సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువులంటే గతంలో డిగ్రీ, పీజీ మాత్రమే. ఇక విదేశీ విద్య అంటే అది అందని ద్రాక్షగా ఉండేది. కేవలం సంపన్నులకు మాత్రమే విదేశాలకు వెళ్లి చదివే స్థోమత ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రతిభ ఉంటే చాలు సామాన్యులు కూడా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ఆ విధంగా అవకాశాలు ఇంటి ముంగిట్లోకి వచ్చేశాయి. ఐటీ రంగం బాగా వ్యాప్తి చెందడంతో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తదితర దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి.
ఇది కూడా విదేశీ చదువులపై విద్యార్థులు మక్కువ చూపేందుకు కారణమైంది. చదువుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి విదేశీ వర్సిటీల్లో సీటు పొందిన వారికి తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకం కింద ఆర్థిక చేయూతను అందిస్తున్నది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నదని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో అర్హత గల సుమారు 50 వేల మంది విద్యార్థులకు ఈ పథకం విశేషంగా దోహదపడునున్నది.
చదవండి: ప్రేమ పేరుతో మోసం.. శారీరకంగా లొంగదీసుకొని.. చివరకు
దరఖాస్తు కోసం ఏం చేయాలి
విదేశీ విద్యకోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం విదేశీ విద్యానిధి వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇతర సామాజిక వర్గాల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఇంకో అవకాశం
కల్పించనున్నారు.
ఇవీ అర్హతలు
► విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి.
► వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి.
► తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి.
► డిగ్రీ, ఇంజనీరింగ్‌లలో 60 శాతం మార్కులు తప్పనిసరి.
అర్హత సాధిస్తే రూ.20 లక్షలు మంజూరు
విదేశీ విద్యానిధి పథకం కింద ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేస్తుంది. వీసా వచ్చిన తర్వాత రూ.10 లక్షలు అక్కడి ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షలు చెల్లిస్తుంది. విద్యార్థులు ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి వడ్డీ కింద అదనంగా రూ.10 లక్షల విద్యారుణం తీసుకోవచ్చు. విమాన టిక్కెట్‌కు డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తుంది.
జత చేయాల్సిన పత్రాలు
► పదో తరగతి ఇంటర్, డిగ్రీ, బీటెక్ ధ్రువీకరణ పత్రాలు
►ఆదాయ, నివాస, కుల ధవీకరణ పత్రాలు
► పాస్‌పోర్ట్, వీసా
►యూనివర్సిటీ అనుమతి పొందిన ఎఫ్–1 కాపీ
► జీఆర్‌ఈ, జీమాట్, టోఫెల్, ఐఎఫ్‌ఎల్‌టీఎస్ వివరాలు
►బ్యాంకు ఖాతా సమాచారం
వెలువడిన ప్రకటన
విద్యానిధి పథకానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఎస్సీ, ఎస్టీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు గాను ఇప్పటికే అన్ని కళాశాలల విద్యార్థులకు ఆయా శాఖల కమిషనర్లు అవగాహన కల్పించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం పథకం వివరాలను
అందజేశారు.
దేశాలు.. కోర్సులు
అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, సింగపూర్, జర్మని, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఈ పథకం కింద చదువుకునేందుకు అవకాశం కల్పించారు. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరేందుకు ఈ పథకం వర్తిస్తుంది.
ఎంపిక ఇలా..
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కమిటీ ఎంపిక చేస్తుంది. కమిటీ చైర్మన్‌గా ఎస్సీ, ఎస్టీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. ఉన్నత విద్యాశాఖ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జేఎన్‌టీయూ వైస్ చాన్స్‌లర్, ఎస్సీ కమిషనర్, టెక్నికల్ ఎడ్యుకేషనల్ కమిషనర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, విదేశీ విద్యలో ఒక అనుభవజ్ఞుడు ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment