కుదించిన జయజయహే గేయాన్ని ఖరారు చేసిన సర్కారు
అమరవీరులు, ఉద్యమకారులకు అండగా ఉంటామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రెండున్నర నిమిషాల నిడివికి కుదించిన ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర అధికారిక గేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ‘జయజయహే తెలంగాణ’ గేయం ఒరిజినల్ వెర్షన్‌లోని ఒకట్రెండు పదాలను తొలగించి.. స్వల్ప మార్పులు, చేర్పులు చేసి పదమూడున్నర నిమిషాల పూర్తి నిడివితో మరో వెర్షన్‌ను ఖరారు చేసింది. గేయ రచయిత అందెశ్రీ మార్గదర్శకత్వంలో, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా.. ప్రముఖ గాయ నీ గాయకులతో రికార్డు చేసిన రెండు వెర్షన్ల రాష్ట్ర గేయాన్ని సిద్ధం చేసింది.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో గాయనీగాయ కులు ఈ రెండు వెర్షన్ల గేయాన్ని లైవ్‌గా పాడి వినిపించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఉర్రూతలూగించిన జయజయహే తెలంగాణ గేయాన్ని సరికొత్త స్వరాలు, సంగీత బాణీలతో అద్భుతంగా తీర్చిదిద్దారని, మరోసారి ప్రజలను ఉర్రూతలూగించడం ఖాయమని ఆ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. ఇందులో మంత్రి జూపల్లి కృష్ణారావు, టీజేఎస్ అధినేత కోదండరాం, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ జేఏసీ చైర్మన్ కె.రఘు, తెలంగాణ అధికారిక చిహ్నం రూపొందిస్తున్న చిత్రకారుడు రుద్ర రాజేశం, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
అధికారిక చిహ్నంలో మార్పులపైనా..
తెలంగాణ తొలిదశ ఉద్యమం, అశోక చక్రం, వ్యవ సాయం, రాజ్యాంగాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఈ భేటీలో సూచించారు. చిత్రకారుడు రుద్ర రాజేశం రూపొందించిన పలు నమూనా చిహ్నాలను పరిశీలించి వాటిలో ఒకదానిని ఎంపిక చేశారని.. అందులో కొన్ని మార్పులను సూచించారని తెలిసింది.
అయితే ఇదే అధికారిక చిహ్నమంటూ.. మూడు నమూనా చిహ్నాలు బుధవారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిలో దేనిని కూడా ఎంపిక చేయలేదని సీఎంఓ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర గేయం, తెలంగాణ అధికారిక చిహ్నాన్ని జూన్ 2న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో ఆవిష్కరించనున్నారు.
అమరవీరులు, ఉద్యమకారులకు అండ
గత బీఆర్‌ఎస్ సర్కారు తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులను తీవ్ర నిర్లక్ష్యం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి సమావేశంలో పేర్కొన్నారు. అమరవీ రుల కుటుంబాలు, ఉద్యమకారులకు తమ ప్రభు త్వం అండగా ఉంటుందన్నారు. వారి విషయంలో స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పా రు.
ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులు, అమరవీ రుల కుటుంబాలకు ఇచ్చిన హామీ అమలుకు చర్య లు చేపట్టామని వెల్లడించారు. జూన్ 2న ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే దశాబ్ది వేడుకలకు తెలంగాణ తొలి, మలి విడత ఉద్యమకారులను ఆహ్వానించాలని నిర్ణయించామని తెలిపారు.
నేడు మిత్రపక్షాలతో సమావేశం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, రాష్ట్ర గేయం, అధికారిక చిహ్నం రూపకల్పన అంశాలపై చర్చించేందుకు గురువారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మిత్రపక్షాలు సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమా వేశం కానున్నారు. మిత్రపక్షాల నేతల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణ యాలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలను ఆహ్వానించలేదు.
Comments
Please login to add a commentAdd a comment