Why Foreign Education Is Burden For Indian Students, Details Inside - Sakshi
Sakshi News home page

విదేశీ విద్య మరింత భారం.. విద్యార్థుల్లో కొత్త టెన్షన్‌

Published Thu, Mar 2 2023 10:08 AM | Last Updated on Thu, Mar 2 2023 10:55 AM

Foreign Education Is Burden For Indian Students - Sakshi

సాక్షి, అమరావతి: విదేశీ విద్య భారత విద్యార్థులకు మరింత భారమవుతోంది. ఇప్పటికే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అంతకంతకూ పతనమవుతోంది. దీంతో భారత విద్యార్థులు అమెరికాలో చదువుకోవాలంటే మరిన్ని ఎక్కువ రూపాయలను ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను పెంచడంతో విద్యా రుణాలు తడిసి మోపెడవుతున్నాయి. 

అయితే విదేశాల్లో చదివితే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని, అత్యధిక వేతనాలు వస్తాయన్న ఆశతో వెళ్తున్న విద్యార్థుల్లో అత్యధికులు చివరకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చదువులు ముగిసిన వెంటనే విద్యార్థులు మంచి కొలువులు సాధిస్తే సరి.. లేకపోతే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. విదేశీ చదువులు ముగిస్తున్న వారిలో కేవలం నాలుగో వంతు మందికి మాత్రమే ఆయా దేశాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయని గణాంకాలు తెలుపుతున్నాయి. కంపెనీలు ఆర్థిక పరిస్థితులతో కొందరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. తక్కిన వారంతా స్వదేశానికి తిరిగొచ్చి ఇక్కడ ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. 

మరోవైపు ఇక్కడి వేతనాలు, విదేశీ చదువుల కోసం చేసిన అప్పులకు పొంతన లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇక ఆ కొలువులూ దక్కని వారి కుటుంబాలు ఆ అప్పులు తీర్చడానికి సతమతమవుతున్నాయి. గత ఐదారేళ్లలో ఒక్క కరోనా సమయంలో మినహాయిస్తే ఏటా కనీసం 4 లక్షల వరకు విద్యార్థులు చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. 

కరోనా తగ్గుముఖం పట్టాక..
కరోనా తగ్గుముఖం పట్టడంతో విదేశీ చదువులకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో సహజంగానే ఆ మేరకు రుణాల శాతం కూడా ఎక్కువైంది. 2019లో 5.86 లక్షల మంది భారత విద్యార్థులు విదేశాల్లో చదువుల కోసం వెళ్లారు. 2020లో ఆ సంఖ్య ఒక్కసారిగా సగానికి తగ్గి 2.59 లక్షలకు పడిపోయింది. కరోనా వ్యాప్తి కారణంగా అనేక దేశాల్లో రాకపోకలపై నిషేధాలు, విద్యా సంస్థల మూత ఇందుకు కారణాలుగా నిలిచాయి. 2021 నుంచి కరోనా తగ్గుదలతో క్రమేణా మళ్లీ విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022లో ఆ సంఖ్య గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరింది. గతేడాది 7.5 లక్షల మంది విదేశాలకు వెళ్లారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచే అధిక రుణాలు
విదేశాల్లో చదువులకోసం వెళ్లే విద్యార్థులు ఫీజుల కోసం అత్యధికంగా ప్రభుత్వ బ్యాంకుల రుణాలపైనే ఆధారపడుతున్నారు. దాదాపు 95 శాతం మంది విద్యార్థులు ఈ రుణాల ఆధారంగానే విదేశీ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో 2021లో విదేశీ విద్య కోసం ప్రభుత్వరంగ బ్యాంకులు అందించిన రుణాల మొత్తం రూ.4,503.61 కోట్లుగా ఉంది. 

2020లో మంజూరు చేసిన రుణాలతో పోల్చి చూస్తే ఇది 23.5 శాతం తక్కువ. కరోనా కారణంగా 2020లో విదేశీ విద్యకు ఆటంకాలు ఏర్పడడంతో విద్యా రుణాల మంజూరు కూడా భారీగా తగ్గింది. 2022లో రుణాల మంజూరు అమాంతం పెరిగింది. గతేడాది ప్రభుత్వ రంగ బ్యాంకులు విదేశాల్లో చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు రూ.7,576.02 కోట్లను మంజూరు చేశాయి. 2021లో మంజూరు చేసిన రుణాలతో పోల్చి చూస్తే ఇది 68.2 శాతం అధికం. 2022లో మొత్తం విద్యా రుణాలు రూ.15,445.62 కోట్లు ఇవ్వగా అందులో దాదాపు సగం మేర అంటే రూ. 7,576.02 కోట్లు విదేశీ విద్యకోసం ఇచ్చినవే. 

చెల్లించడానికి ఇబ్బందులు
ఇటీవల కాలంలో వడ్డీ రేట్లు భారీగా పెరగడంతో ఆ ప్రభావం విద్యా రుణాలపైన పడుతోందని ప­లు­­వురు నిపుణులు పేర్కొంటున్నారు. తీసుకున్న రు­­ణం వడ్డీతో కలిపి తడిసి మోపెడవుతోందని, దీ­న్ని తీర్చడానికి సమస్యలు ఎదుర్కొంటున్నారని వి­వరిస్తున్నారు. ఉద్యోగాల్లో చేరి అధిక వేతనాలు తీ­సు­కుంటున్న వారే తిరిగి కట్టలేని పరిస్థితి ఉందని చె­బుతున్నారు. అలాంటిది అరకొర వేతనాలు, లేదా అసలు ఉద్యోగమే లేని వారి కుటుంబాలు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాయని అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement