Andesri
-
రాష్ట్రీయ గీతం.. రెండు వెర్షన్లలో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న నిర్వహించనున్న బహిరంగసభలో తెలంగాణ రాష్ట్ర గీతమైన ‘జయ జయహే తెలంగాణ’కు సంబంధించిన రెండు వెర్షన్లను అధికారికంగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’పూర్తి స్థాయి గేయాన్ని ఓ వెర్షన్‌గా, సంక్షిప్తీకరించిన గేయాన్ని మరో వెర్షన్‌గా విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గేయ రచయిత అందెశ్రీ, సినీ సంగీత దర్శకుడు కీరవాణితో సమావేశమయ్యారు.రాష్ట్ర గీతానికి రెండు వెర్షన్లు సిద్ధం చేసి కీరవాణితో కలిసి రికార్డు చేసే బాధ్యతలను అందెశ్రీకి ప్రభుత్వం అప్పగించింది. అంతర్జాతీయ, జాతీయ, వివిధ రాష్ట్రాల అధికారిక గీతాలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. పూర్తిస్థాయి వెర్షన్లో గేయాన్ని ఉన్నది ఉన్నట్టు వాడుకోవాలా, ఏమైనా మార్పులు చేయాలా అన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అందెశ్రీ తన ఆలోచనలను వివరించారు. చరణాలు, పల్లవి, బాణీలో అవసరమైన మార్పులపై తుదినిర్ణయం తీసుకునే బాధ్యతను అందెశ్రీకి అప్పజెప్పారు.జాతీయ, అంతర్జాతీయ స్థాయి అతిథులు రాష్ట్ర పర్యటనకు వచి్చనప్పుడు సుదీర్ఘంగా ఉన్న జయజయహే తెలంగాణ గేయాన్ని పాడటం/వినిపించడానికి అవసరమైన సమయం ఉండదు. ఈ నేపథ్యంలో గేయం సంక్షిప్తరూపంతో మరో వెర్షన్‌ను సైతం సిద్ధం చేస్తున్నారు. గేయాలను ఎవరు పాడాలి? కోరస్ ఉండాలా? సోలోగా పాడాలా? అనే అంశాలను సైతం అందెశ్రీకి వదిలేసింది. సంగీత దర్శకుడిగా కీరవాణి పేరును సైతం అందెశ్రీ ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం.ఉద్యమ సమయంలో యావత్ తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎంపిక చేయాలని గతంలో నిర్వహించిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్యప్రజాసంబంధాల అధికారి బోరెడ్డి అయోధ్యరెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పాల్గొన్నారు.తిరుమలకు సీఎం రేవంత్‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లారు. మనవడి తలనీలాలు సమరి్పంచి మొక్కు తీర్చుకోవడానికి ఆయన శ్రీవారి ఆలయానికి వెళ్లినట్లు తెలిసింది. బుధవారం ఉదయం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఎం హైదరాబాద్‌కు తిరిగి చేరుకోనున్నారు. -
తెలంగాణ రాష్ట్ర గేయం ఇదే
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం!! పలు జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణా!! పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ!! కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! జానపద జనజీవన జావలీలు జాలువారు కవిగాయక వైతాళిక కళల మంజీరాలు!! జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీగానం అమ్మ నీవే మా ప్రాణం!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! సిరివెలుగులు విరజిమ్మె సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలు నీ తనువుకు సింగారం!! సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న మాగాణియే కద నీ ఎద!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలి!! సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! అందెశ్రీ నేపథ్యం.. తెలంగాణ రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత అందెశ్రీ రాశారు. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధుడైన అందెశ్రీ వరంగల్ జిల్లా జనగామ వద్ద ఉన్న రేబర్తి అనే గ్రామంలో జూలై 18, 1961లో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. గొర్రెల కాపరిగా పనిచేసిన ఈయన్ను శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ అందెశ్రీ పాడుతుండగా విని చేరదీశాడు. రాష్ట్రవ్యాప్తంగా అందెశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణ మూర్తి నటించిన విప్లవాత్మక సినిమాల విజయం వెనక అందెశ్రీ పాటలున్నాయి. 2006లో గంగ సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయం అందెశ్రీని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. అందెశ్రీ సినీ పాటల జాబితా జయజయహే తెలంగాణ జననీ జయకేతనం పల్లెనీకు వందనాలమ్మో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు గలగల గజ్జెలబండి కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా జన జాతరలో మన గీతం ఎల్లిపోతున్నావా తల్లి చూడాచక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి -
కవిత్వం కళ్ల ముందు కన్పించాకే రాస్తా!
తెలంగాణ రాష్ట్ర గీతకర్త అందెశ్రీ ఇంటర్వ్యూ ఆది శంకరుడిని కీర్తించడం అసాధారణమేమీ కాదు. శంకరుడు పూజించిన ‘చండాలుడి’ని? అసాధారణం కదా. అటువంటి అద్భుతం నిజామాబాద్ జిల్లా అమరాద్లో దాదాపు నాలుగు దశాబ్దాల నాడు జరిగింది. లోకరీతిలో నిజామాబాద్ జిల్లా జనగామ సమీపంలోని రేబర్తిలో 1961 జూలై 18న మాదిగ కులస్తుడిగా పుట్టారు ఎల్లయ్య. అతడి 16వ ఏట శృంగేరీ పీఠానికి చెందిన స్వాములు శంకర్ మహరాజ్ ‘బిడ్డా, కాళిదాసును తెనాలి రామకృష్ణను కనికరించిన అమ్మవారు నీలో ఉంది. నీ సాహిత్యంలో ఆమె అందె విన్పిస్తోంది. నీవు నేటి నుంచి అంద్శైవి అని ఆశీర్వదించారు. ఆచరణలోనూ అపురూపంగా చూశారు. ఒక యజ్ఞంలో ‘అంద్శైని రుత్వికునిగా కూర్చోపెట్టారు. తమ సరసన ‘అతడు’ కూర్చునేందుకు వీలులేదన్న సాంప్రదాయవాదులతో ‘తమరు నిష్ర్కమించవచ్చు. అందె శ్రీ రుత్వికుడు. నేను సోమయాజిని, యజ్ఞానికి మీరు అనర్హుల’న్న అభినవశంకరుడు శంకర్ మహరాజ్! బడి మొఖం చూడని పశువుల కాపరి లలిత జానపద కవి (సెమీ క్లాసికల్ కవి)గా ఆవిష్కృతమైన బతుకు బాటలో ఇటువంటి అపురూపాలెన్నో. ఎర్రసముద్రం సినిమా కోసం ఆయన రాసిన పాట ‘మాయమై పోతున్నడమ్మ మనిషి’ 2006 నుంచి ద్వితీయ ఇంటర్ పాఠ్యాంశం. తెలుగు సినిమా చరిత్రలో ‘మా తెలుగు తల్లికి’, ‘తెలుగు జాతి మనది’ తర్వాత పాఠ్యాంశంగా చేరిన మూడవ పాట ‘మాయమైపోతున్నడమ్మా’ కావడం గమనార్హం. గంగ సినిమాలో ‘వెళ్లి పోతున్నావా’కు నంది అవార్డు స్వీకరించారు, భారత ప్రభుత్వపు 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన ‘తెలంగాణ’ తన పాటను రాష్ట్రగీతంగా స్వీకరించిన సందర్భంలో అంద్శై ఇంటర్వ్యూ సారాంశం : పాటకు బీజం తెలంగాణ కళాకారులు లేదా రచయితలు తమ తమ సమావేశాలను పాటతో ప్రారంభించడం ఆనవాయితీ. వివిధ సంఘాల సమాహారమైన తెలంగాణ ఉద్యమ కళాకారులు 2002 సెప్టెంబర్ 30న నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ధూంధాం తలపెట్టారు. అందులో నేనూ పాల్గొన్నా. ముందుగా ఏ పాట పాడాలని మీమాంస వచ్చింది. తెలంగాణకు అందరూ హర్షించే ఒక గీతం లేకపాయెనే అన్పించింది. అందరి నాల్కలపై నిలిచే పాట రాయాలె అనుకున్న. అప్పుడు రెండు చరణాలు ఇప్పుడు రెండు చరణాలు ఊరుతున్నవి. మరుసటి సంవత్సరం సిద్దిపేటలో తెలంగాణ రచయితల సంఘం సమావేశ ప్రారంభగీతంగా పాడుతున్నా... ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జైజై తెలంగాణ ... ఎవరో వెనుక నుంచి ‘ఇది తెలంగాణ జాతీయగీతం’ అన్నరు. వెక్కిరింతేమో అని కొంచెం భయపడ్డాను. కాదని తెలిసి తెప్పరిల్లిన. ఆ క్షణం నుంచి ప్రతి ఒక్కరూ ఈ పాటను తమదిగా చేసుకున్నారు. ఏడేళ్లుగా నునుపు చేసిన పాటలో పల్లవితో కలిపి 12 చరణాలున్నవి. లక్షలాది ప్రజానీకం సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి యువ విభాగం ‘జనజాగరణసేన’ సమావేశంలో ఇందులోని నాలుగు చరణాలు పాడారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధినీ విద్యార్థులు ఈ పాటను కొన్నాళ్లుగా పాడుతున్నారు. ఆ నాలుగు చరణాలకు కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతం హోదానిచ్చింది. రాష్ట్రగీతం హోదా పూర్తి పాటను తెలుసుకునేందుకు ఆస్కారం ఇస్తుందని భావిస్తున్నాను. అన్నిటి కంటె గొప్ప ఆనందం నన్ను కొడుకుగా పెంచి పెద్దచేసిన దివంగత బిరుదురాజు ‘ఇది తెలంగాణకు మాత్రమే కాదు, తెలుగు నేల జాతీయ గీతం’ అన్నప్పుడు కలిగింది. ప్రతి భాషా అపౌరుషేయమే! వేదాలు అపౌరుషేయాలు అంటారు. ‘తాను పలికినది కాదు’ అనే అర్ధంలో ప్రతి భాషా అపౌరుషేయమే! ఏ పదం ఏ ఒక్కరూ కనిపెట్టలేదు. మనకు సంక్రమించిన పదాలు, నుడికారాలు, భావాలతో స్వీయానుభవాన్ని రంగరించి గానం చేస్తాం. రచిస్తాం. కాబట్టి ‘జయజయహే తెలంగాణ’ నా ద్వారా వచ్చిన అనేకుల పాట! శతకకవుల్లా తెలంగాణ ప్రాంతంలో ‘వరకవులు’న్నరు. వేమన వలె ‘గున్రెడ్డిపల్లె కుమ్మర సిద్దప్ప’ ప్రజలు పాడుకునే వరకవి. బాల్యంలో పశువులు కాసుకునే వాడిని. చెలకల్లో చెట్టుకిందకు చేరి కొందరు ఆయన పద్యాలు పాడేవారు. అవి నాలో ఇనికి పోయినవి. అక్షరాలు నేర్వకుండనే ఛందస్సుతో పద్యాలు రాయడం ఆ తీరుగ వచ్చింది. గడ్డిపూల బొడ్డుతాడు తెంపుకుని నేలపై పడ్డాను. పండుటాకు ఎంత ఇష్టమో, అంకురించే చివురుపైనా అంత ప్రేమ! ప్రకృతికి చెందిన వస్తు-శిల్పాలకు శృతి లయలు ప్రాణ ప్రతిష్ట చేశాయి. లంకలో సంపద ఎంత ఉన్నా అయోధ్యకు సాటిరాదు అనే నేపథ్యంలో రామునితో ఆదికవి వాల్మీకి ‘జననీ జన్మభూమిశ్చ’ అనే శ్లోకాన్ని చెప్పిస్తారు. అదే భావాన్ని ‘తరతరాల చరితగల తల్లీ నీరాజనం-పది జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం’ అన్నాను. ఆదికవి నుంచి నన్ను ఆదరించిన జక్కిరెడ్డి పూజల మల్లయ్య, ఉడుకుడుకు అన్నం పెట్టిన మహ్మద్ మునీర్ సేట్, బాలబాలికలు, యువతీ యువకులు అందరి పాలూ రాష్ట్రగీతంలో ఉంది. ఇందులో నా వాటా అణాపైసలే! చూడంది రాయలేను! పద్యమైనా, పాటైనా చూడంది రాయలేను. ప్రకృతి మనిషితో సహా అందులో భాగమైన చరాచరాలను చూసినపుడు కలిగిన సంవేదనలనే రాస్తాను. ‘వాక్కులమ్మ’ రాస్తున్నాను. ఆమె సరస్వతి కాదు. ప్రాణిలో పరుగిడు ప్రణవం. సృష్టి కనుచూపు. అందులో ఒక చరణం ‘కోటి భావాల కొనగోట మీటినట్లు-వసుధ విన్పింతు నా మాట వాక్కులమ్మా’. ప్రపంచంలో ఉన్న నదులన్నిటినీ సందర్శించి నదీ కవిత్వం రాయాలని సంకల్పించాను. ఆఫ్రికా, చైనా పర్యటనలు చేశాను. చూసే రాయాలంటే ‘నదిని కంప్యూటర్లో చూడొచ్చు కదా’ అన్నారొక మిత్రులు. కంప్యూటర్‌తో సంసారం చేయగలమా?! - పున్నా కృష్ణమూర్తి -
కూలీ కలం నుంచి జాలువారిన గీతం
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.. ఇప్పుడిది తెలంగాణ రాష్ట్రగీతం. ప్రాథమిక విద్య కూడా చదవకుండానే కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన అందె ఎల్లయ్య ఈ పాటను రాశారు. ప్రజాకవిగా, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన అందెశ్రీ.. వరంగల్ జిల్లా జనగామ సమీపంలోని రేబర్తి గ్రామంలో జన్మించారు. గొర్రెల కాపరిగా, కూలీగా కూడా పని చేశారు. ఆర్. నారాయణమూర్తి తీసే విప్లవ చిత్రాల్లో చాలావరకు పాటలు ఈయన రాసినవే. తెలంగాణ ప్రాంతాన్ని అద్భుతంగా వర్ణిస్తూ.. సాధారణమైన చిన్నచిన్న పదాలతో ఈయన అల్లే పాటలు ఈ ప్రాంతంలో బహుళ జనాదరణ పొందాయి. ఎర్ర సముద్రం సినిమా కోసం ఆయన రాసిన 'మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు' పాటను కొన్ని విశ్వవిద్యాలయాలు తమ తెలుగు పాఠ్యభాగాల్లో కూడా చేర్చాయి. ప్రకృతి ప్రేమికుడైన ఈయన రాసిన 'జయజయహే తెలంగాణ' పాటను.. ఇన్నాళ్లుగా ఉన్న 'మా తెలుగు తల్లికి' స్థానంలో రాష్ట్ర గీతంగా స్వీకరించారు. నదులంటే అందెశ్రీకి చెప్పలేనంత ఇష్టం. అది ఎంతగానంటే కృష్ణా గోదావరి నదులతో పాటు ఏకంగా నైలు నది, విక్టోరియా ఫాల్స్ లాంటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న నదుల వరకు అన్నింటి విషయాలూ ఆయనకు కరతలామలకం.