తెలంగాణ రాష్ట‍్ర గీతంగా 'జయ జయహే తెలంగాణ'ని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ పాటని స్వరపరిచే బాధ్యతల్ని టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణికి తాజాగా అప్పగించారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిని కీరవాణి కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని బయటకొచ్చాయి. కానీ ఇప్పుడు ఈ పాట విషయంలో లేనిపోని కాంట్రవర్సీలు చోటుచేసుకుంటున్నాయి.తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ తాజాగా ఓ లేఖ విడుదల చేసింది.
''జయ జయహే తెలంగాణ' పాటకు కీరవాణిని సంగీతం అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుంది. తెలంగాణ అస్తిత్వం మీకు తెలియంది కాదు, మన ఉద్యోగాలు, మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సకల జనుల సహకారంతో ఎంతో మంది అమర వీరుల త్యాగ ఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రం. ఇంతటి ఖ్యాతి గడించిన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడటమేంటి? అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుంది. ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణాలో ఉన్నారు మన తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం' అని తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)
ఇకపోతే 'జయ జయహే తెలంగాణ' పాటని అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యక్రమాలలో ఆలపించే విధంగా రూపొందించాలని ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం ఉంది. అంతలో ఈ పాటను రూపొందించాలని కీరవాణికి సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే తెలుగులో ఎన్నో దశాబ్దాల నుంచి సంగీత దర్శకుడు, గాయకుడిగా పేరు తెచ్చుకున్న కీరవాణి.. 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' గీతంతో అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్కార్ కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బాధ్యతల్ని కీరవాణికి అప్పగించి ఉంటారు. కానీ ఇప్పుడు వస్తున్న విమర్శల దృష్ట్యా తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఆమె నా కూతురు కాదంటూ బాంబు పేల్చిన స్టార్ హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment