తెలంగాణ రాష్ట్ర గేయం.. ఇప్పుడే ఎందుకు వివాదమైంది? | Telangana: Congress BRS in war of words over state song | Sakshi
Sakshi News home page

తెలంగాణ రాష్ట్ర గేయం.. ఇప్పుడే ఎందుకు వివాదమైంది?

Published Wed, May 29 2024 5:59 PM | Last Updated on Wed, May 29 2024 6:49 PM

Telangana: Congress BRS in war of words over state song

తెలంగాణ రాష్ట్ర గేయంపై కొత్తగా వివాదం ఎందుకు వచ్చింది? గతంలో లేని వివాదం ఇప్పుడే ఎందుకు వివాదమైంది? రాష్ట్ర గేయం రూపకల్పనలో గులాబీ పార్టీకి ఉన్న అభ్యంతరం ఏంటి? ఇందులో కాంగ్రెస్ సర్కార్ పాత్ర ఎంతవరకు ఉంది? పాటకు సంగీతం సమకూరుస్తున్న వ్యక్తే వివాదానికి కేంద్ర బిందువుగా మారారా? దీనిపై బీఆర్ఎస్ ఏమంటోంది? ముఖ్యమంత్రి రేవంత్‌ సమాధానం ఏంటి? 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతోంది. దశాబ్ది ఉత్సవాలు చేసుకుకోవాల్సిన సమయంలో కొత్త వివాదాలు ముందుకు వస్తున్నాయి. రాష్ట్ర చిహ్నంలో మార్పులు, రాష్ట్ర గేయం రూపకల్పనపైన ప్రధాన విపక్షం నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కారు, హస్తం పార్టీల మధ్య తెలంగాణ గేయం ఇరుక్కుంది. 

రాష్ట్ర గేయం అంశం పదేళ్లలో ఎన్నడూ చర్చనీయాంశం కాలేదు. కానీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గేయం అంశాన్ని మళ్ళీ తెరమీదకు తీసుకుని వచ్చింది. అందులో మార్పులు చేసి గేయాన్ని సరికొత్తగా ఆవిష్కరించాలని నిర్ణయించింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆలోచన బాగానే ఉన్నా.. పాట రచయిత అందే శ్రీ తో ప్రభుత్వంతో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ, పాటకు సంగీతం సమకూర్చే పనిని కీరవాణికి అప్పగించటంపై బీఆర్‌ఎస్‌  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

తెలంగాణ ఆత్మ గౌరవ అంశాన్ని తెలంగాణేతరులకు అప్పగించటం పట్ల గులాబీ పార్టీ నేతలు మండి పడుతున్నారు. సంగీత దర్శకులు, గాయకుల్లో తెలంగాణ బిడ్డలు చాలామంది ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే కొత్త వివాదాలు సృష్టిస్తున్నారని బీ ఆర్ ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గేయానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునే పెట్టేందుకే గులాబీ పార్టీ నాయకత్వం నిర్ణయించుకుంది.

ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కూడా చూస్తోంది. రాష్ట్ర కోసం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవద్దనిబీఆర్‌ఎస్‌ అనుకుంటోంది. ఇది చిలికి చిలికి గాలి వానలా మారుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనతో చల్లగా వివాదం నుంచి తప్పుకున్నారు. తెలంగాణ గేయ రచన, సంగీతం సమకూర్చే పనిని కీరవాణికి అప్పగించే విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని ఇదంతా అందే శ్రీ చూస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. 

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి అనుమతి లేకుండానే అందెశ్రీ నిర్ణయాలు తీసుకుంటారా అని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది. అదేవిధంగా తెలంగాణ రాజముద్రలో కాకతీయ తోరణం, చార్‌మినార్‌లను తొలగించాలన్ని నిర్ణయాన్ని కూడా బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. తెలంగాణ వారసత్వానికి, పోరాటాలకు చిహ్నాలుగా ఉన్నవాటిని ఎలా తొలగిస్తారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర గేయానికి సంగీతం సమకూర్చే బాధ్యతను తెలంగాణేతరులకు ఇవ్వడానికి వీల్లేదని గులాబీ పార్టీ గట్టిగా పట్టుపడుతోంది. మరి ప్రభుత్వం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement