Foriegn Education
-
హిమగిరుల సొగసరి కిర్గిజ్స్తాన్.. వైద్య విద్యకు కేరాఫ్!..అందులోనూ..
అమ్మాయిలు బయటకు వెళ్తుంటే బాడీగార్డ్స్‌లా అబ్బాయిలను తోడిచ్చి పంపే సీన్‌కి రివర్స్‌లో అబ్బాయిలు బయటకు వెళ్తూ తోడురమ్మని అమ్మాయిలను బతిమాలుకోవడం కనిపిస్తే.. పురుషులతో సమానంగా మహిళలకూ హక్కులుంటే.. ఇంటా, బయటా అన్నింటా అమ్మాయిలకు గౌరవం అందుతుంటే.. సలాం.. ప్రివేత్.. ఈ కిర్గిజ్ అండ్ రష్యన్ పదాలకు అర్థం వందనం! పై దృశ్యాలు కనిపించేదీ కిర్గిజ్స్తాన్లోనే! ఈ దేశం ఒకప్పటి యూఎస్సెస్సార్ (యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్)లో భాగం అవడం వలన ఇప్పటికీ అక్కడ రష్యన్ అఫీషియల్ లాంగ్వేజ్‌గా కొనసాగుతోంది కిర్గిజ్తోపాటు. అందుకే ప్రివేత్ కూడా! మొన్న మార్చ్‌లో కిర్గిజ్స్తాన్కి టేకాఫ్ అయ్యే చాన్స్ దొరికింది. ప్రయాణాలు కామనైపోయి.. అంతకంటే ముందే అంతర్జాలంలో సమస్త సమాచారమూ విస్తృతమై పర్సనల్ ఎక్స్పీరియెన్సెస్ని పట్టించుకునే లీజర్ ఉంటుందా అనే డౌటనుమానంతోనే స్టార్ట్ అయింది ఈ స్టోరీ ఆఫ్ జర్నీ! అయినా కిర్గిజ్స్తాన్లో నేను చూసినవి.. పరిశీలించినవి.. అర్థం చేసుకున్నవి మీ ముందుంచుతున్నాను! ఢిల్లీ నుంచి కిర్గిజ్స్తాన్ రాజధాని బిష్కేక్కి మూడున్నర గంటలు. అందులో దాదాపు రెండున్నర గంటలు టీయెన్ షాన్ పర్వత శ్రేణుల మీంచే ఉంటుంది ఆకాశయానం. విండోలోంచి చూస్తే కొండల మీద వెండి రేకులు పరచుకున్నట్టు కనిపిస్తుంది దృశ్యం. మంచుకొండలు.. మబ్బులు అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటున్నట్టు.. భుజాల మీద చేతులేసుకుని కబుర్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇదొక అద్భుతమైతే.. బిష్కేక్.. మనాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లయిట్ దిగగానే కురిసే మంచుతో స్వాగతం మరో అద్భుతం! సిమ్లాలో హిమ వర్షాన్ని ఆస్వాదించినప్పటికీ బిష్కేక్లో మంచు కురిసే వేళలు గమ్మత్తయిన అనుభూతి. మేం వెళ్లిందే మంచు పడే లాస్ట్ డేస్. ఇంకా చెప్పాలంటే తర్వాతి రోజు నుంచి మంచు పడటం ఆగిపోయి.. కరగడం మొదలైంది. వర్షం వెలిసిన తర్వాత ఉండే కంటే కూడా రొచ్చుగా ఉంటుంది కరుగుతున్న మంచు. ఎండ చిటచిటలాడించినా.. మంచు కొండల మీద నుంచి వీచే గాలులు వేళ్లు కొంకర్లు పోయేంత చలిని పుట్టించాయి. అందుకే ఉన్న వారం రోజులూ షూ, థర్మల్స్, గ్లోవ్స్, క్యాప్ తప్పకుండా ధరించాల్సి వచ్చింది. ఇంకోమాట.. అక్కడి వాతావరణ పరిస్థితులకో ఏమో మరి.. షూ లేకుంటే అక్కడి జనాలు చిత్రంగా చూస్తారు. గోలలు.. గడబిడలకు నియత్.. బిష్కేక్ని కేంద్రంగా చేసుకునే అల అర్చా, ఇసిక్ కుల్ ఇంకా బిష్కేక్ చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించాం. కాబట్టి వారం రోజులు బిష్కేక్తో మా అనుబంధం కొనసాగింది. సిటీ సెంటర్లోని హోటల్లో మా బస. అక్కడికి వెళ్లగానే అబ్జర్వ్ చేసిన విషయం.. కిర్గిజ్ ప్రజలు చాలా నెమ్మదస్తులని! గట్టిగట్టిగా మాట్లాడటాలు.. అరుపులు.. కేకలు, గడబిడ వాతావరణం వారికి నచ్చవు. పక్కనవాళ్లు ఏ కొంచెం గట్టిగా మాట్లాడినా చిరాగ్గా మొహం పెడ్తారు. నిర్మొహమాటంగా చెప్పేస్తారు గొంతు తగ్గించి మాట్లాడమని. ఇక్కడ మెజారిటీ రష్యనే మాట్లాడ్తారు. ‘నియత్’ అంటే ‘నో’ అని అర్థం. సైన్‌బోర్డ్స్, నేమ్‌ప్లేట్స్ కిర్గిజ్ అండ్ రష్యన్లో ఉంటాయి. ఇది సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్నప్పుడు మామూలు వ్యవహారాలూ రష్యన్‌లోనే నడచి.. కిర్గిజ్ భాషా పదకోశం కుంచించుకుపోయిందట. స్వతంత్ర దేశమయ్యాక కిర్గిజ్ భాషా వికాసం మీద బాగానే దృష్టిపెట్టారని స్థానికులు చెప్పిన మాట. సర్కారు విద్యాబోధన అంతా కిర్గిజ్ మీడియంలోనే సాగుతుంది. వెస్ట్రనైజ్డ్గా కనిపించే పట్టణ ప్రాంతమే మొత్తం దేశాన్ని డామినేట్ చేస్తుంది. "ఈ దేశం విద్యుత్ అవసరాలను హైడల్ ప్రాజెక్ట్‌లు, బొగ్గే తీరుస్తున్నాయి. అయితే పట్టణాల్లోని సెంట్రలైజ్డ్ హీటింగ్, ఎయిర్ కండిషనింగ్‌కి బొగ్గునే వాడటం వల్ల కాలుష్యం పెరిగిపోతోందని అక్కడి పర్యావరణవేత్తల ఆవేదన. కాలుష్యంలో బిష్కేక్ది ఢిల్లీ తర్వాత స్థానం." లోకల్ మార్కెట్లదే హవా.. ఇక్కడ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అంతగా లేదనే చెప్పొచ్చు. ప్రైవేట్ బ్యాంకులు మొదలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వేళ్ల మీద లెక్కపెట్టేన్ని కూడా లేవు. స్థానికులను అడిగితే.. కమ్యూనిజం ప్రభావం వల్లేమో ప్రైవేట్ బ్యాంకుల మీద పూర్తిస్థాయి నమ్మకం ఇంకా కుదరలేదని చెప్పారు. అఫర్డబులిటీ, బేరసారాలకు వీలుడంటం వల్లేమో లోకల్ మార్కెట్సే కళకళలాడుతుంటాయి. ఇక్కడ ఓష్ బజార్, దొర్దోయి, అక్ ఎమిర్ లోకల్ మార్కెట్లు చాలా పాపులర్. మేం ఓష్ బజార్‌కి వెళ్లాం. రెండు రోజులు మార్కెట్ అంతా కలియతిరిగాం. సిల్వర్ జ్యూలరీ దగ్గర్నుంచి హ్యాండ్ అండ్ లగేజ్ బ్యాగ్స్, బట్టలు, వంట పాత్రలు, వెచ్చాలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, నట్స్ వరకు సమస్త సరకులకూ నిలయమిది. ఏ వస్తువులకు ఆ వస్తువుల సపరేట్ మార్కెట్ల సముదాయంగా కనిపిస్తుంది. బేరం చేయకుండా చూడాలంటేనే రోజంతా పడుతుంది. అన్నట్లు కిర్గిజ్‌లో సిల్వర్, 14 క్యారెట్ గోల్డ్ జ్యూలరీ చాలా ఫేమస్. ఓష్ బజార్లో ఒక్క సిల్వర్, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ జ్యూలరీయే ఉంటుంది. ఈ దేశం లెదర్ గూడ్స్కీ ప్రసిద్ధే! లోకల్ ఫ్యాషన్‌ని చూడాలంటే ఇక్కడి బట్టల మార్కెట్‌ని సందర్శించొచ్చు. ఓష్ బజార్ ఈ మార్కెట్లో ఇంకో అట్రాక్షన్.. కిర్గిజ్స్తాన్ హ్యాండీక్రాఫ్ట్స్ షాప్స్. వీళ్ల సంప్రదాయ వేషధారణలోని కల్పక్ (సూఫీలు ధరించే టోపీని పోలి ఉంటుంది) దగ్గర్నుంచి వీళ్ల సాంస్కృతిక చిహ్నమైన యర్త్ హోమ్, సంప్రదాయ సంగీత వాద్యం కోముజ్ (వాళ్ల నేషనల్ మ్యూజిక్ సింబల్)ల కళాకృతులు, ఎంబ్రాయిడరీ.. ఊలు అల్లికల వరకు కిర్గిజ్ హస్తకళల నైపుణ్యానికి ప్రతీకలైన వస్తువులన్నీ ఈ షాపుల్లో దొరుకుతాయి. అయితే ఏది కొనాలన్నా చాలా బేరం ఆడాలి. కొన్ని చోట్ల వర్కవుట్ అవుతుంది. కొన్ని చోట్ల కాదు ఈ మార్కెట్లో అన్నిరకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లూ ఉంటాయి. అయితే మేం వెళ్లింది అక్కడి వింటర్లో కాబట్టి పెద్దగా కనిపించలేదు. చలికాలాలు మైనస్ డిగ్రీల్లో టెంపరేచర్ ఉంటుంది కావున పంటలన్నీ వేసవిలోనే. యాపిల్స్, కమలా పళ్లు బాగా కనిపించాయి. ఇక్కడి కమలాలు భలే బాగున్నాయి రుచిలో. నిమ్మకాయ కన్నా కాస్త పెద్ద సైజులో ఉండే ఈ పండ్లే మా బ్రేక్ఫస్ట్ అక్కడున్నన్ని రోజులూ! కిర్గిజ్స్తాన్లో మరో ముఖ్యమైన కాపు వాల్నట్స్. ఇవి ఓష్బజార్లో రాశులు రాశులుగా కనిపిస్తాయి. బ్రౌన్ షెల్స్వే కాకుండా నాటుకోడి గుడ్డు పరిమాణంలో వైట్ షెల్స్‌తో కూడా ఉంటాయి. వీటిని చాక్లెట్లో రోస్ట్ చేసి అమ్ముతారు. ఒలుచుకోవడానికి ఒక హుక్లాంటిదీ ఇస్తారు. వీటితోపాటు ఇంకెన్నో రకాల నట్స్, డ్రైఫ్రూట్స్ ఈ మార్కెట్లో లభ్యం. కానీ మన దగ్గరకన్నా వాల్నట్సే చాలా చవక. మంచి క్వాలిటీవి కూడా సగానికి సగం తక్కువ ధరకు దొరుకుతాయి. రష్యన్ బ్రెడ్‌ని ఇష్టపడేవాళ్లు ఇక్కడ దాన్ని ట్రై చేయొచ్చు. చాక్లెట్స్ కూడా ఫేమస్. వాటికీ ప్రత్యేక దుకాణ సముదాయముంది. ఇంకో విషయం.. ఇక్కడ సూపర్ మార్కెట్లలో లిక్కర్కీ ఒక సెక్షన్ ఉంటుంది. రకరకాల కిర్గిజ్, రష్యన్ వోడ్కా బ్రాండ్స్ కనిపిస్తుంటాయి. "జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలు ప్రధానులుగా వాళ్ల వాళ్ల కాలాల్లో కిర్గిజ్స్తాన్ను సందర్శించారు. ఆయా సమయాల్లో అక్కడ పుట్టిన ఆడపిల్లలందరికీ ఇందిర అని పేరు పెట్టుకున్నారట. వాళ్లలో ఒకరు.. హయ్యర్ మెడికల్ డిగ్రీస్ పొందిన కిర్గిజ్స్తాన్ తొలి మహిళ.. డాక్టర్ ఖుదైబెర్జెనోవా ఇందిరా ఒరొజ్బేవ్నా. కిర్గిజ్స్తాన్ స్టేట్ మెడికల్ అకాడమీలో ఆంకాలజీ డిపార్ట్మెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఆ దేశాధ్యక్షుడి తర్వాత అన్ని అధికార లాంచనాలు అందుకునే రెండో వ్యక్తి ఆమే! ఇంకో విషయం ఇక్కడున్న మన ఎంబసీ వీథి పేరు మహాత్మా గాంధీ స్ట్రీట్". మీడియా.. "ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంతో ఇక్కడ ప్రింట్ మీడియా అంతగా కనిపించదు. అందుకే ఎలక్ట్రానిక్ మీడియానే పాపులర్. ప్రభుత్వ చానెల్స్‌తోపాటు డజన్‌కి పైగా ప్రైవేట్వీ ఉన్నాయి. రష్యన్ చానెల్స్కే ఆడియన్స్ ఎక్కువ. ప్రైవేట్ ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లూ ఎక్కువే". కిర్గిజ్స్తాన్.. "ఈ ముస్లిం నొమాడిక్ ల్యాండ్‌కి సెంట్రల్ ఆసియా స్విట్జర్లండ్గా పేరు. యూఎస్సెస్సార్ విచ్ఛిన్నం తర్వాత 1991లో స్వతంత్ర దేశంగా మారింది. టీయెన్ షాన్ పర్వత శ్రేణుల మధ్య ఒదిగి.. కజకిస్తాన్, చైనా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లతో సరిహద్దుల్ని పంచుకుంటుంది. ఎన్నో నాగరికతలకు కూడలిగా ఉన్న సిల్క్‌రూట్‌లో భాగం. సెక్యులర్ కంట్రీ. అధ్యక్ష్య తరహా ప్రజాస్వామ్యం. వ్యవసాయమే ప్రధానం. కెనాళ్లు, చెరువులు సాగుకు ఆధారం. పత్తి, మొక్కజొన్న, గోధుమలు, తృణధాన్యాలు ప్రధాన పంటలు. తేనెటీగలు, మల్బరీ తోటల పెంపకమూ కనిపిస్తుంది. వ్యవసాయం యంత్రాల సాయంతోనే! చిన్న కమతాల రైతులు మాత్రం గాడిదలు, గుర్రాలను ఉపయోగిస్తారు. బొగ్గు, బంగారం, కాటుకరాయి, పాదరసం గనులున్నాయి. కొంత మొత్తంలో పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నిల్వలూ ఉన్నాయి. మాంసం, పాల ఉత్పత్తులు, ఉన్ని ప్రధాన ఎగుమతులు. కరెన్సీ. సోమ్. జనాభా.. దాదాపు 67 లక్షలు. పురుషుల కన్నా మహిళలే అధికం". 