telangana song
-
రాష్ట్రీయ గీతం.. రెండు వెర్షన్లలో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న నిర్వహించనున్న బహిరంగసభలో తెలంగాణ రాష్ట్ర గీతమైన ‘జయ జయహే తెలంగాణ’కు సంబంధించిన రెండు వెర్షన్లను అధికారికంగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’పూర్తి స్థాయి గేయాన్ని ఓ వెర్షన్‌గా, సంక్షిప్తీకరించిన గేయాన్ని మరో వెర్షన్‌గా విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గేయ రచయిత అందెశ్రీ, సినీ సంగీత దర్శకుడు కీరవాణితో సమావేశమయ్యారు.రాష్ట్ర గీతానికి రెండు వెర్షన్లు సిద్ధం చేసి కీరవాణితో కలిసి రికార్డు చేసే బాధ్యతలను అందెశ్రీకి ప్రభుత్వం అప్పగించింది. అంతర్జాతీయ, జాతీయ, వివిధ రాష్ట్రాల అధికారిక గీతాలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. పూర్తిస్థాయి వెర్షన్లో గేయాన్ని ఉన్నది ఉన్నట్టు వాడుకోవాలా, ఏమైనా మార్పులు చేయాలా అన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అందెశ్రీ తన ఆలోచనలను వివరించారు. చరణాలు, పల్లవి, బాణీలో అవసరమైన మార్పులపై తుదినిర్ణయం తీసుకునే బాధ్యతను అందెశ్రీకి అప్పజెప్పారు.జాతీయ, అంతర్జాతీయ స్థాయి అతిథులు రాష్ట్ర పర్యటనకు వచి్చనప్పుడు సుదీర్ఘంగా ఉన్న జయజయహే తెలంగాణ గేయాన్ని పాడటం/వినిపించడానికి అవసరమైన సమయం ఉండదు. ఈ నేపథ్యంలో గేయం సంక్షిప్తరూపంతో మరో వెర్షన్‌ను సైతం సిద్ధం చేస్తున్నారు. గేయాలను ఎవరు పాడాలి? కోరస్ ఉండాలా? సోలోగా పాడాలా? అనే అంశాలను సైతం అందెశ్రీకి వదిలేసింది. సంగీత దర్శకుడిగా కీరవాణి పేరును సైతం అందెశ్రీ ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం.ఉద్యమ సమయంలో యావత్ తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎంపిక చేయాలని గతంలో నిర్వహించిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్యప్రజాసంబంధాల అధికారి బోరెడ్డి అయోధ్యరెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పాల్గొన్నారు.తిరుమలకు సీఎం రేవంత్‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లారు. మనవడి తలనీలాలు సమరి్పంచి మొక్కు తీర్చుకోవడానికి ఆయన శ్రీవారి ఆలయానికి వెళ్లినట్లు తెలిసింది. బుధవారం ఉదయం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఎం హైదరాబాద్‌కు తిరిగి చేరుకోనున్నారు. -
తెలంగాణ తల్లి ప్రార్థనా గీతాన్ని విడుదల చేసిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు ప్రియదర్శి తండ్రి ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి రచించిన తెలంగాణ తల్లి ప్రార్థనా గీతాన్ని మంత్రి కె.తారకరామారావు విడుదల చేశారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, శిల్పకళను గురించి వర్ణించే ఈ పాట బాగుందని కేటీఆర్ ప్రశంసించారు. సుబ్బాచారి రచించిన ఈ పాటకు వి.రాధ సంగీతాన్ని సమకూర్చగా ప్రముఖ సినీ నేపథ్య గాయ కులు కృష్ణచైతన్య, కల్పన, హరిణి, సాయిచరణ్‌లు ఆలపించారు. ఈమేరకు శుక్రవారం ప్రగతి భవన్లో ప్రియదర్శి తన తల్లిదండ్రులు, శ్రీమతితో కేటీఆర్‌ని కలిశారు. తన తండ్రి రాసిన ఈ పాటను ఆవిష్కరించినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
నే పాడితే..
ఆడియో సీడీలదే జోరాయే ! అప్పుడు పాడేవారికి క్రేజీ ఇప్పుడు సీడీలపై మోజు కరీంనగర్ కల్చరల్ : అక్కా జెల్లెండ్లను ఉయ్యాలో ఒక్కూరి కిచ్చిరి ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బొగ్గు బాయిల బతుకమ్మ ఉయ్యాలో వదినే సీతమ్మ ఉయ్యాలో.. చీర ఇయ్యవమ్మ ఉయ్యాలో రామ రామ రామ... ఉయ్యాలో.. రామనే సీరామ.. ఉయ్యాలో అయ్యయ్యో ఓ రామ.. ఉయ్యాలో అయ్యనే సీరామ...ఉయ్యాలో అని పాడుకుంటూ మహిళలంతా సామూహికంగా బతుకమ్మ ఆడుతుంతే ఆహూతుల మదులు ఆనందపరవశంలో తేలియాడుతుంటాయి. బతుకమ్మల చుట్టూ వలయాకారంలో తిరుగుతు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడడం పల్లెల్లోని నిష్కల్మష వాతావరణాన్ని ఆవిష్కరిస్తుంది. బతుకమ్మ సంబరాలలో పాట వచ్చిన ఊరు పెద్దమ్మదే పెత్తనం. ఆమె పాట పాడుతుంటే మిగతా వారు కోరస్ ఇస్తూ బతుకమ్మ ఆడేవారు. అయితే ఇదంతా గతం. నేడు ఆ పాటలు పాడే పెద్దమ్మలు కనిపించడం లేదు. వారి స్థానంలోకి ఆడియో సీడీలు వచ్చాయి. బతుకమ్మల చుట్టూ మహిళలు చేరి లయబద్ధంగా చప్పట్లు కొడుతుంటే స్పీకర్లలో పాటలు వినిపిస్తున్నాయి. ఈ నయా ట్రెండ్ నేపథ్యంలో అప్పటి పెద్దమ్మల మనసులోని మాటలు తెలుసుకుందాం... నా పాట లేనిదే ఆడేవారు కాదు మాది గంగాధర. మాది సంప్రదాయ బ్రహ్మణ కుటుంబం. మేము ఆరుగురం అక్కచెల్లెల్లం. నేనే పెద్దదాన్ని. ఇంటి పక్కనే గుడి, ఆ పక్కనే వాగు ఉంది. బతుకమ్మ పండుగ మొదలు చివరి రోజు వరకు గుడి వద్దనే ఆడుకునేవాళ్లం. ప్రతీరోజు నేనే పాట పాడేదాన్ని. చిన్నప్పటి నుంచి పూజల్లో మంగళహారతుల పాటలు పాడడంతో సహజంగా నా గొంతు బాగుండేది. దీంతో అందరూ నన్నే పాట పాడాలని గోల చేసేవారు. ఇప్పుడు పాటలు పాడే వారు కరువయ్యారు. ఎక్కడ విన్న మైక్‌ల పాటలే వినిపిస్తున్నాయి. – కలకుంట్ల గంగానాయకి ఆ పాటలు ఎక్కడున్నాయి స్త్రీలను గౌరవించి అభిమానించాలని సూచించే పండుగ బతుకమ్మ. చిన్ననాడు అందరం కలిసి ఆడుకునేవాళ్లం. చుట్టాలు, అక్కాచెల్లెల్లు అందరం ఒకే దగ్గర ఉండేవాళ్లం. మా తల్లి గారి ఇల్లు మానకొండూర్. మేము ఆరుగురం అక్క చెల్లెళ్లం, ముగ్గురు అన్నలు. నేనే పెద్దదాన్ని. ఊర్లో నేనే పాట పాడేదాన్ని. అందరు నా పాట అంటే ఇష్టపడేవాళ్లు. పాట పాడందే విడిచిపెట్టేవాళ్లు కాదు. ఇప్పుడు పాడేవాళ్లు కరువయ్యారు. ఆడేవాళ్లు తక్కువైండ్రు. ముస్తాబైనంత సేపు కూడా ఆడుతలేరు. అప్పటి సంబరాలు లేవు. – తుమ్ రామమ్మ ఇప్పటికీ పాడుతా మా అమ్మగారి ఊరు పర్లపల్లి. పెద్ద కుటుంబం. ఐదుగురం అక్కాచెల్లెళ్లం, ముగ్గురు అన్నలు. అందరం కలిసి పొలాలు, గుట్టలు పట్టుకుని పూల కోసం తిరిగేటోళ్లం. బతుకమ్మ పండుగొస్తే నా పాటనే వినిపించేది. ఇప్పటికీ బతుకమ్మ పాట పడుతాను. అప్పటి పాత పాటలు ఇప్పటి వారికి నచ్చవు. క్యాసెట్లు వేస్తుండ్రు. తీరొక్క పూలతో బతుకును దేవతగా చేసి కొలిచే పండుగా బతుకమ్మ. అప్పటిలా అందరం ఒక్క చోట కలుసుడే లేదు. – చిట్టుమల్ల స్వర్ణలత, గృహిణి నా గొంతు బాగుంటుంది బతుకమ్మ మహిళలకు సంబంధించిన పెద్ద పండుగ. పల్లెల్లో చాలా ఘనంగా చేసుకుంటారు. పిల్లలు, పెద్దలు అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ. అందరిలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. నాటి పల్లెపాటలు ఇప్పుడు కరువైనయి. చిన్నప్పడు నేను పాడేదాన్ని. ఇప్పుడు పాడుదామన్న పట్టించుకునే వారు లేరు. మైక్‌లు పెట్టి సీడీలు వేస్తుండ్రు. – సౌగాని రాజేశ్వరి, గృహిణి వారం రోజులు సందడి వారం రోజులు వాడ..వాడంతా పోటీపడి బతుకమ్మలు పేర్చేవాళ్లం. ముగ్గురు అక్కలు, ఒక తమ్మడు. అందరం కలిసి బతుకమ్మ పూలు తెచ్చేవాళ్లం. బతుకమ్మ పాటలు నేనే ఎక్కువగా పాడేదాన్ని. అందరం కలిసి ఆడేవాళ్లం. ఇప్పుడు ఎవరు పాడడం లేదు. కనీసం ఆ పాటలు కూడా వచ్చిన వాళు లేరు. రాష్ట్రం వచ్చిన తర్వాత పండుగ ప్రాధాన్యత పెరిగినా.. అంతటా సీడీల పాటలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డాక్టర్‌గా బిజీగా ఉన్నప్పటికీ ఆ సరదాలు గుర్తుచేసుకోవడంతోనే పండుగ గడిచిపోతుంది. – డాక్టర్ ఎల్.శేష శైలజ