలానికి కళ్లెం! | Funday Special Cover Story On Value of Time, Needs | Sakshi
Sakshi News home page

కాలానికి కళ్లెం!

Published Sun, Jul 7 2024 12:55 AM | Last Updated on Sun, Jul 7 2024 6:08 AM

Funday Special Cover Story On Value of Time, Needs

‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరేందుకు ఎవరైనా, ఎంతటివారైనా సమయాన్ని నమ్ముకోవాల్సిందే. అందుకే దేనికోసం దేనిని విడిచి పెట్టాలో, ఏ కాలంలో ఏ పని చేయాలో తెలిసి మెలగడం ఉత్తమం’ అంటారు పెద్దలు. మరి ఉరుకుల పరుగుల జీవితంలో సమయాన్ని ఎలా ఒడిసిపట్టుకోవాలి? ఎలా సద్వినియోగం చేసుకోవాలి?

‘గడచిపోయినట్టి క్షణము తిరిగిరాదు, కాలమూరకెపుడు గడపబోకు, దీపమున్నయపుడే దిద్దుకోవలెనిల్లు’ అన్నారు ప్రముఖ రచయిత నార్ల చిరంజీవి. ‘కాలః పచతి భూతాని, కాలం సంహరతే ప్రజాః , కాలః సుప్తేషు జాగర్తి, కాలోహి దురతిక్రమః’ అన్నాడు చాణక్యుడు. ‘కాలం అనేది భగవత్స్వరూపం. ప్రాణుల్ని, జగత్తునూ నడిపించేది, హరించేది కూడా కాలమే! సృష్టి, స్థితి, వినాశాలు చేయగలిగేది కాలం. బలవత్తరమైన కాల ప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఏ ఆధ్యాత్మిక శక్తియుక్తులూ కాలాన్ని బంధించలేవు. పారే నదిలో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో.. అదే విధంగా గడిచిపోయిన సమయాన్ని ఆపలేం. పట్టుకోలేం. అందుకే కాలమహిమను గ్రహించి నడుచుకోవాలి’ అనేదే చాణక్యుడి మాటల్లోని పరమార్థం.

ఈ భూమి మీద ప్రతి జీవికి రోజులో 24 గంటలే ఉంటాయి. దానిలో ఏ మార్పు లేదు. అయితే వాటిని వాడుకోవడంలోనే విజయం, అపజయం దాగి ఉంటుంది. అందుకే మనం సమయాన్ని ఎప్పుడు? దేనికి? కేటాయిస్తున్నాం అనేది ముఖ్యం. నిద్రపోవాల్సిన సమయంలో సెల్‌ఫోన్‌ వాడితే.. ఆరోగ్యం పాడవుతుంది. చదువుకోవాల్సిన సమయాన్ని జల్సాలకు వాడితే జీవితమే నాశనమవుతుంది. ఇలా అవసరాన్ని, అనవసరాన్ని గుర్తించకపోతే.. కోల్పోయిన వాటిని కొలమానాలతో కొలవడానికి తప్ప మరో సమయం మిగలదు.

కాలచక్రంలో పరుగులు తీసే మనిషికి.. కాలాన్ని అంచనా వెయ్యడం.. కాలానికి తగ్గట్టుగా నడుచుకోవడం తెలిసుండాలి. మనం ప్రతిదానికి ‘సమయం రావాలి’ అంటుంటాం. వాదనకో, మాటవరసకో ‘నాకూ టైమ్‌ వస్తుంది’ అని కూడా ఇతరులతో చెబుతుంటాం. ప్రతి కార్యానికి సమయంతో ప్రణాళిక వేస్తూ శుభకార్యాలను నిర్వహిస్తుంటాం. అంతటి ముఖ్యమైన సమయాన్ని.. ముందుగానే కేటాయించుకుని.. పనులు పూర్తిచేసుకోవడం మరింత ముఖ్యం. చేసే ఏ పని అయినా విజయం సాధించాలంటే తప్పనిసరిగా సమయపాలన, క్రమశిక్షణ అవసరం. సమయం వృథా కాకూడదంటే.. ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి? అనేది ముందే ఆలోచించుకోవాలి. చేసే పని పాజిటివ్‌ కోణంలో చేస్తే తిరిగి ఆ పని చేయాల్సిన అవసరం రాదు. అప్పుడే ఆ పనికి.. ఆ సమయానికి సరైన ఫలితం దక్కుతుంది.

అనుకున్న పని ఎంత టైమ్‌లో పూర్తి అవుతుందో ముందే ఓ అంచనా ఉండాలి. ఆ టైమ్‌ అనుకున్న పనికి అనుకూలంగా ఉంటుందో లేదో కూడా గమనించుకోవాలి. ఆ తరువాతే మొదలుపెట్టిన పనిని పూర్తి చేయాలి. ఇలాంటి ప్రణాళికతో కూడిన ఆలోచన వల్ల సమయం వృథా కాకుండా ఉంటుంది. రోజువారీ పనుల్లో కూడా సమయ నిర్వహణ అవసరం. అలాగే ముందు వెనుక అనే ప్రాధాన్యం కూడా ముఖ్యమే. అలా సమయాన్ని పనులవారీగా.. రోజుల వారీగా లెక్కేసుకుని చేసుకుంటే.. ప్రాధాన్యాన్ని బట్టి.. అనుకున్న సమయం కంటే తక్కువ సమయంలోనే ఆ పనులు పూర్తి అవుతాయి. ముందుగా ముఖ్యమైన పనులను గడువులోగా పూర్తి చేసుకునేలా ప్రణాళిక రచించుకోవాలి. ఇలా చేయడంతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా మిగిలిన పనులనూ అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతాం.

సమయపాలనకై గురుబోధన..
ఒక రోజు ఒక గురువు తన శిష్యులకు సమయాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పాలనుకుంటాడు. అందుకే శిష్యులకు ఓ పరీక్ష పెడతాడు. ‘శిష్యులారా! నేను మీకో పరీక్ష పెట్టబోతున్నాను.. నా దగ్గర ఒక ప్రత్యేకమైన బొక్కెన (బకెట్‌ లాంటిది) ఉంది. అందులో నీళ్లు పోస్తే అది దానికదే ఓ చిన్న రంధ్రాన్ని సృష్టించుకుంటుంది. దానివల్ల కొంత నీరు అందులోంచి బయటికి వెళ్లిపోతుంది. మీరు ఒకవేళ ఆ రంధ్రాన్ని మూయాలని ప్రయత్నిస్తే.. అది మరిన్ని రంధ్రాలను దానికదే సృష్టించుకుంటుంది. అప్పుడు నీళ్లన్నీ వృథాగా పోతాయి. కాబట్టి దాన్ని అలాగే ఉపయోగించుకోవడం మంచిది. ఈ బొక్కెన సామర్థ్యం 10 సేర్లు. నాకు ఏడు సేర్ల నీళ్లు కావాలి. అక్కడో బావి ఉంది. ఈ ప్రత్యేకమైన బొక్కెన తీసుకుని వెళ్లి.. మూడు నిమిషాల్లో.. ఏడు సేర్ల నీళ్లు తీసుకురండి.

మూడు నిమిషాల్లోపు ఎవరైతే తెస్తారో.. వాళ్లకు నేను మంచి బహుమతి ఇస్తాను’ అంటాడు గురువు. వెంటనే మొదటి శిష్యుడు బొక్కెన తీసుకుని బావి దగ్గరకు వేగంగా వెళ్తాడు. తొందర తొందరగా ఆ బావిలోంచి నీళ్లు తోడి.. ఆ బొక్కెనలో పోస్తాడు. సుమారు ఎనిమిది సేర్లు నిండగానే ఆ బొక్కెనతో పరుగెత్తుకుని వస్తాడు. కాకపోతే పరుగుపెట్టడంతో అందులో మూడు సేర్లు మాత్రమే మిగులుతాయి. మిగిలిన నాలుగు సేర్ల కోసం మళ్లీ వెళ్తాడు. చివరిగా ఏడు సేర్ల నీళ్లు తీసుకుని రావడానికి అతడికి ఆరు నిమిషాల సమయం పడుతుంది. రెండో శిష్యుడు.. గురువు చెప్పిన మాటలు లెక్క చేయకుండా.. ఆ బొక్కెనకి ఉన్న చిన్న రంధ్రాన్ని మట్టితో మూస్తాడు. అప్పుడు గురువు చెప్పినట్లుగానే ఆ బొక్కెనకి మరిన్ని రంధ్రాలు ఏర్పడి.. ఎక్కువ నీరు వృథా అయిపోతుంది. దాంతో అతడు ఏడు సేర్ల నీళ్లు తీసుకుని రావడానికి పది నిమిషాల సమయం పడుతుంది.

అనంతరం మూడో శిష్యుడు బొక్కెన పట్టుకుని బావి దగ్గరకు వెళ్లి.. నీళ్లు నింపి.. బయలుదేరతాడు. అయితే మార్గం మధ్యలో సమయం ఉందిలే అని అలసత్వం వహించి.. ఓ చెట్టు దగ్గర కూర్చుంటాడు. కాసేపు విశ్రాంతి తీసుకుని.. నిదానంగా బయలుదేరతాడు. దాంతో ఇతడికి ఏడు సేర్ల నీళ్లు తీసుకుని రావడానికి తొమ్మిది నిమిషాలు పడుతుంది. చివరిగా నాలుగో శిష్యుడు.. పరుగెత్తకుండా చాలా మామూలుగా ఆ బావి దగ్గరకు వెళ్లి.. బొక్కెన నిండా నీళ్లు నింపుతాడు. ఆ రంధ్రాన్ని మూసే ప్రయత్నం చెయ్యకుండా.. మధ్యలో ఎక్కడా ఆగకుండా.. ఏడు సేర్ల నీళ్లు.. కేవలం రెండు నిమిషాల ఏడు సెకన్లలో తెచ్చేస్తాడు. దాంతో అంతా ఆశ్చర్యపోతారు.

మాటిచ్చినట్లుగానే గురువు అతడికి బహుమతిచ్చి మెచ్చుకుంటాడు. గెలిచిన వ్యక్తిని ఉదహరిస్తూ.. మిగిలిన శిష్యులతో గురువు ఇలా అంటాడు. ‘మొదటి వాడు.. తొందరపాటుకు ప్రతీక. నీళ్లు తేవడానికి తొందరగా పరుగుతీశాడు. నిండా నింపకుండా తప్పుగా అంచనా వేశాడు. ఆ తొందరపాటు వల్ల నీళ్లన్నీ బయటపడి.. అతడి పని రెండింతలు పెరిగింది. అందుకే విఫలమయ్యాడు. రెండవ వాడు తెలివి తక్కువ తనానికి ప్రతిరూపం. అనుభవంతో నేను ముందే హెచ్చరించినా పట్టనట్లుగా.. ఆ చిన్న రంధ్రాన్ని మూసేశాడు. సొంత ప్రయత్నాలు చేసి చివరికి విఫలమయ్యాడు. ఇక మూడవ వాడు సోమరితనానికి ప్రతిబింబం.

సమయం ఉందనే అలసత్వాన్ని ప్రదర్శించి.. బద్ధకంతో మధ్యలో కాసేపు ఆగిపోయాడు. దాంతో రంధ్రంలోంచి నీళ్లు మరింత ఎక్కువగా కారిపోయాయి. అతడి సోమరితనమే అతడి పనిని రెట్టింపు చేసింది. చివరిగా నాలుగవ శిష్యుడు.. సమయపాలనకు సరైన ఉదాహరణ. సమాయాన్ని ఎలా  కాపాడుకోవాలో తెలిసిన వ్యక్తి. ముందుచూపుతో పాటు నిదానం, తెలుసుకున్న దాన్ని గుర్తుంచుకుని పాటించడం లాంటివన్నీ తెలిసిన మనిషి. అందుకే ఈ పరీక్షలో నెగ్గాడు’ అంటూ వివరించాడు.
సోమరితనం, తొందరపాటుతనం, అనుభవజ్ఞుల మాటను పెడచెవిన పెట్టడం మంచివి కాదని చెప్పడంతో పాటు సమయపాలనపై సరైన అవగాహన కలిగుండాలనేది ఈ కథ నీతి!

బ్రేక్స్‌ పడాల్సిందే..
‘నిజానికి గత కొన్నేళ్లుగా ఫోన్‌ వాడకం పెరిగాకే సమయం విలువ తెలియకుండా పోతోంది’ అనేది కాదనలేని నిజం. నెట్టింట సోషల్‌ మీడియాలో రీల్స్, షార్ట్స్, మీమ్స్, ట్రోల్స్‌ అంటూ.. నిత్యం ఫోన్‌ లోనే ఉండిపోవడంతో బయటి ప్రపంచంలోని సమయం తెలియకుండానే గడచిపోతోంది. అందుకే సోషల్‌ మీడియా వినియోగాన్ని తగ్గించుకోవాలి. అలాగే అçనవసరమైన బాతాఖానీలకు కాస్త దూరంగా ఉండాలి. ఏ విషయంలో ఏ కారణంగా సమయం వృథా అవుతుంది? అనేది ఎప్పటికప్పుడు గుర్తించుకోవాలి. ఆ విషయం మీద కూడా దృష్టి పెట్టాలి.

అలవాటు చేసుకుందాం..
సమయ నిర్వహణ అనేది మరింత ఉత్సాహంగా పని చెయ్యడానికి, ఒత్తిడి తగ్గించుకోవడానికి, లక్ష్యాలను సమర్థవంతంగా చేరుకోవడానికి సహాయపడే కీలక నైపుణ్యం. అందుకే రోజూ లేవగానే 10 లేదా 15 నిమిషాలు.. ఆ రోజు చేయాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక వేసుకోవాలి. రోజులో పూర్తి చేయాల్సిన పనులు.. తిరగాల్సిన ప్రాంతాలు ఇలా అన్నింటినీ ఒక జాబితాగా చేసుకోవడంతో పాటు.. ఏ పనికి ఎంత సమయం కేటాయించొచ్చో.. కేటాయించాలో రాసుకోవాలి. దాంతో చేయాల్సిన వాటిపై ఓ క్లారిటీ వస్తుంది. అయితే రాసుకునే పాయింట్స్‌లో కేవలం వృత్తిపరమైన పనుల గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత పనుల గురించి కూడా నోట్‌ చేసుకోవాలి.

వాటికీ వీటికీ తేడా తెలియడం కోసం రంగు స్కెచ్‌లు లేదా పెన్నులు వాడుతుండాలి. లేదంటే అండర్‌ లైన్‌ చేసి.. హైలైట్‌ చేసుకోవాలి. దాంతో మనం వేసుకున్న ప్రణాళికలో ముఖ్యమైన పనులను గుర్తించడం ఈజీ అవుతుంది. ఇప్పుడు నోట్స్‌లో రాసుకోవడం కంటే.. స్మార్ట్‌ఫోన్‌ యాప్స్‌లో నోట్‌ చేసుకునే పద్ధతి పెరిగింది కాబట్టి.. అలా నోట్‌ చేసుకున్న యాప్‌ని ఫోన్‌ ఓపెన్‌ చెయ్యగానే కనిపించేలా పెట్టుకోవాలి. ఒకవేళ పుస్తకంలో పెన్‌ తో రాసుకుంటే.. దాన్ని వీలైనంత అందుబాటులోనే ఉంచుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. మనం ప్రణాళికలో రాసుకున్న అంశం పూర్తిచేసిన తర్వాత.. పూర్తి అయినట్లుగా టిక్‌ చేసుకోవాలి.

అలా చేయడం వల్ల మనసులో ‘సాధించాం’ అన్న ఆనందం కలుగుతుంది. ఇక మిగిలిన వాటిని పూర్తి చేయాలన్న ఉత్సాహమూ పెరుగుతుంది. అందుకే ప్రణాళికను సిద్ధం చేసుకోవడమే కాక ఆ ప్రణాళికల్లో రాసుకున్న పాయింట్స్‌ పూర్తికాగానే.. అయిపోయింది అన్నట్లుగా టిక్‌ చేయడమూ అలవాటు చేసుకోవాలి. దానివల్ల బాధ్యత కూడా పెరుగుతుంది. ఇదే మనకు క్రమశిక్షణ నేర్పిస్తుంది.

నో చెప్పు లేదా తప్పించుకో..
నిజానికి మనకు ఇష్టంలేని కూరో, చారో తినాల్సి వచ్చినప్పుడు వెంటనే నో అంటాం.. ఏ మాత్రం మొహమాటపడకుండా! అదే సమయం వృథా అయ్యే పని విషయంలో మాత్రం మొహమాటంతో నో అనలేం. కానీ నో చెప్పడం నేర్చుకోవాలి. అనవసరమైన పార్టీలకు.. అనవసరమైన సమావేశాలకు ఆహ్వానించినప్పుడు నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. అది రాకుంటే.. ఏదొక కారణం చెప్పి.. తప్పించుకునేందుకు ట్రై చెయ్యాలి. ఆ సమయం మిగిలితే రిలాక్స్‌డ్‌గా ఉండటానికి ప్రయత్నించాలి. దాంతో మానసిక ఒత్తిడి, అలజడి తగ్గుతాయి.

స్విస్‌ టైమ్‌ బ్యాంక్‌ – కాలానికి తూకం
స్విస్‌ బ్యాంక్‌లో ప్రపంచ కుబేరులంతా డబ్బు దాచుకుంటారని తెలుసు. కానీ స్విస్‌ టైమ్‌ బ్యాంక్‌ గురించి తెలుసా? ‘టైమ్‌ దాచుకోవడం ఏంటీ కొత్తగా? సమయాన్ని కూడా డబ్బు దాచుకున్నట్లుగా దాచుకోవచ్చా?’అనే సందేహాలు వచ్చేశాయి కదా! అవును.. డబ్బును డిపాజిట్‌ చేసుకున్నట్టే స్విస్‌ టైమ్‌ బ్యాంక్‌లో టైమ్‌నీ డిపాజిట్‌ చేసుకోవచ్చు. అంటే యవ్వనంలోని మన శక్తిని, ఓపికను వృద్ధాప్యం నాటికి దాచుకోవడం అన్నమాట. స్విట్జర్లండ్‌లో ఈ టైమ్‌ బ్యాంక్‌ ఓ ప్రభుత్వ స్కీమ్‌. ప్రపంచం మొత్తం తలతిప్పి చూసే ఆలోచన ఇది. ఈ స్కీమ్‌ అక్కడి వృద్ధాప్యానికి.. నిస్సహాయతకు చేయూత. అక్కడ ప్రజలు ఈ స్కీమ్‌లో స్వచ్ఛందంగా చేరొచ్చు. ఓపిక, సహనం, స్నేహభావం ఉంటే చాలు ఎవరైనా ఈ స్కీమ్‌కి అర్హులే.

ఒంటరిగా ఉండే వృద్ధులకు.. ప్రమాదాలకు గురైన వ్యక్తులకు సేవ చేసి.. ఆ సేవ చేసిన సమయాన్ని బ్యాంక్‌లో నమోదు చేసుకుంటే.. వారికి అలాంటి సేవలు అవసరమైనప్పుడు.. మరొకరితో ఆ సేవలను అందిస్తూ ఆసరాగా నిలుస్తుంది ప్రభుత్వం. అక్కడివారు చాలా మంది ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూనే.. ఈ స్కీమ్‌లో చేరి.. తమ వృద్ధాప్యానికి పెన్షన్‌ మాదిరి.. సమయాన్ని సేవ్‌ చేసుంటున్నారు. సెలవు దినాల్లో, ఖాళీ సమయాల్లో టైమ్‌ వేస్ట్‌ చేసుకోకుండా.. ఈ స్కీమ్‌ మెంబర్‌గా.. అవసరం ఉన్న వారి ఇంటికి వెళ్లి వారికి సేవ చేస్తున్నారు.

దాంతో వృద్ధులు, ఒంటిరి జీవితంతో బాధపడేవారు.. కాస్త ఊరట పొందుతున్నారు. అలాగే సేవ చేసేవారికి కూడా రేపటి రోజు మీద ఓ భరోసా ఏర్పడుతోంది. అనుకోకుండా ఏ ప్రమాదానికి గురైనా, అనారోగ్యం బారిన పడినా.. ఈ స్కీమ్‌లో భాగంగా.. ముందే ఇందులో సమయాన్ని ఇన్వెస్ట్‌ చేసుకుంటే.. మరొక స్కీమ్‌ మెంబర్‌ సాయం పొందొచ్చు. ఈ స్కీమ్‌లో చేరినవారి అకౌంట్, కార్డ్‌ వివరాలన్నీ లెక్కపత్రాలతో స్పష్టంగా ఉంటాయి. ఎంత సమయం సేవ చేశారు? తిరిగి ఎంత సమయం వాడుకున్నారు? లాంటి అన్ని వివరాలు నమోదై ఉంటాయి. మనం ఎంత ఎక్కువ సమయం ఇతరులకు సేవ చేస్తామో.. తిరిగి మనం అంత సేవను పొందొచ్చన్నమాట. భలే ఉంది కదా..! దీని వల్ల సేవాభావం పెరుగుతుంది.

రేపటి రోజు పై ధీమా ఏర్పాడుతుంది. వృద్ధాప్యంలో ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. నిర్లక్ష్యానికి గురయ్యే ప్రమాదమూ ఉండదు. ఇలాంటి స్కీమ్స్‌ మన భారత్‌ లాంటి దేశాలకు చాలా అవసరం. ఇది భవిష్యత్‌ మీద ఓ భద్రతనిస్తుంది. టైమ్‌ వేస్ట్‌ చేయడం తగ్గుతుంది. ఎవరికి వారు తమ వృద్ధాప్యానికి సరిపడా సమయాన్ని దాచుకునే పనిలోపడతారు. పనికిమాలిన వాదనలు, వాగ్వాదాలు.. అహంభావాలు.. అన్నీ తగ్గుతాయి. ప్రేమగుణం అలవడుతుంది. సమయం అనేది తిరిగి రాకపోయినా.. సమయాన్ని దాచుకునే అవకాశం దొరికినట్లు అవుతుంది. మానవసంబంధాలు మరింత బలపడతాయి. దీనిపై మన ప్రభుత్వాలూ శ్రద్ధ పెడతాయని ఆశిద్దాం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement