జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం!!
పలు జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణా!!
పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ
గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ!!
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్!!
జై తెలంగాణ జై జై తెలంగాణా!!
జానపద జనజీవన జావలీలు జాలువారు
కవిగాయక వైతాళిక కళల మంజీరాలు!!
జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర
అనునిత్యం నీగానం అమ్మ నీవే మా ప్రాణం!!
జై తెలంగాణ జై జై తెలంగాణా!!
సిరివెలుగులు విరజిమ్మె సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలు నీ తనువుకు సింగారం!!
సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద
సిరులు పండే సారమున్న
మాగాణియే కద నీ ఎద!!
జై తెలంగాణ జై జై తెలంగాణా!!
గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి
పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలి!!
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి!!
జై తెలంగాణ జై జై తెలంగాణా!!
అందెశ్రీ నేపథ్యం..
తెలంగాణ రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత అందెశ్రీ రాశారు. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధుడైన అందెశ్రీ వరంగల్ జిల్లా జనగామ వద్ద ఉన్న రేబర్తి అనే గ్రామంలో జూలై 18, 1961లో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. గొర్రెల కాపరిగా పనిచేసిన ఈయన్ను శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ అందెశ్రీ పాడుతుండగా విని చేరదీశాడు.
రాష్ట్రవ్యాప్తంగా అందెశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణ మూర్తి నటించిన విప్లవాత్మక సినిమాల విజయం వెనక అందెశ్రీ పాటలున్నాయి. 2006లో గంగ సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయం అందెశ్రీని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
అందెశ్రీ సినీ పాటల జాబితా
- జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
- పల్లెనీకు వందనాలమ్మో
- మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు
- గలగల గజ్జెలబండి
- కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా
- జన జాతరలో మన గీతం
- ఎల్లిపోతున్నావా తల్లి
- చూడాచక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి
Comments
Please login to add a commentAdd a comment