పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కేతావత్ సోంలాల్‌కు రూ. 25 లక్షల చెక్కును చిరంజీవి, వెంకయ్య నాయుడుతో కలసి అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చి, ఉత్తేజం రగిల్చిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర గేయంగా గుర్తించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనితోపాటు తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం భావితరాలకు గుర్తుండేలా కీలక మార్పులు చేపట్టాలని తీర్మానించింది. తెలంగాణ ఆత్మ కనిపించేలా రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తామని ప్రకటించింది.
ఈ మేరకు ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 25కుపైగా అంశాలపై చర్చించారు. వాహనాల రిజి్రస్టేషన్ నంబర్లలో రాష్ట్ర కోడ్‌గా ‘టీఎస్’కు బదులు ‘టీజీ’ని ఉపయోగించాలని నిర్ణయించారు.
ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు.. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండింటిని ఈ సమయంలోనే ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మీడియాకు వివరించారు.
ఇందిరమ్మ రాజ్య ఫలాలు అందిస్తాం
కాంగ్రెస్ పార్టీకి అధికారమిచ్చిన రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ రాజ్య ఫలాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. తొలిరోజున గవర్నర్ ప్రసంగిస్తారని, తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని తెలిపారు. మూడో రోజు బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు కొనసాగించేదీ బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
‘‘తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది. అలాంటి పోరాటాన్ని కాదని రాచరిక పోకడలతో రూపొందించిన రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనిపించేలా చిహ్నాన్ని రూపొందిస్తాం. తెలంగాణ తల్లి రూపాన్ని కూడా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు కనిపించేలా మారుస్తాం. తెలంగాణ గేయంగా అందెశ్రీ రాసిన జయజయõహే తెలంగాణ పాట గుర్తించాలని మంత్రిమండలి నిర్ణయించింది..’’ అని పొంగులేటి తెలిపారు.
త్వరలోనే కులగణన
రాష్ట్రంలో బీసీలకు సంక్షేమ ఫలాలు పక్కాగా దక్కేలా కులగణన చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను అధికార యంత్రాంగం రూపొందిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో తెలంగాణ గెజిట్‌లో భాగంగా.. వాహనాల నంబర్ ప్లేట్లపై ‘టీజీ’ని నిర్దేశించిందని.. కానీ గత ప్రభుత్వం వారి పార్టీ ఆనవాళ్లు కనిపించేలా ‘టీఎస్’ను ఖరారు చేసిందని పేర్కొన్నారు.
కేంద్ర గెజిట్ ప్రకారం టీఎస్‌కు బదులు టీజీగా మార్చాలని నిర్ణయించినట్టు వివరించారు. వీఆర్‌ఓల అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనప్పటికీ.. త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లోనే మరో రెండు గ్యారంటీ హామీలను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.
త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ..
రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హైకోర్టు నిర్మాణం కోసం వంద ఎకరాల భూమి కేటాయింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు. త్వరలో వ్యవసాయాధికారి పోస్టుల భర్తీ చేపడతామన్నారు. గ్రూప్–1, ఇతర కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీలను గుర్తించి, భర్తీ చేసే దిశగా కసరత్తు ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం అతి త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు.
చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై నివేదిక ఇవ్వండి
రాష్ట్రంలో మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ అంశంపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీకి సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఆదివారం సచివాలయంలో సబ్ కమిటీతో ఈ అంశంపై సమీక్షించారు. బోధన్, ముత్యంపేటలలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన పాత బకాయిలు, వాటి ఆర్థిక ఇబ్బందులు, ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని, తగిన సూచనలను అందించాలని కమిటీని కోరారు. త్వరగా నివేదిక సిద్ధం చేస్తే.. మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుందామని సూచించారు. ఈ కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, రోహిత్‌రావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment