రాష్ట్రీయ గీతం.. రెండు వెర్షన్లలో | CM Revant reddy meeting with writer Andeshree and music director Keeravani | Sakshi
Sakshi News home page

రాష్ట్రీయ గీతం.. రెండు వెర్షన్లలో

Published Wed, May 22 2024 6:18 AM | Last Updated on Wed, May 22 2024 6:18 AM

CM Revant reddy meeting with writer Andeshree and music director Keeravani

రచయిత అందెశ్రీ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణితో సీఎం సమావేశం 

జయ జయహే తెలంగాణ గేయంలో మార్పులుచేర్పుల బాధ్యత అందెశ్రీకే  

దశాబ్ది తెలంగాణ ఉత్సవాల్లో సోనియాగాంధీ చేతుల మీదుగా విడుదల

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్‌ 2న నిర్వహించనున్న బహిరంగసభలో తెలంగాణ రాష్ట్ర గీతమైన ‘జయ జయహే తెలంగాణ’కు సంబంధించిన రెండు వెర్షన్లను అధికారికంగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’పూర్తి స్థాయి గేయాన్ని ఓ వెర్షన్‌గా, సంక్షిప్తీకరించిన గేయాన్ని మరో వెర్షన్‌గా విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గేయ రచయిత అందెశ్రీ, సినీ సంగీత దర్శకుడు కీరవాణితో సమావేశమయ్యారు.

రాష్ట్ర గీతానికి రెండు వెర్షన్లు సిద్ధం చేసి కీరవాణితో కలిసి రికార్డు చేసే బాధ్యతలను అందెశ్రీకి ప్రభుత్వం అప్పగించింది. అంతర్జాతీయ, జాతీయ, వివిధ రాష్ట్రాల అధికారిక గీతాలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. పూర్తిస్థాయి వెర్షన్‌లో గేయాన్ని ఉన్నది ఉన్నట్టు వాడుకోవాలా, ఏమైనా మార్పులు చేయాలా అన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అందెశ్రీ తన ఆలోచనలను వివరించారు. చరణాలు, పల్లవి, బాణీలో అవసరమైన మార్పులపై తుదినిర్ణయం తీసుకునే బాధ్యతను అందెశ్రీకి అప్పజెప్పారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయి అతిథులు రాష్ట్ర పర్యటనకు వచి్చనప్పుడు సుదీర్ఘంగా ఉన్న జయజయహే తెలంగాణ గేయాన్ని పాడటం/వినిపించడానికి అవసరమైన సమయం ఉండదు. ఈ నేపథ్యంలో గేయం సంక్షిప్తరూపంతో మరో వెర్షన్‌ను సైతం సిద్ధం చేస్తున్నారు. గేయాలను ఎవరు పాడాలి? కోరస్‌ ఉండాలా? సోలోగా పాడాలా? అనే అంశాలను సైతం అందెశ్రీకి వదిలేసింది. సంగీత దర్శకుడిగా కీరవాణి పేరును సైతం అందెశ్రీ ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం.

ఉద్యమ సమయంలో యావత్‌ తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎంపిక చేయాలని గతంలో నిర్వహించిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్యప్రజాసంబంధాల అధికారి బోరెడ్డి అయోధ్యరెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌ పాల్గొన్నారు.

తిరుమలకు సీఎం రేవంత్‌
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లారు. మనవడి తలనీలాలు సమరి్పంచి మొక్కు తీర్చుకోవడానికి ఆయన శ్రీవారి ఆలయానికి వెళ్లినట్లు తెలిసింది. బుధవారం ఉదయం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఎం హైదరాబాద్‌కు తిరిగి చేరుకోనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement