state anthem
-
కళ.. విశ్వజనీనం!
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర గీతంపై ఒక తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ గీతానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు అనగానే చాలామందికి ఇది ఆత్మ గౌరవంతో ముడిపడిన వ్యవహారంగా కనబడింది. తెలంగాణ గీతానికి తెలంగాణేతర సంగీత దర్శకులు వుండ కూడదా? ఉంటే వచ్చే నష్టం ఏమిటి?తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న తరుణంలో ఎక్కడ చూసినా ‘జయ జయహే తెలంగాణ’ అన్న గీతాన్నే నాలుగున్నర కోట్ల గొంతుకలు ఒక్కటై నినదించాయి. పది జిల్లాల గొప్పతనం గురించి అత్యద్భుతంగా అల్లిన అక్షర మాలను అందెశ్రీ ఎంతో ప్రేమతో, తెలంగాణపై భక్తితో జాతికి అంకితం చేశారు. ఇంత వరకు బాగానే వుంది. కాని, తెలంగాణ సిద్ధించిన తర్వాత మాత్రం ఆ గేయానికి ప్రభుత్వం మాత్రం ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదన్నది అందరికీ తెలిసిన విషయమే.మరి అప్పటి ప్రభుత్వానికి ఆత్మ గౌరవం అంటే తెలియలేదమో. లేక అందెశ్రీ అక్షరాలపై వివక్ష వున్నదో తెలియదు కాని, దాన్ని రాష్ట్ర గీతంగా పెట్టటానికి మనసు రాలేదు. ఇన్నాళ్ళకు మొత్తానికి ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించింది. కాని, ఇప్పుడే అసలైన సమస్య మొదలైంది. తెలంగాణ జాతికి అంకితం చేసే గీతానికి మరింత వన్నె తెచ్చి యావత్ తెలంగాణకు ఒక గొప్ప రాష్ట్ర గీతం అందివ్వాలని ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణికి దానికి సంగీతం అందించే బాధ్యతను అప్పగించింది ప్రభుత్వం. వెంటనే మేధావులు, నాయకులు, కళాకారులు అందరూ ఒక్కసారిగా ఆంధ్ర వాళ్ల చేతిలో ఆత్మ గౌరవం ఎలా పెడతారు అని అడుగుతున్నారు.పాటకి అక్షరమే ప్రాణం. సంగీతం కేవలం పాటకి హంగు మాత్రమే. తెలంగాణేతరులు సంగీతం అందిస్తే తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతింటుందా? కళకు ప్రాంత, లింగ, వర్ణ విభేదాలు ఉండవు. అది విశ్వజనీనం. మరి ఈ విషయం అర్థమయ్యేలా ఈ విమర్శకులకు ఎలా చెప్పాలి? – రామ్ ఠాకూర్, విశ్లేషకులు, రచయిత -
13.30 నిమిషాలు.. 12 చరణాలు
సాక్షి, హైదరాబాద్: ‘జయ జయహే తెలంగాణ.’ గేయాన్ని అధికారిక కార్యక్రమాల్లో ఆలపించడానికి వీలుగా..రెండున్నర నిమిషాల నిడివితో రూపొందించగా, మొత్తం 12 చరణాలతో 13.30 నిమిషాల రాష్ట్ర గేయాన్ని సిద్ధం చేశారు. రచయిత అందెశ్రీ రాసిన గేయాన్ని యథాతథంగా ఆమోదించారు. రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిన నేపథ్యంలో తొలి చరణంలోని ‘పది జిల్ల్లల’.. అనే పదాన్ని తొలగించి ‘పదపదాన’ అనే కొత్త పదాన్ని చేర్చారు. ‘ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి’.. అనే పంక్తితో పాత గేయంలోని చివరి చరణం ముగుస్తుండగా, దాని స్థానంలో ‘ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి’ అనే పంక్తిని కొత్తగా చేర్చారు. మూడు చరణాలకు కుదించిన షార్ట్ వెర్షన్లో ఇవి మినహా ఇతర మార్పులు పెద్దగా లేవు. కానీ 12 చరణాల గేయంలో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. ‘గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు’ అనే పంక్తిలో ‘నవాబుల’ అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘భాగ్యనగరి’ అనే కొత్త పదాన్ని చేర్చారు. తెలంగాణ ప్రాంత ప్రాచీన పద్య సాహిత్యంతో పాటు పంపన, బద్దెన, భీమకవి, హాలుడు, పాల్కురికి సోమనాథుడు, కాళిదాసు, మల్లినాథసూరి వంటి ఆది కవుల ప్రాశస్త్యాన్ని కొత్త తరాలకు తెలియజేసేలా వారిని కీర్తిస్తూ అందెశ్రీ నాలుగు కొత్త చరణాలను రాశారు. బౌద్ధ తార్కికత సంప్రదాయానికి పునాదులు వేసిన దిజ్ఞాగుడు, 600 ఏళ్ల కింద రాచకొండను ఏలిన సింగ భూపాలుడు, సాహస గాథల సమ్మక్క, సారక్కలు, సర్వాయి పాపన్నలు, మీరసాబు, పండు గొల్ల సాయన్నల వీరగాథలను గుర్తు చేసేలా కొత్త చరణాలు సాగుతాయి. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మిత్రపక్ష పార్టీల నేతలకు అందించిన రాష్ట్ర గేయం వెర్షన్లు ఈ కింది విధంగా ఉన్నాయి. 2.30 నిమిషాల నిడివి గేయం 1) జయ జయహే తెలంగాణ జననీ జయకేతనంముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనంతరతరాల చరిత గల తల్లీ నీరాజనంపదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణంజై తెలంగాణ జైజై తెలంగాణజై తెలంగాణ జైజై తెలంగాణ2) జానపద జనజీవన జావళీలు జాలువారకవిగాయక వైతాళిక కళలా మంజీరాలుజాతిని జాగృతపరచే గీతాల జనజాతరఅనునిత్యము నాగానం అమ్మనీవే మా ప్రాణంజై తెలంగాణ జైజై తెలంగాణజై తెలంగాణ జైజై తెలంగాణ3) గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగాపచ్చని మా నేలల్లో పసిడిసిరులు పండంగాసుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలిప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలిజై తెలంగాణ జైజై తెలంగాణ జై తెలంగాణ జైజై తెలంగాణ13.30 నిమిషాల పూర్తి స్థాయి గేయం1) జయజయహే తెలంగాణ జననీ జయకేతనంముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనంతరతరాల చరితగల తల్లీ నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జైజై తెలంగాణ జై తెలంగాణ జైజై తెలంగాణ2) పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చిభీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లిహాలుని గాథాసప్తశతికి ఆయువులూదిన నేల బృహత్కథల తెలంగాణ కోటి లింగాల కోనజై తెలంగాణ జైజై తెలంగాణజై తెలంగాణ జైజై తెలంగాణ 3) ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన తెలుగులో తొలి ప్రజాకవి ‘పాలకుర్కీ’ సోమన్నరాజ్యాన్ని ధిక్కరించి రాములోరి గుడిని గట్టికవిరాజై వెలిగె దిశల ‘కంచర్ల గోపన్న’జై తెలంగాణ జైజై తెలంగాణజై తెలంగాణ జైజై తెలంగాణ 4) కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి‘మల్లినాథసూరి’ మా మెతుకు సీమ కన్నబిడ్డధూళికట్ట నేలినట్టి భౌద్ధానికి బంధువతడుధిజ్ఞాగుని గన్న నేల ధిక్కారమే జన్మహక్కుజై తెలంగాణ జైజై తెలంగాణజై తెలంగాణ జైజై తెలంగాణ 5) ‘పోతన’దీ పురిటిగడ్డ.. ‘రుద్రమ’దీ వీరగడ్డగండరగండడు ‘కొమురం భీముడే’ నీ బిడ్డకాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్పగోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగు చార్మినారుజై తెలంగాణ జైజై తెలంగాణజై తెలంగాణ జైజై తెలంగాణ 6) రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచర్ల‘సర్వజ్ఞ సింగ భూపాలుని’ బంగరుభూమివాణీ నా రాణి అంటూ నినదించిన కవి కులరవి‘పిల్లలమర్రి పినవీరభద్రుడు’ మాలో రుద్రుడుజై తెలంగాణ జైజై తెలంగాణ జై తెలంగాణ జైజై తెలంగాణ 7) ‘సమ్మక్క’లు ‘సారక్క’లు సర్వాయి పాపన్నలుసబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతుఊరూర పాటలైన ‘మీరసాబు’ వీరగాథదండు నిడిపే పాలమూరు ‘పండు గొల్ల సాయన్న’జై తెలంగాణ జైజై తెలంగాణజై తెలంగాణ జైజై తెలంగాణ 8) కవిగాయక వైతాళిక కళల మంజీరాలుడప్పు, ఢమరుకము, డక్కి, శారద స్వరనాదాలుపల్లవుల చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగఅనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణంజై తెలంగాణ జైజై తెలంగాణజై తెలంగాణ జైజై తెలంగాణ 9) జానపద జనజీవన జావళీలు జాలువారజాతిని జాగృతపరిచే గీతాల జనజాతర వేలకొలదిగా వీరులు నేల ఒరిగి పోతెనేమి తరుగనిదీ నీ త్యాగం మరువనదీ శ్రమ యాగం జై తెలంగాణ జైజై తెలంగాణజై తెలంగాణ జైజై తెలంగాణ10) బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలివిరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలితడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుకఒక జాతిగ నీ సంతతి ఓయమ్మ వెలగాలిజై తెలంగాణ జైజై తెలంగాణ జై తెలంగాణ జైజై తెలంగాణ 11) సిరివెలుగులు జిమ్మే సింగరేణి బంగారంఅణువణువున ఖనిజాలే నీ తనువున సింగారంసహజమైన వనసంపద సక్కనైన పువ్వుల పొద సిరులు పండె సారమున్న మాగాణమె కదా నీ యెద జై తెలంగాణ జైజై తెలంగాణజై తెలంగాణ జైజై తెలంగాణ12) గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగాపచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగాసుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలి ప్రతి దినమది తెలంగాణ ప్రజల కలలు పండాలిజై తెలంగాణ జైజై తెలంగాణ జై తెలంగాణ జైజై తెలంగాణ -
తెలంగాణ రాష్ట్ర గేయం రెండు వెర్షన్లు
సాక్షి, హైదరాబాద్: ‘జయ జయహే తెలంగాణ’ గేయం రెండు వెర్షన్లను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దం పూర్తి అవుతున్న సందర్భంగా జూన్ 2న ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లోనే ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలూగించి తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్నిఅందరి ఆమోదంతో, భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు వెల్లడించారు. తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ 20 ఏళ్ల క్రితం రాసిన ఈ గీతాన్ని యథాతథంగా అమోదించామన్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతంతో పాటు స్వరాలు కూర్చినట్లు తెలిపారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గురువారం సాయంత్రం సచివాలయంలో అధికార, మిత్రపక్ష పార్టీల నేతలతో సమావేశమైన సీఎం.. తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల నిర్వహణపై చర్చించారు. ఈ సమావేశంలో అందెశ్రీ, కీరవాణితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డి, టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు పార్లమెంటులో ఉన్న మాజీ ఎంపీలు, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 2.30 నిమిషాల్లో మూడు చరణాలు జయ జయహే తెలంగాణ గీతాన్ని 2.30 నిమిషాల నిడివితో ఒక వెర్షన్‌గా, 13.30 నిమిషాల పూర్తి నిడివితో మరో వెర్షన్‌గా రూపొందించారు. రెండున్నర నిమిషాల వెర్షన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా మూడు చరణాలతో ఉంటుందని సీఎం ప్రకటించారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. కేబినేట్లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించటం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రతిష్ట ఇనుమడించేలా కార్యాచరణ ‘రాష్ట్ర అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలనే నిర్ణయం కూడా జరిగింది. కొత్త అధికారిక చిహ్నానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు అందాయి. ఇవన్నీ ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. తుది రూపమేదీ ఖరారు కాలేదు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయం జరగలేదు. కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహాలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్టను ఇనుమడించేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా మా కార్యాచరణ ఉంటుంది..’ అని రేవంత్ చెప్పారు. ఈ సందర్భంగా కీరవాణి సంగీత సారథ్యంలోని యువ గాయనీ గాయకుల బృందం ఆలపించిన రాష్ట్ర గేయం అందరినీ అలరించింది. ఇలావుండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం ధనవంతుల విగ్రహంలా ఉందంటూ.. తెలంగాణ కష్టజీవుల బతుకు పోరాటం ఉట్టిపడేలా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా సీఎం చెప్పినట్లు తెలిసింది. టీఎస్‌కు బదులు టీజీ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం టీఎస్‌ను టీజీగా మార్చినట్లు ఈ సమావేశంలో సీఎం తెలిపారు. ‘వాహనాల రిజి్రస్టేషన్ నంబర్లకు సంబంధించి, అలాగే అన్ని ప్రభుత్వ సంస్థల విషయంలో కూడా టీఎస్‌ను టీజీగా మార్పు చేశాం..’ అని చెప్పారు. -
రాష్ట్ర గేయం.. 2.30 నిమిషాలు!
సాక్షి, హైదరాబాద్: రెండున్నర నిమిషాల నిడివికి కుదించిన ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర అధికారిక గేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ‘జయజయహే తెలంగాణ’ గేయం ఒరిజినల్ వెర్షన్‌లోని ఒకట్రెండు పదాలను తొలగించి.. స్వల్ప మార్పులు, చేర్పులు చేసి పదమూడున్నర నిమిషాల పూర్తి నిడివితో మరో వెర్షన్‌ను ఖరారు చేసింది. గేయ రచయిత అందెశ్రీ మార్గదర్శకత్వంలో, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా.. ప్రముఖ గాయ నీ గాయకులతో రికార్డు చేసిన రెండు వెర్షన్ల రాష్ట్ర గేయాన్ని సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో గాయనీగాయ కులు ఈ రెండు వెర్షన్ల గేయాన్ని లైవ్‌గా పాడి వినిపించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఉర్రూతలూగించిన జయజయహే తెలంగాణ గేయాన్ని సరికొత్త స్వరాలు, సంగీత బాణీలతో అద్భుతంగా తీర్చిదిద్దారని, మరోసారి ప్రజలను ఉర్రూతలూగించడం ఖాయమని ఆ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. ఇందులో మంత్రి జూపల్లి కృష్ణారావు, టీజేఎస్ అధినేత కోదండరాం, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ జేఏసీ చైర్మన్ కె.రఘు, తెలంగాణ అధికారిక చిహ్నం రూపొందిస్తున్న చిత్రకారుడు రుద్ర రాజేశం, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.అధికారిక చిహ్నంలో మార్పులపైనా..తెలంగాణ తొలిదశ ఉద్యమం, అశోక చక్రం, వ్యవ సాయం, రాజ్యాంగాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఈ భేటీలో సూచించారు. చిత్రకారుడు రుద్ర రాజేశం రూపొందించిన పలు నమూనా చిహ్నాలను పరిశీలించి వాటిలో ఒకదానిని ఎంపిక చేశారని.. అందులో కొన్ని మార్పులను సూచించారని తెలిసింది.అయితే ఇదే అధికారిక చిహ్నమంటూ.. మూడు నమూనా చిహ్నాలు బుధవారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిలో దేనిని కూడా ఎంపిక చేయలేదని సీఎంఓ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర గేయం, తెలంగాణ అధికారిక చిహ్నాన్ని జూన్ 2న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో ఆవిష్కరించనున్నారు.అమరవీరులు, ఉద్యమకారులకు అండగత బీఆర్ఎస్ సర్కారు తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులను తీవ్ర నిర్లక్ష్యం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి సమావేశంలో పేర్కొన్నారు. అమరవీ రుల కుటుంబాలు, ఉద్యమకారులకు తమ ప్రభు త్వం అండగా ఉంటుందన్నారు. వారి విషయంలో స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పా రు. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులు, అమరవీ రుల కుటుంబాలకు ఇచ్చిన హామీ అమలుకు చర్య లు చేపట్టామని వెల్లడించారు. జూన్ 2న ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే దశాబ్ది వేడుకలకు తెలంగాణ తొలి, మలి విడత ఉద్యమకారులను ఆహ్వానించాలని నిర్ణయించామని తెలిపారు.నేడు మిత్రపక్షాలతో సమావేశంతెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, రాష్ట్ర గేయం, అధికారిక చిహ్నం రూపకల్పన అంశాలపై చర్చించేందుకు గురువారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మిత్రపక్షాలు సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమా వేశం కానున్నారు. మిత్రపక్షాల నేతల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణ యాలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలను ఆహ్వానించలేదు. -
జయ జయహే తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చి, ఉత్తేజం రగిల్చిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర గేయంగా గుర్తించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనితోపాటు తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం భావితరాలకు గుర్తుండేలా కీలక మార్పులు చేపట్టాలని తీర్మానించింది. తెలంగాణ ఆత్మ కనిపించేలా రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 25కుపైగా అంశాలపై చర్చించారు. వాహనాల రిజి్రస్టేషన్ నంబర్లలో రాష్ట్ర కోడ్‌గా ‘టీఎస్’కు బదులు ‘టీజీ’ని ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు.. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండింటిని ఈ సమయంలోనే ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మీడియాకు వివరించారు. ఇందిరమ్మ రాజ్య ఫలాలు అందిస్తాం కాంగ్రెస్ పార్టీకి అధికారమిచ్చిన రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ రాజ్య ఫలాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. తొలిరోజున గవర్నర్ ప్రసంగిస్తారని, తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని తెలిపారు. మూడో రోజు బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు కొనసాగించేదీ బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది. అలాంటి పోరాటాన్ని కాదని రాచరిక పోకడలతో రూపొందించిన రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనిపించేలా చిహ్నాన్ని రూపొందిస్తాం. తెలంగాణ తల్లి రూపాన్ని కూడా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు కనిపించేలా మారుస్తాం. తెలంగాణ గేయంగా అందెశ్రీ రాసిన జయజయõహే తెలంగాణ పాట గుర్తించాలని మంత్రిమండలి నిర్ణయించింది..’’ అని పొంగులేటి తెలిపారు. త్వరలోనే కులగణన రాష్ట్రంలో బీసీలకు సంక్షేమ ఫలాలు పక్కాగా దక్కేలా కులగణన చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను అధికార యంత్రాంగం రూపొందిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో తెలంగాణ గెజిట్‌లో భాగంగా.. వాహనాల నంబర్ ప్లేట్లపై ‘టీజీ’ని నిర్దేశించిందని.. కానీ గత ప్రభుత్వం వారి పార్టీ ఆనవాళ్లు కనిపించేలా ‘టీఎస్’ను ఖరారు చేసిందని పేర్కొన్నారు. కేంద్ర గెజిట్ ప్రకారం టీఎస్‌కు బదులు టీజీగా మార్చాలని నిర్ణయించినట్టు వివరించారు. వీఆర్ఓల అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనప్పటికీ.. త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లోనే మరో రెండు గ్యారంటీ హామీలను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ.. రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హైకోర్టు నిర్మాణం కోసం వంద ఎకరాల భూమి కేటాయింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు. త్వరలో వ్యవసాయాధికారి పోస్టుల భర్తీ చేపడతామన్నారు. గ్రూప్–1, ఇతర కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీలను గుర్తించి, భర్తీ చేసే దిశగా కసరత్తు ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం అతి త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై నివేదిక ఇవ్వండి రాష్ట్రంలో మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ అంశంపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీకి సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఆదివారం సచివాలయంలో సబ్ కమిటీతో ఈ అంశంపై సమీక్షించారు. బోధన్, ముత్యంపేటలలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన పాత బకాయిలు, వాటి ఆర్థిక ఇబ్బందులు, ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని, తగిన సూచనలను అందించాలని కమిటీని కోరారు. త్వరగా నివేదిక సిద్ధం చేస్తే.. మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుందామని సూచించారు. ఈ కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, రోహిత్‌రావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
కూలీ కలం నుంచి జాలువారిన గీతం
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.. ఇప్పుడిది తెలంగాణ రాష్ట్రగీతం. ప్రాథమిక విద్య కూడా చదవకుండానే కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన అందె ఎల్లయ్య ఈ పాటను రాశారు. ప్రజాకవిగా, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన అందెశ్రీ.. వరంగల్ జిల్లా జనగామ సమీపంలోని రేబర్తి గ్రామంలో జన్మించారు. గొర్రెల కాపరిగా, కూలీగా కూడా పని చేశారు. ఆర్. నారాయణమూర్తి తీసే విప్లవ చిత్రాల్లో చాలావరకు పాటలు ఈయన రాసినవే. తెలంగాణ ప్రాంతాన్ని అద్భుతంగా వర్ణిస్తూ.. సాధారణమైన చిన్నచిన్న పదాలతో ఈయన అల్లే పాటలు ఈ ప్రాంతంలో బహుళ జనాదరణ పొందాయి. ఎర్ర సముద్రం సినిమా కోసం ఆయన రాసిన 'మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు' పాటను కొన్ని విశ్వవిద్యాలయాలు తమ తెలుగు పాఠ్యభాగాల్లో కూడా చేర్చాయి. ప్రకృతి ప్రేమికుడైన ఈయన రాసిన 'జయజయహే తెలంగాణ' పాటను.. ఇన్నాళ్లుగా ఉన్న 'మా తెలుగు తల్లికి' స్థానంలో రాష్ట్ర గీతంగా స్వీకరించారు. నదులంటే అందెశ్రీకి చెప్పలేనంత ఇష్టం. అది ఎంతగానంటే కృష్ణా గోదావరి నదులతో పాటు ఏకంగా నైలు నది, విక్టోరియా ఫాల్స్ లాంటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న నదుల వరకు అన్నింటి విషయాలూ ఆయనకు కరతలామలకం.