14 క్యారెట్ గోల్డ్ జ్యూలరీ చూద్దామనే ఉత్సుకతతో ఒక రోజు ఆ షాపింగ్‌కీ వెళ్లాం. అదిరిపోయే డిజైన్స్ ఉన్నాయి కానీ చాలా కాస్టీ›్ల. అంత ధరపెట్టి 14 క్యారెట్ కొనేబదులు అదే ధరలో ఎంతొస్తే అంత 22 క్యారెట్ గోల్డే బెటర్ కదా అనే భారతీయ మనస్తత్వంతో కళ్లతోనే వాటిని ఆస్వాదించి వెనక్కి తిరిగొచ్చేశాం. సెకండ్స్ ఎక్కువ.. ఇక్కడ సెకండ్ హ్యాండ్ మార్కెట్ చాలా పెద్దది. ఫోర్ వీలర్స్ అన్ని సెకండ్సే. అందుకే ప్రపంచంలోని అన్ని బ్రాండ్స్.. అన్నీ మోడల్స్ ఇక్కడ కనిపిస్తాయి. వీటి కోసం బిష్కేక్కి దగ్గర్లోనే దాదాపు 20 ఎకరాల్లో ఒక మార్కెట్ ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ స్టీరింగ్.. రెండూ ఉంటాయి. పర్వత ప్రాంతమవడం వల్లేమో రైల్వే కంటే రోడ్డు రవాణాయే ఎక్కువ. మన దగ్గర కనిపించే స్వరాజ్ మజ్దాలాంటి వాహనాన్ని మార్ష్రూత్కా అంటారిక్కడ. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌కి దాన్నే ఎక్కువగా వాడతారు. మనకు ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉన్నట్టుగా ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులుంటాయి. వాటిని ట్రామ్స్ అంటారు. వీటికి రోడ్డు మీద పట్టాలేం ఉండవు. పైన కరెంట్ తీగతో పవర్ జనరేట్ అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఏం కాదు కానీ ధర చాలా చాలా తక్కువ. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ధర కాస్త ఎక్కువే. ట్రాఫిక్ చాలానే ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు కనిపించరు. అయినా ట్రాఫిక్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అత్యంత అవసరమైతే తప్ప హాంకింగ్ చేయకూడదు. ఫోన్లు కూడా సెకండ్ హ్యాండ్సే అధికం.. బ్రాండ్ న్యూ ఫోన్లు ఉన్నా! ఐఫోన్ వాడకం ఎక్కువ. బ్రాండ్ న్యూ హై ఎండ్ ఫోన్లు డ్యూటీ ఫ్రీతో మన దేశంలో కన్నా గణనీయమైన తక్కువ ధరకు లభిస్తాయి. నాడీ పట్టుకున్నారు.. "కిర్గిజ్స్తాన్లోని బిష్కేక్, ఇసిక్ కుల్ లాంటి చోట్ల భారతీయవిద్యార్థులు అందులో తెలుగు వాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు. కారణం.. మెడిసిన్. అవును ఈ దేశం వైద్యవిద్యకు హబ్‌గా మారింది. ఇది ప్రైవేట్ రంగాలకిస్తున్న ప్రోత్సాహాన్ని గ్రహించి.. రష్యాలో మెడిసిన్ చదివిన కొత్తగూడెం వాసి డాక్టర్ పి. ఫణిభూషణ్ 20 ఏళ్ల కిందటే ఇక్కడ ఐఎస్హెచ్ఎమ్ (ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్)ను స్థాపించాడు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీకొస్తున్న రెస్పాన్స్ చూసి ఇక్కడి ఐకే అకున్బేవ్ కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ (కేఎస్ఎమ్ఏ) ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఈ సంస్థకు తమ యూనివర్సిటీలో అఫిలియేషన్ ఇచ్చింది. ఐఎస్ఎమ్ ఎడ్యుటెక్ అనే కన్సల్టెన్సీ ద్వారా మన తెలుగు స్టూడెంట్స్ ఎందరికో కేఎస్ఎమ్ఏలో అడ్మిషన్స్ ఇప్పించి.. వాళ్ల వైద్యవిద్య కలను సాకారం చేస్తున్నారు డాక్టర్ ఫణిభూషణ్. ఈ రెండు యూనివర్సిటీల్లో దాదపు రెండువేలకు పైగా తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్లలో అమ్మాయిలే ఎక్కువ. ఎందుకంటే ఇది అమ్మాయిలకు సురక్షిత దేశం కాబట్టి. ఇక్కడా మెడిసిన్ అయిదున్నరేళ్లే! ఇంగ్లిష్‌లోనే బోధన సాగుతుంది. చక్కటి ఫ్యాకల్టీ, హాస్టల్ సదుపాయాలున్నాయి. ఆసియాలోనే అతి పెద్ద అనాటమీ ల్యాబ్స్‌లలో ఒకటి కేఎస్ఎమ్ఏలో ఉంది. కమ్యూనికేషన్‌కి ఫారిన్ స్టూడెంట్స్ ఇబ్బందిపడకూడదని కిర్గిజ్, రష్యన్ భాషలనూ నేర్పిస్తారు. శారీరక దృఢత్వం, క్రమశిక్షణ కోసం పీఈటీ కూడా ఉంటుంది. ఇది అకడమిక్స్‌లో భాగం. వారానికి రెండుసార్లు ఇండియన్ ఫ్యాకల్టీతోనూ క్లాస్‌లుంటాయి. ఫారిన్లో మెడిసిన్ పూర్తిచేసుకున్న స్టూడెంట్స్‌కి ఇండియాలో పెట్టే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ (ఎఫ్ఎమ్జీఈ) కోసమూ ఇక్కడ ప్రత్యేక శిక్షణనిస్తారు. అయితే కిర్గిజ్స్తాన్లో మెడిసిన్ చదవడానికి మన నీట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ‘ఇండియాలో మెడికల్ సీట్లు తక్కువ. కాంపీటిషన్ చాలా ఎక్కువ. ఎంత కష్టపడ్డా మంచి కాలేజ్‌లో సీట్ దొరకదు. ‘బీ’ కేటగరీ సీట్‌కి కనీసం కోటి రూపాయలుండాలి. అంతే ఫెసిలిటీస్.. అంతే మంచి ఫ్యాకల్టీతో ఇక్కడ 35 లక్షల్లో మెడిసిన్ అయిపోతుంది. అదీగాక మంచి ఎక్స్పోజర్ వస్తోంది’ అని చెబుతున్నారు అక్కడి మన తెలుగు విద్యార్థులు. ‘పిల్లల్ని మెడిసిన్ చదివించడానికి ఆస్తులు తాకట్టుపెట్టిన పేరెంట్స్‌ని చూశాను. డెడికేషన్ ఉన్న స్టూడెంట్స్‌కి మెడిసిన్ అందని ద్రాక్ష కాకూడదని, తక్కువ ఖర్చుతో క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్‌ని అందించాలనే సంకల్పంతో ఈ సంస్థను స్టార్ట్ చేశాం. అంతేకాదు యాక్టర్ సోనూ సూద్ సహకారంతో ఫీజులు కట్టలేని నీట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్‌ని మా కాలేజెస్లో ఫ్రీగా చదివిస్తున్నాం’ అని చెప్పారు డాక్టర్ ఫణిభూషణ్". - డాక్టర్ ఫణిభూషణ్ విద్య, వైద్యం ఫ్రీ.. ఇందాకే ప్రస్తావించుకున్నట్టు మౌలిక సదుపాయాల విషయంలో ఈ దేశం ఇంకా కమ్యూనిజం విలువలనే పాటిస్తోంది.. విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ! ప్రైవేట్ బడులు, ఆసుపత్రులు లేవని కాదు.. చాలా చాలా తక్కువ. చదువు విషయంలో ఇంగ్లిష్ మీడియం కావాలనుకునే వాళ్లే ప్రైవేట్ బడులకు వెళ్తారు. అయితే ఈ బడుల్లో కూడా కిర్గిజ్, రష్యన్ నేర్పిస్తారు. ఆటలంటే ప్రాణం పెడతారు. ప్రతి విద్యార్థి ఆటల్లో పాల్గొనాల్సిందే! పాఠశాల విద్య నుంచి ప్రొఫెషనల్ కోర్స్ మెడిసిన్ దాకా ఆటలనూ అకడమిక్స్గానే పరిగణిస్తారు. పాఠ్యాంశాలతోపాటు పీఈటీకీ మార్కులుంటాయి. అథ్లెటిక్స్, వాలీబాల్ ఎక్కువ. బిష్కేక్లోని పార్క్స్, గ్రౌండ్స్‌లో అథ్లెట్స్ ప్రాక్టిస్ చేస్తూ కనపడ్తారు. లెవెంత్ క్లాస్ తర్వాత ప్రతి విద్యార్థి సైన్యంలో శిక్షణ తీసుకోవాలి. ప్రతి శని, ఆదివారాలు స్కూల్ పిల్లలు నగర వీథులను శుభ్రం చేయాలి. మొక్కలు నాటాలి. నీళ్లు పోయాలి. ప్రభుత్వాసుపత్రులైతే ఆధునిక సదుపాయాలతో ప్రైవేట్ ఆసుపత్రులను తలదన్నేలా ఉంటాయి. జీరో క్రైమ్.. నో డొమెస్టిక్ వయొలెన్స్! బిష్కేక్లో మేం తిరిగిన ప్రాంతాల్లో ఎక్కడా మాకు పోలీస్ స్టేషన్లు కనించలేదు. ఆశ్చర్యపోతూ మేం తిరిగిన మార్ష్రూత్కా డ్రైవర్లను అడిగితే.. నవ్వుతూ ‘ఉంటాయి కానీ మా దగ్గర క్రైమ్ చాలా తక్కువ. దాదాపు జీరో అని చెప్పుకోవచ్చు’ అన్నారు. డొమెస్టిక్ట్ వయొలెన్స్కీ తావులేదు. ఇక్కడ ఇంటికి యజమానురాలు మహిళే. ఆర్థిక వ్యవహారాల దగ్గర్నుంచి అన్నిటినీ ఆమే చూసుకుంటుంది. లీడ్‌లోనే చెప్పుకున్నట్టు మహిళలను గౌరవించే దేశం. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్.. అన్నిట్లో మహిళలే ఎక్కువ. ట్రక్‌ని డ్రైవ్ చేస్తూ.. సంస్థల్లో ఫ్రంట్ ఆఫీస్ నుంచి మేనేజర్లు.. ఆంట్రప్రన్యూర్స్ దాకా.. లాయర్లుగా.. డాక్టర్లుగా.. ఇలా ప్రతిచోటా మహిళలే ఎక్కువగా కనిపిస్తారు. అల అర్చా నేషనల్ పార్క్ విమెన్స్ డే జాతీయ పండగే.. కిర్గిజ్ ప్రజలు మహిళలకు ఎంత విలువిస్తారో చెప్పడానికి ఇక్కడ జరిగే విమెన్స్ డే సెలబ్రేషనే ప్రత్యక్ష్య ఉదాహరణ. దాన్నో జాతీయ పండగలా నిర్వహిస్తారు. ఆ రోజు మగవాళ్లందరూ గిఫ్ట్స్‌తో తమ ఇంట్లో.. తమ జీవితంలోని స్త్రీలకు గ్రీటింగ్స్ చెప్తారు. తమ మనసుల్లో వాళ్లకున్న చోటు గురించి కవితలల్లి వినిపిస్తారు. మేం వెళ్లింది విమెన్స్ డే అయిన వారానికే కాబట్టి బిష్కేక్లో ఇంకా ఆ సంబరం కనిపించింది.. సిల్వర్, 14 క్యారెట్ గోల్డ్ మార్కెట్లలో విమెన్స్ డే స్పెషల్ కలెక్షన్స్‌తో! దీని ప్రభావం కిర్గిజ్స్తాన్లో మెడిసిన్ చదువుకుంటున్న మన తెలుగు విద్యార్థుల మీదా కనిపించింది.. వాళ్లు చదువుకుంటున్న కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ (కిర్గిస్తాన్ ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయం)కి వెళ్లినప్పుడు! వాళ్ల క్లాస్ రూమ్స్ కారిడార్ వాల్స్ మీద రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ అతికించి ఉన్నాయి. ఆ కాలేజ్‌లోని ప్రతి అబ్బాయి వాళ్లమ్మ .. అమ్మమ్మ.. నానమ్మ.. అత్త.. పిన్ని.. అక్క.. చెల్లి.. టీచర్.. ఫ్రెండ్.. ఇలా వాళ్లకు సంబంధించిన .. వాళ్లకు పరిచయమున్న మహిళలు.. అమ్మాయిల గురించి ఆ గ్రీటింగ్ కార్డ్స్ మీద రాసి తమకు వాళ్ల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అమ్మాయిలను తమకు ఈక్వల్‌గా ట్రీట్ చేయాలని కిర్గిజ్స్తాన్ కల్చర్‌ని చూసి నేర్చుకుంటున్నామని చెప్పారు భారతీయ విద్యార్థులు. యర్త్ హోమ్స్ సిటీ ఆఫ్ గార్డెన్స్.. బిష్కేక్లో ఎటుచూసినా విశాలమైన గార్డెన్లు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. మేం వెళ్లినప్పుడు స్ప్రింగ్ సీజన్‌కి ముస్తాబవుతున్నాయి. వింటర్ అయిపోయే సమయంలో మట్టి తవ్వి.. కొత్త మట్టి వేసి.. కొత్త మొక్కల్ని నాటుతారట. మాకు ఆ దృశ్యాలే కనిపించాయి. స్ప్రింగ్ టైమ్‌లో ఈ కొత్త మొక్కలన్నీ రకరకాల పూలతో వసంత శోభను సంతరించుకుంటాయి. అసలు కిర్గిజ్స్తాన్ని స్ప్రింగ్ సీజన్లోనే చూడాలని స్థానికుల మాట. తోటల్లోనే కాదు.. కొండలు .. లోయల్లో కూడా మంచంతా కరిగి.. మొక్కలు మొలిచి.. రకారకాల ఆకులు.. పూలతో కొత్త అందం పరచుకుంటుంది. అందుకే ఆ టైమ్‌లోనే పర్యాటకుల సందడెక్కువ. సిటీ స్క్వేర్.. ఒక పూటంతా బిష్కేక్ సిటీ స్క్వేర్‌లో గడిపాం. మార్చి 21.. కిర్గిజ్స్తా¯Œ కొత్త సంవత్సరం నూరోజ్ పండగ. మేం అక్కడికి వెళ్లేప్పటికి ఆ వేడుక కోసం పిల్లలంతా జానపద నృత్యాలు.. పాటలతో రిహార్సల్స్ చేసుకుంటూ కనిపించారు.. కిర్గిజ్స్తాన్ ఎపిక్ హీరో మనాస్ విగ్రహం ముందు. పదిలక్షలకు పైగా పద్యాలతో ఉన్న ఈ మనాస్ కావ్యం కిర్గిజ్ ప్రజల చరిత్ర, సంస్కృతి, ఫిలాసఫీని అభివర్ణిస్తుంది. ఇది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద కావ్యంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ కింద దీని సంరక్షణ బాధ్యతను యునెస్కో తీసుకుంది. అంతటి ప్రాశస్త్యమున్న మనాస్ విగ్రహానికి పక్కనే కొంచెం దూరంలో ఆ దేశ పార్లమెంట్ ఉంటుంది. విశాలమైన రోడ్లు.. వాటికి ఆనుకుని గార్డెన్లు.. పాత్వేలతో ఎక్కడో యూరప్‌లోని దేశంలో ఉన్నట్లు అనిపిస్తుంది. నూరోజ్ కోసం బిష్కేక్ ప్రత్యేకంగా ముస్తాబవుతుందట. యర్త్ హోమ్‌లు.. హస్తకళల ఎగ్జిబిషన్స్ జరుగుతాయి. ఆ సన్నాహాలు కనిపించాయి. వరల్డ్ నొమాడిక్ గేమ్స్ వేడుకలు ఇసిక్ కుల్ సాల్ట్ లేక్.. ఒకరోజు బిష్కేక్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల అర్చా వెళ్లాం. అ ్చ అటఛిజ్చి అంటే రంగురంగుల జూనపర్ చెట్లు అని అర్థం. రకరకాల పక్షులు, అడవి మేకలు, జింకలు, కొమ్ముల మేకలు, తోడేళ్లకు నిలయం ఈ ప్రాంతం. ఇక్కడున్న నేషనల్ పార్క్ చూడదగ్గది. మంచు కొండల మీద ట్రెకింగ్, పైన్ చెట్లు.. వాటర్ ఫాల్స్, టీయెన్ షాన్ శ్రేణుల నుంచి పారే నదులు.. నిజంగానే స్విట్జర్లండ్లో ఉన్నామేమో అనే భ్రమను కల్పిస్తుంది. అన్నిటికీ మించి ఇక్కడి స్వచ్ఛమైన గాలి.. ఓహ్.. అనుకుంటాం గానీ పాడు చలి చంపేస్తుంది. పార్క్ ఎంట్రెన్స్ నుంచి మంచులో దాదాపు మూడు గంటలకు పైగా నడిస్తే గానీ నదీ తీరానికి వెళ్లలేం. ఆ తీరం వెంట ఇంకాస్త ముందుకు వెళితే వాటర్‌ఫాల్స్. అలాగే మరికాస్త వెళితే అక్ సై హిమానీ నదం. ఇది అద్భుతమని చెబుతుంటారు స్థానికులు. అక్కడ నైట్ క్యాంప్ వేసుకోవచ్చట. ఇసిక్ కూల్ లేక్ కానీ మైనస్ డిగ్రీల టెంపరేచర్లో మాకు అర కిలోమీటర్ నడిచేసరికే కాళ్లు, చేతులు కొంకర్లు పోయి.. ముక్కు, పెదవులు పగిలి.. మాట మొద్దు బారిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. అలాగని అక్కడే ఉండి పక్షుల కిలకిలారావాలు.. పైన్ చెట్ల తోపులను ఆస్వాదించలేకపోయాం ఇది ప్రొఫెషనల్ ట్రెకర్స్కే సాధ్యమని జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ తిరిగొచ్చి మార్ష్రూత్కాలో కూలబడ్డాం. అందులోని హీటర్‌కి చలికాచుకున్నాం. మా చలివణుకు చూసి డ్రైవర్లు ఒకటే నవ్వులు. ఇంకోరోజు ఇసిక్ కుల్కి ప్రయాణమయ్యాం. బిష్కేక్ నుంచి ఇది దాదాపు 260 కిలోమీటర్లు. సూర్యోదయానికి ముందే స్టార్ట్ అయ్యాం. దార్లో సిల్క్‌రూట్ టచ్ అవుతుంది కిర్గిజ్స్తాన్ – కజకిస్తాన్ బార్డర్లో. మసక చీకటి.. మంచు.. మార్ష్రూత్కా విండో గ్లాసెస్ మీది ఫాగ్ తుడుచుకుని.. కళ్లు చిట్లించుకున్నా బయటి దృశ్యం స్పష్టంగా లేదు. వెహికిల్ ఆపడానికి లేదు. వచ్చేప్పుడు చూడొచ్చులే అనుకున్నాం. వచ్చేప్పుడూ సేమ్ సీన్. రాత్రి.. చీకటి.. మంచు అయితే ఇసిక్ కుల్ సాల్ట్ లేక్ ఆ నిరాశను కాస్త మరిపించింది. కాస్పియన్సీ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సరస్సుగా.. టిటీకాకా తర్వాత రెండవ అతిపెద్ద మౌంటెన్ లేక్ సరస్సుగా పేరుగాంచిందీ భూతల స్వర్గం. ఆకాశాన్ని అంటుతున్నట్టు కనిపించే మంచు పర్వతాల ఒడిలో నింగి నీలంతో.. చల్లదనంలో ఆ హిమ గిరులతో పోటీ పడుతూ నా ఊహల్లోని మానస సరోవరానికి కవలగా కనపడింది. మైనస్‌లోకి పడిపోయే టెంపరేచర్‌లోనూ ఇది గడ్డకట్టదు. ఈ లేక్‌లో బోటింగ్ కూడా ఉంటుంది. దీనికి విశాలమైన ఇసుక బీచ్ ఉంటుంది. ప్రతి సెప్టెంబర్‌లో ఇక్కడ వరల్డ్ నొమాడిక్ గేమ్స్ జరుగుతాయి. దీన్ని 2014లో కిర్గిజ్స్తానే ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంచార ప్రజల సంస్కృతీసంప్రదాయల పునరుద్ధరణ, సంరక్షణతోపాటు.. ఈ గేమ్స్‌లో పాల్గొంటున్న దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో! మొదటి సంవత్సరం ఇందులో 19 దేశాలు పాల్గొంటే 2018 కల్లా 66 దేశాల నుంచి 1500 మంది పాల్గొన్నారు. ఇవి ఒక్క క్రీడాకారులనే కాదు పలురంగాల్లోని కళాకారులందరినీ ఏకం చేస్తోంది. ఈ సంబరాల్లో ఒక్క ఆటలే కాదు.. కిర్గిజ్స్తాన్ కల్చర్, ఫుడ్, ఆర్ట్స్, షాప్స్ అన్నీ తరలి వస్తాయి. వందల సంఖ్యలో యర్త్ హోమ్స్ వెలసి.. ప్రపంచ అతిథులకు ఆతిథ్యాన్నిస్తాయి. ఆ సమయంలో ఇసిక్ కుల్లో ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారట. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవకూడని ఈవెంట్ ఇదని స్థానికులు అంటారు. ఇసిక్ కుల్ నుంచి వచ్చాక ఒకరోజు బిష్కేక్ పొలిమేరలో పౌల్ట్రీ, డెయిరీ ఫామ్ నడిపిస్తున్న ఓ రష్యన్ ఫ్యామిలీ దగ్గరకు వెళ్లాం. అతని పేరు దినేశ్. అరే.. ఇండియన్ నేమ్ అని మేం ఆశ్చర్యపోతుంటే.. అతను నవ్వి.. యూఎస్సెస్సార్లో బాలీవుడ్‌కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఆ ప్రభావంతోనేమో తనకు దినేశ్ అనే పేరుపెట్టారని చెప్పాడు. నిజమే అక్కడ మాకు కుమార్ అనే పేరూ కామన్‌గా వినిపించింది. బిష్కేక్లో మెడికల్ కాలేజ్ అనుబంధ హాస్టల్స్‌లో ఉండి చదువుతున్న భారతీయ వైద్యవిద్యార్థుల కోసం పాలు, చికెన్, కూరగాయలను సప్లయ్ చేయడం కోసమే తను ప్రత్యేకంగా డెయిరీ, పౌల్ట్రీ ఫామ్‌లను నడుపుతున్నాని, కూరగాయలను సాగు చేస్తున్నాని చెప్పాడు దినేశ్. వరల్డ్ నొమాడిక్ గేమ్స్ మిస్సింగ్.. ఉన్న వారంలో చలి.. ఎండ.. వాన మూడు కాలాలనూ చూపించింది కిర్గిజ్స్తాన్. ఎండ, వాన ఉన్నా చలి కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ వెదర్.. చిన్నపిల్లలమైపోయి మంచులో ఆటలు.. స్కీయింగ్, రోప్ వే సాహసాలు.. కిర్గిజ్, రష్యన్ మాటల్ని నేర్చుకోవడం.. వాళ్ల క్రమశిక్షణకు అబ్బురపడటం.. ఆ ప్రశాంతతను ఆస్వాదించడం.. ఉన్నదాంట్లో తృప్తిపడుతున్న వాళ్ల నైజానికి ఇన్స్పైర్ అవడం.. అక్కడి ఆడవాళ్ల సాధికారతకు గర్వడటం.. మొత్తంగా కిర్గిజ్స్తాన్ మీద బోలెడంత గౌరవంతో తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం! కానీ ఒక్క అసంతృప్తి మిగిలిపోయింది. జమీల్యా, తొలి ఉపాధ్యాయుడు వంటి ఎన్నో పుస్తకాలతో ఎప్పుడో కిర్గిజ్స్తాన్ని పరిచయం చేసిన చెంఘిజ్ ఐత్మతోవ్ని కలిపే ఆయన మ్యూజియాన్ని చూడలేపోయామని! బిష్కేక్లో ఉందా మ్యూజియం. దాంతోపాటు కిర్గిజ్స్తాన్ హిస్టరీ అండ్ ఆర్ట్స్‌కి సంబంధించిన మ్యూజియమూ ఉంది. ఇదీ చూడలేదు.. సమయాభావం వల్ల! ఐత్మతోవ్ పుట్టిన నేల మీద నడయాడమన్న కాస్త ఊరటతో కిర్గిజ్స్తాన్కి సలామత్ బొలుప్ జక్ష్య (ఇప్పటికి వీడ్కోలు)! ఎప్పుడైనా స్ప్రింగ్‌లో ఒకసారి కిర్గిజ్స్తాన్ను చూసి.. ఐత్మతోవ్ని పలకరించాలని ఆశ! రహమత్ .. స్పసీబా.. థాంక్యూ! — శరాది ఇవి చదవండి: 'ఖైమర్ అప్సర'గా భారత దౌత్యవేత్త! -
విదేశీ విద్య మరింత భారం.. భారత విద్యార్థులకు కొత్త టెన్షన్!
సాక్షి, అమరావతి: విదేశీ విద్య భారత విద్యార్థులకు మరింత భారమవుతోంది. ఇప్పటికే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అంతకంతకూ పతనమవుతోంది. దీంతో భారత విద్యార్థులు అమెరికాలో చదువుకోవాలంటే మరిన్ని ఎక్కువ రూపాయలను ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను పెంచడంతో విద్యా రుణాలు తడిసి మోపెడవుతున్నాయి. అయితే విదేశాల్లో చదివితే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని, అత్యధిక వేతనాలు వస్తాయన్న ఆశతో వెళ్తున్న విద్యార్థుల్లో అత్యధికులు చివరకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చదువులు ముగిసిన వెంటనే విద్యార్థులు మంచి కొలువులు సాధిస్తే సరి.. లేకపోతే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. విదేశీ చదువులు ముగిస్తున్న వారిలో కేవలం నాలుగో వంతు మందికి మాత్రమే ఆయా దేశాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయని గణాంకాలు తెలుపుతున్నాయి. కంపెనీలు ఆర్థిక పరిస్థితులతో కొందరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. తక్కిన వారంతా స్వదేశానికి తిరిగొచ్చి ఇక్కడ ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. మరోవైపు ఇక్కడి వేతనాలు, విదేశీ చదువుల కోసం చేసిన అప్పులకు పొంతన లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇక ఆ కొలువులూ దక్కని వారి కుటుంబాలు ఆ అప్పులు తీర్చడానికి సతమతమవుతున్నాయి. గత ఐదారేళ్లలో ఒక్క కరోనా సమయంలో మినహాయిస్తే ఏటా కనీసం 4 లక్షల వరకు విద్యార్థులు చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టాక.. కరోనా తగ్గుముఖం పట్టడంతో విదేశీ చదువులకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో సహజంగానే ఆ మేరకు రుణాల శాతం కూడా ఎక్కువైంది. 2019లో 5.86 లక్షల మంది భారత విద్యార్థులు విదేశాల్లో చదువుల కోసం వెళ్లారు. 2020లో ఆ సంఖ్య ఒక్కసారిగా సగానికి తగ్గి 2.59 లక్షలకు పడిపోయింది. కరోనా వ్యాప్తి కారణంగా అనేక దేశాల్లో రాకపోకలపై నిషేధాలు, విద్యా సంస్థల మూత ఇందుకు కారణాలుగా నిలిచాయి. 2021 నుంచి కరోనా తగ్గుదలతో క్రమేణా మళ్లీ విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022లో ఆ సంఖ్య గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరింది. గతేడాది 7.5 లక్షల మంది విదేశాలకు వెళ్లారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచే అధిక రుణాలు విదేశాల్లో చదువులకోసం వెళ్లే విద్యార్థులు ఫీజుల కోసం అత్యధికంగా ప్రభుత్వ బ్యాంకుల రుణాలపైనే ఆధారపడుతున్నారు. దాదాపు 95 శాతం మంది విద్యార్థులు ఈ రుణాల ఆధారంగానే విదేశీ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో 2021లో విదేశీ విద్య కోసం ప్రభుత్వరంగ బ్యాంకులు అందించిన రుణాల మొత్తం రూ.4,503.61 కోట్లుగా ఉంది. 2020లో మంజూరు చేసిన రుణాలతో పోల్చి చూస్తే ఇది 23.5 శాతం తక్కువ. కరోనా కారణంగా 2020లో విదేశీ విద్యకు ఆటంకాలు ఏర్పడడంతో విద్యా రుణాల మంజూరు కూడా భారీగా తగ్గింది. 2022లో రుణాల మంజూరు అమాంతం పెరిగింది. గతేడాది ప్రభుత్వ రంగ బ్యాంకులు విదేశాల్లో చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు రూ.7,576.02 కోట్లను మంజూరు చేశాయి. 2021లో మంజూరు చేసిన రుణాలతో పోల్చి చూస్తే ఇది 68.2 శాతం అధికం. 2022లో మొత్తం విద్యా రుణాలు రూ.15,445.62 కోట్లు ఇవ్వగా అందులో దాదాపు సగం మేర అంటే రూ. 7,576.02 కోట్లు విదేశీ విద్యకోసం ఇచ్చినవే. చెల్లించడానికి ఇబ్బందులు ఇటీవల కాలంలో వడ్డీ రేట్లు భారీగా పెరగడంతో ఆ ప్రభావం విద్యా రుణాలపైన పడుతోందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. తీసుకున్న రుణం వడ్డీతో కలిపి తడిసి మోపెడవుతోందని, దీన్ని తీర్చడానికి సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరిస్తున్నారు. ఉద్యోగాల్లో చేరి అధిక వేతనాలు తీసుకుంటున్న వారే తిరిగి కట్టలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. అలాంటిది అరకొర వేతనాలు, లేదా అసలు ఉద్యోగమే లేని వారి కుటుంబాలు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాయని అంటున్నారు. -
విదేశీ విద్య కోసం వైఎస్ జగన్ మరో పథకం
-
ఏపీ: జగనన్న విదేశీ విద్యాదీవెనపై ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ఆంధప్రదేశ్‌లో విద్యార్థుల కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో సంక్షేమ పథకం తీసుకొచ్చింది. విదేశీ విద్యను అభ్యసించే అర్హులైన వాళ్ల కోసం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’పై ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఇప్పుడు అమలు అవుతున్న సంక్షేమ పథకం లాగే.. పక్షపాతం లేకుండా ప్రతిభకే పెద్దపీట వేసేలా ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ వర్తించేలా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ఇకపై వైఎస్సార్సీపీ ప్రభుత్వమే భరించనుంది. మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. 100పైబడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించనుంది. నాలుగు వాయిదాల్లో.. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్. ల్యాండింగ్ పర్మిట్ లేదంటే ఐ–94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లింపు జమ చేస్తుంది ప్రభుత్వం. ఫస్ట్‌సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లింపు ఉంటుంది. అలాగే.. రెండో సెమిస్టర్ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లింపు, నాలుగో సెమిస్టర్ లేదంటే ఫైనల్ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపు ఉంటుంది. అర్హతలు ఇవే పీహెచ్డీ, ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏడాది వారీగా లేదంటే.. సెమిస్టర్ వారీగా కోర్సు పూర్తయ్యేంతవరకూ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు ఉంటుంది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుందని ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. టాప్ 200 యూనివర్శిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే అందరికీ సంతృప్తకర స్థాయిలో జగనన్న విదేశీ దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందనుంది. వయసు.. 35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులని ప్రకటించింది ప్రభుత్వం. ఏపీలో స్థానికుడై ఉండి.. అలాగే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే జగనన్న విదేశీ విద్యాదీవెన వర్తించనుంది. ప్రతి ఏటా సెప్టెంబర్–డిసెంబర్, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపుకోసం నొటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ చేత అర్హుల ఎంపిక ఉండనుంది. గతానికి, ఇప్పటికీ తేడా.. 2016 –17 నుంచి లబ్ధిదారులుగా ఎంపిక చేసిన 3,326 మందికి రూ.318 కోట్లను బకాయిలుగా పెట్టింది గత ప్రభుత్వం. చంద్రబాబు సర్కారు సమయంలో ఆర్ధికంగా వెనకబడ్డ అగ్రకులాలకు వర్తింప చేయలేదు. అయితే ఇప్పుడు వాళ్లకు సైతం వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ సర్కార్. గతంలో సంవత్సరాదాయం రూ.6 లక్షల లోపు ఉన్నవారికి వర్తించేది. ఇప్పుడు ఆ ఆదాయ పరిమితి పెంచారు. ప్రపంచంలోని కొన్నిదేశాలకే వర్తింపు చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రపంచంలోని ఎక్కడైనా 200 అత్యుత్తమ యూనివర్శిటీలకు వర్తించనుంది. చంద్రబాబు హయాంలో ఎస్సీలకు రూ. 15 లక్షలు, ఎస్టీలకు రూ. 15 లక్షలు, కాపులకు రూ.10 లక్షలు, బీసీలకు రూ.10 లక్షలు, మైనార్టీలకు రూ.15 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ ఉండేది. ఇప్పుడు టాప్ 100 యూనివర్శిటీల్లో సీటు వస్తే పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించనుంది. అలాగే.. 101 నుంచి 200 లోపు ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజులను చెల్లించనుంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వం హయాంలో 300 మంది ఎస్సీలకు, 100 మంది ఎస్టీలకు, 400 మంది కాపులకు, 1000 మంది బీసీలకు , 500 మంది మైనార్టీలకు పరిమితి విధించించింది. ఇప్పుడు టాప్ 200 యూనివర్శిటీల్లో ఎంతమంది సీట్లు సాధించినా వర్తింపు చేస్తూ వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ విదేశీ విద్యా పథకంలో పలు లోపాలు: ► గత ప్రభుత్వం హయాంలో విదేశీ విద్య అమల్లో పలు లోపాలను గుర్తించింది విజిలెన్స్ & ఎన్ఫోర్స్ మెంట్‌విభాగం. ► లబ్ధిదారుల ఎంపికలో ఆదాయ పరిమితులు పాటించలేదని నిర్ధారించింది. ► ఆధీకృత సంస్థకు సమాచారం ఇవ్వకుండానే లబ్ధిదారులైన కొందరు విద్యార్థులు తాము చదువుతున్న యూనివర్శిటీని, వెళ్లాల్సిన దేశాన్ని కూడా మార్చుకున్నారని గుర్తించింది. ► ఆధీకృత సంస్థకు సమాచారం ఇవ్వకుండానే యూనివర్శిటీలను మార్చుకున్నారు కొందరు విద్యార్థులు. ► గత ప్రభుత్వంలో స్కీం నుంచి డబ్బు పొందాక కోర్సులు పూర్తిచేయకుండానే వెనుదిరిగి వచ్చిన కొందరు విద్యార్థులు. ► ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపు అన్న నిబంధనను ఉల్లంఘించి ఒకే కుటుంబంలో ఒకరికి అంతకంటే ఎక్కువమందికి పథకం వర్తింపజేశారు. ► ఈ పథకంలో లబ్ధి పొందిన వారి చిరునామాల్లో వెతికినా.. వాళ్లు కనిపించని వైనం. ► అన్నికంటే ముఖ్యంగా 2016 –17 నుంచి లబ్ధిదారులుగా ఎంపిక చేసిన 3,326 మందికి చెల్లించాల్సిన రూ.318 కోట్లను బకాయిలుగా పెట్టిన గత ప్రభుత్వం. చదవండి: సీఎం జగన్ దృష్టికి వాళ్ల సమస్యలు.. వెంటనే పరిష్కరించాలని ఆదేశం -
విదేశాల్లో చదువుకు తెలంగాణ ప్రభుత్వం 20 లక్షలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువులంటే గతంలో డిగ్రీ, పీజీ మాత్రమే. ఇక విదేశీ విద్య అంటే అది అందని ద్రాక్షగా ఉండేది. కేవలం సంపన్నులకు మాత్రమే విదేశాలకు వెళ్లి చదివే స్థోమత ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రతిభ ఉంటే చాలు సామాన్యులు కూడా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ఆ విధంగా అవకాశాలు ఇంటి ముంగిట్లోకి వచ్చేశాయి. ఐటీ రంగం బాగా వ్యాప్తి చెందడంతో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తదితర దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఇది కూడా విదేశీ చదువులపై విద్యార్థులు మక్కువ చూపేందుకు కారణమైంది. చదువుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి విదేశీ వర్సిటీల్లో సీటు పొందిన వారికి తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకం కింద ఆర్థిక చేయూతను అందిస్తున్నది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నదని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో అర్హత గల సుమారు 50 వేల మంది విద్యార్థులకు ఈ పథకం విశేషంగా దోహదపడునున్నది. చదవండి: ప్రేమ పేరుతో మోసం.. శారీరకంగా లొంగదీసుకొని.. చివరకు దరఖాస్తు కోసం ఏం చేయాలి విదేశీ విద్యకోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం విదేశీ విద్యానిధి వెబ్సైట్లో చూడవచ్చు. ఇతర సామాజిక వర్గాల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఇంకో అవకాశం కల్పించనున్నారు. ఇవీ అర్హతలు ► విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. ► వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. ► తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. ► డిగ్రీ, ఇంజనీరింగ్‌లలో 60 శాతం మార్కులు తప్పనిసరి. అర్హత సాధిస్తే రూ.20 లక్షలు మంజూరు విదేశీ విద్యానిధి పథకం కింద ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేస్తుంది. వీసా వచ్చిన తర్వాత రూ.10 లక్షలు అక్కడి ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షలు చెల్లిస్తుంది. విద్యార్థులు ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి వడ్డీ కింద అదనంగా రూ.10 లక్షల విద్యారుణం తీసుకోవచ్చు. విమాన టిక్కెట్‌కు డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. జత చేయాల్సిన పత్రాలు ► పదో తరగతి ఇంటర్, డిగ్రీ, బీటెక్ ధ్రువీకరణ పత్రాలు ►ఆదాయ, నివాస, కుల ధవీకరణ పత్రాలు ► పాస్‌పోర్ట్, వీసా ►యూనివర్సిటీ అనుమతి పొందిన ఎఫ్–1 కాపీ ► జీఆర్ఈ, జీమాట్, టోఫెల్, ఐఎఫ్ఎల్టీఎస్ వివరాలు ►బ్యాంకు ఖాతా సమాచారం వెలువడిన ప్రకటన విద్యానిధి పథకానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఎస్సీ, ఎస్టీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు గాను ఇప్పటికే అన్ని కళాశాలల విద్యార్థులకు ఆయా శాఖల కమిషనర్లు అవగాహన కల్పించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం పథకం వివరాలను అందజేశారు. దేశాలు.. కోర్సులు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, సింగపూర్, జర్మని, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఈ పథకం కింద చదువుకునేందుకు అవకాశం కల్పించారు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో చేరేందుకు ఈ పథకం వర్తిస్తుంది. ఎంపిక ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కమిటీ ఎంపిక చేస్తుంది. కమిటీ చైర్మన్‌గా ఎస్సీ, ఎస్టీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. ఉన్నత విద్యాశాఖ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్, ఎస్సీ కమిషనర్, టెక్నికల్ ఎడ్యుకేషనల్ కమిషనర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, విదేశీ విద్యలో ఒక అనుభవజ్ఞుడు ఉంటారు. -
పోదామా అమెరికా.. ఆ పొరపాట్లు చేయొద్దు
అమెరికా.. భారతీయ విద్యార్థుల కల! ఏటా లక్షల మంది యూఎస్ యూనివర్సిటీల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. కాని ఈ సంవత్సరం కరోనా కారణంగా అమెరికాలో ఉన్నత విద్య స్వప్నం సందిగ్ధంలో పడింది. కొవిడ్ నేపథ్యంలో.. అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లడం సరైందేనా.. అక్కడి వర్సిటీలు ఎలాంటి వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. ఇప్పటికే చేరిన విద్యార్థులకు తరగతుల నిర్వహణ ఎలా ఉంది? ఫీజులు ఏమైనా తగ్గిస్తున్నారా.. మన విద్యార్థుల స్పందన ఎలా ఉంది.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు హైదరాబాద్‌లోని యూఎస్–ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ రీజనల్ ఆఫీసర్ మోనికా సెటియాతోపాటు అమెరికాలోని టాప్ యూనివర్సిటీల అధికారులు స్వయంగా సమాధానాలు ఇస్తున్నారు!! ఆంధ్రప్రదేశ్/తెలంగాణ విద్యార్థుల నుంచి అమెరికాలో ఉన్నత విద్య పరంగా ఎలాంటి కోర్సులకు డిమాండ్ ఉంది? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఐఐఈ) ఓపెన్ డోర్స్ వార్షిక నివేదిక ప్రకారం–2018–2019 విద్యాసంవత్సరంలో స్టెమ్,మ్యాథ్స్/కంప్యూటర్ సైన్స్ కోర్సులకు భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ ఆదరణ ఉంది. 2018–2019 విద్యా సంవత్సరంలో అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లిన భారత విద్యార్థుల్లో 37శాతం మంది మ్యాథ్స్ /కంప్యూటర్ సైన్స్, 34.2 శాతం మంది స్టెమ్ కోర్సుల్లో చేరారు. ఆ తర్వాత స్థానంలో బిజినెస్/మేనేజ్మెంట్ 10.3 శాతం,ఫిజికల్/లైఫ్‌సైన్సెస్ 5.6శాతం ఉన్నాయి. రాష్ట్రస్థాయి డేటా అందుబాటులో లేనప్పటికీ.. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ, ఒడిషా రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువగా కంప్యూ టర్సైన్స్, స్టెమ్ ప్రోగ్రామ్స్‌లో చేరుతున్నట్లు ట్రెండ్‌ను బట్టి అర్థమవుతోంది. 2009–2010లో19.8 శాతం మంది విద్యా ర్థులు మ్యాథ్స్/కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో చేరగా..అది 2018–2019 నాటికి 37శాతానికి పెరిగింది. అదే సమయంలో బిజినెస్/మేనేజ్మెంట్, ఫిజికల్/లైఫ్ సైన్సెస్ పట్ల ఆసక్తి కొద్దిగా తగ్గింది. గత దశాబ్ద కాలంగా సోషల్ సైన్సెస్, హుమానిటీస్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కోర్సులకు డిమాండ్ స్థిరంగా ఉంది. అలాగే 2018–2019 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యలో చేరిన భారతీయ విద్యా ర్థుల్లో 3.2శాతం మంది హెల్త్‌కేర్ కోర్సులను ఎంచు కున్నారు. 2010 నుంచి దాదాపు ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అమెరికాలో ఉన్నత విద్య కోర్సులకు దరఖాస్తు చేసుకునేటప్పుడు విద్యార్థులు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు? వాటిని ఎలా అధిగమించవచ్చో తెలపండి? దరఖాస్తు సందర్భంగా విద్యార్థులు చాలా పరిమిత సంఖ్యలో యూనివర్సిటీలను ఎంచుకుంటున్నారు. వాస్తవానికి అమెరికా ఉన్నత విద్యావ్యవస్థ 4500 కాలేజీలు /యూనివర్సిటీల్లో కోర్సులను ఎంచుకునే అవకాశం విద్యార్థులకు కల్పిస్తోంది. అలాగే కాలేజీకి, కోర్సుకు అక్రిడి టేషన్ ఉందో లేదో పరిశీలించకుండానే దరఖాస్తు చేసుకో వడం చాలామంది విద్యార్థుల చేస్తున్న మరో పొర పాటు. అదేవిధంగా యూఎస్‌లో ఉన్నత విద్య కోర్సులో ప్రవేశం పొందడంలో విద్యార్థి ఆర్థిక స్థితి కూడా కీలకంగా నిలుస్తుంది. కాబట్టి దరఖాస్తు చేసుకోవడానికి ముందే చదువుకు అయ్యే ఖర్చు, సదరు నిధులు ఎక్కడ నుంచి సమకూరుతాయి అనే విషయంలో స్పష్టత అవసరం. దరఖాస్తు టైమ్‌లైన్, విద్యార్థి వీసా అప్లికేషన్స్, ఇంటర్వ్యూ కూడా అడ్మిషన్ పొందడంలో అత్యంత కీలకమైన అంశాలుగా పేర్కొనవచ్చు. ► విద్యార్థులు అమెరికాలో చదువులకు పయనమవడానికి ముందే అక్కడి భిన్నమైన అకడెమిక్, సోషల్ కల్చర్‌పై అవగాహన పెంచుకోవాలి. లేకుంటే అక్కడ కుదురు కోవడానికి చాలా సమయం పట్టే ఆస్కారం ఉంటుంది. ► అమెరికా యూనివర్సిటీలోకి దరఖాస్తు ప్రక్రియ, ప్రవేశ విధానం తదితర అన్ని అంశాలపై సలహాలు సూచనల కోసం విద్యార్థులు https://educationusa.org/ను సందర్శించి అవసరమైన సమాచారం పొందొచ్చు. ► ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా విద్యార్థులకు ఎలాంటి సందేహం ఉన్నా...usiefhyderabad @usief.org.in కు మెయిల్ చేయొచ్చు. మోనికా సేటియా, రీజనల్ ఆఫీసర్, యునైటెడ్ స్టేట్స్–ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్–హైదరాబాద్ ప్రవేశాలు పెరిగాయి ప్రస్తుత కొవిడ్–19 పరిస్థితుల్లో అమెరికా యూనివర్సిటీల్లో చేరే విషయంలో భారతీయ విద్యార్థుల నుంచి ఎలాంటి స్పందన ఉంది? మేం 2019 ఆగస్టు, నవంబర్ మధ్య భారత్‌లో విస్తృతంగా పర్యటించాం. దేశవ్యాప్తంగా పది పట్టణాల్లో ఎడ్యుకేషన్ ఫెయిర్స్లో పాల్గొన్నాం. ఫలితంగా 2020 ఫాల్లో అండర్గ్రాడ్యయేట్ ఫ్రెష్‌మెన్ ప్రవేశాలు 5.5 శాతం పెరిగాయి. క్యాంపస్‌కు రాలేని 58 మంది విద్యార్థులు ఇంటర్నేషనల్ అడ్వెంచర్ లెర్నింగ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ ద్వారా యూనివర్సిటీలో ప్రవేశం పొందారు. ఈ విద్యార్థులు ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్, జనరల్ ట్రాక్స్ విధానంలో ఆన్లైన్లో క్లాసులకు హాజరవుతున్నారు. విద్యార్థులు ఐవోవా యూనివర్సిటీలో ఎలాంటి కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు? ద ఐవోవా స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.. స్టెమ్/ఇంజనీరింగ్/సైన్స్ కోర్సుల్లో విద్యార్థులను ఆకర్షించడంలో ముం దుంటోంది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా స్టెమ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, ఇండస్ట్రియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, హుమాన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, స్టాటిస్టిక్స్, అండ్ ఆర్కిటెక్చర్ వంటి కోర్సులవైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుత కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో తరగతుల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఐవోవా స్టేట్ యూనివర్సిటీ తెరిచే ఉంది. క్యాంపస్‌లో విద్యార్థులు ఉన్నారు. మేం ముఖాముఖి, ఆన్లైన్, హైబ్రిడ్, అరేంజ్డ్ విధానంలో తరగతుల నిర్వహణ విధానం అమలు చేస్తున్నాం. కొవిడ్ పరిస్థితుల్లో జీఆర్ఈ, ప్రామాణిక ఇంగ్లిష్ టెస్టింగ్ పరీక్షల పరంగా ఏమైనా మినహాయింపు ఉందా? యూనివర్సిటీలోని పలు విభాగాలు జీఆర్ఈ/జీమ్యాట్కు మినహా యింపు ఇస్తున్నాయి. అలాగే డుయోలింగో ఇంగ్లిష్ టెస్ట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాం. దీనికి విద్యార్థులు తమ ఇంటి నుంచే హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే మేం టోఫెల్ స్పెషల్ హోం ఎడిషన్‌ను కూడా అంగీకరిస్తున్నాం. ఈ సంవత్సరంతోపాటు వచ్చే స్ప్రింగ్ సెషన్‌కు కోర్సు ఫీజు ఏమైనా తగ్గిస్తున్నారా? స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయా? యూనివర్సిటీలో చేరిన అంతర్జాతీయ విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఫాల్ 2021 ఎంట్రీ నుంచి మా అంతర్జాతీయ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌ను విస్తరించనున్నాం. దీనిద్వారా విద్యార్థులకు మద్దతుగా నిల్వనున్నాం. ప్రస్తుత కొవిడ్–19 పరిస్థితుల్లో విద్యార్థులు చదువుతోపాటు క్యాంపస్‌లో పనిచేసే అవకాశం ఉందా? యూనివర్సిటీ క్యాంపస్‌లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. డైనింగ్ సెంటర్, రెసిడెన్స్ హాల్స్, లైబ్రరీ, బుక్‌స్టోర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, పెయిడ్ అండర్గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఆపర్చునిటీస్, పెయిడ్ స్టూడెంట్ కన్సల్టింగ్ ప్రోగ్రామ్స్, ఇంటర్న్షిప్స్ వంటì వి చేసే అవకాశం ఉంది. కొవిడ్ బారిన పడకుండా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఐవోవా స్టేట్ యూనివర్సిటీలో కొవిడ్–19 నివారణ చర్యల్లో భాగంగా టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, మాస్క్‌లు ధరించడం వంటివి తప్పనిసరి చేశాం. తరగతిలో విద్యార్థుల సంఖ్యను తగ్గించాం. వివిధ విధానాల్లో బోధన అందిస్తున్నాం. ఐసోలేషన్, క్వారంటైన్ సౌకర్యం, సమావేశాలపై ఆంక్షలు తదితర చర్యలు తీసుకుంటున్నాం. కేథరిన్ జాన్సన్ సుస్కి,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ న్యూ స్టూడెంట్ ప్రోగ్రామ్స్–ఆఫీస్ ఆఫ్ అడ్మిషన్స్, ఐవోవా స్టేట్ యూనివర్సిటీ. క్యాంపస్ తెరిచే ఉంది కొవిడ్–19 పరిస్థితుల్లో అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశాల పరంగా భారతీయ విద్యార్థుల స్పందన ఎలా ఉంది? 2020 నవంబర్ నాటికి పెన్సెల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఫాల్సె మిస్టర్ (ఆగస్టు 2021)కు దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య 27 శాతం పెరిగింది. ఈ యూనివర్సిటీ ప్రపంచంలోనే టాప్1 శాతం విశ్వవిద్యాల యాల జాబితాలో నిలుస్తుంది. అమెరికాలో ఎక్కువమంది అంతర్జాతీయ విద్యార్థులను కలిగిన యూనివర్సిటీల జాబితాలో 12వ స్థానంలో ఉంది. అలాగే కెరీర్ సర్వీస్‌లో 9వ స్థానంలో నిలిచింది. మా విద్యార్థుల ఆరోగ్య భద్రతకు మేం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఫాల్ సీజన్లో యూఎస్‌లోని పలు ఇన్స్టిట్యూ ట్స్‌ను మూసేసినా.. మేం మాత్రం మా విద్యార్థులను క్యాంపస్‌కు స్వాగత పలికాం. విద్యార్థులు ఎక్కువగా కోరుకుంటున్న కోర్సుల(అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యు యేట్) గురించి చెప్పండి? కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో 14 అండర్గ్రాడ్యుయేట్ మేజర్స్, 13 మాస్టర్స్ డిగ్రీలకు బాగా ఆదరణ ఉంది. వీటితోపాటు పెన్సెల్వేనియా యూనివ ర్సిటీ ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్, బయలాజికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ వంటి పాపులర్ కోర్సులను కూడా అందిస్తోంది. భారతీయ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్‌లో చేరడానికి బాగా ఆసక్తి చూపుతున్నారు. అలాగే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బిజినెస్ కోర్సులను చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో తరగతుల నిర్వహణకు యూనివర్సిటీ ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తోంది. స్టెమ్ కోర్సులకు ప్రాక్టికల్స్ ఎలా నిర్వహిస్తారు? మా యూనివర్సిటీ క్యాంపస్‌లు అన్నీ అంతర్జాతీయ విద్యార్థుల కోసం తెరిచే ఉన్నాయి. ఈ సంవత్సరం యూఎస్‌కు రాగలిగే కొత్త విద్యార్థులు క్యాంపస్‌లో ఉండొచ్చు. కొంతమంది విద్యార్థులకు మహమ్మారి సమయంలో తమ కుటుంబాలకు దగ్గరగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి విద్యార్థుల కోసం పెన్సెల్వేనియా యూనివర్సిటీలో పూర్తి స్థాయి టెక్నాలజీతో ఆన్లైన్ క్లాస్ వర్క్ విధానం ఉంది. కొవిడ్ పరిస్థితుల్లో జీఆర్ఈ, ఇంగ్లిష్ టెస్టింగ్ పరీక్షల నుంచి సడలింపు కల్పిస్తున్నారా? 2021 అండర్గ్రాడ్యుయేట్ అడ్మిషన్లకు ఎస్ఏటీ, ఎసీటీ టెస్ట్ ఆప్షనల్. అంటే.. విద్యార్థి ఈ టెస్ట్‌లకు హాజరుకావాల్సిన పనిలేదు. అలాగే 2022, 2023 లోనూ ఇదే విధానం కొనసాగుతుందని భావిస్తున్నాం. ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్టుకు సంబంధించి టోఫెల్, ఐఈఎల్టీఎస్తోపాటు డుయోలింగో, ద టోఫెల్ ఎట్ హోం ఎడిషన్, ఐఈఎల్టీఎస్ ఇండికేటర్లను పరిగణనలోకి తీసుకుం టున్నాం. కొన్ని ప్రోగ్రామ్‌లకు జీఆర్ఈ, జీమ్యాట్ అవసరం లేదు. ఈ సంవత్సరంతోపాటు వచ్చే స్ప్రింగ్ సెషన్లో ఫీజులు తగ్గించే అవకాశం ఉందా? విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయా? ఈ సంవత్సరం మేం ట్యూషన్ ఫీజు పెంచలేదు. వచ్చే ఏడాదికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. యూనివర్సిటీ విద్యార్థుల అవసరా లను సదా దృష్టిలో పెట్టుకుంటుంది. మాస్టర్స్, డాక్టోరల్ స్థాయిలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అసిస్టెంట్‌షిప్స్, ఫెలోషిప్స్‌ను పెద్ద సంఖ్యలో కొనసాగిస్తున్నాం. మా ఓపీటీ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ అద్భుతంగా ఉంది. అలాగే గ్రాడ్యుయేట్ స్థాయిలో విద్యార్థులకు ఆర్థికంగా మద్దతు అందిస్తున్నాం. ప్రస్తుత కొవిడ్–19 పరిస్థితుల్లో విద్యార్థులు చదువుతోపాటు యూనివర్సిటీ క్యాంపస్‌లో పనిచేసేందుకు అవకాశం ఉందా? చదువుతోపాటు యూనివర్సిటీ క్యాంపస్‌లో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్‌గా పని చేసేందుకు అవకాశం ఉంది. అండర్గ్రాడ్యుయేట్ స్థాయిలో ప్రతి అంతర్జాతీయ విద్యార్థి వారానికి 20 గంటలు పనిచేసేందుకు అనుమతి ఉంది. కొవిడ్–19 బారిన పడకుండా క్యాంపస్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పెన్సెల్వేనియా యూనివర్సిటీలో అద్భుతమైన మెడికల్ స్కూల్, నర్సింగ్, పబ్లిక్ హెల్త్ కాలేజీ ఉన్నాయి. మా ఫ్యాకల్టీలో అంతర్జాతీయ స్థాయి అంటువ్యాధుల నిపుణులు ఉన్నారు. ఆగస్టు 2020 నుంచి క్యాంపస్‌లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించేలా నిబంధనలు అమలు చేస్తున్నాం. కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. అలాగే కాంటాక్ట్ ట్రేసింగ్ విధానం, ఐసోలేషన్, క్వారంటైన్ కోసం అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి. ఫలితంగా ఫాల్ సెమిస్టర్ మొత్తం యూనివర్సిటీ తెరిచే ఉంది. స్ప్రింగ్ సెషనల్లో కూడా తెరిచే ఉంచాలని భావిస్తున్నాం. డాక్టర్ రోజర్ బ్రిండ్లీ, వైస్ ప్రోవోస్ట్ ఫర్ గ్లోబల్ ప్రోగ్రామ్స్, ద పెన్సెల్వేనియా స్టేట్ యూనివర్సిటీ. స్టెమ్, ఎంబీఏవైపు మొగ్గు కొవిడ్–19 పరిస్థితుల్లో యూఎస్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం చూస్తున్న భారతీయ విద్యార్థుల నుంచి స్పందన ఎలా ఉంది? గతంలో భారతదేశంలో ఎడ్యుకేషన్ ఫెయిర్స్ నిర్వహించినప్పటితో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు కొంత మందకొడిగా ఉందనే చెప్పొచ్చు. యూఎస్ విద్యా సంస్థల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య మాత్రం స్థిరంగా ఉంది. హూస్టన్ ప్రాంతంలో ఇండియా నుంచి వచ్చిన హెచ్–1బీ వీసాదారులతోపాటు వారిపై ఆధారపడిన హెచ్4 వీసాదారులు కూడా తమ విద్యార్హతలను పెంచుకునేందుకు కోర్సుల్లో చేరుతున్నారు. యూఎస్‌లో చదువు పూర్తిచేసుకొని భారత్‌కు తెరిగి వెళ్లిన విద్యార్థులు సైతం అమెరికాలో కొత్త కోర్సులు పూర్తిచేసేందుకు తిరిగి దరఖాస్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎంబీఏ చేసేందుకు వస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ స్థాయిలో ఏ కోర్సుల్లో విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు? ఎక్కువగా స్టెమ్, ఎంబీఏ ప్రోగ్రామ్స్‌ను ఎంచుకుంటున్నారు. ఇండియా నుంచి వచ్చే విద్యార్థులు ముఖ్యంగా కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజిటల్ గేమింగ్‌లో డిగ్రీ చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. దీంతోపాటు సైకాలజీలో అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ కోర్సులు చేసేందుకు వచ్చే విద్యార్థినుల సంఖ్య కూడా పెరుగుతోంది. కొవిడ్ మహమ్మారి పరిస్థితిలో క్లాస్‌వర్క్ కోసం వర్సిటీ ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తోంది? మహమ్మారి ప్రారంభమైన మార్చిలో మా విశ్వవిద్యాలయాన్ని మూసివేశాం. క్యాంపస్‌లో ఉండి ముఖాముఖి బోధన కావాలనుకునే విద్యార్థులకు అనువుగా ఫాల్ సెషన్లో క్యాంపస్‌ను తెరిచాం. కొత్త అంతర్జాతీయ విద్యార్థులందరూ యూఎస్ వీసాలు పొందగానే క్యాంపస్‌కు వచ్చారు. కోర్సులను ముఖాముఖి, హైబ్రిడ్ అండ్ ఆన్లైన్లో అందించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. మా వర్సిటీ కొవిడ్–19 టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. కొవిడ్ –19 దృష్ట్యా మీ వర్సిటీ జీఆర్ఈ స్కోరు లేదా ప్రామాణిక ఇంగ్లిష్ టెస్టింగ్ నిబంధనల్లో సడలింపు ఇస్తోందా? ఇంగ్లిష్ స్కిల్స్ కోసం డుయోలింగోను అమలు చేశాం. డుయోలింగో ఒక కొత్త ఇంగ్లిష్ స్కిల్ టెస్ట్, దీనిద్వారా విద్యార్థులు తమ ఇంటి నుంచే పరీక్ష రాసేందుకు వీలుంది. ఇక, విదేశీ విద్యార్థుల కోసం హూస్టన్ యూనివర్సిటీ శాట్/ఆక్ట్ స్కోర్స్‌ను గతంలోనే రద్దు చేసింది. మేము విద్యార్థుల ప్రతిభను వారి జాతీయ పరీక్షల్లోను, లేదా వారి హైస్కూల్, మాధ్యమిక, పోస్ట్–సెకండరీ స్కూలింగ్ తీరును ఆయా సంస్థల నుంచి తెలుసుకుంటాం. ప్రస్తుత కొవిడ్ సంక్షోభ సమయంలో విద్యార్థులు చదువుతోపాటు క్యాంపస్‌లో పనిచేసే అవకాశం ఉందా? మా విద్యార్థులు ఆన్ క్యాంపస్గాను, రిమోట్గాను పనిచేస్తున్నారు. మా గ్రాడ్యుయేట్ కోర్సుల విద్యార్థులు..స్టెమ్‌లోనే కాకుండా.. బిజినెస్ కోర్సుల్లో కూడా గ్రాడ్యుయేట్ అసిస్టెంట్‌షిప్స్ పొందారు. కొవిడ్ నివారణకు వర్సిటీ క్యాంపస్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? క్యాంపస్‌లో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సిడిసి) మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి భవనం ప్రవేశద్వారం వద్ద శానిటైజింగ్ అండ్ టెంపరేచర్ స్టేషన్లు ఉన్నాయి. స్టడీ డెస్క్‌ల చుట్టూ ప్లెక్సీ షీల్డ్స్‌ను ఏర్పాటు చేశాం. భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు వర్సిటీ ఏమైనా ప్రత్యేక ఆఫర్లు ఇస్తోందా? భారతీయ విద్యార్థులు యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్‌ను ఎంచుకోవడానికి కారణం.. ఇక్కడి స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్) కోర్సులు. అలాగే మేము విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పిస్తున్నాం. లుడ్మి హెరాత్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్, సీనియర్ ఇంటర్నేషనల్ ఆఫీసర్(ఎస్ఐఓ),యూనివర్సిటీ ఆఫ్ హుస్టన్. -
విదేశీ విద్యకు ప్రవేశ పరీక్షలెన్నో..
విదేశీ విద్య ఇప్పుడు ప్రతి ఒక్కరి కల. విదేశాలకు వెళ్లి తమకు నచ్చిన కోర్సులు అభ్యసించి.. భావి జీవితానికి బలమైన పునాదులు వేసుకోవాలని విద్యార్థులు ఆశిస్తారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఇందులోనూ అందరూ మొదటి గమ్యంగా భావించే అమెరికాకు వెళ్లేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఫారిన్ చదువుల కోసం ఏ దేశ నగరాల నుంచి అమెరికాకు ఎక్కువమంది విద్యార్థులు వస్తున్నారో తెలుసుకోవడానికి ఇటీవల అమెరికాకు చెందిన బ్రూకింగ్ ఇన్స్టిట్యూట్ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో 26,220 మంది విద్యార్థులతో ప్రపంచవ్యాప్తంగా ఐదోస్థానంలో, దేశంలో మొదటి స్థానంలో నిలిచింది హైదరాబాద్. ఈ నేపథ్యంలో విదేశీ విద్యను అభ్యసించాలంటే రాయాల్సిన పరీక్షల గురించి తెలుసుకుందాం.. టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ (టోఫెల్) ఇది ప్రాథమిక స్థాయి ఆంగ్ల పరీక్ష. అమెరికాలోని యూనివర్సిటీలు యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కెనడా, బ్రిటన్, సింగపూర్ సహా 130 దేశాలు, దాదాపు 9000 పైగా కాలేజీలు, యూనివర్సిటీలు టోఫెల్ స్కోరు ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. పరీక్ష స్కోర్ కార్డ్ రెండేళ్లపాటు చెల్లుతుంది. టోఫెల్లో వచ్చిన స్కోరు ఆధారంగా ఆయా దేశాలు వీసా, స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ కూడా ఇస్తున్నాయి. పరీక్ష వ్యవధి నాలుగున్నర గంటలు. లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అంశాలపై ప్రశ్నలడుగుతారు. ప్రతి సెక్షన్‌కు 30 పాయింట్ల చొప్పున మొత్తం పాయింట్లు 120. పరీక్ష ఫీజు: 170 యూఎస్ డాలర్లు. ఏడాదిలో ఎప్పుడైనా ఆన్లైన్, ఫోన్, ఈమెయిల్ లేదా టోఫెల్ ఐబీటీ రిసోర్స్ సెంటర్‌కు నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: www.ets.org/toefl స్కాలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ (శాట్) విదేశాల్లో.. ముఖ్యంగా యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)లో అండర్గ్రాడ్యుయేట్/బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ చదవాలనుకునేవారు రాయాల్సిన పరీక్ష స్కాలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ (శాట్). ఈ స్కోర్ ఆధారంగా యూజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించే వాటిలో కెనడా, ఆస్ట్రేలియా, యునెటైడ్ కింగ్డమ్ వంటి దేశాలున్నాయి. స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ అందించడానికి కూడా ఈ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. శాట్‌ను యూఎస్ఏలోని కాలేజ్ బోర్డ్, ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) నిర్వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 20 లక్షలమంది శాట్ రాస్తున్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో స్పెషలై జేషన్ చేయాలనుకునేవారు శాట్ సబ్జెక్ట్ టెస్టులు రాయాలి. 2016 నుంచి శాట్ పరీక్ష విధానంలో మార్పులు రానున్నాయి. సంవత్సరంలో ఆరుసార్లు (జనవరి, మే, జూన్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్) ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఏడాదిలో రెండుసార్లకు మించి రాయడానికి అవకాశం లేదు. 12 ఏళ్ల ఎడ్యుకేషన్.. అంటే ఇంటర్మీడియెట్ (10+2) పూర్తిచేసినవారు శాట్‌కు అర్హులు. మూడు గంటల 45 నిమిషాల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. అవి.. రీడింగ్, రైటింగ్, మ్యాథ్స్. వీటిల్లో అభ్యర్థుల నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలడుగుతారు. శాట్ స్కోర్ పరీక్ష రాసిన నాటి నుంచి ఐదేళ్లపాటు చెల్లుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష రుసుం కింద 51 యూఎస్ డాలర్లు, ఇతర రుసుంల కింద 40 యూఎస్ డాలర్లు చెల్లించాలి. సబ్జెక్టు టెస్టులు రాసేవారు నిర్దేశిత ఫీజులు పే చేయాలి. వెబ్సైట్: http://sat.collegeboard.org/ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్) ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ దేశాల్లో ఎంబీఏ, ఇతర బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధిత కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే రాయాల్సిన పరీక్ష గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్). దీన్ని యూఎస్‌లోని గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (జీమ్యాక్) నిర్వహిస్తోంది. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1700 యూనివర్సిటీలు బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ఆయా కోర్సుల్లో స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ అందించడానికి జీమ్యాట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. పరీక్షా విధానం: మూడున్నర గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో వెర్బల్ (41 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ (37 ప్రశ్నలు), ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ (12 ప్రశ్నలు)తోపాటు అనలిటికల్ రైటింగ్‌పైన ప్రశ్నలుంటాయి. పరీక్ష ఫీజు 250 డాలర్లు. మన దేశ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, కెనడా, ఫిన్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యూకే, యూఎస్‌లలోని ప్రముఖ కాలేజీలు/యూనివర్సిటీలు జీమ్యాట్ స్కోర్ ఆధారంగానే గ్రాడ్యుయేట్ బిజినెస్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. మనదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు, బిట్స్ పిలానీ, ఐఎస్బీ-హైదరాబాద్, ఎక్స్ఎల్ఆర్ఐ-జంషెడ్పూర్, మైకా-అహ్మదాబాద్, ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి ప్రముఖ సంస్థలు జీమ్యాట్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. జీమ్యాట్ రాసేవారికి కనీసం 18 ఏళ్ల వయసు ఉండాలి. పరీక్ష తేదీ నాటికి కనీసం వారం రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఒక ఏడాదిలో గరిష్టంగా ఐదుసార్లు పరీక్ష రాయొచ్చు. ఒకసారి పరీక్ష రాస్తే 31 రోజుల తర్వాత మాత్రమే మళ్లీ పరీక్ష రాయడానికి అవకాశం లభిస్తుంది. ఈ స్కోర్ ఐదేళ్లపాటు చెల్లుతుంది. సాధారణంగా ఈ మొత్తం స్కోర్ 200 నుంచి 800 మధ్యలో ఉంటుంది. ప్రధాన బీ-స్కూల్స్‌లో ప్రవేశానికి కనీస స్కోరు ప్రకటించనప్పటికీ 600-700 వరకు మంచి స్కోరుగా భావించొచ్చు. ఆన్లైన్, ఫోన్, పోస్టల్ మెయిల్ ద్వారా సంవత్సరమంతా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: www.mba.com/india అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (ఏసీటీ) అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (ఏసీటీ) స్కోర్‌ను యూఎస్ కాలేజీల్లో అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. యూఎస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీలో చేరాలనుకునేవారు శాట్ లేదా ఏసీటీ రాసుకోవచ్చు. ఎందులో ఎక్కువ స్కోర్ వస్తే దాని ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. నాలుగేళ్ల కోర్సులను అందించే అమెరికన్ యూనివర్సిటీలు, కళాశాలలన్నీ ఏసీటీ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కెనడాలోని కొన్ని విద్యా సంస్థలు కూడా ఏసీటీ ఆధారంగా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఏసీటీని ఏడాదికి ఆరుసార్లు నిర్వహిస్తారు. దాదాపు మూడున్నర గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో ఇంగ్లిష్ (75 ప్రశ్నలు), మ్యాథ్స్ (60 ప్రశ్నలు), రీడింగ్ (40 ప్రశ్నలు), సైన్స్( 40 ప్రశ్నలు), వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: www.actstudent.org ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్టీఎస్) అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఫిన్లాండ్ వంటి దేశాల యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం 130 దేశాల్లో 900 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. నెలకు నాలుగుసార్లు చొప్పున ఏడాదికి 48 సార్లు పరీక్ష ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 9000 సంస్థలు ఐఈఎల్టీఎస్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వీటిలో వివిధ యూనివర్సిటీలు, ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్లు, ప్రభుత్వ సంస్థలు, బహుళజాతి కంపెనీలు, ఇతర సంస్థలు ఉన్నాయి. అంతేకాకుండా పని కోసం ఇతర దేశాలకు వెళ్లేవారు కూడా ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. రెండు గంటల 45 నిమిషాల వ్యవధిలో అభ్యర్థుల ఇంగ్లిష్ భాషా సామర్థ్యాలను తెలుసుకునే విధంగా లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అంశాలపై పరీక్ష ఉంటుంది. ప్రతి విభాగంలో కనీసం 1-9 వరకు స్కోర్ సాధించాలి. అన్ని విభాగాల్లో సాధించిన స్కోర్ ఆధారంగా సగటు స్కోరును లెక్కిస్తారు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలమంది ఈ పరీక్ష రాశారు. స్కోర్ రెండేళ్లపాటు చెల్లుతుంది. ఫీజు: రూ. 9,900. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: www.ielts.org ది గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ (జీఆర్ఈ) ది గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ (జీఆర్ఈ) రివైజ్డ్ జనరల్ టెస్ట్.. విదేశాల్లో ఉన్నత విద్యావకాశానికి మార్గం వేసే పరీక్ష. విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ, డాక్టోరల్ కోర్సులు చదవాలనుకునేవారు ఈ పరీక్ష రాయాలి. అమెరికాలోని గ్రాడ్యుయేట్ స్కూల్స్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 3,200 ఇన్స్టిట్యూట్లు జీఆర్ఈ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ ఎంపికకు కూడా ఈ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. జీఆర్‌ఈని ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో..850 కేంద్రాల్లో నిర్వహిస్తారు. పరీక్ష రాయడానికి మూడు వారాల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఏడాదిలో ఐదుసార్లు జీఆర్ఈ రాయొచ్చు. ఒక్కో పరీక్ష మధ్య కనీసం 21 రోజుల వ్యవధి ఉండాలి. గతంలో రాసిన పరీక్షలో వచ్చిన స్కోర్‌ను మెరుగుపర్చుకొనేందుకు మళ్లీ టెస్టు రాయొచ్చు. కంప్యూటర్/పేపర్ ఆధారిత విధానాల్లో పరీక్ష ఉంటుంది. అనలిటికల్ రైటింగ్, వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్‌లపై ప్రశ్నలడుగుతారు. పరీక్ష వ్యవధి దాదాపు గంటన్నర. సంబంధిత సబ్జెక్టుల్లో స్పెషలైజేషన్ చేయాలనుకునేవారి కోసం ప్రత్యేకంగా జీఆర్ఈ సబ్జెక్టు టెస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఏడాదిలో మూడుసార్లు (సెప్టెంబర్, అక్టోబర్, ఏప్రిల్) రాసుకునే సదుపాయం ఉంది. జీఆర్ఈ స్కోర్ పరీక్ష రాసిన నాటి నుంచి ఐదేళ్లపాటు చెల్లుతుంది. వివరాలకు: www.ets.org/gre -
ఉద్యోగాన్వేషణకు... ఆగ్నేయాసియా
టాప్ స్టోరీ: ఫారిన్ ఎడ్యుకేషన్ అన్నా..విదేశాల్లో ఉద్యోగం అన్నా మన యువతలో ఎనలేని ఆసక్తి. డిగ్రీ పట్టా చేతికి అందగానే విద్య, ఉద్యోగం అంటూ విదేశాల వైపు చూసేవారెందరో ఉన్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా అమెరికా, ఐరోపా దేశాల్లో అనిశ్చితి నెలకొన్న సమయంలో కూడా.. అవకాశాల కల్పనలో ఆ దేశాలకు దీటుగా నిలిచాయి ఆసియాన్ దేశాలు. స్వేచ్ఛా వ్యాపారం, ప్రపంచీకరణ ఫలితంగా ఆసియాన్ దేశాల స్వరూపమే మారిపోయింది. పెరుగుతున్న వాణిజ్యం, ఊపందుకున్న వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం ఏర్పడింది. అవకాశాలు ఎక్కడ ఉన్నా ఇట్టే పసిగట్టే భాగ్యనగర యువత.. తమ కెరీర్‌కు గమ్యంగా ఆగ్నేయాసియా దేశాలను ఎంచుకుంటున్నారు. ఆయా దేశాల్లో వాలిపోతున్న యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసియాన్ దేశాలకు వెళ్లేవారు తమ కెరీర్‌ను విజయవంతం చేసుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు.. అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఏషియన్ నేషన్స్‌కు సంక్షిప్త రూపం..ఆసియాన్ (అఉఊ). సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, ఫిలిఫ్పైన్స్, వియత్నాంలను ఆసియాన్ దేశాలుగా వ్యవహరిస్తారు. ఈ ఆగ్నేయాసియా దేశాల్లో కెరీర్‌ను ప్రారంభించాలంటే.. డిగ్రీలు, ప్రతిభను మాత్రమే నమ్ముకుంటే సరిపోదు. ఎందుకంటే మనతో పోల్చితే పూర్తి భిన్నమైన వాతావరణం, వివిధ దేశాల ప్రజలతో గ్లోబల్ విలేజ్‌ను తలపించే నేపథ్యం, సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే అక్కడి సమాజం వంటి అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. అక్కడి పరిస్థితులపై క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పలు కీలక అంశాలపై అవగాహన పెంచుకోవాలి. హైరింగ్ ట్రెండ్: సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, ఫిలిఫ్పైన్స్, వియత్నాం వంటి ఆసియాన్ దేశాల్లో గ్లోబలై జేషన్ ఫలితంగా అక్కడి వ్యాపార ముఖచిత్రమే మారిపో యింది. ప్రపంచంలో ఎనిమిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆసియాన్ అవతరించింది. ఈ దేశాల జీడీపీ వృద్ధి 2.3 ట్రిలియన్ యూఎస్ డాలర్లకు చేరుకుంది. అదే క్రమంలో వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. డిమాండ్ వీటికే: ఆగ్నేయాసియా దేశాల్లో టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, డిజిటల్ మీడియా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సర్వీస్ సెక్టార్ వంటి రంగాల్లో జోరుగా హైరింగ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఉదాహరణకు సింగపూర్‌ను తీసుకుంటే.. అక్కడి మ్యాన్‌పవర్ మినిస్ట్రీ అంచనా మేరకు పది ఉద్యోగాల్లో ఆరు విదేశీయులకే దక్కాయి. మలేషియాలో ఫైనాన్స్, టెక్నాలజీ రంగాలు ముందంజలో ఉంటున్నాయి. కారణాలు: ప్రపంచంలో అధిక శాతం కంపెనీలు ఆగ్నేయాసియా బాట పట్టాయి. దీనికి కారణం అక్కడి ప్రభుత్వాలు కల్పిస్తున్న ఆకర్షణీయమైన రాయితీలే. ఈ క్రమంలో చాలా కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసు కుంటున్నాయి. ఫలితంగా సంబంధిత వ్యవహారాల నిర్వహణ కోసం పెద్ద ఎత్తున మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. రెట్టింపు సిబ్బంది కావాలి: పర్యాటక, హోటళ్ల రంగాల్లో ఆగ్నేయాసియా దేశాలు ముందంజలో నిలుస్తున్నాయి. ఆయా దేశాల్లో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద హోటల్ వ్యవస్థ ఉంది. అక్కడి ప్రముఖ హోటళ్లు త్వరలో 47 కొత్త హోటళ్లను ప్రారంభించాలని ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. అంటే ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బంది కంటే రెట్టింపు సిబ్బంది కావల్సి ఉంటుంది. సంస్కృతికి పెద్ద పీట: ఆగ్నేయాసియా దేశాలకు ఉపాధి కోసం వెళ్లే విద్యార్థులు మొట్టమొదటగా అవగాహన పెంచుకోవాల్సిన కీలక అంశం.. ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాలు. ఎందుకంటే అక్కడి ప్రజలు వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి ప్రయాణానికి ముందే అక్కడి సంస్కృతి సంప్రదాయాలపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలి. వాటిని గౌరవించడం నేర్చుకోవాలి. దాంతో కంపెనీలో పని చేసే సహచరులతో స్నేహసంబంధాలు ఏర్పడతాయి. వివిధ మాధ్యమాలు, ఇంటర్నెట్, పుస్తకాల ద్వారా ఆయా దేశాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలి. వీలైతే అక్కడ స్థిరపడిన భారతీయుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పదజాలం: మరో కీలకాంశం.. భాష. ఆయా దేశాల్లో స్థానికంగా మాట్లాడే భాషపై అవగాహన కలిగి ఉండటం. అక్కడి ప్రజలు తమ సంభాషణలో భాగంగా తరుచుగా ఉపయోగించే కొన్ని పదాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు మలేషియాలో ప్రజలు ఏ విషయాలకు నేరుగా కాదు లేదా నో (ూౌ) అని చెప్పరు. అటువంటి సందర్భం ఎదురైతే సున్నితంగా ‘ఐ విల్ ట్రై (ఐ ఠీజీ ్టటడ )’ అంటారు. కాబట్టి అలాంటి పదాలపై అవగాహన పెంచుకోవాలి. సమయ పాలన: ఆగ్నేయాసియా ప్రజలు అత్యంత ప్రాముఖ్యాన్నిచ్చే అంశాల్లో సమయ పాలన ఒకటి. దీన్నిబట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. ప్రజలు సంబంధ బాంధవ్యాలకు కూడా ఎక్కువ విలువనిస్తారు. ఒకరితో ఒకరు స్నేహం పెంచుకోవడానికి తరుచుగా కలుసుకోవడం కీలకమని భావిస్తుంటారు. ఇతరులతో వ్యవహారాలను నిర్వహిం చేటప్పుడు ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. ఆహార అలవాట్లు: మరో అంశం.. ఆహార అలవాట్లు. పూర్తిగా మన దేశానికి భిన్నమైన వంటకాలు అక్కడ కనిపిస్తాయి. ఆయా దేశాల్లో ఎక్కువగా ఉపయోగించే ఆహారం, సంబంధిత అలవాట్లను క్షుణ్నంగా తెలుసుకోవడం మంచిది. అక్కడ ఆహారం తీసుకోవడానికి ఎక్కువగా చాప్ స్టిక్స్ వినియోగిస్తారు. కాబట్టి వాటి వినియోగంపై అవగాహన పెంచుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. కార్యాలయాల్లో.. కార్యాలయాల్లో హుందాగా ప్రవర్తించాలి. సందర్భానుసారంగా హావభావాల ప్రకటన ఉండాలి. చొరవగా కలివిడిగా అందరితో మంచి సంబంధాలను కలిగి ఉండడం కెరీర్లో రాణించడానికి దోహదం చేస్తుంది. అక్కడికి చేరుకున్నాక ఫ్రెండ్స్, కుటుంబ, సహచరుల, సంబంధిత అసోసియేషన్ల ఫోన్ నెంబర్లు, చిరునామా, ఈ-మెయిల్ తదితర వివరాలను దగ్గర ఉంచుకోవాలి. మీ చదువు, నైపుణ్యం, పరిజ్ఞానానికి అనువైన ఉద్యోగాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కోసారి మనం ప్రాముఖ్యం ఇవ్వని చిన్న ఉద్యోగం కూడా లభించవచ్చు. అటువంటి వాటిని తిరస్కరించకుండా అనుభవం పెంచుకునే దిశగా వాటిని ఉపయోగించుకోవాలి. కమ్యూనికేషన్ కీలకం: భావ ప్రసరణలో కీలకం కమ్యూనికేషన్. ఇద్దరు వ్యక్తులు లేదా సమూహాల మధ్య జరిగే వ్యవహారాలను ప్రభావవంతంగా నిర్వహించేందుకు కమ్యూనికేషన్ దోహద పడుతుంది. ఈ విషయంలో మన దేశానికి, అక్కడి దేశాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించాలి. మరీ చిన్నగా లేదా బిగ్గరగా, అరుస్తూ మాట్లాడడాన్ని కూడా సింగపూర్ వాసులు హర్షించరు. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ సంభాషించడం అలవాటు చేసుకోవాలి. మిగతా దేశాల ప్రజలు మాట్లాడే తీరుపైనా అవగాహన పెంచుకోవాలి. ఇంటర్వ్యూలో వ్యక్తిగతం మన దేశంతో పోల్చితే ఇంటర్వ్యూ చేసే విధానం కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆయా దేశాల్లోని చాలా మంది రిక్రూటర్లు ఇంటర్వ్యూలో భాగంగా వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఎక్కడ నివసిస్తున్నారు? ఎంత అద్దె చెల్లిస్తున్నారు? ఎక్కడ చదువుకున్నారు? ఎంత వరకు చదువుకున్నారు? వంటి వ్యక్తిగత అంశాలను లోతుగా తెలుసుకునే ప్రశ్నలను వేస్తుంటారు. ఇలాంటి ప్రశ్నలకు, ఉద్యోగానికి సంబంధం ఉండకపోవచ్చు, అయితే, కొత్త వారి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, స్నేహాన్ని పెంచుకోవడానికి, సుహృద్భావ వాతావరణం సృష్టించడానికి, చక్కటి సంబంధాలను నెలకొల్పే క్రమంలో మాత్రమే వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తుంటారు. అవకాశాలు వీరికే: ఆసియాన్ దేశాల్లో అందుబాటులోకి వస్తున్న అవకాశాలను అందుకోవాలంటే ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఆపరేషన్స్, హోటల్ మేనేజ్మెంట్, కామర్స్, జర్నలిజం, డిజిటల్ మీడియా, ఫైనాన్స్ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. వేతనాలు అధికమే: హోదా, అనుభవాన్ని బట్టి వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌లలో భారత్‌లో లభించే వేతనాల కంటే 25 నుంచి 30 శాతం అధికంగా వేతనాలను చెల్లిస్తున్నారు. సమాచారం ఎలా? జాబ్ పోర్టల్స్, వివిధ సంస్థలు నిర్వహించే కెరీర్-నెట్ వర్కింగ్ ఈవెంట్ల ద్వారా ఉద్యోగావకాశాల గురించి తెలుసుకోవచ్చు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లను కూడా ఇందుకు వినియోగించుకోవచ్చు. గుర్తుంచుకోండి సమయ పాలన, వృత్తిపరమైన అంశాల్లో నిబద్ధతతో వ్యవహరించాలి. కంపెనీల నియమాలు/ ఉద్యోగ ఒప్పందాన్ని అతిక్రమించరాదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. నేరుగా సంప్రదింపులు (డెరైక్ట్ కమ్యూనికేషన్) ప్రశంసనీయం కాదు. విభిన్న అవకాశాలకు.. ఆగ్నేయాసియా దేశాలు ఆగ్నేయాసియా దేశాలు చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు, పరిశ్రమల విస్తరణ వంటి చర్యల కారణంగా ఇప్పుడు ఆ దేశాలు విదేశీ ఉద్యోగార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో హాస్పిటాలిటీ, టూరిజం, హెల్త్‌కేర్, బీపీఓ విభాగాల్లో పలు ఉద్యోగాలు ఉన్నాయి. ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో టీచింగ్ విభాగంలో మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఆయా దేశాలకు వెళ్లాలనుకునే ఔత్సాహికులు సరైన ప్రణాళికతో వ్యవహరించాలి. తాము చేరదలచుకున్న సంస్థ, రంగాలకు సంబంధించి ఆయా దేశాల్లో ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తుపై సంపూర్ణ అవగాహనతో ఉండాలి. ఇలా అయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. - ఎం. సింధు, క్లయింట్ రిలేషన్ మేనేజర్, మాన్స్టర్ ఇండియా డాట్ కామ్ జాబ్ సెర్చ్ ఇంజిన్స్ ద్వారా అవగాహన ఇటీవలి కాలంలో ఆగ్నేయాసియా దేశాలు ఉద్యోగాల రీత్యా మన అభ్యర్థులకు చక్కటి గమ్యాలుగా నిలుస్తున్నాయి. అభ్యర్థులు ఆన్లైన్ జాబ్ సెర్చ్ ఇంజిన్స్, కన్సల్టెన్సీల ద్వారా ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించొచ్చు. తమ అర్హతలకు తగిన ఉద్యోగాలపై అవగాహన పొంది దరఖాస్తు చేసుకోవచ్చు. పారిశ్రామిక సంస్థల్లో క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు డిప్లొమా నుంచి.. మిడిల్ లెవల్ మేనేజ్మెంట్ పోస్ట్‌ల కోసం మాస్టర్స్ డిగ్రీ వరకు ప్రతి ఒక్కరికీ అనువైన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఆయా అవకాశాలపై కన్సల్టెన్సీలను సంప్రదించే ముందు సదరు కన్సల్టెన్సీ విశ్వసనీయత గురించి తెలుసుకున్నాకే ముందుకు సాగాలి. - టి.ఎస్. విశ్వనాథ్, విసు గ్లోబల్ కన్సల్టింగ్స్