Bank interest rates
-
రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు..
న్యూఢిల్లీ: గృహాల రంగానికి ఇచ్చిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు రూ. 10 లక్షల కోట్లు ఎగిశాయి. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రికార్డు స్థాయిలో రూ. 27.23 లక్షల కోట్లకు చేరాయి. రంగాలవారీగా బ్యాంకు రుణాల అంశంపై ఆర్బీఐ వెలువరించిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.వీటి ప్రకారం 2022 మార్చిలో గృహ నిర్మాణ రంగంలో (హౌసింగ్‌కు ప్రాధాన్యతా రంగం కింద ఇచ్చినవి సహా) రుణబాకీలు రూ. 17,26,697 కోట్లుగా ఉండగా 2024 మర్చి ఆఖరు నాటికి రూ. 27,22,720 కోట్లకు చేరింది. కమర్షియల్ రియల్ ఎస్టేట్‌కి ఇచ్చినవి రూ. 2.97 లక్షల కోట్ల నుంచి రూ. 4.48 లక్షల కోట్లకు చేరాయి.కోవిడ్ అనంతరం గత రెండేళ్లలో ఇళ్ల విక్రయాలు, ధరలు గణనీయంగా పెరిగినట్లు పలు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. ప్రభుత్వ తోడ్పాటు చర్యలతో అందుబాటు ధరల్లోని ఇళ్లకు డిమాండ్ నెలకొన్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవీస్ తెలిపారు. రాబోయే రోజుల్లోనూ గృహ రుణాల వృద్ధి పటిష్టంగానే ఉంటుందని, అయితే, అధిక బేస్ కారణంగా 15–20 శాతానికి దిగి రావొచ్చని పేర్కొన్నారు.ఇవి చదవండి: పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు! -
విదేశీ విద్య మరింత భారం.. భారత విద్యార్థులకు కొత్త టెన్షన్!
సాక్షి, అమరావతి: విదేశీ విద్య భారత విద్యార్థులకు మరింత భారమవుతోంది. ఇప్పటికే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అంతకంతకూ పతనమవుతోంది. దీంతో భారత విద్యార్థులు అమెరికాలో చదువుకోవాలంటే మరిన్ని ఎక్కువ రూపాయలను ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను పెంచడంతో విద్యా రుణాలు తడిసి మోపెడవుతున్నాయి. అయితే విదేశాల్లో చదివితే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని, అత్యధిక వేతనాలు వస్తాయన్న ఆశతో వెళ్తున్న విద్యార్థుల్లో అత్యధికులు చివరకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చదువులు ముగిసిన వెంటనే విద్యార్థులు మంచి కొలువులు సాధిస్తే సరి.. లేకపోతే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. విదేశీ చదువులు ముగిస్తున్న వారిలో కేవలం నాలుగో వంతు మందికి మాత్రమే ఆయా దేశాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయని గణాంకాలు తెలుపుతున్నాయి. కంపెనీలు ఆర్థిక పరిస్థితులతో కొందరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. తక్కిన వారంతా స్వదేశానికి తిరిగొచ్చి ఇక్కడ ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. మరోవైపు ఇక్కడి వేతనాలు, విదేశీ చదువుల కోసం చేసిన అప్పులకు పొంతన లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇక ఆ కొలువులూ దక్కని వారి కుటుంబాలు ఆ అప్పులు తీర్చడానికి సతమతమవుతున్నాయి. గత ఐదారేళ్లలో ఒక్క కరోనా సమయంలో మినహాయిస్తే ఏటా కనీసం 4 లక్షల వరకు విద్యార్థులు చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టాక.. కరోనా తగ్గుముఖం పట్టడంతో విదేశీ చదువులకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో సహజంగానే ఆ మేరకు రుణాల శాతం కూడా ఎక్కువైంది. 2019లో 5.86 లక్షల మంది భారత విద్యార్థులు విదేశాల్లో చదువుల కోసం వెళ్లారు. 2020లో ఆ సంఖ్య ఒక్కసారిగా సగానికి తగ్గి 2.59 లక్షలకు పడిపోయింది. కరోనా వ్యాప్తి కారణంగా అనేక దేశాల్లో రాకపోకలపై నిషేధాలు, విద్యా సంస్థల మూత ఇందుకు కారణాలుగా నిలిచాయి. 2021 నుంచి కరోనా తగ్గుదలతో క్రమేణా మళ్లీ విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022లో ఆ సంఖ్య గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరింది. గతేడాది 7.5 లక్షల మంది విదేశాలకు వెళ్లారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచే అధిక రుణాలు విదేశాల్లో చదువులకోసం వెళ్లే విద్యార్థులు ఫీజుల కోసం అత్యధికంగా ప్రభుత్వ బ్యాంకుల రుణాలపైనే ఆధారపడుతున్నారు. దాదాపు 95 శాతం మంది విద్యార్థులు ఈ రుణాల ఆధారంగానే విదేశీ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో 2021లో విదేశీ విద్య కోసం ప్రభుత్వరంగ బ్యాంకులు అందించిన రుణాల మొత్తం రూ.4,503.61 కోట్లుగా ఉంది. 2020లో మంజూరు చేసిన రుణాలతో పోల్చి చూస్తే ఇది 23.5 శాతం తక్కువ. కరోనా కారణంగా 2020లో విదేశీ విద్యకు ఆటంకాలు ఏర్పడడంతో విద్యా రుణాల మంజూరు కూడా భారీగా తగ్గింది. 2022లో రుణాల మంజూరు అమాంతం పెరిగింది. గతేడాది ప్రభుత్వ రంగ బ్యాంకులు విదేశాల్లో చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు రూ.7,576.02 కోట్లను మంజూరు చేశాయి. 2021లో మంజూరు చేసిన రుణాలతో పోల్చి చూస్తే ఇది 68.2 శాతం అధికం. 2022లో మొత్తం విద్యా రుణాలు రూ.15,445.62 కోట్లు ఇవ్వగా అందులో దాదాపు సగం మేర అంటే రూ. 7,576.02 కోట్లు విదేశీ విద్యకోసం ఇచ్చినవే. చెల్లించడానికి ఇబ్బందులు ఇటీవల కాలంలో వడ్డీ రేట్లు భారీగా పెరగడంతో ఆ ప్రభావం విద్యా రుణాలపైన పడుతోందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. తీసుకున్న రుణం వడ్డీతో కలిపి తడిసి మోపెడవుతోందని, దీన్ని తీర్చడానికి సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరిస్తున్నారు. ఉద్యోగాల్లో చేరి అధిక వేతనాలు తీసుకుంటున్న వారే తిరిగి కట్టలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. అలాంటిది అరకొర వేతనాలు, లేదా అసలు ఉద్యోగమే లేని వారి కుటుంబాలు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాయని అంటున్నారు. -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం: బ్యాంక్ వినియోగదారులకు షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రష్యా–ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు, గ్యాస్, బొగ్గు వంటి కమోడిటీల సరఫరాకు సంబంధించి మరిన్ని సమస్యలు తలెత్తవచ్చని యూటీఐ ఏఎంసీ ఫండ్ మేనేజర్ అంకిత్ అగర్వాల్ తెలిపారు. ఇంధనాల ధరలు ఇప్పటికే అధిక స్థాయిలో ఉన్నాయని, ఇకపై మరింతగా పెరగవచ్చని పేర్కొన్నారు. ఫెడ్ రేట్లు మరికొంతకాలం యథాతథమే! ‘‘ఈ నేపథ్యంలో అమెరికా ఫెడ్ రిజర్వ్ సహా సెంట్రల్ బ్యాంకులు..వడ్డీ రేట్ల పెంపును కాస్త వాయిదా వేసే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం ఎగిసిందంటే వినియోగదారుల్లో ఖర్చు చేసే సామర్థ్యాలు దెబ్బతింటాయి. కనుక ఇలాంటప్పుడు వడ్డీ రేట్లను వేగంగా పెంచితే ప్రతికూల పరిస్థితులు తలెత్తవచ్చు. దేశీ మార్కెట్లు గణనీయంగా పెరిగిన దృష్ట్యా సాధారణంగానే ఎంతో కొంత కరెక్షన్కు గురవుతాయి. అందుకోసం వాటికి ఏదో ఒక కారణం అవసరమవుతుంది. అది ఈ రూపంలో వచ్చిందని భావించవచ్చు’’ అని అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వివరించారు. ఇన్వెస్ట్ చేయాలంటే మదుపునకు సంబంధించి రంగాల వారీగా చూస్తే నిర్మాణ మెటీరియల్స్, కన్జూమర్ సర్వీసులు, హెల్త్‌కేర్ మొదలైనవి సానుకూలంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఇక దేశీయంగా తయారీ కార్యకలాపాలు పెరుగుతున్న క్రమంలో పారిశ్రామిక రంగ సంస్థలు, స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీలు, కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు మెరుగ్గా ఉండవచ్చని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మిడ్‌క్యాప్‌ల పనితీరు అన్నది ఆయా సంస్థల ఆదాయాలపై ఆధారపడనుందని అగర్వాల్ వివరించారు. లాంగ్‌టర్మ్ బెస్ట్ ప్రస్తుతం మార్కెట్లో మదుపు చేద్దామనుకుంటే..దీర్ఘకాలిక ధోరణితో వ్యవహరించాల్సి ఉంటుందని, కనీసం 3–5 ఏళ్ల వ్యవధికి ఇన్వెస్ట్ చేయడం మంచిదని పేర్కొన్నారు. దీనివల్ల సమీప భవిష్యత్తులో ఒడిదుడుకుల గురించి ఎక్కువగా ఆందోళన ఉండదని చెప్పారు. తమ కంపెనీపరంగా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు ఉన్నవి లేదా టర్నెరౌండు సామర్థ్యాలు ఉన్న వాటిపై ఎక్కువగా దృష్టి పెడతామని, తద్వారా కాలక్రమంలో మెరుగైన రాబడులు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. -
బ్యాంకు వడ్డీపై పన్నెంతో తెలుసా?
2016–17 ఆర్థిక సంవత్సరానికి రిటర్నులు దాఖలు చేయడానికి గడువు తేది అయిపోయింది. ఏదైనా కారణంతో వేయలేకపోతే వెంటనే వేసేయండి. ఇక ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం విషయానికి వస్తే.. ఇన్కమ్ శ్లాబులు.. రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.. ► 60 సంవత్సరాలు దాటని వారికి రూ.2,50,000 వరకు పన్ను లేదు. రూ.2,50,000 దాటితే రూ.5,00,000 లోపల 5 శాతం, రూ.5,00,000 నుంచి రూ.10,00,000 వరకు 20 శాతం, రూ.10,00,000 ఆపైన 30 శాతం పన్ను భారం ఉంటుంది. ► 60 నుంచి 80 ఏళ్ల లోపు ఉన్న వారికి రూ.3,00,000 వరకు పన్ను ఉండదు. ► 80 సంవత్సరాలు దాటిన వారికి రూ.5,00,000 వరకు పన్ను పడదు. ► చెల్లించే పన్ను మీద అదనంగా విద్యా సుంకం 3 శాతంగా ఉంటుంది. ► నికర ఆదాయం రూ.50,00,000 దాటితే సర్‌చార్జి 10 శాతం. ఇక నికర ఆదాయం రూ.1,00,00,000 దాటితే సర్‌చార్జి 15 శాతం. ► 80 ఏళ్ల లోపు వారికి ఆదాయం రూ.3,50,000 లోపల ఉంటే ట్యాక్స్ రిబేటు ఇస్తారు. ఈ రిబేటు రూ.2,500 వరకు మాత్రమే. ఈ రిబేటు వలన రూ.3,00,000 వరకు పన్నుండదు. అంటే శ్లాబులు మార్చకపోయినా రూ.3,00,000 వరకు పన్ను భారం లేదన్నమాట. పైవన్నీ పరిగణనలోకి తీసుకొని సెక్షన్ 80సీ, 80డీ, 80జీ తదితర మినహాయింపులు ఇచ్చిన తర్వాత మీ నికర ఆదాయాన్ని లెక్కించండి. పన్ను భారం తెలుసుకోండి. మీరు ఉద్యోగి అయితే మీ మొత్తం ఆదాయం మీద పన్నుభారం టీడీఎస్ ద్వారా జమ అయితే సరి!. అలా కాకపోతే పన్ను భారం పూర్తిగా చెల్లించినట్లు కాదు. అలాంటప్పుడు అడ్వాన్స్‌గా పన్ను చెల్లించాలి. మీరు వ్యాపారస్తులయినా, వృత్తికి సంబంధించిన వారయినా, ఇతర ఆదాయం ఉన్న వారయినా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ఉద్యోగస్తులకొచ్చే జీతం మీద, ఆదాయం మీద పూర్తి పన్ను భారాన్ని టీడీఎస్ రూపంలో మినహాయించటం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో అటు ఉద్యోగస్తులకు ఇటు ఇతరులకు టీడీఎస్ (మూలం వద్ద పన్ను మినహాయించటం) పూర్తిగా జరగకపోవచ్చు. జరిగినా కొంత భాగానికే జరుగుతుంది. అది ఎలాంటి పరిస్థితుల్లోనో ఒక్కసారి చూద్దాం... సేవింగ్స్ బ్యాంకు ఖాతాల మీద వచ్చే వడ్డీకి మినహాయింపు రూ.10,000. అంతకన్నా ఎక్కువగా వచ్చే వడ్డీని ఆదాయంలో కలపాలి. ఈ వడ్డీ మీద టీడీఎస్ ఉండదు. పన్ను భారం ఏర్పడినప్పుడు మొత్తం పన్ను చెల్లించాలి. ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీకి ఎలాంటి మినహాయింపు లేదు. కాకపోతే వార్షిక వడ్డీ రూ.10,000 దాటినప్పుడే టీడీఎస్ చేస్తారు. మీ వడ్డీ రూ.10,000 లోపల ఉందనుకోండి. టీడీఎస్‌కి గురికాదు. కాని పన్ను భారం ఉంటుంది. వార్షిక వడ్డీ రూ.10,000 దాటిన తర్వాత బ్యాంకు వాళ్లు వడ్డీలో 10 శాతాన్ని టీడీఎస్ చేస్తారు. చాలా మంది ఈ 10 శాతంలో పన్ను భారం తీరిపోయిందనుకుంటారు. అది తప్పు. మీ నికర ఆదాయం రూ.5,00,000 దాటినట్లయితే మీ పన్ను భారం 20శాతం. మీ నికర ఆదాయం రూ.10,00,000 దాటితే మీ పన్ను భారం 30 శాతం. ఈ రెండూ సందర్భాల్లో మీ పన్ను భారం మీరే స్వయంగా చెల్లించాలి. ఆ మేరకు అడ్వాన్స్‌గా 2018 మార్చి లోపల జమచేయాలి. మీ వార్షిక వడ్డీ రూ.60,000 అనుకోండి. టీడీఎస్ రూ.6,000 మాత్రమే. 20 శాతం.. రూ.12,000 పన్నుభారం అదనం. 30 శాతం.. రూ.18,000 పన్ను భారం అదనం. విద్యా సుంకం అదనం ఈ అదనపు పన్ను భారాన్ని అడ్వాన్స్ టాక్స్ రూపంలో గడువు తేదీలోపల చెల్లించకపోతే నెలకు వందకు 1 శాతం వడ్డీ వేస్తారు. ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ వారు బ్యాంకు అకౌంట్స్ వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏడాదికి రెండు సార్లు సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ జమవుతుంది. మీకు ఎన్ని అకౌంట్లుంటే అన్ని అకౌంట్లలో వడ్డీ కలపాల్సిందే. మొత్తం మీద రూ.10,000 మినహాయింపు. మిగతాది పన్నుకు గురవుతుంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు మీద వడ్డీలు.. ఆదాయపు పన్ను వారి చేతిలో మీ రాబడి వివరాలు పదిలంగా ఉన్నాయి. వారు అడగకముందే డిక్లేర్ చేసి మీ పన్ను భారం చెల్లించండి. -
డెట్‌ఫండ్స్ కన్నా ఎఫ్డీలు మిన్న
అన్ని రేట్లూ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో .. ఇటీవలి పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించలేదు. మరోవైపు, మార్కెట్ ఆధారిత డెట్ ఫండ్స్‌పై మాత్రం కొత్త నిబంధనలు విధించింది. దీంతో ఇప్పటిదాకా ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే ఆకర్షణీయంగా కనిపించిన డెట్ ఫండ్స్ వన్నె తగ్గింది. చాలా మంది ఎఫ్‌డీలవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే ఎఫ్‌డీలే సురక్షితం అన్న భావన నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక కథనం. ఇన్వెస్టరు ప్రధాన లక్ష్యం.. తాను పెట్టిన పెట్టుబడి సురక్షితంగా ఉండటం, రాబడులు రావడం, పెట్టిన పెట్టుబడి వృద్ధి చెందడం. ప్రస్తుతం ఎన్ని కొత్త సాధనాలు వస్తున్నప్పటికీ.. ఏ ఇన్వెస్టరైనా ప్రధానంగా వాటిలో ముందుగా చూసేది ఈ మూడు అంశాలే. అందుకే మనలో చాలా మంది తమ కష్టార్జితాన్ని బ్యాంకు డిపాట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే, ప్రస్తుతం ఈ కోవకి చెందిన సాధనాల్లో మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ చర్చనీయాంశంగా మారాయి. రిస్కు అంటే అస్సలు ఇష్టపడని వారు ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలో అర్థంగాక సతమతమవుతున్నారు. రిస్కు తీసుకునే సామర్థ్యం, రాబడి అంచనాలు, కాలవ్యవధి లాంటి అంశాలను బట్టి ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయాలా లేక ఫండ్స్‌ని ఎంచుకోవాలా అన్నది వ్యక్తిగతమైన అభిప్రాయాలపై ఆధారపడి ఉండే విషయం. అయినప్పటికీ .. మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఎఫ్డీలలో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు మంచిదన్నది తెలియజెప్పేందుకు ఈ ప్రయత్నం. స్వల్పకాలికం.. దీర్ఘకాలికం.. దీర్ఘకాలికంగా మంచి రాబడులు ఇస్తాయని మ్యూచువల్ ఫండ్స్‌కి పేరున్నప్పటికీ.. స్వల్ప కాలిక వ్యవధి విషయంలో వీటికి అంతగా మార్కులు పడవు. ఎందుకంటే ఫండ్స్ అనేవి.. మార్కెట్స్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటాయి. ఫలితంగా స్వల్పకాలిక వ్యవధిలో ఒకవేళ మార్కెట్ల పరిస్థితి గానీ బాగా లేకుంటే రాబడి సంగతి అటుంచి కొన్ని సార్లు పెట్టిన పెట్టుబడిలో సింహభాగం రాకుండా పోయే అవకాశాలూ ఉన్నాయి. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్ల విషయం తీసుకుంటే.. స్వల్పకాలికమైనా, దీర్ఘకాలికమైనా రాబడి గ్యారంటీగా ఉంటుంది. వీటిపై వడ్డీ రేట్లు ఆయా కాల వ్యవధికి సంబంధించి స్థిరంగా ఉండటమే ఇందుకు కారణం. ఎఫ్‌డీల్లో ‘నష్టం’ అన్న పదం వినిపించదు. ఇన్వెస్టరుకు అన్ని రకాల ప్రయోజనం చేకూర్చే సాధనం ఇది. పెట్టుబడులపై స్థిరమైన రాబడులు.. బ్యాంకు డిపాజిట్ల కింద ఇన్వెస్ట్ చేసేటప్పుడే నిర్దిష్ట శాతం మేర రాబడులు ఉంటాయని ఇన్వెస్టరుకు బ్యాంకు ముందుగానే చెబుతోంది. ఉదాహరణకు మీరు అయిదేళ్ల కాల వ్యవధి కోసం 9 శాతం వార్షిక వడ్డీ రేటు లెక్కన రూ. 50,000 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మొత్తం కాలవ్యవధిలో మీకు అదే వడ్డీ రేటు కొనసాగుతుంది. అంతే తప్ప తగ్గదు. అదే, డెట్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే.. కచ్చితమైన రాబడి రేటు ఉండదు. ఎందుకంటే.. ఇవి పూర్తిగా మార్కెట్‌పైనా, ఫండ్ పనితీరుపైనా ఆధారపడి ఉంటాయి. మనీ మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు .. సదరు ఫండ్ ఎన్‌ఏవీలపై ప్రభావం చూపుతాయి. దీంతో రాబడులు మారిపోతుంటాయి. కనుక చెప్పొచ్చేదేమిటంటే.. మార్కెట్లు ఎలా ఉన్నా కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై ముందుగా అనుకున్న రాబడి మాత్రం కచ్చితంగా చేతికొస్తుందన్న గ్యారంటీ ఉంటుంది. లిక్విడిటీ.. ఫిక్స్డ్ డిపాజిట్లకు కాస్త దీర్ఘకాలిక లాకిన్ వ్యవధి ఉన్నప్పటికీ... అవసరమైతే స్వల్ప పెనాల్టీతో (సుమారు 1 శాతం) ముందస్తు విత్‌డ్రాయల్స్‌కు చాలా మటుకు బ్యాంకులు అనుమతిస్తాయి. ఇలాంటప్పుడు ఎన్నాళ్ల పాటు డబ్బును ఇన్వెస్ట్ చేశారన్న దానిపై వడ్డీ రేటును లెక్క గట్టి ఇస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ స్వల్ప వ్యవధిలో ఎన్ని యూనిట్లయినా రిడీమ్ చేసుకోవచ్చు. ఆ రోజున సదరు ఫండ్ ఎన్ఏవీని బట్టి ప్రిమెచ్యూర్ విత్‌డ్రాయల్‌పై రాబడి ఆధారపడి ఉంటుంది. అయితే, ఫండ్స్‌లో ఏడాది వ్యవధికన్నా ముందుగానే విత్‌డ్రా చేసుకుంటే 1 శాతం మేర ఎగ్జిట్ లోడు పడుతుంది. రిస్కు తక్కువ.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై రాబడనేది.. మార్కెట్ హెచ్చుతగ్గుల మీద ఆధారపడి ఉంటుంది. ఒకోసారి పెట్టిన దానికన్నా కూడా తక్కువ మొత్తం చేతికొచ్చే అవకాశాలూ ఉంటాయి. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో అలాంటి రిస్కులు ఉండవు. ఇన్వెస్ట్ చేసిన వారు ఉద్యోగి అయినా... రిటైరయిన వ్యక్తయినా సరే.. స్థిరంగా, రెగ్యులర్‌గా ఆదాయం అందిస్తాయి. ఇన్వెస్ట్ చేసినందుకు ఖర్చులూ ఉండవు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తే.. దానికి సంబంధించి అదనపు ఖర్చులేమీ ఉండవు. అదే ఫండ్ విషయానికొస్తే రాబడులు ఎలా ఉన్నా సరే.. మ్యూచువల్ ఫండ్ నిర్వహణ వ్యయాల కింద కనీస చార్జీలను ఇన్వెస్టరే భరించాల్సి ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. మీకు రాబడి వచ్చినా రాకున్నా.. లేదా అసలు మొత్తానికే ఎసరు వచ్చినా.. మీరు మాత్రం ఫండ్ నిర్వహణ ఫీజులను భరించాల్సిందే. కాని బ్యాంకు డిపాజిట్లలో ఎటువంటి ఫీజులు ఉండవు. ఫండ్స్‌తో పోలిస్తే ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో ఇన్వెస్టరుకు అదనపు వ్యయాలంటూ ఉండవు. ఎఫ్డీ అనేది కచ్చితమైన రాబడులు అందించాల్సిందే. ఏదైతేనేం.. సగటు ఇన్వెస్టరు కష్టార్జితంపై రాబడులు అందించే సురక్షిత సాధనం ఫిక్స్డ్ డిపాజిట్. స్వల్పకాలికమైనా.. దీర్ఘకాలికమైనా ఇందులో పెట్టుబడికి భద్రత ఉంటుంది. అలాగే, ఇన్వెస్టరు, వారి కుటుంబానికి ఆర్థికపర మైన భరోసా కూడా లభిస్తుంది.