కూలీ కలం నుంచి జాలువారిన గీతం
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం..
ఇప్పుడిది తెలంగాణ రాష్ట్రగీతం. ప్రాథమిక విద్య కూడా చదవకుండానే కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన అందె ఎల్లయ్య ఈ పాటను రాశారు. ప్రజాకవిగా, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన అందెశ్రీ.. వరంగల్ జిల్లా జనగామ సమీపంలోని రేబర్తి గ్రామంలో జన్మించారు. గొర్రెల కాపరిగా, కూలీగా కూడా పని చేశారు. ఆర్. నారాయణమూర్తి తీసే విప్లవ చిత్రాల్లో చాలావరకు పాటలు ఈయన రాసినవే.
తెలంగాణ ప్రాంతాన్ని అద్భుతంగా వర్ణిస్తూ.. సాధారణమైన చిన్నచిన్న పదాలతో ఈయన అల్లే పాటలు ఈ ప్రాంతంలో బహుళ జనాదరణ పొందాయి. ఎర్ర సముద్రం సినిమా కోసం ఆయన రాసిన 'మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు' పాటను కొన్ని విశ్వవిద్యాలయాలు తమ తెలుగు పాఠ్యభాగాల్లో కూడా చేర్చాయి. ప్రకృతి ప్రేమికుడైన ఈయన రాసిన 'జయజయహే తెలంగాణ' పాటను.. ఇన్నాళ్లుగా ఉన్న 'మా తెలుగు తల్లికి' స్థానంలో రాష్ట్ర గీతంగా స్వీకరించారు.
నదులంటే అందెశ్రీకి చెప్పలేనంత ఇష్టం. అది ఎంతగానంటే కృష్ణా గోదావరి నదులతో పాటు ఏకంగా నైలు నది, విక్టోరియా ఫాల్స్ లాంటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న నదుల వరకు అన్నింటి విషయాలూ ఆయనకు కరతలామలకం.