తెలంగాణ రాష్ట్ర గేయం రెండు వెర్షన్లు | Telangana state anthem has two versions | Sakshi
Sakshi News home page

తెలంగాణ రాష్ట్ర గేయం రెండు వెర్షన్లు

Published Fri, May 31 2024 4:26 AM | Last Updated on Fri, May 31 2024 5:13 PM

Telangana state anthem has two versions

‘జయ జయహే తెలంగాణ’ను ఆమోదించినట్టు ముఖ్యమంత్రి ప్రకటన 

2.30 నిమిషాలు ఒకటి, 13.30 నిమిషాలు మరొకటి 

భవిష్యత్తరాలు పాడుకునేందుకు వీలుగా ఆమోదం 

జూన్‌ 2న దశాబ్ది ముగింపు వేడుకల్లో జాతికి అంకితం  

అధికార చిహ్నానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా మార్పులు.. అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయం 

అధికార, మిత్రపక్ష పార్టీల నేతలతో సీఎం సమావేశం  

సాక్షి, హైదరాబాద్‌: ‘జయ జయహే తెలంగాణ’ గేయం రెండు వెర్షన్లను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దం పూర్తి అవుతున్న సందర్భంగా జూన్‌ 2న ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లోనే ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలూగించి తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్నిఅందరి ఆమోదంతో, భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు వెల్లడించారు. 



తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ 20 ఏళ్ల క్రితం రాసిన ఈ గీతాన్ని యథాతథంగా అమోదించామన్నారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతంతో పాటు స్వరాలు కూర్చినట్లు తెలిపారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గురువారం సాయంత్రం సచివాలయంలో అధికార, మిత్రపక్ష పార్టీల నేతలతో సమావేశమైన సీఎం.. తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల నిర్వహణపై చర్చించారు. 

ఈ సమావేశంలో అందెశ్రీ, కీరవాణితో పాటు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి,  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డి, టీజేఎస్‌ అధినేత ప్రొఫెసర్‌ కోదండరాం, సీపీఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు పార్లమెంటులో ఉన్న మాజీ ఎంపీలు, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.  



2.30 నిమిషాల్లో మూడు చరణాలు 
జయ జయహే తెలంగాణ గీతాన్ని 2.30 నిమిషాల నిడివితో ఒక వెర్షన్‌గా, 13.30 నిమిషాల పూర్తి నిడివితో మరో వెర్షన్‌గా రూపొందించారు. రెండున్నర నిమిషాల వెర్షన్‌ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా మూడు చరణాలతో ఉంటుందని సీఎం ప్రకటించారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. కేబినేట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించటం జరిగిందని తెలిపారు.  

రాష్ట్ర గీతంగా "జయ జయహేతెలంగాణ" ఆమోదం

తెలంగాణ ప్రతిష్ట ఇనుమడించేలా కార్యాచరణ 
‘రాష్ట్ర అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలనే నిర్ణయం కూడా జరిగింది. కొత్త అధికారిక చిహ్నానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు అందాయి. ఇవన్నీ ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. తుది రూపమేదీ ఖరారు కాలేదు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయం జరగలేదు. కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహాలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. 

అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్టను ఇనుమడించేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా మా కార్యాచరణ ఉంటుంది..’ అని రేవంత్‌ చెప్పారు.  ఈ సందర్భంగా కీరవాణి సంగీత సారథ్యంలోని యువ గాయనీ గాయకుల బృందం ఆలపించిన రాష్ట్ర గేయం అందరినీ అలరించింది. ఇలావుండగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం ధనవంతుల విగ్రహంలా ఉందంటూ.. తెలంగాణ కష్టజీవుల బతుకు పోరాటం ఉట్టిపడేలా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా సీఎం చెప్పినట్లు తెలిసింది. 



టీఎస్‌కు బదులు టీజీ 
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం టీఎస్‌ను టీజీగా మార్చినట్లు ఈ సమావేశంలో సీఎం తెలిపారు. ‘వాహనాల రిజి్రస్టేషన్‌ నంబర్లకు సంబంధించి, అలాగే అన్ని ప్రభుత్వ సంస్థల విషయంలో కూడా టీఎస్‌ను టీజీగా మార్పు చేశాం..’ అని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement