
కులగణన అమలుపై అధ్యయనానికి ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
రెండో విడత సర్వే పూర్తయిన వెంటనే విధివిధానాలు ఖరారు
కులగణనపై మార్చి తొలి వారంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రం పరిశీలనకు.. విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో దీని అమలు, నిధుల కేటాయింపుపై కసరత్తు
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చల్లో కీలక నిర్ణయాలు
కులగణన, ఎస్సీ వర్గీకరణ అమల్లో రాష్ట్రం దేశానికి దిక్సూచిగా ఉండాలన్న రాహుల్
ఎమ్మెల్యేల అసంతృప్తితో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దని సూచన
ఎస్సీ వర్గీకరణపై చట్టం చేశాక బహిరంగ సభ ఏర్పాటుకు నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రెండో విడత కులగణన పూర్తయిన వెంటనే, దానిని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసే దిశగా అధ్యయనం చేయాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాందీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జరిపిన భేటీలో నిర్ణయించారు. ఇందుకోసం కమిషన్ లేదా ఉన్నతస్ధాయి కమిటీ ఏర్పాటు చేయాలని.. అది ఇచ్చే నివేదిక మేరకు చట్టం తేవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
విద్య, వైద్య, ఉపాధి రంగాలతోపాటు వివిధ పదవుల నియామకాలు, నిధులు, కేటాయింపులు సహా విధానపరమైన నిర్ణయాలన్నీ కులగణన ఆధారంగా ఉండేలా భవిష్యత్ ప్రణాళికలు రూపొందించాలని అభిప్రాయానికి వచ్చారని సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎస్సీ వర్గీకరణ, కులగణన అంశాలపై చర్చించేందుకు శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. శనివారం మధ్యాహ్నం రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చర్చించారు.
దేశానికి రాష్ట్రమే రోడ్‌మ్యాప్ కావాలి
రాష్ట్రంలో కులగణన నిర్వహించిన తీరు, అసెంబ్లీ ఆమోదం, చట్టబద్ధత కల్పించే దిశగా ప్రణాళికలు, బహిరంగ సభ తదితర అంశాలను రాహుల్‌కు రేవంత్ వివరించారు. కచ్చితత్వంతో, పూర్తి పారదర్శకంగా కులగణన నిర్వహించామని, బీసీల జనాభా గతం కన్నా 6% మేర పెరిగిందని తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తామని.. త్వరగా ఆమోదించేలా బీజేపీపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
దీని పై రాహుల్‌గాంధీ స్పందిస్తూ.. తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశానికే దిక్సూచిలా ఉండాలని, సామాజిక న్యాయంలో రాష్ట్రం దేశానికే మార్గదర్శి కావాలని సూచించారని తెలిసింది. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారని సమాచారం. పార్టీ,ప్రభుత్వ పదవులతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సామాజిక న్యాయ అంశానికి ప్రాధాన్యతనిచ్చి బలహీన వర్గాలకు రాజకీయ న్యాయం చేయాలని రాహుల్ సూచించారని తెలిసింది.
ఎస్సీ వర్గీకరణపై చట్టం..
ఎస్సీ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో బిల్లుపెట్టి, చట్టం చేస్తామని, ఆ తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని రాహుల్ గాం«దీతో రేవంత్ పేర్కొన్నారని తెలిసింది. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను యథాతథంగా అమలు చేస్తామని వివరించారని సమాచారం. ఇక కులగణన డిమాండ్‌తో దేశవ్యాప్త ఉద్యమం చేయాలని, ఇందుకోసం ఇండియా కూటమి పక్షాలను కలుపుకొని పోవాలని ఈ భేటీలో నిర్ణయించారని తెలిసింది. ఇండియా కూటమి ఎంపీల ఆధ్వర్యంలో పార్లమెంటులో ఆందోళన చేపట్టాలని తీర్మానించారని సమాచారం. ఇండియా కూటమి ఆధ్వర్యంలో సభ నిర్వహించే అంశంలో కూటమి పార్టీల ముఖ్యమంత్రులతో సమన్వయం చేసే బాధ్యతలను రేవంత్‌కు రాహుల్ గాంధీ అప్పగించారని తెలిసింది.
ప్రతిపక్షాలు కాచుకుని ఉన్నాయి..
ఇటీవలి ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీ, సీఎల్పీ సమావేశంలో వెలువడిన అభిప్రాయాలు, ప్రతిపక్షాల విమర్శలు వంటి అంశాలపైనా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు దూకుడుగా ఉన్నాయని, చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తాయని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపే అవకాశాలున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని రాహుల్ సూచించారని సమాచారం. ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు మాట్లాడాలని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. అందరితో సమన్వయం మొదలు ప్రభుత్వ పథకాల అమలు, కీలక నియామకాల వరకు అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటానని రేవంత్ పేర్కొన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment